ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలోని  స్కూల్ అసిస్టెంట్ లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రత్యేక విద్యా అవసరాల అసిస్టెంట్ల ఖాళీలు 16347 పోస్టులు భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పోస్టులను ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్,  మున్సిపల్, గిరిజన, దివ్యాంగుల సంక్షేమ పాఠశాలల్లో నింపడాని కోసం ఆ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ పోస్టుల కోసం మొత్తం 5.77 లక్షల మంది దరఖాస్తు చేయగా 3.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించారు. సెప్టెంబరు 2025 లో 15,941 పోస్టుల తుది జాబితా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నియామక ప్రక్రియను 150 రోజుల్లో పూర్తి చేసింది. అయితే డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి వయో పరిమితి, పరీక్షల నిర్వహణ,  ప్రశ్న పత్రాల భద్రత,  మార్కుల నార్మలైజేషన్, రిజర్వేషన్ల అమలు,  క్రీడా కోటా పోస్టుల భర్తీ, మెరిట్ జాబితా విడుదల, సర్టిఫికేట్ ల వెరిఫికేషన్ మొదలగు విషయాలలో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. పై అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.

 వయాపరిమితి విషయంలో జనరల్ కేటగిరీకి 44 సంవత్సరాలు గాను,  ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 49 సంవత్సరాలుగాను, పీహెచ్సీ వారికి 54 సంవత్సరాలుగాను పేర్కొన్నారు. దీనివలన 2024 సంవత్సరం నాటికి వయస్సు అర్హత గలవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కోల్పోయారు. వారు వయసు కట్ ఆఫ్ డేట్ పై గొడవ చేశారు. ఇలా  వారు అడగడానికి  2018 డిఎస్సి తర్వాత సుమారు 7 సంవత్సరాల కాలం డీఎస్సీ నియామకాలు లేకపోవడమే ఇందుకు కారణం. పరీక్షల నిర్వహణ 2025 జూన్ 6వ తేదీ నుంచి జూలై రెండు వరకు జరగడం, ప్రతిరోజు జరిగే పరీక్ష పేపరు ప్రశ్న పత్రం మారడం వలన, ప్రశ్నల భారం, సులభతరంలలో మార్పులు వలన, ఫలితాలలో ఎక్కువ తక్కువ మార్కులు రావడం జరిగింది. దీనిని మార్కుల వెయిటేజ్ లో నార్మలైజేషన్ చేయమని వారు న్యాయస్థానాలకు వెళ్లారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు.

 స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేసిన 372 పోస్టులకు గాను అసలు పరీక్ష పెట్టకుండానే వారికి నియామకాలు చేశారు.  ఈ విధానం ఒక్క 2025 డీఎస్సీ లోనే చేశారు. గతంలో జరిగిన ఏ డీఎస్సీ లోనూ ఇటువంటి విధానాన్ని అవలంభించలేదు. 2019లో అప్పటి వైసీపీ ప్రభుత్వం 1.26 లక్షల గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు కూడా ఇటువంటి విధానం అమలు చేయలేదు. ఫలితంగా డీఎస్సీ అభ్యర్థులలో అనేక అనుమానాలకు దారితీసింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో క్రీడలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ సంస్థ పని విధానం చాలా వివాదాస్పదమైంది.  వీరు నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ అనేక అవకతవకలతో నిండిపోయి ఉంటాయి. ఇక్కడ పతకాలను కొందరు అనేక అడ్డదారుల్లో సంపాదిస్తూ ఉంటారు.  ఇలా సంపాదించడానికి అధికార యంత్రాంగం అండదండలు పుష్కలంగా వారికి ఉంటున్నాయన్న విమర్శ ఉంది. ఇంతటి వివాదాస్పద క్రీడా సంస్థ నిర్ధారించే క్రీడా పతకాల సర్టిఫికేట్లను ప్రామాణికంగా తీసుకొని డీఎస్సీ పరీక్ష లేకుండా వారికి ఉద్యోగాలు ఇవ్వడం శోచనీయం.

 ఇక రిజర్వేషన్ల విధానం అమలు ఈ డీఎస్సీలో పెద్ద గందరగోళాన్ని సృష్టించింది. ఇంతవరకు జరిగిన గత డిఎస్సి ఎంపిక విధానంలో జీవో 91 ప్రాప్తికి మెరిట్ కమ్ రోస్టర్ విధానం పాటించేవారు. ఈ విధానం ప్రకారం మెరిట్ ఉన్న రిజర్వుడు అభ్యర్థులు మెరిట్ లోనూ, అదేవిధంగా రోస్టర్ లోను ఎంపిక కాబడే వారు. ఫలితంగా రిజర్వుడ్ అభ్యర్థులు ఎక్కువ మార్కులు సంపాదించిన వారు మెరిట్ లో ఓపెన్ క్యాటగిరీలో ఎంపిక కాగా, తక్కువ మార్కులు వచ్చినవారు రోస్టర్ పాయింట్లలో ఎంపిక అయ్యేవారు. వీటిని తుది జాబితా లో పెట్టినప్పుడు ఎటువంటి గందరగోళం లేకుండా అభ్యర్థులు అర్థం చేసుకునేవారు. ఇప్పుడు ఈ డీఎస్సీ 2025 లో నిలువు, అడ్డం రిజర్వేషన్ విధానం అమలు చేయడం వలన ఎంపిక విధానం అంతా గందరగోళానికి గురి కావడం జరిగింది. ఇందుకు మూలమైన జీవో 77ను  2023లో వైసీపీ ప్రభుత్వమే తెచ్చింది. అయినప్పటికీ వైసీపీ ఐదు సంవత్సరాల పాలనా కాలంలో ఒక్క డీఎస్సీను కూడా నిర్వహించక  పోవడం వలన ఈ జీవో 77 ప్రభావం మనకు కనబడలేదు. ఇప్పుడు ఈ జీవోను కూటమి ప్రభుత్వం డీఎస్సీ 2025లో అమలు చేయడం వలన దాని లోపాలు బయట పడుతున్నాయి. ఈ జీవో అమలు వలన కొన్ని కేటగిరీ  పోస్టుల భర్తీలో మహిళా రిజర్వుడు అభ్యర్థులు నష్టపోగా, మరికొన్ని కేటగిరీ పోస్టుల భర్తీలో పురుష రిజర్వుడు అభ్యర్థులు నష్టపోయారు. ఈ విధానంలో పారదర్శకత లేకుండా పోయింది. అటువంటి నష్టపోయిన అభ్యర్థులు కోర్టులకు వెళ్లినప్పటికీ వారికి న్యాయం జరగలేదు. ఇప్పుడు మనం జీవో 77 రద్దు కోసం డిమాండ్ చేస్తూ, గతంలో అమలు చేసిన జీవో 91 పునరుద్ధరణ కోసం పోరాడాలి.

                  పై విషయాలన్నీ మనకు తెలియజేస్తున్నది ఏమంటే, లోపభూయిష్టమైన జీవోలతోనూ, అస్తవ్యస్త  ఎంపిక విధానంతోనూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన డీఎస్సీ 2025 ఉపాధ్యాయ నియామకాలు అనేక అనుమానాలకు దారి తీశాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎన్ని ప్రెస్ మీట్ లు పెట్టి వివరణలు ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియ మొత్తం ప్రశ్నార్థకమైంది. ఈ లోపాలపై మొదటిలో మౌనం వహించిన వైసీపీ నాయకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం, శాసనసభ, శాసనమండలిలో చర్చ పెట్టడం వలన వారికి రాజకీయ లబ్ది ఎంతవరకు జరుగుతుందో లేదో తెలియదు గానీ, ప్రస్తుతం నియామకం పొందిన ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళనకు గురి కావడం జరుగుతుంది. ఫలితంగా వారు కర్నూలు, నెల్లూరు, విజయవాడ మొదలగు పట్టణాలలో వైసీపీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  ఈ నిరసనలను కూటమి నాయకులు లబ్ధి కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందుమూలంగా అసలు సమస్య మరుగున పడింది. నష్టపోయిన మెరిట్ కమ్ రిజర్వుడ్ అభ్యర్థులకు న్యాయం జరగలేదు. స్పోర్ట్స్ కోటాలో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారు లాభపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తు డీఎస్సీ నియామకాల కోసం ఎటువంటి గుణపాఠాలు నేర్చుకుంటుందో వేచి చూద్దాం.

  •  పేడాడ కృష్ణారావు,  జిల్లా కన్వీనర్,

ప్రజాసంఘాల ఐక్యవేదిక, శ్రీకాకుళం.

తేదీ. 25 -08 – 2026.

Leave a Reply