డెబ్భై తొమ్మిది కాదు
తొంబై ఏడు ఏళ్ల తర్వాత కూడ
జైలు కటకటాలు అడుగుతున్నాయి
స్వాతంత్ర్యం ఎవరికి వచ్చింది?
లాహోర్ చీకటి కొట్లలో
జతిన్ దాస్ ఆకలి
ఇవ్వాళ కూడ జీవించే ఉన్నది
ఆ ఆకలి లాదో సికాకా కళ్ళలో ఉన్నది
సురేంద్ర గాడ్గిల్ ఎల్గార్లో ఉన్నది
రెజాజ్-షర్జీల్- ఉమర్ మౌనంలో ఉన్నది
అబూబకర్ రాత్రుళ్ళలో ఉన్నది
హైసెక్యూరిటీ జైళ్లలో
ముస్లిం ఖైదీల అభద్రతలో ఉన్నది.
సునీతా పొట్టమ్ స్వప్నాల్లో ఉన్నది
లింగరాజ్ ఆజాద్ పిలుపులో ఉన్నది
జైలు ద్వారాల వెనుక బందీలై
విచారణ పేరిట శిక్ష అనుభవిస్తున్న
వేలాది ఆదివాసీ గుండె చప్పుళ్లలో ఉన్నది
అధికారం అనుకుంటుంది
జైలులో స్వరం నిశ్శబ్దమౌతుందని
జైలు గోడలు శబ్దాన్ని ఆపజాలవు
మరింతదూరం వరకు చేరవేస్తాయని శాసనానికెవరు చెప్పాలి
ఈ షహీద్ (అమరత్వ) దినం రోజు
మనం కేవలం వాళ్ళను
స్మరించుకోవడం లేదు
స్వేచ్ఛ కోసం అమరులు చేసిన
పోరాటాన్ని మన పోరాటంగా కొనసాగిస్తున్న రాజకీయ ఖైదీలను విడుదల చేయండి
యుఎపిఎ రద్దు చేయండి అంటున్నాం
జైలు గోడలు కంపిస్తున్నాయి
ఎందుకంటే లోపలున్న ఖైదీలు
అంధకారంలో కూడ
ఆ గోడల మీద ఉదయించే
సూర్యుడి పేరు రాస్తున్నారు
ఆ పేరు కింద
ఒక శబ్దం మళ్ళీ మళ్ళీ
ఉచ్ఛస్వరమై వస్తున్నది
యుఎపిఎ కాదు ఆజాదీ
(ఈ కవితకు మనం భువనేశ్వర్ జైల్లో ఉన్న దుబాసీ శంకర్, జగదల్పూర్ జైల్లో ఉన్న బెల్లాల పద్మ, శిరీష, దుడ్డు ప్రభాకర్ల పేర్లతో పాటు తెలంగాణ, ఆంధ్ర రాజకీయ ఖైదీల విడుదల పోరాట విశాల ఐక్యవేదికలు, డిమాండ్ చేస్తున్న ఖైదీల విడుదలకు సంబంధించిన అన్నీ అంశాలు కలుపుకొని చదువుకోవచ్చు. లక్నో, రాంచీ కుట్ర కేసుల రాజకీయ బందీలతో సహా – విద్యార్థి, కార్మిక బందీలను కూడ కలుపుకొని)
13 సెప్టెంబర్ 2026
స్వేచ్ఛానువాదం: ఫెలో ట్రావెలర్.




