గద్దరన్న ఇక లేడని తెలిసినప్పటి నుండి చాలా బాధగా  వుంది. ఏ పనిలో ఉన్నా ఆయనే తెగ గుర్తుకొస్తున్నాడు.

ఆయన గత కొంత కాలంగా విప్లవోద్యమానికి భిన్నమైన  దిశలో పనిచేయడం, తన పాత దృక్పథానికి భిన్నంగా మాట్లాడడం చూస్తున్నాం. ఒకప్పుడు మీడియాలో ప్రచారం కావడానికి ఇష్టపడన కళాకారుడు ఆయన. ఇప్పుడు మీడియాలో ప్రచారానికి అభ్యంతరం చెప్పకపోవడం, ఎవరు పిలిచినా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆయనని గమనిస్తున్న అభిమానులంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.

బహుశా 2014 నుండి   ఆయన విప్లవ పంథాకు, భౌతికవాద భావాజాలనికి పూర్తిగా స్వస్తి పలికి, పార్లమెంట్ పంథాకి, భావవాదంలోకి మారిపోయాడని సాహసల్  మీడియాలో ఆయన వీడియోల్లో పాటలు, మాటలు వింటున్నప్పుడు అనిపిస్తోంది. ఎందుకు గద్దరన్న ఇలా అయ్యాడనే బాధకలిగింది. ఒక వేళ తాను విశ్రాంతి తీసుకోదలుచుకుంటే, ఇంట్లోనే ఉండవచ్చు కదా! ఇప్పటిదాకా ఒకటి ఆచరించి, ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారోనని మధన  పడిన సందర్బాలు చాలానే ఉన్నాయి.

 *

బహుశా 1985 నుండి అంటే నాకు 12 ఏళ్ళ వయసుకు ఆయన రాసిన పాట “సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ” పరిచయం అయింది. అప్పటి నుండి ఆయన రూపం తెలియకపోయినా, ఆయన గురించి తెలిసినవాళ్ళు, ఆయన్ని చూసినవాళ్లు చెబుతుంటే ఆయన ఆకారరూపం నా కళ్ళముందు ఒకటి ఆవిష్కరించబడేది.

ఆయన చొక్కా వేసుకోడని, పంచెకట్టుతో పైన నల్ల దుప్పటితో (గొంగళి) కాళ్ళకి గజ్జెలు కట్టుకొని ఎవరి కంటా కనపడకుండా తిరుగుతుంటారనీ, ఆయన కోసం పోలీసులు గాలిస్తుంటారనీ మొట్టమొదటి సారిగా గద్దర్ గురించి విన్నప్పుడు ఆయన్ని చూడాలని తపించేవాడిని.

1986 లో ఆర్. నారాయణ మూర్తి మొదటి చిత్రం “అర్థరాత్రి స్వతంత్రం” సినిమా ఒంగోలు నెల్లూరు బస్టాండ్ దగ్గర బాలకృష్ణ హాలులో విడుదలైంది. మా మేనమామ పల్లెపాగు బాబు రెండు రూపాయలు ఇచ్చి ఆ సినిమా చూడమని మొదటిసారి లైసెన్స్ ఇచ్చాడు. (అప్పటిదాకా సినిమాలు ఇంట్లో తెలియకుండా చూసేవాడిని) అప్పటికే బాబు మామయ్యకు విప్లవోద్యమంతో పరిచయాలు ఏర్పడ్డాయి.

ఆ సినిమాలో “ఏం పిల్లడో ఎల్దు మొస్తవా” అనే పాట వచ్చినప్పుడు నాకు ఒళ్లంతా జలతరించింది.‌ సరిగ్గా నేను ఊహించుకొనే వ్యక్తి ఆ సన్నివేశంలో కనిపించాడు. గోశ, గొంగళి, కాళ్ళకి గజ్జెలు, చేతిలో కర్ర వున్న వ్యక్తి ఆ పాట పూర్తయ్యే వరకు తన ముఖం కనపడకుండా ఆ పాట పాడుతూ అభినయం చేస్తాడు. ఆయన ప్రక్కన ఒక మహిళా కామ్రేడ్, మరోతను కోరస్ పలుకుతూ పుస్తకాలు పంచుతుంటారు. ఆ పాట పూర్తివగానే ఆయన ముఖం చూయిస్తారు.

ఆ పాత్ర వేసింది అభ్యుదయ చిత్రాల దర్శకుడు టి. కృష్ణ. ఆ పాటను రాసింది, పాడింది, ఆ పాటకు కృష్ణకు డూప్ గా అభినయించింది మాత్రం వంగపండు ప్రసాదరావు అని తర్వాత తెలిసింది. నిజ రూపంలో ఆ పాత్ర దారుడు కామ్రేడ్ గద్దర్.

నిజమైన గద్దర్ ని చూసింది మాత్రం 1990 లో. ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో జిల్లా రైతుకూలీ మహాసభలు జరిగాయి. వెలుగొండ ప్రాజెక్టు సాధనకై గొప్ప ర్యాలీ కూడా జరిగింది. ఆ సభలో పాల్గొనడాని గద్దర్ వచ్చాడు. బహుశా చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, గద్దర్ అజ్ఞాత జీవితం వీడినాక పాల్గొన్న రెండవ బహిరంగ సభ అది.

కా. సంజీవ్, కా. దివాకర్ తప్ప జె.యన్.యం. రాష్ట్ర, జిల్లా కమిటీలు పాల్గొన్నారు. సభ మొదలైనప్పటి నుండి వర్షం పడుతుంది. అయినా చివరి వరకు సభ విజయవంతంగా జరిగింది. ఆ సభలో గద్దర్ “దళం కదులుతున్నదా! దిండు కదులుతున్నదా!” అనే పాట అద్భుతంగా అభినయించాడు. చేతి కర్రనే తుపాకిగా చూపుతూ, కవాతు చేస్తూ, క్రింద పడుకొని పాకుతూ వున్న సన్నివేశం జనమంతా నిలబడి చూశారు.  అలా నా కలల ఊహా చిత్రాన్ని నిజమైన రూపాన్ని తనివితీరా చూసిన సందర్భం అది.

“గద్దర్ గర్జన” లాంటి ఆడియో క్యాసెట్లో రోజూ ఆయన పాటలు వింటూ, పాడుకుంటూ పెరిగాం.

కొడలెత్తర తమ్ముడా, నువు కోత కొయ్యవె చెల్లెలా!

ఆగదు ఆగదు ఈ ఆకలిపోరు ఆగదు

కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మా

ఇలాంటి శ్రమజీవుల పాటలు, వింటూ నేర్చుకున్నాం

గద్దరన్న పాల్గొనే బహిరంగ సభలో ఎంత దూరమైనా, ఎంత రిస్క్ అయినా తీసుకొని హాజరయ్యేవాళ్ళం.

ఆ రోజుల్లో గద్దర్ సభలంటే గొప్ప సంచలనం. పాలకులకు, పోలీసులకు వణుకు పుట్టేది. ఏ రాజకీయ నాయకుడిని టార్గెట్ చేసి మాట్లాడతారోనని. ముఖ్యంగా ముఖ్యమంత్రినీ, ప్రజలను హింసించే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు లక్ష్యంగా మాట్లాడతాడు గనుక, ఆయన పాల్గొనే సభలకు అనుమతి దొరక్కపోయేది. చాలా సందర్భాల్లో గద్దర్ సభలకు వెళ్ళే ప్రజలను రైళ్ళలో, బస్సుల్లో నుండి మధ్యనే దించివేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వానికి నిజమైన ప్రతిపక్షం విప్లవోద్యమమే అనేది ఆ కాలంలో వుంది. పోలీసులంటే ప్రజలందరూ భయపడితే, విప్లవకారులు, విప్లవ కళాకారులు వాళ్ళను రాజకీయ నాయకుల దోపిడి ఆస్తులు కాపాడే కావలి కాసేవారిగా అభివర్ణించేవారు. ఎవరికైనా, ఎక్కడైన ప్రశ్నిస్తే నీవు నక్సలైట్ వా అనేంతగా ప్రభావం చూపారు.

1990 లోనే చీరాలలో “కారంచేడు మృతవీరుల సంస్మరణ సభ” జరగనుంది. మేము రెండు టీంలుగా విడిపోయి. మా చుట్టు ప్రక్కల గ్రామాల్లో రాత్రి వేళల్లో పోస్టర్లు అంటించి వచ్చేవాళ్ళం.

ఒక రోజు మిగిలిపోయిన పోస్టర్లు వుంటే, ప్రక్కన ఊళ్ళో ఉదయం పూట అంటిస్తుంటే, కొత్త సినిమా వాల్ పోస్టర్లని జనం వింతగా చూస్తున్నారు. వాళ్ళకి అర్థంకాలేదు,

ఒకామె వచ్చి మమ్మల్ని అడిగింది ఏం సినిమా వచ్చిందయ్యా అని అడిగింది.

మేము నవ్వుకొని అమ్మా జులై 17 న చీరాలకు గద్దరన్న వస్తున్నాడు, ఆ రోజు ర్యాలీ భారీ బహిరంగసభ జరుగుతుందని మీరు కూడా రండని చెప్పాము.

ప్రక్కన మరొక ఆమె ఈమెను అడిగింది ఎందంటా అని.

ఏ వోనే ఎవరో “గద్దలు” వస్తున్నాయట అని నిష్టూరంగా చెప్పింది.

అడినామె అర్ధంగాక తల గోక్కుంది.

అలా అక్షరం ముక్క రాని ప్రతి పల్లెకు గద్దరన్నను పరిచయం చేసినందుకు తృప్తి మిగిలింది.

తర్వాత కొన్నాళ్లకు 6.4.1997 న మేము అభిమానించే గద్దరన్న మీద హత్యాయత్నం జరిగింది.

ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆయన గురించే మాట్లాడుకున్నాము. బ్రతికుతోడో, లేదోనని ఆవేదన చెందేము. రేడియోలో వార్తలు కోసం ఎదురుచూసే వాళ్ళం.

మరుసటి రోజు “స్టేట్ బంద్” కి పిలుపందుకొని, ఆ రాత్రంతా ప్లే కార్డులు, ఎర్రజెండాలు తయారు చేసుకొని మా పల్లె నుండి ఏబై మంది యువకులం ఫస్ట్ బస్సుకి ఒంగోలు వెళ్ళాం. అక్కడ ప్రజా సంఘాలతో కలిసి బస్సులు, రైళ్ళు ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు బంద్ చేయించి, గొప్ప ఊరేగింపు చేశాము. గద్దర్ మీద దాడి అనగానే కులాలతో సంబంధం లేకుండా పీడిత వర్గాలు, వర్గపోరాటాలను కోరుకొనే వాళ్ళందరూ కదిలి వచ్చిన బందును విజయవంతం చేసిన కాలమది.

గద్దరన్న బ్రతికి మళ్ళీ ప్రజల ముందుకు పాటగా వచ్చినందుకు ఎంతో ఆనందపడ్డాము.

మా ఇంట్లో 1999 వరకు కరెంట్ లేదు. కిరోసిన్ బుడ్డి దీపమే రాత్రికి వెలుగయ్యేది. కాబట్టి మాకు రేడియో తప్ప, టేఫ్ రికార్డర్ ఉండే అవకాశం లేదు. మా యూత్ లో కొలకలూరి సింగయ్య కు గద్దరన్న పాటలంటే విపరీతమైన అభిమానం. ఆయన అంత చదువుకోలేదు. తండ్రీ కొడుకులిద్దరూ బల్ల రిక్షా నడుపుతారు. వాళ్ళ రిక్షాకి టేప్ రికార్డర్ అమర్చుకోని పాటలు వింటూ నడుపుకుంటూ ఉంటారు. సింగన్న మాత్రం గద్దర్ పాటలు, జననాట్యమండలి పాటలు తప్ప వేరే పాటలు పెట్టేవాడే కాదు. అంత పిచ్చిగా ఉండేవాడు. వాళ్ళ నాయన అయితే “సత్యహరిచ్చంద్ర ” పద్యాలు, తిరుపతమ్మ కథ లాంటి పెట్టేవాడు.

నాకు గద్దరన్న పాటలంటే ప్రాణం గనుక, రోజు రాత్రి వేళల్లో అన్నం తిని సింగన్న దగ్గరకు వెళ్ళేవాడిని, అప్పటికే ఆయన పాటలు వింటూ ఉంటాడు. దాదాపు రెండు గంటలు ఆ పాటలు విని ఇంటికొచ్చి పడుకొనేవాడ్ని.

భారతదేశం భాగ్యసీమరా

పోతివిరో రామన్నా

వందనాలు‌ వందనాలమ్మో మా బిడ్డలు

వందనమో వందనమమ్మా నా చెల్లేలా స్వర్ణమ్మా!

భావయ్యో ఒక్క సారి వచ్చిపోవా!

కారంచేడు ఒగ్గు కథ

అమ్మ నన్ను సాగనంపు – అమరుల తోవలోనా

దళిత పులులమ్మా!

నమ్మెద్దు బాబో ఒరే కూలన్న

నీ కన్నీరు నా కన్నీరు

ఒరె ఒరె కూలన్న ఇంక లేవరో

ఎరుపంటే కొందరికి భయం భయం

కొంగు నడుముకి చుట్టవే చెల్లెమ్మా

అమాస చీకటి అర్ధరాత్రి చెల్లెమ్మా ఓ చెల్లెమ్మా

ఇది తుపాకి రాజ్యంరన్నో

యంత్రమెట్ల నడుస్తువుందంటే

అందుకో…అందుకో అమరుడ జోహార్లు అందుకో

పల్లెటూరి పిలగాడా పశువులు కాసే మొనగాడా

రావణా సెందనాలో వెన్నెలా, రాజ నీకొందనాలో

మళ్ళోచ్చినాయిరో మాయదారి ఎలక్షన్లు

మల్లొస్తుండే ఓట్ల బిచ్చగాడు

జీపి వత్తంది రండిరా

ఇలాంటి పాటలన్ని ఎన్ని సార్లు విన్నా విసుకు పుట్టేవి కావు. చివరకు కూలి పనులకు వెళ్ళినప్పుడో, ఒంగోలు పనికి పోయి సాయంత్రం రైలు దిగి నడుచుకుంటూ అన్నం బాక్స్ మీద దరువు వేస్తూ, పాటలు పాడుకుంటూ రావడమనేది నిత్యం జరిగేది. ఎవరన్నా పాడమని అడిగితే, సిగ్గు, బిడియం వదిలి పెద్దగా పాడేవాడిని.

అసలు చీకట్లో భయమంటే తెలిసేది కాదు. పాట తోడుంటే వెయ్యి ఏనుగుల బలం ఉండేది.

ఆ కాలంలోనే మరో మిత్రుడి ఇంటికి వెళ్ళి “ఒరేయ్ రిక్షా” సినిమా లోని పాటలు విని కంఠస్థం చేసేవాడిని.

పోలీస్ దొరో మా ప్రశ్నలకు జవాబు చెప్పు

మల్లెతీగకు పందిరివోలే

ఈ రెండు పాటలంటే చాలా ఇష్టంగా పాడేవాడిని.

బహుశా 2000 సంవత్సరం అనుకుంటా ప్రకాశం జిల్లాలో ఇంకొల్లు పట్టణంలో కా. దివాకర్ సంస్మరణ సభ జరిగింది. ఆ సభలో విరసం నేత కా. చలసాని ప్రసాద్ గారు ముఖ్య వక్త. కా. ఇ.వి. ప్రజాకళామండలి కళాకారులు పాల్గొన్నారు. గద్దర్   వస్తున్నాడని సమాచారం వుంది. హైదరాబాద్ నుండి ఇంకొల్లుకు కారులో వస్తున్నాడు.

సభ ప్రారంభమై పాటలు, వక్తల ప్రసంగాలు అయ్యిపోయాయి. మధ్య మధ్యలో గద్దర్ దగ్గర వచ్చాడని సమాచారం. రాత్రి 10 గంటలకు వచ్చాడు గద్దర్. వేషం మార్చుకొనే సమయం లేదు. నల్ల ప్యాంటు మీదనే గజ్జెలు కట్టుకొని, చొక్కా తీసేసి గొంగళి వేసుకొని వేదిక మీదికి వస్తూనే ఈ వేషం చూశారా సగం హిందూస్తానీ, సగం పాకిస్థానీ లా ఉందికదా అని చెమత్కరించాడు.

గద్దరన్న కా. దివాకర్ తన సహచరుడుగా పరిచయం చేసుకున్నాడు. గద్దర్ తర్వాత అంతటోడు దివాకర్ గుంటూరులో ఎంబిబిఎస్ చదువును వదిలి, మొదట జననాట్యమండలి కళాకారుడుగా, కారంచేడు ఒగ్గు కథ రచనలో భాగమైన వాడిగా, తర్వాత విప్లవోద్యమంలో నాయకునిగా ఎదిగి అమరత్వం చెందాడని గుర్తుచేసుకుంటూ… గద్దరన్న తీవ్ర ఆవేదనతో

వందనాలు వందనాలు

వీరులారా వందనాలు

కన్న తల్లుల వందనాలు

కూలి రైతుల వందనాలు

దివాకరా వందనాలు

అంటూ దుఃఖంతో గద్దర్ పాడుతుంటే

రెండవ ప్రక్క కా. ఇ.వి.

దినకరుడా దివాకరా అందుకో జోహార్లు! లాలమ్మలాలి

ధర్మయుద్దము చేయనీకీ నువు ధర్మన్న అయితివిరో లాలమ్మలాలి!

గర్జిస్తూ పాపడం అద్భుతంగా ఉంది.

ఈ సభ ఇంతటితో అయిపోయింది అని అర్థరాత్రి 12 గంటలకు నిర్వాహకులు  చెప్పేవరకు చూస్తున్న ప్రజలు ఒక్కరుకూడ కదలలేదు.

గద్దరన్న అత్యంత దైర్య సాహసాలు కలవాడు. పీడిత ప్రజల పక్షాన మాట్లాడడానికి, పాడటానికి ఎంత రిస్క్ అయినా తీసుకొని ఎంత దూరమైనా వస్తాడు అనడానికి ఈ సభ గొప్ప ఉదాహరణ.

ఎవరో ముక్కూ, ముఖం తెలియని విప్లవ సానుభూతి పరుడు కా. దివాకర్ “సంస్మరణ సభ” పెడుతున్నాము. మీరు రావాలని అడగడం, వెంటనే గద్దర్ ఒప్పేసుకొని హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లా ఇంకొల్లుకు కారులో రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంత మొండిగా, పట్టుదల కలవాడు కనుకనే ప్రజలతో ఆంత పెనవేసుకుపోయాడు.

“ఎన్టోడు ఎన్టోడు ఎన్టోడు

ఈడు ఎన్నికల్లో గెలిచినాడు సంటోడు”

ఈడు సినిమాల్లో చిందులేసినాడు

శ్రీదేవి వీపుపై దరువులేసినాడు”

ఎన్. టి. రామారావు ముఖ్యమంత్రి అయ్యాక రాసిన పాట ఇది.‌ అందులో రామారావు వ్యక్తిత్వం, సినిమాలో వేసిన అసభ్య చిందుల గురించి, అతను రాజకీయాలలోకి వచ్చి ముఖ్యమంత్రి అవడానికి కారణమైన అతని కమ్మ సామాజిక వర్గ ప్రభావాన్ని ఆ పాటలో వివరిస్తాడు.

“పోతవురో రామన్నా

పేదోళ్ళ ఉసురు తలిగి

పోతవురో రామన్నా

బీదోళ్ళ ఉసురు తలిగి”

1985 ప్రాంతంలో ముఖ్యమంత్రిగా రామారావు దుర్మార్గమైన పాలన చేశాడు. నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అన్నా ఆయన గద్దె నెక్కినాక నక్సలైట్లను చంపడానికి ప్రత్యేక “గ్రేహౌండ్స్” బెటాలియన్ నియమించింది. ఎన్ కౌంటర్ చేయించిన బాడీలు హంతకులను పట్టిస్తుందని పోలీసులు డెడ్ బాడీలు మాయం చేసేవాళ్ళు ఎంతోమంది వీరులు అలా అదృశ్యం చేయబడ్డారు. ఆ సందర్భంలో రాసిన పాటే పోతవురో రామన్నా పాట. నిజంగానే రామారావు 1989 ఎన్నికల్లో ఓడిపోయాడు.

“అమ్మో బాబోయ్ చెన్నారెడ్డి వచ్చిండు

అయ్యో బాబాయ్ చెన్నారెడ్డి వచ్చిండు

తెలంగాణ తెస్తానని తెడ్డే చూపించినాడు”

చెన్నారెడ్డి రెండవ సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక బహుశా 1990 లో రాసిన పాట. చెన్నారెడ్డి నక్సలైట్ల మీద నిషేధం తొలగించాడు. గద్దరన్న అజ్ఞాతం నుండి బయటకు వచ్చాడు. బహుశా నా తరం వారికి 1990 లోనే ఆయన పరిచయం అయ్యింది. వందలాది సభలు, సమావేశాలు, శిక్షణా తరగతులు తెలుగు నేల మీద గద్దర్ నడియాడని గడ్డలేదు.

“చంద్రబాబు పాలనలోనా

చంద్రా లోకం చూపుతుండు

హైటెక్ సిటి హైదరాబాద్

చూడపోదామా బావ

హైటెక్ సిటి హైదరాబాద్

చూడానీకి పైసలు లేవు

ఆ ఆకలి కేకల హైదరాబాద్

నేను రానురో బావ”

“తెలుసుకొ తెలుసుకొ తమ్మి

నారా చంద్రబాబు చరిత సుమ్మి”

నక్సలైట్లను అంతం చేయడానికి మామ ఎన్టీఆర్ గ్రేహౌండ్స్ ని సృష్టించి అన్నలను వెంటాడి వేటాడి ఎన్ కౌంటర్ చేయించాడు. కనీసం చనిపోయిన శవాలను కూడా చూపించకుండా అదృశ్యం చేశారు. మామకు మించి చంద్రబాబు నక్సలైట్ల వేరివేతలో అత్యంత కౄరంగా వ్యవహరించారు.  మొత్తం పోలీసులకు ఫ్రీహేడ్ ఇచ్చి చట్ట విరుద్ధంగా ఎన్ కౌంటర్లు చేశారు. బ్లాక్ టైగర్స్, గ్రీన్ టైగర్స్, కోబ్రా లో పేరుతో నక్సలైట్ల సానుభూతి పరులను, హక్కుల నేతలను, ప్రజా సంఘాల నాయకులను టార్గెట్ చేస్తూ హత్యలు చేశారు.

నయీం లాంటి మాజీ నక్సలైట్ల ముఠాను పెంచి పోషించి, మరోవైపు కోవర్ట్ లను దళాలలోకి పంపి నక్సలైట్ల ను సమూలంగా తొలగించడానికి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు.‌

సహజంగానే చంద్రబాబు హైటెక్ పాలన మీద, చంద్రబాబు వ్యక్తిత్వం, దోపిడి మీద గద్దర్ పాటలు రాసి చంద్రబాబు నిజస్వరూపం ప్రజలకు తెలియజేశారు.  ఈ పాట ప్రజల్లో విస్తృతంగా ప్రచారం అయ్యింది. ఎక్కడో చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో పుట్టిన రెండు ఎకరాల భూమి కలిగిన చంద్రబాబుకు ఇన్ని వేల కోట్ల రూపాయలను ఎలా దోపిడి చేసి సంపాదించాడో చెబుతాడు. అంతేకాదు, దోపిడి వర్గాలకు ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ గా మారాడని నిరూపించారు.

ఆ క్రమంలోనే గద్దర్ మీద 6.4.1997 లో కిరాయి హంతకులు ఆయన ఇంటిలో కాల్పులు జరిపారు. ఐదు బుల్లెట్లు ఆయన శరీరంలో దూసుకుపోయినా బ్రతికి బయటపడ్డాడు. కొన్ని నెలలు విశ్రాంతి తర్వాత మళ్ళీ పాటగా తిరిగి వచ్చాడు.

“తెలుగోడె మంత్రయ్యి నాడురా

మన తెలుగోడె ప్రధాన మంత్రయ్యరా

వాడు ఏం చేస్తడో, ఏం ఇస్తడో,

ఏమవుతడొగానీ”

పి.వి. నరసింహారావు ప్రధానమంత్రి అయినప్పుడు రాసిన పాట. తెలంగాణ పల్లేడే/కరీంనగర్ జిల్లాలోనే… డిల్లీ గద్దెకు ఎక్కిండు/డిల్లీ బెల్లం అండు. అంటూ అద్భుతమైన పాట రాసి పాడాడు.

“ఏం చేసుకుంటావురో మైసురరెడ్డి గా

నువు ఏం పీక్కుంటావురో మైసురరెడ్డిగా

మైసురా రెడ్డిగా గుణం లేని కంత్రిగా”

1991లో రాష్ట్ర హోంమంత్రిగా మైసూరారెడ్డి మీద రాసిన పాట ఇది. తెలంగాణలో పల్లెపల్లెల్లో కూంబింగ్, పోలీసుల క్యాంపులు పెట్టి నిర్బంధించి వేధింపులకు గురి చేస్తుంటే చలించి రాసిన పాట అది

“చక్కని ప్రతివత తానేనంటూ

అస్సలు పార్టీ నాదేనంటూ

మార్క్సిస్టు పార్టని పేరు పెట్టుకొని

మార్క్సు ముసుగులే కప్పుకున్నరు

మార్క్సు పేరుతో మార్పును చంపే

మూర్కుల పార్టీరో నాయనా”

“ఎమర్జెన్సీలో సిపిఐ

ఇందిరాగాంధీ తో ఇకిలించింది

రష్యా చేతులో కీలుబొమ్మలై

ఇందిరమ్మకే భజన చేసినరు

ఎర్రజెండా ఏట్లో బెట్టినరు

కమ్యునిజాన్ని కాట్లొబెట్టినరు

ఈ దొంగా కమ్యునిస్టు గాండ్లను

ఎండగట్టరండో నాయనా”

“కాషాయరంగు జనసంఘాడు

కమలం బట్ట కట్టుకున్నాడు

ఆడదిగాక, మగోడుగాక

అటల్ బిహారీ ఆడుతున్నాడు

భరతమాతకు జైజై అంటూ

మతకలహాలను మంటరేపుతూ

భరతమాతను బజారుకీడ్చిచిన

బాడు కావులీళ్ళో నాయనా”

భారతదేశం భాగ్య సీమరా – ఖనిజ సంపదకు కొదువలేదు రా అనే అద్భుతమైన పాటలో భారతదేశంలో ఓట్ల పార్టీలు ఎలా ఉన్నాయి. అవి ప్రజల, మాన ప్రాణాలను ఎలా హరిస్తున్నాయి. ఎలా దోపిడి చేస్తున్నాయి అనే సత్యాన్ని పాటు ద్వారా కళ్ళముందు ఆవిష్కరించారు గద్దర్.  ఆరోజుల్లో ఆయన వాడిన భాష ఇప్పుడు కొంత ఇబ్బంది అనిపిస్తోంది.

అసు కవిగా (సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు పాటల అల్లడం) కొందరికి మాత్రమే సాధ్యమైన ప్రక్రియ. అందులో గద్దరలాంటి వారు బడుగు జీవితాలను, అంటరాని బ్రతుకులను పాటలల్లికలో పెనవేసుకుపోయిన బంధం వుంది. అది కొందరికే వుంది. కమ్యూనిష్టులు , విప్లవ కవులకే వుంది. ఆ మనుషులకే ఆ నిబద్దత వుంది. ఆధునిక ప్రజలు ఇష్టపడే ఆధునిక సాహిత్య ప్రక్రియ జోలికి తానెప్పుడూ పోలేదు. సామాన్య ప్రజల కోసం, వాళ్ళు కష్టాలు, దుఃఖాలు, సంస్కృతిని సాహిత్యం మాత్రమే చేశాడు.

తాను పని చేసిన విప్లవ పార్టీ అండదండలతో ఆ పార్టీ ఆశయాలను కీర్తిస్తూ, వాళ్ళ త్యాగాలను గానం చేస్తూ, ప్రజలు ఆ వైపుకు చూసేలా అసామాన్యమైన కృషి చేశాడు. అందుకోసం ఎంతో శక్తివంతమైన, దోపిడి రాజ్యాంగ వ్యవస్థలను ప్రశ్నించాడు, ఎదురించాడు. తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశాడు.

రెండు, మూడు సందర్భాల్లో ఒంగోలులో గద్దర్ పాల్గొనే మీటింగ్ లకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. చివరి వరకు ప్రయత్నించి, తర్వాత ఎ.పి.సి.యల్.సి నాయకులు లాయర్ కనకయ్య ఆఫీసులోనే సభ జరిపిన సందర్భాలు ఉన్నాయి. 

అయితే గద్దరన్న పాల్గొనే బహిరంగ సభలకు ఎలాంటి హోం వర్కు చేయకుండా వచ్చేవాడనిపించింది. చాలా సందర్భాల్లో చెప్పిందే చెప్పడం, పాడిందే పాడడం చేసేవాడు.

ఒకప్పుడు తన సహచరులతో ఒక ప్రణాళిక బద్ధంగా సాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఒక క్రమం మొత్తం గద్దర్ చుట్టూ తిరగడం వల్ల ఆ వైఫల్యం స్పష్టంగా కనిపించేది. ఆయన ఎక్కువగా ఇది నాలుగు కాళ్ళ కుర్చి గురించి, నిచ్చెన మెట్ల కులం వ్యవస్థను నిటారుగా కాకుండా అడ్డంగా తీసుకురావాలనే అనే సూక్తిని ప్రతి సభలో చెప్పడం ద్వారా సభ సప్పగా అనిపించేది.

కొన్నాళ్ళకి గద్దరన్న దగ్గరే ఉండే డప్పు రమేష్ అన్న తన కొత్త టీంతో వేరేగా పాటలు పాడేవారు.

2004 రాజశేఖరరెడ్డి ప్రభుత్వంతో చర్చలు విఫలం అయ్యాయి. వెను వెంటనే వరుస ఎన్ కౌంటర్లు జరిగాయి. 2005 లో నల్లమలలో మావోయిస్టు పార్టీ కార్యదర్శి కా. మాధవ్ ఎన్ కౌంటర్ జరిగినప్పుడు. ఒక టి. వి. డిబెట్ లో గద్దర్ పాల్గొన్నారు. ఇది ముమ్మాటికీ చుట్టు ముట్టి ఏకపక్ష కాల్పులతో చేసిన బూటకపు ఎన్కౌంటర్ అని గద్దరన్న అంటే, అవతల పోలీస్ ఎస్.పి. గద్దర్ని బెదిరిస్తూ నువు హైదరాబాద్ కూర్చుని బూటకపు ఎన్కౌంటర్ అని ఎలా అంటావు. రా నీకు దమ్ముంటే నల్లమల్లకు రా! చూసిపోదువుగానీ అంటూ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తీవ్రంగా బెదిరిస్తూ మాట్లాడడం టి.వి. లో చూసిన వారు ఆనాడు అందరూ విన్నారు. గద్దర్ అంటే తీవ్రంగా సమాధానం ఇచ్చాడు. పోలీస్ ఆఫీసర్లతో అంత ధైర్యంగా మాట్లాడడం గద్దర్ని తప్ప మరే నాయకుడు మాట్లాడి ఉండరు.

మరోవైపు తెలంగాణ మూమెంట్ బలంగా ముందుకు వచ్చింది. రాజశేఖరరెడ్డి చనిపోయాక ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సాధించడానికి గద్దరన్న కృషి మరువలేనిది.

ఆ తర్వాత విప్లవోద్యమంతో , విప్లవ సంఘాలతో ఎందుకో అంత సాన్నిహిత్యం లేకుండా పోయింది. కుల, వర్గ పోరాటాలు జరగాలని, లాల్, నీల్ ఏకం కావాలనే కొత్త, కొత్త ప్రతిపాదనలు మీడియా సమక్షంలో పెట్టేవారు.

వేములవాడ రాజన్న, భద్రాచలం రామయ్య, రామానుజాచార్యులు, చిన్నజీయర్, ఘంటశాల, బాల సుబ్రహ్మణ్యం, సిరివెన్నెల లాంటి బ్రాహ్మణ సంస్కృతిని బలంగా మోసిన వారిని కీర్తించి విమర్శలపాలయ్యారు.

అలాంటి గద్దరన్న ఇలా ఎలా అయ్యాడనిపించేది.. ఇది బూటకపు ప్రజాస్వామ్యమని, ఇది దోపిడి రాజ్యమని, ఈ రాజ్యంలో సమానత్వం రావాలంటే ఇప్పుడున్న పెట్టుబడిదారి వ్యవస్థ కూల్చాలంటే ప్రజలందరూ చైతన్యవంతమై ఉద్యమించాలని పిలుపునిచ్చినవాడు..

రాజ్యాంగమే పవిత్రమని, ఇందులో మానవునికి విముక్తి అని, ఓటు ద్వారా కూడా శ్రామిక రాజ్యాన్ని సాధించవచ్చని కొత్తగా ఓటు వేసి కొత్త కొత్త భాష్యాలు చెప్పడం ప్రారంభించాడు.

ఇన్ని అస్పష్టతల మధ్య నే   విప్లవోద్యమం నా మాతృ సంస్థగా ప్రకటించుకునేవాడు.

 మహా స్వప్నాన్ని కలగని, దాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి, చివరికి ఇలా తనువు చాలించడం బాధాకరం.

Leave a Reply