నీట్, సిబిఎస్ఈ, నెట్ వంటి జాతీయ అర్హత పరీక్షలలో మోడీ సర్కారు వైఫల్యం, విద్యా విధానంలో సంస్కరణలు, కేంద్ర సర్కారు యొక్క జవాబుదారీతనం, కనీస భాద్యతలను గుర్తు చేస్తూ కాంక్రోచ్ జనతా పార్టీ, విద్యార్థి సంఘాల పిలుపుతో దేశవ్యాప్తంగా విద్యార్థి యువత భాగస్వామ్యంతో జూన్ 20 నుండి జంతర్ మంతర్ లో మొదలైన నిరసన పాలకులు స్పందించకపోవడంతో పార్లమెంటు ముట్టడికి దారి తీసింది. జూలై 20 నాడు విద్యార్థి యువతపై జరిగిన లాఠీ చార్జీ అనంతర పరిణామాలతో దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు ఎన్డీఏ సర్కారును ఒక మెట్టు కింద దిగేలా చేశాయి. ఈ పోరాటంతో ఇన్నాళ్ళు దేశంలో అంతా బాగుందని భావిస్తూ అచలనంగా ఉన్న ఒక సెక్షన్ ప్రజలను మేల్కోపినట్లైంది. విద్యారంగంలో ఒక అర్హత పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ప్రస్తావనతో మొదలైన పోరాటం కేంద్ర మంత్రి రాజినామాకు దారి తీసింది. విద్యార్థి -యువత భాగస్వామ్యంతో జరిగిన ఈ ఆందోళన ఎంతో ఆదర్శమైనది. విద్యారంగంలో అసలు సమస్యలైన ప్రైవేటీకరణ, కాషాయికరణ, కార్పోరేటీకరణలు అందుకు బాటలు వేసే నూతన జాతీయ విద్యా విధానం, విద్య సంస్థలలో కుల వివక్షత తదితర అంశాలు, నిరుద్యోగ సమస్య ఈ సందర్భంలో చర్చకు వచ్చినప్పటికీ పోరాట రూపం దాల్చలేదు. ఈ సమస్యలతో పాటు గిట్టుబాటు ధర అందని రైతాంగం, నూతన లేబర్ కోడ్ లతో దివాలా తీసిన కార్మికులు, కుల వ్యవస్థ భాదితులు, హిందుత్వ భాదితులు, నిర్వాసిత భాదితులు పోరాట మార్గం ఎన్నుకుంటే నేటి ఫాసిస్టు ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా నిలబడజాలదు. విద్యార్థి-యువత-కార్మిక-కర్షక-పీడిత సెక్షన్లు ఐక్యతతో సాగితే మరింత గొప్ప విజయాలు సాధించవచ్చనేది చారిత్రక సత్యం.
కాక్రోచ్ జనతా పార్టీ దేశంలోని పలు ప్రాంతాల్లో జరిపిన దర్నాలలో పాల్గొన్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ గారు నిరాహారదీక్షకు పూని జంతర్ మంతర్ లో జరిగిన నిరవధిక ఆందోళనకు విలువైన మద్దతు అందించారు. సోనంవాగ్చుక్ గారు అక్రమ అరెస్టు అనంతరం మాట్లాడుతూ ఈ దేశంలో మరో స్వాతంత్ర్య పోరాటం జరగాల్సిన అవసరం ఉందని బహిరంగ ప్రకటన విడుదల చేశారు. నిజానికి భగత్ సింగ్ అన్నట్లు తెల్ల దొరలు పోయి నల్లదొరలు వచ్చారనే మాట ఇందుకు సరిగా సరిపోతుంది. ఈ దేశ పౌరులైన విద్యార్థి, యువకులు రాజ్యాంగ బద్దంగా నిరసన తెలిపితే ఈ దేశ పాలకులు లాఠీ చార్జీ చేయించి తలలు పగులగొట్టారు, చేతులు కాళ్ళు విరిచారు. విద్యార్థులపై కాల్పులు జరిపారు. పొగ బాంబులు,వాటర్ కేనన్లు ప్రయోగించారు. అవసరం లేని హింస విద్యార్థులపై ప్రయోగించిన భారత ప్రభుత్వ చర్యలు ఇంకా ఎంత మాత్రం మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టలేవు, ఇది ముమ్మాటికి ఫాసిస్టు పాలనను, ఫాసిస్టు రాజ్యాన్ని, దాని స్వభావాన్ని బట్టబయలు చేశాయి. ఈ ఫాసిస్టు పాలనను ఈ దేశ యువతరం, విద్యార్థి లోకం అంగీకరించబోదు. ఈ ఫాసిస్టులకు వ్యతిరేకంగా మరో స్వాతంత్ర్య పోరాటం జరగాల్సిందే.
దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జరిగిన నిరవధిక నిరసన ఒక మంత్రి రాజినామాతో తాత్కాలికంగా ఆగినప్పటికీ కేంద్ర పాలకులు వహిస్తున్న విధానాలు గమనిస్తే విద్యార్థుల పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమైన నీట్ పరీక్ష మరియు జాతీయ అర్హత విధానం రద్దు చేయకుంటే అక్రమాలు అసమానతలు ఆగవు. వైద్య విద్యలో దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష నీట్ ను ఇంగ్లీష్,హిందీ లలో నిర్వహిస్తే దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు స్కోర్ చేయలేరు. అడ్మీషన్లు పొందలేరు. పరీక్ష ఫలితాలు రెండవసారి విడుదలై నెల గడిచినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక తదితర దక్షిణాది రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. అదే విధంగా పరీక్ష నిర్వాహణ సంస్థ ఎన్టీఏ ను కూడా శాశ్వతంగా రద్దు చేయకుండా పరీక్షలలో అవినీతి ఆగదు. ఈ డిమాండ్ల నుండి జంతర్ మంతర్ నిరసనలు పక్కకు జరగడం కొంత నష్టదాయకమే. అయినప్పటికీ ఈ నష్టాలకు బలౌతున్న విద్యార్థులు పోరాడక మానరు. నిజాయితి గల ప్రాంతీయ రాజకీయ పార్టీలు, సంఘాలు ఈ అంశాలపై పోరాడాల్సిందే.
డిల్లీ కేంద్రంగా జరిగిన విద్యార్థుల పోరాటం విద్యార్థి లోకానికి ఎంతో ఆదర్శం. ఈ పోరాటాలలో పాల్గొన్నది నూతన తరం విద్యార్థులు, యువకులు. పోరాటాలలో ఎలాంటి అనుభవం లేనప్పటికీ వారి దైర్య సాహాసాలే వారిని ముందుకు నడిపాయి. అనేక కారణాలతో ఈ ఆందోళనలో పాల్గొనని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీవ్ర స్వయం విమర్శ చేసుకోవాలి. అదే సందర్భంలో ఈ పోరాట క్రమాన్ని రివ్యూ చేసుకొని విద్యా విధానంలో అసమానతలు తొలగించేందుకు కృషి చేయాలి. జంతర్ మంతర్ ఆందోళనకు మార్గదర్శకం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం నూతనంగా ఏర్పడినది. వారితో కలిసి ఐక్య ఉద్యమాలు నిర్మించాల్సిన బాధ్యత ఇది వరకే ఏర్పడిన విద్యార్థి యువజన సంఘాలపై ఉంది. ముఖ్యంగా గతితార్కిక భౌతికవాదాన్ని తమ దృక్పథంగా ప్రకటించుకున్న విద్యార్థి సంఘాలు ముందు వరుసలో ఉండాలి. ప్రపంచ వ్యాప్తంగా పెల్లుబాకుతున్న విద్యార్థి ఉద్యమాలను అద్యయణం చేస్తూ పోరాటాన్ని మార్గంగా ఎంచుకోవాలి. ముఖ్యంగా విద్యార్థి లోకాన్ని సంప్రదించే మార్గాలను,మాధ్యమాలను మార్చుకోవాలి. మూస పద్దతిలో కాకుండా వారి ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు పని విధానాన్ని రూపొందించుకోవాలి. ఉదాహరణకు గతంలో ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆఫ్ లైన్ సంతకాల సేకరణ చేసే వారు నేడు ఆ పని ఆన్ లైన్ పిటిషన్ రూపంలో, ఆన్ లైన్ ఫోల్ రూపంలో చేయడం అవసరం. పని విధానంలో ఇలాంటి మార్పులతో పాటు విద్యార్థి యువజనులు వ్యక్తివాదం, కెరియరిజంలో కొట్టుకుపోకుండా త్యాగాలకు సిద్ధపడటం అవసరం. భగత్‌సింగ్, రాజు గురు, సుఖ్‌దేవ్ ల త్యాగాన్ని ఆదర్శంగా తీసుకొని దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సంపూర్ణ స్వాతంత్ర్యం నెలకోల్పడం కోసం ముందుకు రావాలి. దేశంలో నేటి పాలకులు అన్ని రంగాలు కూడా భ్రష్టు పట్టించిన ఈ సందర్భంలో మళ్ళీ దేశాన్ని నిలబెట్టి పునఃనిర్మించాల్సిన కర్తవ్యం విద్యార్థి యువజనులదే. నూతన విద్యా విధానాన్ని రుద్ది విద్యార్థులను నిలువునా దోపిడీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఈ విద్యా విధానం అమలుతో నీట్, నెట్, సిబిఎస్ఈ వంటి జాతీయ అర్హత పరీక్షలలో ఏర్పడిన కుంభకోణాలకు బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా లు రాజీనామా చేయాలనే తక్షణ డిమాండ్ తో విద్యార్థులు పోరాటంలోకి రావాలి. అంతిమంగా మన దేశాన్ని, దేశంలోని ప్రజలను స్వదేశి, విదేశీ దోపిడీ దారుల కబంధ హస్తాల నుండి విముక్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి.
-కోట ఆనంద్
ప్రొగ్రెస్సివ్ స్టూడెంట్స్ యూనియన్.
01.08.2026




