ఆస్తి పునః పంపిణీ (జిత్‌నే ఆబాదీ ఉత్‌నే హక్‌).

ముస్లింలకు రిజర్వేషన్‌ అనే అంశాలపై ప్రధాని మోడీ రాజస్థాన్‌లో ఏం మాట్లాడాడో, స్వయంగా ఆయననోట దేశంలో చాల మంది ఇప్పటికే విని ఉంటారు. అది కాంగ్రెస్‌ మానిఫెస్టో కాదు ముస్లింలీగ్‌ మానిఫెస్టో అని అంతకన్నా అర్బన్‌ మావోయిస్టుల మానిఫెస్టో అని ఆయన అన్నాడు. అంటున్నాడు. గుజరాత్‌ శాసన సభ ఎన్నికల నుంచి మొదలుపెట్టి ఇప్ఫుడు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌లలో లోక్‌సభలు ఎన్నికల దాకా ఆస్తి పునః పంపిణీ అర్బన్‌ మావోయిస్టుల ప్రతిపాదన అని ఆయన పునరుద్ఘాటిస్తున్నాడు.

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపాయికి, అద్వానీకి కూడ ఐడియాలాగ్‌ (సిద్ధాంత ప్రేరకుడు) గా భావించబడే సుధేంద్ర కులకర్ణి మోడీ పట్ల మాత్రం బద్ధవిరోధి. కాని చివరకు ఆయన కూడ ‘జిత్‌నే ఆబాదీ ఉత్నే హక్‌’ అనేది అంటే కులప్రాతిపదికపై ఆస్తి పునః పంపిణీ అనేది అంబేడ్కరైట్లు, వామపక్ష మేధావులు యుద్ధ ప్రాతిపదిక మీద అమలు కావాలని కోరుతున్నారన్నాడు.

ఇది రాజ్యాంగ వాదానికి విరుద్ధమైన డిమాండని, కుల ప్రాతిపదికపై, జనాభా దామాషాపై ప్రాతినిధ్య ప్రాతిపదికపై ఆస్తి పంపిణీ జరగాలని 1947 కి పూర్వం ముస్లిలీగ్‌ డిమాండ్‌ చేసిందని. డాక్టర్‌ అంబేడ్కర్‌ కూడ అదే డిమాండు డిప్రెస్డ్‌ (అణచివేయబడిన వర్గాలకోసం చేసాడని గర్తుచేశాడు.అంబేడ్కర్‌ అణచివేతకు గురయిన సామాజిక వర్గాలనన్నింటినీ మైనారిటీలుగా గుర్తించాలన్నాడని కూడ గుర్తుచేసాడు. అప్పుడు కాంగ్రెస్‌ దీనిని తీవ్రంగా వ్యతిరేకించిందని, అందుకే స్వాతంత్య్రం తర్వాత రచింపబడి అమలులోకి వచ్చిన రాజ్యాంగం కుల ప్రాతిపదికపైన గానీ, జనాభా దామాషా, మైనారిటీ మతాలుగా గుర్తించి గానీ రిజర్వేషన్లు ఇవ్వలేదని, ఇప్పుడీ ప్రయత్నం చేస్తే అది సామాజిక ఘర్షణకే దారి తీస్తుందని అన్నాడు. దేశంలో తొంబై శాతం మంది పేదలుగా ఉన్నారని, వీళ్ల ఆస్తి, సంపద, శ్రమ ఒక శాతం మంది దోచుకున్నరనేది నిజం కాదని చెప్తూనే ఆదివాసుల విషయంలో మాత్రం అది వర్తిస్తుందని,  ముస్లింలు వ్యవస్థీకృతమైన వివక్షకు గురవుతున్నారని, అట్లని ముస్లింలు అందరూ పేదవాళ్లనడం కూడ అంగీకారం కాదన్నాడు.

రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్‌ మొదలుకొని మేధాపాట్కర్‌ (గుజరాత్‌ శాసన సభ ఎన్నికల సందర్భంగా) దాకా అర్బన్‌ మావోయిస్టు లంటున్న మోడీ ఇపుడిరక కాంగ్రెస్‌ మానిఫెస్టో అర్బన్‌ మావోయిస్టుల ప్రణాళిక అంటున్నాడు.

జైరాం రమేశ్‌ మొదలుకొని కాంగ్రెస్‌ అభివక్తలు అందరూ మేం మానిఫెస్టోలో ఆస్తుల పునఃపంపిణీ గురించి రాయలేదు. అట్లాగే ముస్లింల రిజర్వేషన్ల గురించి రాయలేదు. అసలు 48 పేజీల మానిఫెస్టోలో మేము హిందూ, ముస్లిం వంటి మత పరమైన శబ్దాలే వాడలేదు. కుల గణన జరగాలని మాత్రం అన్నం అంటున్నారు.

కనుక ముస్లింలకు ఎస్‌సి కోటా నుంచి కాదు (అది రాజ్యాంగంలోని షెడ్యూల్డ్‌ ప్రకారం ఎస్‌సి, ఎస్‌టిలకు వచ్చిన కోటా`) గదా బిసి కోటా నుంచి కూడ రిజర్వేషన్లు ఇవ్వలేదు. దూదేకుల వంటి ఉప కులాలకు తప్ప మోడీ ముస్లిం ఫోబియా గుజరాత్‌ మారణకాండ మరచిపోనివాళ్లకు మాటల దగ్గర ఆగేదికాదు అని గత పదేళ్ల అనుభవంలో ఎన్నో దాఖలాలతో చెప్పవచ్చు.

ఈ చొరబాటు దార్లు, ఎక్కువ పిల్లలను కనే వాళ్లయిన ముస్లింలు ఎక్కడి నుంచి వచ్చారు. వీళ్లంతా దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణ భూస్వాములకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం చేసిన మాప్లా (మలబార్‌) పోరాట వారసులు. 1920 అనే సినిమాలో దేశంలో తొలి తిరుగుబాటుగా చూపారు.

దేశవ్యాప్తంగా వహబీ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు. బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోను, తెభాగా కౌల్దార్‌ రైతుల పోరాటంలోను ప్రపంచ దృష్టి నాకర్షించిన పోరాట వీరుల వారసత్వం నుంచి వచ్చిన వాళ్లు. తెలంగాణలో భూమి కోసం పోరాడిన ముస్లిం రైతాంగ ప్రతినిధి బందగీ వారసులు. విస్నూర్‌ దేశ్‌ముఖ్‌ ప్రతీకగా జరిగిన ప్యూడల్‌ రాచరిక వ్యతిరేక పోరాటంలో భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు సాయుధ రైతాంగ పోరాటం చేపట్టిన కమ్యూనిస్టు పార్టీకి ఆదర్శం బందగీ. విస్నూర్‌ దేశ్‌ముఖ్‌ గూండాలు అతను న్యాయ పోరాటంలో పొందిన భూమి హక్కును అతన్ని చంపి హరిస్తే అతని రక్తంలో తడిసి ఎగిరిన జెండాయే కమ్యూనిస్టు పార్టీ జెండా`ఆ సాయుధ రైతాంగ పోరాటానికి పిలుపునిచ్చిన వారిలో మెదక్‌ జిల్లా పేద ముస్లిం వర్గం నుంచి వచ్చిన సుప్రసిద్ధ కవి, మేధావి, కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ స్థాపకుడు మగ్దూం మొహియొద్దీన్‌  ఉన్నాడు. ఇదివరకు ఎన్నో సందర్భాల్లో ఎందరో చరిత్రకారులు చెప్పినట్లు ముస్లింలు ఇక్కడి భూమి పుత్రులు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ముస్లింల మారణకాండను రచించి, ప్రోత్సహించి నిర్వహించిన మోడీ గానీ, అతని కుడి భుజమైన అమిత్‌ షా గానీ ఢల్లీి కేంద్ర ప్రభుత్వంలోకి చొరబాటు దారులవుతారు గానీ ముస్లింలు కారు.

ఆదివాసీ నాగజాతి రాజధానిని నాగపూర్‌లోకి ఆర్‌ఎస్‌ఎస్‌ బ్రాహ్మణీయ ఫాసిస్టులు చొరబాటు దారులవుతారు గానీ ముస్లింలు చొరబాటుదారులు కారు.

ఇంతకూ ఎక్కువ మంది పిల్లలను కంటూ ఈ దేశ జనాభాలో హిందువులను మైనారిటీలోకి నెట్టివేస్తున్నారన్న అర్థం వచ్చినట్లు ప్రస్తావించిన మోడీ మాటల్లో నిజమెంత?

దేశ విభజనకు ముందు భారతదేశంలో హిందూ ముస్లిం జనాభా 66 శాతం హిందువులు 24.3 శాతం ముస్లింలు 2011 జనాభా లెక్కల ప్రకారం హిందులు 79.80 శాతం ముస్లింలు 14.23 శాతం. 2023 సెప్టెంబర్‌ లెక్కల ప్రకారం హిందువులు 80.46 శాతం ముస్లింలు 13.43 శాతం.

మరి హిందువులు ప్రమాదంలో ఉన్నదెక్కడ ?

ఇంక ఎక్కువ ప్రస్తావనకు వచ్చి మోడీ సభల్లో కనిపించే, లేదా ఏ సభల్లో కనిపించే, కనిపించని, అత్యంత పేదవాళ్లు భూమి ఆస్తి లేని వాళ్లు మొదలు మధ్యతరగతి వరకు భావోద్వేగానికి గురయి ద్వేషభావాలు పెంచుకోవడానికి ఆస్కారమున్న ప్రస్తావన`దాని మీదనే ఉన్న నొక్కు హిందూ పేద మహిళల మంగళ సూత్రాలు దోచుకొని ముస్లింలకు ఇస్తారని. గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంచడంద్వారా, పేదల సంగతి అలా ఉంచండి మధ్యతరగతి స్త్రీయే ఇంటికి గ్యాస్‌ సిలిండర్‌ తెచ్చిన వ్యక్తి ఇపుడు, ధర ఎంతో చెప్పగానే మంగళ సూత్రంతో సహా గాజులు వగైరా బంగారందోచి ఇచ్చే ఒక సాంస్కృతిక ప్రదర్శన మలయాళంలో సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అయింది. ఇంతకూ ఈ దేశంలో భూమిలేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు, కౌలురైతులు సన్నకారు చిన్నకారు రైతుల ఇళ్లల్లో ఎన్నిమార్లు స్త్రీలు పసుపుతాడుకు పసుపుకొమ్ము కట్టుకొని లేదా టెన్‌పర్సెంట్‌ బంగారు పుస్తెలతాడు కొనుక్కొని భూ తనఖా బ్యాంకు మొదలు, గిరిగిరి బ్యాంకులకు, వడ్డీ వ్యాపారుల దగ్గర, ఫైనాన్స్‌ కంపెనీలు దగ్గర తమ ‘పవిత్ర మంగళ సూత్రాలు’ తాకట్టు పెట్టాల్సివస్తున్నదో మోడీకి తెలుసా? ఎంత మంది రైతుల మహిళల మంగళ సూత్రాలు తాకట్టు పెట్టే స్థితి వస్తే రైతులు ఆత్మహత్య చేసుకునే స్థితి వస్తున్నదో మోడీకి తెలుసా? మంగళ సూత్రాలు కాదుగదా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీల, గ్రామాల్లో చిట్టీలు నడిపేవాళ్ల వడ్డీ విషవలయానికి వ్యవసాయంతో, వృత్తులతో సంబంధమున్న ప్రజలే కాకుండా పెళ్లిళ్లు, రోగాలకయ్యే ఖర్చు కోసం చేసే అప్పులు తీర్చలేని సగటు ఉద్యోగస్తుల మహిళా జీవితాలు కూడ అభద్రతకు గురవుతున్న సందర్భాలెన్నో చూస్తున్నాం.

ఇంతకూ ఈ హిందూ మహిళల మంగళ సూత్రాలు దోచుకొని ఎవరికి పెడతారు? ముస్లిం మహిళలకా? ఇది ఇరువైపుల మహిళలను, వాళ్ల విశ్వాసాలను అవమానించడమే కదా?

మోడీ అర్బన్‌ మావోయిస్టులపై ఆరోపిస్తూ కాంగ్రెస్‌ మానిఫెస్టో గురించి చేసిన ప్రసంగంతో ‘కమ్యూనిస్టు భూతాన్ని చూసి యూరపు వణికిపోతున్నదన్న కమ్యూనిస్టు ప్రణాళిక గుర్తుకొచ్చింది. 1955 ఆంధ్ర ఉప ఎన్నకల సందర్భంగా కమ్యూనిస్టులపై కాంగ్రెస్‌తో సహా క్యూనిస్టు వ్యతిరేక వర్గాలన్నీ కలిసి చేసిన ప్రచారదాడి గుర్తుకొచ్చింది. 1955 ఎన్నికలు కమ్యూనిస్టులు చేసిన ఆఖరి వర్గపోరాట రూపం తెలుగునేల మీద అని అప్పటి పరిశీలకులు వ్యాఖ్యానించారు. మోడీ ప్రసంగానికి ప్రింటు మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, మోడీ సమర్థక సామాజిక మీడియా ఇస్తున్న ప్రచారం చూస్తే అప్పుడు నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వంలోని ఆంధ్రప్రభ, పండితారాధ్యుల నాగేశ్వరరావు సంపాదకత్వంలోని ఆంధ్రపత్రిక చేసిన కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం మరికొన్ని కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం పత్రికలు గుర్తుకొచ్చినవి. కృష్టా జిల్లా దివి సీమలో కమ్యూనిస్టు పార్టీ ప్రముఖ నాయకుడు మాకినేని బసవ పున్నయ్య చల్లపెల్లి రాజా భూములను కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వస్తే స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచుతుందని చేసిన ప్రసంగాన్ని ఎంతదూరం తీసుకపోయి ఈ సంపాదకీయాలు వక్రీకరించాయో తలచుకుంటే అగ్రవర్ణ దోపిడీ వర్గ భావజాలంతో ఉన్న బ్రాహ్మణీయ ఫాసిజం మూలాలు కనిపిస్తాయి. చల్లపెల్లి రాజా వేల ఎకరాల భూములను దున్నే కౌల్దారీ రైతుల నుంచి గోళ్లూడగొట్టి శిస్తు వసూలు చేయడం ప్రస్తావించి, ఆ రైతుల స్త్రీల పుస్తెల తాళ్లు కూడ కుదువపెట్టుకున్నారని.. ఆ బంగారమంతా పోగుబడి రాజాంతఃపురంలోని మహిళలు మోయలేనంత ఆభరణాలు మోస్తున్నారని ఆయన అన్నారో లేదో తెలియదు కానీ.. రేపు ఆ రాజ ప్రసాదంలోని మహిళల మెడల మీద కాడి మోపి ప్రజా పరం చేసే భూముల్లో దున్నిస్తామని, భూమి, ఆస్తి వలెనే స్త్రీలను కూడా జాతీయం చేస్తామని అన్నాడని ఎడతెగని విష ప్రచారం చేసి ప్రజలను భయపెట్టారు.

చరిత్ర ఒక్కొక్కసారి విషాదంగాను, ఫార్సుగానూ పునరావృతమవుతుందన్నట్లుగా చల్లపెల్లి రాజా భూములు స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచుతామని 1955లో ఎన్నికల ప్రచారం చేసిన అవిభక్త, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మాకినేని బసవ పున్నయ్య వంటి వాళ్ల నాయకత్వంలో చీలి ఏర్పడిన సిపిఎం 1967లో నక్సల్బరీ ఆదివాసీ రైతాంగ పోరాటాన్ని నెత్తుటేర్లలో కేంద్రంలోని ఇందిరా ప్రభుత్వంతో కలిసి ముంచిన నేపథ్యంలో ముఖ్యంగా కౌలు రైతులను దృష్టిలో పెట్టుకునే ‘ఆపరేషన్‌ బర్గా’ అనే పేరుతో చిన్న, సన్నకారు రైతులకు భూమి పట్టాలిచ్చింది.

అదే లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం బుద్ధదేవ్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత నందిగ్రామ్‌లో పేద ముస్లింల భూములను ఆక్రమించుకొని  ఇండోనేషియా సలీం కంపెనీకి మూడు వేల ఎకరాలు కార్పొరేటీకరణకు కట్టబెట్టింది. బహుశా దేశంలో వ్యవసాయాధార జీవితమే గడుపుతున్న ఏకైక భూఖండంగా నందిగ్రామ్‌ ఉండేది. ప్రతి ముస్లిం రైతుకు రెండు, రెండున్నర ఎకరాలు మించని భూమి. అందులో ఆ కుటుంబం నివసిస్తూ వ్యవసాయానికి తోడు కూరగాయలు పండిస్తూ, మేకలు కోడి పిల్లలను పెంచుతూ ఒక స్వావలంబనతో జీవిస్తున్న వేలాది ముస్లిం కుటుంబాలు ఈ చర్యతో నిరాశ్రమైనవి. లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ పతనం నందిగ్రామ్‌ రైతుల పై 2007 మార్చ్‌ 14న పోలీసుల కాల్పులు పదకొండు మంది అమరత్వంతో ప్రారంభమైంది. (తల్పతి నది ` నందిగ్రామ్‌ బ్లాక్‌నూ ఖెజారీ బ్లాక్‌ను వేరుచేస్తున్న నది. ఖెజారీ పోలీసు క్యాంపు నుంచి ఈ నది మీదుగా సిపిఎం`అప్రకటిత సైన్యం హర్మత్‌ వాహినీ పోలీసులు సోనాచురాలో గౌరంగపూజ, నమాజ్‌ చేస్తున్న వేలాది మంది ప్రజలపై మార్చ్‌ 14 ప్యారిస్‌ కమ్యూన్‌ జరిగిన రోజు కాల్పులు జరిపారు)

మోడీ ప్రస్తావించిన మన్‌మోహన్‌ సింగ్‌ ముస్లింలకు అందరికన్నా ముందు ఆస్తి, పంచుతామన్న మాటకు రాజేంద్రసచార్‌ ఇటువంటి సంఘటనలపై చేసిన వ్యాఖ్యలే కారణం.

ముస్లింల జీవన స్థితిగతులపై రాజేంద్రసచార్‌ కమిషన్‌ నివేదిక సెక్యులరిజం పేరుతో, బుజ్జగించే రాజకీయాల పేరుతో కాంగ్రెస్‌ చేసిందేమీలేదనే వాస్తవంతో పాటు ముప్పై ఏళ్లపాటు బెంగాల్‌లో లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం కూడ చేసిందేమీ లేదని, దేశంలో అంతటికన్నా ముస్లింల స్థితిగతులు అధ్వాన్నంగా ఉన్నాయని పేర్కొన్నది.

మొత్తంగానే అస్పృశ్యత అనే భావన మినహా చాలచోట్ల ముస్లింల జీవన పరిస్థితులు దళితుల కన్నా అధ్వాన్నంగా ఉన్నాయని రిపోర్టు ఇచ్చింది. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో ఉన్న రిజర్వేషన్లు పూర్తిగా వినియోగించుకొని విద్యావంతులై ఉద్యోగాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడ ప్రతి గ్రామంలో ఒక నిర్ణాయక శక్తి అయిన దళితుల వలె ముస్లింలు రిజర్వేషన్లు లేని కారణంగానూ, 1992 బాబ్రీ మసీదు విధ్వంసకాలం నుంచీ (ఈశాన్య రాష్ట్రంలోనయితే నెల్లీ మారణకాండ కాలం నుంచే) బయటి నుంచి వచ్చిన చొరబాటు దారులుగా వివక్షకు గురయ్యారు. ఇంకా గుజరాత్‌ మారణకాండ, సంఫీు ప్రచారంతో ఇతరులుగా చూడబడి హిందూ జీవన విధానాన్ని అంగీకరిస్తే తప్ప బతుకు దుర్భరమైన స్థితి వచ్చింది. ఎమర్జెన్సీలో పట్టణ సుందరీకరణ కొరకు ముస్లిం ఆవాసాలున్న టర్క్‌మెన్‌ గేట్‌ ఢల్లీిలో బుల్‌డోజర్లతో భూమట్టం చేయబడితే ఇప్పుడు బుల్‌డోజర్‌ బాబా పరిపాలనలో యుపితో మొదలై ఢల్లీి, బిజెపి పాలిత రాష్ట్రాలలో స్వంత ఇల్లు వంటి ఆస్తి కలిగి ఉన్న ముస్లిం కుటుంబం కూడ స్త్రీలతో సహా నేరస్తులుగా చూపబడి ఏ విచారణ లేకుండా ‘బుల్డోజర్‌ న్యాయానికి’ బలి అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ల విషయంలో వారితో మొదలు పెట్టి న్యాయం జరుగుతుందనే మన్‌మోహన్‌సింగ్‌ వాగ్దానం ఎప్పుడో ఎండమావైంది. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు`కేవలం సారవంతమైన భూములను మనం కశ్మీరీ భూఖండాలు అని పిలుచుకుంటం. కేవలం వాటిని అదానీ అంబానీ వంటి కార్పొరేట్‌ శక్తులకివ్వడానికే చేసారు. మోడీ దేశ ప్రధాని అయినాక ఈ ఫాసిస్టు వివక్షకు మత ప్రాతిపదిక మీద హిందూ జనామోదం వచ్చింది. చొరబాటుదారులు, ఎక్కువ పిల్లలు కనేవారు అనేమాటకు చప్పట్లు ఎంత ప్రమాదకరం.

అర్బన్‌ మావోయిస్టులుగా సంఫీు మోడీలు పిలిచే విప్లవ, ప్రజాస్వామిక సంఘాలయినా, శక్తులయినా స్వయంగా మావోయిస్టు పార్టీ అయినా ఆస్తి పునః పంపిణీ కాదు కదా అసలు పంపిణీయే జరుగలేదని, రోజు రోజుకూ ఆదానీ అంబానీ వంటి సామ్రాజ్యవాద కార్పొరేట్‌ శక్తుల దగ్గరే పోగుబడి దానిని కాపాడుకోవడానికి సైనికీకరణను పెంచి ఫాసిస్టు అణచివేతను చట్టాల ద్వారాను, అంతకన్నా ఇమ్మడిగా రాజ్యాంగేతర శక్తులయిన సంఫీుయుల ద్వారా అమలుచేస్తున్నారనే అంటున్నారు. ఇతరంగా చూసే ఈ వివక్షకు, వివక్ష కారణంగా అమలుచేసే హింసకు దేశవ్యాప్తంగా ముస్లింలు మాత్రమే లక్ష్యంగా ఉన్నారు. పౌరసత్వ చట్టం ద్వారా 2019లో చేసిన ఆ దుర్మార్గ వ్యూహానికి వ్యతిరేకంగా వచ్చిన పోరాటాన్ని ఒక్క మాటలో దేశమంతటా ముస్లిం ప్రతిఘటనా మహిళా నాయకత్వ పోరాటంగా చిత్రిస్తే దానిని షహీన్‌బాగ్‌ అని పిలవవచ్చు. కరోనా వంటి ఒక బ్రాహ్మణీయ అస్పృశ్యతా సామ్రాజ్యవాద మహమ్మారి వచ్చి ఆగిపోయి ఈశాన్య ఢల్లీిలో ముస్లింల పై కేంద్ర మంత్రుల నాయకత్వంలోనే జరిగిన మారణకాండలో ఏబై మంది చనిపోతే ఇపుడు నాలుగేళ్లుగా తిహార్‌ జైళ్లలో మగ్గుతున్నది మాత్రం ఉమర్‌ ఖలీద్‌, షార్జిల్‌ ఇమామ్‌ వంటి ‘మొహబ్బతే కారవాన్‌’ నిర్వహిస్తున్న ముస్లిం యవకులు. కనుక మోడీ బ్లాక్‌ మెయిలింగ్‌కు అధికారోన్మాద హింసా వ్యూహానికి భయపడి కాంగ్రెస్‌ వాగాడంబర వాగ్దానాల నుంచి మాకు సంబంధం లేదని తప్పుకోవచ్చుగానీ అడవిలో ఆదివాసులకు జల్‌, జంగల్‌, జమీన్‌ ఇజ్జత్‌లపై అధికారం డిమాండ్‌ చేసినట్లుగానే (అక్కడ మైనింగ్‌ ప్రయోజనాల వల్ల సామ్రాజ్యవాద ప్రేరేపిత బ్రాహ్మణీయ ఫాసిజం ఆదివాసులపై యుద్ధమే ప్రకటించింది) మైదాన  ప్రాంతమంతటా దళిత, బహుజనులతో పాటు ముస్లింలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ ప్రాతినిధ్యం, లబ్ధి, జనాభా ప్రాతిపదికన జరగాలనేది ‘అర్బన్‌ మావోయిస్టుల’ ఎజెండా. మోడీ సరిగానే భయపడుతున్నాడు. ఆ భయాన్ని నిజంచేసే ప్రజా పోరాటాలు నిర్మించడమే మన కర్తవ్యం.

Leave a Reply