(మనీష్ ఆజాద్ అలహాబాద్ నివాసి. రచయిత, కవి, సామాజిక కార్యకర్త. ఆయన ఈ వ్యాసం ఈ రోజు జన చౌక్ వెబ్ పత్రికలో వచ్చింది. విరసం సంస్థకు కాలం చెల్లిందని ఒకరు, విరసం దిక్కు మార్చుకోవాలని మరొకరు సలహాలనిస్తున్న సందర్భంలో సాంస్కృతిక రంగంలో విప్లవ కర్తవ్య బాట నుంచి తప్పించడానికి సామ్రాజ్య వాదం చేసిన కుట్రలను ఎండగట్టిన పుస్తకాలను మీ ముందుకు తీసుకురావటం అవసరమని భావించి ఈ వ్యాసాన్ని అనువదించి మీ ముందు ఉంచుతున్నా.. అనువాదకుడు)
గత నెల ఆగస్టు 31న బ్రిటిష్ రచయిత్రి ఫ్రాన్సెస్ స్టోనర్ సాండర్స్ (Frances Stonor Saunders) బ్రెయిన్ ట్యూమర్‌తో కన్నుమూశారు. ఆమె వయస్సు అప్పటికి కేవలం 60 సంవత్సరాలు మాత్రమే. ఆమె పుస్తకం ‘హూ పెయిడ్ ద పైపర్: ద సీఐఏ అండ్ ద కల్చరల్ కోల్డ్ వార్’ (Who Paid the Piper?: The CIA and the Cultural Cold War, Granta Books (UK) (1999) ఆ రోజుల్లో అకాడమిక్, కళా రంగాల్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది. తక్షణమే ఈ పుస్తకం దాదాపు 17 భాషల్లోకి అనువాదమైంది.
శీతయుద్ధ కాలం (cold war) లో సామ్రాజ్యవాద వ్యతిరేక, సమాజవాద కళలు, సాహిత్యం, ఆలోచనల ప్రభావం పెరుగుతుంటే దాన్ని అడ్డుకోవడానికి, ఎదుర్కొనడానికి సీఐఏ రహస్యంగా అనేక సంస్థలను (ఫ్రంట్స్) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా కళ, సాహిత్యం, సంస్కృతిని ప్రచార సాధనాలుగా (ప్రొపగాండా) ఎలా వాడుకుందో ఫ్రాన్సెస్ స్టోనర్ ఈ పుస్తకంలో స్పష్టంగా నిరూపించారు. ప్రసిద్ధ రాజకీయ విశ్లేషకులు జేమ్స్ పెట్రాస్ ‘మంత్లీ రివ్యూ’ పత్రికలో ఈ పుస్తకంపై అద్భుతమైన సమీక్ష రాస్తూ ఇలా పేర్కొన్నారు: “రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కళల పట్ల ప్రజల ఆలోచనా విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడంలో సీఐఏ, దాని అనుబంధ సాంస్కృతిక సంస్థలు గొప్ప విజయం సాధించాయి. ఎందరో ప్రసిద్ధ రచయితలు, కవులు, కళాకారులు, సంగీత విద్వాంసులు రాజకీయం నుంచి తమకు స్వాతంత్ర్యం ప్రకటిస్తూ “కళ కళ కోసమే” అనే భావనపై నమ్మకం వ్యక్తం చేశారు. ఐరోపాలో రాజకీయ స్పృహతో, స్పష్టమైన రాజకీయ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న రచయితలు, కళాకారులపై దాడి చేయడానికి ఈ ఆలోచననే ఒక ఆయుధంగా వాడుకున్నారు.”
ఫ్రాన్సెస్ స్టోనర్ దీనికొక తిరుగులేని ఉదాహరణ కూడా ఇచ్చారు. సోషలిస్ట్ రియలిజం, క్రిటికల్ రియలిజం ధోరణులకు పోటీగా అబ్‌స్ట్రాక్ట్ ఎక్స్‌ప్రెషనిస్ట్ (అమూర్త అభివ్యక్తీకరణ) చిత్రకళను, చిత్రకారులను ప్రోత్సహించడానికి సీఐఏ ‘మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్’, రాక్‌ఫెల్లర్, కార్నెగీ వంటి సంస్థల సహాయంతో భారీగా నిధులు గుమ్మరించిందని వివరించారు. ఈ ధోరణిలో నిలబడిన ప్రముఖ చిత్రకారుడు జాక్సన్ పోలాక్ నేరుగా సీఐఏతో సంబంధాలు కలిగి ఉండేవాడు.
నిజానికి ఈ పుస్తకం రాయడానికి ముందే, 1995లో ఫ్రాన్సెస్ స్టోనర్ ‘ఛానెల్ 4’ కోసం హిడెన్ హ్యాండ్స్:
ఎ డిఫరెంట్ హిస్టరీ ఆఫ్ మోడర్నిజం అనే ఒక ప్రసిద్ధ డాక్యుమెంటరీ ఫిల్మ్ తీశారు. (దీన్ని మీరు ఇప్పటికీ యూట్యూబ్‌లో చూడవచ్చు). 4 భాగాలుగా ఉన్న ఈ సిరీస్ మొదటి భాగం ఆర్ట్ అండ్ ద సీఐఏ గురించి ఉంటుంది. సరిగ్గా దీన్నే ఆమె 4 సంవత్సరాల తర్వాత తన పుస్తకంలో మరింత విస్తృతంగా రాశారు. పరిశోధనా చరిత్ర (ఇన్వెస్టిగేటివ్ హిస్టరీ) రంగంలో ఒక గొప్ప విజయాన్ని సాధించారు. ఈ డాక్యుమెంటరీలోనే ప్రముఖ చిత్రకారుడు జాక్సన్ పోలాక్ నేల మీద పరిచిన కాన్వాస్‌పై డబ్బాలోంచి రంగులను చెల్లాచెదురుగా చిమ్ముతుండటం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ప్రసిద్ధ ఆర్ట్ గ్యాలరీలలో ఈ చిత్రాలను ప్రదర్శించి, గొప్పగా సమీక్షలు రాయించి, ఈ కళా రంగానికి రకరకాల గ్రాంట్లు ఇచ్చి, రియలిస్టిక్, సోషలిస్ట్ శైలికి వ్యతిరేకంగా దీన్ని ఆర్ట్ ప్రపంచంలో బలంగా నిలబెట్టారు.
కళా రంగంలో ఈ ప్రచారాన్ని సీఐఏ ఎంత నైపుణ్యంతో నడిపిందో వివరిస్తూ రచయిత్రి తన పుస్తకంలో ఇలా రాశారు: “ప్రచ్ఛన్న యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, సీఐఏ ద్వారా అమెరికా ప్రభుత్వం పశ్చిమ ఐరోపాలో సాంస్కృతిక ప్రచారం అనే ఈ రహస్య కార్యక్రమం కోసం పిచ్చి పిచ్చి గా డబ్బు ఖర్చు చేసింది. అసలు అలాంటి ప్రోగ్రామ్ ఒకటి నడవడం లేదని బుకాయించడమే ఈ ప్రయత్నం వెనుక ఉన్న అసలు రహస్యం.”
కళలు, సాహిత్యంలో ఉన్న సోషలిస్ట్, రియలిస్టిక్ అంశాలను, కళాకారుల రాజకీయ నిబద్ధతను చెడగొట్టడానికి సీఐఏ భారత్ సహా 35 దేశాల్లో ‘కాంగ్రెస్ ఫర్ కల్చరల్ ఫ్రీడమ్’ సంస్థను ఏర్పాటు చేసిందని ఫ్రాన్సెస్ స్టోనర్ అంటారు. దీనితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జార్జ్ ఆర్వెల్, డానియల్ బెల్, హన్నా ఆరెంట్, మెల్విన్ లాస్కీ, సిడ్నీ హుక్, బెర్ట్రాండ్ రస్సెల్ వంటి దిగ్గజాలను జోడించడంలో విజయం సాధించింది. ఫ్రాన్సెస్ స్టోనర్ ఈ ‘కాంగ్రెస్ ఫర్ కల్చరల్ ఫ్రీడమ్’ సంస్థను సరైన రీతిలోనే ‘కల్చరల్ నాటో’ (సాంస్కృతిక నాటో) అని పిలిచారు. ఆమె పుస్తకంలో ఒక అధ్యాయం పేరే ‘కల్చరల్ నాటో’. ఈ ‘కల్చరల్ నాటో’ పత్రికలు (భారత్ నుంచి వచ్చిన క్వెస్ట్ వంటివి), పుస్తకాలు, సెమినార్లు, ఆర్ట్ ఎగ్జిబిషన్లు, అవార్డులు, కచేరీలు, రకరకాల గ్రాంట్లను ‘సాంస్కృతిక మిసైళ్లు’గా వాడుకుంది. వీటితో సామ్రాజ్యవాద వ్యతిరేక, సోషలిస్ట్, నిబద్ధత ఉన్న కళలపై విపరీతంగా దాడి చేసింది. అన్నిటికంటే ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయం – కళా-సాహిత్య రంగాల్లోని సాధారణ ప్రజలు ఇదంతా స్వచ్ఛందంగా, స్వతంత్ర ఆలోచనలతోనే జరుగుతోందని నమ్మారు.
ప్రపంచమంతటా దీని ప్రభావం పడింది. భారత్ కూడా దీనికి మినహాయింపు కాదు, పైగా భారత్ ఇందులో భాగస్వామిగా కూడా ఉంది.
‘కాంగ్రెస్ ఫర్ కల్చరల్ ఫ్రీడమ్’ సంస్థను 1950లో బెర్లిన్‌లో స్థాపించారు. సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత జయప్రకాశ్ నారాయణ్, మీనూ మసానీ నాయకత్వంలో దీని సదస్సు నేటి ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో హిందీ ప్రసిద్ధ సాహిత్యవేత్త ‘అజ్ఞేయ్’ కీలక పాత్ర పోషించారు. ‘పరిమళ్’ అనే రచయితల సంస్థలో కూడా అజ్ఞేయ్ పాత్ర దాదాపు ఒక సంరక్షకుడిలా ఉండేది. ‘ప్రగతిశీల రచయితల సంఘం’ (అభ్యుదయ రచయితల సంఘం)కు సమాంతరంగా ఈ ‘పరిమళ్’ నిలబడింది. సృజన అనేది సిద్ధాంతాల బంధనాల నుంచి స్వేచ్ఛగా ఉండాలి, లేదా వారి మాటల్లో చెప్పాలంటే రచనను సిద్ధాంతాల శిలువ వేయకూడదు అనే ఆలోచనతో దీన్ని స్థాపించారు. ఈ ఆలోచన ‘కాంగ్రెస్ ఫర్ కల్చరల్ ఫ్రీడమ్’ మేనిఫెస్టోతో పూర్తిగా సరిపోలుతుంది.
‘కాంగ్రెస్ ఫర్ కల్చరల్ ఫ్రీడమ్’ ద్వారా సీఐఏ హిందీ సాహిత్యాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో ఆధారాలతో చెప్పడానికి ప్రస్తుతానికి హిందీలో ఒక ‘ఫ్రాన్సెస్ స్టోనర్ సాండర్స్’ కోసం ఎదురుచూడాల్సిందే. అయితే అప్పుడప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. హిందీ సాహిత్యవేత్తల్లో ఒక పెద్ద వర్గంపై ఈ ‘కల్చరల్ నాటో’ ప్రభావం చాలా లోతుగా ఉందనడానికి ఇవే నిదర్శనం. హిందీ సీనియర్ కవి కమ్లేష్ ‘సమాస్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “మానవాళి సీఐఏకి రుణపడి ఉండాలి” అని వ్యాఖ్యానించినప్పుడు అలాంటి ఒక దృశ్యం బయటపడింది. కమ్లేష్‌ను సమర్థిస్తూ ఓం థాన్వీ కూడా మానవాళి సీఐఏకి ఎందుకు రుణపడి ఉండాలో వివరించారు. సీఐఏ చాలా తక్కువ ధరకే మానవాళికి పుస్తకాలను అందుబాటులోకి తెచ్చిందనేది ఆయన వాదన. కానీ ఆ చవకైన పుస్తకాలు ఏవో థాన్వీ గారు చెప్పలేదు.
సీఐఏ డబ్బుతో, అంటే ‘కాంగ్రెస్ ఫర్ కల్చరల్ ఫ్రీడమ్’ అందించిన నిధులతో అచ్చయిన ఒక పుస్తకం పేరు- ‘క్లాస్‌లెస్ క్యాపిటలిజం’. ఈ పుస్తకం 60ల కాలంలో ఎప్పుడో అచ్చయింది, అప్పట్లో దీని ధర కేవలం 25 పైసలు మాత్రమే. వర్గ రహిత సమాజాన్ని నిర్మించడానికి సోషలిజం ఏమీ అవసరం లేదని ఇందులో రాశారు. కష్టపడి పనిచేస్తే పెట్టుబడిదారీ విధానంలోనే ఎవరైనా తమ వర్గాన్ని మార్చుకోవచ్చని చెప్పారు. దీనికి మద్దతుగా కొందరు వ్యక్తులు తమ కష్టపడి పనిచేసే తత్వంతో పేద వర్గం నుంచి ధనిక వర్గానికి ఎలా వెళ్లారో, అలాగే కొంతమంది బద్ధకం వల్ల ధనిక వర్గం నుంచి పేద వర్గానికి ఎలా దిగజారారో ఉదాహరణలుగా చూపించారు. పెట్టుబడిదారీ విధానం ఏమీ కఠినమైన వ్యవస్థ కాదు, ఇది చాలా లౌక్యమైన వ్యవస్థ, ఇందులో అందరికీ పైకి ఎదగడానికి తగినంత అవకాశం ఉందనేది దీని సారాంశం. అయితే సీఐఏ అందించే చవక పుస్తకాల వాదనపై ఇబ్నే ఇన్సా సమగ్రమైన వ్యాఖ్య చేశారు: “నల్లమందు చవకగా దొరుకుతుందని ఆబగా నాకేద్దామా? విషం చవకగా ఉందని తిని ఆత్మహత్య చేసుకుందామా?”
2013లో జరిగిన ఈ ఆసక్తికరమైన చర్చను ఎవరైనా ఇప్పటికీ అప్పటి వెబ్‌సైట్ ‘జనపక్ష’లో చదవచ్చు.
అమెరికాకు చెందిన స్త్రీవాది ‘గ్లోరియా స్టైనమ్’ ఈ నెల సెప్టెంబర్ 2న మరణించిన తర్వాత, ఆమె సీఐఏతో క్రియాశీలకంగా పనిచేసిందనే వార్త ఆమెపై వచ్చిన అనేక వ్యాసాల్లో బయటపడింది. అప్పుడు కూడా ఎక్కువ మంది హిందీ సాహిత్యవేత్తలు, మేధావులు ఈ నిజాన్ని పక్కన పెట్టడానికే మొగ్గు చూపారు.
‘కల్చరల్ నాటో’ సాంస్కృతిక క్షిపణులు భారత్‌పై కూడా పడ్డాయి. కాకపోతే ఈ ‘విధ్వంసం’ గురించిన స్పష్టమైన అంచనా ఇప్పటివరకు జరగలేదు. (తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం ఏమైనా ఉందా? అనేది పరిశోధన చేయల్సే ఉంది- అను.)
ఫ్రాన్సెస్ స్టోనర్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకేనేమో ఈ ఏడాది ఆరంభంలో ఆమె పుస్తకం ఇచ్చిన స్ఫూర్తితో, అదే పేరును వాడుకుంటూ వచ్చిన మరో ముఖ్యమైన పుస్తకం వార్త బహుశా ఆమెకు చేరి ఉండకపోవచ్చు. ‘మంత్లీ రివ్యూ’ నుంచి వచ్చిన ఆ పుస్తకం పేరు- ‘‘హూ పెయిడ్ ద పైపర్స్ ఆఫ్ వెస్టర్న్ మార్క్సిజం? (Who Paid the Pipers of Western Marxism?, Gabriel Rockhill, Monthly Review Press, 2025) దీని రచయిత గాబ్రియేల్ రాక్‌హిల్, ఫ్రాన్సెస్ స్టోనర్‌కు పూర్తి శ్రేయస్సు (క్రెడిట్) ఇస్తూ ఇలా రాశారు: “నా పుస్తకం ‘హూ పెయిడ్ ద పైపర్స్ ఆఫ్ వెస్టర్న్ మార్క్సిజం?’ అనేది ఫ్రాన్సెస్ స్టోనర్ సాండర్స్ అద్భుత సృష్టి ‘హూ పెయిడ్ ద పైపర్? ద సీఐఏ అండ్ ద కల్చరల్ కోల్డ్ వార్’ ప్రతిధ్వని మాత్రమే.”
ఫ్రాన్సెస్ స్టోనర్ సీఐఏ, కళా-సాహిత్య రంగానికి మధ్య ఉన్న అపవిత్ర బంధాన్ని ఎలాగైతే బయటపెట్టారో, గాబ్రియేల్ రాక్‌హిల్ సీఐఏ, వెస్టర్న్ మార్క్సిజం మధ్య ఉన్న అనుబంధాన్ని లోతుగా త్రవ్వి తీశారు. అకడమిక్ ప్రపంచంలో సీఐఏ సహాయంతో నిలబెట్టిన వెస్టర్న్ మార్క్సిజం/పోస్ట్ మోడర్నిజం అసలు లక్ష్యం విప్లవాత్మకమైన, సామ్రాజ్యవాద వ్యతిరేక మార్క్సిజాన్ని పక్కకు నెట్టివేయడమేనని, విప్లవ బాధ్యతలను ఎప్పటికీ మూలన పడేయడమేనని నిరూపించారు.
ఫ్రాన్సెస్ స్టోనర్ తరహాలోనే గాబ్రియేల్ రాక్‌హిల్ కూడా ఈ పుస్తకంలో సీఐఏ రహస్య పత్రాలను (డిక్లాసిఫైడ్ డాక్యుమెంట్స్), ఇతర ఆధారాలను లోతుగా పరిశోధించారు. డెరిడా, అడోర్నో, హోర్కైమర్, మార్క్యూజ్, హేబర్‌మాస్ మొదలైనవారు సీఐఏకి చెందిన ‘ఇంపీరియల్ థియరీ ఇండస్ట్రీ’తో కలిగి ఉన్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలను బయటపెట్టారు. అకడమిక్ ప్రపంచంలో ‘వర్గ పోరాటం’ లేదా ‘వర్గ విశ్లేషణ’ వంటి పదాలు కూడా కనిపించకుండా పోవడానికి కారణమైన ఆ పొగమంచును తొలగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఒకప్పుడు ఒక చిన్న పిల్లాడు రాజు దిగంబరంగా ఉన్నాడని చూసి చెప్పేశాడు. కానీ ఆ తర్వాత రాజు జాగ్రత్తపడ్డాడు. ఈ రోజు ఆయన ‘అందమైన దుస్తుల’ వెనుక దాదాపు దాక్కుండిపోయాడు. అయితే పైన పేర్కొన్న రెండు పుస్తకాలు ఈ ‘అందమైన దుస్తులను’ చింపివేసి రాజును మరోసారి మన ముందు దిగంబరుడిగా నిలబెట్టాయి. కాకపోతే ఆ చిన్న పిల్లాడిలా రాజు నగ్న౦గా ఉన్నాడని మనం ధైర్యంగా చెప్పాలి.




