మనుషులం కదా
ఆలోచనలను
విరమించుకోలేం కదా

ఇంత నాగరికతా పెరిగింది
ప్రశ్నలకు జవాబుల
వెతుకులాటలోనే కదా

దేశమంతా పీడిస్తున్న
ఈ ఉక్కపోతకు
కారణాన్ని ప్రశ్నించడం
నేరంగా మారుతూంది

నలుగురు కూడి
మాటాడుకోవడం
దేశద్రోహమవుతుంది

మనుషుల మధ్య
వారి మనసుల మధ్య
చిచ్చు పెట్టడమే
నేటి పాలనా తీరు

గోవును పూజిస్తారు
మనిషిని ముక్కలుగా
నరికీ చంపుతారు

మనుషుల మధ్య
మనువును అడ్డంగా
నిలబెడతారు

న్యాయమూర్తులు
ధర్మం బోధిస్తారు
న్యాయన్ని ఉరితీస్తారు

ఈ నిర్భంధ శిబిరంలో
మౌనంగా తలదించి
బతకడం ప్రజా ద్రోహం

మనుషులం కదా
మరల నడచి వచ్చిన
రహదారి కూడలిలో
మరల కలుసుకుందాం!!

Leave a Reply