ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి రైతులకు కన్నీటి కష్టాలే. జూన్ నుంచి సెప్టెంబర్ 21 వరకు కరువు తోను, సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలలో కురిసిన భారీ వర్షాలు కారణంగా వరదలు తోనూ, అక్టోబర్ 27 నుంచి ఆర్నాబ్ తుఫాన్, నవంబర్ 2 నుంచి మురసు తుఫాన్ తోను 20 జిల్లాల రైతాంగం పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఇక కరువు విషయానికి వస్తే 21 జిల్లాలలో 412 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఇందులో ఇప్పటికీ రాయలసీమ జిల్లాలలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రజలు కరువుకి తట్టుకోలేక వలస బాట పడుతున్నారు.
ఆర్నాబ్ తుఫాన్ నష్టాలు – సహాయ చర్యలు :-
ఆర్నాబ్ తుఫాను వలన శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు 13 ఉమ్మడి జిల్లాలలో 114 మండలాలలోని 715 గ్రామాలు ప్రభావితమైనాయి. 70,900 హెక్టార్లలో వరి, 50 వేల హెక్టార్లలో అరటి, 8 వేల హెక్టార్లలో కొబ్బరి మొదలగు ఉద్యానవన పంటలు నష్టపోయాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం తుఫాన్ నష్టం ₹4,563 కోట్ల రూపాయలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేస్తూ, కేంద్ర ప్రభుత్వ సహాయం కోసం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తుఫాను బాధితుల తక్షణ సహాయార్థం 27 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అక్టోబర్ 29న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 119 లో 50 కేజీల బియ్యం మత్స్యకార కుటుంబాలకు, 25 కేజీల బియ్యం చేనేత కుటుంబాలకు, కందిపప్పు, పంచదార, వంట నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంపలతో కూడిన నిత్యవసర కిట్టును తుఫాన్ బాధిత కుటుంబాలకు అందజేశారు. వీటికి అదనంగా ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ధ్వంసం కాబడిన ప్రతి కొబ్బరి చెట్టు, పామాయిల్ చెట్టుకి 1500 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు.
మురసు తుఫాన్ నష్టాలు:-
మురసు తుఫాన్ వలన పశ్చిమగోదావరి జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకూ పంటలకు తీవ్ర నష్టం జరిగింది. 1,43122 హెక్టార్లలో పంటలు ముంపుకు గురికాగా, 1,86,063 మంది రైతులు నష్టపోయారు. ఇక 983 ఇల్లు, 346 మత్స్యకారుల బోట్లు, 220 వలలు దెబ్బ తిన్నాయని, మొత్తంగా తుఫాను వలన 1988 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో తీవ్రంగా నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. సహాయ చర్యలలో భాగంగా జీవో 119నే ఆచరించారు.
కేంద్ర బృందాల పర్యటన రైతుల విన్నపాలు :-
నవంబర్- 1 న కేంద్ర బృందాలు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో పర్యటించారు. ఈ పర్యటనలలో రైతులు కేంద్ర బృందాలకు తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో చెప్పుకున్నారు. అవి ఏమిటంటే, 1) రైతులు ప్రతి ఎకరం వరి పంటకు 30 నుంచి 35 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టామన్నారు.
2) తుఫాను, వరదలు ఫలితంగా పశువులకు పశుగ్రాసం ఇబ్బందిగా ఉందని చెప్పారు.
3) దేవాదాయ ధర్మాదాయ భూములకు భూమి శిస్తును రద్దు చేయాలని కోరారు.
4) తక్షణం పంటల బీమా మొత్తాలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంటలకు నష్టపరిహారాన్ని చెల్లించాలని కోరారు.
5) చేపల చెరువులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
6) పాడైపోయిన మత్స్యకార బోట్లకు తక్షణం నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.
కరువు జిల్లాలలో కేంద్ర బృందాల పర్యటనలు, రైతుల విజ్ఞప్తులు :-
నవంబర్ 2న కేంద్ర బృందాలు అనంతపురం, కర్నూలు జిల్లాలలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు కేంద్ర బృంద సభ్యులకు వివరించిన వివరాలు ప్రకారం, “అనంతపురం జిల్లాలో 2000 కోట్ల నష్టం జరిగిందని, కంది పంటకు ఒక ఎకరానికి 15000 పెట్టుబడి పెట్టామని, ఆముదం పంట దిగుబడి తగ్గిందని చెబుతూ, ఉపాధి హామీ పనులను 125 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలని, త్రాగునీరు, పశుగ్రాసం ఉచితంగా అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
అటు వరద ప్రాంతాలలోనూ పర్యటించిన కేంద్ర బృందాలుగానీ, ఇటు కరువు ప్రాంతాలలో పర్యటించిన కేంద్ర బృందాలుగానీ చెప్పిన విషయాలు ఏమంటే, ” కేంద్ర ప్రభుత్వానికి నష్టపరిహార నివేదికలు అందజేస్తామని, మరో 10, 15 రోజుల్లో చర్యలు చేపట్టడం జరుగుతుందని రైతులతో చెప్పారు. ఇది ప్రతిసారీ తుఫానులు, వరదలు, కరువు వచ్చినప్పుడు పరిశీలనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్న రొటీన్ మాటలే తప్ప తక్షణ ఆర్థిక సహాయం చేసింది ఏమీ లేదు. ఆ తర్వాత కూడా చేసిన ఆర్థిక సహాయం తక్కువగానే జరుగుతుంది. బిజెపి నాయకత్వంలోని కేంద్ర కూటమి ప్రభుత్వం గానీ, రాష్ట్రంలోని టిడిపి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కానీ రైతులకు కంటి తుడుపు చర్యలే చేపడుతున్నారు. ఈ చర్యలు ఆర్థిక లేమితో కాదు. ఇదే కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి 2026 వరకు పది సంవత్సరాల కాలంలో దేశంలోని పారిశ్రామికవేత్తలకు 16.35 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేశారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం అయితే విశాఖలోని ఆదాని డేటా సెంటర్ కి సంవత్సరానికి 22 వేల కోట్ల రూపాయలను రాయితీగా ప్రకటించింది. కావున రైతాంగానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజా స్వామ్య వాదులు, ప్రజా సంఘాలు రైతు లకు సంఘీభావం ప్రకటించాలి. రైతుల పోరాటాలకు వెన్నుదన్నుగా మనందరం నిలవాలని ప్రతిజ్ఞ చేద్దాం.




