(విప్ల‌వోద్య‌మాల ఆటుపోట్ల‌ను త‌ట్టుకోవాలంటే,  విప్ల‌వం పేరుతోనే త‌లెత్తే రివిజ‌నిజాన్ని ఎదుర్కోవాలంటే చ‌రిత్ర‌ను చ‌ద‌వాలి..   సామాజిక పురోగ‌మ‌నానికి ఇరుసులాంటి వ‌ర్గ‌పోరాటాన్ని అర్థం చేసుకోవాలంటే చ‌రిత్ర అధ్య‌య‌నం త‌ప్ప‌నిస‌రి అని ఈ వ్యాసంలో కా. కెవిఆర్ వివ‌రించారు. ప్ర‌స్తుత సామాజిక‌, రాజ‌కీయ సంద‌ర్భంలో ఈ వ్యాసం అవ‌స‌రం రీత్యా ఈ శీర్షిక కింద పున‌ర్ముద్రిస్తున్నాం… వ‌సంత‌మేఘం టీం)

“విప్లవ సిద్ధాంతం, చారిత్రక పరిజ్ఞానం, కార్యాచరణలో పట్టు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా విప్లవోద్యమం నడపలేదు” మార్క్సిస్టు ` లెనినిస్టు సిద్ధాంతాలను మనసు పెట్టి పఠించాల్సిన అవసరం ఎంతైనా వుంది. వాటిని పరిశీలించాలి. పరిశోధించాలి. అంతేకాదు పార్టీ సభ్యులందరూ దేశ, విదేశ చరిత్రలు తెలుసుకోవాలి. విప్లవ పార్టీ విజయాలు చారిత్రక అవగాహనమీదే ఆధారపడివుంటాయి. ప్రపంచ విప్లవం గొప్పగా అభివృద్ధి చెందుతున్న దశలో, ప్రపంచ చరిత్ర పఠనం సామ్యవాద విప్లవానికి ఎంతో తోడ్పడుతుంది.

ప్రపంచ పరిస్థితి లక్షణాలుః

ఇవాళ మనం వుంటున్న యుగం “ప్రపంచ పరివ్యాప్తంగా సాంఘిక వ్యవస్థ తీవ్రమైన మార్పులకు లోనవుతున్న సంచలనాత్మక యుగం.” దేశాలు స్వాతంత్య్రాన్ని, జాతులు విముక్తిని, ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు. ఇది ఆపశక్యంకాని చారిత్రక ప్రవాహం. రెండు అగ్రరాజ్యాలు ప్రపంచాన్ని అదుపుచేసే కాలం దాటిపోయింది. ఇలాంటి యుగంలో నివసిస్తున్న మనం పోరాటాలకు తయారుగా వుండాలి. ఈ పోరాటాల రూపాలు గతంలో జరిగినవాటికి భిన్నమైనవి.

మన విప్లవ కర్తవ్యాలు ప్రపంచ ప్రజల విప్లవ పోరాటాలతో ముడిపడి వున్నాయి. ప్రపంచాన్ని మనం హృదయానికి హత్తుకోవాలంటే ముందు దాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేటి ప్రపంచం నిన్నటి ప్రపంచం నుంచి మొగ్గదొడిగిందే. వర్గపీడనకు, విదేశీ దురాక్రమణకు, వలసపాలనకు వ్యతిరేకంగా చిరకాలం నుంచి ప్రపంచ ప్రజలు పోరాడుతున్నారు. ఇవాళ సామ్రాజ్యవాదానికి, దాని తొత్తులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు కూడా వాటి కొనసాగింపే.  ప్రపంచ చరిత్ర మనకు ఒకందుకు తోడ్పడుతుంది. గతంలో దాని తీరుతెన్నులను తెలుసుకుని, అనుభవాలు నేర్చుకుంటే నేటి ప్రపంచపు ప్రత్యేక లక్షణాలు మరింత బాగా తెలుసుకోవచ్చు. అందువల్ల శ్రామిక విప్లవ విజయంపైన మన నమ్మకం బలపడుతుంది. శ్రామికవర్గ అంతర్జాతీయ చైతన్యం పెరుగుతుంది. దేశదేశాల ప్రజలకు మధ్య తోడ్పాటు పెంపొంది విప్లవ పోరాటాలు, తద్వారా ప్రపంచ విప్లవం ముందుకుపోతాయి.

“సకలలోక సంచలనం” అనేది నేటి ప్రపంచపు ప్రత్యేక లక్షణం. ఈ సంచలనానికి వర్గ స్వభావం వుంది. ప్రపంచంలోవున్న వైరుధ్యాలు మరింత తీవ్రమైనాయి. ఇది మంచా చెడా  అంతర్జాతీయ పరిణామాలను ఎలా మదింపువేయాలి  పాత వ్యవస్థను కూలదోసి కొత్త వ్యవస్థను నెలకొల్పడం అనేది హృదయాలను కదలించే వర్గ పోరాటాల ద్వారానూ, పునాదులు పెకలించే పెనుమార్పుల ద్వారానూ మాత్రమే సాధ్యం. ప్రపంచ చరత్ర చదివితే ఈ సంగతులు మనకు తేటతెల్లం అవుతాయి. రోమన్ సామ్రాజ్యంలో బానిసల తిరుగుబాట్లు, అంతర్యుద్ధాలు చాలా పరిపాటి. వీటన్నిటి ఫలితంగానే బానిస విధానం నేలమట్టమయింది. దాదాపు రెండువందల ఏళ్ళపాటు యూరప్, అమెరికాల్లో జరిగిన బూర్జువా విప్లవాలే భూస్వామ్య విధానానికి గోరీకట్టాయి.

మార్క్సిజం పుట్టి నూరేళ్లు పైచిలుకయింది. ప్రపంచ రంగం మీదికి శ్రామికవర్గం వచ్చింది. బూర్జువా విధానాన్ని దోపిడీవర్గాలను కూలదోయడానికి విప్లవపోరాట పరంపరలు ప్రపంచాన్నే కుదిపివేస్తున్నాయి. అందుకని సకలలోక సంచలనం అనేది ఈనాడు సర్వసాధారణ లక్షణం. చారిత్రక పరిణామ సూత్రాలూ ఈమాటే చాటి చెబుతున్నాయి. విప్లవ శక్తులకు, విప్లవ ప్రతిఘాత శక్తులకు మధ్య జరుగుతున్న జీవన్మరణ పోరాట ప్రతిబింబమే నేటి ప్రపంచ సంచలనం. ఈ సంచలనం వల్లనే సామ్రాజ్యవాదుల పాత ప్రపంచం కూలి పోతోంది. సరికొత్త సామ్యవాద జగత్తు పురోగమిస్తోంది.

సామాజిక అభివృద్ధి సూత్రాల ఆకళింపు:

“వర్గాలు పోరాడతాయి కొన్ని వర్గాలు గెలుస్తాయి. మరికొన్ని రూపుమాసిపోతాయి. వేలాది ఏళ్ళనించి ఇదే మానవజాతి చరిత్ర”. ప్రపంచ చరిత్ర చదివితే మానవ సమాజ అభివృద్ధి సూత్రాలు, విశ్వవ్యాప్తంగా జరిగిన వర్గపోరాటాల చరిత్ర గతి మనం ఆకళింపు చేసుకుంటాం. అలా తెలుసుకోవడం వల్ల ఇప్పటి వర్గపోరాటాల్లో మన చొరవ మరింత పెరుగుతుంది. ఇంటా బయటా కూడా పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదం – వీటి అన్యాయాలతో అక్రమాలతో నిండివుంది ఆధునిక ప్రపంచ చరిత్ర. దోపిడీకి, దురాక్రమణకు, పీడనకు వ్యతిరేకంగా విప్లవ ప్రజానీకం వీరోచితంగా పోరాడుతున్నారు. సుదీర్ఘ పోరాట క్రమంలో పెట్టుబడిదారీ విధానం, వలస విధానం, సామ్రాజ్యవాదం ఆనాటికానాడు క్షీణిస్తున్నాయి. బడుగుదేశాల ప్రజలు, వలస ప్రజానీకం, విప్లవ ప్రజానీకం మనుముందుకు సాగిపోతున్నారు. ఒకప్ప్పుడు బాగా వెలిగిన ఏ వలస సామ్రాజ్యాన్ని చూసినా – అది జారిస్టు రష్యా కానివ్వండి, ఫాసిస్టు జర్మనీ కానివ్వండి, క్రుంగికృశించిపోయిన ఆంగ్ల సామ్రాజ్యం కానివ్వండి – చారిత్రక అభివృద్ధి సూత్రం కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం ఓడిపోవడం, సామ్యవాదం గెలవడమనేది చారిత్రక అభివృద్ధి సూత్రం.

19వ శతాబ్దంలో తెల్లవాడు తన నౌకాబలంతో సముద్రాధినేత అయ్యాడు. వారి దర్పానికి తిరుగులేదు, ఎదురులేదు. అదిరింపులతో, బెదిరింపులతో, పెత్తందారీ రాజకీయాలతో ఐదు ఖండాలకు వ్యాపించింది రవి ఆస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం, కాని పెట్టుబడిదారీ విధానంలో అంతర్గతంగా వున్న వైరుధ్యాలను పరిష్కరించలేకపోగా వాటిని మరింత పెంచింది. శ్రామిక సామ్యవాద విప్లవం వలన ప్రజల విముక్తి ఉద్యమాలు ` వీటి ధాటికి బ్రిటిష్ సామ్రాజ్యవాదం పతనమైంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదం పెరుగుదల, విరుగుదల కూడా ఆధునిక సామ్రాజ్యవాదం, సోషల్ సామ్రాజ్యవాదాలను అర్థం చేసుకోడానికి పనికి వస్తాయి. ప్రపంచం అంతటా వ్యాపించి ఇవాళ రెండు అగ్రరాజ్యాలూ రెండు భూతాల్లా కనిపిస్తున్నాయి. కాని ఆ భూతాలు ప్రజావిప్లవం అనే అగ్నిపర్వతం మీద కూర్చున్నందున సంక్షోభంలో కూరుకుపోయాయి. బ్రిటిష్ సామ్రాజ్యంలాగానే అవికూడా అస్తమిస్తాయి.

విప్లవ శక్తులు ప్రపంచమంతటా వ్యాపించి, వృద్ధి చెందుతూంటే సామ్రాజ్యవాదం కూలిపోతుంది. ప్రజల విప్లవశక్తులు మొదట్లో అంతంత మాత్రంగానే వున్నా అవి అజేయమే. ఎందుకంటే అవి చారిత్రక అభివృద్ధికి ప్రాతినిధ్యం వహిస్తాయి. చిన్నవి, పెద్దవిగానూ, బలహీనమైనవి బలవత్తరంగానూ రూపొందుతాయి. ఎన్ని ఒడిదొడుకు లెదురైనా అవి చివరికంటా పోరాడుతాయి. చిన్నదేశం పెద్దదేశాన్ని, బడుగుదేశం అగ్రరాజ్యాన్ని ఓడించగలవనడానికి ఎన్నో తార్కాణాలున్నాయి. చైనా విప్లవం, అల్బేనియా విప్లవం, అమెరికా సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా కొరియా ప్రజాయుద్ధం, జాతీయ విముక్తి కోసం జరిగిన లావోస్, కాండోడియా, వియత్నాం యుద్ధాలు ` గత చరిత్రలో కూడా ఈ సత్యం ఎన్నోసార్లు నిరూపితమైంది. 1775 -1783 అమెరికా స్వాతంత్య్ర యుద్ధం గురించి చూద్దాం. అప్పటికి ప్రపంచంలోని అత్యున్నతమైన పారిశ్రామిక దేశం అయిన ఇంగ్లాండు జనాబా 3 కోట్లు. 30 లక్షల జనాభా కలిగిన అమెరికాకు, ఇంగ్లండు 90 వేల సైనిక పటాలాన్ని పంపింది. అమెరికా వాళ్ళ దగ్గర నాటు తుపాకులు, చిన్నచిన్న గెరిల్లా దళాలు మాత్రమే వున్నాయి. మొదట్లో చాలారంగాల్లో అమెరికా ఓడిపోయింది. బ్రిటిష్‌వాళ్ళు చాలా ప్రాంతం ఆక్రమించారు. యూర‌ప్‌లోని అభ్యుదయశక్తుల ప్రోత్సాహంతో అమెరికా ప్రజలను సమీకరించి గెరిల్లా యుద్ధం మొదలెట్టి న్యాయసమ్మతమైన తమ స్వాతంత్య్ర యుద్ధాన్ని చివరకంటా కొనసాగించారు. దీర్ఘకాలిక యుద్ధాలలో బ్రిటిష్‌వాళ్లు పరాజయం పొందారు. అమెరికా స్వాతంత్య్రం పొందింది. ఇవాళ సామ్రాజ్యవాదానికీ, సోషల్ సామ్రాజ్యవాదానికీ వ్యతిరేకంగా పోరాడాలంటే సరైన విప్లవపంథా అవసరం. “తెగించి పోరాడాలి. కష్టాలను లెక్క చేయకూడదు. మునుముందుకు సాగిపోవాలి. అప్ప్పుడు ప్రపంచం అంతా ప్రజలదే. భూతాలన్నీ మట్టికొట్టుకుపోతాయి.”

అన్ని దేశాల ప్రజాపోరాటాల నుంచి పాఠాలు నేర్చుకోవడం

విప్లవ పోరాటాల్లో అన్ని దేశాల ప్రజలు ఒకరికొకరు తోడ్పడుతూ వచ్చారు. చైనా, ఇతర ఆసియా దేశాల ప్రజలు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల ప్రజలు అందరూ కూడా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒకేరకంగా పోరాడారు. చరిత్ర చదివితే ఆ సంగతి మనకు బాగా తెలుస్తుంది. మనం శ్రామిక అంతర్జాతీయ కర్తవ్యాన్ని నెరవేర్చి వలస దేశాల ప్రజల న్యాయమైన పోరాటాలకు తోడ్పడడం ద్వారా విప్లవ పంథా ననుసరించాలి.

నాగరికత పుట్టి పెరిగింది ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు తమతమ ప్రాచీన నాగరికతా వైభవాల మూలంగా మానవజాతి అభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి. 15వ శతాబ్దంలో పాశ్చాత్య రాజ్యాల దండయాత్రల వల్ల ఈ ఖండాల్లో చాలా ప్రాంతాలు వలస పాలనకు, బానిసత్వానికి, పచ్చి దోపిడీకి గురయ్యాయి. బానిస వ్యాపారం, ఇతర దోపిడీ విధానాల మూలంగా ప్రాచీన నాగరికతకు, సౌందర్యానికి, సౌభాగ్యానికి నిలయమైన ఆఫ్రికా ఖండం ‘చీకటి ఖండం’గా మారిపోయింది. నాలుగు శతాబ్దాలపాటు యధేచ్ఛగా సాగిన దోపిడీ మూలంగా ఆఫ్రికా జనాభా 10 కోట్లు తరిగిపోయింది. ఆఫ్రికా నీగ్రోలను పాపకూపాల్లోకి విసిరి పారేసి చైనా నుంచి కూలీలను నౌకలమీద అమెరికా పట్టుకుపోయారు. ఆఫ్రికా నీగ్రోల్లాగా, అమెరికా పాటక జనంలాగా చైనా ప్రజలు కూడా చాలా హీనంగా, దీనంగా బ్రతికి తమ చెమట, నెత్తురు ధారపోశారు. పీడన వున్న చోట ప్రతిఘటన వుండి తీరుతుంది. పాశ్చాత్య వలస పెత్తందార్లకు వ్యతిరేకంగా భుజం భుజం కలిపి పోరాడి నెత్తుటి నీరాజనాలతో నెచ్చెలులయ్యారు. చైనా తైపాంగ్ విప్లవాన్ని అణచి వేసిన తెల్లవాడు పచ్చి బందిపోటు, కటిక కసాయి. ఆఫ్రికా వెళితే వీడిని కొడాన్ ప్రజలు ఖతంచేశారు. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల ప్రజలు సోదరులు, సహోదరులు, కాలులో కాలు, వేలులో వేలుగా కలిసిపోయారు. కష్టసుఖాలు పంచుకున్నారు. ఇప్ప్పుడు వీళ్ళదే పైచేయి. దీన్నే మూడో ప్రపంచం అంటున్నాం.

పరస్పరం నేర్చుకోవడం అనేది నేటి చారిత్రక దశలో చాలా అవసరం. కోట్లాది పీడిత ప్రజలే చరిత్రను, సమాజాన్ని, సంస్కృతిని ముందుకు నడిపారు. మానవజాతి హక్కుల సంస్కృతీ నిర్మాతలు, వారసులు, చరిత్ర అధినేతలు, సామాన్యజనులే. చిన్న దేశమైనా, పెద్ద దేశమైనా ప్రజలు మానవజాతి అభివృద్ధికి దోహదం చేశారు. తప్ప్పులు ఒప్ప్పులు దొర్లినా ఒకరి నుండి మరొకరు గుణపాఠాలు నేర్చుకున్నారు. ఇతర దేశాలతో స్నేహ సంబంధాల వల్ల ప్రజలు ఎన్నో అమూల్యమైన విషయాలు నేర్చుకుంటారు. తద్వారా తమ దేశ సంస్కృతిని కూడా పెంపొందించుకో గలుగుతారు. శ్రామికవర్గం అన్ని విషయాల్లో కూడా మార్క్సిస్టు వైఖరినే అలవరచుకోవాలి. విదేశాలను గుడ్డిగా అనుకరించడం, బానిస మనస్తత్వం ఎంత మాత్రం పనికిరానివి. అదే విధంగా విదేశాలనుంచి మంచి విషయాలు నేర్చుకోవడానికి నిరాకరించడం కూడా మూర్ఖత్వం, దురహంకారం అనిపించుకుంటుంది. గతం వర్తమానానికి, విదేశీ సంగతులు, స్వదేశాలకు  ఉపకరించాలనేదే సరైన అవగాహన.

మార్క్సిస్టు సిద్ధాంత అధ్యయనం:

ప్రపంచ చరిత్ర చదివితే మార్క్సిజం  మనకు మరింత బాగా అర్థమవుతుంది. అందుకే అన్నాడు లెనిన్ ` “గొప్ప తాత్వికదృష్టి, ప్రపంచ చారిత్రక పరిజ్ఞానం ` వీటి మేళవింపే మార్క్సిజం. ప్రపంచ చరిత్ర పరిజ్ఞానం లేకపోతే మనకు మార్క్సిస్టు  మహోపాధ్యాయుల సిద్ధాంతాలు, వర్గ సంఘర్షణల పునాది, కాలమాన పరిస్థితులు, విప్లవం ఇత్యాదులు అర్థంకావు. నిర్దిష్ట చారిత్రక పరిస్థితులను సత్యాలను చూసి వాటిని లోతుగా పరిశీలించడం ద్వారానే మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాలు రాయగలిగారు. ‘ఫ్రాన్సులో అంతర్యుద్ధం’ అన్న పుస్తకం మార్క్స్  అలా రాసిందే. అందులో పారిస్ క‌మ్యూన్  నాటి నుంచి శ్రామిక విప్లవం, శ్రామిక నియంతృత్వం మున్నగు చారిత్రక అనుభవాల గురించి, మార్క్సిస్టు సిద్ధాంతాన్ని సుసంపన్నం చేశారు. అలాగే ఎంగెల్స్ పుస్తకం “కుటుంబం, ఆస్తి, ప్రభుత్వ పుట్టుపూర్వోత్తరాలు”, ఆదిమ సమాజం తీరుతెన్నులు, మానవ సమాజపు అభివృద్ధి క్రమం అందులో ఎంగెల్స్ చాలా గొప్పగా చిత్రించాడు. ప్రపంచ చరిత్ర చదివితేనే ఇవన్నీ మనకు మరింత బాగా బోధపడతాయి.

చైనా విప్లవంపైన మావో రచనలు అర్థం చేసుకోవాలన్నా మనకు ప్రపంచ చరిత్ర తెలియాలి. ఇంటా బయటా చారిత్రక పరిస్థితులు సాకల్యంగా అర్థం చేసుకున్నాకనే చైనా విప్లవం గురించి మావో రాయగలిగాడు.“నిప్ప్పురవ్వే దావానలం రగిలిస్తుంది” అన్న మావో రచన చాలా గొప్పది. చైనాలో వర్గపోరాటం, ప్రపంచంలోని వివిధ వైరుధ్యాలు వీటిని బాగా పరిశీలించి శాస్త్రీయ నిర్ణయాలకు రాగలిగాడు మావో. చైనా విప్లవం తథ్యం అని ఎంతో నమ్మకంగా చెప్పగలిగారు మావో. లీషావ్ చీ మొదలైన నిరాశాపరులు ‘ఎర్రజెండాను మనం నిలబెట్టగలం’ అని గొణుగుతూ వుండే వాళ్ళు. మావో, వాళ్ళ సిద్ధాంత అవగాహనలోని లోపాలను తూర్పారబట్టి, బాగా ఎండేశాడు. మావో అంచనా ప్రకాం “1927లో చైనా అర్ధవలస దేశం. దాన్ని కబళించాలని సామ్రాజ్యవాద దేశాలు పోటీపడుతున్నాయి”. ఈ సంగతి అవకాశవాదులు గ్రహించలేకపోయారు. మావో రచన మనం లోతుగా అర్థం చేసుకోవాలంటే అనాటి ప్రపంచ పరిస్థితి, సామ్రాజ్యవాద దేశాల మధ్య పోటీ, చైనా పార్టీలో రెండు పంథాల మధ్య పోరాటం ఇవన్నీ, అవగతం చేసుకోవాలి. ప్రపంచ క‌మ్యూనిస్టు ఉద్యమ అనుభవాలను సంతరించుకుని వాటిని క్రోడీకరించి, మార్క్సిజం- లెనినిజాన్ని మరింత వృద్ధి చేశాడు మావో. మావో సిద్ధాంతం తెలుసుకోవాలంటే అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర చదవడం అవసరం.

చిరకాలం నుంచీ కూడా పేరుపడ్డ విద్రోహులు బెర్నస్టీన్, కాట్క్సీ, ట్రాట్క్సీ,  కృశ్చేవ్, బ్రేజ్నేవ్, వాంగ్‌మింగ్, లీషావ్‌చీ మార్క్సిజం – లెనినిజాన్ని సవరించాలనే వంకతో, సామ్రాజ్యవాదుల కొమ్ముకాసి మార్క్సిస్టు- లెనినిస్టు గ్రంథాలకు వక్ర భాష్యాలు చెప్పి ఆ విప్లవ సిద్ధాంతాన్ని నీళ్ళు గార్చి బూర్జువాలకు అనుకూలంగా మలిచారు.

సరైన మార్క్సిస్టు  పంథాకు, అవకాశవాద పంథాకు చైనా పార్టీలో జరిగిన ఆంతరంగిక పోరాటాన్ని మావో క్రోడీకరించి చెప్పాడు. “ప్రస్తుత పరిస్థితిని అశ్రద్ధ చేయడం. చరిత్ర అధ్యయనాన్ని అశ్రద్ధ చేయడం మార్క్సిజం లెనినిజంను అమలుపరచలేకపోవడమే.” ప్రజలు అదుపు చేయకుండా వదిలేస్తే క‌మ్యూనిస్టు పార్టీ స్వభావం పూర్తిగా మారిపోతుంది. పార్టీ సభ్యులు తమ చారిత్రక బాధ్యతను నిర్వహించలేరు. చెడు పంథాకు ప్రతినిధిగా చైనా కమ్యూనిస్టు పార్టీలో లీషావ్‌చీ మొదలైన వాళ్ళు తలెత్తారు. వాళ్ళను మనం దుయ్యబట్టాలి. పరిస్థితులను సవ్యంగా అర్థం చేసుకోవాలి. చరిత్ర చదివి మార్క్సిజం – లెనినిజంను అమలుపరచాలి. ఇంటా బయటా కూడా విప్లవ పోరాట వాస్తవాలను పరిశీలించాలంటే సిద్ధాంత అధ్యయనం చరిత్ర అధ్యయనం కూడా అవసరం.

వర్గపోరాటాన్ని ఆకళింపు చేసుకోవడం:

కొన్నివేల ఏళ్ళుగా, ఎన్నో సంఘటనలతో నిండి, మరెన్నో చిక్కులతో కూడి వున్న ప్రపంచ చరిత్రను అధ్యయనం చేయడమంటే మాటలా  అందుకే లెనిన్ అన్నాడు- “మార్క్సిజం మనకు మార్గం చూపించింది. చరిత్ర చదివేటప్ప్పుడు మనం వర్గ పోరాటమే కీలకమని గుర్తించక పోయేటట్టయితే, మనకు సరైన అవగాహన వుండదు. మార్క్సిజం- లెనినిజం మావో ఆలోచనా విధానాన్ని మనం మార్గదర్శకంగా ఒప్ప్పుకుని వర్గపోరాటాన్ని గట్టిగా ఆకళింపు చేసుకుని చరిత్రలో అదే కీలకమైన లంకె అని గుర్తిస్తేనే చారిత్రక అభివృద్ధి సూత్రాలు మనకు తేటతెల్లం అవుతాయి. ప్రపంచ చరిత్రను చదువుకోవడానికి, నేర్చుకోవడానికి మనకు బాగా ఉపకరించే ఆయుధాలు మార్క్సిస్టు మహోపాధ్యాయుల రచనలే. అందుకనే మనం వాటిని మనసుపెట్టి పఠించాలి.

వర్గపోరాటం కొనసాగించడానికి చరిత్ర చదవడం చాలా అవసరం. వర్గపోరాటాలతో మన అధ్యయనాన్ని మిళితం చేస్తేనే మన దృష్టి సవ్యంగా వుంటుంది. అప్ప్పుడే మనం కీలకం అయిన సంగతులను గ్రహించగలుగుతాం. మార్క్స్‌,  ఎంగెల్సు, లెనిన్, స్టాలిన్, మావో రచనలను, ప్రపంచ చరిత్రతో కలిపి చదవాలి. పోరాటాలతో ప్రపంచ చరిత్రను మిళితం చేయాలి. అప్ప్పుడే మనం గమ్యం చేరగలం. సమకాలీన ప్రపంచ చరిత్ర, ప్రపంచ కమ్యూనిస్టు చరిత్ర ఒకదానికొకటి ముడిపడి వున్నాయి. మన అధ్యయనంలో మనం ఆ మాటే నొక్కి చెప్పాలి.

సృజన, జనవరి 1978

One thought on “ప్రపంచ చరిత్ర ఎందుకు చదవాలి

  1. ఒక చిన్న సవరణ: ఈ వ్యాసం కెవిఆర్ రచన కాదనుకుంటాను. చైనా నుంచి వచ్చిన వ్యాసాలలో ఒక పెద్ద వ్యాసంలో ఇది మొదటి భాగం. ఆ వ్యాసం తెలుగు అనువాదం సృజనలో జనవరి 1978, ఫిబ్రవరి 1978, మార్చ్ 1978, ఏప్రిల్/మే 1978 నాలుగు సంచికల్లో సీరియల్ గా వేసి, ఆ తర్వాత మొత్తం వ్యాసం కూడా ఒక బుక్ లెట్ గా, సృజన ప్రచురణగా తెచ్చాం. అనువాదం కూడా కె వి ఆర్ ది కాదనే నా జ్ఞాపకం. సృజనలో నాలుగు సంచికల్లోనూ అనువాదకుల పేరు వేయలేదు గాని ఐ వి గాని, సి ఎస్ ఆర్ ప్రసాద్ గాని చేశారని నా జ్ఞాపకం. ఈ వ్యాసం చూస్తే కూడా భాష కె వి ఆర్ ది కాదని కచ్చితంగా తేలుతుంది.

Leave a Reply