ఈ నెల 11 కు కా. మోడెం బాలకృష్ణ అమరుడై ఏడాది అయ్యింది. 2025 సెప్టెంబర్ 11 న ఛత్తీస్ గఢ్ రాష్ట్రం లోని గరియాబంధ్ జిల్లాలోని రాజాదేరా అడవిలో ఉన్న విప్లవకారుల బృందం గురించి సమాచారం తెలిసిన పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టి చేసిన దాడిలో సి‌పి‌ఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యుడైన కా. బాలకృష్ణతో పాటు, కా. చంద్రహాస్ (పాండు), మరో ఎనిమిది మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. 2024 లో మొదలైన ఆపరేషన్ కగార్ లో ఈ గొప్ప విప్లవకారులు కూడా తమ ప్రాణాలు అర్పించారు.
కా. బాలకృష్ణ తన 61 ఏళ్ల జీవితంలో 44 ఏళ్ళు విప్లవానికే అంకితం చేసిన గొప్ప వ్యక్తి. బాలకృష్ణ 1965లో వరంగల్ వద్ద ఉన్న మడికొండలో జన్మించాడు. కా. బాలకృష్ణ తండ్రి తపాలా శాఖలో పని చేసేవాడు. 1964-65 లో ఆయనకు వరంగల్ నుండి హైదరాబాద్ కు బదిలీ అయ్యింది. అప్పటి నుండి వారి కుటుంబం చాదర్ ఘాట్ వద్ద ఉన్న సుల్తాన్ పురా లో ఉండేవాళ్లు. బాలకృష్ణ స్కూలు చదువంతా అక్కడి పాఠశాలలోనే జరిగింది. ఆయన చాలా చురుకైన విద్యార్థి. ఆయన ఇంటర్ మీడియట్ కోసం ఓల్డ్ మలక్ పేట కాలేజీలో చేరాడు. ఆ కాలేజ్ లో ఇంటర్ లోనే ఆర్&బి వొకేషనల్ కోర్స్ తీసుకున్నాడు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే ఆర్‌ఎస్‌యూతో సంబంధాలలోకి వచ్చి ఇంటర్ లో చేరేటప్పటికి క్రియాశీల కార్యకర్తగా మారడమే కాకుండా పూర్తి కాలం విప్లవం కోసం వెచ్చించాలని నిర్ణయించుకున్నాడు. 1983 దాకా జంట నగరాలలో ఆర్‌ఎస్‌యూ నిర్మాణ కృషిలో భాగమయ్యాడు. పూర్తి కాలం కార్యకర్తగా పని చేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ ఆయనను గ్రామీణ ప్రాంతంలో రైతాంగాన్ని, యువజనులను ఆర్గనైజ్ చేయడానికి ఖమ్మం జిల్లాకు పంపించింది. అట్లా 1983 లో 17-18 ఏళ్ల ప్రాయంలో విప్లవోద్యమంలోకి పూర్తి కాలం కార్యకర్తగా పని చేయాలని నిర్ణయించుకున్న కామ్రేడ్ బాలకృష్ణ 2025 లో అమరుడయ్యేదాకా 42 ఏళ్ల పాటు మడమ తిప్పకుండా విప్లవోద్యమ నిర్మాణానికి కృషి చేశాడు. భారత దేశాన్ని సామ్రాజ్యవాద, అర్ధ భూస్వామ్య – అర్ధ వలస పీడనల నుండి విముక్తి చేసి సమసమాజ నిర్మాణానికి బాటలు వేయడం కోసం నిరంతరం శ్రమించి ఆ లక్ష్యం కోసమే ప్రాణాలర్పించాడు.
ఖమ్మం జిల్లాలో ఆర్గనైజర్ గా వెళ్ళిన కా. బాలకృష్ణ కొద్ది కాలంలోనే అరెస్టు అయ్యాడు. అప్పుడు ఆయనను వరంగల్ జైలులో ఉంచారు. అప్పటికే వరంగల్ జైలులో నక్సలైటు ఖైదీలందరూ పోరాడి జైల్ కమ్యూన్ స్థాపించుకున్నారు. కొద్ది రోజులలోనే బాలకృష్ణను ఆ జైలు కమ్యూన్ ను నడిపించడానికి ఏర్పడ్డ నాయకత్వ కమిటీ ఐన జైలు కమ్యూన్ కమిటీలోకి తీసుకున్నారు. ఆయన జైలులో ఉన్నంత కాలం ఆ కమ్యూన్ సజావుగా క్రమశిక్షణతో నడవడంలో కీలక పాత్ర వహించాడు. కమ్యూన్ లో రాజకీయ విషయాల అధ్యయనం, చర్చలు సజావుగా, క్రమబద్ధంగా జరిగేలా పట్టుదలతో పని చేసేవాడు. జైలు సమస్యల మీద పోరాటం నడిపారు. అప్పటి జైలు సూపరింటెండెంట్ గా ఉన్న అహ్మద్, ఆ కాలంలో వరంగల్ పోలీస్ ఎస్‌పి గా ఉన్న అరవింద రావుతో సన్నిహిత సంబంధాలలో ఉంటూ ఆ జైలు పోరాటాన్ని అణచివేసేందుకు జైలులోనే నక్సలైటు ఖైదీల మీద విపరీతంగా లాఠీ చార్జ్ చేయించాడు. ఈ విధంగా తన యవ్వన ప్రాయం లోనే జైలు పోరాటాలకు కా. బాలకృష్ణ నాయకత్వం వహించాడు.
ఒకటిన్నర రెండేళ్లలో కా. బాలకృష్ణ జైలు నుండి విడుదలయ్యాడు. జైలులో నిరంతర అధ్యయనం వల్ల మార్క్సిస్ట్ రాజకీయాలలో మరింత రాటుదేలి బయటకు వచ్చాడు. జైలు నుండి విడుదల అయ్యాక అతి త్వరలోనే ఆయన మళ్ళీ విప్లవోద్యమంలోకి మరింత ఉన్నత బాధ్యతలు చేపట్టి వెళ్ళాడు. ఈ సారి మహబూబ్ నగర్ జిల్లా కమిటీ సభ్యుడిగా జిల్లా ఉద్యమానికి నాయకత్వం వహించడానికి వెళ్ళాడు. అక్కడ విప్లవ రైతాంగ ఉద్యమాన్ని, విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు. మహబూబ్ నగర్ టౌన్ లో విద్యార్థి ఉద్యమ నిర్మాణ క్రమంలోనే కొందరు విద్యార్థులు అరెస్టయి కా. బాలకృష్ణ గురించి చెప్పడంతో రెండవ సారి 1987 లో అరెస్టు అయ్యాడు. ఈ సారి ముషీరాబాద్ జైల్లో ఆయనను ఉంచారు.


హైదరాబాద్ లో ఆర్‌ఎస్‌యూ లో పని చేస్తున్న నేను కా. బాలకృష్ణ రెండవ సారి అరెస్టు అయినప్పుడు ఆయన గురించి మొదటి సారి విన్నాను. ఆయన మా జిల్లా అయిన మహబూబ్ నగర్ లో అరెస్టయినందుకు కూడా మరింత ప్రత్యేకంగా ఆయన గురించి తెలిసింది. అప్పటికే హైదరాబాద్ లో అరెస్టయిన కా. విశ్వనాథ్, శంకర్ తదితరులు కూడా ముషీరాబాద్ జైల్లో ఉన్నారు. వీళ్ళందరినీ కండెమ్డ్ (Condemned) సెల్స్ లో ఉంచారు. (గతంలో ఉరి శిక్ష పడిన వారిని ఇందులో ఉంచేవారు). అప్పటికే 1986 లోనే అరెస్టయిన కా. ఆదిరెడ్డి తదితరులు కూడా అదే జైలులో ఉన్నారు కానీ ఆ కేసులో ఉన్నవారందరినీ ఒక విడి బారక్ లో ఉంచారు.
1988 ఏప్రిల్ లో నేను అరెస్టయి ముషీరాబాద్ జైల్ కు వెళ్ళాను. అప్పుడు మొదటి నాలుగైదు నెలలు కా. వి‌వి, కా. రవూఫ్ లతో పాటు సెల్ లలో ఉన్నాను. మూడు నెలల తరువాత బెయిలు వచ్చి బయటకు వెళ్ళిన వెంటనే పోలీసులు మళ్ళీ అరెస్టు చేసి మరో కేసు పెట్టి మళ్ళీ జైలుకు పంపించారు. అక్కడ సూపరింటెండెంట్ తో ఒక చిన్న వివాదం అయిన తరువాత అక్కడి నుండి నన్ను విడదీసి ఒంటరి సెల్ లో ఉంచారు. ఆరు నెలల తరువాత రెండవ కేసులో కూడా బెయిల్ వచ్చి ఇక బయటకు వెళతాను అనుకుంటున్న తరుణంలో మరో తీవ్ర ఆరోపణలు ఉన్న టాడా కేసును నాపై పెట్టారు. ఈ కేసు పెట్టిన తరువాత, నన్ను కూడా కండెమ్డ్ సెల్స్ లోకి మార్చారు.
అందులో పదమూడు సెల్స్ ఉండేవి. మేము 10-12 మందిమే ఉన్నా మమ్మల్ని సెల్ కు ముగ్గురి చొప్పున ఉంచారు. ముగ్గురు పడుకోగలిగేటంత స్థలం మాత్రమే ఉండేది. ఒక మూలన ఏ అడ్డూ లేకుండా ఒక ఇండియన్ టాయ్ లెట్ ఉండేది. రాత్రి పూట ఏ అవసరానికైనా అదే వాడాల్సి వచ్చేది. పగలు వాడుకోవడానికి మాత్రం సెల్స్ బయట బారక్ లో టాయ్ లెట్ లు ఉండేవి.
నేను వెళ్ళిన మరుసటి రోజే కా. విశ్వనాథ్ కు బెయిల్ వచ్చి రిలీజ్ అయ్యాడు. నేను అరెస్టయ్యాక రెండు మూడు నెలల తరువాత కా. మఠం రవి కుమార్ (మంజీర), కా. సామ మల్లా రెడ్డి కూడా అరెస్టయి అదే బ్యారాక్స్ లో ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆర్గనైజర్ గోపాల్ రెడ్డి, కా. రవూఫ్ పార్టీకి చెందిన కా. భూపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు. వీరు కాక మరో ఇద్దరు ఉన్నారు.


అక్కడే కా. బాలకృష్ణను మొదటి సారి కలవడం. పార్టీలో బయట జిల్లా కమిటీ సభ్యులైన కా. బాలకృష్ణ, రవి కుమార్ అక్కడ జైలు కమిటీ నాయకత్వ కామ్రేడ్స్. వీరిద్దరి నాయకత్వంలో ఒక పద్ధతి ప్రకారం మా జైలు జీవితం గడిచేది. ఉదయమే లేచిన తరువాత వచ్చిన టీ తాగి సామూహికంగా వ్యాయామం చేసే వాళ్ళం. ఈ విషయంలో మాత్రం బాలకృష్ణ కొంచెం తక్కువే శ్రమించేవాడు. ఇక ఆ తరువాత వచ్చిన పోపు అన్నం తినేవాళ్లం. ఉదయం వచ్చిన టీ కొద్దిగా ఎక్కువ పోయించుకొని మాకు ఇచ్చే కొబ్బరి నూనె తో ఒక మూలాన వేడి చేసుకొని 10.30 కు రెండో సారి టీ తాగేవాళ్లం. ఈ లోగా అందరం వచ్చిన పేపర్లు చదివే వాళ్ళం. ఆ రోజుల్లో పేపర్లలో నక్సలైట్లకు సంబంధించిన వార్తలను నల్ల రంగు పూసి ఇచ్చే వాళ్ళు. అందులో ఏమొచ్చిందని డ్యూటీ జవాన్లను అడిగి తెలుసుకునేవాళ్లం. కొందరు సహకరించేవాళ్ళు కాదు. ఆ తరువాత ఒకటి రెండు గంటలు సామూహికంగా ఏదైనా పుస్తకాన్ని అధ్యయనం చేసే వాళ్ళం. ‘చైనాలో ఏం జరుగుతోంది’ అట్లాగే అధ్యయనం చేశాము. సాపేక్షికంగా మా కంటే సీనియర్లైన వారితో చర్చలు, అనుభవాలను పంచుకోవడం వల్ల మాకు సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణాత్మక జ్ఞానం పెరగడానికి చాలా తోడ్పడింది.
బాలకృష్ణ కు వరంగల్ జైలు అనుభవం కూడా ఉండటం వల్ల జైలు కూడా ఒక అధ్యయన కేంద్రంగా నడవటానికి మాకు బాగా తోడ్పడింది. బాలకృష్ణ చాలా పట్టుదల ఉన్న కామ్రేడ్. కష్టపడే కామ్రేడ్. అధ్యయనశీలి. ఆ కాలంలో ఎన్నో పత్రికలకు ‘మేము రాజకీయ ఖైదీలము’ అని ఉత్తరాలు రాసి పత్రికలను ఫ్రీగా తెప్పించుకునేవాళ్లం. అట్లాగే ఎన్నో పుస్తకాలను కూడా పుస్తక రచయితలకు ఉత్తరాలు రాసి తెప్పించేవాడు. రంగనాయకమ్మ గారు మాత్రం రాజకీయ ఖైదీలు ఏ జైలు నుండి అడిగినా వారికి తప్పక పంపించే వారు.
ఆ కాలంలోనే బాలకృష్ణ నాతో మహబూబ్ నగర్ విప్లవోద్యమం గురించి ముఖ్యంగా విప్లవ రైతాంగ ఉద్యమం గురించిన వివరాలు నాకు చెప్పి, అక్కడే ఉన్న గోపాల్ రెడ్డి తో కూడా చెప్పించి ఒక వివరమైన రిపోర్ట్ ఇంగ్లిష్ లో రాయించాడు. దానిని నేను జైలు నుండి విడుదల అయిన తరువాత ఫ్రాంటియర్ కు పంపించాము కానీ అది ప్రచురణ కాలేదు.
ఏదైనా ఒక పని అనుకున్నామంటే ఆ పని అయ్యేదాకా వెంటపడేవాడు. ఆరునెలలు వారందరితో కలిపి గడపడం వల్ల రోజులెట్లా గడిచిపోయాయా అన్నట్టు అయిపోయాయి. ఆరునెలల పాటు కా. బాలకృష్ణతో గడిపిన సమయం ఒక దృఢసంకల్పి, ఆదర్శప్రాయుడు ఐన కమ్యూనిస్టుతో గడిపిన సమయం. ఆనాటి అనుభవం నా తదుపరి విప్లవ జీవితంలో ఎంతో ఉపయోగపడింది. విప్లవ జీవితంలోనే కాక, ఆ తరువాతి జైలు జీవితంలో కూడా చాలా ఉపయోగపడింది.
1989 ఏప్రిల్ నెలలో నేను విడుదలయ్యే నాటికి కా. బాలకృష్ణ, కా. రవి ఇంకా జైలులోనే ఉన్నారు.
సుదీర్ఘ కాలం ఇట్లా విచారణ లేకుండా కామ్రేడ్స్ ను జైళ్ళలో ఉంచుతున్నందుకు వాళ్ళను విడిపించేందుకు ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ కూడా పాలకవర్గ రాజకీయ నాయకులను నిర్బంధించి విప్లవకారుల విడుదలను డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. అట్లా రవి, బాలకృష్ణలను డిమాండ్ చేస్తూ ఒక మండలాధ్యక్షున్ని నిర్బంధించింది. అట్లా వాళ్ళు 1990 ప్రారంభంలో విడుదల అయ్యారు. వాళ్ళు విడుదల అయ్యే సమయానికి బయట నిర్బంధం కొంత సడలి మరో వెల్లువ ప్రజా పోరాటాలకు సన్నద్ధమవుతున్న కాలం అది.
చారిత్రక వరంగల్ రైతు కూలీ సంఘ సభలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రజా సమీకరణకు సన్నాహాలు నడుస్తున్నాయి. దానిని సజావుగా నడిపించేందుకు వందలాది వాలంటీర్ల బృందాలు ఏర్పడ్డాయి. ఆ బృందాలకు నాయకత్వం వహించేందుకు కొన్ని నాయకత్వ కమిటీలు ఏర్పడ్డాయి. ఆ సమయం లోనే వివిధ జైళ్ల నుండి బయటకు వచ్చిన కా. సూర్యం, బాలకృష్ణ, రవి కుమార్, మల్లా రెడ్డి, భూషణం, ప్రభు లు ఈ నాయకత్వ కమిటీలలో ఉన్నారు. వీరందరికీ బాధ్యుడు కా. పులి అంజన్న. వీరి నాయకత్వంలో వరంగల్ లో రైతు కూలీ సంఘ సభలు అత్యంత ఘనంగా విజయవంతమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగి పది లక్షలకు పైగా హాజరైన సభల్లో ఒక్క చిన్న ఘటన కూడా జరగకుండా సజావుగా జరిపించిన నాయకత్వ టీం లో కా. బాలకృష్ణ కూడా ఒకరు.
ఆ సభలు జరిగిన కొద్ది కాలానికే కా. బాలకృష్ణ మళ్ళీ విప్లవోద్యమంలో అజ్ఞాత జీవితానికి వెళ్లిపోయాడు. ఆయన నాయకత్వ పటిమను గుర్తించిన పార్టీ ఆయనను దక్షిణ తెలంగాణ రీజనల్ కమిటీ లోకి తీసుకొని నల్గొండ ఉద్యమ బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలోనే బాలకృష్ణ 1995 మార్చ్ లో మళ్ళీ ఒకసారి అరెస్ట్ అయ్యాడు. ఆయనపై వ్యాస్ హత్య కేసు మోపారు. ఆయన నుండి పార్టీ సమాచారం రాబట్టడానికి పోలీసులు ఆయనను విపరీతమైన చిత్ర హింసలకు గురి చేశారు. అయినా ఏ సమాచారం రాబట్టలేక ఆయనను చంచల్ గూడా జైలుకు తరలించారు. ఆయనను అరెస్ట్ చేసిన రెండు రోజులకే కా. శాఖమూరి అప్పారావును కూడా అరెస్టు చేసి అదే కేసులో అదే జైలుకు తరలించారు. అప్పటికే కా. పటేల్ సుధాకర్ రెడ్డి ముషీరాబాద్ జైలులో ఉన్నాడు. ఈ రెండు జైళ్ళలో వీరు ముగ్గురూ అక్కడ ఉన్న మరికొందరు సీనియర్ కామ్రేడ్లతో కలిసి జైలు సమస్యలపై నక్సలైటు ఖైదీలనే కాక సాధారణ ఖైదీలను కూడా కదిలించి 1995లో చారిత్రాత్మకమైన జైలు పోరాటాన్ని నడిపించారు. ఈ జైలు పోరాటం తరువాత ఆంధ్రప్రదేశ్ జైళ్ళలో పరిస్థితులు చాలా మెరుగు పడ్డాయి. అంతే కాక ఎంతో మంది జీవిత ఖైదీలు ప్రభుత్వ ప్రత్యేక జి‌ఓ ద్వారా విడుదల అయ్యారు. ఆనాడు ఈ రెండు జైళ్ళలో ఉన్న వందలాది నక్సలైటు ఖైదీలకు జైలు ఒక అధ్యయన కేంద్రంగా కూడా మారింది. జైలులో అధ్యయనం మాత్రమే కాక కవితలు, కథలు, వ్యాసాలు రాసి, చిత్రాలు గీసి ఒక పత్రికను కూడా నడిపే వాళ్ళు. 1999లో కామ్రేడ్ బాలకృష్ణ జైలు నుండి విడుదలై కొద్ది రోజులలోనే తిరిగి ఉద్యమంలో రహస్య జీవితానికి వెళ్లిపోయాడు. 2000 సంవత్సరంలో ఆయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీలోకి తీసుకొని ఆంధ్ర-ఒడిశా బార్డర్ స్పెషల్ జోన్ కు పంపించాలని నిర్ణయం జరిగింది. ఆ మరుసటి సంవత్సరమే 2001లో పీపుల్స్ వార్ కాంగ్రెస్ జరిగింది. పార్టీ యూనిటీ- పీపుల్స్ వార్ విలీనం తరువాత జరిగిన కాంగ్రెస్ ఇది. అక్కడ ప్రతినిధిగా కా. బాలకృష్ణ పాల్గొన్నాడు. దాదాపు ఒక దశాబ్దం తరువాత ఆ కామ్రేడ్ ను కలిసే అవకాశం దొరికింది. పదిహేను ఇరవై రోజులు కలిసి ఉండగలిగాము. ఆయన 1991లో కలిసిన దానికి 2001 లో కలిసే నాటికి సైద్ధాంతికంగానూ, విప్లవోద్యమ నిర్మాణ అనుభవం లోనూ మరింత రాటుదేలాడు. కాంగ్రేస్ లో పార్టీ పంథాను సుసంపన్నం చేయడానికి సైద్ధాంతిక చర్చల్లో క్రియాశీలకంగా పాల్గొన్నాడు.
అక్కడి నుండి వెళ్ళిన తరువాత కొంత కాలం ఆయన ఏ‌ఓ‌బి స్పెషల్ జోన్ కార్యదర్శిగా కూడా బాధ్యతలను నిర్వహించాడు. ఎం‌సి‌సి‌ఐ, పీపుల్స్ వార్ పార్టీలు 2004 లో విలీనం అయి సి‌పి‌ఐ (మావోయిస్టు) ఏర్పడిన తరువాత 2007 లో పార్టీ ఐక్యతా కాంగ్రేస్ నిర్వహించింది. అందులో కూడా బాలకృష్ణ ప్రతినిధిగా పాల్గొన్నాడు. ఆ కాంగ్రేస్ లోనే ఆయన ప్రత్యామ్నాయ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. తూర్పు రాష్ట్రాల విప్లవోద్యమానికి నాయకత్వం వహించడానికి ఈస్టర్న్ రీజనల్ బ్యూరో (ఈ‌ఆర్‌బి) ఏర్పడింది. బాలకృష్ణ అందులో భాగమై ఒడిశా ఉద్యమానికి బాధ్యుడిగా పని చేశాడు. ఒడిశాలో ఉద్యమ విస్తరణకు నిర్విరామంగా కృషి చేశాడు. తీవ్రమైన డయాబెటిస్, బి‌పి, మోకాళ్ళ నొప్పులను భరిస్తూనే అక్కడ పనిచేసాడు.
2013-14 తరువాత నిర్బంధం రోజురోజుకూ తీవ్రమై ఉద్యమం సెట్ బ్యాక్ కు గురి అవుతున్నా, ముఖ్యంగా ఆపరేషన్ కగార్ తరువాత దండకారణ్యం లోనూ, ఒడిశాలోనూ మావోయిస్టు పార్టీ నాయకత్వం తీవ్రమైన నష్టాలకు గురవుతున్నా, ఉద్యమం ఓటమి అంచులకు చేరుతున్నా తన ప్రాణాలున్నంత వరకు విప్లవోద్యమానికే అంకితమై పని చేస్తూ చివరికి గత సంవత్సరం సెప్టెంబర్ 11 నాడు జరిగిన చుట్టుముట్టి చేసిన దాడిలో కా. చంద్రహాస్ తదితర కామ్రేడ్స్ తో కలిసి పోరాడుతూ అమరుడయ్యాడు.
కా. బాలకృష్ణ తన 60 ఏళ్ల జీవితంలో నలభై ఏళ్ళకు పైగా విప్లవోద్యమంలో గడపగా అందులో పదకొండేళ్లకు పైగా జైళ్ళలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నా తాను ఉన్న స్థానాన్ని అధ్యాయనాలకు, పోరాటాలకు కేంద్రంగా మలిచాడు. తన యవ్వన కాలం నుండి భారతదేశ సమాజాన్ని భూస్వామ్య, సామ్రాజ్యవాద దోపిడీలనుండి విముక్తం చేసి కుల వర్గ రహిత సమాజం గా మార్చాలనే ఒక తపనతోనే జీవించాడు, మరణించాడు. పీడిత కులం నుండి వచ్చి విప్లవోద్యమ నాయకులలో ఒకరిగా ఎదిగాడు.
2001 లో కామ్రేడ్ బాలకృష్ణ కా. బెల్లాల పద్మ జీవిత సహచరులు అయ్యారు. కా. పద్మను 2007 లో భిలాయ్ వద్ద ఛత్తీస్ గఢ్ పోలీసులు అరెస్టు చేసి ఎన్నో అక్రమ కేసులు బనాయించి జగదల్ పూర్ లో జైలులో ఉంచారు. పదేళ్ళ పాటు జైల్లో ఉండి 2017 లో విడుదల అయ్యింది. ఆమె కూడా తన సహచరుడి మార్గంలోనే జగదల్ పూర్ జైలు లో ఎన్నో పోరాటాలను నడిపింది. జైల్లో ఆరోగ్యం చాలా క్షీణించింది. విడుదల అయ్యాక బయట ఉద్యమాలలో పాల్గొంటూనే ఎల్‌ఎల్‌బి లో చేరి పూర్తి చేసింది. కానీ ఎన్‌ఐ‌ఏ మళ్ళీ 2021 లో అరెస్టు చేసి ఇప్పటికీ జగదల్ పూర్ జైల్లో ఉంచింది. తన సహచరుడు కా. బాలకృష్ణ అమరుడైన తరువాత అంతిమ చూపులకు కూడా నోచుకోలేదు. తరువాత జరిగిన అంతిమ సంస్కారాలలో భాగం పంచుకోవడానికి కోర్టులో పిటిషన్ వేసినా కోర్టు నిరాకరించింది. 2026 మార్చ్ కల్లా మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి కానీ మావోయిస్టులనే ఆరోపణలతో ఉన్న వారిని మాత్రం జైళ్ల నుండి విడుదల చేయడం లేదు. ఈ సంవత్సరం బాలకృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగానైనా కొద్ది రోజుల పాటు ఇంటికి రావడానికి ఇంటెరిమ్ బెయిల్ కోసం అప్లై చేసినా కోర్టు నిరాకరించి కనీస మానవత్వం కూడా లేదని నిరూపించుకున్నది. వీళ్ళ సాహచర్యం పట్టుమని ఆరేళ్లు కూడా సాగలేదు. మిగిలినదంతా జైలు నిర్బంధంలోని ఎడబాటే. అయినా ఇప్పటికీ జైల్లో నిరంతరం రాజీ లేకుండా కా. పద్మ తన సహచరుడు బాలకృష్ణ లాగే పోరాటం కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా కా. పద్మ తో పాటు జైళ్ళలో ఉన్న వందలాది కామ్రేడ్స్ కు సంఘీభావం తెలపడం, వారి విడుదలకై కృషి చేయడం మన కర్తవ్యం. అది కా. బాలకృష్ణకు మనం ఇవ్వగలిగే నివాళి. దానితో పాటు ఏ దోపిడీ రహిత సమ సమాజ స్వప్నం కోసం కా. బాలకృష్ణ జీవించి మరణించాడో అందుకోసం తుదకంటా పోరాడటం కూడా మనం ఇవ్వగలిగే నివాళి.

One thought on “విప్లవ నాయకుడు కా.బాలకృష్ణకు జోహార్లు!”

Leave a Reply