భారతదేశ ఎన్నికల నిర్వహణ విమర్శలకు గురవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధానంగా నాలుగు రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ కులం, మతం, డబ్బు, ప్రాంతం — ఈ నాలుగు అంశాల చుట్టూనే రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేయవచ్చనే నమ్మకంతో ముందుకు సాగడం పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రి నుంచి వార్డు సభ్యుడి వరకు అవినీతి ద్వారా ఆర్థిక హోదాను సంపాదించుకోవచ్చనే భావన బలపడుతోంది. రాజకీయాలంటే ప్రజల సమస్యలను పరిష్కరించడం కావాలి. కానీ, ఆ లక్ష్యానికి బదులుగా వ్యక్తిగత సంపదను పెంచుకోవడమే రాజకీయాల ప్రధాన లక్ష్యంగా మారుతోంది.
దేశవ్యాప్తంగా రెండు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య పోటీ కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా తమదైన రాజకీయ ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. ఇక్కడి రాజకీయాల్లో కుల సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొన్ని ఆధిపత్య కులాల చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమవుతున్నాయి. వాటి ప్రభావానికి లోనవుతున్న ఎస్సీ, బీసీ వర్గాల ప్రయోజనాలు, ఆకాంక్షలు కూడా ఈ రాజకీయ సమీకరణల్లో భాగమవుతున్నాయి.
తాజాగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక ప్రజాస్వామ్య భావన వెనుకబడిపోతోంది. రెండు శత్రు శిబిరాల మధ్య ఘర్షణే ప్రధానంగా కనిపిస్తోంది. అధికార పార్టీ తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి భాగస్వామ్య పార్టీల అభ్యర్థులను సైతం బెదిరించడమే కాకుండా, ప్రత్యర్థి అభ్యర్థులపై భౌతిక దాడులకు పాల్పడుతుంది.
దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల పనితీరుపై చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా వ్యవహరించిందని విమర్శించినప్పుడు, ఇప్పుడు మా వంతు వచ్చిందనే సమాధానం సిద్ధంగా ఉంటుంది. రాజకీయ పార్టీలన్నీ అధికారమే పరమావధిగా భావించినప్పుడు ప్రజాస్వామ్య విలువలకు చోటెక్కడ ఉంటుంది?
ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్లు, పంచాయతీలకు సంబంధించిన స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రజల ముందుకు వచ్చింది. తమ ప్రాంత సమస్యలపై అవగాహన ఉన్న ప్రజలు తమకు తెలిసిన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, ప్రతిపక్షాలకు నామినేషన్లు వేయడానికి కూడా అవకాశం లేకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ ప్రజాస్వామ్యంలో అత్యంత సహజమైన హక్కు. అధికార పార్టీ తన బలాన్ని ఉపయోగించి నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు వేసిన తర్వాత పరిశీలన దశలో వాటిని తిరస్కరించడం వంటి పరిణామాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలను పరిశీలించాలి. మొదటిది, రాష్ట్ర ఎన్నికల సంఘం తన అధికారాలను స్వతంత్రంగా వినియోగించాలి. అధికార యంత్రాంగంపై తనకున్న పరిధిలోని అధికారాన్ని ఉపయోగించి, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పక్షపాతానికి తావివ్వకూడదు. కానీ, ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వచ్చినప్పుడు, దాని స్వయం ప్రతిపత్తిపై ప్రశ్నలు తలెత్తుతాయి. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల సంస్థ అధికార పార్టీ జేబు సంస్థగా మారిందనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడితే, అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.
రెండవది, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సిన పోలీసు వ్యవస్థ పాత్ర. ప్రజల భద్రతను కాపాడుతూ, అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లోనైతే ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుంది. ఇటీవల కాలంలో ఎన్నికల కమిషనర్ల పనితీరుపై కేవలం విమర్శలే కాకుండా, వారి నిష్పక్షపాత వైఖరిని ప్రశ్నించే ఆరోపణలు కూడా పెరిగాయి. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై వస్తున్న విమర్శలను పరిశీలించినప్పుడు, ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత గురించి ఆందోళన చెందాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం, అధికార పక్షం — ఈ మూడు వ్యవస్థల మధ్య ఏర్పడుతున్న అనుబంధం స్థానిక ఎన్నికల వేళ బహిర్గతమవుతోంది. ఈ కలయిక అధికార పక్షాన్ని గెలిపించేందుకు ప్రయత్నిస్తోందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడితే, ఎన్నికల ఫలితాలపై కూడా అనుమానాలు తలెత్తుతాయి.
గతంలో జగన్ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించలేదా అనే ప్రశ్నతో ప్రస్తుత పరిస్థితిని సమర్థించలేం. గతంలో ఎవరు తప్పు చేసినా, ఇప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా, ఎన్నికల వ్యవస్థ నిజాయితీగానే పనిచేయాలి. ప్రజాస్వామ్య సంస్థల బలిమి, వాటి నిష్పక్షపాత వైఖరిపైనే ఆధారపడి ఉంటుంది. ఎన్నికల వ్యవస్థను అంచనా వేయాల్సింది ఎవరు అధికారంలో ఉన్నారనే కోణంలో కాదు; ప్రజాస్వామ్య విలువలను ఎంతవరకు కాపాడుతున్నారనే కోణంలో.
భవిష్యత్ తరాలను, ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, ఇది నిజంగా ప్రజాస్వామ్య దేశమేనా అనే అనుమానం కలుగుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలోని అన్ని సంస్థలు తమ నైతిక బాధ్యతలను విస్మరించినప్పుడు, న్యాయస్థానాల వైపు చూడటం సహజం.
అయితే, న్యాయస్థానాల తీర్పులను స్వాగతించి, తమ పనితీరును మెరుగుపరుచుకోవాల్సిన ఎన్నికల వ్యవస్థ, అదే తప్పులను పదేపదే పునరావృతం చేస్తే ఎలా? ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించే చర్యలపై న్యాయస్థానాలు స్పందించినప్పటికీ, వ్యవస్థల పనితీరులో మార్పు రాకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుంది. తమ ముందే జరుగుతున్న రాజకీయ అరాచకాలను చూస్తూ మౌనంగా భరించాల్సిన పరిస్థితిలోకి సగటు పౌరులు నెట్టబడుతున్నారు.
అధికారులు, రాజ్య యంత్రాంగ వ్యవస్థలు రెండూ ధనస్వామ్య ప్రభావంలో ఉన్నాయి. ప్రజలు కేవలం నిమిత్తమాత్రులుగా మిగిలిపోవడమే కాదు, ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కూడా కోల్పోతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. చివరకు ఓటు వేసే అవకాశం లేకుండానే అధికారాన్ని సుస్థిరం చేసుకునే రోజులు వస్తే, అది ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం. ఇది ప్రజాస్వామ్య తీరు కాదు. వందల కోట్ల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించాల్సిన ప్రజాస్వామ్యం, దేశస్థాయి నుంచి ఒక గ్రామంలోని వార్డు స్థాయి వరకు ప్రజల అసంతృప్తికి కారణమవుతోంది.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణపై మరోసారి చర్చ మొదలైంది. ఎన్నికల నిర్వహణలో అవకతవకలపై వస్తున్న ఆరోపణలు మళ్లీ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుకు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణకు మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీల సంఘటిత నిరసన, ఢిల్లీలో జరుగుతున్న పోరాటానికి సంఘీభావంగా కనిపిస్తోంది.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా, అధికార పార్టీ గెలుపునకు ఎన్నికల వ్యవస్థ దోహదపడుతోందనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఏర్పడటం ఆందోళనకరం. ఎన్నికలు ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించాలి. కానీ, ఎన్నికల ప్రక్రియే అధికారాన్ని నిలబెట్టుకునే సాధనంగా మారితే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది?
ఇక్కడ ప్రధానమైన అంశం ఓటు దొంగతనం మాత్రమే కాదు. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లను తిరస్కరించడం, ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలను పరిమితం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య హక్కులను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన ప్రజలను రాజకీయ ప్రక్రియకు దూరం చేయడం, వారిని పౌరులుగా సమాన హక్కులకు నోచుకోని అంచులకు నెట్టడం అత్యంత ప్రమాదకరం.
ఎన్నికల ప్రక్రియను తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకునే సాధనంగా మార్చుకునే ప్రయత్నాలను ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఎన్నికల్లో గెలవడం ఒక్కటే ప్రజాస్వామ్యం కాదు. ప్రజలందరికీ సమాన రాజకీయ హక్కులు కల్పించడం, స్వేచ్ఛగా అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఇవ్వడం, స్వేచ్ఛగా ఓటు వేసే హక్కును రక్షించడం — ఇవే ప్రజాస్వామ్యానికి పునాదులు.
ఈ పునాదులనే బలహీనపరిస్తే, ఎన్నికలు జరిగినా ప్రజాస్వామ్యం మిగలదు. దేశంలోనైనా, రాష్ట్రంలోనైనా, ఒక చిన్న గ్రామంలోని వార్డులోనైనా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు జరిగే పోరాటం ప్రజలందరి బాధ్యత.
28/10/26.




