ప్రజాస్వామ్యానికి అసలైన ఊపిరి “ప్రశ్నించడం”. ఇది రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులలో భావప్రకటన స్వేచ్ఛ రూపంలో స్పష్టంగా ఆవిష్కృతమైంది. కానీ, దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాలను ఒప్పుకోవడానికి బదులు, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, వేధింపులకు గురిచేస్తూ, చివరకు వారి గొంతు నొక్కేలా భౌతిక దాడులు, దారుణమైన హత్యల సంస్కృతిని నిర్మొహమాటంగా అమలు చేస్తోంది. ఇటీవలి కాక్రోచ్ యువతరం ఉద్యమం మన సమాజపు స్థితిని, అవసరాన్ని సూచిస్తోంది. దాన్ని ఒకానొక విడి ఉద్యమంగాకాక మన సమాజపు స్థితిగతుల్లో భాగంగా, ప్రజా పోరాట వ్యక్తీకరణల్లో భాగంగా చూస్తూనే దాని ప్రత్యేకతలు వివరించాల్సి ఉంది.
శతాబ్దపు అతిపెద్ద వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన పాలకులు, నేడు క్షేత్రస్థాయి వాస్తవాలను కప్పిపుచ్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం అప్రజాస్వామిక పంథాను తొక్కుతున్నారు. ఇవన్నీ ఇవాళ అందరికీ కళ్లకు కట్టే సాక్ష్యాధారాలతో, నగ్న వాస్తవాలతో కనిపిస్తున్నాయి. సమాజంలో ఏదైనా ఒక పెద్ద మార్పు లేదా తిరుగుబాటు వస్తోందీ అంటే దాని వెనుక దశాబ్దాల అణచివేత, ఆర్థిక దోపిడీ నిగూఢంగా దాగి ఉంటాయి. అవన్నీ కలిసి ఇటీవల దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీలపై జరిగిన విద్యార్థి, యువజన ఉద్యమం. ఇదేదో ఒక్క రాత్రిలో ఆకస్మికంగా పుట్టుకొచ్చినది కాదు.
ఇలా ఆకస్మికంగా కాకుండా దశాబ్దాలుగా పేరుకుపోయిన నిరాశ, నిస్పృహలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు క్షేత్రస్థాయిలో చాలా పకడ్బందీగా ప్రతిఘటనను సిద్ధం చేశాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశ సంపద అంతా కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి చేరడమే దీనికి కారణం. విద్య, వైద్యం లాంటి కనీస హక్కులను సైతం ప్రైవేటీకరించి, సామాన్యుడికి అందనంత వ్యాపార సరుకులుగా మార్చేసిన ఈ వ్యవస్థాగత దోపిడీ సృష్టించిన ఆర్థిక సంక్షోభమే నేడు అన్ని వర్గాల ప్రజలను రోడ్డుపైకి తెచ్చింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రకటన భలే గమ్మత్తుగా ఉంది! బహుశా యువత అంతా పకోడీలు అమ్ముకుంటూ ఐటీ ప్రొఫెషనల్స్ అయిపోవాలని ప్రభుత్వం ముందే ఊహించి ఉంటుంది. నేడు దేశాన్ని దశాబ్దాల గరిష్ట నిరుద్యోగంలోకి నెట్టేసి, శాశ్వత ఉద్యోగాలను తీసేసి, తాత్కాలిక పనుల ద్వారా యువత శ్రమను తక్కువ ధరకే దోపిడీ చేస్తుండటంతో, వారిలో పేరుకుపోయిన అసంతృప్తి ఈ విద్యార్థి ఉద్యమంతో జతకట్టింది. ‘అచ్ఛే దిన్’ (మంచి రోజులు) అంటే గ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలు దాటడం, పెట్రోల్ సెంచరీ కొట్టడమే కాబోలు! సామాన్యుడి కడుపు కాల్చి కార్పొరేట్లకు పన్నులు మాఫీ చేయడం బహుశా నయా నమూనా సంక్షేమమేమో! నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే సామాన్య కుటుంబం బ్రతకడమే భారంగా మారింది.
ఈ విధంగా సామాన్యుడి బ్రతుకును భారంగా మార్చిన ఆర్థిక అణచివేతతో పాటు, పాలకుల ఉన్నత పీఠాల నుండి వచ్చిన తీవ్ర అవమాన భారాల నుండే ఒక చారిత్రక ప్రజా తిరుగుబాటు పుట్టింది. దేశ అత్యున్నత పీఠంపై ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దేశంలోని నిరుద్యోగ యువతను, కార్యకర్తలను ఉద్దేశించి అత్యంత దారుణంగా “సమాజానికి పట్టిన బొద్దింకలు, పరాన్నజీవులు” అని వ్యాఖ్యానించారు. న్యాయం కాపాడాల్సిన పీఠం పైనుండే దేశ భవిష్యత్తును కీటకాల్లా అవహేళన చేస్తే.. ఆ అవమాన భారం నుండే 30 ఏళ్ల యువకుడు అభిజీత్ దీప్కే X (ట్విట్టర్) వేదికగా “దేశంలోని బొద్దింకలంతా ఏకంకండి” అని పిలుపునిచ్చాడు. అలా పుట్టిన ‘కాక్రోజ్ జనతా పార్టీ’ (CJP) కేవలం కొన్ని వారాల్లోనే సోషల్ మీడియాలో అధికార పార్టీ కంటే రెట్టింపు ఫాలోయింగ్‌ను సంపాదించుకుని, ఒక మహా ప్రజా విప్లవంగా భౌతిక రూపాంతరం చెందింది. మొదట్లో ఈ ఉద్యమం కేవలం ‘NEET పేపర్ లీకేజీ’కి వ్యతిరేకంగా వైద్య విద్యార్థుల పోరాటంగానే ప్రారంభమైనప్పటికీ, ఆ విద్యార్థుల న్యాయమైన గొంతుకకు తోడుగా సమాజంలోని మిగతా పీడిత వర్గాలన్నీ స్వచ్ఛందంగా తరలివచ్చాయి.
ఇలా స్వచ్ఛందంగా తరలివచ్చిన జనప్రవాహంలో వైద్య విద్యార్థులు ముందుండి పోరాటాన్ని నడిపిస్తుండగా, సమాజంలోని అత్యధిక శ్రేణులు వారికి రక్షణ కవచంలా నిలబడటంలోనే అసలైన సామాజిక శక్తుల ఐక్యత స్పష్టంగా కనిపిస్తుంది. పాలకుల మభ్యపెట్టే రాజకీయాలు విఫలమై, వ్యవస్థ వల్ల నష్టపోతున్న ప్రతి ఒక్కరూ ఒకే తాటిపైకి వచ్చారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు లేక నలిగిపోతున్న నిరుద్యోగులు, చిన్న చిన్న ప్రైవేట్ పనులు చేస్తూ భద్రత లేని జీవితాలతో, విసిగిపోయిన తాత్కాలిక ఉద్యోగులతో పాటు తమ పిల్లలను చదివించడానికి రాత్రింబవళ్లు పొలాల్లో చెమటోడ్చే రైతులు, సామాన్య తల్లిదండ్రులు ఈ విద్యార్థి విప్లవానికి బాసటగా నిలిచారు. కార్పొరేట్ దళారీలు పరీక్షా పత్రాలను కొనుగోలు చేస్తూ, తమ పిల్లల కష్టాన్ని, భవిష్యత్తును దొంగిలిస్తున్నారని గ్రహించిన రైతాంగం ఈ ఉద్యమాన్ని ఒక వర్గ పోరాటంగా మార్చింది. “మేము కష్టపడి సంపాదించిన డబ్బును ఫీజులుగా పోసి చదివిస్తే మా పిల్లల భవిష్యత్తును దళారుల చేతుల్లో పెడతారా?” అంటూ వారు పాలకులను నిలదీస్తున్నారు. ఈ జెన్‌జీ ఉద్యమంలో కనిపించిన అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే దీనికి ఏ ఒక్కరో, ఇద్దరో అగ్రనేతలు లేరు. ఇది ఒక వికేంద్రీకృత శ్రేణుల ఐక్యత. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమను తాము బాధ్యతాయుత పౌరుడిగా, లీడర్‌గా భావించారు (వ్యక్తీకరణ). ఒక విద్యార్థి ల్యాప్‌టాప్ ముందు కూర్చుని డిజిటల్ పోస్టర్లు తయారుచేస్తే ఒక ఆటో కార్మికుడు లేదా తాత్కాలిక ఉద్యోగి క్షేత్రస్థాయిలో ప్రజలను సమీకరించాడు. ఏ ఒక్క నాయకుడి ఆదేశాల కోసమో వేచి చూడకుండా, వ్యవస్థాగత లోపాలను ఎదుర్కోవడానికి ప్రతి పౌరుడూ స్వయంగా ఒక ఉద్యమ కేంద్రంగా మారిపోయాడు.
ఈ వికేంద్రీకృత స్వభావాన్ని, జెన్‌జీ (GEN Z)యువత నిరసన ఆవేశాలను ఒక పద్ధతి ప్రకారం సమన్వయం చేస్తూ.. నిన్నటివరకు యువత పోరాటాలను చులకనగా చూస్తూ ముఖం చిట్లించుకున్న పాలకులను పునరాలోచనలో పడేలా చేసింది ఈ ఉద్యమ వ్యూహం. ఇలాంటి మహా ప్రజా తిరుగుబాట్లు కేవలం ఆవేశంతోనే సాధ్యం కావు, దాని వెనుక ఒక గట్టి క్రమశిక్షణ, సిద్ధాంత బలం అవసరం. ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా భుజాన వేసుకుని నడిపించింది.. దశాబ్దాల పోరాటాల అనుభవం, సంఘటిత నిర్మాణాలు కలిగిన సీపీఐ, సీపీఎం, మరియు సీపీఐ ఎం-ఎల్ అనుబంధ వామపక్ష విద్యార్థి సంఘాలే. జెన్‌జీ తరం డిజిటల్ తెరలపై ఉద్యమాన్ని హోరెత్తిస్తుంటే.. క్షేత్రస్థాయిలో పోలీసుల బారికేడ్లకు ఎదురు నిలబడి సంఘటిత పోరాట రూపం ఇచ్చింది ఈ చారిత్రక శక్తులే. అందుకే ఈ సిద్ధాంత బలాన్ని చూసి వణికిపోతున్న కేంద్ర ప్రభుత్వం.. నేడు ప్రత్యేకంగా ఈ వామపక్ష విద్యార్థి సంఘాల నేతలనే టార్గెట్ చేస్తూ రాత్రింబవళ్లు ఇళ్లపై దాడులు చేస్తోంది, దారుణమైన అక్రమ కేసులు, అరెస్టుల బెదిరింపులతో పగబట్టినట్లు వేధిస్తోంది! ఉద్యమాలకు వెన్నెముక లాంటి ఈ క్రమశిక్షణ కలిగిన శ్రేణుల గొంతు నొక్కితే.. యువత ఆందోళనలను ఇట్టే అణచివేయవచ్చనేది పాలకుల అసలైన కుట్ర.
కానీ ఈ అడ్డంకులు, రవాణా దిగ్బంధనాలు, ప్రభుత్వ కుట్రలు జెన్‌జీ ఉద్యమ స్ఫూర్తిని ఎంతమాత్రం ఆపలేకపోయాయి. ఈ చారిత్రక ర్యాలీకి వివిధ ప్రాంతాల నుంచి జనం రాకుండా రైళ్లను బలవంతంగా రద్దు చేయించినా, ఢిల్లీలోని మెట్రో రైళ్లను, కీలకమైన మెట్రో స్టేషన్లను పూర్తిగా నిలిపివేసి ఒక అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణాన్ని సృష్టించినా యువత లొంగలేదు. రైళ్లు ఆగితే ప్రైవేట్ వాహనాల్లో, అవి దొరకకపోతే కిలోమీటర్ల మేర నడుచుకుంటూ, వేలాది మంది యువతీ యువకులు, రైతులు జంతర్ మంతర్ వేదికకు చేరుకున్నారు. ప్రభుత్వం ఎంతగా రవాణా దిగ్బంధనం విధించినా, ఆ ఆంక్షలన్నింటినీ దాటుకుని దేశ నలుమూలల నుంచి తరలివచ్చిన ఆ జనప్రవాహం.. పాలకుల ఇనుప గోడల కంటే ప్రజా చైతన్యే శక్తివంతమైనదని నిరూపించింది. ఆ వేదికలపైనే యువత “మోదీ తేరి తానాషాహీ.. నహీ చలేగీ, నహి చలేగీ” నినాదంతో పాలకుల నిరంకుశత్వాన్ని సూటిగా కడిగిపారేసింది. అలాగే పేపర్ లీకేజీ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ నాటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని “ధర్మేంద్ర ప్రధాన్..ఇస్తీఫా దో” అంటూ దేశవ్యాప్తంగా హోరెత్తించారు. ఈ నినాదాల ఒత్తిడి తట్టుకోలేకే చివరకు కేంద్ర మంత్రి దిగిరావాల్సి వచ్చింది.
ఈ విధంగా నిరసనల ఒత్తిడికి ఒక విద్యాశాఖ మంత్రి దిగివచ్చినా, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏ తప్పు చేసినా, ఏ కుంభకోణంలో దొరికిపోయినా చేతిలో సిద్ధంగా ఉంచుకునే ఒకే ఒక్క మంత్రదండం తెరపైకి వస్తుంది.. అదే ‘మతం’! ఆర్థిక వ్యవస్థ అట్టడుగుకు పడిపోతే మందిరాల గురించి మాట్లాడటం, నిరుద్యోగం పెరిగిపోతే సరిహద్దుల గురించి చర్చలు పెట్టడం పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. వాటిపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం దేశ సరిహద్దులు, మత విద్వేషాలు, మందిరాల చుట్టూ రాజకీయ చర్చలను తిప్పుతుంది. తద్వారా నిజమైన బతుకుదెరువు సమస్యలను ప్రజలు మర్చిపోయేలా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ జెన్‌జీ (GEN Z) ఉద్యమాన్ని కూడా అణచివేయడానికి పాలకులు అదే వ్యూహాన్ని అమలు చేశారు. నీట్ లీకేజీపై సమాధానం చెప్పాల్సింది పోయి, నిరసన చేస్తున్న విద్యార్థులను, సామాన్యులను “హిందూ వ్యతిరేకులు”, “మత సామరస్యాన్ని దెబ్బతీసే శక్తులు” అని అధికార పార్టీ ఐటీ సెల్స్ సామాజిక మాధ్యమాల్లో ముద్రలు వేశారు. అంటే, లీకైన పరీక్షా పత్రాల గురించి అడిగితే అది మత వ్యతిరేకత అయిపోతుందన్నమాట! ఎంతటి విచిత్రమైన లాజిక్!
మతంతో మభ్యపెట్టే ఇటువంటి ఫాసిస్టు అణచివేత కేవలం పెద్దలపైనే కాదు, చివరకు 15 ఏళ్ల మైనర్లపై కూడా కేసులు పెట్టే స్థాయికి దిగజారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని డబ్బా కొట్టుకునే దేశంలో ఒక 15 ఏళ్ల మైనర్ బాలిక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, పాలకుల సింహాసనాలు కదిలిపోయాయా? ఎంతటి ఘోరం! ఇటీవల నీట్ నిరసనల వీడియోలో పాలకుల వైఫల్యాలను ప్రశ్నించినందుకు రుచికా సింగ్ అనే 15 ఏళ్ల మైనర్ బాలికపై నోయిడా పోలీసులు అర్ధరాత్రి వేళ ‘జీరో ఎఫ్ఐఆర్’ (Zero FIR) నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఆమె వయస్సును కావాలనే 25 ఏళ్లుగా మార్చి చూపిస్తూ చట్టాన్ని కూడా అపహాస్యం చేశారు. దానికి తోడు, అధికార పార్టీ ఐటీ సెల్స్ ఆ చిన్నారిని సోషల్ మీడియాలో దారుణంగా వేధించి, బెదిరింపులకు గురిచేశాయి. ఫలితంగా భయపడిపోయిన ఆ మైనర్ బాలిక చేతులు జోడించి దేశానికి, ప్రధానికి క్షమాపణలు చెబుతున్న వీడియోను విడుదల చేయాల్సి వచ్చింది. తప్పు చేసిన విద్యాశాఖ దళారులను పట్టుకోలేని ఈ వ్యవస్థ.. తనను నిలదీసిన ఒక 15 ఏళ్ల చిన్నారి రుచికా సింగ్‌ను మాత్రం నడిరోడ్డుపై క్షమాపణలు చెప్పేలా మోకాళ్లపై నిలబెట్టింది!
ఈ మొత్తం ఎపిసోడ్లో, అత్యంత విచిత్రమైన వ్యవహారం ఏంటంటే సదరు మైనర్ బాలిక రుచికా సింగ్ ప్రధానిని ఉద్దేశించి ఏదో అనిందని పాలకులు గగ్గోలు పెట్టడం! ప్రధాని పరువుకు జరిగిన భంగం మాత్రమే పాలకులకు కనిపించింది తప్ప, దేశ భవిష్యత్తు నాశనమైపోతుంటే రోడ్డెక్కిన లక్షలాది మంది యువతీ యువకులు కంటికి ఆనలేదు కాబోలు! ప్రధాని నరేంద్ర మోదీ ఆ తర్వాత ఒక వీడియో సందేశం పెట్టి, “నన్ను నా తల్లిని దూషించిన ఆ పిల్లలను నేను పెద్దమనసుతో క్షమిస్తున్నాను.. వారిని కోర్టుల చుట్టూ తిప్పడం సరికాదు” అంటూ తీవ్రంగా బాధపడిపోతూ సెలవిచ్చారు! ఎంతటి కరుణామయ హృదయం! కానీ ఇక్కడే ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యింది. ప్రధాని గారు తమపై మాట అన్నందుకు అంతగా నొచ్చుకుని బాధపడ్డారు కానీ అదే ప్రధానిగారి కనుసన్నల్లో పోలీసులు రోడ్డెక్కిన వేలాది మంది విద్యార్థులపై లాఠీలు విరిచారు, వాటర్ కెనాన్లతో ఎముకలు కొరికే నీళ్లు కొట్టారు, కళ్లు బైర్లు గమ్మేలా టియర్ గ్యాస్ ,వాయుగోళాలు ప్రయోగించారు. ఆ దెబ్బలకు వందలాది మంది విద్యార్థుల ఒళ్లు రక్తసిక్తమైంది. ఆ ఘోరాల గురించి, పరీక్షల లీకేజీల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న 21 మంది విద్యార్థుల కన్నవారి కడుపుకోత గురించి ప్రధానికి ఎందుకు బాధ కలగలేదు? తన వైఫల్యాలను, తన కింద ఉన్న లీకేజీ ముఠాల దారుణాలను కప్పిపుచ్చుకోవడానికే ఒక బాలిక మాటను సాకుగా చూపిస్తూ, తనేదో బాధితుడిగా (Victim Card) ముసుగు వేసుకోవడం ముమ్మాటికీ ప్రజలను మభ్యపెట్టడమే!
పాలకుల ఇటువంటి మభ్యపెట్టే ముసుగులను చీల్చుతూ, ఈ పోరాటంలో సిజెపి (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, అధికార ప్రతినిధి గౌరవ్ దాస్ వంటి యువ నాయకులు ప్రభుత్వ వైఫల్యాలపై అత్యంత పదునైన ప్రశ్నలు సంధించారు. “కోట్లాది మంది విద్యార్థుల రక్తాన్ని, కష్టాన్ని దళారులకు ఎలా అమ్ముకుంటారు? జాతీయ పరీక్షల సంస్థ (NTA) దగా చేస్తుంటే పాలకులు ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని నిలదీశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, బీజేపీ అనుబంధ శ్రేణులు రంగంలోకి దిగి “ఈ విద్యార్థి ఉద్యమం వెనుక జార్జ్ సోరోస్ నిధులు ఉన్నాయి”, “ఇది దేశాన్ని అస్థిరపరిచే దేశ వ్యతిరేక శక్తుల కుట్ర” అని కథలు అల్లారు. అవును మరి! సామాన్య భారతీయ విద్యార్థికి లేదా మైనర్ పిల్లలకు పేపర్ లీక్‌లపై కోపం రావాలన్నా విదేశీ నిధులు కావాలనేది పాలకుల అద్భుతమైన తెలివితేటలు! దీనిపై అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్ లు ఎంతో పరిణతితో సమాధానమిస్తూ “మా నిధులు విదేశాల నుండి రాలేదు; పరీక్షల ఫీజుల రూపంలో మా తల్లిదండ్రులు కట్టిన కష్టం నుండి వచ్చాయి. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ప్రతిపక్షాల కుట్ర అని మభ్యపెట్టడం ఆపండి. తప్పు చేసింది మీ ప్రభుత్వ సంస్థ అయితే, మాకు దేశద్రోహ ముద్రలు వేయడం మీ పిరికితనానికి నిదర్శనం” అని ప్రభుత్వ ఆరోపణలను తిప్పికొట్టారు.
యువత అడిగిన ఈ నిజాలను దేశప్రజల ముందుకు వెళ్లకుండా దాచడానికి, పాలకులతో పాటు దేశంలోని ప్రధాన స్రవంతి టీవీ ఛానళ్ల (Godi Media) బానిసత్వం కూడా తోడైంది. లక్షలాది మంది విద్యార్థులు దేశ రాజధానిలో నిరసనలు తెలుపుతుంటే, ఈ ఛానళ్లు కనీసం ఒక్క నిమిషం కూడా కవరేజ్ ఇవ్వకుండా పూర్తిగా తొక్కిపెట్టాయి! ప్రధాని మోదీ పార్లమెంట్ ముందు ఏం మాట్లాడారనే భజన కార్యక్రమాలతోనే కాలక్షేపం చేశాయి. కానీ ఈ జెన్‌జీ యువత ఆ మీడియాను నమ్మకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్, , మీమ్స్ (Memes) ద్వారా నీట్ లీకేజీ కుంభకోణాన్ని సామాన్య ప్రజల ఇళ్లల్లోకి చేరవేశారు. ‘డిజిటల్ ఇండియా’ అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వమే… డిజిటల్ మాధ్యమాల్లో నిరసనలు రాగానే భయపడి ఇంటర్నెట్ను బంద్ చేయడం ఒక అద్భుతమైన వ్యంగ్యం! పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేస్తున్నప్పుడు, ఆ దారుణాలు సోషల్ మీడియా ద్వారా దేశప్రజల ముందుకు ‘లైవ్ వీడియోల’ రూపంలో వెళ్లకుండా దాచడమే ప్రభుత్వ ఉద్దేశం కాబట్టే కేంద్ర గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) తనకున్న అధికారాలను ఉపయోగించి, భారీగా ఇంటర్నెట్ జామర్లను (Network Jammers) ఏర్పాటు చేయించి, ప్రజల ప్రాథమిక కమ్యూనికేషన్ హక్కును కాలరాసింది.
కానీ ఈ జెన్‌జీ (GEN Z) తరం పాలకుల జామర్ల కంటే రెండు అడుగులు ముందే నిలిచి, ప్రభుత్వం విధించిన (ScreenBinding) సాంకేతిక దిగ్బంధనాన్ని (Cyber Blockade) ముక్కలు చేస్తూ ఇంటర్నెట్ మరియు మొబైల్ సిగ్నల్స్ లేకపోయినా పని చేసేలా సరికొత్త ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను సృష్టించుకుంది. విద్యార్థులు ఇంటర్నెట్ అవసరం లేని, కేవలం బ్లూటూత్ , పీర్-టు-పీర్ (P2P) వైఫై ద్వారా పనిచేసే ‘బిట్‌చాట్’ (Bitchat) వంటి వికేంద్రీకృత యాప్‌లను ఆయుధంగా చేసుకున్నారు. వేలాది మంది ఈ యాప్‌ను ఆన్ చేయడం ద్వారా ఒకరి ఫోన్ మరొకరికి రిలే పాయింట్‌గా (Mesh Network) మారిపోయింది. దీనివల్ల ఇంటర్నెట్ బంద్ చేసినా విద్యార్థులు ఎక్కడ గుమికూడాలి, పోలీసుల లాఠీఛార్జ్ ఎక్కడ జరుగుతోంది అనే సమాచారాన్ని ఇంటర్నెట్ అవసరం లేకుండానే చేరవేసుకోగలిగారు. ఈ సాంకేతికతను చూసి హడలిపోయిన కేంద్ర హోంశాఖ ఏకంగా ట్విట్టర్ మాజీ సీఈఓ జ్యాక్ డోర్సేకు చెందిన ఈ యాప్ యొక్క సోర్స్ కోడ్‌ను భారతదేశంలో నిషేధించాలని గిట్‌హబ్ (GitHub) ను ఆదేశించింది! ఒక యాప్‌ను చూసి ఇంతగా వణికిపోవడం పాలకుల భయానికి నిదర్శనం కాదా? అయినప్పటికీ యువత ఆఫ్‌లైన్ ద్వారా ఈ యాప్‌ను షేర్ చేసుకుంటూ ప్రభుత్వ ఆంక్షలను బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేశారు.
సాంకేతికతతో మొదలైన ఈ పోరాటంలో పాలకుల నియంతృత్వాన్ని, భయాన్ని దెబ్బతీయడానికి యువత కేవలం డిజిటల్ నెట్‌వర్క్‌లను మాత్రమే కాకుండా రకరకాల సాంస్కృతిక కళారూపాలను ఆయుధంగా మార్చుకుంది. జంతర్ మంతర్ వీధుల్లో కేవలం నినాదాలు మాత్రమే హోరెత్తలేదు; ప్రభుత్వ వైఫల్యాలను, మభ్యపెట్టే నాటకాలను ఎండగడుతూ విద్యార్థులు వేసిన వీధినాటకాలు (Street Plays) దేశవ్యాప్తంగా ప్రజా హృదయాలను కదిలించాయి. నోట్ల రద్దు నుండి నీట్ లీకేజీ వరకు సాగిన దగాను నాటక రూపంలో ప్రదర్శిస్తుంటే, పక్కనే యువ కళాకారులు రాజకీయ వ్యంగ్య చిత్రాలు (Cartoons & Graffiti) గీస్తూ గోడలపై పాలకుల అహంకారాన్ని బొమ్మల రూపంలో నవ్వులపాలు చేశారు. అంతేకాకుండా, జెన్‌జీ తరం తమ ఆక్రోశాన్ని పదునైన హిప్-హాప్ , ర్యాప్ సాంగ్స్ (Protest Rap) రూపంలో మలిచి విడుదల చేయడంతో అవి సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో హోరెత్తాయి. సంప్రదాయ కళాకారుల డప్పు దరువులు, ప్రజా గేయాలు ఒకవైపు.. ఆధునిక తరం ఫ్లాష్ మాబ్లు, కవితా ప్రదర్శనలు మరొకవైపు కలిసి ఒక అపూర్వమైన సాంస్కృతిక ప్రతిఘటనను (Cultural Resistance) సృష్టించాయి. ఈ కళారూపాల ద్వారా సామాన్య అక్షరాస్యులకు కూడా పాలకుల పెట్టుబడిదారీ కుట్రలు, మత రాజకీయాల డొల్లతనం ఇట్టే అర్థమైపోయాయి.
ఈ పోరాట తీవ్రతకు , అంతర్గత ఒత్తిడికి తట్టుకోలేక జూలై 25న విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత, కేంద్ర మంత్రులు , సంకీర్ణ కూటమి నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి “విద్యార్థులపై పెట్టిన పోలీసు కేసులు (FIRs) అన్నీ వెనక్కి తీసుకుంటాం, ఎవరిపైనా భవిష్యత్తులో కక్షసాధింపు చర్యలు ఉండవు” అని హామీ ఇచ్చి ఉద్యమం విరమింపజేశారు. కానీ ఉద్యమం ఆగిపోగానే పాలకులు తమ అసలైన నైజం బయటపెట్టారు! ఇచ్చిన మాటను గాలికొదిలేసి దేశవ్యాప్తంగా విద్యార్థి నేతలను మళ్లీ అక్రమంగా నిర్బంధించడం మొదలుపెట్టారు! దీనికి తోడు బీజేపీ జాతీయ శ్రేణులు ఈ ఉద్యమ నేతలపై వ్యక్తిగత కక్ష సాధింపులకు దిగుతూ బహిరంగంగానే వీరిని “వైరస్ మరియు కాక్రోజ్ గ్యాంగ్” అని, దేశాన్ని లోపలి నుండి గుల్ల చేసే “మురికి మనుషులు, మురికి కుప్ప” అని అత్యంత నీచమైన భాషలో అభివర్ణించారు. న్యాయం అడిగిన విద్యార్థి లోకాన్ని ‘మురికి’ అనడం పాలకుల మనస్తత్వం ఎంత మురికిగా మారిందో స్పష్టం చేస్తోంది. అందుకే ప్రధాని మోదీ ఆ క్షమాపణ వీడియో విడుదల చేసిన వెంటనే, అభిజీత్ దీప్కే ట్విట్టర్లో సంధించిన అస్త్రం పాలకుల ముసుగును ఊడబీకింది: “ఫ్రెండ్, కేవలం రీళ్లలోనే (Reels) క్షమిస్తారా.. లేక పెట్టిన అక్రమ కేసులు కూడా వెనక్కి తీసుకుంటారా?” అని సూటిగా ప్రశ్నించి పాలకుల కెమెరా డ్రామాలను బట్టబయలు చేశారు.
చివరకు ఇక్కడ సామాన్య ప్రజలు, యువత వేస్తున్న సూటి ప్రశ్న ఒక్కటే… “ఈ దేశంలో ప్రభుత్వ తప్పులను ప్రశ్నించడం నేరమా?” వ్యవస్థాగత లోపాలను ప్రశ్నించే స్వతంత్ర గొంతుకలను భౌతికంగా అణచివేయడం కేవలం ఈ విద్యార్థి లోకంతోనే ఆగలేదు. సమాజంలో పాలకుల నయవంచనను, నయా-ఉదారవాద పన్నుల దోపిడీని నిలదీస్తున్న మేధావులు, సంస్కరణల కోసం తపించే బుద్ధిజీవులు, ఆందోళన చేసే విప్లవాత్మక భావజాల విద్యావేత్తలపై కూడా ప్రభుత్వం ఇటువంటి ఉక్కుపాదమే మోపుతోంది. వాస్తవాలను సమాజం ముందుకు తెచ్చే జర్నలిస్టులను, అక్రమాలను బట్టబయలు చేసే ఆర్టిఐ (RTI) కార్యకర్తలను, రాజ్యాంగ పరిరక్షణ కోసం గొంతు ఎత్తే ప్రతి సామాజిక శక్తులను తప్పుడు దేశద్రోహం ముద్రలతో జైళ్లలో బంధించడం లేదా దారుణంగా భౌతిక దాడుల ద్వారా అంతమొందించడం నేడు పాలకుల నిత్య కృత్యంగా మారింది.
పాలకుల ప్రస్తుత వైఖరిని గమనిస్తే.. కేవలం పార్లమెంటరీ భవనాల్లో లేదా చట్టసభల చర్చల్లోనే పారదర్శకత దొరకదని, వ్యవస్థాగత లోపాలపై నిజమైన జవాబుదారీతనాన్ని డిమాండ్ చేసే శక్తి కేవలం క్షేత్రస్థాయి సంఘటిత ప్రజా పోరాటాలకే ఉందనే బలమైన సత్యాన్ని ఈ తరం యువత నిరూపించింది. గతంలో సాగిన చారిత్రక రైతు పోరాటాలు గానీ, కార్మిక సమ్మెలు గానీ ఆకస్మికంగా వచ్చినవి కావు; అవి క్షేత్రస్థాయిలో ఉన్న లోతైన ఆర్థిక సంక్షోభం నుండి పుట్టుకొచ్చిన నిరసన రూపాలు. నేడు విద్యా రంగాన్ని కేవలం ఒక లాభదాయక వ్యాపార నెట్‌వర్క్‌గా మార్చే క్రమంలోనే NEET, NET, CBSE వంటి ప్రతిష్టాత్మక పరీక్షలలో ఊహించని కుంభకోణాలు , అక్రమ లీకేజీలు చోటుచేసుకున్నాయి. ఈ తీవ్రమైన వైఫల్యాలకు, విద్యార్థుల జీవితాలను గందరగోళంలోకి నెట్టిన విధానాలకు బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా లు నైతికంగా తమ పదవుల నుండి తక్షణమే తప్పుకోవాలనే పదునైన , రాజ్యాంగబద్ధమైన డిమాండ్‌తో యువత తమ కార్యాచరణను మరింత విస్తృతం చేస్తోంది. ఈ పోరాటం కేవలం ఒక పరీక్ష అక్రమాలపై జరుగుతున్న తాత్కాలిక అసంతృప్తి కాదు; ఇది సమాజంలో స్వేచ్ఛ, సమన్యాయం, పరస్పర నమ్మకాన్ని మళ్లీ పునరుద్ధరించడానికి వచ్చిన నూతన తరం మేధో విప్లవం. అంతిమంగా, పౌరుల శ్రమను , దేశ వనరులను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ వ్యవస్థలను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూసే అటు అంతర్గత కార్పొరేట్ శక్తులు, ఇటు బాహ్య దళారీ పెట్టుబడిదారుల తీవ్ర అణచివేత ధోరణుల నుండి భారతీయ సమాజానికి సంపూర్ణ స్వయంప్రతిపత్తిని సాధించడమే ఈ మహా చైతన్య ప్రవాహపు అంతిమ గమ్యస్థానం.
- కర్తార్




