ఖమ్మం జిల్లా రచయిత్రి రూప రుక్మిణి కలం నుండి జాలు వారిన అక్షరాలు సమకాలీన జీవితాన్ని సుతిమెత్తగా స్పృశిస్తాయి. సమాజాన్ని హెచ్చరిస్తూ, ఇవ్వాల్టి జీవన పరిస్థితుల లోతులను భావుకతతో అన్వేషిస్తూ, వ్యక్తీకరిస్తూ సాగిన కవితల సమాహారమే ‘‘మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని’’ సంపుటి.

శూన్యం కవితలో..

‘‘పచ్చి గుండెను తవ్వి చూడకు

భరోసాగా భుజమెప్పుడు పానుపు కాలేదని

తప్పొప్పుల లెక్కల్లో ఆమెకెప్పుడూ విశేషాలేమీలేని సశేషాలే మిగిలాయి’’

అంటూ మహిళ బతుకును ఆవిష్కరించారు. ‘ఒంటరి’  కవితలో ‘‘క్షణాలన్నీ పొరలు పొరలుగా తెగి పడుతూ పగిలిన అద్దం పైన మరకల్లా’’ అంటూ  వేదనను పలికించటానికి అద్దాన్ని వస్తువుగా తీసుకుని వర్తమానాన్ని కళ్ళ ముందుంచారు. ‘ఖననం’ కవితలో ఆవేశాన్ని వెలి బుచ్చడానికి..

‘‘ఏ చరిత్ర పుటలు తిరగెయ్యాలో

ఖననం చేయబడిన జన్మ రహస్యాన్ని తిరగ రాయడానికి’’ అంటూ  కవయిత్రి తన పరిపక్వతను ప్రదర్శించారు.

‘సవ్వడి’ కవితలో ‘‘నా మనసుని అల్లుకుని నా చుట్టూ మాటల కోట కడుతుంటావు అప్పుడనిపిస్తుంది నేనో వైశాఖ వెన్నెలనై కురుస్తున్నానని’’ అమ్మాయిలోని సున్నితత్వాన్ని చెప్పకనే చెబుతూనే ‘‘మన రహదారుల్లో నువ్వు ఎప్పుడూ నే మిగుల్చుకున్న వాక్యాన్ని’’ అని జీవిత మాధుర్యాన్ని చెబుతారు. ఆ పదాలనే  పుస్తకం పేరుగా నిర్ణయించుకున్నారు.

‘పరిచ్చాయ’ కవితలో

‘‘దిశ నిర్దేశాలు కాల గమనాల్లో కరిగిపోతాయి తడిమిన దేహపు ఛాయల్లో నిర్జీవమైన మనసుకి తడారిన పరిచ్చాయలే జీవనం’’ అంటూ తన నిర్లిప్తతను సందేహం లేకుండా చెప్పారు. ‘టైమ్‌ టేబుల్‌’ అనే కవితలో ‘‘ఊహకి అందక ముందే మెడకు తగిలించిన ఉచ్చు’’ అని తెలిసీ తెలియని వయస్సులో పడుతున్న మూడు ముళ్ళ బంధాన్ని నిశితంగా విమర్శిస్తూ సాగిన కవిత ‘‘తనకి తాను చేసుకున్న సంతకంలో కొన ఊపిరితో..’’ అని ముగించి పరిష్కారాన్ని పాఠకులకి వదిలేసారు.

‘మిఠాయి పొట్లం’ కవితలో ‘‘గునుగు పూల గడ్డికి ఒరిసిన చర్మం ఎన్ని రంగుల్ని చిమ్మిందో’’ అంటూ… కష్టాన్ని కడగండ్లను ప్రశ్నిస్తూ… కట్టెల కట్టలు కట్టి .. ‘‘ఇంతటి కష్టం ఒక్కపూట ఆకలి కడుపులోకి మిఠాయి పొట్లమవ్వడానికే’’ అనే సత్యాన్ని తేటతెల్లం చేస్తూ ‘‘ఎద చప్పుడంతా మోదుగు వనమయ్యింది’’ అని గుండెల్లోకి తొంగి చూసి ఎగసి పడే జ్వాలలను మోదుగు పూల యాదిలో కలాన్ని రaుళిపించారు.

‘శబ్దం’ కవితలో ‘‘చీకటికి శబ్దించడమూ తెలుసు నినదించడమూ తెలుసు’’ అని చీకటి సైతం వెలుతురు ప్రతిఫలిస్తుందని నర్మగర్భంగా వాక్య నిర్మాణం గావించారు. వొడవని యుద్ధం కవితలో ‘‘యుద్ధ కాంక్షలు కార్చిచ్చులుగా వెలుగుతుంటే గాజు కళ్ళకి మసి పట్టి లోకం గుడ్డిదై పోయింది’’అని అనాదిగా ఓటమి సామాన్యులదే అని అణగారిన వర్గాల పక్షం నిలిచారు.

‘మా దేవుళ్ళు’ కవితలో  అడవి బిడ్డలు పోరు బిడ్డలై   బతుకు మార్చినోళ్ళు యే మా దేవుళ్ళని ఖరాఖండిగా చెప్పి మను వ్యవస్థ లోగుట్టును బైట పెట్టారు. చరిత్రకే మా మొక్కులు అని పుక్కిటి గాథలను త్యజించారు. ఉత్తరం కవితలో తన స్వగతం చెప్తూ ఎక్కడన్నా మిగిలి వున్న ఉత్తరం స్వభావాన్ని స్వాగతించారు. ఉత్తరంలో మనాదిని యాదిని ఈ తరానికి అందించే ప్రయత్నం శ్లాఘనీయం. ఏ పేరు పెట్టాలో కవిత లో  నేటి రాజకీయాన్ని తూర్పార పడుతూ  బయట పడేవి జైన బౌద్ధ సంస్కృతులు అని తేట తెల్లం చేసిన ధైర్యం ఈమె  కలానిది.

 ‘మాట’ అనే కవితలో ప్రశ్నిస్తే నేటి కలం సంకెళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రశ్న నిరంతరం అని… మహా అయితే జైలు. ఉరి.. అంతేగా. అయితే ప్రశ్నించటం  ఆపవద్దనే సంకేతం ఇస్తూ మట్టి పొరల్లో జీవిస్తావనే భరోసా ఇచ్చిన రీతి నేడు చాలా అవసరం.

 ‘అద్దం అబద్ధం’ కవితలో ‘‘అద్దం ముందు నిలబడితే వీస్తున్న సాంప్రదాయ గాలుల్లో ఎండుటాకుల చప్పుళ్ళు వినలేక లోలోపలి గాయాల సలపరింత కలవర పెడుతుంది’’. మను ధర్మాన్ని కాలదన్ని ‘‘నీవో కరిగే కొవ్వొత్తిలా అంటూ వెన్ను విరుస్తుంది’’. నిడివి ఎక్కువైన కవితల్లో గాఢత లోపించింది. ఆద్యంతం పాఠకులను చదివించ లేకపోయాయి. రచయిత్రి ఇలాంటి పొడవైన కవితల్లో జాగ్రత్త వహించాలని నా సూచన.

‘అడుగు నేల’ కవిత లో ‘‘సరిహద్దు గీతల మధ్య చెదిరి పోయి అడుగు నేల కోసం వెతుకుతున్నాను. ఈ మట్టిపొరలపై పుట్టిన నాకు అదే మట్టి పొరల కిందికి చేరేందుకు అట్టే సమయం లేదు’’ అంటూ పాలస్తీనా చరిత్రను పాఠకులకు చేరవేస్తూ నేటి యుద్ధకాంక్షను ఖండిరచారు. యుద్ధోన్మాదుల సామ్రాజ్య కాంక్షలు రేపటి తరాన్ని మట్టు పెట్టే ధోరణిపై కలాలు కదలాల్సిన తరుణం.  మన ఇంటి దాకా వచ్చే దాకా వేచి చూసే మూర్ఖత్వంలో వున్న జనాన్ని కవులు గాయకులు మేలుకొల్పాల్సిన సమయమిది. ఆధిపత్య వర్గాలు మతం మత్తు ఎక్కించి తమ హక్కులను కాలరాసే నేటి పరిస్థితుల్లో ఇలాంటి కలాల అవసరం వుంది.

‘దిగులు’ కవితలో ‘‘సంధి కాలం జీవం పోసుకునేది ఒకరి మాటల్లో ఒకరం ఓడి గెలిచినప్పుడే కదా!! మనసు పూల తోటకి మాటల నీళ్ళివ్వడం మరిచి పోతే నీరింకిన గుండెల్లో దిగులు గూడు మిగులుతుంది’’  అని బతుకు మర్మాన్ని చెప్పారు. మా ఊరు కవితలో  లేచే ఎర్రమట్టి  ఊరు నియాన్‌ లైట్లతో మెరిసే రోడ్లతో  మా ఊరు రంగు మార్చిన ఆకాశమైందని, డ్రైనేజీ కాల్వ వరద నీటికి తేడా లేకుండా అని చెప్పే ప్రయత్నంలో కవితా వస్తువు సరైనదే అయినా శైలి పేలవంగా సాగింది.

‘అవసరం’ కవితలో ఆమెను అవసరానికి పనికి వచ్చే వస్తువుగా సనాతనం కబళించిన  తీరును  ‘‘ఆమె ఆశలు ఆశయాలు నీ అభిమతానికి వ్యతిరేకం అయితే చాలు నీ నక్క ఊళలే ఆమె చరిత్ర రాతలౌతున్నాయి’’  అని ధిక్కార స్వరం వినిపించారు. ‘కొత్త పేజీల్ని రాసుకుందాం’ కవితలో కుస్తీ ఆడబిడ్డల పక్షాన ‘‘ఎన్ని దారుణాలు జరుగుతున్నా మధ్య యుగాల మడి పాఠాల్ని ప్రశ్నించకుండా’’ సాధించాల్సింది ఏమీ లేదని ఆధిపత్య భావజాలానికి చితి పేర్చక తప్పదని హెచ్చరించారు.

Leave a Reply