2026 సెప్టెంబర్ 7
‘‘గనులను లీజుకు ఇచ్చిన ప్రాంతంలో ఎలాంటి సహజ నీటి వనరులు లేవు అని చెట్ల లెక్కింపు నివేదికలో పేర్కొన్నారు…, మన వద్ద కేవలం 2933 చెట్లు మాత్రమే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది’’ అని సిజిమాలి కొండలలో మైనింగ్ వల్ల కలిగే పర్యావరణ ప్రభావాల గురించి ఒక డాక్యుమెంటరీ కోసం ప్రశ్నించినప్పుడు వేదాంత (బహుళజాతి మైనింగ్; లోహాల సంస్థ) అధికారి అన్నారు. ఈ ప్రకటనలోని అంతరార్థం ఏమిటంటే, ఆ ప్రాంతంలో అడవులు, నీటి వనరులు లేవు కాబట్టి, ఈ మైనింగ్ ప్రాజెక్ట్ ఆ ప్రాంతానికి ఎలాంటి పర్యావరణ ముప్పును కలిగించదు. బాక్సైట్ మైనింగ్ పట్ల ఉన్న ఇటువంటి వైఖరి 1980ల నుండి తూర్పు భారతదేశంలో కనిపిస్తున్న బాక్సైట్ కొండల తవ్వకాలకు సంబంధించిన ఘర్షణలు మరోసారి పునరావృతమవుతాయనే ఆందోళనలను రేకెత్తిస్తుంది.
2013 నుండి బాక్సైట్ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్న సమీపంలోని బాఫ్లిమాలి కొండలలో, మైనింగ్ కంపెనీ ఉత్కల్ అలుమినా ఇంటర్నేషనల్ లిమిటెడ్ (యుఎఐఎల్) అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని ‘టెర్రా నూలియస్’ [మనుషులు లేని ఖాళీ ప్రదేశం] గా— ‘‘కొన్ని రాగులు, గడ్డి మాత్రమే పెరిగే చిన్న లోయలతో కూడిన రాళ్ళ భూభాగం మాత్రమే అక్కడ ఉంది’’అని చెప్పారని స్థానిక ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.
బాక్సైట్ కొండల మైనింగ్ వివాదాస్పద చరిత్రలో, తూర్పు కనుమల వెంబడి గంధమర్ధన్, నియామ్‌గిరి, అరకు, జెర్రెలా వంటి ప్రాంతాలలో ఆ ప్రాంతపు ప్రత్యేక పర్యావరణ వ్యవస్థలను; ప్రజలను విస్మరించే బాక్సైట్ మైనింగ్ విధానాలు కొనసాగుతూనే ఉన్నాయి. వేదాంత సంస్థ చేస్తున్న బాక్సైట్ గని తవ్వకాల నుండి నియామ్‌గిరి కొండలను రక్షించడానికి 2013లో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం కూడా బాక్సైట్ నిల్వలున్న ఇతర కొండలకు రక్షణ కల్పించలేకపోయింది.
అటువంటి నిర్వచనాలు ఈ ప్రాజెక్ట్ ను ఎటువంటి ముప్పు లేనిదిగా, పర్యావరణ ఫలితాలను మెరుగుపరిచే సామర్థ్యం గలదిగా చూపించడానికి అనుమతిస్తాయి. అయితే, ఇటువంటి ప్రకటనలు అనేక లోపాలతోనూ, విస్మరించిన అంశాలపైనా ఆధారపడి ఉండడంతో బాధితులైన ఆదివాసీ, దళిత సముదాయాలు ఈ మైనింగ్ ప్రాజెక్ట్‌లను ప్రతిఘటించక తప్పడంలేదు. నేడు సిజిమాలిలో నెలకొన్న ఆందోళన కూడా ఈ పరిస్థితుల నుంచే పుట్టుకొచ్చింది.
1990లలో భారతదేశ మైనింగ్ రంగం ప్రైవేటీకరణ అయినప్పటి నుండి, అనేక దేశీయ అంతర్జాతీయ మైనింగ్ కంపెనీలు తూర్పు భారతదేశంలోని బాక్సైట్ కొండలలో ఉన్న భారీ నిల్వలను దక్కించుకోవడానికి ప్రయత్నించాయి. ఆదివాసీ ప్రాంతాలలోకి జరిగిన ఈ చొరబాట్ల ఫలితంగా దేశంలోనే అత్యంత ప్రసిద్ధ ప్రతిఘటనా ఉద్యమాలు తలెత్తాయి. ఈ ఉద్యమాలు కాశిపూర్ విషయంలో టాటా, నార్స్క్ హైడ్రో; జెర్రెలా విషయంలో అన్‌రాక్ అల్యూమినియం లిమిటెడ్; నియామ్‌గిరి కొండల విషయంలో వేదాంత రిసోర్సెస్ వంటి మైనింగ్ దిగ్గజాలను వెనక్కి తగ్గేలా చేశాయి. నియామ్‌గిరి కొండలను గనుల తవ్వకాన్నుంచి రక్షించాలనే గ్రామసభ నిర్ణయమే అంతిమమని సుప్రీంకోర్టు ఆదేశించింది. సిజిమాలి కొండలు ప్రస్తుతం ప్రతిపాదిత బాక్సైట్ మైనింగ్ జాబితాలో చివరివి. ఇవి ఆదివాసీ, దళితుల జీవితాలను, జీవనోపాధిని తలక్రిందులు చేసేలా ఉన్నాయి. అంతేకాకుండా, తమ సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక ఆచారాల ద్వారా ఈ పర్యావరణ వ్యవస్థలను కాపాడుకుంటూ వస్తున్న సముదాయాలను నిలబెట్టిన ప్రత్యేకమైన పర్యావరణాలను ఇవి ప్రమాదంలో పడేస్తున్నాయి.
బాక్సైట్ కొండల భూస్వరూప శాస్త్రం
అల్యూమినియం ఉత్పత్తికి ఉపయోగపడే అల్యూమినియం ఆక్సైడ్ ఉండే బాక్సైట్ ఖనిజం కోసం మైనింగ్ కంపెనీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అల్యూమినియం ఆక్సైడ్ అనేది కొన్ని కొండల శిఖరాలను ఏర్పరిచే శిలల్లో భాగం. చాలా కొండ పీఠభూములలో గడ్డి మైదానాలు ఉంటాయి; సిజిమాలి, కుట్రుమాలి, సాసుబోహుమాలి కొండల వంటి కొన్ని ప్రాంతాలలో అడవి భాగాలు కూడా ఉన్నాయి. భారీ వర్షాలకు దీర్ఘకాలంగా గురికావడం, నీటిలో ఖనిజాలు కరిగిపోవడం (లీచింగ్); ఖనిజాలు బాక్సైట్ ఖనిజంగా కేంద్రీకృతమవడంలాంటి కారణాల వల్ల ఈ కొండ శిఖరాలు చాలా ప్రత్యేకమైనవి. దీనివల్ల మైనింగ్ ప్రక్రియ సులభతరమవుతుంది; కొండలను లోతుగా తవ్వాల్సిన అవసరం ఉండదు.
అయితే, ఈ ఖనిజాన్ని మాత్రమే విడిగా చూడటం అంటే ఈ కొండలు, భూభాగాలతో ముడిపడి ఉన్న పెద్ద పర్యావరణ వ్యవస్థను, ఆదివాసీ సంస్కృతులను, జీవనోపాధులను విస్మరించడమే అవుతుంది. వేదాంత వంటి ప్రాజెక్ట్ నిర్వాహకులు సిజిమాలి కొండల దగ్గర జరుగుతున్న స్థానిక సముదాయాల ఆందోళనలను, పర్యావరణ పరిరక్షణను పట్టించుకోకుండా, గత బాక్సైట్ మైనింగ్ కు సంబంధించి సాంకేతికంగా నిర్వచించిన సరిహద్దులు, ఇంజనీరింగ్ పరిష్కారాలపైన పదే పదే అతిగా ఆధారపడుతున్నారు.
ఈ కొండల పైభాగంలో పైమట్టి, ఖనిజాలు కొట్టుకుపోవడం వల్ల సాధారణంగా ఇక్కడ దట్టమైన అడవులు కాకుండా, గణనీయమైన జీవవైవిధ్యం కలిగిన, ప్రత్యేకమైన గడ్డి మైదాన ప్రాంతాలు ఉండడం వల్ల పశువుల పెంపకం ద్వారా ఆ ప్రాంత నివాసుల జీవనోపాధికి మద్దతు ఇస్తున్నాయి. అలాగే దట్టమైన అడవులు ఉండే కొండ వాలులలో, అనేక రకాల చిన్నతరహా అటవీ ఉత్పత్తులను ఆదివాసీ సముదాయాలు సేకరిస్తాయి. వీటిలో టెండు (డియోస్పైరోస్లనోక్సిలాన్), చిరోంజి (బుచనేనియా లాంజన్) వంటి కాలానుగుణ పండ్లు; పరిశ్రమలలోను, ఆహారపు ఆకులు తయారు చేయడానికి ఉపయోగించే సాల్ (షోరే రోబస్టా) విత్తనాలు, ఆకులు; తాళ్లు, చీపుర్లు తయారు చేయడానికి; ఔషధ మూలికలను అందించడానికి ఉపయోగపడే అనేక రకాల గడ్డి మొక్కలు ఉన్నాయి. ఈ చదునైన కొండలు (టేబుల్‌టాప్) స్పాంజి లాగా పనిచేస్తూ, నీటిని పీల్చుకుని సంవత్సరం పొడవునా నెమ్మదిగా విడుదల చేస్తాయని జలవనరుల నిపుణులు పేర్కొన్నారు. ఈ విధంగా ఈ కొండలు ఆ ప్రాంతంలోని గ్రామాలన్నింటికీ స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి, సాగునీటికి, చేపలు పట్టడానికి ప్రాథమిక వనరులుగా ఉన్న చిన్న, పెద్ద జీవనదులకు (ప్రవాహాలకు) జీవనాధారంగా ఉంటున్నాయి. అయినప్పటికీ, ప్రాజెక్ట్ నిర్వాహకులు ఈ కీలకమైన సేవలకు ఎటువంటి విలువను ఇవ్వడం లేదు.
అందుకు విరుద్ధంగా, కొండ శిఖరాలపైన చెట్ల సాంద్రత లేకపోవడాన్ని మైనింగ్ ద్వారానూ; మైనింగ్ అనంతర పునరుద్ధరణ సందర్భంలోనూ ప్రత్యామ్నాయ అటవీ పెంపకం (కాంపెన్సేటరీ ఫారెస్ట్ ప్లాంటేషన్స్) ద్వారా పరిష్కరించదగిన ఒక తేలికపాటి సమస్యగా చూపిస్తారు. అదనంగా, కేవలం మైనింగ్ లీజు సరిహద్దులపైన మాత్రమే దృష్టి పెట్టడం వల్ల సంపద్వంత సాల్ అడవులు, సిజిమాలి కొండలతో సహా ఈ ప్రాంతంలో ఈ సముదాయాల జీవనాధారంగా ఉన్న విస్తృతమైన సాంప్రదాయ పోడు వ్యవసాయాన్ని కూడా విస్మరించే ప్రమాదం ఉంది.
ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక పర్యావరణ వ్యవస్థ
భారతదేశంలోని అత్యంత అణగారిన సముదాయాలైన స్వదేశీ ఆదివాసులకు చివరి ఆశ్రయాలలో కొన్నిటిగా ఈ బాక్సైట్ కొండలు ఉన్నాయి. ఉదాహరణకు, నియామ్గిరిలో కొండల్లో నివసించే డోంగ్రియా కొంద్ ప్రజలు కేవలం ఆ కొండపైనే నివసిస్తున్నారు. ఎక్కువగా కుటియా, దేశియా కొంద్, జోడియా, పెంగో వంటి ఇతర సముదాయాలతో పాటు దళిత సముదాయాలు కొండ కింది ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. గ్రామస్థులు ఎక్కువగా కొండల నుండి వచ్చే ప్రవాహాల ద్వారా మద్దతు పొందే కొండ శిఖరాలు, కొండ వాలులు, లోయ వ్యవసాయం, అలాగే అటవీ ఉత్పత్తుల సేకరణపైన ఆధారపడి జీవిస్తున్నారు.
రాయగడ నుండి కొరాపుట్ వెళ్లే రైలులో ప్రయాణిస్తే, కిలోమీటర్ల కొద్దీ విస్తరించి ఉన్న చదునైన శిఖరాలు కలిగిన అంతులేని కొండలను మనం చూడవచ్చు. ఈ కొండలు స్థానిక కొంద్, జోడియా, దళిత సముదాయాలకు ఒక పవిత్ర భూభాగాన్ని ఏర్పరుస్తాయి. ఈ కొండలలోని గుహలు, సొరంగాలు ప్రసిద్ధ వార్షిక సాంస్కృతిక ఉత్సవాలతో ముడిపడి ఉన్న ప్రముఖ పవిత్రమైన ధార్మిక ప్రదేశాలుగా ఉన్నాయి. ఇవి పొరుగు పట్టణాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ పవిత్ర భూభాగంలోనే బంధుత్వ బంధాలు ఇమిడి ఉన్నాయని జానపద కథలు చెబుతున్నాయి. ప్రతి కొండపై గ్రామాలలో లేదా కొండలలో నివసించే ఇతర దేవతలతో సంబంధం ఉన్న ఒక అధిష్టాన దేవత ఉంటుంది. శక్తివంతమైన దేవుడైన టిజి రాజా, సిజిమాలిని పాలిస్తూ తన ప్రజల మధ్య శాంతిని చేకూరుస్తాడు. ఆ దయగల ప్రభువు తన ప్రజల సంక్షేమానికి బాధ్యత వహిస్తాడు; బదులుగా పెద్దగా ఏమీ కోరడు. సిజిమాలి, నియామ్‌గిరి కొండలు ‘అసూయ సంబంధాలతో’ ముడిపడి ఉన్నాయి. నియామ రాజా రహస్యంగా ప్రేమించిన అతని మనోహరమైన భార్యను టిజి రాజా అపహరించాడని స్థానిక జానపద కవులు చెబుతారు. అప్పటి నుండి, వారు దైవిక సమావేశాలలో కలిసి కనిపించడం మానేసారు.
బాఫ్లిమాలి మాతృస్వామ్య దేవత అయిన బాఫ్లిబుధికి, కొడింగ రాజాకు (కొడింగమాలి కొండల రాజు) మధ్య వైవాహిక సంబంధాలు ఉన్నాయని మరొక కథనం సూచిస్తుంది. బాఫ్లిబుధి మైకంచ్ గ్రామ దేవత అయిన పత్రుబుధికి అత్తగారు కూడా అవుతారు. కాబట్టి ఈ కొండలు కేవలం జడ ఖనిజాల భౌగోళిక నిర్మాణాలు మాత్రమే కాకుండా, సామాజిక సంబంధాలతో జీవం పోసుకున్న సజీవ సాంస్కృతిక సంస్థలు. వారి దైనందిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవితం నుండి వార్షిక పూజల ద్వారా కొండలను ఆరాధించే అసాధారణ సంఘటనల వరకు, కొండలు తమను తాము ‘నేల పురుగులు’ గా భావించే కొంద్ గుర్తింపులో అంతర్భాగంగా ఉన్నాయి. ఈ కొండలు, గ్రామాల సంక్లిష్టమైన భౌగోళిక స్వరూపం ఆదివాసీ-దళితులకు ఒక పవిత్ర ప్రదేశం.
వనరుల కోసం జరిగిన పోరాటాల చరిత్ర
తమ కొండలను, గ్రామాలను రక్షించుకోవడానికి ఆదివాసీలు దశాబ్దాలుగా ఎంతో ధైర్యంగా పోరాడారు, తరచుగా క్రూరమైన హింసను ఎదుర్కొన్నారు. బాక్సైట్ పోరాటాలలో అత్యంత బాధాకరమైన పరిణామాలలో ఒకటి 2000 సంవత్సరంలో కాశీపూర్‌లోని మైకంచ్లో జరిగింది. అక్కడ ముగ్గురు ఆదివాసీ నిరసనకారులు పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. కాలక్రమేణా, రాష్ట్ర ప్రభుత్వానికి, మైనింగ్ కంపెనీకి మధ్య కుదిరిన కుమ్మక్కు 2013లో బాఫ్లిమాలి కొండలలో మైనింగ్ ప్రారంభం కాకుండా ఉన్న ప్రతిఘటనను అణచివేసింది. అప్పటి నుండి, ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేసే అనేక నాటకీయ మార్పులు సంభవించాయి. గాలిలో తీవ్రమైన కాలుష్యం పెరగడం వల్ల చర్మ, శ్వాసకోశ వ్యాధులు ప్రబలాయి. నీటి ప్రవాహాలు పారిశ్రామిక బురద (స్లర్రీ) మోసే మార్గాలుగా మారాయి;, ఫలితంగా అవి స్నానానికి లేదా బట్టలు ఉతకడానికి పనికిరాకుండా పోయాయి. ఎరుపు రంగు మట్టి వ్యర్థాలు (రెడ్ మడ్ వేస్ట్) పొంగిపోవడం సర్వసాధారణమైంది; వ్యవసాయ భూములపైన థర్మల్ విద్యుత్తు కేంద్రాల నుంచి వెలువడే బూడిద (ఫ్లై యాష్) పేరుకుపోవడం వల్ల పంటలు దెబ్బతిని భూములు నిస్సారంగా మారుతున్నాయి.
ఈ అన్ని సందర్భాలలోనూ నిరసనల కారణంగా ప్రతిపాదిత ప్రాజెక్ట్‌లు కనీసం ప్రస్తుతానికి రద్దు అవడం అనేది ఒడిశాలోని నియామ్‌గిరి, గంధమర్ధన్ కొండలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అరకు, జెర్రెలా కొండలు మెరుగైన చారిత్రక పాఠాలను అందిస్తాయి. గని తవ్వకాల వ్యతిరేక ఉద్యమం కంపెనీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి, 2013లో మైనింగ్ ప్రణాళికలకు అడ్డుకట్ట వేయడంతో నియామ్‌గిరి కొండలను రక్షించే ఉద్యమం అంతర్జాతీయంగా అత్యంత ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఇలాంటి ఉదాహరణే కనిపిస్తుంది; అక్కడ ప్రైవేట్ పెట్టుబడితో రిఫైనరీకి ఆర్థిక సహాయం చేయడంతో, ప్రభుత్వ రంగ మైనింగ్ కంపెనీ [జెర్రెలా కొండలలో] మైనింగ్‌ను ప్రతిపాదించింది. అన్‌రాక్ అల్యూమినియం సంస్థ అల్యూమినియం కాంప్లెక్స్, బాక్సైట్ గనులు రెండింటికి ఆర్థిక సహాయం అందిస్తే, ఆదివాసేతరుల భూ యాజమాన్యానికి సంబంధించిన రాజ్యాంగపరమైన నిషేధాన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వమే గనులను నిర్వహిస్తామని ముందుకు వచ్చింది. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ, సామాజిక ప్రభావాలను విస్మరించి అరకు, జెర్రెలా కొండల నుండి బాక్సైట్ వెలికితీతకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించింది. చివరికి, ఆదివాసీల తీవ్ర నిరసనల కారణంగా ఈ రెండు మైనింగ్ ప్రాజెక్ట్‌లను రద్దు చేయాల్సి వచ్చింది.
సిజిమాలి కొండలపైన ఆధారపడిన ఆదివాసీ-దళిత సముదాయాలకు వేదాంత మైనింగ్ ప్రాజెక్ట్ ముప్పు కలిగిస్తోందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మైనింగ్‌ను వేగవంతం చేసే ఈ పోటీలో, అంతిమంగా భారతదేశంలోని అత్యంత అణగారిన వర్గాలకు అండగా నిలిచిన; విస్తృతమైన పవిత్ర భూభాగాన్ని ఏర్పరచిన పర్యావరణ వ్యవస్థలు శాశ్వతంగా కనుమరుగవుతాయి.
గ్రామస్థులు బుల్డోజర్ చర్యలను ఎదుర్కొంటున్నారు; జర్నలిస్టులు, కార్యకర్తలు ఆ ప్రాంతానికి స్వేచ్ఛగా వెళ్లలేని ప్రస్తుత గోప్యతా స్థితి, అణచివేత వాతావరణం అత్యంత ఆందోళనకరంగా ఉన్నది. కొండ ప్రాంత ఆదివాసులకు వారి అగాథమైన జ్ఞాన వ్యవస్థలను, పర్యావరణ విజ్ఞానాన్ని, గొప్ప సంస్కృతిని గౌరవించే దీర్ఘకాలిక స్థిరత్వం, జీవనోపాధి మద్దతు అవసరం. దీనికి బదులుగా, ప్రైవేట్ మైనింగ్ ప్రయోజనాల కోసం ఈ సున్నితమైన వనరులను కూడా లాక్కోవడం అభివృద్ధికి పూర్తిగా విరుద్ధమైన అపహాస్యం.
అనువాదం : కె. పద్మ
—
మినాటి డాష్: ఓ.పి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో బోధిస్తున్నారు. ఆమె పీహెచ్డీ పరిశోధన దక్షిణ ఒడిశాలోని బాక్సైట్ మైనింగ్ సంఘర్షణలపైన సాగింది.
పాట్రిక్ ఆస్కార్సన్: స్వీడిష్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ పరిశోధకులు, ఉపాధ్యాయులు; ఆంధ్రప్రదేశ్‌లోని బాక్సైట్ మైనింగ్ సంఘర్షణలపై తన పీహెచ్డీ పూర్తి చేశారు.
https://india.mongabay.com/2026/09/bauxite-mining-transforms-living-hills-into-emptiness-commentary




