“ప్రిజన్ రిమెయిన్స్” సాంస్కృతిక కార్యకర్త రమేశ్ గైచోర్ రాస్తున్న వ్యాసమాలిక. ప్రొఫెసర్ హనీ బాబు సంపాదకీయ మార్గదర్శకత్వంలో, హర్షాలీ పోత్దార్ దీన్ని మరాఠీ నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. విచారణ ఖైదీగా దాదాపు తొమ్మిదేళ్లు జైలులో గడిపిన గైచోర్, జైలు గోడల వెనుక మనుషుల గురించి, వారి రోజువారీ జీవితాల గురించి రాశారు. వ్యక్తి చిత్రణలు, కథనాత్మక వ్యాసాలు, విశ్లేషణల ద్వారా కులం, పేదరికం, రాజ్యాధికారం జైలు జీవితాన్ని ఎలా మలుస్తాయో ఈ వ్యాస మాలిక పరిశీలిస్తుంది. అదే సమయంలో అక్కడ నిలిచే అనుబంధాలు, హాస్యం, ఒకరినొకరు చూసుకునే తీరు, ప్రతిఘటనను కూడా నమోదు చేస్తుంది.

అనువాదకురాలి మాటః
“ఈ వ్యాసాన్ని అనువదించడం నా అవగాహనను ఎంతో విస్తరించిన అనుభవం” . ఉమ్మడి అనుభవాల కారణంగా తనకు ఎంతో సన్నిహితమైన ఆ చిత్రం ద్వారా రచయిత ప్రపంచంలోకి లోతుగా ప్రవేశించడం, అనువాదంలో పూర్తిగా భిన్నమైన దృక్కోణాన్ని అందించింది. తన అనుభవాలనూ జ్ఞాపకాలనూ ఆయన ఎంత బలంగా సజీవంగా చెప్పారంటే, ఒక్కో సంఘటనను అనువదిస్తున్నప్పుడు అందులోని ఒక్కో భావం నాకు ఆసక్తి కలిగించింది.
ఒకదానితో ఒకటి గాఢంగా ముడిపడిన ఎన్నోసజీవ కథలను అనువదిస్తున్నట్టు నాకు అనిపించింది. అవి మూడు వేర్వేరు ప్రపంచాలకు చెందినవి. ప్రతి ప్రపంచానికీ దాని సొంత భాష, ప్రత్యేకత ఉన్నాయి. మొదటిది “ది షాషాంక్ రిడెంప్షన్” చిత్ర ప్రపంచం. రెండోది జైలు వెలుపలి ప్రపంచం. మూడోది రచయిత విచారణ ఖైదీగా రెండుసార్లు సుదీర్ఘకాలం గడిపిన తలోజా కేంద్ర కారాగారం. వ్యాసమంతటా ఈ మూడు ప్రపంచాల పరిభాషలు ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయి.

రచనలోని కవితాత్మకతను నిలుపుతూనే, అధికారిక ప్రక్రియలనూ వాస్తవ వివరాలనూ సరిగ్గా అందించడంతో పాటు, కథాంశాన్నికూడా పాఠకులకు చేరవేయడం అసలు సవాలు. రచయిత జైలు అనుభవాల గురించి వ్యక్తిగతంగానూ, రాజకీయ సందర్భాల్లోనూ చాలాకాలంగా వింటూ వచ్చినందున నేపథ్యం చాలావరకు అర్థమైంది. అయినా, ఎక్కడైనా ఆగిపోయినప్పుడు, రచయిత ఓపికగా నా ప్రశ్నలకు జవాబులిచ్చి సందేహాలను తీర్చారు.
వ్యాసం మొత్తాన్ని మరాఠీ నుంచి ఆంగ్లంలోకి నేనే అనువదించాను. అయితే పదాల ఎంపికలో, వాక్య నిర్మాణంలో ప్రొఫెసర్ హనీ బాబు ఇచ్చిన సూచనలు, ఆయన చేసిన సమీక్ష, తుది సంపాదక సహాయం లేకపోతే పని మరింత కష్టమయ్యేది. పలువురు చదివి సూచనలు ఇవ్వడంతో అనువాదం మెరుగుపడింది. హనీ బాబు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రం, ఆంగ్లం బోధించిన ప్రొఫెసర్. ఆయన రాజకీయ ఖైదీ కూడా. రమేశ్ గైచోర్‌తో పాటు అదే కేసులో నిందితుడిగా, హనీ బాబు అదే తలోజా కేంద్ర కారాగారంలో ఐదేళ్లకు పైగా గడిపారు. ఆ అనుభవం కూడా ఈ అనువాదం ఇప్పటి రూపాన్ని సంతరించుకోవడానికి తోడ్పడింది. వ్యాసంపై పని చేస్తున్నప్పుడు ఆయన ఉదారంగా సమయం కేటాయించి మాకు మార్గదర్శకత్వం ఇచ్చారు. ఇలా ఈ అనువాదం రమేశ్ గైచోర్ నుంచీ, ప్రొఫెసర్ హనీ బాబు నుంచీ నేర్చుకునే ఒక కొత్త అనుభవంగా మారింది.
జైళ్లు సజీవంగా ఉంటాయి, సంకెళ్లు వర్ధిల్లుతాయి. విప్లవకారులు బతికున్నంతకాలం సంకెళ్లు పూస్తాయి, ఫలిస్తాయి.


తిరుగుబాటు దారులతో తమ బంధాన్ని సంకెళ్లు తెంచుకున్నప్పుడు ఏమవుతుంది?
హఫీజ్ మేరఠీ

ఇది రాస్తున్నప్పుడు హఫీజ్ మేరఠీ పంక్తులు నా మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇటీవల గాయాలతో, రక్తమోడుతూ కనిపించిన భారతీయ విద్యార్థుల చిత్రాలు సామాజిక మాధ్యమాలను ముంచెత్తాయి. భారతదేశంలోని అవినీతిమయ విద్యావ్యవస్థకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న జెన్‌-జెడ్ విద్యార్థులపై పోలీసులు బాష్పవాయువును, నీటి ఫిరంగులను ప్రయోగించారు. మేకులు పొదిగిన లాఠీలతో నిర్దాక్షిణ్యంగా కొట్టారు. విద్యార్థినులనూ వదల్లేదు. వారి దుస్తులు చిరిగిపోయేంతగా ఈడ్చుకెళ్లారు. ఇంతటి అణచివేతను ఎదుర్కొన్న విద్యార్థులు, నిరసనకారులు, వివిధ అంబేడ్కరైట్, వామపక్ష, ఉదారవాద సంస్థలు దృఢంగా నిలబడ్డాయి. వారి ఆశాభావపు పరిమళం ఎన్నో పోరాటాల రూపంలో భారతదేశపు నలుమూలలకూ వ్యాపించింది. ఆ పరిమళం నాలోనూ నిండింది. ఈ ఆశాభావంతో, అది రగిలించే తిరుగుబాటుతో నాకు పాతదీ గాఢమైనదీ అయిన అనుబంధం ఉంది. ఇరవై అయిదేళ్ల క్రితం కబీర్ కళా మంచ్ ద్వారా కులం, వర్గం, పితృస్వామ్య నిర్మూలన ఉద్యమంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి నాకున్న అనుబంధమది.

ఇప్పటి జెన్‌-జెడ్ నిరసనలు కావచ్చు, ఢిల్లీ–హరియాణా రహదారిపై సింఘు సరిహద్దులో రైతుల పోరాటం కావచ్చు, సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్ నిరసనలు కావచ్చు. రోహిత్ వేముల, జిషా, చంపా, పాయల్ తాడ్వీ, అనితల వ్యవస్థాగత హత్యల తర్వాత పుట్టుకొచ్చిన విద్యార్థి ఉద్యమాలు కావచ్చు. ఖైర్లాంజీ, హథ్రాస్, జవ్‌ఖేడా వంటి చోట్ల దళితులపై జరిగిన మారణకాండలకు ప్రతిస్పందనగా వెల్లువెత్తిన కులనిర్మూలన ఉద్యమాలు కావచ్చు. ఇవన్నీ వేర్వేరు చోట్ల, వేర్వేరు సమయాల్లో, వేర్వేరు సమూహాల మధ్య భిన్న రూపాల్లో, భిన్న మాధ్యమాల ద్వారా సాగాయి. ప్రస్తుత వ్యవస్థను ప్రతిఘటించగలం, మార్చగలం అనే రాజకీయ దృఢనిశ్చయం వీటన్నిటినీ కలుపుతోంది.

ఇజ్రాయెల్, అమెరికాల క్రూరమైన సామ్రాజ్యవాద హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్న పాలస్తీనా, గాజా ప్రజలు మనకు ఎంత గాఢంగా స్ఫూర్తినిస్తున్నారో మనం ఎప్పుడూ గుర్తించకపోవచ్చు. పరిస్థితులను ఎదిరిస్తే అవి మారగలవనీ, సామూహిక ప్రతిఘటనతో ప్రపంచాన్ని తిరిగి మలచగలమనీ వారి పోరాటం గుర్తుచేస్తుంది.

మార్పు సాధ్యమే అన్న భావనే నేను రెండుసార్లు సుదీర్ఘ జైలు జీవితాన్ని తట్టుకుని నిలడేలా చేసింది. మొదటిసారి 2013 నుంచి 2017 వరకు, రెండోసారి 2020 నుంచి 2026 వరకు జైలులో ఉన్నాను. రెండుసార్లూ 1967 నాటి చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం, యూఏపీఏ, కింద నన్ను నిర్బంధించారు. ఉగ్రవాద నిరోధక చట్టమైన దీనిని భిన్నాభిప్రాయాలను అణచడానికి పదేపదే ఉపయోగించారు. మొదటిసారి బెయిల్‌పై విడుదలైన తర్వాత, అనుకోకుండా “ది షాషాంక్ రిడెంప్షన్” చూశాను. రెండోసారి ఎల్గార్ పరిషత్–భీమా కోరేగావ్ కేసులో నన్ను అరెస్టు చేశారు. ఆ కేసులో యూఏపీఏ కింద 16 మంది కార్యకర్తలు, అధ్యాపకులు, న్యాయవాదులను అరెస్టు చేశారు. రెండోసారి జైలులో ఉన్నప్పుడు ఆ సినిమా నాకు ఎంతో ముఖ్యమైంది. అది నన్ను నిబ్బరంగా నిలబెట్టింది. నిర్బంధం మధ్య కూడా స్వేచ్ఛ సాధ్యమే అన్న నమ్మకాన్ని నిలుపుకోవడానికి తోడైంది. 1994లో విడుదలైన “ది షాషాంక్ రిడెంప్షన్,” ఓర్పు స్నేహం ప్రతిఘటనల కథతో అసంఖ్యాక ప్రేక్షకులకు స్ఫూర్తినిచ్చింది.

సంస్కరణ గృహమా? వధశాలా?
“ది షాషాంక్ రిడెంప్షన్ “కథ అమెరికాలోని షాషాంక్ జైలులో జరుగుతుంది. నేను మహారాష్ట్రలోని తలోజా కేంద్ర కారాగారంలో ఉన్నాను. భౌగోళికంగా, సాంస్కృతికంగా ఎంత దూరం ఉన్నా, అమానుషత్వంలోనూ అవినీతిలోనూ రెండు జైళ్లకూ ఎన్నో పోలికలున్నాయి. జైలు యంత్రాంగం చెలాయించే అధికారం, అక్రమ వ్యాపారాలు, నిర్బంధంలో ఊపిరాడని స్థితి, ఖైదీలు అనుభవించే మానసిక గాయాలు రెండుచోట్లా కనిపిస్తాయి. కొద్దిమంది మినహా తలోజా జైలు సూపరింటెండెంట్లు, అదనపు సూపరింటెండెంట్లు సినిమాలోని అధికారుల్లాగే క్రూరంగా, అమానుషంగా, స్వార్థపరులుగా, అవినీతిపరులుగా ఉండేవారు.

కొత్తగా శిక్ష పడిన ఖైదీలు షాషాంక్‌లోకి ప్రవేశించే కలచివేసే దృశ్యంతో సినిమా మొదలవుతుంది. జైలులో చేర్చుకునే ప్రక్రియే వారిని అవమానించేలా, వారి మానవ గౌరవాన్ని హరించేలా రూపొందింది. సినిమా, దాన్ని యథాతథంగా చూపిస్తుంది. అయినా, దాని తీవ్రతను చదివినా, తెరపై చూసినా పూర్తిగా గ్రహించడం కష్టం. ఒంటిపై బట్టలన్నీ విప్పించి, అందరి ఎదుట గుండ్రంగా తిరగమని ఆదేశించినప్పుడు, ఆ అవమానం తెలుస్తుంది. తొలిసారి జైలులోకి అడుగుపెట్టినవారికి ఆ మానసిక గాయాన్ని తట్టుకోవడం అంత సులభం కాదు.

ఆ ప్రారంభ దృశ్యంలో కొత్తగా వచ్చిన ఒక ఖైదీ, జైలులో చేర్చే తీరు, అక్కడి ప్రతికూల వాతావరణం తట్టుకోలేక, ఇంటికి వెళ్లిపోవాలంటూ ఏడుస్తాడు. అతణ్ని ఆదుకోవాల్సిన సీనియర్ జైలు అధికారులు, ‘సంస్కరణ గృహం’ అని పిలిచే సంస్థకు ప్రతినిధులు, అతణ్ని నేలకు పడేసి, తన్ని, చావగొడతారు. రాత్రంతా నొప్పితో విలవిలలాడిన అతడు జైలు ఆసుపత్రిలో చనిపోతాడు. సినిమాలో ఈ నిర్దాక్షిణ్య హత్య అతిశయోక్తిలా అనిపించవచ్చు. దాదాపు పదేళ్ల జైలు జీవితంలో నేను స్వయంగా తెలుసుకున్న వాస్తవమే అది.

ఇలాంటి అమానుష ఘటనలు ఎన్నో చూశాను. తన పెంపుడు జంతువులపై ఎంతో ప్రేమ చూపించే జైలు అధికారి, ఖైదీల పట్ల ఏమాత్రం కనికరం చూపకపోవచ్చు. చాలామంది ఖైదీల మరణాలకు జైలు వైద్యుల నిర్లక్ష్యమే కారణం. వారి అనారోగ్యం అంత తీవ్రమైనది కూడా కాకపోవచ్చు.

నా పక్క బ్యారక్‌లో ఒక వృద్ధ ఖైదీ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేవాడు. ఆ రాత్రి వైద్య సహాయం కావాలని ఖైదీలు పదేపదే పిలిచినా ఏ వైద్యుడూ రాలేదు. చాలాసేపటికి ఒక వైద్య సహాయకుడు వచ్చి నొప్పి మాత్ర ఇచ్చాడు. తరచూ పారాసిటమాల్ లేదా డైక్లోఫెనాక్ వంటి మాత్ర ఇచ్చి, సమస్య తీరిపోయిందనుకుంటారు. ఆ మందులతో ఉపశమనం కలగకపోవడంతో, అతణ్ని జైలు ఆసుపత్రిలో చేర్చారు. అప్పటికే మెరుగైన చికిత్స కోసం అతణ్ని అత్యవసరంగా జైలు బయట ఉన్న పెద్ద ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఏర్పడింది . అధికారులు ఏ చర్యా తీసుకోలేదు. అదే సమయంలో డబ్బున్న లంచం ఇవ్వగల ఖైదీలను బయట ఆసుపత్రులకు పంపించడం మరింత కలచివేసింది. మూడు రోజులు బాధతో కొట్టుమిట్టాడిన ఆ ఖైదీ చివరికి జైలు ఆసుపత్రిలోనే చనిపోయాడు. ఆ మరణాన్ని కప్పిపుచ్చడాని కన్నట్టుగా తెల్లవారు జామున అతని మృతదేహాన్ని బయట ఆసుపత్రికి తీసుకెళ్లారు. దారిలో చనిపోయాడనే అభిప్రాయం కలిగేలా చేశారు.నేను,ఏం జరిగిందో తెలుసుకుని, ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించాను. ఖైదీ మరణానికి వైద్యుణ్నీ, సూపరింటెండెంట్‌నీ బాధ్యులను చేయాలని కోరుతూ. మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశాను. అయితే, నేను ఎవరిపై ఫిర్యాదు చేశానో, వారి ఆధీనంలోనే నేను నిర్బంధంలో ఉండటం వల్ల ఆ ఫిర్యాదును ముందుకు తీసుకెళ్లడం కష్టమైంది. సమాచార హక్కు చట్టం కింద అడిగినా పత్రాలు ఇవ్వలేదు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ తేదీలను ఉద్దేశపూర్వకంగా నా నుంచి దాచారు. సాక్షులైన తోటి ఖైదీలపై రకరకాల ఒత్తిళ్లు తెచ్చారు. దాంతో కమిషన్ ముందు ఫిర్యాదును సమర్థంగా కొనసాగించలేకపోయాను.

అదే విధంగా, ఎల్గార్–భీమా కోరేగావ్ కేసులో నా సహనిందితుడు, మానవ హక్కుల పరిరక్షకుడు ఫాదర్ స్టాన్ స్వామి నిర్బంధంలో మరణించడం కూడా వ్యవస్థాగత హత్యే. జైలులో కలిసినప్పుడల్లా ఆయన చెయ్యెత్తి, పిడికిలి బిగించి, వణికే గొంతుతో ‘లడేంగే, జీతేంగే’ అనేవారు. ‘పోరాడతాం, గెలుస్తాం’ అని దాని అర్థం. ఈ వ్యవస్థాగత హత్యకు నిరసనగా ఎల్గార్ కేసు ఖైదీలమైన మేము ఒకరోజు నిరాహార దీక్ష చేశాం. ఆయన మరణానికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశాం. దానివల్ల చెప్పుకోదగ్గ ఫలితమేమీ రాలేదు. ఖైదీలతో మానవీయంగా వ్యవహరిస్తే, జైలు జీవితం ఒక శిక్ష అన్న సంగతి ఖైదీలకు అర్థం కాదని చెప్పుకుంటూ, జైలు యంత్రాంగం, తన క్రూరత్వాన్ని సమర్థించు కుంటుంది. తమ శాఖ అధికారిక పేరు ‘మహారాష్ట్ర కారాగారాలు, సంస్కరణ సేవల శాఖ’ అనీ, దాని నినాదం ‘సంస్కరణలు పునరావాసం’ అనీ అధికారులు కావాలనే మరచిపోతారు. క్రమశిక్షణ అంతర్గత భద్రత పేరుతో ఇష్టానుసారంగా, క్రూరంగా వ్యవహరిస్తారు.

ఉదాహరణకు, తలోజా కేంద్ర కారాగారంలో, ఓ రోజు అర్ధరాత్రి అగరుబత్తీ అట్టపెట్టెలతో తయారు చేసిన పేకముక్కలతో కొందరు ఖైదీలు ఆడుతుండగా ఒక అధికారి చూశాడు. మరుసటి ఉదయం వాళ్లను కర్రతో తీవ్రంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఒక ఖైదీ రెండు రోజుల తర్వాత చనిపోయాడు. అతడు కాలు జారి పడి చనిపోయాడని శవపరీక్ష నివేదికలో రాశారు. నా దృష్టిలో హత్య అయిన ఆ ఘటనను కప్పిపుచ్చడానికి ఆ సాకు జైలు యంత్రాంగానికి ఉపయోగపడింది. ఇలాంటి కప్పిపుచ్చివేతల వల్ల, బాధ్యులైన అధికారుల్లో పశ్చాత్తాపం కలగడం అరుదు. అవి వారిని మరింత క్రూరులుగా, జంకులేనివారిగా మారుస్తాయి.

బైకుల్లా మహిళా కారాగారంలో క్రూరమైన దాడి తర్వాత ఒక మహిళా ఖైదీ చనిపోవడంతో ఒక అధికారినీ, పలువురు కానిస్టేబుళ్లనూ జైలుకు పంపారు. అది అరుదైన ఘటన. నిర్బంధ మరణాలను తరచుగా కప్పిపుచ్చుతుండటంతో, జైలు సిబ్బంది ఖైదీలను కొట్టడం సర్వసాధారణ మయ్యింది.జైలు జీవితం, ప్రతి క్షణమూ ఆశకూ, నిరాశకూ మధ్య సంఘర్షణతో నిండి ఉంటుంది. రోజుకో కొత్త చిక్కు ఎదురవుతుంది. ఆ పరిమిత ప్రపంచంలో చిన్న చిన్న విషయాల కోసం కూడా పోరాడాలి.

“ది షాషాంక్ రిడెంప్షన్”లో ఆండీ డుఫ్రేన్ పుస్తకాలు కావాలని జైలు అధికారులను అడుగుతాడు. వారి నుంచి సహాయం అందదు. ప్రభుత్వానికి ఉత్తరాలు, దరఖాస్తులు రాస్తూ ఆరేళ్లు పట్టువదలకుండా ప్రయత్నిస్తాడు. చివరకు కొద్దిపాటి నిధులు, కొన్ని పాత పుస్తకాలు వస్తాయి.

2013 నుంచి 2017 వరకు నేను మొదటిసారి జైలులో ఉన్నప్పుడు, నాకు కావాల్సిన పుస్తకాలను నా సొంత ఖర్చుతో తెప్పించుకోవడానికి కూడా సూపరింటెండెంట్ అనుమతించలేదు. అనుమతి కోసం ముంబయి సెషన్స్ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. గ్రంథాలయంలో ఇప్పటికే సరిపడా పుస్తకాలు ఉన్నాయంటూ, జైలు అధికారులు నా దరఖాస్తును వ్యతిరేకించారు. వారు సమర్పించిన జాబితాను పరిశీలించిన న్యాయమూర్తి ఆ పుస్తకాలు ఏమాత్రం సరిపోవని గుర్తించి నా అభ్యర్థనకు అనుమతిచ్చారు.

ఆ ఉత్తర్వు ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ బి. హెచ్.లోయా.రాజకీయంగా సున్నితమైన సోహ్రాబుద్దీన్ షేక్ కేసును విచారిస్తున్న సమయంలో, 2014లో ఆయన మరణించారు. ఆ మరణంపై బహిరంగ వివాదం తలెత్తింది. విచారణ జరిపించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. అంత వివేకంతో, హేతుబద్ధంగా వ్యవహరించే న్యాయమూర్తి తారసపడే అదృష్టం ఎప్పుడూ ఉండదు. ఇంత సుదీర్ఘ పోరాటం తర్వాత కూడా ఒకసారి జైలర్ ఒక పుస్తకాన్ని గేటు దగ్గరే ఆపి స్వాధీనం చేసుకున్నాడు. దాని శీర్షికలో ‘బానిసత్వం’, ‘తిరుగుబాటు’ వంటి పదాలుండటమే కారణం. ఊపిరాడనివ్వని ఈ వింత వాస్తవంలో పుస్తకాలు అందుబాటులో లేకపోవడం కూడా ఒకరకమైన హక్కుల హరణమే… కొన్నిసార్లు ఆండీలాగే ఒంటరిగా, మరికొన్నిసార్లు అందరితో కలిసి దాన్ని ఎదిరించాల్సి వస్తుంది.

‘బ్రూక్స్ ఇక్కడ ఉన్నాడు’
సినిమా ముగిసిన చాలాసేపటి తర్వాత కూడా వృద్ధ ఖైదీ బ్రూక్స్ హాట్లెన్ మన మనసులో నిలిచిపోతాడు. అతనంటే తోటి ఖైదీలకు గౌరవం. షాషాంక్ జైలు గ్రంథాలయాన్ని బ్రూక్స్ ఎంతో శ్రద్ధగా, అంకితభావంతో నిర్వహిస్తాడు. క్రమంగా అదే అతని సర్వస్వం అవుతుంది. జైలులో తాను పెంచుకునే జేక్ అనే కాకితో అతనికి గాఢమైన అనుబంధం ఉంది. బయట ఒక జంతువునో పక్షినో తోడుగా పెంచుకోవడం మామూలు విషయంగా అనిపించవచ్చు. జైలులో దానికి పూర్తిగా వేరే అర్థం ఉంటుంది. తమ కోసం ఎదురుచూసే బంధువులు స్నేహితులు ఆత్మీయులు బయట ఎవరూ లేని ఖైదీలకు, ఒక జంతువో పక్షో ఏకాంతంలో తోడవుతుంది. దానితో మాట్లాడుకోవచ్చు. ఒంటరితనాన్ని కొంత దూరం పెట్టవచ్చు.

దాదాపు అర్ధ శతాబ్దం జైలులో గడిపిన బ్రూక్స్‌కు పెరోల్ మంజూరవుతుంది. విడుదల కాబోతున్నాననే ఆలోచన అతణ్ని తీవ్రంగా కలవరపెడుతుంది. జైలు తనకు ఎంతగా శాశ్వత ఆశ్రయంగా, సొంతింటిగా మారిందో అప్పుడే అతనికి అర్థమవుతుంది. బయటి ప్రపంచం అతనికి పూర్తిగా పరాయిదైపోయింది. దిక్కుతోచక, మరో ఖైదీ మెడకు కత్తి గురిపెడతాడు. ఏదైనా నేరం చేస్తే మళ్లీ శిక్ష పడుతుందనీ, జైలులోనే ఉండవచ్చనీ అతని ఆశ. తోటి ఖైదీలు అతనికి నచ్చజెప్పి ఆ ప్రయత్నాన్ని విరమింపజేస్తారు. మరుసటి రోజు నిస్సహాయంగా, వెళ్లడానికి మనసొప్పకపోయినా, తన సామానంతా ఒకే బ్రీఫ్‌కేసులో పెట్టుకుని బ్రూక్స్ జైలు నుంచి బయటకు నడుస్తాడు.
బ్రూక్స్ విడుదలయ్యేనాటికి బయటి ప్రపంచం అతనితో సంబంధం లేకుండానే ఎంతో ముందుకు వెళ్లిపోయింది. అతడు ఒక డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో శ్రద్ధగా పనిచేస్తాడు. కానీ, సాయంత్రాలూ రాత్రులూ అతనికి భరించలేనివిగామారతాయితాను, ఆకాశంలోకి విడిచిపెట్టిన జేక్ కాకి ఎలాగైనా తిరిగొస్తుందేమోనని ఎదురుచూస్తాడు. పక్షుల గుంపుల్లో దాని కోసం వెతుకుతాడు. అది కనిపించదు.ఒకప్పుడు అతడు భవిష్యత్తుపై పెంచుకున్న ఆశ క్రమంగా మాయమవుతుంది. దాన్ని తిరిగి రగిలించేవారెవరూ అతని చుట్టూ లేరు. ఒంటరితనం, దిక్కుతోచని స్థితి అతణ్ని చుట్టుముడతాయి. బతకడానికి ఇక ఏమీ మిగల్లేదనిపించి, చివరకు బ్రూక్స్ తన ప్రాణం తానే తీసుకుంటాడు. అంతకు ముందు ఒక చెక్క దూలంపై ‘బ్రూక్స్ ఇక్కడ ఉన్నాడు’ అని చెక్కుతాడు.

బ్రూక్స్ మరణానికి బాధ్యులెవరు? బాధ్యత ఎవరిదో తేల్చాలంటే, అది అమానుష అధికార నిర్మాణానిదీ, స్వార్థం వ్యక్తివాదం ప్రబలిపోయిన పెట్టుబడిదారీ సమాజ వ్యవస్థదీ. ఆ వ్యవస్థ మనుషులను సంపూర్ణ వ్యక్తులుగా చూడదు. భావోద్వేగాలూ, అంతరంగ జీవితమూ లేని మరమనుషుల్లా చూస్తుంది. మనిషి సమగ్ర వికాసం, జీవశక్తి, భావోద్వేగ క్షేమం దానికి పట్టవు. తాను నడవడానికి బ్రూక్స్ లాంటి వాళ్ల శ్రమ మాత్రమే దానికి కావాలి. ఈ యాంత్రిక ప్రపంచంలో బ్రూక్స్ భావోద్వేగాలకు చోటు దొరకదు. అతనికి మానవీయమైన అండనిచ్చే వాతావరణాన్ని కల్పించలేక పోవడం ఆ అధికార నిర్మాణ వైఫల్యం.వ్యక్తి గతమైనదీ రాజకీయమే.

జైలులో ఉన్నప్పుడూ, విడుదలైన తర్వాతా ఎదురయ్యే ఇంత బహిరంగమైన వ్యవస్థాగత హింస, మానవ గౌరవాన్ని హరించే తీరు మనల్ని నిస్సహాయులుగా చేస్తాయి. మాలాంటి రాజకీయ ఖైదీలు మాత్రం, రాజకీయ ఆలోచన పట్ల ఉన్న నిబద్ధతతో, ఈ నిస్సహాయతను అధిగమించడం అలవర్చుకున్నాం. సినిమాలో అలాంటి రాజకీయ నిబద్ధతకు ఉదాహరణ కనిపించదు. అయినా ‘వ్యక్తిగతమైనదీ రాజకీయమే’ అనే నినాదాన్ని నమ్మే నాకు, అందులోని ఎన్నో దృశ్యాలు, సంభాషణలు పూర్తిగా రాజకీయమైనవిగా అనిపించాయి.

ఒక అద్భుతమైన దృశ్యంలో కథానాయకుడు ఆండీని జైలు అధికారి కార్యాలయంలో పని చేయడానికి పంపిస్తారు. జైలు అధిపతి గదితో సహా కార్యాలయమంతా ఖాళీగా ఉందని గమనించగానే ఆండీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు. తనకు పని అప్పగించిన అధికారిని బాత్‌రూమ్‌లో బంధించి, రికార్డు ప్లేయర్‌పై మొజార్ట్ సంగీతపు రికార్డును పెడతాడు.

ఆ అధికారి బెదిరింపులను పట్టించుకోకుండా, ఆండీ శబ్దం పెంచుతాడు. మొజార్ట్ స్వరపరిచిన లె నొత్సె ది ఫిగారోలోని ‘సుల్‌ఆరియా’ అనే చిన్న యుగళగీతాన్ని జైలు లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రసారం చేస్తాడు. అప్పటిదాకా ఖైదీలను క్రమశిక్షణలో ఉంచడానికి, అదుపు చేయడానికి జారీ చేసే ఆదేశాలు మాత్రమే వాటిలో వినిపించేవి.
జైలు అంతటా ఖైదీలు చేస్తున్న పనిని ఆపి, సంగీతం వినిపిస్తున్న వైపు తిరుగుతారు. ఒక్క క్షణం
ఆ సంగీత సౌందర్యం వారి కఠినమైన దినచర్యకు విరామమిస్తుంది. ఆండీ జైలు అధిపతి కుర్చీలో కూర్చుని, బల్లపై కాళ్లు పెట్టుకుని, నిర్భయంగా సంగీతం వింటాడు. తాళం వేసిన తలుపు బయట అధికారులు గుమికూడతారు. అంత అందమైన క్షణాన్ని ఆస్వాదించినందుకు ఎంతటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో ఆండీకి బాగా తెలుసు. అయినా తన కోసమూ, తోటి ఖైదీలందరి కోసమూ అతడు ఆ పని చేస్తాడు. గాజు తలుపు అవతల భయపెట్టేలా నిలబడ్డ సూపరింటెండెంట్‌ను చూస్తూ, తన చిరునవ్వుతో అతని బెదిరింపును తోసిపుచ్చుతాడు.
సాంస్కృతిక కార్యకర్తగా, రాజకీయ ఖైదీగా ఆ దృశ్యం నన్ను అబ్బురపరిచింది. ఆ చూపులో ఆశాభావం, తిరుగుబాటు, సృజనాత్మక ఆనందం, దాన్ని సృష్టించిన క్షణంలోని సంతోషం, తోటి ఖైదీలతో కలిసిపోయిన అనుభూతి అద్భుతంగా మిళితమయ్యాయి. అదే సినిమా సారం. జీవిత సారం కూడా. మనుషులు అలా ఒక్కటైన క్షణాలే ఎంతటి బలమైన పాలనా వ్యవస్థలనైనా కూల్చి వేశాయి. గత కొద్ది రోజులుగా ఆ అనుభూతి భారతదేశపు విప్లవ నేలలో సహజంగా ఇంకిపోవడాన్ని చూస్తున్నాను.

‘పునరావాసమా? అదొక పనికిమాలిన మాట’:
సినిమా చివర్లో, దర్శకుడు ఫ్రాంక్ డారబాంట్ మరో బలమైన దృశ్యాన్ని చూపిస్తాడు. ‘రెడ్’గా పిలిచే ఎలిస్ బాయ్డ్ రెడ్డింగ్, నాలుగు దశాబ్దాల జైలు జీవితంలో ఎన్నడూ చూపని ధిక్కారంతో పెరోల్ మండలి ఎదుట హాజరవుతాడు.

ఏళ్ల తరబడి రెడ్ ఆ మండలి ఎదుట పలుమార్లు హాజరయ్యాడు. ప్రతిసారీ వాళ్లు తన నుంచి ఆశించిన జవాబులే ఇచ్చాడు. అయినా, అతని విడుదల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతూనే వచ్చాయి. ఈసారి మాత్రం, పశ్చాత్తాపం వ్యక్తం చేయడానికి అతడు సిద్ధంగా లేడు. సుదీర్ఘ అనుభవం తీర్చిదిద్దిన మనిషిగా, స్పష్టమైన చూపుతో, దృఢంగా, ధిక్కారంతో మండలి ఎదుట నిలుస్తాడు.

తనకు పునరావాసం లభించిందని భావిస్తున్నాడా? అని అడిగినప్పుడు, ‘పునరావాసమా? అదొక పనికిమాలిన మాట’ అంటాడు రెడ్. అది రాజకీయ నాయకులు కనిపెట్టిన పదమంటాడు. ప్రశ్న అడుగుతున్న అతనిలాంటి యువకులు, సూటూ టై వేసుకుని ఉద్యోగాలు నిలబెట్టు కోవడానికి పనికొచ్చే పదమని అంటాడు. రెడ్ కోపం గాఢమైన మానసిక సంఘర్షణలోంచి పుట్టుకొస్తుంది. దాదాపు ప్రతి ఖైదీ ఏదో ఒక రూపంలో ఎదుర్కొనే సంఘర్షణ అది.

బయటి నుంచి చూస్తే ‘ఖైదీలు’ అందరూ ఒకే తరహా సమూహంలా కనిపిస్తారు. వాస్తవానికి వర్గం, కులం, మతం, లింగం, ప్రాంతం, భాష అనే గోడలు వారిని వేరు చేస్తాయి. ఈ దేశంలోని ప్రతి ఖైదీ చివరకు బ్రాహ్మణీయ, పెట్టుబడిదారీ, పితృస్వామిక సమాజంలో భాగమే. వారిపై మోపిన నేరారోపణలు కూడా వారిని వేరు చేస్తాయి.అయినా, అందరూ ఒకే కప్పు కింద ఉంటారు. చాలామందిపై నిరాధారమైన ఆరోపణలు ఉంటాయి. అయినప్పటికీ వారిని కేసుల్లో ఇరికిస్తారు. తరచూ వారు నేర ప్రపంచంలోకి కూడా లాగబడతారు. చాలామందికి బయట నుంచి సాయపడేవారు ఎవరూ ఉండరు. న్యాయ ప్రక్రియలోనూ ఆశాజనకంగా ఏమీ మిగలకపోవచ్చు. కాని, ఆశ అనే సన్నని దారాన్ని పట్టుకుని, శిక్షించే ఆ విస్తారమైన కారాగార వ్యవస్థలో బతుకుతూనే ఉంటారు. రోజువారీ పోరాటం, నిరాశకు పూర్తిగా లొంగిపోకపోవడం వారిని కలుపుతాయి. జైలులో ధైర్యాన్నీ, జీవశక్తినీ నిలబెట్టుకుని బతుకుతున్న అసంఖ్యాకుల నుంచి నా పోరాటానికి బలం పొందాను.

మండలి ఎదుట ధిక్కారంగా మాట్లాడినప్పటికీ, రెడ్‌కు మిగిలిన శిక్షను మాఫీ చేస్తారు. నలభై ఏళ్ల జైలు జీవితం తర్వాత, అతని బయటి బతుకూ బ్రూక్స్ జీవితంలాగే ఊపిరాడకుండా, యాంత్రికంగా మారుతుంది. మరో మరమనిషి బ్రూక్స్ ప్రాణం తీసుకున్న గదినే రెడ్‌కు కేటాయిస్తారు. బ్రూక్స్‌కు ముందూ అదే గదిలో చాలామంది మెడకు ఉరి బిగించుకుని ఉండవచ్చు. ఇప్పుడు రెడ్ కూడా అదే స్థితి వైపు సాగుతున్నాడు. సరిగ్గా అప్పుడు ఆండీ ఉత్తరం అతనికి చేరుతుంది.

‘గుర్తుంచుకో రెడ్, ఆశ మంచిది. బహుశా అన్నిటికన్నా మంచిది. మంచి అన్నది ఎన్నటికీ చనిపోదు.’
ఆ మాటలను అక్షరాలా స్వీకరించి, ఆండీ చూపిన దిశలో రెడ్ నడవడం మొదలుపెడతాడు. చివరకు ప్రశాంతమైన సముద్రతీరానికి చేరుకుంటాడు. అక్కడితో సినిమా ముగుస్తుంది.

జైళ్లు లేని చోట సినిమా తెరపై ముగుస్తుంది. దాని కథ మన మనసుల్లో కొనసాగుతుంది. ఆ విశాలమైన అంతులేని సముద్రతీరానికి చివరకు చేరుకున్న రెడ్, తాను ఎంతగానో కోరుకున్న ప్రశాంతతను పొందాడేమో కానీ. నా విడుదల అనుభవం మాత్రం “ది షాషాంక్ రిడెంప్షన్” చివరి క్షణాలకు చాలా భిన్నంగా ఉంది. జైలు నుంచి బయటకు నడిచినప్పుడూ, తర్వాతి రోజుల్లోనూ నాకు కలిగిన అనుభూతి వేరు. ఆ భారీ జైలు గేటు గడప దగ్గర నిలబడ్డప్పుడు సంతోషానికీ దుఃఖానికీ మధ్య చిక్కుకున్నాను. ఐదేళ్లకు పైగా జైలులో గడిపిన తర్వాత హర్షాలీతో ప్రశాంతంగా కొంత సమయం గడపగలను. నన్ను ఇంటికి తీసుకెళ్ల డానికి ఆమె జైలు గేటు దగ్గరకు రాబోతోంది. నా కుటుంబంలాంటి ఉద్యమ సహచరులు ఎందరినో మళ్లీ కలవబోతున్నాను.

అదే సమయంలో, మొదట్లో ఆ సంతోషంపై పలుచని నీడలా ఉన్న దుఃఖం క్రమంగా చిక్కబడుతోంది. చివరకు,ఆ సంతోషాన్ని దుఃఖం పూర్తిగా కమ్మేసేంతగా పెరిగి, నన్ను కలచివేసింది. ఎల్గార్–భీమా కోరేగావ్ కేసులో నా సహనిందితుడు, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌కు అప్పటికింకా బెయిల్ రాలేదు. మూడు దశాబ్దాల న్యాయవాద వృత్తిలో లెక్కలేనంతమంది ఖైదీలకు ఉచితంగా న్యాయసహాయం అందించిన గాడ్లింగ్, తానే తలోజా కేంద్ర కారాగారంలో కటకటాల వెనుక ఉండిపోయారు.

సినిమాలోని తిరుగుబాటు నాయకుడు ఆండీ, జైలులోని చీకటి మూలల్లోనూ ఆశను సజీవంగా ఉంచుతాడు. ఉద్యమంలో నాకు అలాంటి ఆండీలు ఎంతోమంది తారసపడ్డారు. ఇతరుల్లో ధైర్యాన్ని రగిలించి, ఈ క్రూర పాలనను ధిక్కరించి నిలబడేవారు వాళ్లు. కులం, వర్గం, పితృస్వామ్య నిర్మూలన కోసం సాగే విప్లవోద్యమంలో, శత్రువుతో పోరాడిన అమరుల్లో, అత్యంత భయానక పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని వదలని వారిలో ఆ స్ఫూర్తిని గుర్తిస్తాను. పేరున్న, పేరు తెలియని ప్రతి స్వేచ్ఛా యోధుడిలోనూ నాకు ధైర్యం, తిరుగుబాటు రెండూ కనిపిస్తాయి.
జైలు బయట నాకోసం ఎదురుచూస్తున్న ఎన్నో వైరుధ్యాలనూ, పోరాటాలనూ ఎదుర్కోవడానికి, సినిమాలో కనిపించిన ఆశే నాకు కావాల్సి వచ్చింది. ఆశకూ, నిరాశకూ మధ్య భావోద్వేగాలతో సతమతమవుతున్న
ఆ సమయంలోనూ, నన్ను ఆహ్వానించడానికి జైలు గేటు దగ్గరకు వచ్చిన వారందరిలో రేపటి ఆశావహ ఉద్యమానికి తొలిచిగుళ్లు కనిపించాయి. మా బృందం ఆ భారీ జైలు గోడలనూ, ఆ ఎర్ర గేటునూ దాటి నన్ను స్వేచ్ఛ వైపు తీసుకెళ్తోంది. నా మనసు మాత్రం ఒక వింత అలజడిలో, జైలు లోపలి ప్రపంచానికీ బయటి ప్రపంచానికీ మధ్య ఊగిసలాడుతూనే ఉంది. ఐదున్నరేళ్లపాటు ప్రతి సాయంత్రం ఆరు గంటలు దాటగానే నన్ను తాళం వేసి నిర్బంధించేవారు. ఆ రోజు నేను స్వేచ్ఛగా ఉన్నాను. నా వాళ్ల మధ్య ఉన్నాను.

నేను విడుదలైన రోజు జైలు గోడల వెనుక మెల్లగా నా చూపు నుంచి కనుమరుగైన న్యాయవాది గాడ్లింగ్ కూడా ఏదో ఒకరోజు తప్పకుండా విడుదలవుతారు. దెబ్బతిని చెల్లాచెదురైన మన ఉద్యమపు బూడిద నుంచి మన ఫీనిక్స్ పక్షి మళ్లీ లేచి ఎగురుతుంది. ఆశనూ, తిరుగుబాటునూ తోడుగా చేసుకుంటే, ఏదో ఒకరోజు ఒకరిద్దరు ఖైదీల నుంచి యావత్ దేశం దాకా, చివరికి ప్రపంచాన్నే ఈ ఫాసిజపు చెర నుంచి విముక్తం చేయగలమని అది మనకు చెబుతుంది.

అక్టోబర్ 2, 2026

రమేశ్ మురళీధర్ గైచోర్ భారతీయ కులవ్యతిరేక కార్యకర్త, ప్రదర్శన కళాకారుడు, కబీర్ కళా మంచ్ సాంస్కృతిక బృంద సభ్యుడు.

హర్షాలీ పోత్దార్ భారతీయ కులవ్యతిరేక కార్యకర్త. రచయిత్రి,అనువాదకురాలు, ప్రముఖ ఉద్యమ నిర్వాహకురాలు.

Leave a Reply