ఆర్థిక మందగమన మేఘాలు ప్రపంచాన్ని కమ్మేస్తున్నాయి. ఆ దేశం ఈ దేశం అని లేదు… అగ్రరాజ్యం, చిన్న రాజ్యం అని లేదు. అన్నింటినీ కబళించి వేయడానికి మాంద్యం దూసుకోస్తోంది. ఒకవైపు యుద్ధాలు, యుద్దాలతో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ విబేధాలు మరోవైపు పర్యావరణ మార్పులు, కారణాలేమైతేనేం… ప్రపంచాన్ని క్రమంగా మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. జపాన్‌ ఇటీవలే ఆర్థిక మాంద్యపు ఛాయల్లోకి జారుకుంది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడు నుంచి నాలుగో స్థానానికి దిగజారింది. బ్రిటన్‌ కూడా సాంకేతికంగా మాంద్యంలోకి జారుకుంది. అయితే ఇది ట్రైలర్‌ మాత్రమేనని ఆర్థికవేత్తలంటున్నారు. పదుల సంఖ్యలో దేశాలు ఆర్థిక ఒడిదొడుకులతో విపరీతంగా సతమతమవుతూ మాంద్యం దిశగా సాగుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే కనీసం మరో 18 దేశాలు ఈ జాబితాలోకి చేరడం కలవర పరుస్తోంది… ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం వరుసగా రెండు త్రైమాసికాల్లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో తగ్గుదల నమోదైతే సాంకేతికతంగా దాన్ని మాంద్యం కిందే పరిగణిస్తారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదపుటంచున నిలిచింది. ఆర్థిక మందగమనం సునామీలా విరుచుకుపడుతోంది. ఆర్థిక సంక్షోభానికి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతకంతకూ మాంద్యంలోకి జారుతోందని ఇటీవల హెచ్చరించింది. 2024లో అంతర్జాతీయ ఆర్థిక వృద్ది రేటు 2.9 శాతానికి పరిమితమవుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన కొవిడ్‌ మహమ్మారితో మొత్తంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైందని, కరోనాకు ముందుకాలంతో పోలిస్తే, 2020 నుండి కరోనా, యుక్రెయిన్‌పై రష్యా దాడులతో సహా పలు ఎదురుదెబ్బలతో ప్రపంచ ఆర్థిక ఉత్పత్తి 3.7 లక్షల కోట్ల యూరోల మేరకు కుదించుకుపోయిందని ఐఎంఎఫ్‌ పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కుంటుతోందని ఐఎంఎఫ్‌ ముఖ్య ఆర్థికవేత్త పియర్రె ఆలీవర్‌ హెచ్చరించారు. 9 అక్టోబర్‌ నుంచి 15 అక్టోబర్‌ వరకు మొరాకోలోని మరకేష్‌ నగరంలో జరిగిన ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంక్‌ సమావేశాల సమయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇదిలావుండగా, చైనా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 5 శాతం నుంచి వచ్చే ఏడాదికి ఇది 4.2 శాతమే ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ 2023లో 2.1 శాతం వృద్ధి చెందుతుందని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. 2024లో ఇది 1.5 శాతంగానే ఉంటుందని పేర్కొంది.

ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాల నివేదిక- 2024ను  జనవరి 4న ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2023లో అంచనా వేసిన 2.7 శాతం నుండి 2024లో 2.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేయబడిరది. ఈ వృద్ధిని ‘స్టాల్డ్‌ స్పీడ్‌’గా పేర్కొంది. వృద్ధి రేట్‌ 2.5 శాతం దిగువకు చేరుకున్నప్పుడు ప్రపంచం మాంద్యంలో ఉందని నిర్వచిస్తారు. సంక్షోభ సంవత్సరాలకు వెలుపల, గత నాలుగు దశాబ్దాల అత్యల్ప వృద్ధి రేటులో ఇవి ఉన్నాయి. తక్షణ భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సంకేతాలు లేవు. నిరంతరంగా అధిక వడ్డీ రేట్లు, సంఘర్షణలు మరింత పెరగడం, అంతర్జాతీయ వాణిజ్యం మందగించడం, పెరుగుతున్న వాతావరణ విపత్తులు ప్రపంచ వృద్ధికి గణనీయమైన సవాళ్లను కలిగిస్తాయి. రుణాలతో సతమతమవుతున్న ప్రపంచ ఆర్తిక వ్యవస్థకు సుదీర్ఘమైన, కఠినమైన రుణ పరిస్థితులు, అధిక రుణ ఖర్చుల అవకాశాలు బలమైన ఎదురు గాలిని అందిస్తాయి. అయితే వృద్ధిని పునరుజ్జీవింపజేయడానికి, వాతావరణ మార్పులతో పోరాడటానికి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా పురోగతిని వేగవంతం చేయడానికి మరిన్ని పెట్టుబడులు అవసరం.

2024 ప్రపంచ దేశాలు ఈ ఊబిలోంచి బయట పడేయాలంటే సాహసోపేతమైన పెట్టుబడులను అందచేయడం ద్వారా స్థిరమైన అభివృది బాటలో నడిపించవచ్చు. ఈ చర్యల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది. స్థిరమైన అభివృద్ధి చర్యలలో పెట్టుబడుల కోసం సరసమైన దీర్ఘకాలిక ఫైనాన్సింగ్‌లో సంవత్సరానికి కనీసం 500 బిలియన్‌ డాలర్లు అవసరమవుతుంది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో తగ్గిన వృద్ధి అనేక పెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ముఖ్యంగా అమెరికా అధిక వడ్డీ రేట్లు, వినియోగదారుల వ్యయం మందగించడం, బలహీనమైన కార్మిక మార్కెట్ల కారణంగా 2024లో క్షీణించవచ్చని అంచనా వేయబడిరది. అనేక అభివృద్ది చెందుతున్న దేశాలకు స్వల్పకాలిక వృద్ధి అవకాశాలు ముఖ్యంగా తుర్పు ఆసియా, పశ్చిమాసియా, లాటిన్‌ అమెరికా, కరేబియన్లలో కఠినమైన ఆర్థిక పరిస్థితులు, మందగించిన బాహ్య డిమాండ్‌ కారణంగా కూడా దిగజారుతున్నాయి. తక్కువ ఆదాయ, హాని కలిగించే ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడి, రుణ స్థిరత్వ ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయి.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక అవకాశాలు, ప్రత్యేకించి భారీ రుణ భారాలు, అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న వాతావరణ సంబంధిత దుర్బలత్వాలు అణగదొక్కడానికి కారకాలవుతాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. 2023లో 5.7 శాతం నుండి 2024లో 3.9 శాతానికి తగ్గుతుందని అంచనా వేయబడిరది. అయితే అనేక దేశాల్లో ధరల ఒత్తిళ్లు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. భౌగోళిక రాజకీయాలు మరింతగా పెరుగుతాయి. వివాదాల నష్టాలు ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణాలు కావచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నాలుగింట ఒక వంతులో వార్షిక ద్రవ్యోల్బణం 2024లో 10 శాతానికి మించి ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది. జనవరి 2021 నుండి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో వినియోగదారుల ధరలు క్యూములేటివ్గా 21.1 శాతం పెరిగాయి. కొవిడ్‌-19 పునరుద్ధరణ తర్వాత సాధితంచిన ఆర్థిక లాభాలు గణనీయంగా తగ్గాయి. సరఫరా వైపు అంతరాయాలు, సంఘర్షణలు, విపరీతమైన వాతావరణ సంఘనటల మధ్య, అనేక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో స్థానిక ఆహార ధరల ద్రవ్యోల్బణం అధికంగానే ఉంది. ఇది పేదల కుటుంబాలను అసమానంగా ప్రభావితం చేసింది.

నిరంతర అధిక ద్రవ్యోల్బణం పేదరిక నిర్మూలనలో పురోగతిని మరింత వెనుకకు నెట్టివేసింది. ముఖ్యంగా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో తీవ్ర ప్రభావం చూపుతుంది, ప్రపంచ సహకారం, బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడం, అభివృద్ధి ఫైనాన్స్‌ను సంస్కరించడం, రుణ సవాళ్లను పరిష్కరించడం, స్థిరమైన, సమ్మిళిత వృద్ధిమార్గం వేగవంతం చేయడంలో సహాయపడడానికి వాతావరణ ఫైనాన్సింగ్‌ను పెంచడం చాలా అవసరం. నివేదిక ప్రకారం ప్రపంచ కార్మిక మార్కెట్లు మహమ్మారి సంక్షోభం నుండి అసమాన పునరుద్ధరణను చూశాయి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో వృద్ధి  మందగించినప్పటికీ కార్మిక మార్కెట్లు స్ధిరంగా ఉన్నాయి. అయినప్పటికీ అనేక అభివృద్ది చెందుతున్న దేశాలలో ముఖ్యంగా పశ్చిమ ఆసియా, ఆప్రికాలో నిరుద్యోగిత రేటుతో సహా కీలక ఉపాధి సూచికలు ఇంకా మహమ్మారి పూర్వస్థాయికి తిరిగి రాలేదు. ప్రపంచ లింగ ఉపాధి అంతరం ఎక్కువగా ఉంది. లింగ వేతన అంతరాలు కొనసాగడమే కాకుండా కొన్ని వృత్తులలో కూడా విస్తరించాయి.

ఆర్థిక మందగమన పరిస్థితులు వస్తే ఏం జరుగుతుందో ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం తల్లకిందులవుతుంది. కోట్ల ఉద్యోగాలు ఊడిపోతాయి. నిరుద్యోగ రేటు వేగంగా పెరుగుతుంది. దీంతో ప్రజల ఆదాయం తగ్గిపోతుంది. ఆదాయం పడిపోవడం అంటే కొనుగోలు శక్తి తగ్గిపోవడమే. అంటే ఏం కొనలేం… తినలేం… గిరాకీ తగ్గిపోతుంది. దీని ప్రభావం ఉత్పత్తిపై పడుతుంది. దీంట్లో కోతలు పడటం అంటే మరిన్ని ఉద్యోగాలు పోవడమే… ఇదంతా ఓ విషవలయం లాంటిది… ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇప్పటికే ప్రజల కొనుగోలు శక్తి తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. అగ్ర దేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక విదేశీ మదుపరులు తరలిపోతారు. స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతాయి. మౌలిక, సేవా రంగాల్లో పెట్టుబడులు ఆగిపోతాయి. చిన్న చిన్న సంస్థలు మార్కెట్‌లో నిలబడలేకపోతాయి. కొత్త పెట్టుబడులు రావడం కష్టమవుతుంది. ముడిచమురు ధరలు పెరుగుతాయి. నిజానికి గిరాకీ తగ్గితే ముడిచమురు ధరలు పడిపోవాలి. అయిదే దీన్ని ఎదుర్కోవడానికి ఒపెక్‌, ఒపెక్‌ ప్లస్‌ దేశాలు ఉత్పత్తిలో కోతపెడతాయి. దేశాలకు దేశాలు దివాళా తీసే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. అంటే మరిన్ని శ్రీలంకలను మనం చూడాల్సి రావచ్చు. దాదాపు 70 దేశాలు ఆర్థికంగా గడ్డు పరిస్తితి ఎదుర్కొంటున్నట్లు ఎప్పట్నుంచో చెబుతున్నారు. మందగమనంతో ఇవన్నీ మరింత కుదేలవుతాయి. అప్పులిచ్చిన దేశాలది ఓ కష్టం… తీసుకున్న దేశాలది మరో కష్టం… సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి వస్తుంది. 2008 నాటి మాంద్యం ప్రభావాన్ని ప్రపంచ దేశాలు మర్చిపోలేదు. ఆ పీడ కల మరోసారి నిజం కాబోతోంది.

రష్యా యుక్రెయిన్‌ యుద్ధం, నాలుగు నెలలుగా ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది ప్రమాదకరమని వరల్డ్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ బంగా ఆందోళన వ్యక్తం చేశారు. సౌదీ అరేబియాలో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచంచాలా ప్రమాదకరమైన దశలో ఉందని అన్నారు. ఇటీవల ఇజ్రాయెల్‌, గాజా పరిణామాలు భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేశాయని అన్నారు. ఈ పరిస్థితులు ఆర్థిక వృద్దిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని భావిస్తున్నానని ఆయన అన్నారు. ఇలాంటివి ఆర్థిక ప్రమాదాలను వేగంగా పెంచుతాయని, వాటిని విస్మరించరాదని అన్నారు. మాంద్యం అసమానతలను పెంచుతుంది. ఇది వృద్ధిని, వృద్ధి అందించే సంపద పంపిణీ కూడ దెబ్బ తీస్తాయి. తగిన బహుపాక్షిక విధానాలు, సమన్వయ యంత్రాంగం లేకుండా నేటి పెళుసు ఆర్థిక వ్యవస్థలు, విభిన్న అఘాతాలు రేపటి వ్యవస్థగత సంక్షోభాలుగా పరిణామం చెందుతాయని ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు బంగా హెచ్చరించాడు. ఇవాళ ప్రపంచ యవనికపై యుద్ధాల ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి వాతావరణం నెలకొందన్నారు.

ప్రపంచ కార్పొరేట్‌ రంగం గత దశాబ్దంలో కనీవినీ ఎరుగని స్థాయిలో రెండంకెల వేగంతో దివాళాలను చవిచూస్తోందని జాతీయ గణాంకాలను ఉదాహరిస్తూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ తెలిపింది. గత 12 నెలల కాలంలో ఈ దివాళాలు అంతకు ముందటి సంవత్సరంతో పోల్చినప్పుడు 30 శాతం పెరగగా, ఐరోపాలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో జనవరి-డిసెంబర్‌ మధ్యకాలంలో అంతకు ముందు సంవత్సర అదే కాలంతో పోల్చినప్పుడు కార్పొరేట్‌ దివాళాలు 25 శాతం పెరిగాయి.ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఇసిడి) గ్రూపులోని సంపన్న దేశాలలో నోర్డిక్‌ దేశాలైన డెన్మార్క్‌, స్వీడెన్‌, ఫిన్లాండ్‌లతో సహా కార్పొరేట్‌ కంపెనీలు 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటికంటే ఎక్కువగా దివాళా తీశాయి. ఇంగ్లాండ్‌, వేల్‌స్‌లలో కూడా వర్తమాన సంవత్సరంలోని జనవరి తరువాత కార్పొరేట్‌ దివాళాలు 2009 స్థాయిని దాటిపోయాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందు కోసం కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పదేపదే పెంచటం వల్ల కార్పొరేట్‌ దివాళాలు వేగవంతం అయ్యాయి.

గతేడాదిలోని లక్షలాది టెకీల ఉద్వాసనలు మర్చిపోకముందే.. కొత్త ఏడాదిలోనూ టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపునకు వరుస కడుతున్నాయి. ఇప్పటికే గూగుల్‌, మెటా, అమెజాన్‌ సహా పలు టెక్‌ కంపెనీలు సిబ్బందిని ఇంటికి పంపించడానికి ప్రకటనలు చేయగా… తాజాగా మైక్రోసాఫ్ట్‌ వేలాది మందిపై వేటు వేయడానికి సిద్ధం అయ్యింది. అదేవిధంగా సేల్స్‌ఫోర్స్‌ కూడా వందలాది మందిని రోడ్డున పడేసే పనిలో పడిరది. ఆర్థిక మందగమనం, వ్యయ నియంత్రణ చర్యలు, పునర్‌ వ్యవస్థీకరణ ప్రణాళిక పేరుతో టెక్‌ కంపెనీలు సిబ్బందిని తొలగిస్తున్నాయి. ఆర్థిక మందగమనం, ఇతర ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడుతున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీ కొత్త నియామకాల్లో ఏకంగా 78 శాతం తగ్గుదల ఉంటుందని నాస్కామ్‌ అంచనా వేసింది. 2023లో ఐటీ పరిశ్రమ 2.7 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తే… 2024లో కేవలం 60 వేల కొత్త ఉద్యోగాలే ఉంటాయని తన అధ్యయనంలో పేర్కొన్నది. అరబ్‌ ప్రాంతంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) పేర్కొంది. 2024లో ఈ నిరుద్యోగం రేటు 9.8 శాతంగా ఉండగలదని భావిస్తున్నట్లు తెలిపింది. అమెరికాలో జనవరి నెలలో ఉద్యోగుల తొలగింపులు రెండిరతల కన్నా అధికమయ్యాయి. ఉద్యోగాల్లో కోతలు కేవలం జనవరిలోనే పదినెలల గరిష్టానికి చేరాయి. 2024 జనవరి నెలలో 82,307 మంది ఉద్యోగులను తొలగించారు.

సామ్రాజ్యవాద అమెరికా, నాటో దేశాలు యుక్రెయిన్‌లో, పాలస్తీనాలో యుద్ధం తీవ్రం చేస్తున్నందున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెలుతోంది. అమెరికా సామ్రాజ్యవాదం తన ప్రపంచ భౌగోళిక రాజకీయ ఆధిపత్య స్థానాన్ని నిలబెట్టుకోవడానికి యుద్ధాలతో ముందుకు సాగుతున్నందున పలు దేశాలు ఎక్కువగా యుద్ధంచే పీడిరపబడుతున్నాయి. ఆ దేశాల్లో మాంద్యం సూచనలు స్పష్టంగా కనిపిస్తోన్నాయి. ఈ పరిణామం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను తీవ్రతరం చేస్తోంది. ఇది మిలిటరిజానికి దారి తీస్తుంది. ఎందుకంటే యుద్ధ ప్రభావిత దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుతాయి. అదే సమయంలో వ్యయాన్ని పూడ్చుకోవడానికి కార్మిక వర్గంపై దాడులను తీవ్రతరం చేస్తాయి. 2023లో ఇయు లోని-11 దేశాలు మాంద్యం బారిన పడ్డాయి. ఆ దేశాలలో సంవత్సర కాలంగా కార్మికులు, రైతులు ఆయా ప్రభుత్వాల యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా దీర్ఘకాలంగా తీవ్ర నిరసన ఉద్యమాలు చేస్తోన్నాయి. ద్రవ్యోల్బణం, ఉత్పత్తి స్తంభన ప్రజలను మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి. యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి, ఉద్యోగాలు, వేతనాలు, జీవన ప్రమాణాల రక్షణ మధ్య విడదీయరాని సంబంధం ఉంది. ఈ దుస్థితి సామ్రాజ్యవాదుల ఓటమి, కార్మికవర్గ సోషలిస్టు విప్లవ విజయం మాత్రమే పరిష్కారమవుతుంది. అంటే తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఏకైక ఆచరణీయ, వాస్తవిక దృక్పథం దాని మూలాన్ని నిర్థేశించడమే. పెట్టుబడిదారీ విధానాన్ని కూలదోయడానికి సోషలిస్టు విప్లవ కార్యక్రమాన్ని ఆచరణీయం చేయడమే శ్రామిక ప్రజల ముందున్న ఏకైక కర్తవ్యం.

Leave a Reply