గత 20 ఏళ్లలో 3,50,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మూడు రైతు వ్యతిరేక దుర్మార్గ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేసిన ధర్నాలో  700 మంది రైతులు అమరులయ్యారు. నవంబర్‌లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే, మూడు చట్టాలను రద్దు చేసి, కనీస మద్దతు ధరపై పటిష్టమైన చట్టం చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించాడు. పేద రైతుల కోసం, దేశాభివృద్ధి కోసం ఈ చట్టాలను రూపొందించామని, కానీ వాటి ప్రయోజనాలను రైతులకు వివరించడంలో విఫలమయ్యామని అన్నాడు.

ఈసారి రైతులు, ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు తదితరులతో కమిటీని ఏర్పాటు చేస్తామని, ఈ మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావడానికి ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రారంభిస్తామని నొక్కిచెప్పాడు. కానీ రైతులు మరోసారి మోసపోయారు. బిజెపి ప్రభుత్వం కనీస మద్దతు ధర వాగ్దానాన్ని నెరవేర్చలేదు. రైతులు రోడ్లపై టియర్ గ్యాస్ షెల్స్, పెలెట్లు, రబ్బరు బులెట్లపాలవుతున్నారు. రైతులపై డ్రోన్ల ద్వారా కాల్పులు జరపడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం విస్తృతంగా ఉపయోగిస్తోంది. ఇక మన వ్యవసాయం సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందినట్లే మరి.

మూడు వ్యవసాయ చట్టాలలో ఎటువంటి లోపం లేదని, కేవలం రైతుల అవగాహనలో మాత్రమే లోపం ఉందనే ప్రధానమంత్రి చేసిన ప్రకటన ఎవరికైనా అర్థమైపోతుంది. రైతులు ఈ చట్టాల ప్రయోజనాన్ని గ్రహించలేకపోయారు, తమ దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నారు. కాబట్టి వారు ఇప్పుడు రైతులను అర్థం చేయించే  కేంపెయిన్ ప్రారంభిస్తారు, ఆపై ఈ చట్టాలను తిరిగి తీసుకువస్తారు. కనీస మద్దతు ధరపై వాగ్దానాల నిజం కూడా వెలుగులోకి వస్తుంది. ఈ మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించి ప్రధానమంత్రి మనసులో ఎంత బలమైన కోరిక ఉందో ఇప్పుడు అందరికీ తెలుసు. ప్రధానమంత్రి మనసులో ఇంతటి బలమైన కోరిక ఎందుకు ఉందనే సందేహం ఎవరికైనా రావచ్చు. ఈ బలమైన కోరిక వెనుక వున్నది ఏమిటి?

ఈ బలమైన కోరిక వెనుక ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) లో జరిగిన వ్యవసాయ ఒప్పందం ఉంది. దీని కింద ప్రభుత్వం పంట ఖర్చు, నిర్వహణ, దిగుబడి, కొనుగోలు-అమ్మకం అన్నీ ప్రైవేట్ పెట్టుబడిదారులకు అప్పగించే ఒప్పందం ఉంది. అందుకోసం ఇక్కడ కనీస మద్దతు ధరను, రైతులకు లభించే రాయితీలను తగ్గించాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని, బిజెపి ప్రభుత్వం 2024-25 మధ్యంతర బడ్జెట్‌లో వ్యవసాయానికి నిధులను తగ్గించింది, సబ్సిడీని కూడా తగ్గించింది. ఒక ఉదాహరణ తీసుకుని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం.

పి. వి. నరసింహ రావు, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1990లో నూతన ఆర్థిక విధానాలపై సంతకం చేసింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను తిరిగి దోచుకోవడానికి, బానిసలుగా మార్చడానికి అమెరికా నేతృత్వంలోని జి – 7 దేశాలు (జపాన్, కెనడా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్) ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ వాణిజ్య సంస్థల ద్వారా ఈ విధానాల అమలుచేయించడం మొదలుపెట్టాయి.

ఈ విధానాలకు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ అని పేరు పెట్టారు.  దీని కింద పరిశ్రమలు, ఆర్థిక రంగం, సేవల రంగం, విద్య, ఆరోగ్యం, అన్నింటినీ బహిరంగంగా దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు అమ్ముతారు. ఈ విధానాల ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రభుత్వాలు తమ దేశంలో అన్ని రకాల సామాజిక సహాయాన్ని రద్దు చేస్తాయి. ఈ విధానాల ప్రకారం 1995లో భారత ప్రభుత్వం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తో సంతకం చేసిన ఒప్పందం ప్రకారం మన దేశ వ్యవసాయ రంగాన్ని విదేశీయులకు తెరిచింది. ఇప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ప్రకారం అన్ని సభ్య దేశాలు తమ వ్యవసాయ ఉత్పత్తులను పరస్పరం మార్కెట్లలోకి ఎలాంటి అడ్డంకులు లేకుండా రవాణా చేయగలుగుతాయి. వారి సౌలభ్యం కోసం, దిగుమతి పన్నును చాలామటుకు తగ్గించింది.

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వ్యవసాయమూ, వ్యవసాయానికి సంబంధించిన మొత్తం యంత్రాంగాన్ని ఎలా స్వాధీనం చేసుకోవాలి అనేదే ప్రపంచ వాణిజ్య సంస్థను రూపొందించిన జీ – 7 దేశాలకు వున్న ఏకైక  లక్ష్యం. మార్కెట్‌లో భారతదేశ రైతులను ఎలా నిస్సహాయులను చేయాలనేది ఇందుకు మొదటి పని. వారి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలలో ప్రభుత్వ జోక్యాన్ని ఎలా తొలగించాలి? ఈ రైతుల తలల మీద నుంచి ప్రభుత్వ నీడ తొలగిపోతే, ఈ విదేశీ మొసళ్లకు రైతాంగాన్ని తమ బలిపశువులుగా చేసుకోవడం సులువవుతుంది.

1980లలో అభివృద్ధి చెందుతున్న దేశాలన్ని అప్పులలో కూరుకుపోయాయని ఈ సామ్రాజ్యవాద జి – 7 దేశాలకు బాగా తెలుసు. 1980 – 81లో భారతదేశ రుణం 18,400 కోట్ల రూపాయలు ఉండగా, 1990 నాటికి అది 2,00,000 కోట్ల రూపాయలకు చేరింది. భారతదేశం, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యవసాయ రంగంలో తమ దేశానికి పెద్దగా ఆర్థిక సహాయం చేయలేవు. అందువల్ల, ఈ సామ్రాజ్యవాద కౌటిల్యులు  ఉద్దేశపూర్వకంగా 1986 – 88 కాలపరిమితిని ఆధారంగా తీసుకొని, ఆ కాలంలో రైతాంగానికి చేసిన సహాయం మాదిరిగానే, ఇప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరిన తరువాత, తమ రైతులకు సబ్సిడీ లేదా ఆర్థిక సహాయం అందించవచ్చు.

ఈ సమయంలో అమెరికా తన దేశంలో చాలా మద్దతునిచ్చింది. 2020లో అమెరికా వ్యవసాయ ఆదాయంలో 40 శాతం ప్రత్యక్షంగా ప్రభుత్వం యిచ్చిన సబ్సిడీలు వున్నాయి. 2019లో 22.4 బిలియన్ల నుంచి 46.5 బిలియన్లు (కోట్లాది రూపాయలు) పెరిగింది. కానీ భారతదేశం ఉత్పత్తి చేసే వస్తువుల ధరలో 10 శాతం మాత్రమే సబ్సిడీగా ఇవ్వగలదు. 10 శాతానికి మించి సబ్సిడీ ఇవ్వడం అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది.

పైన పేర్కొన్న డబ్ల్యుటిఒ నిబంధన వల్ల భారత ప్రభుత్వానికి చేతులు కట్టేసి ఉన్నాయి. ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెంచాలనుకుంటే, ప్రపంచ వాణిజ్య సంస్థలోని ఇతర సభ్య దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువగా వున్నాయి. భారత ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెంచడాన్ని అవి వ్యతిరేకిస్తాయి, ప్రపంచ వాణిజ్య సంస్థ వేదికపై భారతదేశానికి వ్యతిరేకంగా తీర్పును ఆమోదిస్తాయి. గోధుమ, బియ్యం, చెరకు, ప్రత్తి, పప్పుధాన్యాలకు భారతదేశం మద్దతు ధర ఇస్తుంది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థలో ప్రశ్నలు లేవనెత్తారు. ధరల హెచ్చుతగ్గుల నుండి రైతులను రక్షించడానికి ప్రభుత్వం ఈ సహాయం చేస్తుంది. ఉదాహరణకు, కేంద్ర ప్రభుత్వం చెరకుకు మద్దతు ధరను నిర్ణయిస్తుంది, ఆపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత ధరను నిర్ణయిస్తాయి. దీని ఆధారంగానే చెరకు కర్మాగారాలు రైతుల చెరకుకు చెల్లింపులు చేస్తాయి.

ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్య దేశాలు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా ప్రస్తుత చెరకు ధరలపై  వివాదం లేవనెత్తాయి. తమ రైతులకు ఉత్పత్తి వ్యయంలో 10 శాతం సబ్సిడీ ఇవ్వాలనే నిబంధనను భారతదేశం ఉల్లంఘిస్తోందని అన్నాయి. భారతదేశం 2016-17లో చెరకు రంగంలో ఉత్పత్తి వ్యయంలో 94.4 శాతం చెల్లించిందని ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను నేరుగా ఉల్లంఘించడమేనని ఆస్ట్రేలియా అన్నది. 1995-96 నుండి 2017-18 వరకు ఒక నిర్దిష్ట ఉత్పత్తికి తాము అందించే మద్దతును డబ్ల్యుటిఒ నిబంధనల ప్రకారం 10 శాతం కంటే తక్కువగా ఉంచామని భారతదేశం తన పత్రాలను డబ్ల్యుటిఒలో ప్రవేశపెడుతూ తెలియచేసింది.

 ఈ సామ్రాజ్యవాద దోపిడీ దేశాలు తాము నిర్ణయించిన పరిమితులతో కూడా సంతృప్తి చెందలేదని ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. వీలైనంత త్వరగా భారతీయ మార్కెట్‌ను స్వాధీనం చేసుకుని రైతులను నాశనం చేయాలని వారు కోరుకుంటారు. ఇక్కడ మనం ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ ముందు ప్రస్తుత చెరకు ధరను కాపాడే సమర్థత లేని భారత ప్రభుత్వం మద్దతు ధరను పెంచగలదా? లేదు. ప్రపంచ వాణిజ్య సంస్థతో (డబ్ల్యుటిఒ) ఒప్పందం సంతకం చేసి, పిడికెడు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం భారతదేశం తన చేతులను కట్టేసుకుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల కుట్రలో చిక్కుకుంది. ఈ దేశీయ, విదేశీ సాలెపురుగులు భారతీయ ప్రజల రక్తాన్ని పూర్తిగా పీల్చుకునే వరకు విశ్రాంతి తీసుకోవు.

డబ్ల్యుటిఒ సభ్యత్వం నుంచి బయటకు రావడం భారత ప్రభుత్వం ముందున్న మరో మార్గం. కానీ అలా చేయడం అసాధ్యం ఎందుకంటే 1990లో 2,00,000 కోట్ల రూపాయల విదేశీ రుణం వుండడం వల్ల , నూతన ఆర్థిక విధానపు బానిసత్వ పత్రంపై సంతకం చేయాల్సి వచ్చింది. దేశంలోని ధనవంతులు దిగుమతి చేసుకున్న వస్తువుల వల్ల, భారతీయ వ్యవసాయం, పరిశ్రమలకు సరిగ్గా పంపిణీ, నిర్వహణలు చేయకపోవడం వల్ల ఈ రుణ భారాన్ని మన తలపై పెట్టింది. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ వాణిజ్య సంస్థల ద్వారా భారతదేశంపై విధించే ఆర్థిక విధానాలు ఇవే.        

2021 లో 42,421,765,500,000.01 రూపాయల విదేశీ రుణం ఉంది. అంటే 130 కోట్ల జనాభా ఉన్న దేశంలోని ప్రతి పౌరుడి తలమీద 3,26,321.27 రూపాయల విదేశీ రుణం ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థతో భారత ప్రభుత్వం తన సంబంధాన్ని తెంచుకుంటుంది అని మనం ఆశించగలమా? లేదు. రైతుల పంటలకు సరైన ధర కూడా ఇవ్వలేక పోయిన ఈ ప్రభుత్వం కోట్లాది డబ్బును ఎక్కడ ఖర్చు చేసింది అనే ప్రశ్న తలెత్తడం సహజం.?  ఈ మొత్తాన్ని అదానీ, అంబానీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, టాటా, బిర్లాలు చెల్లిస్తారా లేక దేశ ప్రజలు చెల్లించాలా?

కానీ ఈ ధనవంతులందరూ ఈ డబ్బుతో విదేశాలకు పారిపోతున్నారు, అంబానీ ప్రపంచంలోని కోటీశ్వరులలో చేరాడు, ఇంగ్లండులో ఇల్లు కట్టుకొని దీపావళి పండగ జరుపుకుంటాడు. ఈ రుణభారాన్ని ప్రజలు తమ ఎముకలను పిండి చేసి  తీరుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. మన ఆఖరి రక్తపు చుక్కను పీల్చుకునే వరకు వారి ఆత్మలకు శాంతి ఉండదు. వారు నరభక్షకులు. మన పాలకులు, పెట్టుబడిదారులు విదేశీ సామ్రాజ్యవాదులతో పొత్తు పెట్టుకున్నారు.

ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీలను వేలం వేస్తోంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను అమెజాన్ కంపెనీకి అప్పగించింది.  బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును తీసుకురావడంతో, అందుకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు జంతర్-మంతర్‌లో నిరసనకు కూర్చున్నారు. విద్యను ప్రైవేటుపరం చేయడానికి 2015 లో ప్రపంచ వాణిజ్య సంస్థలో సంతకం చేసేసింది. ఆరోగ్య సంరక్షణను ప్రైవేటుపరం చేయడం అందరికీ తెలిసిన విషయమే.  నీళ్ళను  కిన్లే, కోకాకోలా వంటి దిగ్గజ కంపెనీలు స్వాధీనం చేసుకొన్నాయి. వ్యవసాయ బ్యాంకులను ఏర్పాటు చేసి రైతుల భూమిని స్వాధీనం చేసుకొంటున్నది. ఒడిశాలో కొరియా కంపెనీ పోస్కోకు ఇచ్చిన 2900 ఎకరాల భూమిని ఆదివాసీలు సుదీర్ఘ పోరాటంతో తిరిగి పొందారు. కానీ ఇప్పుడు అదే భూమిని జిందల్‌కు బహుమతిగా ఇచ్చింది. ఆదివాసీలు మరోసారి పోరాటం ప్రారంభించారు.

దీనిలో భాగంగానే మూడు చట్టాలు తీసుకువచ్చి దేశంలోని పేద రైతుల భూములను స్వాధీనం చేసుకొని, వారి సబ్సిడీలను రద్దు చేసి, బహిరంగ మార్కెట్లో సామ్రాజ్యవాద గద్దల దయా దాక్షిణ్యాలపై వదిలేసి నాశనం చేయాలనుకుంటున్నారు. రుణ భారం, నిరుద్యోగం, మద్య వ్యసనాలు మనల్ని నాశనం చేసేసాయి. ఇక ఇంతకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మన నుండి ఏమి కోరుకుంటోంది?  ఇంతకంటే మనల్ని ఉరి కంబానికి వేలాడదీస్తే  సరిపోతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతిరోజూ 2,000 మంది రైతులు వ్యవసాయాన్ని విడిచిపెడుతున్నారు. అదేవిధంగా, వ్యవసాయ సమాజంలోని యువతకు వ్యవసాయం పట్ల ఆసక్తి వుంటే బాగుండు. వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుండి పట్టభద్రులైన విద్యార్థులు కూడా ఇతర వృత్తులలోకి వెళ్లిపోతున్నారు. దీనిని ‘భారతదేశ వ్యవసాయ రంగంలో ఉన్న గొప్ప మేధస్సుల వలస’ అని పిలుస్తారు.

 మూడు వ్యవసాయ చట్టాలు తీసుకురావడానికి ముందు వ్యవసాయం, రైతులపై సంక్షోభం లేదా? వీటిని వెనక్కి తీసుకోవడం వల్ల  సంక్షోభం అంతమైపోయిందా? భారత సమాజం, ఆర్థిక వ్యవస్థపై ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణల సామ్రాజ్యవాద దాడి నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడగలమా? ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ వాణిజ్య సంస్థలు నిర్వహించే వ్యవసాయరంగాన్ని కాపాడుకోగలమా? దీనికి మా సమాధానం జవాబు ఏమిటంటే, ఎట్టి పరిస్థితులలోనూ కాపాడుకోలేము. ఈ మొసళ్ళు ప్రతిదీ మింగేస్తాయి. ఇది మొత్తం సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం, ఇది ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించినది కాదు, ఇది నేరుగా తమ దేశ పాలకులతో పాటు అమెరికా నేతృత్వంలోని ప్రపంచ ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం.

పేద రైతులు ఈ పోరాటంలో ఒంటరిగా గెలవలేరనేది స్పష్టం. ఎందుకంటే ప్రస్తుత రైతు ఉద్యమంలో పార్లమెంట్, క్యాబినెట్, న్యాయస్థానాలు, మీడియా, పోలీసు బలగాలు, గూండాలు అన్నీ రైతులపై దారుణమైన దాడులు చేస్తూ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. జాతీయ పార్టీలు కానీ లేదా ప్రాంతీయ పార్టీలు కానీ పార్లమెంటరీ రాజకీయ పార్టీలన్నీ, తమ ఎన్నికల పప్పులను వుడకబెట్టుకుంటాయి. వ్యవసాయానికి వ్యతిరేకంగా ప్రపంచ వాణిజ్య సంస్థ విధానాలకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, ఏకాభిప్రాయంతో వున్నాయి.

మరో విషయం, ప్రస్తుత ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థ రైతులను మరణాలకి గురిచేస్తోంది, పేద రైతులను వ్యవసాయాన్ని విడిచిపెట్టమని బలవంతం చేస్తోంది. ఈ వ్యవస్థ కొనసాగితే రైతు ఎలా సంతోషంగా ఉంటాడు? పేద రైతులందరూ ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థ గురించి ఆలోచించనంతవరకు, కులం, మతం, ప్రాంతం అనే భావనలకు మించి ఈ దేశీయ – విదేశీ ద్రోహులతో పోరాడకపోతే, ఈ దోపిడీదారులకే ప్రయోజనం చేకూరుతుంది.

కులం, మతం, ప్రాంతం అనే విభజనలను అధిగమించి, సంఘటితమైతేనే మనం ఈ దోపిడీదారులతో పోరాడి స్వేచ్ఛను పొందగలం, లేకపోతే దేశ సరిహద్దుల్లో కూడా పేద రైతు బిడ్డలు మాత్రమే చనిపోతారు. నిరుద్యోగం, మాదకద్రవ్యాల వల్ల చనిపోయేది కూడా పేద రైతు బిడ్డలే అవుతారు. పొలంలో విషం తిని చనిపోయేది పేద రైతులు; మతపరమైన అల్లర్లలో చనిపోయేది పేద రైతులు;  కులాల పేరిట మనమే ఒకరినొకరిని చంపుకుంటాం. చివరికి మనకు మిగిలేది ఏమిటి? నిరక్షరాస్యత, ఆకలి, అనారోగ్యం, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, నిరుపయోగ జీవితం. మన ఇండ్లు, పొలాల నుంచి బహిష్కరణ;  నగరాల్లోని మురికివాడల్లో జంతువుల్లా జీవించడం .

హరేంద్ర రానా  సామాజిక కార్యకర్త.

Leave a Reply