దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న విద్యా రంగ సమస్యలపై తమ గొంతు వినిపిస్తున్న విద్యార్థులను భారత ప్రభుత్వం తీవ్రంగా అణచి వేస్తోంది. సమస్యలు పరిష్కరించాలని అడిగినప్పుడు గానీ, రాజ్యాంగానికి లోబడి తమకున్న భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు గానీ భాజపా, ఆర్ ఎస్ ఎస్ అనుకూల వ్యక్తులు, ఎబివిపి వంటి రైట్ వింగ్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలలో పనిచేసే సంఘ్ పరివార్ మద్దతు దారులు, భాజపా ప్రజాప్రతినిధులు తీవ్రంగా దాడి చేస్తున్నారు. ప్రశ్నించిన వారిని సోషల్ మీడియాలో విదేశీయులుగా,రాజద్రోహుళుగా, ఉగ్రవాదులుగా ముద్ర వేసి ప్రచారం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా భౌతిక చర్యలకు పాల్పడుతూ భయపెడుతున్నారు. ఇదంతా కాషాయ భావజాలాన్ని కాపాడుతూ ఆ భావజాలం నీడలో ఉద్యోగం,పదవులు, పలుకుబడి అనుభవించేందుకు చేస్తున్నారు. అమాయకులైన మెజారిటీ ప్రజలను అణచివేసే చర్యల్లో ప్రత్యేక్షంగా పరోక్షంగా పాల్గొంటున్నారు. రాజ్యాంగ బద్ద సంస్థలలో పనిచేసే వ్యక్తులు పాలకవర్గాల మెప్పు కోసం తమ పరిథి దాటి మరీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని టార్గెట్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలిస్తూ విద్యార్థులను టెర్రరైజ్ చేస్తున్నారు. ఈ సంఘటనలన్నీ దేశంలో పెరిగిపోయిన అసహనానికి సూచికలు, ఒక ప్రజా వ్యతిరేక భావజాలాన్ని కాపాడే ప్రయత్నాలు.
దేశ రాజధానిలో జూలై 20 తేదిన విద్యార్థి యువతపై జరిగిన అమానుష లాఠీ చార్జీ, అణచివేత ఘటనపై చర్యలు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ చేసేందుకు సమయం లేదన, మా సమయం వృథా చేయొద్దన్న చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు ఖండిస్తూ దేశ వ్యాప్తంగా ఆన్లైన్, ఆఫ్ లైన్ లో నిరసనలు జరిగాయి. విద్యార్థి యువకులతో పాటు ప్రజాస్వామిక వాదులు,దేశ ప్రజలను కూడా చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు బాధించాయి. ఇదే సందర్భంలో హైదరాబాద్ లో ఉన్న నల్సార్ లో చదివే న్యాయ విద్యార్థులు కూడా స్పందించారు. తమ స్నాతకోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సూర్యకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకావడాన్ని హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీలో 2026 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు వ్యతిరేకిస్తూ లేఖ రాశారు.ఆ లేఖ జాతీయ మీడియాలో,సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ చర్చ దేశ వ్యాప్తంగా యువత గత నెలలో చేపట్టిన పోరాటానికి కొనసాగింపుగా ఉనికిలోకి వచ్చింది.
ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తన పరిథి దాటి తీవ్రంగా స్పందించింది. నల్సార్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న 2026 బ్యాచ్ కు చెందిన బి.ఏ, ఎల్ ఎల్ బి విద్యార్థులను లాయర్లు గా నమోదు చేసుకునేందుకు అనుమతి నిరాకరిస్తూ దేశంలోని వివిధ బార్ అసోసియేషన్లకు, నల్సార్ విశ్వవిద్యాలయంకు ఆదేశాలు జారీ చేసింది. బిసిఐ పాలకవర్గం తో సంబంధం లేకుండా భాజపా నేత, రాజ్యసభ సభ్యుడు,బిసిఐ అధ్యక్షుడిగా ఉన్న మన్నన్ కుమార్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారని అంటునప్పటికీ మిగతా సభ్యులు స్పందించకపోవడంతో మొత్తం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పాత్ర స్పష్టం అవుతోంది. బిసిఐ తరపున వారు అదే సమయంలో విద్యార్థులు ఉమ్మడిగా లేఖ రాసేందుకు వర్శిటీలో జరిగిన విద్యార్థి సమీకరణలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులపై నివేదిక సమర్పించాలని విశ్వవిద్యాలయాన్ని కోరారు. ఈ అంశంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురవడంతో అదే రోజు ఈ ఆదేశాలు వెనక్కి తీసుకుంటూనే ఈ అంశంలో ప్రచారం చేసిన భాగస్వామ్య విద్యార్థులను గుర్తించి నివేదిక ఇవ్వాలని అనడం, ఆ చర్య స్వయం ప్రతిపత్తి గల వర్శిటీ నిబంధనలకు విరుద్ధం అని వైస్ ఛాన్సలర్ గారు ప్రకటించడంతో పాటు బిసిఐ ఆదేశాలతో విద్యార్థులను గుర్తించే రాజ్యాంగ బద్దం అవునో కాదో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ముందు ఉంచుతామని సరైన సమాధానం చెప్పారు.మళ్ళీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ విద్యార్థులపై చర్యలు వద్దన్నారు. అయినా విద్యార్థులు నేటికీ కొంత భయంలో, ఆందోళనలోనే ఉన్నారు.
2014 లో కేంద్రంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశంలో రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాల్సిన సంస్థలు ఫంక్తు దళారీ సంస్థలుగా, జేబు సంస్థలుగా మారాయి. ఆయా సంస్థల ఆటనామస్ హోదా పేరుకే మిగిలింది. దేశంలో అత్యున్నత పదవులు సంఘ్ పరివార్ మద్దతు దారులతో నిండిపోయాయి. యూనివర్శీటీలు మనువాద పాలకవర్గాలతో భ్రష్టు పట్టిపోయాయి.వైస్ ఛాన్సలర్ నియమాలలలో గవర్నర్ జోక్యంతో కేంద్రమే యూనివర్సిటీ లలో ప్రత్యక్షంగా విద్య కేంద్రికరణకు పూనుకుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఎబివిపి, ఆర్ ఎస్ ఎస్ సభ్యులు మాత్రమే అర్హులుగా మారారు. దేశంలో ఏ ప్రాంతంలో ప్రశ్న వినిపించినా, ఎక్కడ భిన్న స్వరం వినిపించినా అణచివేయడం లేదా అంతం చేయడమే కర్తవ్యంగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా నల్సార్ విశ్వవిద్యాలయంకు చెందిన విద్యార్థులపై చర్యలు తీసుకొని దేశవ్యాప్తంగా విద్యార్థులను బయపెట్టాలని చూశారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. దేశంలో ప్రజాస్వామిక వాదులు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. పాలకుల విధానాలతో అన్ని వర్గాల, సామాజిక సెక్షన్ల ప్రజలు అనేక కష్టాల పాలవుతున్నారు. భయంలో బతుకుతున్నారు.ఈ పరిస్థితి నుండి పీడిత ప్రజలను బయటపడేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజురోజుకి తీవ్రమవుతున్న ఈ అసహనానికి అడ్డు కట్ట వేయడానికి ప్రజలు ముందుకు రావాలి. ఇప్పటికే తమ తమ సమస్యలపై పోరాడుతున్న విద్యార్థి యువతతో ప్రజలు కలిసి ఉద్యమించాలి. ప్రశ్నించే హక్కు కోసం,భావ ప్రకటన స్వేచ్ఛ కోసం ఉద్యమించాలి.
-కోట ఆనంద్.
16.08.2026




