కొన్ని కొత్త పదాలు మన చెవిన పడేనాటికే అవి జీవితంలో భాగమైపోతాయి. జరగాల్సిన విధ్వంసమంతా జరిగిపోతుంది. మనం ఆ తర్వాత ఎప్పటికో గుర్తిస్తాం. పాలకులు ఒక పథకం ప్రకారమే ఈ పని చేస్తారు.  ఫాసిస్టు పాలకులైతే ఇక చెప్పనవసరమే లేదు. ఏ వైపు నుంచి ఎట్లా కమ్ముకొని వస్తారో ఊహించలేం. మనం దేనికది విడిగా విశ్లేషించుకుంటూ, ఒక్కోదాంట్లో తలమునకలవుతుంటాం. వాళ్లు మాత్రం అన్నిటినీ కలిపి ప్రజలపై ఎక్కుపెడతారు. దీన్ని మనం తెలుసుకోవడం ఏమోగాని అడుగడుగునా మనల్ని అనేక సందేహాలు వెంటాడుతుంటాయి.  ఏది హిందుత్వ? ఏది సనాతన? ఏది కార్పొరేటీకరణ? ఏది సైనికీకరణ? వాటి మధ్య సంబంధమేమిటి? తేడాలేమిటి? అనే మథనలో ఉంటాం. ఒక్కో దాన్ని ఎదిరించే  పోరాటంలో అలసిపోతుంటాం. వాళ్లు తమ పనులన్నీ సజావుగా చక్కబెట్టుకుంటారు.

కేంద్రంలోని బీజేపీ ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పుడు అఖండ భారత్‌ కోసమే ఈ పని చేశారనే విమర్శ వచ్చింది. అది నిజమే. కానీ అదొక్కటే కాదు. కొద్ది రోజుల్లోనే అది కార్పొరేట్‌ కశ్మీర్‌ కోసం అని అర్థమైంది. అఖండమనే హిందుత్వ, దురాక్రమణ భావన ఒంటరిగా రాలేదు. కార్పొరేటీకరణను వెంటేసుకొని వచ్చింది. అజాదీ కశ్మీర్‌ అనే మాటను రూపుమాపి కార్పొరేట్‌ కశ్మీర్‌గా అవతరించింది. ఈ సంగతి లదక్‌ ప్రతిఘటనలో ఇప్పుడు అర్థమవుతోంది. ఇట్లా ఎన్నయినా చెప్పుకోవచ్చు.

ఇట్లా వాళ్లు తమ సమస్త చర్యలను, విధానాలను, అణచివేతలను ఒకే ఒక లక్ష్యం దిశగా ఎక్కు పెట్టారు. తమ సమగ్ర వ్యూహం కోసమే అన్నిటినీ తీసుకొచ్చారు. కశ్మీర్‌ అయినా, మణిపూర్‌ అయినా, దండకారణ్యమైనా, దేశంలోని ఏ భూభాగమైనా, ఏ పీడిత జన సముదాయమైనా. అన్నిటి మీద, అందరి మీద ఒకే గురితో ఫాసిస్టు దండయాత్ర సాగుతున్నది. మరి వీటిలో కొన్ని ప్రధానమై కొన్ని అప్రధానమవుతాయా? కొన్ని ఫాసిస్టు దుర్మార్గాలై మిగతావి రోజువారీ బూర్జువా పాలకుల చర్యలవుతాయా? కొన్ని ఫాసిస్టు సాంస్కృతిక చర్యలై ఇంకొన్ని సైనిక సంఘర్షణలవుతాయా? వాళ్లేమో సాంస్కృతిక సంఘర్షణను, సాయుధ యుద్ధాలను కలిపి ఒకే వ్యూహాన్ని నడుపుతున్నప్పుడు కూడా సమాజంలో ఈ సందిగ్ధం తీరలేదంటే ఫాసిజం ఎంత పై చేయి సాధించినట్లు? ఫాసిస్టులు ప్రజల మనసులనే కాదు. మేధస్సునూ తమకు అనుకూలంగా మార్చుకోవడం అంటే ఇదే.

ఆపరేషన్‌ కగార్‌ అనే రాజకీయార్థిక సాంస్కృతిక సైనిక వ్యూహం మధ్యభారతదేశంలో మొదలై నాలుగు నెలలవుతోంది. తెలిసినవాళ్లకు ఇదొక  సైనిక అభియాన్‌ అనిపించవచ్చు. వివరాల్లోకి వెళ్లితే ఈ పేరుతో కేంద్ర సైనిక బలగాలు ఆదివాసులను చంపేస్తున్నాయని  తెలిసి ఉండవచ్చు. ఈ కాలంలోనే వైమానిక దాడులు కూడా జరిగాయని తెలిసి ఉండవచ్చు. కానీ ఇది సైనిక చర్యలకు పరిమితం కాదు. 2004లో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రారంభించిన యుద్ధానికి కొనసాగింపు మాత్రమే కాదు. మావోయిస్టులకు, భారత ప్రభుత్వానికి మధ్య సాగుతున్న సాయుధ ఘర్షణే కాదు. సంఫ్‌ు ప్రభుత్వం ఆదివాసులను, మావోయిస్టులను సాయుధ సమస్యగానే చూడటం లేదు. దేశానికి, దేశభక్తి భావజాలానికి, సనాతన సంస్కృతికి, కార్పొరేట్‌ రాజకీయార్థిక విధానానికి, నియంతృత్వంగా మారిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విపత్తుగా చూస్తున్నది.  దాన్ని ఎదుర్కోడానికే ఆపరేషన్‌ కగార్‌ను తీసుకొచ్చింది.

మావోయిస్టుల మీద అంతిమ యుద్ధం చేయడమే కగార్‌ లక్ష్యం. ఇది ఈ ఏడాది జనవరి 1న ఆరంభమైంది. ఆరోజు  దండకారణ్యంలోని బీజాపూర్‌ జిల్లా గంగలూరు దగ్గర ఉండే ముద్దుం అనే ఊరి మీద  దాడి జరిగింది.  మంగ్లి అనే ఆరునెలల ఆదివాసీ పాప తల్లి ఒడిలో పాలు తాగుతూ సైనిక బలగాల కాల్పుల్లో కన్నుమూసింది.  ఇక అప్పటి నుంచి రోజువారీ హత్యాకాండగా మారిపోయింది. తాజాగా ఏప్రిల్‌ 16వ తేదీన అబూజ్‌మాడ్‌లో ముప్పై మందిని హత్య చేశారు. మొత్తం డెబ్బై మందికి పైగా ఆదివాసులను, విప్లవకారులను, పిల్లలను, పెద్దలను, స్త్రీలను, పురుషులను చంపేశారు.  ఆపరేషన్‌ కగార్‌ రాబోయే రోజుల్లో ఇంకెట్లా ఉండబోతోందో ఈ మూడు నెలల అనుభవంతోనే ఊహించవచ్చు.

ఈ అంతిమ యుద్ధాన్ని ప్రారంభించడానికి ముందు ఏడాది కింద కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మావోయిస్టు రహిత భారత్‌లో 2024 సాధారణ ఎన్నికలు జరుగుతాయని అన్నాడు. ఈ ఎన్నికల నాటికే దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలించాలని అనుకున్నారు. ఇట్లా పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం చాలాసార్లు అన్నది. అంతక ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా గడువు ప్రకటించి అణచివేత తీవ్రం చేసింది. కానీ సాధ్యం కాలేదు. 

మావోయిస్టు రహిత భారత్‌లాగే కేంద్ర ప్రభుత్వం ‘నూతన భారత్‌’ అనే మరో లక్ష్యం ప్రకటించుకుంది. దాన్ని రాజకీయాల్లో బీజేపీ, సాంఘిక సాంస్కృతిక విషయాల్లో సంఫ్‌ుపరివార్‌  ప్రచారం చేస్తున్నాయి.  ప్రధాని నోటెంట వినిపించే వికసిత భారత్‌ కూడా ఇదే. దీనికి పునాది 2022 అక్టోబర్‌ 27, 28 తేదీల్లో హర్యాణాలోని సూరజ్‌కుండ్‌లో జరిగిన ఒక చింతనా శిబిరంలో పడిరది.   వివిధ రాష్ట్రాల హోం మంత్రులు,  హోం సెక్రటరీలు, డీజీపీలు,   సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(సిఎపిఎప్‌)` సెంట్రల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌ ( సిపివో) డైరెక్టర్‌ జనరల్‌లు కలిసి  ‘నూతన భారతదేశం’ నిర్మించే పథకం తయారు చేశారు. ఈ మాటకు సమగ్రమైన నిర్వచనం ఇచ్చారు. దాన్ని సాధించడానికి అడ్డంగా ఉన్న సమస్యల్లో మావోయిస్టు ఉద్యమం ప్రధానమైనదని నిర్ధారించారు. దాన్ని నిర్మూలించే వ్యూహాన్ని అక్కడ తయారు చేశారు. తద్వారా కార్పొరేట్‌ అభివృద్ధిని అన్ని రంగాల్లో సాధించి 2047 నాటికి న్యూ ఇండియాను నిర్మించాలని అనుకున్నారు. 

బీజేపీ అధికారికంగా ప్రవేశపెట్టిన ఈ విధానాన్ని సంఫ్‌ుపరివార్‌ ఇంకోలా తీసుకొచ్చింది. హిందూ రాష్ట్ర సాధించినప్పుడే  నిజమైన భారత్‌ సాకారమవుతుందని ప్రకటించింది. అదే అసలైన భారత్‌. అఖండ భారతం. ఆర్యావర్తం. ఈ మాట వాళ్లు కొత్తగా అనడం లేదు.  సరిగ్గా వందేళ్ల సంఫ్‌ుపరివార్‌ చరిత్రలో మొదటి నుంచీ హిందూ రాష్ట్ర అనే భావన ఉన్నది. దాన్ని 2047 నాటికి సాధించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ దిశగా  జరిగిన అనేక ప్రయత్నాల్లో సూరజ్‌కుండ్‌ నిర్ణయాలకు చాలా ప్రాధాన్యత ఉంది. గతంలోలాగా కేవలం సనాతనత్వం, హిందుత్వం మీద ఆధారపడిన హిందూ రాష్ట్రను మాత్రమే ఇవాళ సంఫ్‌ుపరివార్‌ కోరుకోవడం లేదు. దానికి బలమైన రాజకీయార్థిక పునాది ఉండాలనుకుంటోంది. దాన్ని సాధించడానికి, కొనసాగించడానికి అవసరమైన సైనిక పంథాను సిద్ధం చేస్తోంది. బీజేపీ వచ్చాక మరే ఇతర రంగాలకంటే ఒక్క సైనిక, పోలీసు రంగాలకే, దేశ ప్రజలపై యుద్ధ సన్నాహాలకే ప్రకటిత, అప్రకటిత భారీ బడ్జెట్‌ను ఏటా కేటాయిస్తోంది.  భావజాల, సాంస్కృతిక రంగాల్లో మూక దాడులు,  హత్యలు చేసే మత ఉగ్రవాద మూకలను తయారు చేసి దేశం మీదికి వదలడంతోపాటు అధికారికంగా వివిధ రకాల సైనిక బలగాలను, ఆయుధాలను, యుద్ధానికి అవసరమైన ఏర్పాట్లను చేసుకుంటోంది.  ఒక్క దండకారణ్యంలో అణచివేత కోసమే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. లక్షలాది బలగాలను వెచ్చించారు. ఈ నేపథ్యంలో సూరజ్‌కుండ్‌ మావోయిస్టు విముక్త భారత్‌కు ప్రణాళికలు తయారు చేసింది.

దీని కోసం అప్పటి దాకా నడిపిన ఆపరేషన్‌ సమాధాన్‌ను మరింత ముందుకు తీసుకపోవాలని అనుకున్నారు. 2024 సాధారణ ఎన్నికలను తక్షణ లక్ష్యంగా ప్రకటించుకున్నారు. వందలాది మందిని చంపేశారు. జైళ్లపాలు చేశారు. ఇదంతా గతంలో జరిగిన అణచివేత వంటిది కాదు. బీజేపీ మిగతా బూర్జువా పార్టీల కంటే కొన్ని విషయాల్లో ప్రమాదకమైంది. ప్రగతిశీల ఆలోచనలను, ఆధునిక జీవన విధానాన్ని, విప్లవ ప్రజాపోరాటాలను నిర్మూలించి, కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర సాధన అనే లక్ష్యం దీనికి ఉంది.

 న్యూ ఇండియాకైనా,  హిందూ రాష్ట్ర స్థాపనకైనా  ప్రజా పోరాటాలు, లౌకిక ఆలోచనా విధానాలు ఆటంకంగా ఉన్నాయి. వాటిలో బలమైన సిద్ధాంత పునాది, అన్ని రంగాలను సమన్వయం చేయగల ప్రాపంచిక దృక్పథం, దీర్ఘకాలిక వ్యూహం, దాన్ని సాధించడానికి అవసరమైన పోరాటతత్వం, త్యాగనిరతి మావోయిస్టు ఉద్యమానికి ఉన్నాయి.  దీని వల్లే సూరజ్‌కుండ్‌ చింతనా శిబిరం న్యూ ఇండియాను సాధించడమంటే మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడమనే అవగాహనకు వచ్చింది.  వామపక్ష విప్లవోద్యమం ఉన్నంత వరకు  కార్పొరేట్‌ హిందుత్వ పునాది మీద ‘నూతన భారత్‌’కు  అవకాశం లేదు.

కానీ గత పదేళ్లలో  విప్లవోద్యమ నిర్మూలనకు గడువులు ప్రకటిస్తూనే వచ్చారు. కానీ సాధించలేకపోయారు. ఎంత మందిని చంపినా దాని ప్రభావాన్ని దెబ్బతీయలేకపోయారు. విప్లవోద్యమాన్ని తలుచుకోగానే కలిగే భయ ప్రభావం నుంచి పాలకులే తప్పించుకోలేకపోతున్నారు. ఇంత ప్రచండమైనశక్తి మావోయిస్టు ఉద్యమానికి ఆయుధాల వల్లనే రాలేదు. తన ప్రాపంచిక దృక్పథం వల్లనే ఈ వ్యవస్థను అంతిమంగా మార్చేయగల శక్తి దానికి ఉన్నది. ఉత్పత్తి వ్యవస్థను, సామాజిక సంబంధాలను, అతి పురాతనమైన హింసాత్మక నాగరికతా మూలాలను, సంస్కృతీ కళా సాహిత్యాలను తిరగదోడగల సమగ్ర ఆచరణ దాని సొంతం. అది అట్టడుగు ప్రజలను సంఘటితం చేయగలదు. వాళ్ల క్రియాశీలతను పెంచగలదు. అనేక జీవన రంగాలను ప్రజాస్వామిక విలువలతో వెలిగించగలదు. అందుకే దాన్ని సమూలంగా దెబ్బతీయాలని ఫాసిస్టు పాలకులు అనుకున్నారు. ఇందులో భాగంగానే  దండకారణ్యాన్ని దేశంలోనే అతి పెద్ద మిలటరీ జోన్‌గా మార్చేశారు. విప్లవ భావజాలంపై యుద్ధం కొనసాగిస్తున్నారు. కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర స్థాపన అనేది సంఫ్‌ుపరివార్‌కు భావజాల సాంస్కృతిక వ్యూహం.  బీజేపీ ప్రభుత్వానికి రాజకీయార్థిక, సైనిక, పాలనా వ్యూహం. 

ఈ రెండూ కలగలసిన ఫాసిస్టు వ్యూహం నుంచి ఆపరేషన్‌ కగార్‌ పుట్టుకొచ్చింది. మావోయిస్టుల మీద అంతిమ యుద్ధం చేయడానికి ఫాసిస్టులు దీన్ని తీసుకొచ్చారు. నిజానికి అల్‌ అవుట్‌ వార్‌ అని చాలా కాలం కిందే అన్నారు. దానికీ కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర స్థాపన దిశగా పరుగుతు పెడుతూ ఇప్పుడు ఆరంభించిన ఈ అంతిమ యుద్ధానికీ చాలా తేడా ఉన్నది. ఇచ్చి అచ్చమైన ఫాసిస్టు యుద్ధం.

దేశమంతా అనేక రూపాల్లో విస్తరిస్తున్న కార్పొరేటీకరణకు తీవ్రమైన ప్రతిఘటన విప్లవోద్యమం నుంచి బీజేపీకి ఎదురవుతున్నది. కార్పొరేట్‌ భారత్‌ను స్థాపించడానికి సంఫ్‌ుపరివార్‌ వేగంగా పరుగులు తీస్తున్నది. మోదీ ప్రచారం చేసుకుంటున్న వికసిత్‌ భారత్‌ అనేది సారాంశంలో సనాతన భారత్‌, సైనిక భారత్‌, కార్పొరేట్‌ భారత్‌. ఈ కార్పొరేటీకరణకు, సైనికీకరణకు, హిందుత్వీకరణకు వ్యతిరేకంగా  పోరాడాలనే సమగ్ర అవగాహన దండకారణ్య ఆదివాసులకు  ఉన్నది.  బహుశా ఇండియన్‌ ఫాసిజానికి ఉన్న ప్రత్యేకతలను పూర్తిగా అర్థం చేసుకుంటున్నదీ, దాన్ని ఎదిరిస్తున్నదీ దండకారణ్య ఆదివాసులే కావచ్చు. ఈ దిశగా వాళ్లు ఎప్పుడు తమ పోరాటానికి పదును పెట్టారో అప్పటి నుంచే కార్పొరేట్‌ యుద్ధం మొదలైంది. అంతిమసారంలో ఒక మానవీయ సమాజాన్ని నిర్మించడం, చరిత్రను సమూలంగా మలుపు తిప్పడం లక్ష్యంగా ఉన్నందుకే విప్లవోద్యమాన్ని తుడిచిపెట్టేందుకు ఫాసిస్టులు ఈ అంతిమ యుద్ధం ప్రారంభించారు. బహుశా ఇందులోని మావోయిస్టు రహిత భారత్‌ అనే నినాదంలో ఆదివాసీ రహిత భారత్‌ అనే అర్థం కూడా ఉన్నది.

అయితే ఈ యుద్ధం అక్కడే ఆగేది కాదు. ఇప్పటికే దేశమంతా విస్తరిస్తున్నది. ఆపరేషన్‌ కగార్‌కు మూల రూపం మంద్రస్థాయి యుద్ధతంత్రంలో ఉన్నది. అది సైనిక యుద్ధమే కాదు. అందులో ఆధిపత్య భావజాలం ఉన్నది. అది పోరాట శక్తుల మధ్య ఐక్యతను దెబ్బతీస్తుంది. పరస్పర అవిశ్వాసాన్ని లేవదీస్తుంది. నైతికశక్తిని నిర్మూలిస్తుంది. చుట్టూ జరుగుతున్న దారుణాలు పట్టీ పట్టని మౌనంలోకి తోసేస్తుంది. ఒక ప్రజా ఉద్యమం మీదకి మరో ఉద్యమాన్ని ఎగదోస్తుంది. అందుకే భారత పాలకవర్గం ఈ యుద్ధతంత్రాన్ని స్వీకరించాయి. ఫాసిస్టు శక్తులకు ఇది బాగా ఇష్టమైనది. సన్నిహితమైనది.

కాబట్టి ఈ అంతిమ యుద్ధం దేన్ని అంతం చేయాలనుకుంటోందో మనం తెలుసుకోగలమా? దేన్ని నిర్మించాలనుకుంటోందో గ్రహించగలమా? ఆదివాసులను చంపేయడంతో ఇది ఆగదు. మావోయిస్టు ఉద్యమాన్ని దెబ్బతీయడంతో ముగిసిపోదు. అత్యంత అనాగరికమైన, అమానవీయమైన కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర సాధనకు ఉన్న  ఆటంకాలను తొలగించుకోడానికి ఆపరేషన్‌ కగార్‌ తీసుకొచ్చింది. ఇక ఈ అంతిమ యుద్ధంతో ఎవరెవరు ఎట్లా తలపడాలో ఎవరంతకు వాళ్లు నిర్ణయించుకోవలసిందే. లేకపోతే మన ఉమ్మడి భవితవ్యాన్ని కార్పొరేట్‌ హిందుత్వకు అప్పగించినట్లే.

Leave a Reply