ఒక ఆదివాసీ రచయిత విజ్ఞప్తి
సెప్టెంబర్ 16న జగదల్పూర్లోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు, 2013 మే 25న జరిగిన ఝీరం ఘాటీ దాడి కేసులో మరణశిక్షను విధించినట్లు వార్తల ద్వారా తెలుసుకున్నాను. నివేదికల ప్రకారం ఈ ఘటనలో పోలీసు సిబ్బందితో సహా 27 మంది ప్రాణాలు కోల్పోగా, 38 మంది గాయపడ్డారు. మావోయిస్టులు నిర్వహించిన “వ్యూహాత్మక ప్రతిదాడి కాంపెయిన్ ” (టాక్టికల్ కౌంటర్ ఆఫెన్సివ్ క్యాంపెయిన్ – TCOC)లో భాగంగా కాంగ్రెస్ పరివర్తన్ ర్యాలీపై ఈ దాడి జరిగింది (వికీపీడియా). మరణశిక్ష పడిన పదిమంది సాధారణ ఆదివాసీలు, ప్రత్యేకంగా గోండులు.
నేను ఆ గోండు సంప్రదాయం నుంచి వచ్చినవాడిని. ఆ సంప్రదాయం నాకు భిన్నమైన ప్రశ్న అడగడం నేర్పింది: బస్తర్లో ఇన్నేళ్ల హింస తర్వాత, న్యాయం చివరకు మరొక మరణం ద్వారానే మాట్లాడాలా?
అలా జరగకూడదని నేను విశ్వసిస్తున్నాను.
మరో బస్తర్ జ్ఞాపకం
ఆదివాసీల చరిత్ర, అలాగే బస్తర్ చరిత్ర, ఆదివాసీల దృక్కోణం నుంచి రాయలేదు. చరిత్ర రచనలో పురాణాలు, జానపద కథనాలు, సామాజిక స్మృతి, సమాజ నైతికత పరిగణనలోకి తీసుకోలేదు. బస్తర్ పరస్పరం పోరాడే సైన్యాలకు యుద్ధభూమిగా మారక ముందు, రాజ్యం పోలీసు స్టేషన్లతో, పరిపాలనా సరిహద్దులతో అడవిలోకి అడుగుపెట్టక ముందు, తిరుగుబాటు–ప్రతి తిరుగుబాటు అనేవి ఈ ప్రాంతాన్ని అర్థం చేసుకునే భాషగా మారక ముందు, మరో బస్తర్ ఉండేది.
అది అడవులు, నదులు, కొండలు, తెగలు, గ్రామాలు, పాటలు, ఆచారాలు, బంధాల కలయికతో ఏర్పడిన బస్తర్.
అక్కడ మనిషి ప్రకృతికి వెలుపల నిలబడి, ప్రకృతిని ఒక వనరుగా చూసే వ్యక్తి కాదు. మనిషి ప్రకృతి లోపలే ఉండేవాడు. గోండు ప్రజల ఆదివాసీ స్మృతిలో ఇది ఒక ముఖ్యమైన భాగం.
గోండు సామాజిక స్మృతిలో పహండీ పారీ కుపార్ లింగో ప్రధాన పాత్ర పోషిస్తారు; ఆయనది పునాది స్థానం. వేర్వేరు గోండు సముదాయాలు ఆయన కథను వేర్వేరు రీతుల్లో భద్రపరచి, వ్యాఖ్యానిస్తాయి. అయితే సామాజిక జీవన సంవిధానానికి, నైతిక ప్రవర్తనకు తొలి గురువుగా ఆయనని కోయా పునేమ్ (గోండీ ధర్మం)లో విస్తృతంగా స్మరించుకుంటారు. సమకాలీన పండితుడు మోతీరామ్ ఛత్తీరామ్ కంగాలి తన ‘పారీకుపార్ లింగో: కోయా పునేమ్’ గ్రంథంలో గోండీ ధర్మాన్ని లేదా కోయా పునేమ్ను మనుషుల మధ్య, అలాగే మనుషులకూ మానవేతర జీవులకూ మధ్య ఉండే సంబంధాలను నిర్దేశించే మౌఖిక తాత్విక చట్రంగా, ప్రవర్తనా నియమావళిగా వర్ణించారు. మాకు ఇది కేవలం పురాణం కాదు. సమాజం ఎలా జీవించాలో గుర్తుచేసుకునే మార్గం.
జంతువు బంధువైనప్పుడు
గోండు సామాజిక కల్పనలోని అత్యంత అందమైన భావనలలో ఒకటి వంశానికీ పెర్సాపేన్కూ (పరమ దైవం, కొన్నిసార్లు ప్రకృతి శక్తిగా వ్యక్తీకరించబడేది) మధ్య ఉన్న సంబంధం; దీన్ని తరచుగా టోటెమిజం భాషలోకి అనువదిస్తారు. గోండు సామాజిక సంప్రదాయాలు వంశాలను నిర్దిష్ట జంతువులు, పక్షులు, వృక్షాలతో ముడివేస్తాయి. కోయా పునేమ్పై జరిగిన పరిశోధనలు వంశాలకు నిర్దిష్ట మానవేతర జాతుల పట్ల బాధ్యతలు ఉంటాయని వివరిస్తాయి. గోండు సామాజిక వ్యవస్థలో 750 వంశాలు ఉన్నాయని, ప్రతి వంశానికి ఒక జంతువు, ఒక పక్షి, ఒక వృక్ష జాతి చొప్పున మొత్తం మూడు మానవేతర జాతులు అనుబంధంగా ఉంటాయని కంగాలి తన గ్రంథంలో పేర్కొన్నారు. తమకు కేటాయించిన జంతువును, పక్షిని, మొక్కను కాపాడే బాధ్యత ఆ వంశానిది. ఈ విధంగా 750 వంశాలు 2,250 ప్రకృతి అంశాల పరిరక్షణకు బాధ్యత వహిస్తాయి. ఎందుకంటే, ఒక జంతువు మా బంధుత్వంలో, బాధ్యతలో భాగం కాబట్టి దాన్ని చంపకూడదనే నైతిక నిషేధాన్ని మా పూర్వీకులు ఊహించగలిగితే, మనుషులను చంపడం గురించి అది మనకు ఏమి నేర్పుతుంది?
నేడు మరణం గురించి మాట్లాడేటప్పుడు ఈ భేదం అత్యంత ప్రాధాన్యం కలిగినది.
గోండు సమాజం చారిత్రకంగా వేట, సంఘర్షణ, యుద్ధాలకు అతీతమైనదని నేను చెప్పను. అలా చెప్పడం ఆదివాసీ చరిత్రను అవాస్తవంగా ఆదర్శీకరించడమే అవుతుంది. తమ వంశ టోటెమ్కు చెందని జంతువును, పక్షిని, మొక్కను చంపడానికి వారికి అనుమతి ఉండేది. కాబట్టి అవసరం లేనిదే దాడి చేసి చంపడం జరిగేది కాదు. తమ ప్రకృతిని, సమాజాన్ని కాపాడుకోవడానికి గోండులు బయటి నుంచి వచ్చిన ఆర్యులపై దాడి చేశారు.
బస్తర్, లేదా మొత్తం దండకారణ్యం, మురియా, హల్బీ, కోయ వంటి వివిధ గోండీ ప్రజల నేల. బ్రాహ్మణీయ రచనలు వీరిని అసురులుగా వర్ణిస్తాయి. రామాయణం, మహాభారతం, వేదాలు మొదలైన వాటిలో దానవులకూ దేవతలకూ మధ్య జరిగిన పోరాటాల ప్రస్తావన ఉంది. దండకారణ్యంలోని అసురులు వసిష్ఠుడు, రాముడు వంటి వారు తమ భూమిలోకి ప్రవేశించి జగరక్ష (యజ్ఞం అనే బ్రాహ్మణీయ క్రతువు నిర్వహించడం) చేయడాన్ని ప్రతిఘటించారు. ప్రకృతి పరిరక్షణ సంప్రదాయం పట్ల గోండు ప్రజలు మరింత నిబద్ధతతో ఉండేవారు; దాన్ని కాపాడుకోవడానికి ఎంతదూరమైనా వెళ్లేవారు. జల్, జంగల్, జమీన్ (నీరు, అడవి, భూమి) పరిరక్షణ కోసం బస్తర్ గోండు ప్రజలు కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా చూపిన ప్రతిఘటన, ఆ సముదాయపు ఆదివాసీ ఆచారాల లోపలి నుంచే పుట్టింది.
అందుకే అటవీ జీవనాన్ని పునర్వ్యవస్థీకరించడానికి వలస పాలకులు చేసిన ప్రయత్నాలు ఆదివాసీ భారతమంతటా ప్రతిఘటనలకు దారితీశాయి.
ఆదివాసీ సమాజాలు అడవిని భిన్నంగా చూశాయి, అనుభూతి చెందాయి. అడవి నివాసయోగ్యమైనది. అది వారి జ్ఞాపకంలో ఉండేది. పాటలలో ఆరాధన లో భాగమైనది. సాగులో ఉండేది. ఆహారానికి, ఔషధానికి, ఆశ్రయానికి, జ్ఞానానికి మూలం. సామాజిక సంబంధాల ద్వారా పాలనలో ఉండేది
బస్తర్ దీనికి మినహాయింపు కాదు.
1910 నాటి భూమ్కాల్లో మనం చూసిన ప్రతిఘటన బస్తర్లోని అత్యంత ముఖ్యమైన ప్రతిఘటన జ్ఞాపకాలలో ఒకటి. వలస పాలకుల జోక్యం, అటవీ రిజర్వేషన్, సంప్రదాయ ఆచారాలపై ఆంక్షలు, వెట్టిచాకిరీ, శిస్తు డిమాండ్లు, భూమిపై, అడవిపై ఆదివాసీల నియంత్రణ విస్తృతంగా క్షీణించడం వంటి కారణాలతో ఈ తిరుగుబాటును చారిత్రక కథనాలు ముడివేస్తాయి. 1910 నాటి తిరుగుబాటును బ్రిటిష్ అటవీ విధానాలకు, భూమితో ప్రజలకున్న సంబంధం చెదిరిపోవడానికి ప్రతిస్పందనగా వచ్చినదిగా భారత ప్రభుత్వం తన డిజిటల్ నిక్షేపాలలో వర్ణిస్తుంది.
ఈ చరిత్రలో గుండాధూర్ అత్యంత ముఖ్యమైన పేర్లలో ఒకటిగా నిలిచి ఉంది. కానీ భూమ్కాల్ను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది హింసను ప్రేమించిన ప్రజల కథ కాదు. అది తమ ప్రపంచం రూపాంతరం చెందడాన్ని ప్రతిఘటించిన ప్రజల కథ. అందుకే ఆ తిరుగుబాటు భాష భూమి, అడవి, ఆత్మగౌరవం, స్వపరిపాలనల నుంచి విడదీయరానిది.
పీడిత సమాజం హింసను తన నైతిక ఆదర్శంగా చేసుకోకుండానే ప్రతిఘటించగలదు.
భూమ్కాల్ సైతం సాయుధ తిరుగుబాటుగా మారింది; ప్రభుత్వ సంస్థలపై, వ్యాపారులపై, అధికారులపై దాడులు జరిగాయని, మరణాలు సంభవించాయని చారిత్రక కథనాలు నమోదు చేశాయి. ఈ చరిత్రను మనం దాచకూడదు. కానీ దాన్ని కేవలం హింసకు కుదించి, దాన్ని పుట్టించిన కారణాలను మరచిపోనూ కూడదు.
సమకాలీన బస్తర్ను అర్థం చేసుకోవడానికి ఈ వ్యత్యాసం ముఖ్యం. ఒక ప్రజ తమ పైన జరిగే ఆధిపత్యాన్ని ప్రతిఘటించవచ్చు. ఆయుధాలు చేపట్టవచ్చు. హింసకు పాల్పడవచ్చు. కానీ దాని వల్ల హింస ఆ సమాజపు అత్యున్నత నైతిక సూత్రంగా మారిపోదు.
ఝీరం ఘాటీపై జరిగే చర్చలోకి గోండు దృక్కోణం ప్రవేశించేది ఇక్కడే. గుండాధూర్ను స్మరించుకున్నప్పుడు, బ్రిటిష్ అధికారాన్ని ప్రతిఘటించిన ఒక వ్యక్తిని మాత్రమే నేను గుర్తుచేసుకోను.
తమ భూమితో తమ సంబంధాన్ని కాపాడుకుంటున్న ప్రజలను గుర్తుచేసుకుంటాను.
పారీ కుపార్ లింగోను స్మరించుకున్నప్పుడు, ప్రాచీన మౌఖిక సంప్రదాయంలోని ఒక వ్యక్తిని మాత్రమే నేను గుర్తుచేసుకోను.
ఒక నైతిక భావనను గుర్తుచేసుకుంటాను:
మనుషులు బంధాల ద్వారా జీవిస్తారు.
నిర్దిష్ట జంతువులను, పక్షులను, వృక్షాలను రక్షించే వంశ సంప్రదాయాలను స్మరించుకున్నప్పుడు, విధ్వంసం చేయాలనే మానవ కాంక్షపై గోండు కల్పన పరిమితులు విధించిందని గుర్తుచేసుకుంటాను.
ఈ రోజు ఝీరం ఘాటీని చూసినప్పుడు, మానవ ప్రాణం ఖర్చు చేయదగిన వస్తువుగా మారిన రాజకీయాల భయంకర పరిణామాలను నేను చూస్తున్నాను.
అందువల్ల నా విజ్ఞప్తి సరళమైనది. బస్తర్ ప్రతిఘటన చరిత్ర అంతులేని హత్యల చరిత్రగా మారడానికి మనం అనుమతించరాదు. ప్రతిఘటనను ప్రతీకారంతో కలగలపరాదు. న్యాయాన్ని ఉరిశిక్షతో కలగలపరాదు. ఒక మరణానికి మరొక మరణంతో సమాధానం చెప్పడానికి రాజ్యాన్ని అనుమతించరాదు.
రాజ్యం ఉరిశిక్షను “తీర్పు” అనవచ్చు. కానీ నేలకు అది మరొక మరణమే. బస్తర్ ఇప్పటికే చాలా మరణాలను చూసింది.
కాబట్టి, దోషులుగా తేలిన ఆ పదిమంది భవితవ్యంపై నిర్ణయాధికారం ఉన్న న్యాయవ్యవస్థకూ, రాజ్యాంగ అధికారులకూ నేను విజ్ఞప్తి చేస్తున్నాను: వారిని ఉరితీయకండి.
అనువాదం : రాము




