ఎవరిదో దుఃఖం నదిగా ప్రవహిస్తున్నది
ఒడ్డున పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు
ఎక్కడి నుండో పక్షులు పాడుతున్నవి
ఎవరు నాటారో తెలియని మొక్కలు
నిలువెల్లా పువ్వులతో నిండి ఠీవీగా చూస్తున్నవి
ఓ నాలుగు పెద్ద వృక్షాలు
చూపులతోనే ఏ పాత ముచ్చట్లో చెప్పుకుంటున్నవి
వాటి గలగల నవ్వులో ఏమో ఆకులై రాలుతున్నవి
చెట్టుమీదున్న పావురం
రాలిన ఆకుల స్థానంలో రాబోయే చిగుళ్ళను పరికల్పన చేస్తూ
ఓ శాస్త్రవేత్తలా ఆలోచిస్తున్నది
దట్టమైన చెట్ల పొదలు
పొద్దుగుంకని తలపోతలను ముందేసుకున్న వృద్ధుల్లా నెమ్మదిగా కదులుతున్నవి
పొద్దులు వెలిగించేందుకు రేయంతా జాగారం చేస్తున్న వృద్ధుల్లాగే అవి గంభీరంగా ఉన్నవి
రెండు ఉడత బుడతలు
ఆ పొదల లోపలికీ బయటికీ పదే పదే పరుగులు పెడుతూ సరదా పడుతున్నవి
సూర్యుడు దుఃఖనదిలోకి మౌనంగా నిష్క్రమిస్తున్నాడు
చీకటి చిక్కగా పరచుకోవడానికి తొందరపడుతున్నది
వెన్నెలను వెల్లువలా వెదజల్లలేని చంద్రుడు
నెలవంకగా నీరసంగా తొంగి చూస్తున్నాడు
మసక వెలుతురులో చెట్ల నీడలు చిత్రకారులవలె రకరకాల ఆకృతులను సృష్టిస్తున్నవి
ఓ మిణుగురుల గుంపు విజయోత్సవ ర్యాలీలా వెలిగిపోతూ నది మీదుగా వెళ్తున్నది
చిన్న మబ్బు మరక ఒకటి ఆకాశానికి దిష్టి చుక్కైంది
కెరటాల సందేశమేదో మోసుకొని చల్లటి గాలి
తెరలు తెరలుగా పయనమై పోతున్నది
పిల్లల నవ్వులను చూడటానికి చుక్కలు నేలమీదికి వంగుతున్నవి
లోకం వెలివేసిన ఓ జంట నదీ తీరాన ఇసుక రేణువులతో తమ సుదీర్ఘ కన్నీటి కథను చెప్పుకుంటున్నది
ఆ మార్గాన ఎవరో నడిచి వెళ్ళిపోయిన పాదముద్రలు
ఆ జంట కన్నీటి చుక్కలను ఓదార్చుతూ ధైర్యం బోధిస్తున్నవి
నది మీది ఆకాశం అమ్మ కొంగులా వాత్సల్య పొరయై నదిని కనిపెట్టుకుని ఉన్నది
అల్లంత దూరంలో అగ్నిశిఖలు కనిపిస్తున్నవి
అవి ఏ సతి చితివో… ఏ అనుమానం, ఏ అవమానం, ఏ అబద్ధ ప్రేమ చేసిన హత్యవో తేలలేదు
కొందరు స్త్రీలు మౌన రోదనలై అక్కడి నుండి అలాంటి చోట్లకే తిరిగి వెళ్తున్నారు
దూరంగా నిలుచున్న చారిత్రక కట్టడం
మరింత శిథిలమవుతూ ఏదో చెప్పాలనుకుంటున్నది
ఒక పెద్ద బండరాయి పాతుకుపోయి కూర్చున్న పాలకుడిలా
తన దరిదాపులకొచ్చే కెరటాలను విరిచేస్తూ గర్వపడుతున్నది
కెరటాల హోరు మళ్ళీ మళ్ళీ సందేశాలను మోసుకొని వస్తున్నది
మినుకుమినుకుమనే నక్షత్రాల నడుమ ఓ అరుణ తార అమరవీరుడి జ్ఞాపకంలా అపురూపంగా మెరుస్తున్నది
నదికి ఆవల మట్టి రేణువులు అడవిని ప్రసవించే కల కంటున్నవి
నదికి ఈవల ఓ గుంపు చెత్తా చెదారాన్ని నదిలోకి తోస్తున్నది
నదినే చూస్తున్న ఒక నిటారు పర్వతం కాలంతో ఏదో మాట్లాడుతున్నది
నది నడి మధ్యలో ఓ ఒంటరి ఓడ అతి బరువుగా కదిలీ కదలనట్టుగా పయనిస్తున్నది
నది కొసన చిరుచేపలు తమ తెరచిన కన్నుల కలలను ఎవరికో చెప్పాలని హడావిడిగా తిరుగుతున్నవి
నది ఒడ్డున గులకరాళ్ళు చిరకాల స్నేహితుల్లా శుభాకాంక్షలు చెబుతున్నవి
యుద్ధంలో నిలబడిన ఓడిపోని వీరుడి పోరాట జీవితంలా సన్నివేశం కొనసాగుతున్నది…..!




