భారత విప్లవోద్యమ చరిత్రలో 1980కి విశిష్ట స్థానం వుంది. దేశ విప్లవోద్యమ చరిత్రలో అది ఒక మైలురాయిగా నిలిచిపోయిన సంవత్సరం. 1980 జూన్ లో ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపిక చేసిన యువ విప్లవకారులు సరిహద్దులలోని దండకారణ్యంలో అడుగిడినారు. వారు, 35 మంది విప్లవకారులు 7 దళాల రూపంలో విశాల అటవీ ప్రాంతంలో తమ విప్లవ కార్యకలాపాలకు నాంది పలికారు. ఆ అటవీ ప్రాంతంలో భాగం పాత చంద్రపుర్ (చాందా) జిల్లా, వర్తమాన గడ్ చిరోలీ జిల్లా. గడ్ చిరోలీ జిల్లా ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి నదులు సరిహద్దులుగా ఆంధ్రప్రదేశ్ తో అనుబంధాన్ని కలిగివుంది.

గడ్చిరోలీ విప్లవోద్యమ చరిత్రలో 1980, నవంబర్ 2 రక్తాక్షరాలతో లిపిబద్ధమైంది. దండకారణ్య అడవులలో తొలి తరం విప్లవకారులలో ఒకరైన కామ్రేడ్ పెద్ది శంకర్ పోలీసుల తుపాకీ తూటాలకు బలై నెత్తురు చిందించిన రోజు నవంబర్ 2. ఆయన నెత్తురు వృధా కాలేదు. ఆ త్యాగఫలమే గడ్ చిరోలీ విప్లవోద్యమం గత 4 దశాబ్దాలకు పైగా  అనేక ఆటు పోట్లను ఎదుర్కొంటూ నూతన ప్రాంతాలకు విస్తరిస్తూ ప్రజల హృదయాలలో తన స్థానాన్ని నిలపుకోవడమే కాకుండా భారత ఆర్థిక రాజధాని ముంబైకి సైతం విప్లవ సందేశాలను చేరవేస్తుంది.

గత నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న విప్లవోద్యమంలో వేలాది ప్రజలు సంఘటితమై, తమ అడవుల కోసం, తమ ఆవాసాల కోసం, తమ హక్కుల కోసం, తమ అస్థిత్వం కోసం పోరాడడంతో అది పాలకుల దృష్టిలో ప్రముఖ మావోయిస్టు ఉద్యమ ప్రాంతాలలో ఒకటిగా నమోదైంది. 1980 దశకం చివర్లో ఈ సంఘటిత ప్రజా ఉద్యమంలో నుండి నవ యవ్వన ప్రాయంలోనున్న చురుకైన మూలవాసీ యువకుడు సృజన్ సింగ్ ముందుకు వచ్చాడు. ఆనాటి నుండి ఆరు మాసాల క్రితం దేవ్ నది ప్రవాహంలో ప్రమాదవశాత్తు అసువులు బాసేవరకు ఆయన పీడిత ప్రజల విముక్తి కోసం అలుపెరుగని పోరు సలిపినాడు. ఆయన విప్లవ సేవలను, విప్లవాదర్శాలను ఈతరం యువత తెలుసు కోవాలి.

కామ్రేడ్ సృజన్ సింగ్ గడ్ చిరోలీ జిల్లా ధనోరా తాలూకా మురుంగాఁవ్ లో 1960 ల చివర్లలో జన్మించాడు. అప్పటికి ఆ జిల్లాలోని విశాల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న పేద ఆదివాసీ కుటుంబాలనేకం పంట భూములకు నోచుకోని బతుకులీడుస్తుండేవి. ఆయన పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించినప్పటికీ చదువుకోవాలన్న ఆసక్తి వుండడంతో 7వ తరగతి వరకు చదువుకున్నాడు. కానీ, ఆపై ఆయన చదువుకు పేదరికం అనుమతించ లేదు. దానితో ఆయన తన కుటుంబంతో పాటు పొరుగున వున్న చార్వాహి అనే మరో గ్రామానికి భూమి కోసం తరలివెళ్లక తప్పలేదు. అక్కడ భూమి కోసం ప్రభుత్వ అటవీ శాఖ వారితో అందరాదివాసీ కుటుంబాలలాగే, కామ్రేడ్ సృజన్ సింగ్ కుటుంబం జీవన్మరణ పోరు సలపక తప్పలేదు. భయం భయంగానే పంటలు వేసుకోవడం, అవి చేతికి అంది వచ్చేవరకు భరోసా లేని జీవితాలే గడిపేది. అలాంటి జీవితాలకు 1980ల చివర్లో విప్లవోద్య మం ప్రత్యక్షంగా పరిచయమైంది.

నిజానికి, పెద్ది శంకర్ చిందించిన నెత్తురు వెన్వెంటనే దావానలంలా తన విప్లవ సందేశాలను రాష్ట్ర వ్యాప్తంగా చేరవేసింది. అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో బలపడుతున్న విప్ల వోద్యమ ఫలితం అది. జిల్లా లోని మారుమూల సిరొంచ తాలూకాలోని ప్రాణహిత నది ఒడ్డున గల ముయ్యబోయినపేట జొన్న చేలల్లో చిమ్మిన నెత్తుర్లు పాలకుల గుండెలలో గుబులు పుట్టించగా జిల్లా వ్యాప్తంగా పీడిత ప్రజలను ముఖ్యంగా మూలవాసీ ప్రజలను ఆలోచింపచేశాయి. వారిపై తరతరాలుగా అమలవుతున్న రాజుల, ప్రభుత్వాల దోపిడీ, అణచివేత, అత్యాచారాల అంతానికిది ప్రారంభమని వారూహించుకున్నారు. వారిని స్వాగతించాలనీ నిర్ణయించుకున్నారు. ఆ ఉద్యమంతో తాదాత్మ్యం చెందాలని దీక్ష పూనారు. అలాంటి వారిలో కష్టాల మధ్య, కన్నీళ్ల మధ్య ధైర్య సాహసాలతో ఎదుగుతున్న యువ కామ్రేడ్ సృజన్ సింగ్ ఒకరు.

తమ ప్రాంతానికి విప్లవోద్యమం చేరడంతో పట్టరాని సంతోషంతో వేలాది ప్రజలు విప్లవ ప్రజాసంఘాలలో సంఘటితమయ్యారు. వారు ఆనాడు తమ విప్లవోద్యమ నాయకుడైన కామ్రేడ్ మడ్కాం (కామ్రేడ్ పసుల రాంరెడ్డి, కోరుట్ల) ను, తమ కోసం వచ్చిన నాయకుడిగా  భావించారు.    ఆ ప్రజలు దళం చెప్పే ప్రతిమాటను  తమ జీవితాలను బాగు చేస్తున్నదని స్వీకరించారు.   ఆనాటి వారి విప్లవ రాజకీయాల నిబద్ధత ఎంతటిదంటే  వారు తమ ప్రాంతంలో తమను వేధించుకు తింటూ పోలీసుల కాపలాలో వుంటున్న సర్సుండి రాజుపైకి ప్రజా పంచాయతీ నిర్వహణకు వేలాదిగా తరలి వెళ్లడం, అక్కడ జరిగిన కాల్పులలో కామ్రేడ్ తుమ్రేటి దయారాం అసువులు బాయడం గురించి తెలుసుకుంటే సులభంగానే బోధపడుతుంది. ఆ రాజకీయాల నిబద్ధతతో రాటుతేలుతున్న కామ్రేడ్ సృజన్ సింగ్ ను అక్కడి ప్రజలు తమ రేంజ్ నాయకుడిగా నిలుపుకున్నారు.

కామ్రేడ్ సృజన్ సింగ్ రేంజ్ స్థాయిలో ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందడంతో పోలీసుల కంట్లో నలుసైనాడు. పోలీసులు ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపారు. కానీ, ప్రజలు, విప్లవాభిమానులు కోర్టుకు వెళ్లి జమానత్ పై ఆయనను విడిపించుకువచ్చారు. మారుతున్న పరిస్థితులను కామ్రేడ్ సృజన్ సింగ్ నిశితంగా అంచనా వేసుకున్నాడు. ఇక తనను పోలీసులు చట్టబద్ధంగా పనిచేయనియ్యరనీ అర్థం చేసుకున్నాడు. తన జీవితాన్ని ప్రజల కోసమే అర్పించాలనీ, ఆదివాసీ ప్రజల కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో వీరోచితం గా పోరాడి అసువులు బాసిన వీర బాబురావ్ కు నిజమైన వారసుడిగా నిలువాలనీ శపథం పూనాడు. అయితే, అప్పటికే ఆయనకు అన్ని విధాలా సహకరించే సహచరి, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు వున్నప్పటికీ ఆయన నిర్ణయానికి వారెంత మాత్రం అడ్డు కాలేదు. వారి బాగోగులు  ప్రజలు చూసుకుంటారనీ నాలుగు గోడల మధ్య కుటుంబ బంధనాలకు బందీ కాకుండా విశాల ప్రపంచాన్ని తన కుటుంబంగా భావించి పూర్తికాలం విప్లవకారుడిగా బాధ్యతలు చేపట్టాడు.

తొలుత ఆయన కొంత కాలం ఉద్యమం  ఇచ్చిన కొరియర్  (వార్తార్హుడు) బాధ్యతలు చేపట్టా డు. కానీ, అప్పటికే సరిహద్దులలోని మధ్య ప్రదేశ్ (వర్తమాన ఛత్తీస్ గఢ్)కు విస్తరించిన విప్లవోద్యమం  కామ్రేడ్ సృజన్ సింగ్ ను అక్కడికే పంపాలని నిర్ణయం తీసుకోగా, రాజేశ్ గా పేరు మార్చుకున్న సృజన్ సింగ్ వెంటను నిర్నిబంధనగా తన ఆమోదాన్ని తెలిపి నూతన ప్రాంతానికి వెళ్లాడు. ఇక ఆయన తుది వరకు అక్కడే వివిధ స్థాయిలలో తన విప్లవ బాధ్యతలను కొనసాగించాడు.

దాదాపు మూడు పదులు నిండేవరకు ప్రజల మధ్య జీవిస్తూ ఎంతో జీవితానుభవాన్ని గడించిన కామ్రేడ్ సృజన్ సింగ్ నూతన ప్రాంత ఆదివాసీ రైతులతో ఎంతగానో మమేకమ య్యాడు. తమ ప్రాంతంలో తమ మాతృభాష గోండి మాట్లాడడం తగ్గిపోతూ ఛత్తీస్ గఢీ మాట్లాడడం క్రమం గా ఆధిపత్యంలోకి వస్తుండడంతో తనకు ఇంటివద్దనే ఆ భాష అలవ డింది. అది ఆయనకు ఉద్యమ విస్తరణలో ఎంతగానో తోడ్పడింది. ప్రజలు కూడ ఆయన ను తమ వాడిగా భావిం చి ఆయనను తమ నాయకుడిగా స్వీకరించి విప్లవ ప్రజాసంఘా లలో సంఘటితం కాసాగారు. సరిహద్దులలోని దేవ్ రీ, దర్రెకస్స ప్రాంతాల రైతులు విప్లవ రాజకీయాలతో సంఘటితమై సమరశీల పోరాటాలు చేయడంతో రాజ్యం వారిపై నూతన రూపాలలో విరుచుకపడ సాగింది. దేవ్ రీ తాలూకాలోని ఆదివాసీ గ్రామం మంగేఝరి నుండి 14 మంది రైతులను పోలీసులు అపహరించి సజీవంగా ఖననం చేశారు. అప్పుడప్పుడే కామ్రేడ్ రాజేశ్ జీవితంలో బూటకపు ఎన్ కౌంటర్లు పరిచయం అవుతూ 1991-94 మధ్య గడ్ చిరోలీలో 60 మంది ప్రజాసంఘాల కార్యకర్తలు, నాయకులు అసువులు బాయడం గమనంలోకి వస్తుండగా తాను పని చేస్తున్న ప్రాంతంలో నూతన తరహలో రాజ్య హంస మొదలైనప్పటికీ ఆయన చలించలేదు. సరికదా, ఫాసిస్టు రాజ్య స్వభావాన్ని అర్థం చేసుకోసాగాడు. అప్పటికే ఆయన సహచరి సునంద పేరుతో ఆయనతో పాటుగా గెరిల్లా దళంలో సభ్యురాలైంది.

మంగేఝరి ఘటనపై  బాలగోపాల్ గారి నాయకత్వంలో నిజనిర్ధారణ కమిటీ ఎంతో శ్రమపడి, రాజ్యహింసను భరిస్తూ నిజాలు వెలికి తీసి ప్రపంచానికి అందించారు. ఆ పక్కనే వున్న ఛత్తీస్ గఢ్ గ్రామం బేవర్ టోల నుండి నలుగురు ఆదివాసీ మహిళా సంఘం యువ కార్యకర్తలను పోలీసులు మామం చేశారు. వారి వివరాలు ఈనాటి వరకు ప్రపంచం తెలుసుకోలేకపోయింది.  విప్లవకారులను మాయం చేయడంలో అప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు రాటుతేలగా, మహారాష్ట్ర పోలీసులు మరో అడుగు ముందుకువేసి సమరశీల ప్రజలను అరెస్టు చేసి సజీవంగా ఖననం చేయడం, మాయం చేయడాలకు పాల్పడుతూ పంజాబ్,  కశ్మీర్ లను తలపింపచేశారు. లాటిన్ అమెరికా దేశాలను గుర్తు చేశారు.

అంచెలంచెలుగా ఉద్యమంలో ఎదుగుతున్న కామ్రేడ్ రాజేశ్ మొదట గెరిల్లా దళ డిప్యూటీగా, తదనంతరం కమాండర్ గా బాధ్యతలు చేపట్టాడు. ఆ క్రమంలో ఆయన ఒక వైపు రాజకీయంగా ఎదుగుతూ, సైనిక రంగంలో మంచి అనుభవాన్ని సంపాదించ సాగాడు. నిర్మాణపరంగా ప్రజలను సంఘటితం చేస్తూ వెదురు కూలీ రేట్లపై, తునికాకు కోత కూలీ రేట్ల పెరుగుదలపై సమరశీల పోరాటాలు నిర్వహించడంలో మంచి పట్టు సాధించాడు. అడవులలో నివసిస్తూ, పొట్ల గడుపుకోవడానికి అడవి నుండి వెదురు తెచ్చుకునే  బున్ కర్లపై (ఆదివాసీలలో వెదురుతో అల్లకం పని చేసే వారు) అటవీశాఖ వారి ఆగడాలకు అడ్డుకట్ట వేశాడు. ఆ ప్రాంత వాసులకు కామ్రేడ్స్ సునీల్ (అమరుడు కొండన్న, మహబూబ్ నగర్ జిల్లా), రాజేశ్ అంటే ప్రాణప్రదమైన నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటికే అక్కడ పెద్ద ఎత్తున పోలీసు దాడులు జరుగుతుండడంతో, దళం పై జరిగిన కాల్పులలో కామ్రేడ్ రాజేశ్ సహచరి కామ్రేడ్ సునంద 2008లో అమరు రాలైంది.

తన సహచరి అమరత్వం ఆయనకు దాదాపు రెండు దశాబ్దాల ఎడబాటును కలిగించి నప్పటికీ, మొదట ఇంటి వద్ద పిల్లల బాధ్యత చూస్తూ, తనకు విప్లవ కార్యకలాపాలలో ఎంతగానో సహకరించిన కామ్రేడ్ సునంద తరువాత తనకు దళంలో చేదోడువాదోడుగా వున్న జ్ఞాపకాలను తన మదిలోనే భద్రంగా నిలుపుకొని ఆయన మరింత పట్టుదలగా ప్రజల కోసం విప్లవించ ప్రతిజ్ఞ పూనాడు. ఆ క్రమంలో ఆయన డివిజన్ స్థాయి నాయకుడి గా ఉన్నత బాధ్యతలలోకి వచ్చాడు. ఆ ప్రాంతంలో అమరుడు కటకం సుదర్శన్ తో పాటు ఆయన సీతాఫల్ (గ్రామం) ప్రజా ప్రతిఘటనలో  పాల్గొన్నాడు. ఇతరత్ర జరిగిన ప్రతిఘటనల్లో  ఆయన పాల్గొని వాటిని సఫలం చేయడంలో చూపిన చొరవ, ప్రదర్శించిన సమయస్ఫూర్తి యువ గెరిల్లాలు నేర్చుకోవలసినవే. ఆయన చివరి ప్రతిఘటన చర్య అంటే, 2023 వర్షాకాలం లోబాగ్ నది వద్ద   గెరిల్లాలు జరిపిన ప్రతిఘటననే  అనుకోవచ్చు. అందులో ఆయన ప్రత్యక్షంగా  పాల్గొన కపోయినప్పటికీ,  దాన్ని  చేయలేమని మొదట వెనుతిరిగి వచ్చిన గెరిల్లాల నుండి సాకల్యంగా రిపోర్టు తీసుకొని తన అనుభవంతో వారికి   కావలసిన   మెలుకువలను చెప్పి వారిని తిరిగి పంపించాడు.  గెరిల్లాలు రెట్టింపు ఉత్సాహంతో వెళ్లి దానిని జయప్రదం చేసి వచ్చాక, గెరిల్లాలను అభినందించాడు.

కామ్రేడ్ రాజేశ్ నూతనంగా ఉనికిలోకి వచ్చిన యంయంసీ (మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్) జోన్ లో 2018 నుండి రాష్ట్ర స్థాయి నాయకుడిగా అమరుడు మిలింద్ తేల్తుం బ్డే నాయకత్వంలో పని చేశాడు. కేంద్ర నాయకుడు  కామ్రేడ్ మిలింద్ కు అత్యంత విశ్వాసపాత్రుడైన నాయకత్వ కేడర్లలో కామ్రేడ్ రాజేశ్ ఒకరు. వారివురు కలిసి అక్కడి ఉద్యమానికి దాదాపు దశాబ్దన్నర కాలం నాయకత్వం అందించారు. మిలింద్ తనకు తెలియని గెరిల్లా జీవిత విశేషాలను, ఆదివాసీ ప్రజల ఆచార సంప్రదాయాలను అనేకం కామ్రేడ్ రాజేశ్ నుండి తెలుసుకునేవాడు. కామ్రేడ్ మిలింద్ తో పరిచయాలు ఏర్పడేనాటికి రాజేశ్ ముందు మంగూ పేరుతో, తరువాత దామదాదా పేరుతో ఉద్యమ బాధ్యతలలో వున్నాడు. కామ్రేడ్ మిలింద్ అమరత్వంతో (13 నవంబర్ 2021) దామాదా ఒక గొప్ప విప్లవ నేస్తాన్ని కోల్పోయాడు. అయినప్పటికీ, ఆయన కామ్రేడ్ మిలింద్ లేని లోటు తీర్చ డానికి నిరంతరం కృషి చేస్తూ విప్లవ కేడర్ల, ప్రజల విశ్వాసాన్ని మరింతగా చూరగొ న్నాడు.

వయసు పైబడుతున్న కామ్రేడ్ దామా గత నాలుగేళ్లుగా మధుమేహ వ్యాధితో బాధ పడుతున్నాడు. మరోవైపు బీ.పీ కూడ మొదలవడంతో ఆయన విప్లవ కార్యకలాపాలకు ఒక మేరకు పరిమితి తప్పలేదు. అయినప్పటికీ, ఆయన నూతన తరాలకు ఒక గొప్ప మార్గదర్శకుడిగా వుండేవాడు. ఆయన ఉన్నాడంటే గెరిల్లాలకు కొండంత అండగా వుండే ది. వారంతా నిశ్చింతగా వుండేవారు. ఆయన గెరిల్ల దళ జీవితంలోనే ప్రాథమిక వైద్యం నేర్చుకున్నాడు. సోదర కామ్రేడ్స్ అభిమానం చూరగొనడమే కాకుండా విపత్కర పరిస్థితు లలో ప్రతి గెరిల్లా ఒక వైద్యుడు కావడానికి కూడ తయారుగా వుండాలనే వాస్తవాన్ని ఆయన అక్షరాల అమలుచేశాడు. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధాన్ దాడుల మధ్య గెరిల్లాలను దృఢంగా నిలబెట్టడం, నూతన ప్రాంతంలో విప్లవోద్యమాన్ని నిలపడంలో ఆయన చేసిన కృషి అనుపమానమైనది. 

కామ్రేడ్ దామ అక్టోబర్ చివర్లో ఒక రోజు ఉదయాన్నే ఆ ప్రాంతంలోని దేవ్ నదిని దాటడానికి దళంతో పాటు సిద్ధమయ్యాడు. కొండలలో నుండి చాలా వేగంగా ప్రవహించే ఆ నదిని దాటడానికి గెరిల్లాల సాధనం ప్లాస్టిక్ షీట్ (ఝిల్లీ) మాత్రమే. అందులోనే తమ తుపాకులు సహ అన్ని సామానులు వేసి మూటగా చేసి దాని సహాయంతో దాటుతుం టారు. కానీ, ఆరోజు ఆ మూటలోకి నీళ్లు చేరుతున్న విషయం అర్థమై, ప్రమాద సంకేతాల ను ఊహించి తాను మూట వదిలి ఈదడానికి పూనుకోగా, 64 సంవత్సరాల దామాదాదా కు శక్తి సరిపోక పోవడంతో, ఆయన ఆవలి ఒడ్డు చేరలేకపోయాడు. గతంలో ఆయన ఆ నదిని సునాయసంగానే దాటేవాడు. కానీ, ఆరోజు ఆయన దాటలేక ఆ ప్రవాహంలోనే కలిసి పోయాడు.  “Men may come and men may go but I go on forever” అంటూ ప్రవహించే ఆ నదిలో మూడు రోజులు సహచర కామ్రేడ్స్ గాలింపులు జరిపినా ఆయన  శరీరం దొరుకలేదు. నదిలో మూట విడిచిన క్షణాలే ఆయన కడసారి చూపుగా వారికి మిగిలాయి. అంతిమంగా గెరిల్లాలు ఆయనకు శ్రద్ధాంజలి అర్పించి ఆయన ఆశయా ల సాధనలో తుది వరకూ పోరాడుతామని శపథం చేశారు.

యవ్వన ప్రాయం నుండి ప్రజల కోసమే పని చేసిన కామ్రేడ్ దామాదాదా విప్లవ జీవితం ప్రతి గెరిల్లాకు, ముఖ్యంగా నేటి తరానికి ఎంతో ఆదర్శవంతమైనది. పీడిత ప్రజల ను సంఘటితం చేసి దోపిడీ రహిత సమాజం కోసం ఆయన చేసిన సేవలు విలువైనవి. ఉద్యమాల చరిత్రలో సదా స్మరణీయమైనవి. అధికారంలో వున్న హిందుత్వ శక్తులు అడ వులను కార్పొరేటీకరిస్తూ, అడ్డుతగులుతున్న ప్రజా వుద్యమాలను సైన్యకరణతో నెత్తురు టేరులలో ముంచుతూ ఆదివాసీల అస్థిత్వాన్నే హైందవీకరణతో రూపుమాపుతున్న నేటి తరుణంలో సృజన్ సింగ్ ల ఆవశ్యకత సమాజానికి, మూలవాసీ జన జీవితాలకు ఎంతో వుంది. ఆ కొరవ నేటి తరమే తీర్చాలి.   

Leave a Reply