మర్రి మాను వోడలు పట్టుకుని
మా ఊరి చెరువు మీదుగా ఊగుతూ..
చాలా సార్లే చూశాను..
ఆకాశం కదలడం.. జతగా ఊగడం..
నన్ను ఉడికించి నవ్వడం..
చేతులు వదిలేయమంటూ కవ్వించడం..
చూశాను నాలోకి దిగుతున్న ఆకాశం
చెలికత్తైన..నాదైన.. ఆకాశం
అలా ఊగుతూ..
కొమ్మ నుంచి కుందేటి కొమ్ము మీదకు దుంకుతూ..
ఆదివాసీ గూడెంపై వెన్నెలలు పరుస్తూ..
అంతలోనే నాపైకి దూకుతూ..
చూశాను ఆకాశం తెల్ల బడటం..
నల్ల బడటం, ఎర్ర బడటం..
చూశాను వక్ర రేఖలను భేదించిన ఆకాశం
దీక్షగా సప్త ధనుద్ధారైన ఆకాశం
చేతులిస్తున్న వేళ పక్షులకు..
కమ్మిన మబ్బుల్లో చూశాను
వ్యక్తావ్యక్త ఆకాశం
ఊగే వోడలు తెగుతున్న నిశ్శబ్ధం
ఆటకు రావా..అంటూ బాబు మారం,
ఎత్తుకోవా అంటూ కాళ్లకడ్డం పడటం గుర్తొచ్చి,
అప్రయత్నంగా కదలాడిన నీటి పొర.
అమ్మా అని పిలవాలని ఉంది
జనన కాంక్షతో
నిజంగానే చేతులు వదిలేయాలని ఉంది.
ఈ మర్రి చెట్టు, ఆ చెరువు.. కదిలే
చిన్న చిన్న ప్రపంచాల రహస్యం
నాలోను, బయటా ఊగడం చూస్తున్నాను.





బావుంది