బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో భరత్ భూషణ్ తివారీ మరణించడం ఇటీవలి కాలంలో అత్యంత చర్చనీయాంశమైన సంఘటనలలో ఒకటిగా నిలిచింది. ఈ ఎన్‌కౌంటర్‌ ఉదంతం పోలీసు వ్యవస్థ స్వరూపం, రాజ్యాంగ రక్షణలు, పౌర స్వేచ్ఛలు, ప్రభుత్వ సంస్థల జవాబుదారీతనం, పౌరులకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం గురించి మరింత విస్తృతమైన చర్చకు దారితీసింది.

బీహార్ రాష్ట్రంలోని భోజ్‌పూర్ జిల్లా బిలౌటి గ్రామానికి చెందిన ఒక పోలీస్ శాఖలో డ్రైవర్ గా పనిచేసిన కాశీనాథ్ తివారీ, ఆశాదేవీ దంపతుల నలుగురు సంతానంలో మూడోవాడైన ఏళ్ల భరత్ భూషణ్ తివారి బీఎస్సీ పట్టభద్రుడు. ఒకప్పుడు పోలీసు ఉద్యోగంలో చేరాలని కలలు కన్నవాడు.

ఆయన తనను తాను అమరవీరుడు సర్దార్ భగత్ సింగ్ బాటలో ఒక విప్లవకారుడిగా అభివర్ణించుకున్నప్పటికీ, పొరుగు రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను తన ‘ఆదర్శంగా’ ఆరాధించాడు. చనిపోయే కొద్ది రోజుల ముందు కూడా హిందూ మతం పేరుతో బిజెపి చేస్తున్న కార్యక్రమాలన్నింటిని ప్రశంసించిన వాడు. ఎన్‌కౌంటర్ల ద్వారా మాఫియాను, అవినీతిపరులను నిర్మూలించవచ్చనే యోగి పద్ధతిని మెచ్చుకున్నవాడు. మాటలతో వినకపోతే తుపాకులతో సమాధానం ఇవ్వాలనే యోగి మాటలతో ప్రభావితుడయ్యాడు. తివారీ ఆదిత్యనాథ్‌ను తన ‘ఆదర్శంగా’ అంగీకరించాడు. ఆర్ఎస్ఎస్-బిజెపిల హిందుత్వ అజెండాకు మద్దతు ఇచ్చాడు.  స్వయం ప్రకటిత దైవపురుషుడైన ధీరేంద్ర శాస్త్రికి చెందిన బాగేశ్వర్ ధామ్ ఆశ్రమానికి పాద యాత్ర కూడా చేసాడు.

తన ప్రాంతంలోని అణగారిన వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం, కు‌ళ్లిపోయిన ఈ వ్యవస్థలతో పోరాడాడు. గ్రామంలోని రోడ్ల దుస్థితి, తన ప్రాంతంలో గంగా నది వరదలు, అవినీతి, లంచగొండితనంపై సోషల్ మీడియా వేదికగా గళమెత్తుతూ ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మాటకారి కావడంతో సునాయాసంగా వీడియోలు చేసేవాడు.

షాపూర్ లో నది వరదలకు, కోటలకు గురైనప్పుడు ఎన్నో కుటుంబాలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రితులయ్యారు. వారిని తరలించిన పునరావాస కేంద్రాలలో పరిస్థితులు దారుణంగా ఉండడంతో వారి తరఫున భరత్ తన గళమెత్తాడు. వరద బాధితులకు యిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశాడు. రోడ్డు విస్తరణలో భూములు పోగొట్టుకున్న వారి తరఫున పోరాడాడు. అధికారులను కలిసాడు. వారి సమస్యలను లేవనెత్తడంలో చాలా చురుకుగా ఉన్నాడు. బాధిత ప్రాంతాల నుంచి వీడియోలు చేసి అక్కడి దుస్థితిని బయటి ప్రపంచానికి చూపించాడు. అధికారులను ప్రశ్నించాడు.

దాంతో అతనికి బెదిరింపులు రావడం మొదలైంది. అప్పుడు అతను ఒక పిస్టల్ కొనుక్కున్నాడు. బీహార్లో ఆయుధాల వాడకం విపరీతంగా ఉంటుంది. ఆత్మరక్షణ కోసం పిస్తోలు పెట్టుకోవడం అక్కడ సర్వసాధారణమే. అక్కడ భూస్వాముల దగ్గర పెద్ద పెద్ద తుపాకీలు ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు అది సమస్య కాదు. కానీ సామాన్యుల దగ్గర, అందులోనూ ప్రశ్నించేవారి దగ్గర ఉండడం అనేది సమస్య.

కుల పరంగా చూస్తే ఇతను బ్రాహ్మణుడు.  బహుశా దేశవ్యాప్తంగా ఇలా నిరసనలు రావడానికి అది కూడా ఒక కారణం కావచ్చు అని కొంతమంది అంటున్నారు.

ఇతను ఒక పేద బ్రాహ్మడు అని అతని వీడియోలు చూస్తే అర్థమవుతుంది. కనీసం ప్లాస్టరింగ్ కూడా లేని ఇంటి ఇటుకలు కనబడుతున్నాయి. బహుశా వరదల్లో ఇల్లు కొట్టుకుపోయిన తర్వాత తాత్కాలికంగా కట్టుకున్నది కావచ్చు. సరిగా కిటికీలు, తలుపులు కూడా లేవు.

ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా, పోలీసు ముట్టడి మధ్య కూడా వెనకడుగు వేయకుండా, ప్రజల సమస్యలను లైవ్ ద్వారా సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి వినిపించాడు, వ్యవస్థల్ని ప్రశ్నించాడు. లోపాలను ప్రజలకు ఎత్తి చూపాడు. పరిష్కారం కోసం పోరాడాడు. దోపిడీ శక్తులకు తలనొప్పిగా మారాడు.

“బీహార్ గవర్నమెంట్ నన్ను ఎన్కౌంటర్ లో చంపడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకు మీరు పని చేయలేదు? ఎందుకు అవినీతి ఉంది అని ప్రశ్నిస్తే మీరు వెంటనే దేశద్రోహులు అయిపోతారు. మీరు కొంతమందికి శత్రువులు కూడా అయిపోతారు. అందుకే ఆయుధం చేతబట్టక తప్పలేదు. భగత్ సింగ్ ఆనాడే కాదు ఈనాడూ ఉన్నాడు” అని భరత్ ఒక వీడియోలో అంటాడు.

సోషల్ మీడియాలో అతని పోస్టుల గురించి ప్రశ్నించడానికి పోలీసులు అతని ఇంటికి వెళ్లినప్పుడు భరత్ ఇంట్లో లేడు. భరత్ పిస్తోలు పట్టుకొని ఊరంతా తిరుగుతున్నాడు అని పోలీసులకు తెలిసి మర్నాడు మళ్ళీ వెళ్ళారు.

మర్నాడు పోలీసులు వచ్చినప్పుడు ఎదురెదురుగా నిలబడ్డారు. తన డిమాండ్లను అంగీకరిస్తే లొంగిపోతానని చెప్పాడు. వాటిలో  ఒక్కటీ వ్యక్తిగత డిమాండ్ లేదు. ఈ అవినీతిని అంతం చేయాలన్నాడు.

 పోలీసు అధికారి అందుకు అంగీకరించడంతో ఒక తూటాను గాలిలోకి పేల్చి పోలీసులకు కొద్ది గజాల దూరంలోనే తన తుపాకిని విసిరేశాడు. పరిగెత్తుకు వచ్చిన పోలీసులు ఆ తుపాకిని స్వాధీనం చేసుకొని జీపు దగ్గరగా తీసుకు వెళ్ళి నిరాయుధుడుగా ఉన్న భరత్  కాళ్ళ మీద అతని కాళ్ళ మీద  మూడు రౌండ్లు కాల్చారు. (ఇదంతా భారత్ వీడియోలో రికార్డు అయింది. సోషల్ మీడియాలో ప్రసారమైంది)

“ఈ పోలీసులు నన్ను పిచ్చివాడినని నిరూపించాలనుకుంటున్నారు. భగత్ సింగ్ సమాజం కోసమూ, దేశం కోసం పోరాడుతున్నప్పుడు, అతన్ని కూడా పిచ్చివాడని ప్రకటించారు” అని అతను అంటున్నట్లుగా ఆ వీడియోలో వినిపిస్తుంది

 భరత్  ని జీప్ లో వేసుకొని ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ కి ఆ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ కి తిప్పుతూ తిప్పుతూ చివరికి పాట్నా లో ఆసుపత్రికి తీసుకెళ్ళేటప్పటికి అతను చనిపోయాడు అని డాక్టర్లు చెప్పారు. అయితే అప్పటికి అతని ఛాతీలో రెండు తూటాలు అదనంగా ఉన్నాయి.

“ఎన్‌కౌంటర్‌కు ఒక రోజు ముందు, అంటే 2026 జూన్ 16 నాడు ఉదయం పోలీసులు భరత్ ఇంటికి వచ్చి, గదులను సోదా చేసి, మమ్మల్నందరినీ చంపేస్తామని బెదిరించారు. ఆత్మరక్షణ కోసం పిస్టల్ కొనుక్కున్న భరత్, ఆందోళనగా బయటకు వచ్చి, వారిపై ఆయుధాన్ని గురిపెట్టి, వెళ్లిపోమని చెప్పాడు” అని తల్లి ఆశా వివరించింది. వాళ్ళు మళ్ళీ అర్ధరాత్రి తిరిగి వచ్చారని కూడా ఆమె ఆరోపించింది.

“పైకప్పు మీద నిద్రిస్తున్న భరత్, చీకట్లో దొంగచాటుగా వచ్చినందుకు వారిని మందలించి, పగటిపూట తిరిగి రమ్మని చెప్పాడు. మరుసటి రోజు, ఉదయం  స్థానిక పోలీసులు, భోజ్‌పూర్ ఎస్‌టిఎఫ్ బెటాలియన్ పోలీసులు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లతో తిరిగి వచ్చి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు” అని ఆమె వివరించింది.

తివారీ పెట్టిన డిమాండ్లను నెరవేరుస్తామని పోలీసులు చెప్పారని, “ఏ సమస్యలు పరిష్కరించాలో చూపించడానికి తమతో పాటు రమ్మని వారు అతడిని అడిగారు” అని తివారీ తమ్ముడు చందన్ చెప్పాడు.” అతడిని పొలంలోకి తీసుకెళ్లి కాల్చి చంపారు. మేము వారి వెంట వెళ్లాలని  ప్రయత్నిస్తే మమ్మల్ని రానివ్వలేదు. ఆయుధాల చట్టం కింద అతడిని అరెస్టు చేస్తారని మేము అనుకున్నాం. అతడిని అంత నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతారని మేము ఎప్పుడూ ఊహించలేదు” అని అతను ఆవేదన చెందాడు.

మొత్తం ఊరు మాత్రమే కాదు చుట్టుపక్కల అంతటి నుంచి  మృతదేహంతో సహా  హైవే మీద నిరసన తెలియచేసారు.

జూన్ 16,  17 తేదీలలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కార్యాలయం విడుదల చేసిన రెండు పత్రికా ప్రకటనలలో భోజ్‌పూర్ పోలీసులు రెండు వేర్వేరు వివరణలు పలు అనుమానాలకు దారితీసాయి.

నివేదికల ప్రకారం, జూన్ 16న జారీ చేసిన ప్రకటనలలో ఒకదానిలో, ఒక వ్యక్తి ఆయుధంతో తిరుగుతున్నాడని షాహ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, అతను వాస్తవానికి మానసికంగా అస్థిరంగా ఉన్నాడని తరువాత పోలీసులు తెలిపారు. అతడిని మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించడానికి ప్రయత్నాలు జరిగాయని, అలాగే అతని వద్ద నుండి ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ ప్రకటనలో ఇంకా పేర్కొన్నారు.

అయితే, ఆరోపిత బూటకపు ఎన్‌కౌంటర్ జరిగిన మరుసటి రోజు, జూన్ 17న ఉదయం 9 గంటల ప్రాంతంలో భరత్ భూషణ్ తివారీ అనే వ్యక్తి పిస్టల్ ప్రదర్శిస్తూ గాలిలోకి కాల్పులు జరుపుతున్నాడని పోలీసులకు సమాచారం అందిందని పేర్కొంటూ పోలీసులు మరో ప్రకటనను విడుదల చేసినట్లు సమాచారం.

ఆ ప్రకటనలో, తాము భోజ్‌పూర్ ఎస్‌టిఎఫ్ బృందంతో కలిసి అతడిని లొంగిపోవాలని కోరినట్లు, అయితే అతను తన చేతిలో ఉన్న పిస్టల్‌తో పోలీసులపై ఎడతెరిపి లేకుండా కాల్పులు కొనసాగించాడు. పోలీసు బృందం ప్రాణాలకు, భద్రతకు ముప్పు ఉందని గ్రహించిన వారు, ఆ వ్యక్తిని సమీపించేందుకు ప్రయత్నించగా, ఆ వ్యక్తి పోలీసులపై కాల్పులు జరిపాడని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. “దీనికి ప్రతిస్పందనగా, పోలీసు బృందం ఆత్మరక్షణ కోసం, ప్రజలను రక్షించడం కోసం కాల్పులు జరిపింది, ఈ క్రమంలో ఆ వ్యక్తి కాలికి బుల్లెట్ తగిలింది. ఆ వ్యక్తి పాట్నాలోని పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించాడు. తదుపరి చర్యలు తీసుకుంటున్నారు” అని అందులో తెలిపారు.

అయితే, మరణించిన వ్యక్తి తన పిస్టల్‌ను విసిరేసి పోలీసుల ముందు లొంగిపోతున్నట్లుగా ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, పోలీసులు చెప్పిన దానిపై చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

” అతని నివాసానికి వెళ్లినప్పుడు, విస్తృతంగా ప్రచారంలో ఉన్న వీడియోలలో కనిపించిన వ్యక్తి ‘మానసికంగా అస్వస్థుడు’ అని అధికారులు కనుగొన్నారు” అని, ” సురక్షితంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించి అతడిని మానసిక ఆసుపత్రికి పంపే ప్రక్రియ ప్రారంభించాము” అని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించాడు.

ఒకవేళ ఎన్‌కౌంటర్ అవసరమైతే, సగం (హాఫ్) ఎన్‌కౌంటర్ జరిపి ఉండాల్సిందని బీహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారీ అంటున్నాడు. ఈ సగం ఎన్‌కౌంటర్ అంటే ఏమిటి? ఆ పిల్లాడు సోషల్ మీడియాలో కూడా అనుచితంగా ప్రవర్తించాడు. ముందుగా భరత్ నేర చరిత్రను నిర్ధారించుకోవాల్సిందని,  ఆ తర్వాత అవసరమైతే, సగం ఎన్‌కౌంటర్ జరిపి ఉండవచ్చు అని మంత్రి అంటున్నాడు..  

అంటే పూర్తి ఎన్‌కౌంటర్ సరియైనది కాదని, సగం ఎన్‌కౌంటర్ సరియైనది అని అన్యాపదేశంగా చెబుతున్నాడు. అంటే మిథిలేష్ తివారీ భరత్ తివారీ ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తున్నాడు.

పెరుగుతున్న ఒత్తిడికి ప్రతిస్పందనగా, బీహార్ పోలీసులు 2026 19 జూన్ న, ఎన్‌కౌంటర్ సమయంలో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్, సబ్-ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌తో సహా నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. జూన్‌ 20న, బీహార్ ప్రభుత్వం పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ఒక స్వతంత్ర న్యాయ విచారణను ప్రకటించింది

పాట్నా హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిఐఎల్) దాఖలయ్యాయి.

ఒక మనిషిని చంపిన, ఒక బూటకప్ ఎన్కౌంటర్ చేసిన ఏ ఒక్క పోలీస్ అయినా జైల్ కి వెళ్ళాడా? ఇప్పుడే కాదు మొత్తం దేశంలోనే ఇప్పటివరకు జరిగిన ఏ బూటకప్ ఎన్కౌంటర్ లో కూడా ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా జైలుకి వెళ్ళలేదు. (2020లో సాతన్‌కుళంలో వ్యాపారి పి. జయరాజ్, అతని కుమారుడు జె. బెనిక్స్‌లను చిత్రహింసలకు గురిచేసి చంపిన కేసులో దోషులుగా తేలిన తొమ్మిది మంది పోలీసు అధికారులకు ఇటీవల మదురై కోర్టు విధించిన మరణశిక్షను ఒక అపవాదంగానే చెప్పుకోవాలి)

తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో అయితే అటువంటి వాళ్ళకు ప్రమోషన్లు కూడా వచ్చాయి. యక్సలరేటెడ్ ప్రమోషన్స్ అంటారు. మామూలుగా వచ్చేవి కాకుండా ఇలా ఎన్కౌంటర్లు చేయడం వల్ల వచ్చే అదనపు ప్రమోషన్లు అంటే మనుషులు చంపడం వల్ల డబుల్ ప్రమోషన్లను ఇచ్చే సంస్కృతి కూడా దేశంలో ఉంది. అట్లా పురస్కారాలు పొందిన పోలీసులను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని కూడా అంటారు.

మనుషులని చంపడంలో స్పెషలిస్ట్ అని వింటుంటే మనం ఎంత అనాగరక వ్యవస్థలో ఉన్నామా అని విచారమేస్తుంది.

ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో మావోయిస్టుల పేరుతో జరిగే హత్యలను నమోదు చేయడమే ఉండదు. ఎంతమందిని చంపేసినా ఎఫ్ఐఆర్ నమోదు కూడా నమోదు కాదు. అంతిమ తేదీలు పెట్టి మరీ చంపేయడం మన కళ్ల ఎదురుగా నడుస్తున్న చరిత్రనే.  

బీహార్‌లో జరిగిన ‘బూటకపు ఎన్‌కౌంటర్’ కేసులలో తివారీది మొదటిది కాదు. గతంలో  అనేక ‘బూటకపు ఎన్‌కౌంటర్లు’, ‘కస్టడీ మరణాలు’ చోటుచేసుకున్నాయి.  డిసెంబర్ లో గయాలోని బరచట్టిలో పోలీసులు వ్యాపారవేత్త రాజేష్ ధావన్‌ను, అతని ఇద్దరు ఉద్యోగులను హత్య చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆరుగురు పోలీసులకు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. ఆ తర్వాత  ఉత్తర బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలోని నాన్‌పూర్ గ్రామంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ జవాన్లు నక్సలైట్ నాయకుడు దయానంద్ మలకర్‌ను కాల్చి చంపారని ఆరోపణలు ఉన్నాయి. దీనిని రాష్ట్ర శాసన మండలిలోని ప్రతిపక్ష సభ్యులు ‘బూటకపు ఎన్‌కౌంటర్’ కేసుగా అభివర్ణించారు.

భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 34-44 కింద, గతంలో భారత శిక్షా స్మృతిలోని సెక్షన్లు 96-106 కింద పోలీసులు ఆత్మరక్షణ హక్కును వినియోగించుకునే సందర్భంలో మాత్రమే ప్రాణాంతకమైన బలాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. తమ ప్రాణాన్ని, ఇతరుల ప్రాణాన్ని, లేదా ఆస్తిని తక్షణ ముప్పు నుండి కాపాడుకోవడానికి బలం అవసరమైనప్పుడు ఇది వర్తిస్తుంది. చట్టం ప్రకారం అవసరమైన కనీస బలాన్ని మాత్రమే ఉపయోగించాలి.

ఒక వ్యక్తి లొంగిపోయిన తర్వాత, నిరాయుధుడైన తర్వాత, లేదా పోలీసుల అదుపులో ఉన్న తర్వాత, ప్రాణాంతక శక్తిని ప్రయోగించడానికి గల కారణం సాధారణంగా ముగిసిపోతుంది.

ఒక వ్యక్తి మానసికంగా అస్థిరంగా ఉన్నాడో లేదనే విషయంలో  పోలీసులు తుది నిర్ణయం తీసుకోవడానికి వీలులేదు.

ఒక వ్యక్తి మానసిక స్థితిని, అర్హత కలిగిన మనోవైద్యులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులచే వైద్య పరీక్ష, మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం-2017 ప్రకారం మదింపు, అవసరమైన చోట న్యాయ సమీక్ష ద్వారా నిర్ధారిస్తారు.

బూటకపు ఎన్‌కౌంటర్ల ఆరోపణలకు సంబంధించిన కేసులు తరచుగా న్యాయబద్ధమైన ప్రక్రియ, మానవ హక్కులు, చట్ట అమలు, రాజ్యాంగ రక్షణల మధ్య సమతుల్యత గురించి ప్రశ్నలను లేవనెత్తుతాయి.

పోలీసులు- కుటుంబ సభ్యులు ప్రజలు చెబుతున్న కథనాల మధ్య ఉన్న వైరుధ్యం, స్వతంత్ర దర్యాప్తు ఎందుకు అత్యవసరమో స్పష్టం చేస్తుంది. కేవలం పరస్పర విరుద్ధమైన ఆరోపణలు లేదా భావోద్వేగపూరిత విజ్ఞప్తుల ద్వారా న్యాయం లభించదు. అది ధృవీకరించదగిన సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్ పరీక్ష, సాక్షి వాంగ్మూలం, న్యాయ పర్యవేక్షణపైన ఆధారపడి ఉండాలి.

భరత్ తివారీ నిజంగా తక్షణ ముప్పును కలిగించారా లేదా, పోలీసులు నిర్ధారిత కార్యాచరణ విధానాలను అనుసరించారా లేదా, ప్రాణాంతక బలప్రయోగం అనుపాతంగా ఉందా లేదా,  కాల్పులకు ముందే లొంగిపోవడం నిజంగా జరిగిందా లేదా, రాజ్యాంగపరమైన రక్షణలు, చట్టబద్ధమైన విధానాలు పాటించబడ్డాయా లేదా అనే అంశాలను న్యాయ విచారణ ఈ క్రింది అంశాలను పరిశీలించాల్సి ఉన్నది. రాజ్యాంగ దృక్పథం ప్రకారం పరిశీలిస్తే కనక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి జీవించే హక్కుకు, వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇవ్వబడింది. ఈ రక్షణ సామాజిక హోదా, రాజకీయ అనుబంధం లేదా నేరారోపణలతో సంబంధం లేకుండా ప్రతి పౌరునికి వర్తిస్తుంది.

చట్టం ద్వారా స్థాపించబడిన విధానం ప్రకారం తప్ప, రాజ్యం ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయజాలదని భారత సుప్రీంకోర్టు పదేపదే స్పష్టం చేసింది. ఈ రాజ్యాంగ సూత్రమే భారత ప్రజాస్వామ్యానికి పునాది.

తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కూడా కొన్ని విడదీయరాని హక్కులు ఉంటాయి. అరెస్టు, దర్యాప్తు, విచారణ, దోషిగా నిర్ధారించడం, శిక్ష విధించడం అనేవి నేర న్యాయ వ్యవస్థలో చట్టబద్ధంగా గుర్తించబడిన క్రమం. ఈ ప్రక్రియ నుండి ఏమాత్రం విచలనం జరిగినా, అత్యంత కఠినమైన న్యాయ సమీక్ష అవసరం.

అందువల్ల, పోలీసు ఎన్‌కౌంటర్ మరణానికి దారితీసినప్పుడు, బలప్రయోగం అవసరమని, చట్టబద్ధంగా సమర్థనీయమని నిరూపించాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలపైన ఉంటుంది.

ప్రతి ప్రజాస్వామ్యం చివరికి, అది తన అత్యంత శక్తివంతమైన పౌరులతో ఎలా వ్యవహరిస్తుందనే దాని ద్వారా కాకుండా, రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి హామీ ఇవ్వబడిన హక్కులను ఎంత విశ్వసనీయంగా నిలబెడుతుందనే దాని ద్వారానే అంచనా వేయబడుతుంది.

సాక్ష్యం చివరికి ఎటు దారితీసినా, ఒక సూత్రం మాత్రం రాజీపడలేనిదిగా ఉండాలి. బలప్రయోగంపైన చట్టబద్ధమైన పాలన తప్పక గెలవాలి.

భరత్ తివారీ కేసు చట్టపరంగా చివరికి ముగుస్తుంది. అయినప్పటికీ, జవాబుదారీతనం, పారదర్శకత, రాజ్యాంగబద్ధమైన పాలన పట్ల భారతదేశ నిబద్ధతను ఇది బలోపేతం చేస్తుందా లేదా అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అంతిమంగా, చరిత్ర గుర్తుంచుకునే ప్రశ్న ఇదే.

****

Leave a Reply