యుద్ధాలు జ‌రుగుతున్న‌ప్పుడు ఎన్నిక‌లొస్తే సాధార‌ణంగా ప్ర‌భుత్వాలు కుదేల‌వుతాయి. అధికార ప‌క్షం ప‌ద‌విని పోగొట్టుకోవ‌డ‌మో, ఓట్ల శాతాన్ని ఎంతోకొంతో కోల్పోవ‌డ‌మో జ‌రుగుతుంటుంది. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో పార్ల‌మెంటు లోప‌ల‌, బ‌య‌ట ధాటిగా ప్ర‌సంగాలు చేసిన విన్‌స్ట‌న్ చ‌ర్చిల్ ఆ యుద్ధం త‌ర్వాత బ్రిట‌న్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడిపోయాడు. రెండో ప్ర‌పంచ యుద్ధంలో విజేత‌లు, ప‌రాజితులు అంతా న‌ష్ట‌పోయారు. చ‌ర్చిల్ ఓట‌మికి ఇది ఒక కార‌ణం. ఇక‌.. యుద్ధంలో చొర‌వ‌ను బ్రిట‌న్ జాడ విడుచుకుని సోవియ‌ట్ యూనియ‌న్ హీరోగా నిల‌వ‌డానికి కార‌ణ‌మ‌య్యాడంటూ లార్డ్స్ సైతం చ‌ర్చిల్‌ను క‌సిగా ఓడించ‌డం ప్ర‌ధాన కార‌ణం. యుద్ధాల స‌మ‌యంలో పాల‌క పార్టీలతోపాటు వ్యాపార సంస్థ‌లు కూడా కొంత మేర ఇబ్బంది ప‌డ‌టం స‌హ‌జం. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జాత్య‌హంకార‌, విస్త‌ర‌ణ‌వాద యుద్ధం మొద‌లైన ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ నాటి నుంచీ మ‌న‌దేశంలోని బ‌డా కార్పొరేట్ కంపెనీల లాభాల రేటు ప‌డిపోతోంది. కానీ, ఈ ప‌త‌నం నిక‌ర లాభాల‌ను కూడా తినేసి న‌ష్టాల్లోకి ఇంకా కంపెనీల‌ను నెట్టేయ‌లేదు. కానీ, అదానీ, అంబానీ త‌దిత‌ర ప్రైవేటు రిఫైన‌రీల‌కు, ఆయిల్ కంపెనీల‌కు న‌ష్టాలొస్తున్నాయ‌ని చెప్పి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లను మోదీ ప్ర‌భుత్వం పెంచేసింది. ఆ మాట‌కొస్తే దేశ‌ ప్ర‌ధానిగా ఎవ‌రున్నా స‌రే, చేసేది ఇదే. నిజానికి, బ‌డా కంపెనీల‌కు న‌ష్టాలు రావ‌డం అనేది ఉండ‌దు. ఆర్థిక సంక్షోభాలు ముంచెత్తిన‌ప్పుడు కూడా వ్యాపార సంస్థ‌ల నిక‌ర లాభాల రేటు ప‌డిపోదు. ఆ ప‌రిస్థితే వ‌స్తే రాజ్యం నేరుగా జోక్యం చేసుకుంటుంది. వాటి నిక‌ర లాభాల‌ స్థిరీక‌ర‌ణ కోసం ఎంత దూర‌మైనా పోతుంది.
మ‌రి యుద్ధం ప్ర‌భావం మ‌న దేశ వ్యాపార రంగంపై నేరుగా ఉన్న‌ప్పుడు, ఈ కాలంలో జ‌రిగిన ఎన్నిక‌ల మీద ఉండ‌దా? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇత‌ర ఎన్డీయే పార్టీల ఓట్ల శాతం మీద ప్ర‌తికూల ఫ‌లితాల‌ను చూపించ‌దా? పాలక‌ పార్టీ పొలిటిక‌ల్ గ్రోత్ నెమ్మ‌దించ‌దా? కాస్త రాజ‌కీయార్థిక జ్ఞానం ఉన్న ఎవ‌రికైనా వ‌చ్చే సందేహాలు ఇవి. అందువ‌ల్లే నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతానికి జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ మ‌ధ్య‌లోనే యుద్ధం, ఆయిల్ కంపెనీల‌కు న‌ష్టాల‌ను సాకుగా చూపి గృహ సిలిండ‌రు ధ‌ర‌ను రూ. 60 మేర‌ పెంచారు. వాణిజ్య సిలిండ‌రు రేటును మ‌రీ మూడు రెట్లు పెంచి మూడు వేలు చేయ‌డంతో టిఫెను సెంట‌ర్లు మూత‌ప‌డి, వాటిపై బ‌తికే ల‌క్ష‌లాది మంది చిరు వ్యాపారులు న‌ష్ట‌పోయారు. పెద్ద పెద్ద హోట‌ళ్లు తెంప‌రిత‌నం ప్ర‌ద‌ర్శిస్తూ, క‌స్ట‌మ‌ర్ బిల్లులోనే గ్యాస్ ట్యాక్స్‌ను క‌లిపి వ‌సూలు చేశాయి. ఆయిల్ కొర‌త బూచీని చూపించి ఇత‌ర అవ‌స‌ర‌మైన, ప‌ట్టించుకోవాల్సిన విష‌యాల‌పై నుంచి పాల‌క‌వ‌ర్గాలు ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తే, ఇదే అదునుగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెంచేసి ప్రైవేటు పెట్రోల్ బంకులు వాహ‌న‌దారుల‌ను దోచేశాయి. ఇదంతా ఎన్నిక‌ల నాటి స‌న్నివేశం. అయినా, సామాన్యుడికి కోసం వ‌చ్చిన‌ట్టు లేదు. ఈవీఎం మెష‌న్లు వారి ఆగ్ర‌హ జ్వాల‌ల‌కు బ‌ద్ద‌ల‌యిన దాఖ‌లాలు కూడా లేవు. ఓట‌రు జాబితా స‌మ‌గ్ర ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ (స‌ర్‌) ద్వారా బార‌త ఎన్నిక‌ల సంఘం క‌లిగించిన కొత్త జ్ఞానం కార‌ణంగా ఇలాంటివేవీ జ‌ర‌గ‌వ‌ని మ‌న‌కు కూడా తెలుసు. ప్ర‌జ‌లు త‌మ పాల‌కుల‌ను ఎన్నుకునే ప్ర‌క్రియ స్థానంలో పాల‌కులే త‌మ ప్ర‌జ‌లుగా, ఓట‌ర్లుగా ఎవ‌రుండాల‌నేది నిర్ణ‌యించుకునే కొత్త వెసులుబాటును.. త‌న పేరుకు త‌గిన‌ట్టే సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ప్ర‌సాదించారు. మోడిత్వ‌లో భాగంగా మీడియా, డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లు, ఈవీఎం మెష‌న్లు, వాషింగ్ మెష‌న్లు ఎలాగూ రంగంలో ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ, పాల‌క ఎన్డీయే గ్రాఫ్‌ను యుద్ధం ఈసారి ఎంతోకొంత త‌గ్గిస్తుంద‌ని భావించారు. కానీ, త‌న సిట్టింగ్ రాష్ట్రాల‌ను అది నిల‌బెట్టుకోవ‌డంతోపాటు కొత్త‌గా పెద్ద రాష్ట్రం ప‌శ్చిమ బెంగాల్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. కేర‌ళ‌లో మూడు స్థానాల‌ను బీజేపీ గెలుచుకుంది. ఇందులో ఒక‌టి ఆల‌య వివాదం న‌డుస్తున్న శ‌బ‌రిమ‌ల ప‌రిధిలోని ఖాజాకుట్టం నియోజ‌క‌వ‌ర్గం. స‌వ‌ర్ణ హిందువులు గంప‌గుత్త‌గా హిందుత్వ ఫాసిస్టు శ‌క్తుల వైపు మొగ్గుతున్నార‌నేందుకు ఈ ఫ‌లితమే నిద‌ర్శ‌నం. ఈ వ‌ర్గానికి విద్య‌, ఉద్యోగాల్లో రిజ‌ర్వేష‌న్లూ కావాలి, మ‌నువాద బీజేపీ కూడా కావాలి. ఈ త‌ర‌హా సోష‌ల్ షిఫ్టింగుల‌తో బిహార్ స‌హా చాలా రాష్ట్రాల్లో బీజేపీ బ‌ల‌ప‌డిన మాట నిజ‌మే. కానీ, బూర్జువా ఎన్నిక‌ల్లో సైతం ఎంతోకొంత ప్ర‌జ‌ల మ‌నోభావం వ్య‌క్తం అవుతుంద‌ని అనుకుంటాం క‌దా! ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఓ ఐదు శాత‌మో, ప‌ది శాత‌మో పాల‌క ప‌క్షం విజ‌యావ‌కాశాల‌ను ప్ర‌భావితం చేయాలి క‌దా! అయినా, అసోంలో మూడోసారి బీజేపీ అధికారం చేపట్టింది. పుదుచ్చేరిలో మిత్ర‌ప‌క్షం రంగ‌స్వామి కాంగ్రెస్ రెండోసారి కొలువు తీరింది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌తోపాటు అభివృద్ధిని, కొత్త‌ద‌నాన్ని ఓట‌ర్లు కోరుకోవ‌డం వంటివి బెంగాల్‌లో
మ‌మ‌త ఓట‌మికి కార‌ణాలుగా చెబుతున్నారు. అవ‌న్నీ వాస్త‌వాలే అనుకున్నా, ఆయా సూచిక‌లు డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ల‌కు కూడా వ‌ర్తించాలి క‌దా?
ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన‌ మ‌రుస‌టి రోజు ప్ర‌ధాని మోదీ బీజేపీ గ్రాఫ్‌ను విడుద‌ల చేశారు. దేశ ప‌టంలోని 21 రాష్ట్రాల‌ను కాషాయంతో ఆయ‌న‌ నింపేశారు. 175 అసెంబ్లీ స్థానాలు క‌లిగిన ఏపీలో బీజేపీకి ఉంది నాలుగు సీట్లు. అయినా, ఆ రాష్ట్రానికి కూడా కాషాయం పులిమారు. ఈశాన్యభార‌తంలోని చాలా రాష్ట్ర ప్ర‌భుత్వాల్లో బీజేపీ జూనియ‌ర్ పార్ట‌న‌ర్‌. వాటినీ క‌లిపేశారు. త‌మిళ‌నాడులో ఒక్క సీటు మాత్ర‌మే బీజేపీకి ఉంది. అక్క‌డ కూడా రాబోయే రోజుల్లో పులిహార క‌లిపినా ఆశ్చ‌ర్యం లేదు. త‌మిళ‌నాడులోని త‌న రాజ‌కీయ ముఖం అన్నాడీఎంకేను న‌టుడు విజ‌య్ ప్ర‌భుత్వంలోకి ఇప్ప‌టికే బీజేపీ చొప్పించేసింది. కాబ‌ట్టి, త‌మిళ‌నాడు విష‌యంలో ఇలాంటి అంచ‌నాలు అతిశ‌యోక్తి కాబోవు. పంజాబ్‌లో ఇటీవ‌ల కొన్నిచోట్ల బాంబు పేలుళ్లు జ‌రిగాయి. పంజాబ్‌లో అస్థిర ప‌రిస్థితులు సృష్టించడం ద్వారా ఆప్‌ను ఓడించ‌డానికి బీజేపీయే ఈ పేలుళ్ల‌ను ప్లాన్ చేసింద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ ఆరోపించారు. బిహార్ పోలింగ్‌కు స‌రిగ్గా ఒక రోజు ముందే దేశ రాజ‌ధాని ఢిల్లీలో బాంబు పేలుడు జ‌రిగింది. ఆ పేలుడు ప్ర‌భావం ఏ మాత్రం బిహార్ ఎన్నిక‌ల‌పై క‌నిపించ‌లేదు. పైగా, అక్క‌డ ఎన్నిక‌లు కాగానే పేలుడుకు సంబంధించిన వార్త‌లు అనూహ్యంగా టీవీ తెర‌ల నుంచి మాయ‌మ‌య్యాయి. యుద్ధాలు జ‌రుగుతున్నా, పేలుళ్లు చోటుచేసుకున్నా, డాలరుతో రూపాయి విలువ 42 నెల‌ల జీవిత‌కాల క‌నిష్ఠానికి ప‌త‌న‌మైనా, అవేవీ బీజేపీ విజ‌యాల రేటును ఏ మాత్రం కుదించ‌డం లేదు. పైగా వ‌టుడంతై.. అన్న‌ట్టు బీజేపీ రాజ‌కీయ బ‌లం విస్త‌రిస్తూనే ఉంది. దీనివెనుక సూత్రం సుస్ప‌ష్ట‌మే. యుద్ధ కాలంలోనూ బ‌డా కార్పొరేట్ కంపెనీల‌ నిక‌ర లాభాలు త‌గ్గ‌కుండా మోదీ ప్ర‌భుత్వం చూసింది. ఎన్నిక‌ల్లో మోదీ చ‌రిష్మా, బీజేపీ పొలిటిక‌ల్ గ్రాఫ్ ప‌డిపోకుండా కార్పొరేట్ శ‌క్తులు కాపు కాశాయి. ఇందులో మానియా కాదు.. మ్యాజిక్ లేదు..నిక‌రంగా ఇది ఓట‌ర్ల‌పై యుద్ధమే!

Leave a Reply