ప్రతి ఉద్యమం సమాజానికి ఒక మేల్కొలుపు వంటింది. అది వాస్తవ పరిస్థితి పట్ల కళ్లు తెరిపించి మార్పు కోసం దారి చూపిస్తుంది. అయోధ్య రామున్ని అడ్డం పెట్టి హిందూ మెజారిటీని భక్తితో, ముస్లింలు తదితర మైనారిటీలను భయంతో కళ్లు, నోరు మూసుకునేలా చేసి ఎన్నికల్లో గెలవాలనుకుంది బిజెపి. పాత ఎత్తుగడే కానీ ఇప్పుడు ఇనుమడిరచిన ఉత్సాహంతో, మీడియాను తన వశం చేసుకున్నాక రెట్టించిన బలంతో పాచిక వేసింది. రాముడొచ్చాడు అని దిక్కులు మోగేలా అరిచింది మీడియా. రాముడొచ్చాడు కాచుకోండి అన్నారు ఫాసిస్టులు. ఆ భజన మోతలో, ఆ ఆర్భాటంలో మణిపూర్‌ల కేకలు వినపడలేదు, అదానీల దోపిడి కనపడలేదు. ఇంకా అనేక చోట్ల దేశం తగలబడుతున్న కమురు వాసన తెలియలేదు. తెలియనివ్వలేదు. ఫిబ్రవరి 13న మళ్లీ దేశం రైతు వైపు చూసింది. రెండేళ్ల నాటి మహత్తర పోరాటాన్ని గుర్తు చేసుకుంది. భారతదేశ వ్యవసాయాన్ని కార్పొరేట్ల వశం చేసి రైతులను వారి దయాదాక్షిణ్యాలకు  వదిలేసే మూడు చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసిన, మొట్టమొదటి సారి ఫాసిస్టులపై పాక్షికంగానైనా విజయం సాధించిన పోరాటమది. ప్రభుత్వ నిరంకుశ విధానాలకు పార్లమెంటు చట్టబద్ధతనిస్తే, న్యాయవ్యవస్థ మీద నమ్మకం పోతే, సుప్రీం కోర్టులో కాదు ప్రజాకోర్టులోనే వాటిని వీగిపోయేలా చేయొచ్చని నిరూపించిన పోరాటమది.

రెండేళ్ల తర్వాత మళ్లీ రైతులు రాజధాని రోడ్డుమీదికి ఎందుకొచ్చారు? దీనికి సూటిగా సమాధానం చెప్పొచ్చు. రెండేళ్ల నాటి హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేదు కాబట్టి. అందులో ముఖ్యమైనది అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా ఒక చట్టబద్ధమైన విధానం తీసుకురావాలని. దీనితో పాటు వారు ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్లు తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం నుండి వచ్చినవి. బడా పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే స్వేచ్ఛా మార్కెట్‌ విధానాల వల్ల కుదేలైన భారత వ్యవసాయం రంగం, లక్షల్లో రైతుల ఆత్మహత్యలు, ఆహార సంక్షోభం వంటి కీలక సమస్యలను చర్చనీయాంశం చేసే ఉద్యమమిది. మద్దతు ధర, రుణమాఫీ విషయంలో సామినాధన్‌ కమిటీ సిఫారసులు అమలు చేయాలని రైతులు ఎన్నో ఏళ్ల నుండి అడుగుతున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్యూటివో) ఒప్పందాల నుండి భారతదేశం వెనక్కి రావాలని కూడా తాజా డిమాండ్లలో ఉంది.

విద్యుత్‌ రంగాన్ని పూర్తి ప్రైవేటీకరణ వైపు తీసుకుపోయే విద్యుత్‌ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని 2020 నుండే రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు ఉత్పత్తి చేసే కంపెనీలకు చెక్‌ పెట్టాలని, విత్తన నాణ్యతను కాపాడాలని రైతులు అడుగుతున్నారు. అలాగే ఆదివాసుల జల్‌ జంగల్‌ జమీన్‌లకు, అటవీ వనరులకు రక్షణ కల్పించాలని… వివిధ ప్రాజెక్టుల కోసం రైతుల నుండి సేకరించే భూమికి నష్టపరిహారం పెంచాలని, భూసేకరణ వల్ల ప్రభావితమైన కుటుంబాలకు ఆర్థికంగా రక్షణ కల్పించాలని కూడా వారి డిమాండ్లలో ఉంది.

లఖింపూర్‌ ఖేరీలో బిజెని నాయకుడు తన కారు కింద ఎనిమిది మందిని తొక్కి చంపిన ఘటనలో బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. దానిని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.

ఒక్కదానికీ సమాధానం చెప్పకుండా కళ్లూ చెవులు మూసుకొని నిండా మునిగి జపం చేసే ప్రధానమంత్రి నీరో చక్రవర్తిని ఎప్పుడో మించిపోయాడు. తాను ఒక్క మాట కూడా మాట్లాడకుండా పోలీసులతో, మీడియాతో, వాట్సాప్‌ యూనివర్సిటీతో, సోషల్‌ మీడియా రౌడీ మూకలతో మాట్లాడిరచడం ఇంతలా ఒంటబట్టిన పాలకుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు.

రైతుల డిమాండ్లన్నీ నిన్న ఇవాళ ఆకస్మికంగా పుట్టుకొచ్చినవి కాదు. అనేక దఫాలుగా వివిధ ప్రాంతాల్లోని రైతులు దేశానికి వెన్నెముకైన వ్యవసాయాన్ని నిలబెట్టమని ఏదో ఒక స్థాయిలో పోరాడుతున్నారు. 2020-21 నాటి ఉద్యమం ఒక సంఘటిత రూపం తీసుకుంది. వివిధ రైతు సంఘాలతో విశాల ఐక్యసంఘటన ఏర్పడి ఊర్లకు ఊర్లు కదిలాయి. దీన్ని పంజాబ్‌, హర్యానా పోరాటంగానే చూడరాదు. ఆ రైతులు ప్రాతినిధ్యం వహించింది మొత్తం రైతాంగాన్ని. దేశవ్యాప్త వ్యవసాయాన్ని, కోట్లాది రైతులను జీవన్మరణ సంక్షోభంలోకి నెట్టిన కీలకమైన విషయాలను వారు చర్చనీయంశం చేశారు. ఉద్దేశపూర్వకంగానే వీరు ముందుకు తెచ్చిన డిమాండ్లను మీడియా ప్రచారం చేయడం లేదు. ఉద్యమానికి అనుకూలంగా రాసే సోషల్‌ మీడియా మీద నిషేధాలు పెట్టడం, పోరాడే రైతులను తీవ్రవాదులని దుష్ప్రచారం చేయడం పరాకాష్టకు చేరుకుంది. 

గత అనుభవంతో కూడా ప్రభుత్వం ఈసారి మరింత దుర్మార్గంగా విరుచుకపడుతోంది. కశ్మీర్‌లో ప్రయోగించిన నిర్బంధంతో దీన్ని పోల్చవచ్చేమో. రాజధానికి చేరే రహదార్లను సిమెంటు దిమ్మెలు, ముళ్ల కంచెలతో మూసేయడం, రోడ్లు పొడవునా మేకులు దించడం మాత్రమే కాదు, నేరుగా రైతుల మీదకి ఇదివరకు ఎన్నడూ చూడనంత హింసను ప్రయోగిస్తోంది. రైతుల ‘చలో ఢిల్లీ’ మొదలు కాగానే పోలీసులు కనీసం ముప్పై వేలకు పైగా టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ సమకూర్చుకున్నారని వార్తలొచ్చాయి. రబ్బర్‌ బుల్లెట్స్‌ విపరీతంగా కాలుస్తున్నారు. పెల్లెట్‌ గన్స్‌ తో ఒళ్లంతా ఛిద్రం చేయడం ఇది వరకు కశ్మీర్‌లో చూశాం. ఇప్పుడా హింస ఢిల్లీకి చేరుకుంది. పెల్లెట్స్‌ మాత్రమే కాదు, బుల్లెట్స్‌ కూడా కాలుస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. యువరైతు శభ్‌కరణ్‌ సింగ్‌ మరణం హర్యానా పోలీసుల కక్షపూరిత వైఖరి వల్లనేనని ఆగ్రహిస్తున్నారు. ఇక కేసులు, అరెస్టులకు లెక్కలేదు. ఇంత హింసను నిర్బంధాన్ని ఎదుర్కొంటూ రైతులు చేస్తున్న పోరాటం దేశానికి ఎంతో స్ఫూర్తిదాయకం.

రైతుల డిమాండ్లు దేశంలో పేరుకుపోయిన అసలు సమస్యలను ఎత్తి చూపుతున్నాయి. ఇవి పాలకుల ఆకర్షిణీయమైన అభివృద్ధి నినాదాలను పటాపంచలు చేసేవి. ఫాసిస్టులు రెచ్చగొట్టే జాతిమత భావోద్వేగాల మత్తును వదిలించి ప్రజలుగా మనం పాలకులను ఏం అడగొచ్చో సూటిగా చెప్పేవి. ఇటువంటి ఉద్యమాలే ఫాసిజానికి సమాధానం.

Leave a Reply