ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఐదుగురి సంపద 2020 నుండి రెట్టింపుకు పైగా పెరిగింది. అదే సమయంలో 4.8 బిలియన్ల (480 కోట్లు) మంది అంటే జనాభాలో 60శాతం మంది మరింత పేదలుగా మారారు. ఈ లెక్కన చూస్తే ప్రపంచంలో ఏ ఒక్కరూ పేదరికంతో బాధపడకుండా ఉండాలంటే 229 సంత్సరాలు పడుతుందని అంచనా వేసిన ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ప్రచురించిన నివేదికను దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా జనవరి 14న విడుదల చేశారు. ‘ఈ అంతరాలను మేం గమనిస్తున్నాం. కొవిడ్‌, ద్రవ్యోల్బణం, యుద్దాలు వంటి ప్రతికూల పరిణామాలతో కోట్లాది మంది ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు బిలియనీర్ల సంపద ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. అసమానత అనేది యాధృచ్ఛికం కాదు. కార్పొరేట్‌ సంస్థలు ప్రజలందరి ప్రయోజనాలను ఫణంగా పెట్టి మరింత సంపదను తమకు అందజేయాలని కోరుకుంటున్నాయని ఆక్స్‌ఫామ్‌ తాత్కాలిక ఎగ్గిక్యూటివ్‌ డైరెక్టర్‌ అమితాబ్‌ బెహర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

అభివృద్ధి చెందిన దేశాలకు, వర్ధమాన దేశాలకు మధ్య అసమానతల వ్యత్యాసం గత పాతిక సంవత్సరాల్లో మొదటిసారిగా పెరిగింది. ప్రపంచంలోని వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తల సంపద వేగంగా రెట్టింపు అవుతుంటే, పేదరికం మాత్రం అందుకు కొన్ని వందలరెట్లు పెరుగుతోంది. ప్రపంచ జనాభాలో 28 శాతమే ఉన్నప్పటికీ సంపదలో 69 శాతం అభివృద్ధి చెందిన దేశాల వద్దే ఉంది. అలాగే బిలియనీర్ల సంపదలో కూడా 74శాతం ఆ దేశాలదే. ఒకప్పుడు సంపద సామ్రాజ్యవాద వలసవాద దేశాలకే పరిమితమై ఉండేది. అయితే ఇప్పుడు వలసవాదం అంతరించిపోవడంతో వర్ధమాన దేశాలతో నయా వలసవాద సంబంధాలు మొదలయ్యాయి. దీంతో ఆర్థిక అసమానతలు శాశ్వతంగా అలాగే ఉండిపోయాయి. సంపన్న దేశాలకు అనుకూలంగా ఆర్థిక నిబంధనలు రూపొందాయి. బహుళజాతి కార్పొరేట్‌ సంస్థలు సంపదను సృష్టించి, సంపన్నులకే అందిస్తున్నాయి. ఇదిలా ఉండగా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం అసమానతలు తిరిగి ప్రారంభమయ్యాయి. సంపన్న దేశాలలో కూడ పేదరికం, నిరుద్యోగం పెరిగిపోతోంది. దీంతో అట్టడుగు వర్గాలు, జాతుల సమూహాలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయి.

1975లో మొత్తం ప్రపంచ బహుళజాతి సంస్థల లాభాలు 4 శాతం కాగా 2020 నాటికి 18 శాతానికి పెరిగింది. కార్పొరేట్‌ సంస్థల దురాశ అసమాతనలకు దారి తీస్తోంది. అత్యంత ధనికుల చేతిలో కార్పొరేట్‌ యాజమాన్యాలు బందీ కావడం ఆందోళన రేకెత్తిస్తోందని ఆక్స్‌ఫామ్‌ తెలిపింది. అమెరికా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో అసమానతలు పెరిగాయని ఆర్థిక శక్తి కేంద్రీకరణ విచారకరమని నివేదిక వెల్లడిరచింది. ప్రపంచ ఆస్తుల్లో 43 శాతం ప్రపంచంలో 1 శాతం అత్యంత సంపన్న వర్గం గుప్పిట్లోనే మగ్గుతున్నాయని పేర్కొంది. అదేమాదిరిగా మధ్యప్రాచ్యం, ఆసియా, యూరప్‌ దేశాల్లోనూ ఇదే తరహా అసమానతలున్నాయని నివేదిక తెలిపింది. సంపన్న వర్గమైన ఒక శాతం చేతిలో 47 నుంచి 50 శాతం ఆస్తులున్నాయని వెల్లడిరచింది. ప్రపంచంలోని పది అతి పెద్ద కార్పొరేట్‌ సంస్థల్లో ఏడు సంస్థల సిఇఓలు లేదా ప్రధాన వాటాదారులు బిలియనీర్లే. ఈ కంపెనీల సంపద 10.2 ట్రిలియన్ల (పది లక్షల ఇరవై వేల లక్షల కోట్లు) డాలర్లు. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికాలోని అన్ని దేశాల స్థూల జాతీయోత్పత్తిని వీరి సంపద మించి పోయింది. వరల్డ్‌ బెంచ్‌ మార్కింగ్‌ అలయన్స్‌ సంస్థ నుండి సేకరించిన  సమాచారాన్ని ఆక్స్‌ఫామ్‌ విశ్లేషించింది.

ప్రపంచంలో అతి పెద్ద 1600ల కంపెనీల్లో కేవలం 0.4 శాతం కంపెనీలు మాత్రమే తమ వద్ద పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు చెల్లిస్తున్నాయని ఆక్స్‌ఫామ్‌ విశ్లేషణలో తేలింది. అత్యంత సంపన్నులైన ఒక శాతం మంది వాటాదారులకు ప్రపంచ ఆర్థిక ఆస్తుల్లో 43 శాతం వాటాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో ఇది 47 శాతంగా, ఆసియాలో 50 శాతంగా, యూరప్‌లో 47 శాతంగా వీరి వాటాలు ఉన్నాయి. 2023లో 93 బడా కార్పొరేట్‌ కంపెనీలు ఆర్జీంచిన ప్రతి 100 డాలర్లలోను 82 డాలర్లు వాటాల బై బ్యాక్‌, డివిడెంట్ల రూపంలో వెళ్తున్నాయి. 2023 జూన్‌ నాటికీ ప్రపంచంలోని 146 బడా కార్పొరేట్‌ సంస్థలు 1.8 ట్రిలియన్ల డాలర్ల లాభాలను మూటగట్టుకున్నాయి. వరల్డ్‌ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్‌ అనే సంస్థ 2023లో తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచ జనాభాలో అత్యంత పేదలుగా ఉన్న 50 శాతం మంది ప్రపంచ ఆదాయంలో కేవలం 8.5 శాతం మాత్రమే పొందలిగారు.

ప్రపంచంలో అత్యధిక ప్రజలు సురక్షితము కాని, అనిశ్చిత పరిస్థితుల్లో గంటల తరబడి పనిచేస్తున్నప్పటికీ చాలీ చాలనీ వేతనాలతో బతుకులు నెట్టుకొస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్భణానికి అనుగుణంగా 79.1 కోట్ల మంది కార్మికులు మెరుగైన వేతనాలు పొందలేకపోతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో కార్మిక వర్గం గత రెండు సంవత్సరాల కాలంలో వారి నిజ వేతనాన్ని 1.5 ట్రిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయారు. ఇది ప్రతి కార్మికునికి 25 రోజుల వేతనానికి సమానమని ఆక్స్‌ఫామ్‌ వెల్లడించింది . ధనికుల సంపద, కార్మికుల వేతనాల మధ్య వ్యత్యాసం అనూహ్యంగా పెరిగిపోతుందని ఆక్స్‌ఫామ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన ఐదుగురు… ఎలాన్‌ మస్క్‌, బెర్నాల్డ్‌ ఆర్నాల్ట్‌, జెఫ్‌ బెజోస్‌, లారీ ఎలిసన్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద గత మూడేళ్లలో 464 బిలియన్‌ డాలర్లు పెరిగింది. ‘ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఒఈసిడి)’ సభ్యదేశాల్లో కార్పొరేట్‌ పన్ను 1980లో 48 శాతం ఉండగా ప్రస్తుతం అది 23.1 శాతానికి తగ్గింది.

అధికార బదిలీ తర్వాత కొంతమేరకు హక్కుల చైతన్యం పెరిగినా, పేద-ధనిక అంతరం వందరెట్లు పెరిగింది. నానాటికీ పేద-ధనిక మధ్య అంతరాలు ఆసాధారణంగా విస్తరిస్తున్నాయి. భారత సమాజంలో పీడితవర్గాలు ఇప్పటికీ నాణ్యత ప్రమాణాలతో కూడిన, విద్య, వైద్యాలకు, సాంఘిక సమానతకు దూరమయ్యారు అని ఆక్స్‌ఫామ్‌ స్పష్టం చేసింది. దేశంలో 24.8 కోట్ల మంది పేదరికం నుండి విముక్తి పొందారని నీతి ఆయోగ్‌ నివేదిక పేర్కొంది. బీహార్‌ అట్టడుగున ఉండగా, తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని వెల్లడిరచింది. కానీ పేదరికం నిర్మూలనకు అనుసరించిన మార్గదర్శకాలు ఇప్పటికీ అసమగ్రంగానే ఉన్నాయి. యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగామ్‌ (యుఎన్‌డిపి) దారిద్య్ర గణనలో ప్రజారోగ్యం, పౌష్టికాహారం, శిశుమరణాలు, విద్య, పాఠశాల ఎన్నేళ్ళు చదివారు, హాజరు ఎలా ఉన్నది? వంటగ్యాస్‌, పారిశుద్ధ్యం, మంచినీరు, గృహవసతి, ఆస్తుల వంటి జీవన ప్రమాణాల ఆధారంగా వారు దారిద్య్ర రేఖను దాటారా లేదా అని నిర్ధారిస్తారు. నిరుద్యోగం పెరిగి, వేతనాలు తగ్గి, అసమానతలు పెరిగిపోతున్న కాలంలో పేదరికం తగ్గిందనడం హాస్యాస్పదం. 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని ప్రకటించడం ద్వారా వారికి ఉచిత రేషన్‌, నగదు బదిలీ వంటి సంక్షేమ పథకాలు వర్తింపకుండా చేసే కుట్ర దాగి ఉందని అర్థమవుతుంది.

ప్రపంచం గడచిన నాలుగేళ్ళలో చాలా పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంది. కరోనా మహమ్మారి వల్ల కోట్లాది కుటుంబాలు ఇంటి పెద్దలను, సంపాదనపరులను కోల్పోయి విచ్ఛిన్నమయ్యాయి. కోట్లాది మంది మరణించారు. ప్రాంతీయ స్థాయిలో అటు యూరప్‌లోనూ, ఇటు పశ్చిమాసియాలోనూ రెండు యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గడగడలాడిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం రోజు రోజుకూ విస్తరించి కొత్త భయాలు రేకెత్తిస్తున్నది. ఈ పరిస్థితులలో జీవన వ్యయాలు ఊహించని రీతిలో పెరిగాయి. ఆరోగ్య సంరక్షణ, మనుగడ ప్రతి కుటుంబానికీ సవాలుగా మారింది. సంక్షోభం వచ్చిన ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా పేద-ధనిక మధ్య అంతరాలు మరింత పెరుగుతున్నాయి.

విచిత్రం ఏమిటంటే, అనేక సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు కళ్ళకు కడుతున్న ఆక్స్‌ఫామ్‌ సంస్థ జనవరి 14న తన నివేదిక ద్వారా ‘‘భారతదేశంలో అసమానతలు, అభివృద్ధి బండారం’’ బయటపెట్టిన రెండు రోజులకే ప్రధానమంత్రి పేదరిక నిర్మూలణపై తన ప్రచారం ప్రారంభించారు. మోడీ ప్రచారం ఆక్స్‌ఫామ్‌ నివేదికను తొక్కి పెట్టడం కోసమేనా అనే సందేహం కలగక మానదు. దేశంలో గుత్తాధిపత్యం పెరిగిందని, కేవలం ఐదుగురు పారిశ్రామికవేత్తల చేతుల్లో సంపద కేంద్రీకృతమవుతున్నదని, వారే పరిశ్రమలను శాసిస్తున్నారని ఆక్స్‌ఫామ్‌ వెల్లడిరచింది. ‘‘ప్రైవేటు ఈక్విటీ నిధులతో క్రోనీ క్యాపిటలిస్టులు (కేంద్ర ప్రభుత్వ మిత్రులైన వాణిజ్య ధనాధిపతులు) మాత్రమే సరికొత్త సంపన్నవర్గంగా ఆవిర్భవిస్తున్నారు. 

ఈ దశలో చైనా దేశం పేదరికాన్ని నిర్మూలించామని ప్రకటించినప్పటికీ భారతదేశం అంత ధైర్యంగా చిత్తశుద్ధితో అలాంటి ప్రయత్నం చేయకుండా తప్పుడు ప్రచారానికే పెద్దపీట వేసింది. పైగా మతఛాంధస ప్రభుత్వాన్ని వేళ్ళూనుకునేలా చేసే సంకల్పంతో మోడీ ప్రభుత్వం అంకెలు తారుమారు చేస్తూ, సరికొత్త ఎత్తుగడలతో ప్రజానీకాన్ని మభ్యపెడుతున్నది. సంపద, వనరులు కొందరికే కట్టబెట్టి, మెజారిటీ జనాన్ని ఉన్మాదంలో ముంచెత్తేందుకు ప్రయత్నిస్తున్నది. సామాన్యుల సంపదను ధనికులకు దోచిపెడుతుండగా, స్థూల జాతీయోత్పత్తుల్లో అప్పులే భారీ వాటా ఆక్రమించడం దేశ భవితకు ప్రమాదంగా మారింది. రామ మందిరం పేరుతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రానున్న ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పేరుతో కూడా ఎన్నికల ప్రయోజనాలు వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నది. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా తప్పుదారి పట్టించి భ్రమల్లో పెట్టడం అంటే బాహాటంగా ప్రజలను మోసగించడమే.

ఆర్థిక వ్యవహారాల విశ్లేషకుడు సంజీవ్‌ చందోర్కర్‌ మాట్లాడుతూ ‘ఆర్థిక అసమానతల మూలాలు ఆ దేశపు ప్రభుత్వం అమలు చేసే ఆర్థిక విధానాలపై ఆధారపడి ఉన్నాయి. వాటిపై సామాజిక ఆర్థికవేత్తలు అధ్యయనం జరిపి, సమస్యలను గుర్తించి ప్రపంచానికి తెలియజేయడం ముఖ్యం’ అన్నారు. అదేపని ఆక్స్‌ఫామ్‌ చేస్తోంది. అంతేకాకుండా ప్రజలకు రాజకీయాలపై అవగాహన వచ్చేందుకు ఈ నివేదికలు ఉపకరిస్తాయని తెలిపారు చందోర్కర్‌. ‘‘ఇలాంటి అంశాలపై ప్రజలు దృష్టి సారించినప్పుడు, ముఖ్యంగా భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశాల్లో, అంతరాలను రూపుమాపేలా విధానాల్లో సవరణలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి నివేదికల ఆధారంగా ఎన్నికలు, ర్యాలీలు, నిరసనల ద్వారా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది’’ అన్నారు. ఆయన విశ్లేషణ ప్రకారం..సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఎకనామిక్‌ ఫిలాసఫీగా వ్యవహరిస్తున్న కార్పొరేట్‌ పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు గడిచిన 30-40 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపాయి. ఇవాళ కార్పొరేట్‌ రంగం ఆర్థికపరంగా కన్నా రాజకీయపరంగా శక్తివంతంగా మారింది. ఆ ఫలితంగా కార్పొరేట్‌ శక్తుల ఆర్థిక విధానాలే అమలవడంతో పాటు అవే వ్యవస్థను నియంత్రిస్తున్నాయి.

రానున్న దశాబ్ధాల్లో ప్రధాన పరిణామాలు, అతివృష్టి, అనావృష్టి వంటి అన్నీ అధిక జనాభా ఉన్న ఆసియా ప్రాంతంలోనే సంభవిస్తున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తల అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు రానున్న దశాబ్దంలోనే ట్రిలియనీర్‌ అవతరించబోతున్నాడని ఆక్స్‌ఫామ్‌ అంటోంది. సూపర్‌ రిచ్‌ మీద భారీగా పన్నులు వేయండని కొందరు పాశ్చాత్య కుబేరులు ఎప్పటిలాగానే దావోస్‌లో డిమాండ్‌ చేశారు కానీ, కార్పొరేట్‌ ఆధిపత్యాలను విచ్ఛిన్నం చేయడం, అధిక లాభాలకు, అపరిమిత ఆస్తులకు వీలుకల్పిస్తున్న విధానాలను తిరగదోడటం బూర్జువా పార్లమెంటరీ వ్యవస్థలో, అదీ ద్రవ్యపెట్టుబడి నియంత్రణలో ఉన్న ప్రస్తుత సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దశలో జరిగేపని కాదు. తక్కువ పన్ను రేట్లతో, ఎక్కువ ఎగవేత మార్గాలతో, ఏ మాత్రం పారదర్శకతలేని ప్రభుత్వ విధానాలను సంపన్నులే నిర్ధేశిస్తుంటే, మరోవైపు శ్రమదోపిడీకి వీలైన కార్మికచట్టాలు తయారవుతుంటే పరిస్థితుల్లో మార్పువస్తుందని ఆశించడం భ్రమే. ప్రపంచ సంపదలో అసమానతలు పెరిగిన క్రమంలో పేదరికాన్ని తగ్గించేందుకు, అందరికీ సమాన అవకాశాలు కలిగిన భవిష్యత్‌ కోసం వ్యవస్థాగత మార్పులు చేపట్టాలని నివేదిక స్పష్టం చేసింది. కొద్దిమంది కోసం కాకుండా అందరికి ప్రయోజనాలను చేకూర్చే ఆర్థిక వ్యవస్థలను రూపొందించేందుకు కీలక అడుగులు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని  ఆక్స్‌ఫామ్‌ నివేదిక స్పష్టం చేస్తోంది.

Leave a Reply