వాగ్దానాలు ప్రతి సీజన్ కు పూసే కొత్తపూలు
వాసనలేని, మనిషి వూసులేని పాలనలు
నిజమిదన్న వాండ్లను ‘ఇజ’మిదని
లెక్కలుగట్టి జైల్లో మూటగడుతుంటరు

పాతచరిత్రను మళ్ళీమళ్ళీ తొడుక్కునే భక్తి
కాలాన్ని వెనక్కితిప్పి ప్రగతి అనే రక్తి
దేశమంటే ప్రజలని మరిచిన ఆయుధం
ప్రజలబాధలు కంటికి ఆనని రాజ్యం

ప్రజలు గుమిగూడి మాట్లాడుకుంటరు
ప్రజలు ప్రజల గురించే మాట్లాడుతుంటరు
రాజ్యం పాలకుల భోజ్యమన్న పాతసామెతను
తిరిగేసి ప్రజావీరులదే ప్రభుత అంటుంటరు

ఊర్లల్ల నుంచి పట్నాలదాక
బాటవట్టిన కార్పోరేట్లను చర్చిస్తరు
అడ్డందిరిగి గల్లంతయిన అడ్రసులు వెతుకుతుంటరు
జంజంబల్ బరీ అని పాటలు పాడుతుంటరు
కాని,
ఒకటేమిటి వందలసార్లు గుమికూడుతుంటరు
వొడువని బాధల్ని వొడిసే గొంతులైతుంటరు
ప్రశ్నిస్తూనే సాగుతుంది ప్రజాయుద్ధం
గాయపడ్తూనే... ఎప్పటికప్పుడు సన్నద్ధం

Leave a Reply