మన దేశంలోని బ్రాహ్మణీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాలకు పునాదులు వేసిన సామాజిక విప్లవ కారుడు జ్యోతిరావు పూలే, పునాలోని గోవింద రావు- చిమ్నా బాయ్ దంపతులకు ఏప్రిల్ 11,1827 న జన్మించాడు. పూల ఉత్పత్తి, అమ్మకం చేయడం వల్ల ఆయన కుటుంబంలోని వారందరి పేరు చివర పూలే అని స్థిరపడింది. పూలే ఆనాటి బ్రిటిష్ ఇండియాలోని కుల భూస్వామ్య వ్యవస్థలో అమలు జరుగుతున్న అంటరానితనం, కుల మరియు లింగ వివక్ష, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా, కుల వ్యవస్థ నిర్మూలన కావాలని పోరాడారు. బాలికలు, మహిళల విద్యా హక్కుల కోసం, వితంతుల పునర్వివాహ హక్కు కోసం పోరాడారు. కార్మికవర్గం, రైతాంగ హక్కుల కోసం పోరాడారు. దళిత, శూద్ర సమాజపు ప్రతినిధిగా, సంస్కర్తగా పూలే నిర్వహించిన పాత్ర ఆ తరువాత దేశ వ్యాప్తంగా పెల్లుబికిన దళిత బహుజనోద్యమానికి దిక్సూచి అయ్యింది. ఆయన కుల నిర్మూలన పోరాట వారసత్వాన్ని మహారాష్ట్ర లో చత్రపతి సాహూ మహరాజ్-అంబేద్కర్లు, కేరళలో నారాయణ గురు-అయ్యంకాళి,తమిళనాడులో పెరియార్, హైదరాబాద్ లో భాగ్య రెడ్డి వర్మ మొదలగు వారు కొనసాగించారు.
పూలే,మహారాష్ట్ర లోని పీష్వా భూస్వామ్య సమాజాన్ని సేఠ్ జీ,భట్ జీ -బహుజనుల మధ్య ఘర్షణమయ సమాజంగా పేర్కొన్నాడు.రాముడి రామాయణం కధ ఆర్యన్ దురాక్రమణకు పునాదులు వేసిందనడానికి చిహ్నమని ప్రకటించాడు.విగ్రహారాధనను, బ్రాహ్మణ పూజారుల ఆవశ్యకతను తిరస్కరించాడు. హేతుబద్ధ భావాల ప్రచారం కోసం సెప్టెంబర్ 24,1873 లో సత్య శోధక్ సమాజ్ ను స్థాపించాడు.ఈ సంస్థ పోరాటాల వల్ల పశ్చిమ మహారాష్ట్రలో బ్రాహ్మణ భూస్వాములు గ్రామాలను వదిలి పారిపోయారు. బ్రిటిష్ వలస వాదులకు వ్యతిరేకంగా సతారాలో జరిగిన ఉద్యమం వల్ల సమాంతర అధికారిక వ్యవస్థ ఏర్పడింది. సత్య శోధక్ రైతాంగ చైతన్యానికి, ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఎదిగింది. తన జీవిత సహచరి సావిత్రి బాయ్ పూలేకి విద్యనేర్పి, ఆమె ద్వారా అంటరాని బాలికలు, మహిళల కోసం దేశంలోనే మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించాడు. వితంతు వివాహాల హక్కుల కోసం,శిశు హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు.ఉద్యోగ ఉపాధి అవకాశాలను సృష్టించే విద్యా విధానాన్ని రూపొందించి,ప్రభుత్వమే అందించాలని బ్రిటిష్ పాలకులతో పోరాడారు. బ్రాహ్మణీయ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ఎన్నో రైతాంగ పోరాటాలు నడిపాడు.రైతాంగం అప్పులను రద్దు చేయాలని,మధ్య పానాన్ని నిషేధించాలన్నాడు. ఆయన శిష్యుడైన నారాయణ రావ్ లోఖాండే ద్వారా 1880 లో ఇండియాలో తొట్ట తొలి కార్మికవర్గపు యూనియన్ ‘మిల్ హెండ్స్ అసోసియేషన్ ‘ ను బొంబాయిలో ఏర్పాటు చేశారు.ఆయన అట్టడుగు వర్గాల-కులాల ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వ్యవసాయదారుల బంధనాలు, తృతీయ రత్నా, గులాం గిరీ, చర్నాకోలా వంటి 14 పుస్తకాలు రాశారు. దీనబంధు అనే పత్రికను నడిపారు. కుల వ్యవస్థ వల్ల బానిసత్వం ఏర్పడిందని, బ్రాహ్మణాధిపత్య భాలజాలమే బ్రిటిష్ ఆధిపత్యం సంఘటితం కావడానికి కారణమని,కుల వ్యవస్థ మోసపూరితమైన దోపిడీ వ్యవస్థ అని,దీన్ని తుదముట్టించడానికి అన్ని కులాల-వర్గాల ప్రజలను కూడగట్టి బలమైన దళిత బహుజన, కార్మిక, రైతాంగ ఉద్యమాలను నిర్మిస్తూ నవంబర్ 28,1890 న అమరుడైనాడు.
జ్యోతిరావు పూలే శిష్యుడైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఏప్రిల్ 14,1891 లో జన్మించాడు. ఆయన స్వంత గ్రామం అంబెవాడ, రత్నగిరి జిల్లా మహారాష్ట్ర. ఆ కాలపు దేశంలోని అత్యున్నత విద్యావంతుడు.దళితుడిగా పుట్టి,బుద్ధుడి హేతుబద్ధ తాత్విక దృక్పథాన్ని స్వీకరించి,దేశ సామాజిక రాజకీయోద్యమంలో విశిష్టమైన పాత్ర నిర్వహించాడు. దేశ అభ్యున్నతికి పాటుపడుతూనే,కుల వ్యవస్థ నిర్మూలనకు తనదైన పాత్ర నిర్వహించిన గొప్ప సామాజిక విప్లవకారుడు.కుల-వర్గ రహిత సమాజాన్ని స్థాపిస్తేనే దేశ పురోగతి సాధ్యమౌతుందని ప్రకటించిన మహామేధావి. జ్యోతిరావు పూలే రగుల్కొల్పిన పోరాట స్ఫూర్తిని, సాహూ మహరాజ్ అందించిన సహకారాన్ని వినియోగించుకొని బ్రాహ్మణీయ కుల వ్యవస్థ నిర్మూలన కోసం తన శక్తినంతా ధారపోశాడు. హిందూ మతపు ప్రజావ్యతిరేక ఫాసిస్టు స్వభావాన్ని అత్యంత ప్రతిభావంతంగా విశ్లేషించి చీల్చి చెండాడు.దాని అభివృద్ధి నిరోధక స్వభావాన్ని తిత్తితీసి ఎండగట్టాడు. బహిష్కృత హితకారిణి సభ ద్వారా అంటరాని కులాల ప్రజలకు విద్య, వైద్యం,దేవాలయాల్లో ప్రవేశం, చెరువుల నుండి మంచినీరు వినియోగించుకునే హక్కు.స్వేచ్ఛగా సంచరించే హక్కు కోసం పోరాడారు.మహద్ చెరువులో నీటి కోసం పెద్ద ఎత్తున ఆందోళన నడిపాడు. అంటరాని కులాల ప్రజలు హిందువులే అంటున్న వారి నిజ స్వరూపాన్ని బట్ట బయలు చేయడానికి కాలారాం మందిర ప్రవేశానికి ప్రయత్నించి,హిందూ మతవాదులు మందిరంలోకి అనుమతించకుండా మందిరాన్నే మూసివేయడాన్ని ప్రత్యక్ష ఉదాహరణగా చూపాడు.అంటరానితనానికీ,కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రారంభించిన అయన పోరాటం బ్రిటిష్ వలస పాలనతో ముడివడిన బ్రాహ్మణిజం-క్యాపిటలిజం మన దేశ శత్రువులని ప్రకటించాడు.గ్రామీణ ఖోట్ వ్యవస్థ, వతందారీ పద్ధతి రైతుల,వ్యవసాయ కూలీల సమస్యలపై లక్షలాది ప్రజలను కూడగట్టి పోరాడిండు. స్టాండింగ్ ఆర్డర్ల చట్టం,కనీస వేతనాలు, మహిళలకు ప్రసూతి సెలవుల చట్టాలతో పాటు కార్మికుల కోసం అనేక పధకాలు రూపొందడానికి కృషి చేశాడు.రిజర్వేషన్లు,హిందూ కోడ్ బిల్లు, రాజకీయ ప్రజాస్వామ్యం వంటి సమస్యలను చేపట్టాడు.బహిష్కృత హితకారిణి సభ మొదలుకొని ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, షెడ్యూల్ కులాల సమాఖ్య,రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వంటి రాజకీయ పార్టీలను స్థాపించి అనేక రాజకీయ పోరాటాలకు నాయకత్వం వహించాడు.ముఖ్యంగా కుల వ్యవస్థ హిందూ మతానికి వెన్నెముక,మూల స్థంభం అని, అంటరానితనం దాని ఆత్మ అని, గుండెకాయ వంటిదని, కుల వ్యవస్థ ఉన్నంత వరకు హిందూ మతం కొనసాగుతుందని చెప్పాడు.కుల వ్యవస్థను నిర్మూలించకుండా హిందూ మతాన్ని సంస్కరించడం అసాధ్యమని చెప్పాడు.కుల వ్యవస్థ శ్రమనే కాదు శ్రామికులను కూడా విభజన చేసిందని చెప్పాడు. హిందూ మత గ్రంధమైన మనుస్మృతిని బహిరంగంగానే తగులబెట్టాడు.
మన కుల భూస్వామ్య వ్యవస్థ చేతి వృత్తుల, సేవా వృత్తుల అణగారిన కులాల ప్రజలను వ్యవసాయానికి బంధీ చేసి,స్వతంత్రంగా ఇతర దేశాల్లో వలే పెట్టుబడిదారులుగా అభివృద్ధి చెందకుండా నిరోధించింది. ఆస్తులకు, అధికారానికి,విద్యకు,ఉద్యోగాలకు,రాజకీయ అధికారానికి దూరం చేసింది.శ్రమకు తగ్గ ఫలితం దక్కకుండా సేవా ఫలంగా,మత ధర్మంగా మార్చి బిక్షగాళ్ళుగా మార్చింది. మేధో శ్రమలు చేసే వారిని,కూర్చుని తినే తిండిపోతు పురోహితులను గొప్పగా కీర్తించింది. కష్టం చేయడం నీచమైనదిగా, కష్టజీవులను,వారి సంస్కృతిని నీచమైనదిగా, పశువుల కంటే హీనమైనవారుగానూ పేర్కొని శిక్షించింది.కుల వ్యవస్థ కులాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలను నిషేధించింది. ప్రతి కులం మరో కులంతో సంఘర్షిస్తూ ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా ఐక్యమై పోరాడకుండా చేసిన కుల వ్యవస్థ సమాజంలోని మౌళిక మార్పులకు అడ్డుపడుతూ బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్టు శక్తుల ఆధిపత్యానికి,దోపిడికి సాధనంగా ఉంది. ఇలాంటి కుల వ్యవస్థను లోతుగా అధ్యయనం చేసిన అంబేద్కర్ అనేక గ్రంధాలను రాసి కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడారు.దేవుని ముందు మనుషులంతా సమానమేనని,మనుషుల మధ్య సోదర భావాన్ని, సమానత్వాన్ని, స్వేచ్ఛను భోధించిన అన్ని మతాల వలె హిందూ మతానికి మత లక్షణం లేదని,అది ప్రత్యేక సామాజిక అణచివేత నిరంకుశ కట్టడమని,దీని బ్రాహ్మణీయ భావజాలాన్ని విశ్లేషించి దాని ప్రతీఘాతుక, సమాజ వ్యతిరేక సిద్ధాంతాన్ని ప్రతిఘటించాడు. రాజ్యాంగ రచనా సందర్భంగా మహిళల, దళితుల,వెనుకబడిన కులాల, ఆదివాసీల, మత మైనారిటీల,జాతుల హక్కులను పొందుపర్చడానికి తీవ్రంగా శ్రమించాడు.
మనిషిని మనిషిగా గుర్తించని ఆనాటి సమాజ మార్పు కోసం ఈ ఇద్దరు మహానీయులు చేసిన కృషి విప్లవాత్మకమైనది. వీరి స్ఫూర్తికి విరుద్ధంగా నేటి అన్ని మనువాద/పాలక పార్టీలు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్-బిజెపిలు పీడిత ప్రజల ఐక్యతను,అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు. కష్టజీవులను నిలువునా అడ్డంగా చీల్చిన కుల వ్యవస్థను కాపాడుతూ, దీని ఫాసిస్టు భావజాలంతో ప్రజలలో కులతత్వాన్ని,మతతత్వాన్ని,నకిలీ భరత జాతి తత్వాన్ని రెచ్చగొడుతున్నరు. దేశాన్ని హిందూ మత రాజ్యంగా మార్చాలని కుట్రలు చేస్తున్నరు. ఒక ప్రజా సమూహాన్ని మరో ప్రజాసమూహం పై ఉసిగొల్పి మారణకాండను సృష్టిస్తున్నరు. కుల వ్యవస్థను ఆధారం చేసుకొని దోపిడీ పాలక వర్గాలు పన్నుతున్న పన్నాగాలన్నీ కులాల, మతాల పేరుతో కష్టజీవులు శాశ్వతంగా ఐక్యంగాకుండా చేస్తున్నాయి. భూస్వామ్య వర్గ వ్యవస్థతో పెనవేసుకున్న కులవ్యవస్థ నిర్మూలనకు జమిలిగా పోరాడకుండా మన దేశంలో అంబేద్కర్ చెప్పినట్టు ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపన సాధ్యం కాదు. ప్రజాస్వామ్యం గురించి ఊదరగొడుతున్న పాలకవర్గాల ప్రజాస్వామ్యం కొద్ది మంది దోపిడీ వర్గాలు అసంఖ్యాక పీడిత దళిత బహుజనులను అణచిపెట్టి దోచుకునే నియంతృత్వం తప్ప మరొకటి కాదు.అందుకే అంబేద్కర్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి,లౌకిక విలువలకు విరుద్ధంగా పోతే ప్రజలు ఈ వ్యవస్థ కట్టడాన్నే కూల్చివేస్తారని హెచ్చరించాడు.
ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసగించడానికి ఇచ్చిన ఎన్నికల హమీలనైనా అమలు జరుపకుండా నిరంకుశ పాలనను కానసాగిస్తూ 2047 నాటికి దేశాన్ని ‘అభివృద్ధి చెందిన దేశం'(వికసిత భారత్) గా మారుస్తామని ప్రగల్భాలు పలికి వ్యవసాయిక, పారిశ్రామిక,సేవా రంగాలలోని సకల సంపదలను దేశ,విదేశీ కార్పోరేట్ బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పుతున్నరు.కార్మికవర్గం,రైతాంగం, మహిళలు,దళితులు,ఆదివాసీలు,మత మైనారిటీలు,జాతుల ప్రజలు పోరాడి సాధించుకున్న చట్టాలను,హక్కులను ఎత్తివేస్తున్నరు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యను కాషాయికరిస్తున్నరు.యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగ సైన్యాన్ని పెంచి రోడ్డున పడేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా కష్టజీవులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ముఖ్యంగా మహిళల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నరు. అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలను తమ విధానాలకనుగుణంగా మలుచుకుంటున్నరు.దీనినే ఆర్ఎస్ఎస్-బిజెపిలు ‘హిందూత్వ రాష్ట్రం’అంటున్నాయి. అనగా దేశాన్ని బ్రాహ్మణీయ ఫాసిస్టు కార్పోరేట్ హిందూ మత రాజ్యంగా మారుస్తామంటున్నారు. తమ విలువైన జీవితాలను త్యాగం చేసి ఆర్థిక,రాజకీయ,సామాజిక సమానత్వం – సాధికారత కావాలని జ్యోతిరావు పూలే, అంబేద్కర్ మొదలగు మహానీయులు చేసిన కృషిని, సాధించిన ఫలితాలను రద్దు చేస్తున్నారు నేటి పాలకులు. అందుకే వీరి పోరాట స్ఫూర్తిని కొనసాగించడానికి,విశాల ప్రజానీకంను చైతన్యవంతం చేయడానికి అన్ని చోట్లా జయంతులను ఘనంగా జరుపుకుందాం.
తేదీ.11-4-2026.




