నేను రాస్తా… నిరంతరం రాస్తా. విశ్రాంతి తీసుకోవాలనే కోరిక నాకు లేదు. సమాజ అభివృద్ధి కోసం, అకృత్యాలకు వ్యతిరేకంగా, నా కళ్లతో చూసి గ్రహించిన సత్యాన్ని రాస్తా. మానవీయ విలువలు పరిమళించాలని, మనిషిగా నా బాధ్యతను నెరవేరుస్తూ విశ్రమించకుండా రాస్తా అంటూ పాఠకులను తన అక్షర ప్రయాణంలో భాగస్వాములను చేసే సహజ కవి బిల్ల మహేందర్.
రచయిత ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బిల్ల మహేందర్ ప్రభుత్వ ఉపాధ్యాయులు. “నేను ఎలా జీవిస్తానో అలా రాస్తాను, ఎలా రాస్తానో అలానే జీవిస్తాను” అని తన జీవితానికి నిఖార్సైన నిర్వచనం ఇచ్చుకున్న బిల్ల మహేందర్, ‘నేను మరణిస్తూనే ఉన్నాను’ అనే కవితా సంపుటిని మన ముందుకు తెచ్చారు. సాధారణంగా ‘మరణం’ అనే పదాన్ని అశుభంగా భావించి ఎవరూ శీర్షికగా పెట్టడానికి ఇష్టపడరు. కానీ, బిల్ల మహేందర్ ఈ పేరును ఎందుకు ఎంచుకున్నారో అని లోతుగా వెతికితే, సమాజం పట్ల ఆయనకున్న ఆవేదన, అక్షర రూపం దాల్చిన వైనం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ సంపుటిలో ‘రెండు రాత్రులు – ఒక స్వేచ్ఛ’ అనే కవితలో రచయిత మూడు అంశాలను స్పృశించారు. మొదటి రెండు భాగాలలో సామాజిక స్పృహ, అంబేద్కర్, పేదరికం గురించి మాట్లాడుతుంటే, మూడవ భాగంలో అది వ్యక్తిగత నైతికత, స్వేచ్ఛ వైపు మళ్ళింది. రాత్రి దిక్కు తెలియక అటు ఇటు వెళ్తున్నప్పుడు కూడలి మధ్య నిలబడి దారి చూపుతున్న అంబేద్కర్ చూపుడు వేలు వైపు నడిచాను. ఇందులో సామాజికంగా వెనుకబడి ఉన్న ప్రజలు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాలను తెలుసుకొని పాటించడం ద్వారా తమ వెనుకబాటుతనం దూరం కావచ్చు అనే విషయాన్ని రచయిత తెలియజేశారు. రెండవది, ఉండటానికి ఇల్లు లేని పేదవర్గాల ప్రజలు రాత్రి పూట ఫుట్ పాత్ మీద పడుకున్న ఆ దృశ్యాన్ని మన కళ్ళముందు ఉంచారు. మూడవది, మన ద్వారా బాధపడేవారి గురించి మనం పట్టించుకోము, కానీ మనకు ఎవరి ద్వారానైనా ఇబ్బంది కలిగితే అది ఓర్చుకోలేమనే స్వేచ్ఛా పోరాటం గురించి రచయిత తెలియజేశారు.
‘మట్టి సంతకం’ అనే కవితలో ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళిన సామాన్య రైతుకు ఎదురైన అనుభవాన్ని రచయిత తెలియజేశారు. అధికారి ఏదో నాలుగు కాగితాల మీద సంతకం చేస్తూ “ఈ పచ్చని ఇంకు విలువ తెలుసా?” అన్నాడు. ప్రతి రైతు ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లినప్పుడు ఇలాంటి సందర్భం తప్పకుండా ఎదురై ఉంటుంది. చదువుతో ఉన్నత స్థాయిలో ఉన్న కొంతమంది అధికారులు ఇలా వ్యవహరించడం చూస్తుంటాం. అధికారి అడిగిన ప్రశ్నకు రైతు, “మట్టి మీద సంతకం చేస్తుంటాను” అంటూ ఇచ్చిన సమాధానం, రైతును అత్యున్నత స్థాయిలో నిలబెట్టింది.
‘చెమట పద్యం’ కవితలో రచయిత భావోద్వేగానికి గురయ్యారు. శ్రీశ్రీ కవితల్లో కనిపించే ఆవేశం, శ్రమజీవుల పట్ల ఉండే నిబద్ధత ఇక్కడ కనిపిస్తాయి. “దుఃఖమే బతుకై పోతున్న వాళ్లను ఏ సిరాతో లిఖించను? ఏళ్ల తరబడి ప్రవహిస్తున్న కన్నీటి నదులకు ఏ ఆనకట్ట కట్టను?” అన్న ప్రశ్నలు ప్రతి పాఠకుడిని ఆలోచింపజేస్తాయి. రైతు మరణించాడంటే నీ దేహం, దేశం రెండు అంతమవుతున్నట్టే అనే వాక్యం ద్వారా, రైతు లేకుంటే మన దేహం, దేశం లేకుంటా పోతుందనే నిజాన్ని చెప్పారు. ‘ఆ చెమట పద్యాన్ని భద్రంగా కడుపులో దాచుకోవాలి’ అని సమాజానికి హెచ్చరిక జారీ చేశారు.
‘మనిషి పుష్పించాలే’ కవిత దైనందిన జీవితంలో మనుషుల లక్ష్యాన్ని తెలియజేస్తూనే, జీవిత గమ్యం చేరుకునే దారిని చెబుతుంది. నీవు బాహ్యంగా ఎంత అలంకరించుకున్నా ఏమి ప్రయోజనం? మంచి గుణం ఉన్న మానవుడు పరిమళ సువాసనలా అందరి మన్ననలు పొందుతాడు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగినప్పుడే మనిషి సూర్యుడిలా ఉదయిస్తాడు.
‘మెతుకు’ కవితలో మానవ నైజం ఏమిటంటే, సమస్యల మీద స్పందించడం. అణిచివేతను ప్రతిఘటించి, కొత్త ఆలోచనలతో జీవన విధానం ఫలభరితంగా మలచుకోవాలి. నిజానికి కడుపు ఆకలి బాధను రుచి చూసినప్పుడే మెతుకు విలువ తెలుస్తుంది. డిల్లీకి రాజైనా సరే ఆకలి వేసినప్పుడు నాలుగు మెతుకులు తిననాల్సిందే కదా!
బిల్ల మహేందర్ కవితలను ఒక పాఠకుడిగా చదవాలని అనుకుని, మొదటి పేజీ చూడగానే నాకు ఒక అభిప్రాయం కలిగింది. ఇవి కేవలం అభ్యుదయ భావజాలంతో రాసినవని అనుకున్నాను. కానీ, సంపుటి పూర్తిగా చదివితే అర్థమైంది – ఈ రచయిత కష్టజీవుల ఆవేదనను, అణిచివేతకు గురైన సామాన్యుల బాధను ప్రపంచానికి తెలియజేయడమే ధ్యేయంగా రాశారని.
‘వేలాడే కలలు’ కవితలో “వాళ్లు పొద్దున్నే పువ్వోలే వికసిస్తూ నగరబాట పట్టుతారు” అంటూ కార్మికుల జీవితాన్ని పరిచయం చేశారు. నగరాల్లో కనిపించే అందమైన భవంతులు వారి శ్రమతో నిర్మించినవి. రాత్రి వరకు శ్రమించి, అలసిన ముఖాలతో గుడిసెలో కలల్ని వేలాడదీసి, మరుసటి రోజు మళ్ళీ సూర్యుడితో పోటీ పడి పనికి వెళ్తారు. ఈ కవితలో రచయిత కార్మికులను సూక్ష్మంగా పరిశీలించడమే కాకుండా, తనే ఒక కార్మికుడై ఆ బాధను పంచుకున్నారు.
‘నేను మరణిస్తూనే ఉన్నాను’ అనే కవిత బిల్ల మహేందర్ కవితా సంపుటికి పేరు అయ్యింది. “పేరులో మనిషిని మాయం చేసి, మతాన్ని వెతుకుతున్నారు, కులాన్ని చూసి వెలికోత కోస్తున్నారు.” మన దేశం లౌకికవాదం అనే ప్రాథమిక సూత్రంపై నిర్మించబడింది. ఇప్పుడెందుకు ఆ మూల సూత్రాన్ని మరచిపోతున్నారు? సమాజంలో కుల, మతాల పేరుతో ఎన్నో అసమానతలకు గురైన వేదన ఇది. మన దేశం కులమతాల పేరుతో విడిపోతుంటే, అది తనను తాను మరణించుకోవడమేనని బిల్ల మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అక్షరాల వెనుక ఉన్న ఆవేదనను, శ్రమజీవుల ఘోషను తన కవితా సంపుటిలో బిల్ల మహేందర్ అద్భుతంగా ఆవిష్కరించారు. వాస్తవికతకు అద్దం పట్టే ఈ కవితలు పాఠకుడిని ఆలోచింపజేయడమే కాకుండా, సమాజంలోని అసమానతలపై పోరాడే శక్తిని కలిగిస్తాయి. కేవలం సాహిత్య ప్రక్రియగానే కాకుండా, సామాజిక చైతన్యానికి నిదర్శనంగా నిలిచే ఈ సంపుటి, అభ్యుదయ సాహిత్య లోకంలో ఒక చిరస్థాయి సంతకం.
తెలంగాణ సారస్వత పరిషత్తు ఉత్తమ గ్రంథం పురస్కారాలు, వరిష్ఠ పురస్కారాలు ప్రధానోత్సవాల్లో నేను మరణిస్తూనే ఉన్నాను కవితా సంపుటికి 2026 సంవత్సరానికి గాను వచన కవితా పక్రియలో వరిష్ఠ పురస్కారం 14 మే 2026 ప్రధానోత్సవం జరిగింది.
కొండేటి ప్రకాష్
7981781086




