2000 సంవత్సరంలో యుగాంతం అవుతుందని, మహా ప్రళయం ప్రపంచాన్ని ముంచెత్తుతుందని అప్పట్లో ప్రచారం జరిగింది. యుగాంతం కాలేదుగానీ, మహా ప్రళయం మాత్రం సుడులు తిరుగుతూ ఇప్పుడది ఢిల్లీని తాకింది. ఈ ప్రళయాన్ని నిలువరించడం కోసం అప్పటి బీజేపీ ప్రభుత్వం యాగాలు, హోమాలు చేస్తే, ఇప్పటి ఆ పార్టీ ప్రభుత్వం బుల్లెట్లు, పెల్లెట్లు ప్రయోగించింది. రెండు ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ఇన్నాళ్లూ భారత పాలకవర్గాలు దేని గురించి భయపడుతూ వచ్చారో ఆ జన్ జీ భూతం కళ్ల ముందుకే వచ్చి నిలబడింది. ఇండియా మృత సమాజంగా మారిపోయిందనుకున్నవారిలో సైతం కొత్త మోసులు మొలిపించింది. నేనిప్పుడు నిశ్చంతగా చనిపోగలను…. అని రచయిత్రీ అరుంధతీరాయ్‌తో అనిపించగలిగింది. యువ తరమా.. నవ తరమా.. మా కళ్లు నువ్వే.. మా కాళ్లు నువ్వే.. అంటూ ప్రతి తరమూ ఇలాంటి మహా కదలికనే గానం చేసింది. యూరప్‌లో యువత తరఫున కవి రింబాడ్ యుద్దాలను వ్యతిరేకించాడు. యువకులకు జోహార్లు తెలిపే సమాజం తనకు తాను మరణించినట్టేనని ప్రకటించాడు. నాడు రింబాడ్ గానీ, తన కాలంలో షెల్లీగానీ, మన కాలంలో చెరబండరాజు గానీ కలలు కన్నదీ, తమ కాలంలోనే విన్నదీ ఆ యుగ స్వరాన్నే. ఎవరు బతికేను మూడు యాభైలు అని శ్రీశ్రీ అన్నారుగానీ, బలవంతపు యుద్ధాల్లోకి లాగబడి, సరిహద్దుల్లో చనిపోతున్న భారత జవాన్లు గానీ, అగ్నివీరులు గానీ ఓ యాభై అయినా బతకడం లేదు. విప్లవోద్యమంలో, అంతకుమించిన సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రజాస్వామ్య ఉద్యమాల చరిత్రలో అమరులైన వారిలో ముప్పైలు దాటనివారే ఎక్కువ. పాతికేళ్లు కూడా జీవించని రింబాడ్ వలే వసివాడని మన ఎంఎస్ఆర్ ఇదే సందర్భంలో గుర్తుకొస్తాడు.
నీట్ – యూజీ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన 36 రోజుల విద్యార్థుల ఆందోళన విషయంలో, నిర్దిష్టంగా కాక్రోచ్ జనతాపార్టీ నాయకత్వం విషయంలో ఎవరికి ఎలాంటి భిన్నాభిప్రాయమైనా ఉండవచ్చు. బీజేపీ 12 ఏళ్ల పాలనకే ప్రశ్నపత్రాల లీకేజీ పరిమితం కాలేదని, దానికి ముందు ప్రభుత్వాల్లో కూడా ప్రశ్నలను అమ్ముకున్నారనే వాదన ఉంది. ఆ మాటకొస్తే విద్య ప్రైవేటీకరణ జరిగిన 1990ల నుంచి ఏటా ఏదో ఒక ఎంట్రన్స్ రద్దవుతూనే ఉంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలు వస్తున్న కొత్తల్లో 1993లో, ఏపీలోని బాపట్లలో మెడికల్ ఎంట్రన్స్ పేపరు ముందే బయటకొచ్చింది. అప్పట్లో ఆ స్కామ్ ప్రభుత్వాన్ని కుదిపేసింది. చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా నింపిన 16000 టీచరు ఉద్యోగాల్లో స్పోర్డ్స్ కోటాలో డబ్బులకు పోస్టులు అమ్ముకున్నారంటూ ఏపీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఇతర ప్రవేశ పరీక్షలతో పోల్చితే నీట్-యూజీ, రైల్వే బోర్డు ఎంట్రన్స్ పరీక్షలు విస్తృతిలో చాలా పెద్దవి. లక్షలాది మంది విద్యార్థులు వాటిని రాస్తుంటారు. అయితే, ఈ కారణంగానే నిరసనలు కూడా ఈసారి ఈ స్థాయిలో ఉన్నాయనేది కూడా కొంతవరకే వాస్తవం. వ్యవసాయ, వస్తుసేవా తయారీ రంగాలు యువతకు పని ఇచ్చి, వారి శ్రమశక్తితో నాణ్యమైన ఉత్పత్తులను తీసే స్థితి ఎప్పుడో పోయింది. ఐటీ, ఆహార సరఫరాలు, రవాణా వంటి సేవారంగాలు కూడా ఇప్పుడు ఉద్యోగితా సామర్థ్యం కోల్పోతున్నాయి. రూ.పది వేలు, రూ.15 వేలకు పని చేస్తున్న గ్రిగ్ వర్కర్ల వ్యవస్థ సేవల రంగం దుస్థితికి అద్దం పడుతోంది. అంతేకాదు. నిరుద్యోగ సమస్య గ్రావిటీని తెలుపుతోంది. అందువల్ల రైల్వే బోర్డు ఫోర్త్ క్లాస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే డిగ్రీ ఉత్తీర్ణులు లక్షల్లో ఎగబడుతున్నారు. అందువల్ల పాత ప్రమాణాలతో నిరుద్యోగం, పేదరికం వంటి అంశాలను కొలవలేం. కొత్త సూచీలు, పరిభాష, వ్యక్తీకరణలను ఈ నేపథ్యం నుంచే జన్ జీ తరం అందిపుచ్చుకుంది. మొత్తం మీద విద్య వ్యాపారీకరణ విస్తరిస్తున్న కొద్దీ విద్యార్థుల కలలను భగ్నం చేస్తున్న లీకేజీ ఘటనలు కూడా పెరిగిపోతున్నాయి. బీజేపీ వచ్చి విద్యను కాషాయీకరించిన తర్వాత తొలి దెబ్బ నీట్ ఎంట్రన్స్ పైనే పడింది. ఇప్పుడంటే నీట్ రాసిన విద్యార్థుల ఆత్మహత్యలు, జవాబుదారీ తనం లేని కేంద్ర విద్యాశాఖ తీరు.. ఉద్యమాన్ని ఒక దిక్కుకు లాగేశాయి. కానీ, తన కాషాయీకరణ విధానాల్లో భాగంగా నీట్ ఎంట్రన్స్‌లో హిందీని అనుమతిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు అప్పటికే పోరాడుతున్నాయి. మాతృభాషలో నీట్ రాసుకునే వెసులుబాటును ఇప్పటికీ తమిళనాడు డిమాండ్ చేస్తోంది. కాషాయీకరణలో భాగంగానే యూనివర్సిటీలు, ఉన్నత సాంకేతిక అభివృద్ధి సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, ఐఐటీ, ఐఎంఎంలను సంఘ్ ప్రచారక్‌లతో నింపారు. ఏ బాధ్యత లేని సంస్థలుగా గత 12 ఏళ్లలో వాటిని తయారుచేశారు. సాంకేతికత పేరిట లక్షలాది మంది విద్యార్థుల కలలు, భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల వ్యవస్థలోకి ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీల ప్రవేశాన్ని అనుమతించారు. రాజస్థాన్‌లో లీకయిన నీట్-యూజీ ప్రశ్నపత్రం మూలాలు ఆ పరీక్షను నిర్వహించిన జాతీయ ఏజెన్సీ కార్యాలయంలోనే బయటపడ్డాయి. ప్రశ్నకు ఇంత అని బడా కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు అమ్ముకున్నాయి. తలకు కొన్ని లక్షలు చొప్పున వసూలు చేశాయి.
కార్పొరేటీకరణకు కాషాయీకరణ అందించే దన్నును సమాజం చూసింది. నీట్ లీకేజీకి వ్యతిరేకంగా ముందుకొచ్చిన ఉద్యమాలు ఉమ్మడిగాను, వేర్వేరుగాను ఈ రెండింటినీ ప్రశ్నించాయి. జంతర్‌మంతర్ వేదికగా కాక్రోచ్ జనతాపార్టీ నేతృత్వంలో జరిగిన ఉద్యమం. వాంగ్‌చుక్ నిరసన దీక్ష ప్రధానంగా విద్యావ్యవస్థలో జవాబుదారీతనాన్ని డిమాండ్ చేశాయి. అందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశాన్ని ప్రధానంగా ముందుకు తెచ్చాయి. చలో పార్లమెంటుపై దమనకాండ తర్వాత ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఉత్తరాది, దక్షిణాది ఒక్కతాటి మీదకు వచ్చాయి. మరోవైపు.. కాంగ్రెస్, రాహుల్‌గాంధీ చాత్రోంకా గూంజ్ కార్యక్రమంలో పరీక్షల వ్యవస్థను మోడీ సర్కారు కార్పొరేట్ కోచింగ్ సెంటర్లకు రూ. కోట్లు తెచ్చిపెట్టే బంగారు గనిగా ఎలా మార్చివేసిందీ చర్చకు పెట్టారు. కేంద్ర విద్యాబడ్జెట్ కంటే నీట్ తయారీకి విద్యార్థులు కోచింగ్ సెంటర్లకు చెల్లించే మొత్తాలు కొన్ని రెట్లు ఎక్కువ అని, బడ్జెట్ కంటే కార్పొరేట్ కంపెనీలకు కేంద్రప్రభుత్వం రద్దుచేసిన మొండి బకాయిలు కొన్ని వందల రెట్లు ఎక్కువ అంటూ ఈ చర్చను రాహుల్ పార్లమెంటులోనూ కొనసాగించాడు. కానీ, విద్యాశాఖ మంత్రిని వదులుకున్న మోదీ-షా ప్రభుత్వం.. విద్యార్థులు కోరిన మరో ముఖ్యమైన డిమాండ్ అయిన జవాబుదారీతనాన్ని కించిత్తు ప్రదర్శించలేదు. మంత్రి రాజీనామా, మరో కరుడుగట్టిన సంఘ్ నేత కు ఆ శాఖ అప్పగింత మొదలు విద్యార్థులపై దమనకాండ విషయంలో విపక్షాలు, ఒక మేరకు న్యాయస్థానం వేస్తున్న ప్రశ్నల పట్ల పట్టనితనం వరకు.. ఈ ఘట్టమంతా తన అహంకారాన్నే చూపించుకుంది. దానికి తెలిసింది అణచివేతే కాబట్టి.. మరిన్ని శిక్షలు, ఇంకొన్ని కఠిన సెక్షన్లు చేర్చి యాంటీ పేపరు బిల్లుకు పార్లమెంటులో ఆమోదముద్ర వేయించుకుంది. గత అనుభవం చూస్తే, ఈ చట్టాలేవీ కలుగుల్లోని ఎలుకలను పట్టలేవు.
నిజానికి, జన్ జీ ఉద్యమం పాలకవర్గాలతో వన్ టు వన్ సంభాషణకే పరిమితం కాలేదు. సమాజానికీ, మనకూ కొన్ని ప్రశ్నలు వదిలిపెట్టింది. జవాబుదారీ ప్రభుత్వం పార్లమెంటులో లేదని, సంఘటిత ఉద్యమాలే పాలకుల మెడలు వంచగలుగుతాయనే స్పష్టమైన సందేశం, ఒకరకంగా ఇది యుగ సందేశం కూడా, విద్యార్థులు ఇవ్వగలిగారు. ఇంతకుముందరి ఢిల్లీ రైతుల ఉద్యమం, నోయిడా కార్మికుల సంఘటిత పోరాటాలు అదాటుగా బద్దలయినవి కాదని, వ్యవస్థ సంక్షోభమే అలాంటి మరిన్ని ఉద్యమాలకు పురిటిగడ్డ అనేది మళ్లీ రుజువు అయింది. భరించలేని, ఉక్కపోత స్థితి ఉద్యమాలకు సమాజంలో వస్తుగత అనుకూలతలను పెంచుతున్నాయి. ఈ విషయం చెబితే, నిన్నటి దాకా ముఖం చీరాగ్గా పెట్టేవారిని జన్ జీ ఉద్యమం పునరాలోచనలో పడేయటం ఖాయం. సంఘటిత నిర్మాణాలు కలిగిన సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎం-ఎల్ విద్యార్థి సంఘాలు ఢిల్లీ, ఇతర చోట్ల ఉద్యమాన్ని బాధ్యతగా నిర్వహించాయి. గమనిస్తే, ఈ సంఘాల నేతలే ఎక్కువగా ఇప్పుడు వేధింపులకు, పోలీసు దాడులకు, అరెస్టు బెదిరింపులకు గురి అవుతున్నారు. జంతర్ మంతర్, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉద్యమించిన విద్యార్థుల సామాజిక పొందిక కూడా ఆసక్తికరమే. ఈ ఉద్యమంలో ట్యాక్స్ పేయర్ల పిల్లులు ఉన్నారు. రిజర్వేషన్ల ద్వారా ఆర్థిక, సాంస్కృతిక స్థితి మెరుగుపరుచుకున్న ఫ్యామిలీల నుంచీ వచ్చారు. డాడీ ఇచ్చిన పాకెట్ మనీ తీసుకుని బస్సో, రైలో ఎక్కి వచ్చినవారూ కనిపించారు. మీకు డబ్బులు పాకిస్థాన్ ఇస్తుందా అని ఓ గోదీ మీడియా విలేకరి అడిగితే.. నాన్న ఇచ్చిన పాకెట్ మనీ డబ్బులతో తాను వచ్చానని ఓ విద్యార్థిని కొంటెగా బదులిచ్చింది. మోడీత్వ పేరిట విద్య, ప్రచార మాధ్యమాలు, సాంకేతిక వ్యవస్థల్లో పాదుకుపోయిన కాషాయీకరణ, కార్పొరేటీకరణ శక్తులను ప్రశ్నించి గెలవడం అంత తేలిక కాదు. కానీ, ఈ తరం నైతిక ధృతి ముందు మోడీత్వ మేనియా తాత్కాలికంగా అయినా తల వంచింది. ఇందుకు మనం జన్‌జీ ని అభినందించాలి.
– రివేరా




