నెత్తిమీద కళ్ళువుండి నేలమీదకు వొక్కక్షణం చూపు తప్పిందేమో అరటితొక్క మీద అడుగు పడింది. కాలు జర్రున జారింది. దబ్బున రోడ్డుమీద పడ్డాడు.

పాపం పడిపోయాడని పదిమంది కాకపోయినా నలుగురూ చేరి అతణ్ణి లేపి నిలబెట్టబోయారు.

“లేపడానికి వీల్లేదు” అని మరో నలుగురు వచ్చి అడ్డుకున్నారు. లేపబోయినవాళ్ళకి అర్థంకాక- సగం లేపి పట్టుకున్నారేమో మధ్యలో అలాగే ఆగిపోయారు, పడ్డవాడు చెడ్డవాడేమోనని.

పడ్డవాడు పరమ మంచివాడిలా దీనంగా చూశాడు.

“అసలు లేపడానికి మీరెవరు? పడేయండి” అన్నారు ఆ నలుగురు.

ఎత్తుతున్న యీ నలుగురూ పడేశారు. పడేశాక, “వాళ్ళు పడేయమంటే మనం పడేయడమేమిటి?” అందులో వొకడు అడిగాడు. “ఔను” అని వీళ్ళలోనివాడే మరొకడు మద్దతిచ్చాడు. ఆ యిద్దరి మాటా నిజమేనన్నట్టు మిగిలిన యిద్దరూ తలలు ఆడించారు. అంతే, తాము చేసిన తప్పు గ్రహించినట్టు మళ్ళీ లేపబోతున్నారు…

“వద్దూ… లేపొద్దూ… లేపి అన్యాయం చెయ్యొద్దు” అని అరిచారు ఆ నలుగురూ.

అంత గట్టిగా అరిచి చెపుతున్నారంటే, తామేదో తప్పు చేస్తున్నట్టు అనుమానం కలిగింది యీ నలుగురికి. మునిపటిలాగే సగం లేపి పట్టుకున్నారేమో మధ్యలో అలాగే ఆగిపోయారు మళ్ళీ.

“ఎందుకు చెపుతున్నామో వినండి, పడేయండి” ఆ నలుగురూ చెవికెక్కేలా గొంతు తగ్గించి కనురెప్పలు ఆర్పి తెరచి శాంతంగా చూసి మరీ చెప్పారు, యేదో హితబోధ చేస్తున్నట్టు.

అంతే, దబ్బున పడేశారు యెత్తుతున్న యీ నలుగురూ. ఈసారి అరటితొక్క మీద అడుగేసి పడ్డప్పుడు కంటే యెత్తి పడేయడంవల్ల పెద్ద దెబ్బే తగిలింది. “అమ్మో పడేసార్రోయ్…” అని అరిచాడు పడ్డవాడు, ముడ్డి పాముకుంటూ. నొప్పికి మూడొంకర్లు మూతి తిప్పుకుంటూ.

అప్పటికి తాము చేసిన తప్పు అర్థమైనట్టుంది యీ నలుగురికీ. ముఖాముఖాలు చూసుకున్నారు. చూసుకొని, తిరిగి పడ్డవాడివైపు జాలిగా చూశారు.

పడ్డవాడికి యేడుపు వొకటే తక్కువ. ‘మిమ్మల్ని యెవడు లేపమన్నాడూ… యెవడు పడేయమన్నాడూ…’ అన్నట్టు చూశాడు.

“మనం పడేశాము గనుక మనమే లేపుదాము, యేమయినా సరే…” యీ నలుగురిలో వొకడు ఖండితంగా అన్నాడు. “ఔను, మనం పడేశాము… మనమే లేపుదాం” అని మరొకడు వంత పాడాడు. మిగతా యిద్దరూ ఆమోదంతో తలలు వూపారు. అంతా వొక్కటయ్యారు.

అంతే, పడేసిన వాడిని మళ్ళీ పట్టి లేపారు. సగం లేపేసరికే ఆ నలుగురూ మళ్ళీ వచ్చి “మీరు అతనికి సాయం చేస్తున్నామని అనుకుంటున్నారు, కాని మీరు చేసేది సాయం కాదు… అన్యాయం!” అనేసరికి పూర్తిగా లేపకుండా మధ్యలోనే మళ్ళీ అలాగే ఆగిపోయారు.

“ఎత్తితే యెత్తండి… యెత్తకపోతే వదిలేయండి, అంతేగాని మాటి మాటికి యిలా యెత్తి పడేయకండి… ఆఁ…” అన్నాడు పడ్డవాడు యేడుపు గొంతుతో.

ఏం చెయ్యాలో తోచలేదు యీ నలుగురికి. ఒక్కక్షణం తేల్చుకోలేనట్టు వుండిపోయారు. అటు నేలకీ లేడు… యిటు పైకీ లేడు పడ్డవాడు. తన సంగతి తనకేమీ అర్థం కాలేదు. ‘పడ్డవాడి మీద కోడి పెంట వేసినట్టు’ సామెత యెందుకో గుర్తుకువచ్చింది. అవస్త పడుతూ అచేతనంగా వుండిపోయాడు.

ఫ్రీజ్ చేసిన ఫోటోలో వున్నట్టు వుంది… చూసేవాళ్ళకి ఆ దృశ్యం.

“ఇది తేలే యవ్వారం కాదు గాని…” అని, ముందుకొచ్చిన ఆ నలుగురూ పడ్డవాడిని చూసి, “వాళ్ళకి బుద్ధి లేదు, నీకు లేదా?” అని అడిగారు. పడ్డవాడు దెయ్యం పట్టినట్టు చూశాడు. లేపుతున్న వాళ్ళు ‘మాకు బుద్ధి లేదా?’ అని నొచ్చుకుంటూ కోపం తెచ్చుకుంటూ చూశారు.

“నీకు నువ్వు పడిపో” అన్నారు ఆ నలుగురూ.

“పోను… పడిపోను” అన్నాడు పడ్డవాడు.

“పడిపో…”

“పోను…”

“పడిపో…”

“పోను…”

అరుచుకున్నారు.

చివరకు పడ్డవాణ్ని పట్టుకు తోసేశారు ఆ నలుగురూ, పట్టుకున్న యీ నలుగురి చేతుల్లోంచి లాగి మరీ.

పడ్డవాడు మళ్ళీ పడ్డాడు. “చంపీసార్రోయ్…” అని అరుస్తూ.

“ఎందుకు తోసి పడేశారు?” అడిగారు యీ నలుగురూ.

“వాడికి వాడు పడ్డప్పుడు యీ మాట అడగలేదేం?” తిరిగి అడిగారు ఆ నలుగురూ వొక్కటై.

“పొరపాటున పడ్డాడు…” అన్నారు యీ నలుగురూ, సహజమే అన్నట్టు.

“మేం అటువంటి ‘పొరపాటు’ చెయ్యలేదు, కావాలనే పనిగట్టుకు పడేశాం” అన్నారు ఆ నలుగురూ, వొక్కో మాటని వొత్తి పలికి మరీ.

“అదే… యెందుకు పడేశారు…” పడ్డవాడికి మళ్ళీ చెయ్యి అందివ్వబోతూ యీ నలుగురూ.

“ఒకసారి చెయ్యి అందిస్తే, మరోసారి పడ్డప్పుడు చెయ్యి అందివ్వడానికి మీరే కాదు, యెవరూ లేకపోతే?” ఆ నలుగురిలో వొకడు సూటిగా ప్రశ్నించాడు. “అలాగే రోడ్డుమీద పడి వుండిపోతాడా? మరి లేవడా?” మరొకడు మద్దతుగా నిలిచాడు. మిగతా యిద్దరు తలలు ఆడించి ‘వూ’కొట్టారు.

లేదన్నట్టు తలని అడ్డంగా వూపాడు పడ్డవాడు.

అందుకు విరుద్దంగా తలలు వూపారు యీ నలుగురూ… యిస్తున్న చేతిని వెనక్కి లాక్కోవడమే కాదు, అడుగులూ వెనక్కి వేస్తూ.

అది చూసి ‘యిప్పటికి అర్థం చేసుకున్నారు’ అన్నట్టుగా మెచ్చుకోలుగా యీ నలుగురితో చేతులు కలిపి అభినందన పూర్వకంగా చూశారు ఆ నలుగురు.

‘గుర్రం యెక్కేవాడు పడక మానడు… రేపు మీరూ పడకపోతారా?’ అని పడ్డవాడు లోపల కుంగిపోవడం పైకి కనిపిస్తోంది.

“ఇప్పుడూ… మనలో మన మాట. ఎవడైనా లేపేవాడు వుంటేనే చూసి పడిపోతామా? లేకపోతే పడమా?” ఆ నలుగురిలో వొకడు అడిగేసరికి, అందరూ పాముల్లా తలలు ఆడించారు.

పడ్డవాడు మాత్రం ‘లోకం తనమీద యిలా పగబట్టింది యేమిటా?’ అన్నట్టు చూస్తున్నాడు. ఆ సమయంలో ‘పడ్డవాడికి గుర్రపు వాతలు తప్పవు’ అని నాయినమ్మ పొడిచిన సామెత గుర్తుకువచ్చింది. పడ్డప్పుడు తగిలిన దెబ్బలు నిజంగా వాతల్లానే కనిపించాయి తన వొంటిని తాను తడిమి చూసుకుంటే.

“చెప్పొచ్చేది యేమిటంటే, పోని… లేపేవాడు వున్నాడనే పడిపోదాము అని అనుకుంటే, అక్కడితో అయిపోలేదు. నిజానికి అసలు కథ అక్కడి నుండే మొదలవుతుంది…” చెప్పేవాడు సొంత అనుభవం చెపుతున్నట్టు చెపుతుంటే, అంతా ఆసక్తిగా కన్నార్పకుండా చెవులొగ్గారు.

పడ్డవాడు కూడా పాఠం వింటున్నట్టే శ్రద్ధగా వింటున్నాడు.

“లేపేవాడు యేమనుకుంటాడు? నేను నా చెయ్యిచ్చి, పైకి లాగడానికి నా బలం పెట్టి, ఆగి నా సమయం పెడితే- లేచాక, యెంచక్కా దులుపుకు తనమానాన తను వెళ్ళిపోతున్నాడని అనుకోవచ్చు కదా? మనుషులు అందరూ వొకలా వుండరు కదా?” ఆమాటకు అందరూ అవునన్నట్టు తలలు వూపితే, పడ్డవాడు కాదన్నట్టు తల వూపాడు.

“ఆ వొక్కటే అనుకుంటే పరవాలేదు, రేపు నేను పడితే వీడు నాకోసం ఆగుతాడా? ఆగి చెయ్యిస్తాడా? కాదని హేండిస్తాడా? ఇప్పుడే దులుపుకు పోయాడు తప్పితే, థాంక్స్ కూడా చెప్పలేదు. ఒకవేళ థాంక్స్ పడేసి పోతే కూడా యెంతసేపూ వాడి బాధ వాడిదే. ఇంక జీవితాంతం కృతజ్ఞతతో మెలుగుతాడా?- అని అనుకోవచ్చు. అనుకొని బాధ పడవచ్చు…” అని ఆ నలుగురిలో వొకడు చెపుతుంటే, మరొకడు “అలా చేయని నేరానికి, చేసిన మంచికి హర్ట్ అయితే- రేపు నిజంగా చెయ్యి అందించాల్సి వచ్చినప్పుడు చెయ్యి అందిస్తాడా? అందివ్వడు. అంటే అతను మొండి చేతులవాడయిపోవడమే కాదు, అతనిలోని మనిషి సహితం మాయమయిపోతాడు. ఇవన్నీ అవసరమా?” అని ఆవేదన పడ్డాడు.

గుమికూడిన అందరూ అడ్డంగా తలలు వూపారు.

పడ్డవాడు మాత్రం తలని యెటూ వూపలేదు. ‘పడ్డవాడికి లేపేవాడు లేడు కాని తొక్కేవాడు వున్నాడు’ సామెత నిజమవుతున్నట్టుగా తోచింది.

“అయ్యో పడిపోయాడని మనం చెయ్యిచ్చి లేపుతామా? మనం లేపుతామో లేపమో అని పరీక్ష పెట్టడానికి అతను పడిపోయుండొచ్చు. లేదా నేను పడ్డానని తెలిసి యెవరెవరో వచ్చి చెయ్యిచ్చారు. బెస్ట్ ఫ్రెండ్‌వి నువ్వు మాత్రం రాలేదు. వచ్చి నన్ను లేపలేదు. అసలు నువ్వు లేపుతావనే నేను యెంతో ఆశతో పడిపోయాను. మరెంతో ఆశతో యెదురుచూశాను- అని అంటే?” అందరి ముఖాల్లోకి చూస్తూ మరొకడు అడిగాడు.

‘నేను పడిపోవడం సరే, యిందులో యిన్ని గూడార్థ రాజకీయాలు వున్నాయా?’ నోరు వెళ్ళబెట్టాడు పడ్డవాడు.

“సొంత అనుభవంలా వుంది” అని గుమికూడిన వాళ్ళలో యెవరో అంటే, “లా కాదు, సొంత అనుభవమే. నాకూ ఆ అనుభవం వుంది” అన్నారు మరెవరో.

“నేను యెప్పుడు పడిపోయాను, నువ్వు యిప్పుడు వచ్చి లేపుతావా- అంటే?” ఆ నలుగురిలో యింకొకడు అంటే, “వొక్కొక్కరి అనుభవం వొక్కోటి కావచ్చు. కాని పడిపోవడం లేవడం అందరికీ అనుభవమే. ఆ అనుభవం లేనివాడు లేడు” యీ నలుగురిలో వొకడు అన్నాడు.

నిజమేనన్నట్టు అందరూ తలలు వూపుతున్నారు.

‘పడిపోవడం మీద నేనింత పీహెచ్డీ చెయ్యలేదు’ పడ్డవాడు అనుకుంటూ యీ సారి తన స్థితి గురించి ఆలోచించలేదు. తను చెయ్యి అందించినప్పటి ఆలోచనలు అనుభవాలు గుర్తుకు వచ్చాయి.

“నువ్వు చాలా అదృషవంతుడివి” అని పడ్డవాడిని అన్నారు.

‘నేనే?’ అన్నట్టు చూశాడు పడ్డవాడు.

“నీకు పడడానికి అరటి తొక్క ఆసరా దొరికింది. అది నీ లక్. అన్నిసార్లూ తొక్కలో అరటితొక్క దొరకదు. కాలు అడ్డం పెట్టాల్సివస్తుంది. మన కాలు అయితే మనకి రిస్క్. అదే పక్కవాడి కాలయితే నొప్పి మనకు వుండదు. పరామర్శ వొక్కటే వుంటుంది…” వొకడు తన అనుభవం చెపుతుంటే- 

మరొక తలపండినవాడు అడ్డం పడి “అప్పుడూ నువ్వు పడవ్. ఒకడికి పదిమందిని కలుపుకోవాలి. తోడు తెచ్చుకోవాలి. ఏదీ వుచితం కాదు. కొంత ఖర్చవుతుంది. మరింత సమయం సహనంతో వోపికతో వెయిట్ చెయ్యాలి. అప్పుడూ పడకపోవచ్చు. ఇంతకీ చెప్పేది యేమిటంటే పడడమూ యేమంత సులువు కాదు. పడేయడమూ సులువు కాదు. లేపడమే సులువు. అందుకని అది అందరూ చేస్తారు. చేతగానివాళ్ళు కూడా. పెద్ద గొప్ప పని చేసినట్టు. చేసి చెడగొడతారు…” తేల్చేశాడు.

పడ్డవాడికి గిర్రున కళ్ళు తిరిగాయి. మళ్ళీ పడకుండా నేలమీద పడివుండి బతికిపోయాడు. లేకపోతే మళ్ళీ దబ్బున పడాల్సిందే.

“పడ్డవాడే లేవాలి! తనకి తానుగా లేవాలి!” గుండెల నిండా విశ్వాసం నింపుకున్నట్టు బోరవిరిచి అన్నారు ఆ నలుగురూ- ఈ నలుగురినీ పడ్డవాడ్ని చూస్తూ.

పడ్డవాడు పెద్దగా నిట్టూర్పు విడిచి నీరసంగా కొన్ని క్షణాలు అలాగే వుండిపోవడం చూసి- యెవరో మంచినీళ్ళు తెచ్చి యివ్వబోతే యీ నలుగురూ ఆ నలుగురూ అంతా కలిసి అడ్డుకొని ఆ నీళ్ళని వాళ్ళే లాక్కొని గుక్కల లెక్కన పంచుకొని తాగేశారు.

పరిస్థితి అర్థమైంది పడ్డవాడికి. తనకి తానే లేవక తప్పని స్థితిని అర్థం చేసుకున్నాడు. ఒంటికి అంటిన మట్టిని దులుపుకొని లేవడానికి ప్రయత్నించాడు. మొదట మోకాళ్ళని నేలకు ఆనించి లేవబోతే అతనికి సాధ్యపడలేదు. నేలకు చేతులు ఆన్చి అతి కష్టమ్మీద లేవడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. దబ్బున పడ్డాడు. అది కూడా బోర్లా.

మరో నలుగురు వచ్చి ఆసరాగా చెయ్యి అందివ్వబోతే, యీ ఆ నాలుగు రెళ్ళ యెనిమిది మందీ అడ్డుకున్నారు. కథ మళ్ళీ మొదటికి తేవొద్దన్నారు.

పడ్డవాడు మళ్ళీ లేవడానికి ప్రయత్నించాడు. పడ్డాడు. మూడోసారి మొత్తానికి లేచాడు. మధ్యలో వచ్చిన మరో నలుగురు చప్పట్లు చరిస్తే, ఆగమని ఆ నలుగురూ పడ్డవాన్ని మళ్ళీ తోసేశారు. దబ్బున పడ్డాడు పడ్డవాడు.

“పునాది దిట్టం చేసుకో. పడి లేవాలంటే ముందు పడ్డం కూడా రావాలి. పడడం వస్తేనే లేవడమూ వొస్తుంది” అని ముక్తకంఠంతో చెప్పి లేచిన పడ్డవాణ్ని మళ్ళీ మళ్ళీ తోసేశారు.

లేస్తున్నపుడు ప్రోత్సహిస్తూ “కమాన్ మేన్… కమాన్…” అరుస్తూ వుంటే, ముందరి యెనిమిది మందీ వొక్కటై “రేపు యెంకరేజ్ చెయ్యడానికి యెవరుంటార్రా? మీరు గాని వాడి వెంట తిరుగుతార్రా?” అని అడిగేసరికి మధ్యలో వచ్చిన వాళ్ళకీ సులువుగా బాగా అర్థమైంది. ఈసారి లేచిన వాడిని వీళ్ళూ తోసి పడేశారు.

ఒక్కసారి పొరపాటున జారిపడితే, ఆ పొరపాటు మళ్ళీ జరగకుండా వుండేలా చుట్టూ వున్న సమాజం యెంతలా పట్టించుకున్నదో అనుభవంలోకి వచ్చాక కుమిలికుమిలి మురిసిపోయాడు పడ్డవాడు.

అంతే కాదు, పడితే- తోస్తారు… అని తెలిసాక, యింక పడకుండా వుండడానికి యెవరికి వారే ప్రయత్నం చెయ్యడంతో పడిపోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇంకో మాట, యెవరు పడిపోయినా కూడా తాము పడిపోయామని చెప్పడానికిగాని చేతులు సాయంగా అందివ్వమనిగాని  అడగడానికి యెవరూ ముందుకు రాలేదు.

దాంతో జాతి జనులు పడిపోకుండా బలంగా అడుగులు వేయడం అనే శుభ పరిణామం మొదలైంది కూడా.

సరే, మళ్ళీ పడ్డవాడి దగ్గరికొస్తే ‘పడిలేచే గుర్రానికి పరుగెక్కువ’ వాళ్ళ నాయనమ్మ చెప్పిన సామెత గుర్తు తెచ్చుకొని సంకల్పంతో లేచి పరుగుతీశాడు. పట్టుదలగా పట్టుకు దొరక్కుండా పరుగుతీశాడు. అయితే, అలా పరిగెత్తుతున్నప్పుడు అడ్డు వచ్చిన వాళ్ళనీ రాని వాళ్ళనీ చాలామందిని తోసి కింద పడేశాడు పడ్డవాడు!

Leave a Reply