ఉన్నట్టుండి బ్లాంక్ అయిపోయేను. నే మెడిటేషన్ చేసినప్పుడు కూడా నాలో అంత బ్లాంక్‌నెస్ లేదు. చేతిలో రీవాల్యేషన్ చెయ్యాల్సిన ఆన్సర్ షీట్‌నే చూస్తూ కనురెప్పలు ఆర్పడం మరిచిపోయాను.
“ఈ రీకౌంట్‌లూ రీవాల్యేషన్‌లూ కాండిడేట్స్‌కు బెనిఫిట్ వున్నా లేకపోయినా ప్రభుత్వానికి పక్కా ఇన్‌కమ్…” అన్నాడు పేపర్లు దిద్దుతూ సారీ- దిద్దిన పేపర్లు చెక్ చేస్తూ మా కొలీగ్.
నేనేమీ మాట్లాడలేదు. ఎగ్జామినేషన్ ఫీ వొక్కటే కాదని, రీకౌంటింగ్ ఫీ అని, రీవాల్యేషన్ ఫీ అని- అన్నీ బాగానే వసూలు చేస్తున్నా, మనకు పేపరుకు యిచ్చే కాస్ట్ మాత్రం పెంచడంలేదని మా కొలీగ్ వాపోతున్నాడు.
అవేవీ నా తలకెక్కడం లేదు. నా దృష్టి నే వేల్యూ చేస్తున్న ఆన్సర్ షీట్‌మీద మాత్రమే వుంది.
ఆన్సర్ షీట్‌లో అంత ఘనం యేముంది?
ఎంత చెప్పినా విద్యార్థిలోని విద్యార్థికన్నా భక్తుడే డామినేట్ చేస్తున్నాడని అనుకోకుండా వుండలేకపోయాను. ఇన్నాళ్ళు కొందరు విద్యార్థులు పరీక్షల్లో ఆన్సర్ షీట్‌లో రాసేముందు ‘శ్రీరామ’ అని రాసి ప్రారంభించేవారు. మరి కొందరు ‘ఓం’ కూడా రాసేవారు. అలా రాయకూడదని క్లాసుల్లో చెప్పి, పరీక్షలు రాసేముందు గుర్తుచేసి యెన్ని చేసినా రాసేవాళ్ళు రాస్తూనే వున్నారు, ఆ దేవుడే చూసుకుంటాడులే అన్నట్టు.
తెలిసో తెలియకో చెయ్యకూడని పని చేస్తే? చెయ్యకూడని పనా? మన బ్రెయిన్‌లో చిప్ పెట్టి యిలా అనుకుంటున్నానని గ్రహిస్తే? ఒళ్ళంతా చిరు చెమటలు పోశాయి. ఆ మాత్రం దానికే అతని లైఫ్ స్పాయిల్ చెయ్యాలా? అలాగే అనుకొని, పోనీలే అని- యింత కాలం కన్సిడర్ చేశాం కదా? యువతలో భక్తి పెరిగింది. యువతలోనే కాదు, అందరిలోనూ భక్తి పెరిగింది. మా బాగా వృద్ధి చెందింది. సాక్ష్యంగా నా చేతుల్లో ఆన్సర్ పేపర్.
‘ఓం’ స్థానంలో ‘జై శ్రీరామ్’, ‘శ్రీరామ’ స్థానంలో ‘జై షియా రామ్’! అక్కడితో ఆగితే బాగుణ్ణు. జై షియా రామ్- అని రామకోటి రాశాడు. ఇచ్చిన ఆన్సర్ షీట్స్ చాలలేదు అన్నట్టు అడిషనల్ షీట్స్ తీసుకొని మరీ రాశాడు. మొత్తం యాభై రెండు పేజీలు. మూడు గంటల్లో రాశాడంటే గిన్నీస్ బుక్ యెక్కించొచ్చు అని అనుకోకుండా వుండలేకపోయాను.
‘పేజీకి వొక మార్కు చొప్పున వేసినా యాభైరెండు మార్కులు’ లెక్క చెపుతున్న గొంతు. అది ఆ పరీక్ష రాసిన విద్యార్థిదేనా? లేక దేవుడిదా?
‘దేవుణ్ణి నమ్మినవాడు యెన్నటికీ చెడిపోడు’ అని కూడా రాశాడు. అది కూడా ‘నోట్’ అని పెట్టి మరీ. నయం… ‘జిరాక్స్ తీసి వందమందికి పంపించు, అలా పంపించకపోతే నీ తల వేయి వక్కలవుతుంది’ అని రాసుంటే, చచ్చుండేవాణ్ణి.
ఊపిరి పీల్చుకున్నాను. వదిలాను.
వదల్లేదు…
‘నాకు తెలుసు. చేసేది చేయించేది అంతా ఆ పరమాత్ముడే’ యెక్కడో విన్నట్టుంది. ‘పరీక్ష రాసేది, మార్కులు వేసేది అంతా ఆ భగవంతుడే’ యిప్పుడూ వినిపిస్తోంది. ‘యుద్ధం చేసేది నీవు కాదు, నేను ముందే నిర్ణయించాను. నీవు కేవలం నిమిత్తమాత్రుడవు’ గీతలోని కృష్ణపరమాత్ముడా లేకపోతే చాగంటా గరికపాటా… చెప్పడానికి నేను యేపాటి?
దేశమే మారిపోయింది. ‘ఆన్సర్ షీట్ మారడంలో వింతేముంది?’ నా లోపలి యెవరో నాకే తిరిగి ఆన్సర్ చేస్తున్నారు. పేపర్లు తిరగేస్తూ చివరి వరకూ చూశాను. చివర్లో ‘శుభం’ అని కూడా రాశాడు మహానుభావుడు. ఆ అక్షరాలకి పసుపు రాసి కుంకుమబొట్టు పెట్టివుంది. ఈ సరంజామా అంతా వీడికెక్కడిది? జేబుల్లో వేసి గాని తెచ్చుకున్నాడా? ఇన్విజిలేటర్ చూడలేదా? చూసి ఆపలేదా? ఆపితే పాపం చుట్టుకుంటుందని ఆగిపోయాడా? అని అనుకుంటూ- పోన్లే దిద్దేముందు హారతి యిచ్చి దిద్దవలెను- అని రూల్ పెట్టలేదు.
‘ఇంత రాసి తిరిగి యెంత ధైర్యంగా రీవాల్యేషన్‌కి పెట్టాడు? అతని ఆత్మవిశ్వాసం చాలా గొప్పది, గొప్పదే కాదు, కొనియాడతగినది…’ అని అనుకోకుండా వుండలేకపోయాను.
“పాపం ఎగ్జామ్ ఫీజుకట్టి… రీకౌంటింగ్ ఫీజుకట్టి… రీవాల్యేషన్ ఫీజుకట్టి… చేస్తే, మనకి పాస్ చెయ్యడానికి యేమిటి దొబ్బుదెగులు?” మా కొలీగ్ ఆన్సర్ షీట్ చదవకుండా నా వైపు చూస్తూ కొలిచి మరీ మార్కులు వేసేస్తున్నాడు.
నా కళ్ళలోని భావం చదివేసి “అయినా పాస్‌కూ ఫెయిల్‌కూ పెద్ద తేడా లేదు. పాసయి వూడబొడిసిందీ యేమీ లేదు. ఉద్యోగమా? వల్లకాడా? వాడు అమ్మాఅయ్యా తిట్టారనో మరొకటనో ఆత్మహత్య చేసుకుంటే, ఆ పాపం యెవరి అకౌంట్లో వేస్తారు? మన అకౌంట్లోనే కదా?” వాల్యేషన్ చేస్తూ నా కొలీగ్ మాట్లాడుతూ వున్నాడు. నేనేమీ మాట్లాడలేకపోయేసరికి
“పోనీ, కష్టపడి చదివాడే అనుకుందాం, కనీసం పేపర్ లీక్ కాకుండా మనవేపు నుండి ఆపగలమా?, అదీ లేదు… ఆపాటి దానికి దిద్దినప్పుడే నాలుగు మార్కులు పడేస్తే కలిపేస్తే… వాడికీ అవస్త వుండదు… మనకీ అవస్త వుండదు” యేమంటారు అన్నట్టు నావైపు చూశాడు మా కొలీగ్.
రోజంతా చెయ్యాల్సిన పనిని రెండు గంటల్లో చేసేసి పడేసినట్టే వున్నాడు.
నాకెందుకో నా చిన్నప్పుడు బాగా చదివే క్లాసు లీడర్లే పేపర్లు దిద్దేయడం గుర్తుకు వచ్చింది. తర్వాత యూనివర్సిటీలో మేనేజ్ చేసి యెప్పటికీ పాసుకాని మా మరదలిని పాస్ చెయ్యడమూ గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ప్రవేటు యూనివర్సిటీలు తామే తమ సిలబస్లూ క్వశ్చన్ పేపర్లూ తయారు చేసేసుకొని… తామే మార్కులు వేసేసుకొని… యిదంతా చూస్తుంటే- పిల్లలు వాళ్ళకి వాళ్ళే మార్కులు వేసేసుకొని ఆడుకోవడం కూడా గుర్తుకువచ్చింది.
‘ఆగాగు, మెడికల్ కాలేజీ లేకుండా వున్నట్టు స్టూడెంట్లు లేకుండా వున్నట్టు పేసెంట్లు లేకుండా వున్నట్టు చూపిస్తుంటే తప్పుకాదు గాని రాయకుండా రాసినట్టు మార్కులు వేస్తే తప్పేంటి?’ నా లోలోపలి ప్రశ్నలు. ఆ దైవమే వేయిస్తోందేమో యేమో?!
“ఇంకా ఆ పేపరే పట్టుకొని కూర్చున్నావ్?” నా కొలీగ్ భోజనానికి టైమ్ అవుతున్నట్టు వాచ్ చూసుకున్నాడు.
మళ్ళీ ఆన్సర్ షీట్ తిప్పి చూశాను. ‘జీరో మార్కులు వచ్చినవాడు రీవాల్యేషన్‌కి పెట్టడమే గ్రేట్, అందుకైనా మార్కులు వెయ్యాలి’ నాలోని విదూషకుడు నన్ను నవ్వించడం లేదు, యేడిపిస్తున్నాడు.
చేతిలోని ఆన్సర్ షీట్‌ని పరికించి చూశాను. ఇంటూ కొట్టాను. దేవుడి నామాన్ని అలా క్రాస్ చెయ్యడం నచ్చలేదేమో పెన్ను కూడా కొంత రాయలేదు. ‘టి’ లా అదికూడా క్రాస్ చేసినట్టు వచ్చింది. చూడగా అది యేసు శిలువలా కనిపించింది. అంటే సనాతన మతంపై అన్యమతం దాడి- అని రేపు అంటే? ఎందుకు అనరు? జీరో మార్కులు వచ్చినవాడు రీవాల్యేషన్‌కి పెట్టి వూరుకుంటాడా? గొడవ చేసి ఎంక్వయిరీ దాకా వెళితే? ‘మా మతమ్మీద ద్వేషం కక్కిన గురువు’ అంటే? అననీ! అననీ-నా?, దేశాన్ని పాలించేది యెవరు? మత మద్దతు దారులే కదా? వాళ్ళకి కోపం రాదా?
రామనామం జపించి అధికారంలోకి వస్తే తప్పులేదు? అదే రామనామం జపించి పరీక్ష పాసవడంలో యేమిటి తప్పు?- యెవరో నిలదీస్తున్నారు. నిలదీస్తున్నది రాముడో… యీ దేశ యేలికలో… నా కర్థం కాలేదు. తలతిప్పి చూద్దామంటే ధైర్యం చాలలేదు.
చేష్టలుడిగి అలాగే వుండిపోయాను.
“వెయ్ వెయ్… మార్కులెయ్…” మా కొలీగ్ కాదు, వొక గొంతు కాదు. కానీ ఆ గొంతుల్ని యెక్కడో విన్నట్టే వుంది.
“మన ప్రాచీన భారతదేశంలో ప్లాస్టిక్ సర్జరీ అందుబాటులో వుండేది. దానికి నిదర్శనమే గణేశుడికి యేనుగు తలకాయ అమర్చడం…” వినిపించింది. ‘తలకాయ’ అని అన్నందుకు చెప్పుతీసుకు కొట్టిన భక్తుడూ లైవ్ డిబేటూ గుర్తుకువచ్చింది. వెనువెంటనే ఆ మాట అన్నది సాక్షాత్తూ దేశప్రధాని కావడంతో ధైర్యం వచ్చి వూపిరి పీల్చుకున్నాను.
“కర్ణుడు టెస్ట్ ట్యూబ్ బేబీ, అప్పుడే జన్యుశాస్త్రం వుంది…” ఆయన గొంతే మళ్ళీ.
“అంతెందుకు? మన మహాభారతంలో వందమంది కౌరవ సంతానం. ఒకే తల్లికి వందమంది పిల్లలు పుట్టడం అనేది అప్పట్లోనే వున్న స్టెమ్ సెల్ రీసెర్చ్ అండ్ టెస్ట్ ట్యూబ్ టెక్నాలజీ మనకి వుంది” వైస్ ఛాన్సలర్ అండ్ ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు ఆలిండియా సైన్సు కాంగ్రెస్‌లో చెప్పాడు కదా?, అప్పుడు చెప్పింది యిప్పుడు యెందుకో వినిపిస్తోంది.
“ఇప్పుడు సెక్స్ చేంజ్ ఆపరేషన్లు వచ్చాయి అని అనుకోవలసిన అవసరం లేదు. మన మహా భారతంలోనే ‘శిఖండి’ క్యారెక్టర్ వుంది…” ఆ గొంతు యెవరిదో గుర్తుపట్టలేకపోయాను. కాని వాళ్ళు వైద్య నిపుణులని నాకు యెరుక వుంది.
“ఇప్పుడేమంటావ్?” మధ్యలో వచ్చిన ఆ లేత గొంతు యెవరిది? చూస్తే- కొలీగూ లేడు, భోజనానికి వెళ్ళాడో సిగరెట్‌కు వెళ్ళాడో.
“వేదకాలంలోనే విమానాలు వుండేవి. అవి వొక దేశం నుండి మరోదేశానికే కాదు, వొక గ్రహం నుండి మరో గ్రహమ్మీదికి ట్రావెల్ చేసేవి” పైలట్ ట్రైనింగ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ కెప్టెన్ ఆనంద్ బోడాస్ క్లెయిమ్ చేస్తున్న గొంతు యిప్పుడు యిక్కడా వినిపించింది.
“మన రామాయణంలో రావణుడి దగ్గర వొకటి కాదు, యిరవై నాలుగు రకాల విమానాలు వుండేవి, ఆధునిక శ్రీలంకలో వాటికోసం ప్రత్యేక రన్‌వేలు కూడా వుండేవి…” మా ఆంధ్రా యూనివర్సిటీ అధిపతీ కులపతి నాగేశ్వరరావు గొంతు గుర్తుపట్టాను, కాని తలెత్తి చూడలేదు.
“మన హనుమంతుడే తొలి అంతరిక్ష యాత్రికుడు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కన్నా ముందే అంతరిక్షంలోకి వెళ్ళివచ్చాడు. వరల్డ్ ఫస్ట్ స్పేస్ ట్రావెలర్ అవర్ హనుమంతు” పాఠశాల విద్యార్థులతో వొక ఎంపీ అంటున్నాడు. ఔను, ఆ వార్త నేను చూశాను.
“చూడడమేమిటి?, ఇప్పుడు నువ్వు వింటున్నావు కదా?” ఆ లేత గొంతు అంటోంది, నా చెవి దగ్గరే నోరు పెట్టి.
“ఐజాక్ న్యూటన్ యింకా ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సిద్ధాంతాలు పూర్తిగా తప్పు. అవి గ్రావిటేషనల్ వేవ్స్ కావు, నరేంద్ర మోదీ వేవ్స్ అని పేరు పెట్టాలి” సైన్సు కాంగ్రెస్ వేదికమీద తమిళనాడు ప్రొఫెసర్ కె.జె. కృష్ణన్ కొట్టిపారేసినట్టుగా అంటున్నాడు.
“అరే, అంతెందుకు? విష్ణుమూర్తి ధరించిన సుదర్శన చక్రం? లక్ష్యాలను వెతికి వేటాడే ఒక అత్యాధునిక గైడెడ్ మిస్సైల్ టెక్నాలజీ…” మళ్ళీ వీసీ అండ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూనే వున్నాడు.
“ఇంటర్నెట్ యిప్పుడు వచ్చిందని అనుకోవద్దు. మహాభారత కాలంలోనే ఇంటర్నెట్, శాటిలైట్లు వున్నాయి. కురుక్షేత్ర సంగ్రామంలో ధృతరాష్ట్రుడికి యుద్ధంలో జరిగే విశేషాలను ప్రత్యక్షంగా యెప్పటికప్పుడు సంజయుడు వివరించాడు. దానికి కారణం ఆ రోజుల్లోనే ఇంటర్నెట్, శాటిలైట్ టెక్నాలజీ మనకు వుంది” త్రిపుర మాజీ సియ్యమ్ విప్లవ్ కుమార్ దేవ్ బహిరంగ సభలో చెప్పాడు కదా?, మళ్ళీ యిదేంటి? ఇప్పుడెందుకు?
“లేదు… లేదు… మీరు వినాలి” ఆ లేత గొంతును పసిగట్టాను, ఖచ్చితంగా నా చేతిలోని ఆన్సర్ షీట్ వాడిదే- అనుమానం లేదు.
“మీరు చెప్పండి సార్… ప్లీజ్” ఆ లేత గొంతు అనడంతో- రికార్డర్ ఆన్ చేసినట్టు గొంతులు విచ్చుకున్నాయి.
“సంస్కృతం అత్యంత శాస్త్రీయ కంప్యూటర్ భాష” అధికారుల గొంతులు వొక్కటై ప్రతిధ్వనించాయి.
“సంభోగం ద్వారా సంతానం అనేది పూర్తి సత్యం కాదు. నెమళ్ళు సంభోగం చేసుకోవు. మగ నెమలి కన్నీరు కారుస్తుంది. ఆ కన్నీరు తాగి ఆడనెమలి గర్భం ధరిస్తుంది” రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి మహేశ్చంద్ర శర్మ చెప్పిందే గరికపాటి కూడా చెపుతున్నాడు. ఇద్దరూ వొకే బడిలో చదువుకున్నట్టున్నారు.
“ఆవు ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ విడుస్తుంది…” హైకోర్టు న్యాయమూర్తిగారు చెపుతున్నారు.
‘కాదంటే, ఖైదు విధించరు కదా?’ నా అనుమానం నాది.
“కాదనడానికి లేదు…” మళ్ళీ అదే లేత గొంతు. దేన్ని గురించో నాకు బోధపడలేదు. ‘కాదు, మార్కులు వెయ్యను’ అనడానికి లేదనా?
“గోమూత్రం కాదు ‘గోవామృతం’ అనాలి. గోవు మూత్రం సర్వవ్యాధి నివారణా ఔషధం..” గొంతు వినిపిస్తోంది, యెవరన్నారా అని ఆలోచనల్లో వుండగా “ఐఐటి మద్రాసు డైరెక్టర్ వి. కామకోటిగారు” లేత గొంతు అనుమాన నివృత్తి చేసింది.
“రైట్ సోదరుల కంటే వేల సంవత్సరాల ముందే, భారతీయులు విమానం నడిపారు. మనదగ్గరున్న పుష్పకవిమానం ప్రపంచంలో మరెక్కడా లేదు”
నేను తలూపాను, యెందుకు యెవరన్నారని అడిగి అజ్ఞానం బయటపెట్టుకోవడం అని బుద్ధిగా నోరు విప్పకుండా వున్నాను.
“గోమూత్రం వల్ల కోవిడ్‌ని యెదుర్కొన్నాం” వింటూవుంటే, ‘కంచాలమీద గరిటెలతో కొట్టి కదా కోవిడ్‌ని తరిమేశాం…’ నాలోపలి విదూషకుడు. దొరికితే వాడి పీక నులిమి చంపెయ్యాలని అనిపించింది.
“ఆవు మూత్రంలో బంగారం వుంది”
“మన వేదాల్లోనే అణుబాంబు తయారీ గురించి వుంది”
“మనిషి కోతి నుండి వచ్చాడని యెవరూ చూడలేదు. డార్విన్ పరిణామ క్రమ సిద్ధాంతం తప్పు…”
“మాస్టారూ…” నన్నే పిలిచింది లేత గొంతు. “ఆ?” అన్నాను. “విన్నారా? యివేవీ కాదని, సిలబస్‌లో వున్న తప్పులన్నీ ఆన్సర్లుగా రాయడం తప్పు కదా?” అడిగింది లేత గొంతు. నేను అర్థం చేసుకుంటున్నట్టు తలూపాను. ‘అందుకే కదా?, సిలబస్ మార్చుతున్నది’ అని మద్దతు ప్రకటించబోయి ఆగిపోయాను. “మరి యీ తప్పులన్నీ రాసి యాంటీ నేషన్ కమ్మంటావా? అర్బన్ నక్సల్ కమ్మంటావా? లేకపోతే పాకిస్తాన్ ఏజెంటు కమ్మంటావా? చైనా స్పాన్సరింగ్ కమ్మంటావా?” లేత గొంతు నిలదీస్తోంది.
ఉపాధ్యాయుడైన నేను విద్యార్ధిలాగ… ఆ విద్యార్థి వుపాధ్యాయుడులాగ స్థానాలు మారినట్టుగా అనిపించి వులిక్కిపడ్డాను.
“ఐన్‌స్టీన్ చెప్పిన E=mc² కంటే గొప్ప సిద్ధాంతం మన వేదాల్లోనే వుంది, స్టీఫెన్ హాకింగ్ చెప్పాడు”
“హిందూ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే డైనోసార్లను మొదట కనిపెట్టారు”
“ఆధునిక ఇస్రో (ISRO) శాటిలైట్ చిత్రాలు, రిమోట్ సెన్సింగ్ సాంకేతికత ద్వారా భూగర్భంలో ప్రవహిస్తున్న సరస్వతీదేవి రూపాన్ని, ఆమె ప్రయాణించిన మార్గాన్ని స్పష్టంగా కనుగొన్నారు”
“సరస్వతీ నది ఎండిపోవడానికి లేదా భూగర్భంలోకి వెళ్ళిపోవడానికి నదికి వున్న వొక శాపమే కారణం, యిది సైన్స్ అంగీకరించాల్సిన నిజం”
“పురాతన వేద మంత్రాల ద్వారా ఆకాశంలో మేఘాల గర్జనలను నియంత్రించవచ్చు, పిడుగులు పడకుండా ఆపవచ్చు”
“తరచూ భూకంపాలు మరియు కొండచరియలు విరిగిపడటానికి గల కారణం కొందరు ప్రజలు గోవులను వధించి మాంసం తినడమే, జంతువుల శాపం వల్లే ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి”
బ్యాక్ గ్రౌండ్‌లో గొంతులు వినిపిస్తూనే వున్నాయి, వినడానికి నాకు వోపిక లేకుండా వుంది. లేత గొంతు విద్యార్థి నన్ను చూసి అర్థం చేసుకున్నాడేమో “మాస్టారూ” అని పిలిచి, “యిటు చూడండి” అన్నాడు. నేను ధైర్యం చేసి తలెత్తి చూశాను.
“ఇవన్నీ చెప్పింది యెవరో తెలుసా?” లేత గొంతు విద్యార్థి అడిగాడు.
‘తెలుసు’ అని గానీ ‘తెలీదు’ అని గానీ నేను జవాబివ్వలేదు. ఇస్తే పీక మీదకొస్తుందని నోరు మూసుకున్నాను.
“ఇవి చెప్పింది, మీలాంటి నాలాంటి మామూలు మనుషులు కాదు, ప్రొఫెసర్లూ ప్రిన్సిపాల్లూ వీసీలూ జడ్జీలూ మంత్రులూ శాస్త్రవేత్తలూ వైద్యనిపుణులూ పరిశోధకులూ పండితులూ ప్రవచనకారులూ ఐకాన్లూ అధికార్లూ… హేమాహేమీలూ చెప్పారు. ఎక్కడా? పబ్లిక్‌లో. క్లాసు రూముల్లో. విశ్వవిద్యాలయాల్లో. సైన్సు కాంగ్రెస్ వేదికల్లో. బహిరంగ సభల్లో. అంచేత…”
చెప్పుకుపోతోంది గొంతు. నా గుండె జావగారిపోయింది. నీరయిపోయినందుకు సాక్ష్యంగా వంట్లోంచి తలలోంచి చెమటలు ధారలుగా బయటకు వస్తున్నాయి.
“మాస్టారూ…” లేత గొంతు పిలుపుకి అలర్ట్ అయ్యాను. కాని తలతిప్పి చూసే సాహసం చెయ్యలేదు. ఆన్సర్ షీట్‌లోకి చూశాను. చూస్తూనే వున్నాను.
“ఆ మహానుభావుల కంటే యీ మహానుభావుడు యేమి తక్కువ?” అనుకున్నాను, లేదు అన్నాను.
“గుడ్…” లేత గొంతు విద్యార్థి మెచ్చుకున్నాడు.
“ఎన్ని మార్కులు కావాలి?” నోరు జారానా? లేదు యీ దేశపౌరుడిగా అది నా బాధ్యత కాదా?
“పేజీకి వొక మార్కు చొప్పున వేసినా యాభైరెండు మార్కులు” లెక్క చెపుతున్న గొంతు. మాట తప్పలేదు.
యాభైరెండు మార్కులు వేశాను.
“మరి మీరేమీ వెయ్యరా?” లేత గొంతు విద్యార్ధి ప్లీజింగ్‌గా అడిగాడు.
మరో రెండు మార్కులు కలిపాను.
“మీరేనా? నేను వేసుకోవద్దా?” చిరునవ్వుతో అడిగి, తనూ మరో రెండు మార్కులు వేసుకున్నాడు ఆ లేత గొంతు విద్యార్ధి.
మొత్తం ‘యాభైయ్యారు మార్కులు’ వెయ్యడంతోనే ఆ లేత గొంతు విద్యార్ధి సహా గొంతులన్నీ మాయమైపోయాయి.
నేను విముక్తుడినైపోయాను! ఎటొచ్చీ దేశమే బందీ అయిపోయింది!!
- బమ్మిడి జగదీశ్వరరావు




