‘మీరు వోటరుగా కొనసాగాలంటే ఫలానా తేదీ మధ్యాహ్నం పన్నెండు రెండున్నర గంటల మధ్య పాటిగడ్డ మోడల్ మార్కెట్లో అండర్ సైన్డ్ ఆఫీసరు ముందు హాజరుకావాలి.’
మా అపార్ట్మెంట్ వాచ్మేన్ ద్వారా అందిన తాఖీదు ముందు నాకు అర్థం కాలేదు. నాకిప్పుడు డెబ్బై యేళ్లు దాటిపోయాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి పౌరసత్వం బిల్లు రాకముందే పుట్టా. ఓటుహక్కు వచ్చి దాదాపు యాభై యేళ్ళైంది. ఒక డజను లోకసభ యెన్నికలు దాదాపు అన్నే అసెంబ్లీ యెలక్షన్లు చూశా. ప్రయివేట్ టీచర్ నే అయినప్పటికీ ఆ తతంగంలో భాగమయ్యా. విధిగా ప్రతి సారీ యెలక్షన్ డ్యూటీలు చేశా. భరతుడు రామ పాదుకలు మోసినట్టు బ్యాలెట్ బాక్సులు, ఈవీయంలు నెత్తిమీద పెట్టుకొని బూతులు నడిపి ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రక్రియ సజావుగా సాగేందుకు పనిచేశా. పాలకుల గద్దెని కాపాడాను. గ్రాడ్యుయేట్ గా, టీచర్ గా పెద్దల సభకి ప్రతినిధుల్ని పంపి దేశభక్తి నిరూపించుకున్నా.
అయితే SIR పుణ్యమా అని నేనిప్పుడు సడన్ గా వోటర్ కాకుండా పోతున్నా. దేశ పౌరుణ్ణి కాకుండా పోతున్నా. అసలు నువ్వు మనిషివే కాదు పొమ్మన్నా ఆశ్చర్యం లేదేమో! ఒక్క బటన్ పోటుతో అక్రమ చొరబాటుదారుణ్ణయిపోతా. నేను విదేశీ కాదనీ చొరబాటుదారుణ్ని కాదనీ దేశద్రోహిని కాదనీ నిరూపించుకోవాలంటే వాళ్ళు పంపిన చాంతాడంత లిస్టులో నా దగ్గర యే యే సర్టిఫికేట్లు వున్నాయో వెతుక్కోడం మొదలెట్టా. నా బీపీ పెరిగిపోయింది. నిద్రపట్టదు. ఓటు హక్కు జీవన్మరణ సమస్యగా మారింది. పవిత్రమైన నా వోటే కాదు; నా అస్తిత్వమే ప్రమాదంలో పడింది. ఈ వయస్సులో యీ యాతనంతా పడి నేను వోటరుగా వుండాలా అని కూడా అనిపించింది. కానీ రోషం వచ్చింది. నేను భారతీయుణ్ణే అని గొంతెత్తి అరవాలని అనిపించింది. పత్రాలు అన్నీ తీసుకువెళ్లి అధికారి ముందు హాజరై నా డిఎన్ఎలోనే దేశం వుంది చూసుకో అని చెప్పాలి. ఓటు వేస్తానో లేదో తర్వాతి సంగతి. ముందు నేనీ దేశంలో జీవించి వున్నానని ప్రకటించడం, నా పౌరసత్వ హక్కుని కాపాడుకోవడం ముఖ్యం అనుకున్నా. దేశంలో పద్నాలుగు కోట్ల జీవన్మృతుల లెక్కలో వొకణ్ణి కాదల్చుకోలేదు. చెప్పిన రోజుకి చెప్పిన టైంకి చెప్పిన చోటికి వెళ్లాలని నిశ్చయించుకున్నా.
సరిగ్గా డీ డేట్ నాడు టైంకి మా అబ్బాయి ఆఫీస్ కి వెళ్తూ బైక్ మీద నన్ను మోడల్ మార్కెట్ దగ్గర దింపి వెళ్ళాడు. గేట్ నుంచి లోపలికి వెళ్తే జనం కిక్కిరిసి వున్నారు. చిన్నా పెద్దా తేడా లేదు. ఆడా మగా భేదం లేదు. అందరూ యీ దేశంలో తాము పౌరులమే వోటర్లమే అని నిరూపించుకోడానికి క్యూ కట్టినట్టున్నారు. ఈ క్యూలో నా వంతెప్పుడు వస్తుందో తెలీదు. కోవిడ్ రోజుల్లో ఇంజెక్షన్ చేయించుకోడానికి అక్కడికి వచ్చినట్టు గుర్తొచ్చింది. అప్పుడు కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ పొడుగ్గా క్యూ. దిక్కుతోచక అటూ యిటూ చూస్తుంటే “మాస్టారూ” అనెవరో పలకరించారు. పేరు అరుంధతి అంట, హై స్కూల్లో నా స్టూడెంట్ అంట, నాకు గుర్తుకు రాలేదు. ఆ అమ్మాయి SIR ప్రక్రియలో బి ఎల్ ఓ గా పనిచేస్తునట్టు చెప్పింది.
“మాస్టారూ, మీరు ఈ జనంలో ముందుకు పోలేరు. నేను లోపలికి తీసుకెళ్తాను” అని హడావిడి చేసి నన్ను లోపల తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టింది.
ఈ దేశంలో నేనున్నాననీ నాకూ వొక గుర్తింపు వుందనీ అనిపించి ఆ క్షణానికి గొప్ప వోదార్పు కలిగింది.
నాకిచ్చిన నోటీసు తీసుకెళ్లి అరుంధతి వొక టోకెన్ తెచ్చింది. టోకెన్ నా చేతిలోపెట్టి “మాష్టారూ కొంచెం టైం పడుతుంది. మీ పేరు పిలుస్తారు. వోపిక పట్టండి. నేనిప్పుడే వస్తాను” అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది. కొంచెం రిలాక్స్డ్ గా కూర్చున్నాను.
నాలుగు కుర్చీల అవతల డిఫెన్స్ లో పనిచేసిన కల్నల్ శర్మ కనిపించాడు. వాళ్ళ నాయన చదువుకొనే రోజుల్లో స్కూల్లో నా సీనియర్. అతను కూడా ఆర్మీలోనే పనిచేశాడు. కార్గిల్ యుద్ధంలో గాయపడి తర్వాత సరైన వైద్యం దొరకక చనిపోయాడు. శర్మ నన్ను చూసి నా దగ్గరకి నవ్వుతూ వచ్చాడు.
“మా ఆవిడకి వుంది. మా అమ్మకి వుంది. నాదే యెగిరిపోయింది. హుష్ కాకి” అన్నాడు మొదలూ తుదీ లేకుండా. సందర్భం తెలుసు కాబట్టి నాకు అర్థమైంది.
“మాడిపోయిన రొట్టెల వీడియో తీసిన హవిల్దార్ మీద చర్య తీసుకోవాలని పై ఆఫీసర్లు చెప్పినా వినలేదని బ్లాక్ మార్క్ పడింది. దాని ఫలితమే కావొచ్చు” అన్నాడు సాలోచనగా. శర్మ ఆర్మీలో పని చేయడం వల్ల ముందూ వెనకా లేకుండా అలా మాట్లాడటం అలవాటై వుంటుంది.
“నువ్వు కూడా దేశద్రోహుల లిస్ట్ లో వున్నావన్నమాట.”
ఆ మాటకి శర్మ నవ్వేశాడు గానీ భయపడుతూ అటూ యిటూ చూశాడు.
ఏదో పనున్నట్టు “ఇప్పుడే వస్తా గురువు గారూ” అంటూ వెళ్ళిపోయాడు.
ఎదురుగా పడడుగుల దూరంలో మూడు కుర్చీల్లో ముగ్గురు వోటర్ ఎన్యుమరేషన్ అధికారులున్నారు. మధ్యలో పత్రాలు పరిశీలీస్తున్న అధికారి నెత్తి పైన గోడ మీద ‘దొంగలున్నారు జాగ్రత్త’ అని గుండ్రటి అక్షరాల్లో రాసి వుంది. నిజమే. గుండెనీ జేబునీ వొక్కసారే తడుముకున్నాను.
ముఖమ్మీద పొడుగ్గా యింత పెద్ద బొట్టు చేతికి రంగు రంగు దారాలు మెడలో లావాటి బంగారు గొలుసు వేసుకొని అధికారి పక్కన కూర్చుని చెవిలో యేదో గుసగుసలాడుతున్న వ్యక్తిని యెక్కడో చూసినట్టుంది కానీ గుర్తు రావట్లేదు.
బిఎల్వోనో బిఎల్యే నో కావొచ్చు.
అధికారి టేబిల్ కి యెడం పక్కన తొంభై యేళ్ళ పండు ముసలాయన వీల్ చెయిర్లో కూర్చొని ముందుకు వొంగి అధికారికి యేదో చెప్బుతున్నారు. ఆయనకీ ఎస్కార్ట్ గా వచ్చిన యువకుడు పక్కనే అసహనంతో నిలబడి వున్నాడు.
నేను ఆశర్యపోయాను. ఆయన ప్రపంచ ప్రసిద్ధి పొందిన సైంటిస్ట్ డాక్టర్ రావు గారు!! సీసీఎంబీ లో పనిచేసేవారు. చాన్నాళ్ల తర్వాత చూసినా గుర్తుపట్టాను.
“మీరు మీరేనని రుజువేంటి? పోయిన ఎలక్షన్ లో మీరు ఓటు వెయ్యలేదు. చనిపోయారని మా అనుమానం.” ఆఫీసర్ గొంతు నేను కూర్చున్న చోటికి బిగ్గరగా వినిపించింది. అప్పుడే చూశా ఆ అధికారి చేతికి కూడా రంగు రంగు దారాలు కట్టి వున్నై.
అంత పెద్దాయన మీద ఆ అధికారి ప్రవర్తనకి నాకు కోపం వచ్చింది గానీ డాక్టర్ రావు గారి ముఖంమీద చిరునవ్వు చెరగలేదు.
“మీరు బతికే వున్నారని తేల్చుకోడానికి పిలిపించాం” అన్నాడు.
రావు గారు శాంతంగానే వున్నారు గానీ ఆయనకు ఎస్కార్ట్ గా వీల్ కుర్చీలో తీసుకొచ్చిన యువకుడు ఆఫీసర్ కి బదులిస్తూ
“ఆయన చనిపోతే దేశం ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో సాగనంపుతుంది. పేపర్లో టీవీల్లో వస్తుంది” అన్నాడు.
అధికారి ముఖం ప్రశ్నర్థకంగా పెట్టాడు.
ఆయన తన లాల్చీ జేబునుంచి రావి ఆకు రూపంలో వున్న మెడల్ తీసి టేబిల్ మీద పెట్టారు. దాని వెనక భారత జాతీయ చిహ్నం మూడు తలల సింహం మీద చూపుడు వేలు పెట్టి ‘సత్యమేవ జయతే’ అని నెమ్మదిగా చదివారు.
“నేను జీవించి వున్నాను అని యీ ఉపనిషద్వాక్యం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను”
ఈ సారి అధికారి వులిక్కిపడ్డాడు. పక్క టేబిల్స్ మీదున్న ఆఫీసర్లు కూడా ఆయన వైపు చూసారు.
ఎస్కార్ట్ యువకుడు రావు గారికి ప్రభత్వం ఇచ్చిన సనద్ ను సంచి నుంచి తీసి చూపించాడు.
ఆ పత్రం పై నుంచి కిందకి కింద నుంచి పైకి రెండు సార్లు చూసి అధికారి
‘మీరొక ఫోటో దిగి వెళ్ళండి’ అని చెప్పి ఫోటో గ్రాఫర్ కి సైగ చేశాడు.
డాక్టర్ రావు గారు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న పురస్కారాన్నీ ఎన్యుమరేషన్ అధికారులు పంపిన నోటీసునీ రెండు చేతుల్లో పట్టుకుని ఫోటో దిగారు. పోలీసుల ముందు నేరస్థుడిలా నిలబడి ఫోటో దిగిన ఆయన్ని చూస్తే నాకు దిగులేసింది. ఈ సిస్టం తగలడిపోను అని మనసులోనే తిట్టుకున్నాను.
వీల్ చైర్ లో ఆయన వెళ్ళడానికి సిద్ధమైతే లేచి రెండడుగులు ముందుకు వేసి నమస్కారం చేశాను. నా జర్నలిస్టు మిత్రుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సంభాషణని రికార్డ్ చేయడానికి నేను తోడుగా వున్న విషయం గుర్తు చేస్తే నిండుగా నవ్వారు.
“రిటైర్ అయ్యారు కదా? రాస్తూ వున్నారా?”
ఆయన జ్ఞాపక శక్తికి నేను ఆశ్చర్యపోయాను.
“మీ ఆరోగ్యం బాగుంది కదా సార్” అని వినమ్రంగా అడిగాను.
“ఇలా మిగిలేం” అన్నారు చిన్నపాటి వుద్వేగంతో నిర్వేదంతో. ఆయన కాపాడుకుంటూ వస్తున్న జీవనోత్సాహానికి యెక్కడో తూటు పడింది.
‘పోయిన గవర్నమెంటు యిచ్చిన పురస్కారం అది’ రావు గారు వెళ్ళ్తుంటే వెనకనుంచి ఆఫీసర్ చిన్నగానే అన్నా వినిపించింది.
“థేంక్యూ ఆఫీసర్ SIR” అని చెయ్యి వూపుతూ ఆ గది నుంచి నిష్క్రమిస్తున్న ఆ శాస్త్రవేత్తని చూస్తే ప్రజాస్వామ్యం వీల్ చైర్ లో కూర్చుని కదిలి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది.
“మహమ్మద్ యూసుఫ్”
పేరు పిలవగానే పొడవైన గడ్డం చీల మండల పైకి పైజామా లూజ్ లాల్చీ వేసుకున్న మహమ్మద్ యూసుఫ్ అనే వ్యక్తి హడావిడిగా కిందా మీదా పడుతూ ఆఫీసర్ ముందు హాజరయ్యాడు.
ఆఫీసర్ అతన్ని పైనుంచి కిందకి యెగా దిగా చూసాడు. కాళ్ళు ఆడిస్తూ తల పంకిస్తూ “సిటీ నిండా రోహింగ్యాలు మోపై పోయారు” అన్నాడు మూతి వంకరగా పెట్టి.
యూసుఫ్ శరీరం కుదించుకుపోయింది.
“మాఫ్ కర్నా సాబ్, హమారా వతన్ యేయ్ చ్ హైదరాబాద్. హమారే దాదా పర్ దాదా యహీ పైదా హుయే, యహీ బడే హుయే, యహీ మిట్టీ మే మిలే” అన్నాడు వినమ్రంగా.
“కాగజ్ దిఖావ్” ఆఫీసర్ నిర్లక్ష్యంగా.
ఎంతో భద్రంగా పాలితిన్ బ్యాగ్ లో దాచిన సర్టిఫికెట్లు తీసి ఆఫీసర్ ముందు పెట్టాడతను. ఇలాంటి రోజొకటి వస్తుందని వూహించాడో లేదో గానీ వాటిని ప్రాణప్రదంగా కాపాడుతున్నట్టున్నాడు.
వాటిని చూడనైనా చూడకుండా పక్కన పెట్టి “జావో, తస్వీర్ ఉతరో” అన్నాడు. అతను మాట్లాడే పద్ధతి చూస్తే మహమ్మద్ యూసుఫ్ భవిష్యత్తు ముందే నిర్ణమైపోయినట్టు అనిపించింది.
యూసుఫ్ నెమ్మదిగా కెమెరా వైపు నడిచాడు.
అతన్ని ట్రీట్ చేసిన పద్ధతి చూస్తే మొత్తం SIR ప్రహసనమంతా పెద్ద కుట్ర అని స్పష్టమైంది. మోడల్ మార్కెట్లో యీ నాటకం జరగటం చాలా సమంజసం అనిపించింది. అక్కడ మనుషులందరూ సంతలో పశువుల్లా కనిపించారు. పశువులకి సుడులు మచ్చలు వెదుకుతారు. పొదుగు వట్టలు గిట్టలు పట్టి పరీక్షించి చూస్తారు. ఇక్కడ కూడా మనుషుల్ని కులం మతం జాతి అభిప్రాయాల ‘పుట్టుమచ్చ’లతో గుర్తించి వోట్ల సంతలో నిలబెట్టినట్టు అనిపించింది. సంతలో పనికిరాని పశువుని కబేలాకి పంపినట్టే యిక్కడ కూడా వుపయోగపడని ‘అన్యుల్ని’ గుర్తించి లిస్ట్ నుంచి తొలగించి కాన్సన్ట్రేషన్ క్యాంపుకు పంపుతారేమో అని అనిపించింది. ఆ ఊహతో నాకు వొళ్ళు వొక్కసారిగా జలదరించింది. ఆ జలదరింపు దిగకముందే ఆఫీసర్ నా పేరు పిలిచాడు.
వెళ్లి అధికారి ముందు కుర్చీలో కూర్చున్నాను. నేనేదో మాట్లాడేలోపు యేదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడుతూ సీటులోంచీ లేచి కిటికీ దగ్గరకెళ్లాడు.
కుడి వైపున క్యూలో నిలబడ్డ ఒక పెద్దామె తనలో తాను మాట్లాడుకొంటుంది. ముతక చీరలో నడుం వొంగిపొయిన ఆమె మాటల్ని యెవరూ పట్టించుకోడం లేదు.
‘ఆశా పిల్ల రమ్మంది నాయనా. ఎండ బయంతో ఆటోలో వొచ్చానయ్యా, నూటయాభై తీసుకున్నాడు. బస్సు ప్రీయే గానీ యింటి కాడ నుంచి నడవాలి. రాపోతే ఓటుండదు అంటే, పోతే పాయె అనుకున్నా. రేపు పించను కూడా యివ్వరంటే చచ్చినట్టు వచ్చా. నన్ను తొందరగా పంపించండి నాయినా” ఎవరూ అడక్కుండానే ప్రశ్నలూ జవాబులూ అన్నీ వొక మోనోలాగ్ లా ఆమె చెప్పుకుపోతోంది.
ఆఫీసర్ కిటికీని వదల్లేదు. ఏం తోచక దిక్కులు చూస్తున్నాను.
నాకు ఎడం పక్కన కూర్చున్న అధికారి యెదురుగా వొక వ్యక్తి నిలబడి వున్నాడు. ఆఫీసర్ కూర్చోమన్నా కూర్చోలేదు.
“మీ పేరు?”
“పృథ్వీ”
“పూర్తి పేరు?”
“పృథ్వీ రాజ్ యాదవ్ బత్తుల”
“మీకు యిక్కడ కాకుండా మరెక్కడన్నా ఓటు ఉందా?”
“No SIR, ఈ రాష్ట్రంలో గానీ పొరుగు రాష్ట్రంలోగానీ మరెక్కడా ఓటు లేదు.”
“ఇప్పడుంటున్న అడ్రస్ లో యెన్నాళ్లుగా వుంటున్నావ్?”
“రెండొందల యేళ్ళ నుంచి అదే అడ్రస్ SIR. రెవిన్యూ రికార్డ్స్ లో చూసుకోండి. మా ముత్తాత కాణ్ణుంచి యింకా ముందు నుంచే అక్కడ్నే వుంటున్నం. నేను అక్కడే పుట్టిన. మానాన్న అక్కడే పుట్టిండు. మాతాత అక్కడే పుట్టి అక్కడే చచ్చిండు. నన్నెలా అనుమానితుల జాబితాలో పెట్టిన్రు? మొన్న కూడా వచ్చిన. ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ అని తిప్పించి.. గంటలు గంటలు లైన్లో నిలబెట్టి మా తాత ఓటు ట్యాగ్ కాలేదు, మా ముత్తాత ఓట్ మ్యాప్ కాలేదంటవ??.. ఏంది SIR గింత సతాయిసున్నరు?
“2002 లో మీకు వోటు లేదు. అందుకని మీ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ వోట్ల వివరాలు అడిగాం. మీరిచ్చిన డిటైల్స్ మేచ్ కావడం లేదు”.
“SIR, 2004 లో ఓటు హక్కు వచ్చిన దగ్గర నుండి.. ప్రతి ఎన్నికల్లో ఒకే బూత్ లో ఓటు వేస్తున్న. మీ ఎలెక్షన్ కమీషన్ యిచ్చిన ఓటర్ కార్డు పనికిరాదంటే ఎట్ల SIR ?
“మొన్న 2024 అసెంబ్లీ ఎన్నికల టైంల మీరిచ్చిన అదే ఓటర్ లిస్టు నుండే ఓటర్ నెంబర్, ID డౌన్ లోడ్ చేసి.. MLA అభ్యర్థికి చీఫ్ ఎలక్షన్ ఎజెంట్ గా అప్లై చేస్తే.. ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్న RDO గారు స్వయంగా అప్రూవ్ చేసి.. నా మొహాన ఒక ఐడెంటిటీ కార్డు కూడా యిచ్చిన్రు కదా? ఇదేదీ పనికి రాదా? ఇదేం అన్యాయం SIR?”
ఆ యువకుడు మంచిగా సూటిగా ఆర్గ్యూ చేస్తున్నాడు.
“మా చేతుల యేముంది తమ్మీ, పై వాళ్ళు చెప్పినట్టు మేం చేస్తున్నం” ఆఫీసర్ నీళ్ళు నమిలారు.
నేను గమనించలేదు గానీ అప్పట్నుంచి బొట్టు మనిషి నన్నే చూస్తున్నాడు అనిపించింది. వాణ్ని యెక్కడో చూసినట్టుంది.
ఇంతలో నా ఆఫీసర్ కిటికీ వొదిలి వచ్చి సీట్లో కూర్చుంటూ ఉత్తరాది స్టైల్లో
“కాగజ్ దిఖావో” యూసుఫ్ ని అడిగినట్టే అడిగాడు.
“Yes SIR” ఆధార్ కార్డు చూపించాను
“ పనికిరాదు” విసురుగా పక్కన పడేశాడు.
“బాగా చదువుకున్నారు, సుప్రీం కోర్ట్ జడ్జిమెంటే వుంది ఆధార్ యెందుకూ పనికిరాదని. అది మీ అడ్రస్ ప్రూఫ్ మాత్రమే”.
“కానీ వొకప్పుడు ఆధార్ ఆరో ప్రాణం అన్నారు? అది కోల్పోతే జీవనాధారమే కరువు అన్నారు?”
“ఆధార్ కార్డు క్రియేట్ చేసిన పెద్ద మనిషి నెలికానికే గతిలేదు. ఆయనకే నోటీసులికిచ్చాం.” నువ్వెంత అన్నట్టు చూసాడు.
“డబలింజన్ సర్కార్ లో ఆవులక్కూడా ఆధార్ యిస్తున్నాం”
“ఓటు హక్కు యివ్వాలని ప్లాన్ లేదా?”అని అడగబోయి నన్ను తినేశాలా చూస్తున్న బొట్టు మనిషిని చూసి ఆగిపోయాను,
వాడి చూపులు వాణ్ని పట్టిచ్చాయి. వాడెవడో గుర్తొచ్చింది. మా గల్లీలో పండక్కి దేవుడి విగ్రహం పెట్టి చందాల కోసం వచ్చినప్పుడు ‘నేనివ్వను’ అంటే ఆరోజున ‘ఎందుకివ్వవు’ అని సరిగ్గా యిలాగే చూశాడు. రెండోసారి అధికార పార్టీ వోటరు స్లిప్పులు యింటింటికీ పంచుతున్నప్పుడు చూశాను. నా వోటు యెందుకు డౌట్ ఫుల్ అయ్యిందో కొంచెం అర్థమైంది.
“ఇదిగో యిది నా PAN Card, దాదాపు నలభై యేళ్లుగా యిన్కమ్ టాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తున్నా. దీనికి నా బ్యాంకు అకౌంటూ ఆధారూ లింకై వున్నాయి” నా గొంతులో ప్రౌడ్ టాక్స్ పేయర్ అన్న గర్వం నాకే వినిపించింది. దేశాభివృద్ధిలో నా స్వేదం కూడా వుందన్న నిజాయితీ కూడా పలికింది. ఆఫీసర్ కి అదేం పట్టలేదు.
“ఇది మీ ఆర్థిక లావాదేవీల గురించి మాత్రమే తెలియజేస్తుంది. అయినా వుంచండి” ఆన్నాడు ముక్కు చిట్లించుకుంటూ.
“Yes SIR, అయితే పాస్ పోర్ట్ వుంది చూడండి” అయిదుసార్లు అమెరికా వెళ్లొచ్చిన ధీమాతో అన్నాను.
“అదొక కాపీ ఇవ్వండి. అయినా అది మీకు విదేశ ట్రావెల్ కి అనుమతి పత్రం మాత్రమే. ఆ శాఖా మంత్రి మొన్నీ మధ్యే చెప్పారు వినలేదా?” అని నన్ను పై నుంచి కిందకు స్కాన్ చేస్తూ అన్నాడు.
“Yes SIR. నిజానికి యీ డాక్యుమెంట్స్ అన్నీ మీకు అందుబాటులోనే వుంటాయి కదా?” అన్నాను కొంచెం బిడియంగా చిరాకు పడుతూ.
“ఉంటాయి. మీ పేస్ బుక్, ఇన్స్టా గ్రామ్, ఎక్స్ పోస్టులు కూడా మాకు తెలుసు” అన్నాడు అధికారి బొట్టు మనిషి కనుసైగ అందుకొని.
నాకు నా ఓటెందుకు అనుమానాస్పదమైందో పూర్తిగా అర్థమైయింది. దేశాధినేత నార్సిస్ట్ స్వభావం గురించి యెఫ్బీలో పెట్టిన పోస్టు గుర్తొచ్చింది. రోట్లో తల పెట్టానని తెలిసింది.
నెలకు పద్దెనిమిదొందలు వస్తున్న ఈపీఎఫ్ పెన్షన్ ఆర్డర్ సర్టిఫికెట్, దాదాపు శిథిలావస్థలో వున్న యాభై ఆరేళ్ళ నాటి నా పదో తరగతి మార్కుల పుస్తకంలో వున్న మొదటి పేజీ (బర్త్ సర్టిఫికేట్ గా ఆ పేజీనే యెప్పుడూ అడుగుతారు), ఓటర్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ముప్పై అయిదేళ్లపాటు నేను పనిచేసిన స్కూల్ వాళ్ళిచ్చిన సర్వీస్ సర్టిఫికెట్, జీవన ప్రమాణ్ పత్ర్ .. ఒక్కో దాన్నీ వివరిస్తూ ఫైల్ లో నాదగ్గరున్న కాగితాలన్నీ టేబిల్ మీద పరిచాను.
“సర్లేండి. అవన్నీ అక్కర్లేదు, పాన్ కార్డు, పాస్పోర్ట్, టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ కాపీలు యిచ్చి వెళ్ళండి” నా బాడీ లాంగ్వేజ్ లోని ఫ్రస్ట్రేషన్ గమనించి అన్నాడు.
“అలా నుంచోండి. ఫోటో తీస్తారు.” అని చెప్పి నెక్స్ట్ అని అరిచాడు.
మూడు గంటల నరకం నుంచి చెమటలు కక్కుకుంటూ బయటికి వచ్చాను.
బయట పరిస్థితి నేను వచ్చినప్పటి కంటే గందరగోళంగా వుంది. ప్రెస్ వాళ్ళు కొందరు కెమేరాలు మైకులు పట్టుకొని తిరుగుతున్నారు.
నాలుగడుగుల దూరంలో పొడుగాటి నల్లటి దృఢకాయుడు మీడియా వీడియోగ్రాఫర్స్ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. ఆయన పెదాలు కోపంతో వొణుకుతున్నాయి.
“నా పేరు సూర్య కుమార్, హైకోర్టు జడ్జి గా పనిచేశాను. ఎలక్షన్లొచ్చిన ప్రతిసారీ వోటు హక్కు వినియోగించుకున్నాను, రెండు సార్లు లోకసభకు పోటీ చేశాను. అయినా అనుమానితుల జాబితాలోకి యెట్లా యెక్కాను?”
ఆయన ప్రశ్నకి జవాబెవరు చెబుతారు?
“జస్టిస్ గారూ, నాదో ప్రశ్న, అసలు ఇన్ని లక్షల మందిని ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించే అవకాశం వుందా? కోర్టులు పట్టించుకోవా? కోర్టుకెళ్తే న్యాయం దొరుకుతుంది కదా?” రిపోర్టర్ కొత్త ప్రశ్న సంధించాడు.
“ఓటర్ లిస్ట్ నుంచి పేరు తీస్తే కంటెస్ట్ చేయొచ్చు. న్యాయ పోరాటం చెయ్యొచ్చు. కానీ యెంతమంది కోర్టుకి వెళ్ళగలరు? అక్కడ క్యూలో నిల్చున్నవాళ్లలో యెంత మంది అఫర్డ్ చేయగలరు? ఇదంతా అనుమానితుల లిస్ట్. తమకు వోటు వెయ్యరేమో అని అనుమానం వున్నవాళ్ళందరూ అందులోకి యెక్కుతారు. ఒకప్పుడు వోటర్లు ప్రభుత్వాల్ని యెన్నుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వాలే తమ వోటర్లని ముందుగా నిర్ధారించుకుంటున్నారు. ముస్లింలు దళితులు ఆదివాసీలు ప్రోగ్రెసివ్ థింకర్స్ వీళ్ళు వాళ్ళ టార్గెట్. దేశమంతటా ఎనభై : యిరవై ఫార్ములా నడుస్తున్నది. దాని అంతిమ రూపమే SIR. భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్ళ పౌరసత్వం తొలగించే కుట్ర యిది.”
మీడియా రిపోర్టర్ జస్టిస్ సూర్యకుమార్ పక్కనున్న మరో పెద్దాయన ముఖం ముందు మైక్ పెట్టాడు.
“చెప్పండి లోపలంతా బావుందా?” టాపిక్ ని పక్కకి మళ్లిస్తూ.
“నాకిప్పడు డెబ్భై యెనిమిదేళ్ళు. మా నాన్న నన్ను స్కూల్లో చేర్చినప్పుడు రాసిన రికార్డు ప్రకారం నా వయస్సు 80. నాకు మా నాన్న నాకన్నా 14 ఏళ్ళే పెద్ద అని రికార్డులో వుంది. అలా అనే ఓటర్ లిస్టులో రాసుకున్నారు, మీ తండ్రిగారి వయసు అనుమానస్పదం కాబట్టి నీ ఓటు యెందుకు తొలగించకూడదు అని నాకు నోటీసు. మా తండ్రి గారి ఆధార్ ప్రకారం ఆయన వయసు 94 సంవత్సరాలు. ఇవన్నీ ప్రభుత్వ రికార్డులే. వాళ్ళే చెక్ చేసుకోవచ్చు కానీ చేసుకోరు. ఓటు తీసేయడానికి ఒక సాకు కావాలి సరే. చీఫ్ ఎలెక్షన్ కమీషనర్ గారి విషయంలో ఆ సాకు ఎందుకులేదు? ఆయన తల్లి వయస్సూ ఆయన వయస్సూ చెక్ చేయొచ్చు. నా కథే ఆయనదీ. నన్ను తొలగించినట్టే ఆయన్నీ తొలగిస్తారా? ”
“ఇంకో జంతర్ మంతర్ వుద్యమం చేస్తే గానీ స్టేట్ కదలదు. అసలు సూత్రధారులు బయటికి రాక తప్పదు. ఈ సారి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించే చీఫ్ ఎలక్షన్ కమిషనరే రాజీనామా చేయాలి.” అంటూ జడ్జి గారు అక్కడి నుంచి ముందుకు కదిలారు.
నేను కూడా ఇంటిదారి పట్టాను.
ఇందాక ఆఫీసర్ తో వాదించినతను పడడుగుల దూరంలో బయట గేటు దగ్గర యెత్తుగా వున్న బండ మీద నిలబడి పెద్దగా మాట్లాడుతున్నాడు. అతని చుట్టూ పది మంది పోగయ్యారు.
“పోలీస్ స్టేషన్లో దొంగను నిలబెట్టి ఫోటో తీసినట్టు.. BLO ముందు నిలబెట్టి .. చేతిలో ఫాం పట్టుకొని అతనికి చూపిస్తూ ఫోటో తీయించిన్రు. ఇప్పటి దన్క నా జీవితంలోనే యిదే హైలెట్!
“ఐనా ప్రజాస్వామ్యంపై అభిమానంతో.. ఎన్నికల ప్రక్రియలో క్రియాశీలకంగా వుండే నా లాంటి వాళ్ళనే అనుమానితుల జాబితాలో చేర్చారంటే.. ఇంక సమాజంలో పర్మినెంట్ అడ్రెస్స్ లేనోళ్లు.. బతుకుతెరువు కోసం వలసలు పోయినోళ్ళు.. ఏ వాయిస్ లేనోళ్ళు.. చదువు లేనోళ్ళు.. ఏ అండా లేని ముసలి ముతకా పరిస్థితి ఏంటి? అంబేద్కర్, గాంధీ, నెహ్రులు కలలు గన్న ప్రపంచలోనే గొప్పదైన మన ప్రజాస్వామ్య వ్యవస్థను ఏం చేద్దాం అనుకుంటున్నారు??
“ఎలక్షన్ కమీషనర్ అధికార పార్టీకి అమ్ముడుపోయిండు. చూస్తుండండి.. మొన్న ఆ బంగ్లాదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తన ఇంట్లో దాక్కుంటే.. బయటకు లాగి అరెస్టు చేసినట్టు.. వీళ్ళని కుడా ఒక రోజు అరెస్టు చెయ్యడం ఖాయం!
“ఈరోజున ఎన్ని కుప్పి గుంతలు వేసినా.. ఎంత మంది బూట్లు నాకినా.. రేపటి రోజున సప్త సముద్రాల అవతల దాక్కున్నా తప్పించుకోలేవ్.. అసలు నీ లాంటి వాడు చట్టం నుండి శిక్షలు పడకుండా తప్పించుకుంటే.. అది ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికికే పెను ప్రమాదం!!”
కోపంతో అతని కళ్ళు యెరుపెక్కాయ్. అతని మాటలకి నాక్కుడా రక్తం లావాలా మరిగింది.
లోపల ప్రతి దానికీ ఎస్ సర్ అని జవాబు చెప్పాను. ఇప్పుడు ‘NO SIR’ అని చెప్పాలనుకున్నా.
“ఓట్ చోర్ గద్దీ ఛోడ్” అని పృథ్వీ నినాదం యెత్తుకున్నాడు.
“ఓట్ చోర్ గద్దీ ఛోడ్”
అతనితో నా గొంతు కలిపాను.
“ఓట్ చోర్”
“గద్దీ ఛోడ్”
అక్కడ పోగైన పది మందీ మోడల్ మార్కెట్ ని జంతర్ మంతర్ చేశారు.
ఎ. కె. ప్రభాకర్




