ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభమైంది. నగర, పట్టణ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు తర్వాత చివరి దశలో మూడు విడతల గా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నగర, పట్టణ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తుపై జరగ గా, గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం రాజకీయ పార్టీ ల ఎన్నికల గుర్తుపై కాకుండా, పార్టీ గుర్తులు లేని గుర్తు లతో బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి. నిజానికి ఇవి పార్టీ గుర్తులపై జరగకపోయినా మండల, జిల్లా పరిషత్ ఎన్నికల దగ్గర నుంచి లోక్ సభ, అసెంబ్లీ సభ్యుల ఎన్నికల వరకు ప్రభావితం చేసేవి గ్రామపంచాయతీ ఎన్నికలే అన్నది చేదు నిజం. ఇవి కులాధిపత్యం, ఆ కులాలలోని కుటుంబాల ఆధిపత్యం, ధనబలం, కండబలం తో కూడుకొని అత్యంత ప్రమాదకరంగా జరుగుతాయి. ఈ ఎన్నికలలో గ్రామాలలోని బడుగు బలహీన వర్గ, కులాలకు చెందిన ప్రజలు గ్రామ పెత్తందారుల చేతిలో నలిగిపోతూ ఉంటారు. గ్రామ పెత్తందారీ కుటుంబాలు రెండు గా చీలిపోయి అధికారం, అధిపత్యం కోసం అన్ని రకాల అక్రమ పద్ధతులకు పాల్పడతారు. ఈ పెత్తందారీ వర్గ కుటుంబాల లోని నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యే కి చెందిన వారైతే అధికార యంత్రాంగం అన్ని రకాలుగా వారికి అండదండలు అందిస్తారు. ఈ ఎన్నికలలో ఒక్కో సర్పంచ్ అభ్యర్థి కనీసం 40 నుంచి 50 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారు. మేజర్ పంచాయతీలలో అయితే ఈ ఖర్చు సుమారు కోటి రూపాయలు వరకు ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వం 1957లో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు కోసం బల్వవంత రాయ్ మెహతా కమిటీని నియమించింది. ఈ కమిటీ 1958 లో రిపోర్టును అందజేశారు. 1959 అక్టోబర్ నుంచి భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడింది. అవి గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్తులుగా ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1959 నుంచి 1964 వరకు చేతులెత్తే పద్ధతిపై సర్పంచుల ఎన్నికలు జరిపారు. 1964లో ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీ రాజ్ చట్టం ఆమోదింప బడిన తర్వాత ఆ సంవత్సరం నుంచే మొట్టమొదటిగా బ్యాలెట్ పద్ధతిలో రహస్య ఓటింగ్ ద్వారా పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు. అయితే ఇవి 1964 నుంచి 1979 వరకు పరోక్ష పద్ధతిలో సర్పంచులను ఎన్నుకొనేవారు. సర్పంచ్ కావడానికి అతను తప్పనిసరిగా వార్డ్ సభ్యునిగా గెలుపొందాలి. ఆ తర్వాత గ్రామ సర్పంచులు పంచాయతీ సమితి అధ్యక్షులను ఎన్నుకొనేవారు. 1981 నుంచి సర్పంచ్ ల ఎంపిక ప్రత్యక్ష పద్ధతిలో ఆ గ్రామంలో గల ఓటర్లందరూ ఎన్నుకొనేవారు. వార్డు సభ్యులు కేవలం ఉప సర్పంచ్ ను మాత్రమే ఎన్నుకుంటారు. ఇంతవరకు ఎటువంటి రిజర్వేషన్లు, నిధులు లేని గ్రామపంచాయతీ ఎన్నికల వ్యవస్థలోకి 1993 లో కేంద్ర ప్రభుత్వం చేసిన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు మహిళలకు జనాభా దామాషా పద్ధతిలో సీట్లులను కేటాయించడమే కాకుండా, జవహర్ రోజ్ గార్ యోజన పథకం కింద నేరుగా నిధులను గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు కేటాయించడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1987 నుంచి ప్రజల ముంగిటకు పాలన పేరుతో పంచాయితీ సమితులను రెండు మూడు మండల పరిషత్తులుగా ఏర్పాటు చేయడమైనది.

73వ రాజ్యాంగ సవరణ ప్రాప్తికి 1995 నుంచి గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపు లు పెరిగాయి. సర్పంచులకు 29 రకాల పనులపై అధికారం, పర్యవేక్షణ బాధ్యతలు వచ్చాయి. రిజర్వేషన్లపై ఎన్నిక కాబడిన దళిత, ఆదివాసీ, బడుగు బలహీన వర్గాల మహిళా సర్పంచులు గ్రామ పెత్తందారీ కుటుంబాల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు. గ్రామ పెత్తందార్ల మాట వినని బడుగు బలహీన వర్గాల సర్పంచులను వేధింపులకు గురి చేసేవారు. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ గ్రామ పెత్తందారులకు వత్తాసు పలికే వారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు అదే పని చేస్తున్నారు. గ్రామ స్థాయిలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి గ్రామ పెత్తందారులు ఓటుకి వెయ్యి రూపాయల నుంచి 2000 రూపాయల వరకు పంచుతున్నారు. వీటికి తోడుగా మందు, బిర్యానీ పొట్లాలు పంపకం చేస్తూ ఉంటారు. వీరికి భయపడి బడుగు బలహీన వర్గ, కులాలకు చెందిన ఓటర్లు ఉభయ వర్గాల దగ్గర డబ్బులు తీసుకొని, ఇంటిలో గల ఓట్లను చెరి సమానంగా వేస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరి ప్రమేయం లేకుండా అవతల వర్గానికి చెందిన వ్యక్తి ఓడిపోతే బడుగు బలహీన వర్గాల వీపు విమానం మోత అవుతుంది. వీరికి వారిపై ఫిర్యాదు చేసే ధైర్యం, అవకాశం కూడా ఉండదు. ఇదంతా ప్రజాస్వామ్యం పేరుతోనే చలామణి అవుతున్నది.
ఇంత హింస తోనూ, అప్రజాస్వామికంగానూ జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రజలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేస్తూ భరిస్తున్నారు. అయినప్పటికీ బడుగు బలహీన వర్గాల కులాలకు పేదరికం పోవడం లేదు. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ, నగర ప్రాంతాలకు ఉపాధి కోసం వీరు వలసలు పోవడం తప్పడంలేదు. రెక్కలు తప్ప సెంటు భూమిలేని పేద రైతాంగం భూస్వామ్య, ధనిక రైతుల దగ్గర కౌలుకు భూమిని తీసుకొని చేస్తున్నా, రెక్కలు తప్ప కష్టం కూడా మిగలడం లేదు. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం తో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తీవ్ర కరువుతోనో, ఆ తర్వాత సెప్టెంబర్ 22 నుంచి ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తాలో పడిన భారీ వర్షాలు, వరదలు కారణంగా పంట నష్టం జరిగినప్పటికీ కేంద్ర, రాష్ట్ర కూటమి ప్రభుత్వా లు ఇంతవరకు రైతులను, రైతు కూలీలను ఆదుకున్న దాఖలాలు లేవు. అయినప్పటికీ రాష్ట్రంలో గల భూస్వామ్య పెత్తందారీ వర్గాలు గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు పేరుతో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి అర్రులు చాస్తున్నారు. పేదల బతుకులు బాగు చేయని ఎన్నికల ప్రజాస్వామ్యమా…. వర్ధిల్లని చెప్పి చప్పట్లు కొట్టి, పళ్ళాలు మోగిద్దామా..!!!


——- పేడాడ కృష్ణారావు,
జిల్లా కన్వీనర్, ప్రజా సంఘాల ఐక్యవేదిక, శ్రీకాకుళం.
తేదీ.21 -10 -2026.

Leave a Reply