రాయ‌ల‌సీమ రైతు క‌థ‌లు సంక‌ల‌నానికి శ్రీ‌నివాస‌మూర్తి రాసిన ముందుమాట‌

నేను ఆరోతరగతిలో వున్నప్పుడు మావూరికి ఆపిల్, దానిమ్మ, కమలాలు వంటి ‘అమ్ముకునే’ పండ్లు వచ్చేవి కాదు. పల్లెల్లో వాటిని కొనలేరు.అందుకని ఎవరూ తెచ్చి అమ్మరు. ( నీళ్లు లేవు కాబట్టి అరటిపండ్లు కూడా మా వూళ్ళో దొరకవు. ఎప్పుడైనా కర్నూలు పోతున్నప్పుడు వెల్దుర్తిలో బస్సు ఆగితే “అరటిపండ్లేయ్!” అంటూ బస్సును  చుట్టుముట్టే ఆడవాళ్ళ అరుపులు యిష్టంగా వింటూ ఒక డజనుకొనడం ఆనాడు మాకు అపురూపం ) వూరి కొండల్లోనో,తోటల్లోనో పండే సీతాఫలం, జామ, మామిడి కూడా బాగా అగ్గువ అయినప్పుడు మాత్రమే ఇంటిదగ్గరికి అమ్మొచ్చేవి. టమేటా కాలంలో మాత్రం మా అమ్మ “నాయినా పండ్లు తిందుగానిరా!” అని నాటు టమేటాలని నాలుగు ముక్కలు చేసి పైన రోన్త చక్కిర చల్లి యిచ్చేది.  చుట్టు పక్కల పల్లెల్లో టమేట పంట ఇరగకాసినపుడు 5 పైసలకు రెండున్నరకిలోల (ధడియం) లెక్కన 20 పైసలకు ఒకపెద్ద బుట్ట. యింకా అగ్గువ అయితే తెంపిన కూలీ కూడా గిట్టుబాటు కాదని రైతులు పొలంలోకి పసరాలను ఇడుస్తుండిరి. ఇదంతా నా పిల్లప్పుడు అంటే 1973లో. అప్పుడు నుంచి ప్రతిఏటా టమేటా, ఉల్లిపాయ సీజన్ లో ఇదే పరిస్థితి చూస్తున్నా. నలభై ఏడు యేండ్లు ఐపాయ గదా! మన బతుకు లింత మారె గదా!  లాప్టాప్ లు, స్మార్ట్ ఫోన్లూ,మెగాపార్కులు, స్మార్ట్ సిటీలు వచ్చె గదా! సైన్సు టెక్నాలజీ ఇంత మోపాయె గదా! యీ అభివృద్ధి రైతు బతుకులో ఎందుకు రాలేదు?                                                                

సేద్యం ఏటేటికీ సంక్షోభంలో కూరుకుపోతున్నదనడానికి సాక్ష్యం రైతుల ఆత్మహత్యలు, వలసలే. వ్యవసాయంలో రైతులకున్న ఇబ్బందులను ఈ కథల్లోంచే వెతుకుదాం. వెంకటకృష్ణ కథ :పాత బాకీలు’లో వ్యాపారికూడ అయిన పెద్దరైతు వీరభద్రారెడ్డి మాటల్లో ” పెట్టుబడులు ఎక్కిపాయ , ఎంత పెద్ద రైతుకైనా అప్పులు తప్పవు. వానలురావు, వచ్చినా దాండ్లనే నమ్ముకొని పెద్ద రైతులు వుండలేరు. పంటనీళ్లు గూడా కొనుక్కోవాల్సిందే, పంటనీటికీ, బోర్లకూ, పైపులైన్లకూ మేం పెట్టే డబ్బులు మీరు వూహించలేరు.ఇంక విత్తనాలూ, ఎరువులూ, పురుగు మందుల సంగతి చెప్పనవసరమేలేదు. ఏ పంట ఎప్పుడు ఏ రేటుంటుందో చెప్పేవాడెవుడు. మా రైతులుండారు చూడు, ఒక్కనికి వుల్లిగడ్డలో రేటుకలి సొచ్చి వాని పంట పండిందనుకోండి , మళ్లా యేడు అందురూ వుల్లిగడ్డే నాటుతారు.ఆసారి రేటుండదు. పంట పీకిన ఖర్చులు గూడా రావు. మళ్లా సారి యింకొగడు మిర్చీ వేసుకోని గడ్డనబడింటాడు, వాడ్ని చూసి, యీసారి అందరూ మిర్చీ వేస్తారు.ఇట్ల తిరుగుతానే వుంటుంది.”

అసహాయుడైన రైతు మధ్య దళారీల చేతిలో ఎలా మోసపోతాడో తన కథలో చిత్రించాడు లోసారి సుధాకర్. ‘‘ఈ పొద్దు చాలామంది పెద్ద రైతులవి తూకాలు ఉండాయి. యాడ కుదురుతుంది అప్పా’’ అని షావుకారి సుబ్బయ్య  విసుగ్గా మాట్లాడినాడు.  చానా బతిమాలితే తప్ప తన కల్లము దొడ్డి కాడికి రాలేదు. వచ్చీరాగానే రాశిలో  ఉన్న శనక్కాయలు చేతుల్లోకి తీసుకుని పిడికిలి ఊపుతూ.  ‘‘కాయ చానా తల్లుంది ‘మనవు’  యాబై రూపాయలు పైన ఒక్క రూపాయి కూడా వేసుకోను’” ధర తగ్గించేందుకు చౌక జేసి అంటున్నాడు.  కాటా వద్ద నిలబడి తూకం వేస్తున్న కోక్కానికి సంచి తగిలించి తగిలించక ముందే త్రాసు ముళ్ళు, నిలబడక  ముందే దింపేసి హస్తలాఘవం  ప్రదర్శిస్తున్నాడు. అధమము అంటే సంచికి దడెము కాయలు కొట్టేస్తున్నాడు. అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు ఆ మోసం అయినా ఎవరూ మాట్లాడలేరు. యుద్ధం వాడిదే యుద్ధ వ్యూహం వాడిదే,  యుద్ధ స్థలం నిర్ణయించేది వాడే అయినప్పుడు చేతులెత్తేయడం తప్ప ఓటమి  అంగీకరించడంతో తప్ప మరో మార్గం లేదు అంటాడు రచయిత. కానీ అసహాయులు ఎంతో కాలం మౌనంగా వుండరు. తమకు తోచిన పరిస్కారం వైపు కొత్త తరం అయినా  ఆలోచిస్తుంది అని సూచిస్తాడు రచయిత.

చేతులోపంట నిండుగా వుండి పట్నం మార్కెట్ కుపోయి  అమ్మబోతే ఆడివే. ఆ కష్టాలను సడ్లపల్లి చిదంబరరెడ్డి ‘అడవి’ కథలో చూపాడు. రేశం పుల్లలు నాటుకుంటే పసిబిడ్డల లెక్కన సాకాల్సివస్తుందని కదిరప్ప చెరుకు నాటుకున్నాడు. అది నీళ్లుల్యాక ఎండిపాయ. మార్కెట్లో ముల్లంగి కేజీ నాలుగు రూపాయలు పలుకుతున్నది. కనీసం తీర్లమీద నాటుకున్న ముల్లంగి గెడ్డలన్నా అమ్ముదామని హిందుపురం మార్కెట్ కు పోదామంటే ప్రతిఒక్కడూ మోసంజేసేటోడే. లారీకి 50 రూపాయలుగుంజి మళ్లీ దించేటప్పుడు చేతికి అందినన్ని గెడ్డలు క్లినరు జౌరుక పాయ, మోసినా మోయకపోయినా మార్కెట్ మేస్త్రిలకు కూలి ఇయ్యాలంటే కడుపులో సంగటం పొంగుకొస్తుంది. నూరుకేజీల గడ్డలకు కేజీ రెండు రూపాయల లెక్క అమ్ముకున్నా కనీసం 200 వొస్తుందని ఆశపడితే కొనేవాడే రాలేదు. ఒకతల్లి లాటు మొత్తం 30కి అడుగుతుంది. ఉదారం చూపినట్టు చూసిన  ఉడిపిహోటలు అయ్యవారు మొత్తం గెడ్డలేసుకోని, చేసిన టిఫిన్ డబ్బులుపోను ఇరవై రూపాయలు చేతిలో పెట్టినాడు. పల్లెనుంచి ముల్లంగి తెచ్చి అమ్మినదానికి రైతు ఎదురుఖర్చు 20 రూపాయలు. నష్టానికి అమ్ముకునే యీయాపారం దేశంలో రైతుమాత్రమే చేస్తున్నాడు.

రైతు ప్రధాన సమస్యలుగా మనం గుర్తించేవి

1.వ్యవసాయ పెట్టుబడి పెరగడం  2. పెట్టిన పెట్టుబడి, శ్రమకు అనుగుణంగా  గిట్టుబాటుధర లేకపోవడం.

ఆశ్చర్యంగా కొనేవాడి దగ్గరికి వచ్చేసరికి  అదే సరుకుకు తగినంత లభ్యత వుండదు, లేదా  వినియోగదారుడి కొనుగోలుశక్తికి మించిన ధర అయినా ఉంటున్నది. (వరి,గోధుమ వంటి ఆహార ధాన్యాలు దీనికి ఉదాహరణ) పోనీ వ్యవసాయ ఉత్పత్తిలో పెరుగుదల లేదా? అంటే వుంది. మరి యెక్కడ అంతరం!  అటురైతు, ఇటు వినియోగదారుడు ఇద్దరూ నష్టపోతుంటే మరి లాభపడిందేవరు  ? దళారీ, మధ్యవర్తి, కమీషన్ ఏజెంట్… యీ వ్యతిరేకతను వాడుకొని కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయచట్టాలను తెచ్చింది. తెలుగు రాష్ట్రాలలో ప్రభావ వంతమైన ఉద్యమం రాకపోవడంతో మనకు యీ చట్టాల లొసుగులు పెద్దగా తెలియరాలేదు కాబట్టి కొద్ది వివరాలు చూద్దాం.

రైతుపండించిన పంట వాడకందారుకు చేరే దారి ఒక పెద్ద గొలుసు.ఈ వ్యాపార ఉత్పత్తుల గొలుసు సాలీనా  20 లక్షల కోట్లు. ఇంతపెద్ద వ్యాపారాన్ని తమ అధీనంలోకి తెచ్చుకోవాలని బహుళజాతి సంస్థలు, విదేశీ వ్యవసాయ వ్యాపార కంపెనీలు కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నాయి. విస్తారమైన ఈ లాభసాటి వ్యాపారం లోకి చొచ్చు కుపోవటానికి అడ్డంకి ప్రాంతీయ కమీషన్ ఏజెంట్లు. వీళ్ళను అడ్డుతొలగించటం యిప్పుడు మన ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన పని. ప్రపంచవాణిజ్య సంస్థ కొన్ని దశాబ్దాలుగా విత్తనాలు, ఎరువుల, క్రిమిసంహారకమందులపై సబ్సిడీ నిలిపివేయమని కోరుతున్నది.  నీరు, విద్యుత్తుపై సబ్సిడీలు ఎత్తివేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ శక్తులకు దేశీయ వ్యవసాయ మార్కెట్లో అన్ని సౌకర్యాలు, వెసులుబాట్లు కల్పించమని ప్రభుత్వాలపై ఒత్తిడి పెడుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేగవంతమయిన సరళీకరణ ప్రక్రియ పారిశ్రామిక , సేవా రంగాలలో వచ్చినంత దూకుడుగా  వ్యవసాయరంగం లో రాలేకపోయింది. సంప్రదాయ వ్యవసాయాన్ని మార్చకుండా సరళీకరణ సాధ్యం కాదు కాబట్టి బి.జె.పి. ప్రభుత్వం ఒకదేశం-ఒకచట్టం, ఒక దేశం-ఒకజాతి’ లాగా ‘ఒకదేశం-ఒకమార్కెట్’  నినాదాన్ని ఎత్తుకొని మూడు వ్యవసాయచట్టాలు తెచ్చింది.

మనది వైవిధ్యం వున్న దేశం. భౌగోళిక వైవిద్యంతో పాటు భిన్న వాతావరణ క్షేత్రాలు,భిన్న సాగునీటి సౌకర్యాలు, భిన్న పంటల పధ్ధతి, భిన్నమైన ఆహార సంప్రదాయాలు వున్నాయి. ఒక్క వరిలోనే 6000 రకాల వంగడాలు మనదేశంలో వుండేవి.దేశమంతా ఒక మార్కెట్ అంటే ఈ అన్ని వైవిధ్యాలను నాశనం చేయడమే. అదే జరిగితే మానవ మనుగడ కూడా ఉండదు.

యిప్పుడు నేను రైతుచట్టాల గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే అవి తాత్కాలికంగా వెనక్కు తీసుకోబడ్డా మళ్లీ దొడ్డిదారిన రావటానికి సిద్దంగా వున్నాయి.వాటి అమలుకు అవసరమైన పునాదిని ప్రభుత్వాలు ఇప్పటికే ఇక్కడ తయారుచేసి వుంచాయని, ఇప్పటికే ఆ చట్టాలు పాక్షికంగా అమలులో వున్నాయని ఉమామహేశ్వర్ ‘ఫోర్స్ మేజుర్’ కథలో చెప్పాడు.

పంపన గౌడ తండ్రి విరూపాక్షగౌడ  సహకార సంఘానికి కార్యదర్శి. తన చాకచక్యంతో , ప్రెసిడెంట్, అధికారులకు అణకువగా వుంటూ రెండెకరాల కాలవ భూమి, పదెకరాల మెట్టని రెండింతలు చేశాడు. బినామీ పేర్లతో లోన్లు తీసుకోవడం, కేవలం వడ్డీ మాత్రమే కడుతూ, మళ్ళీ మళ్ళీ అవే అప్పులు, అవే మనుషులకు తిరగరాస్తూ ఎప్పుడో ప్రభుత్వాలకు దయతలచి ఋణ మాఫీఅంటే, ఆ నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాడు.

అధికారులకు భయపడుతూ, చాకిరీచేస్తూ, నిందలుమో స్తూ బతకడం కొడుకు పంపన గౌడకు నచ్చక దళారి వ్యాపారం లోకి దిగాడు. మొదట క్రిమిసంహారక మందు లు, ఎరువుల అంగడి తెరిచాడు. ప్రైవేటురంగంలో ఎరువుల, మందుల తయారీదారుల మధ్య , పంపిణీ దారుల మధ్యపోటీ అతనికి వరమైంది. వాళ్ళే ఊరికొచ్చి సరుకు దింపి, మిగిలినవి వెనక్కితీసుకుని, అమ్మిన వాటికి డబ్బులు తీసుకునే సౌకర్యం వచ్చింది. రెండేళ్లలో విత్తనాల వ్యాపారులూ రంగంలో దిగారు. పంపనగౌడ దుకాణానికి వెనుక గోడౌన్ కూడా వెలిసింది. వ్యాపారం జోరుగానే సాగేది. అమ్మకాలు జరిగినంత వేగంగా చెల్లింపులు ఉండేవి కావు.  కారణం అందరూ అప్పు పెట్టేవాళ్ళే. యికతానే పంట పెట్టుబడికి కూడా అప్పియ్యడం మొదలుపెట్టాడు. పంట చేతికొచ్చాక తను చెప్పిన వ్యాపారికే సరుకు అమ్మటం, ఆ వ్యాపారి ఆన్లైన్లో తనకి డబ్బు  ట్రాన్స్ఫర్ చేస్తే, అందులో వడ్డీతో సహా తన పెట్టుబడి మొత్తాన్ని తీసేసుకుని మిగిలిన పదో, పరకో రైతు చేతిలో పెట్టడం అలవాటు చేసుకున్నాడు. అప్పటి నుండీ జీవితం సుఖంగానే ఉంది. పదేళ్ళు గడిచాయి. పంపనగౌడ కొడుకుతరం దళారీగా  రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉంది.

నూతన వ్యవసాయ చట్టాలఫలితంగా కార్పొరేట్ వ్యవసాయం అమలుకొచ్చింది. వ్యవసాయ రంగంలో  పెను మార్పులు జరిగాయి. విదేశీ కంపెనీలు, దేశీ పారి శ్రామికవేత్తలతో కలిసి వ్యవసాయ రంగఆధునీకరణ కోసం ‘అగ్రికల్చర్ స్పెషల్ పర్పస్ వెహికల్’ ప్రాజెక్టులు రూపొందించాయి. రాష్ట్రాన్ని కొన్ని ఏరియాలుగా, భూముల రకాన్ని, సారాన్ని బట్టి జోన్లుగా విడగొట్టారు. ఊర్లలోని వ్యవసాయ భూములను లాండ్ క్లస్టర్లుగా చేశారు. స్థానిక పెట్టు బడిదారులను భాగస్వాములను చేసుకొని  భారీస్థాయి గిడ్డంగులు నిర్మించారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వ మార్కెట్ యార్డుల కంటే ఎక్కువ ధరకు కొని రెండు మూడేళ్లలో వాటిని నిర్వీర్యం చేసి గుత్తాధిపత్యాన్ని సాధించారు.

వ్యవసాయ యంత్రాలు మొదలుకుని, ద్రోణ్ ల వినియో గం వరకూ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నుండి డేటా అనల టిక్స్ వరకూ అన్నిటెక్నాలజీలను వినియోగించుకున్నారు. అన్ని రంగాలను సంఘటితపరచి అనేక యాప్స్ తయారు చేశారు. ఏ సమాచారమైన సెకన్ల వ్యవధిలో అందుబాటు లోకి వచ్చేలా వెబ్ సైటులను ఏర్పరచి స్టాకు వివరాలు, డిమాండ్ వివరాలు,రవాణా వివరాలు అన్ని లైవ్ గా అప్డేట్ అయ్యేలా చూశారు.ఈ మార్పులు జరుగుతున్న తొలినాళ్ళలో .. పాత తరం దళారి వర్గం కంగారు పడింది. వీళ్ళతో చేరితే తామూ నాశనం అవుతామని పంపనగౌడ కొడుకులు గ్రహించారు. బహుళజాతి పెట్టుబడిదారుడితో పోటీకి  నిలబడటంకంటే రాజీ పడటమే మేలనే ఎరుక వాళ్లకు ఉంది.శ్రీధర్ గౌడ సింగపూర్ మిత్రుడిని ఊరికి రప్పించి అధునాతన వ్యవసాయం, మార్కెట్ అవసరాలు, కంపెనీ వివరాలుచెప్పించి  భూములసాగుకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్లు చేయించాడు. ఇద్దరూ కలిసి కార్పొరేట్ వ్యవసాయం ప్రారంభించారు. రైతులంతా తమ పొలాలలో తామే కూలీలై , ఉమ్మడి పొలానికి పాక్షిక యజమానులై రావల సిన డబ్బులు సకాలంలో వస్తుంటే  సంబరపడ్డారు. పంపన గౌడ కంటే చిన్నగౌడ  మంచోడన్నారు. మొదటి మూడు నాలుగేళ్ళు ఇక్కడి పంటలే వేసి మంచిరేటుకే అమ్మి ఎవరికివ్వాల్సిన డబ్బులు వాళ్లకిచ్చారు. అందరూ సంతోషపడ్డారు.  ఇంకా లాభాలు రావాలని  ఆస్ట్రేలియా దుంపలు, స్పెషల్ ఉల్లిగడ్డ వేశారు. పంటకాలానికి ఈ ఉల్లి ద్వారా ఊపిరితిత్తుల వ్యాధి వస్తోందని ఆస్ట్రేలియాలో పుకారు పుట్టింది.  నిజమో, కాదో తేలుస్తామన్న  పరిశోధనా సంస్థలు పంట కాలం ముగిసినా పరిశోధనలో ఏమీ తేల్చలేదు. రైతు భూములకు బాడుగా ఇవ్వలేదు. అడిగితే “పంట కోసి అమ్మితే కదా ఇచ్చేది. పంట మొత్తం పొలంలోనే వొదిలేశాం” కాబట్టి రాదన్నారు. రైతులు కోర్టుకు పోదామంటే అగ్రిమెంట్లు, చట్టాలప్రకారం యిది కోర్టు పరిధిలోకి రాదని  కలెక్టర్ కు అర్జీ మాత్రంపెట్టుకో వచ్చన్నారు. కలిస్తే ఆయనా రైతులపక్క మాట్లాడలేదు.

 “ప్రకృతి వైపరీత్యాలు గానీ, అనూహ్యమైన వాతావరణం గానీ, దేశంలో అత్యవసరపరిస్థితి గానీ, లేదా తుఫాన్, వరదలు, కరువు, కరోనా లాంటివి సంభవించినప్పుడు ఈ అగ్రిమెంట్ చెల్లదు దీన్ని ఫోర్స్ మేజూర్ అంటారు”. ప్రాంతీయ దళారీలు,  బ్యూరాక్రాట్లు చాలా సహజంగా బహుళజాతి కంపెనీల సేవకులుగా భవిష్యత్తులోఎలా మార్పు చెందగలడో అంచనా వేసిందీ కథ.

ఈ కథ  వెలుగులో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించ డానికి మనకున్న అభ్యంతరాలు ఇవి.

1.ఈ చట్టాల్లో  గిట్టుబాటు ధరలకు సంబంధించి నిర్దిష్ట మైన హామీ లేదు. గతంలో స్వామినాథన్ కమిటీ  చేసిన  “రైతు పెట్టిన పెట్టిబడికి 50 శాతం కలిపి ప్రభుత్వమే గిట్టుబాటు ధర నిర్ణయించాలి” సూచనను ప్రభుత్వం పట్టించుకోలేదు. అంటే పూర్తిగా నిర్ణయాధికారం బహుళ జాతి సంస్థ చేతుల్లోపెట్టి ప్రభుత్వం కేవలం ప్రేక్షకుడి పాత్రకు దిగజారిపోయింది. పట్టణభూముల విషయంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు , పెట్రోలు, కమ్యూనికేషన్స్ విషయంలో రిలయన్స్ కంపెనీలు ప్రభుత్వం చేతుల్లోంచి ఆయా రంగాలను పూర్తిగా తమ చేతుల్లోకి లాక్కోవడాన్ని మనం చూశాం.

2.వ్యవసాయ సేవల్లో రైతుకు సాధికారత, పరిరక్షణ లేదు.

3. వ్యవసాయ ఉత్పత్తుల ప్రోత్సాహం, సౌలభ్యత లేవు.

4. రైతుకు బహుళజాతి సంస్థకు వచ్చే వైరుధ్యాలను, వివాదాలను కలెక్టర్ వంటి జిల్లా అధికారి పరిష్కరిస్తాడు. కొన్ని క్లాజులలో న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కుకూడా రైతుకులేదు. కలెక్టర్ వంటి ఒకజిల్లా అధికారి పేద రైతుపక్షం వహించి బహుళజాతి సంస్థతో కయ్యానికి దిగుతాడని అనుకోలేము.

5. గతంలో వ్యాపారి నిలువచేసుకునే వ్యవసాయ ఉత్ప త్తులపైన నియంత్రణ వుండేది. ఈ ఆహార భద్రతా చట్టం వల్ల ఆహార కృత్రిమ కొరత యెంతో కొంత అరికట్టబడేది. కొత్తచట్టాల్లో యీ నిలువ గరిష్ఠ పరిమితిని ఎత్తేశారు కాబట్టి  వ్యాపారి ఎంత సరుకునైనా దాచుకోవచ్చు. అంటే ఇకనుంచి కృత్రిమ ఆహారధాన్యాల  కొరత, కృత్రిమ ధరల పెంపు, చీకటి బజారు వంటి అవలక్షణాలన్నీ చట్ట బద్ధమౌతాయి.

2

రచయిత ఒక కుటుంబంలోని వాడు. ఒక కులం, ఒక ప్రాంతంవాడు కూడా. తనచుట్టూ వున్న నిర్దిష్టతల లోంచే వస్తువును వెతుక్కుంటాడు.స్వీయ చైతన్యంతో ఆ వస్తువును ప్రభావితం చేస్తున్న కారణాలను విశ్లేషించుకుంటాడు. ప్రాంతీయంగానూ ఇంకొంచెం ముందుకువెళ్లి దేశ స్థలకాలాల్లో దాని ప్రత్యేకతలనూ గుర్తిస్తాడు. అందువల్ల రైతుసమస్యలకు నిర్దిష్టత ఉంటుంది, సర్వజనీనతా ఉంటుంది. ఆయా ప్రాంతాల భౌగోళిక, వాతావరణ స్థితులను బట్టి సమస్యల కోణం కూడా మారవచ్చు.  యిది రాయలసీమలో అయితే  నీటిలేమి, ప్రాంతాల మధ్య  అసమాన నీటి పంపిణీ,  అసమాన అభివృద్ధి, రైతుకు-గ్రామంలోని ఇతర వృత్తి కులాలకు మధ్య సంబంధం, రైతుకు-నేలకు, రైతుకు-వ్యవసాయ పనిముట్లకు, రైతుకు-పెంచుకునే పశువులకు, రైతుకు-అప్పులిచ్చిన బ్యాంకులకు…. రైతుకు ఫ్యాక్షన్ కు…… యిలా నిర్దిష్టతలోంచి, ప్రాంతీయత లోంచి  దేశంలోని సరళీకరణ  విధానాల దుష్ఫలితాల వరకు అన్నింటినీ మన సీమరచయితలు అర్థం చేసుకున్నారు కనుకనే కథల్లో ఎంతో వైవిధ్యం కనిపించింది. వారికి  నా హృదయ పూర్వక అభినందనలు.         

‘రాయలసీమ రైతుకథలు’ అనగానే ఏముంటుంది లేప్పా! “అదే కరువుగురించి రాస్తారు. నీళ్లు లేనిది, నిడుసులు లేనిది, చీనీ చెట్లు నరికిండేది ” అనుకునే వాళ్ళకు యీ కథల వస్తువైవిధ్యం అబ్బురపరుస్తుంది.కోటకొండ మనోహర్ ‘కురువోని బండ’ కథ రైతులు ఊరుమ్మడిగా వాడుకునే ఆస్తులపై అగ్రవర్ణ భూస్వాముల కన్ను ఎలా పడుతుందో,దాన్ని అక్రమించడానికి వాళ్ళుఏ సొడ్డు పెట్టుకొని వస్తారో  సహజంగా చిత్రించింది.

బండ గంగన్నపొలంలో ఉంది కానీ అది ఊర్లో ప్రతి ఒక్కరి సొత్తూ.   మాసూళ్ళ కాలంలో గంగన్న కో మాట చెప్పి  ఒక ఇంటి తర్వాత ఒకరు అక్కడ  వాములు వేసుకొని , కాయలు వొలుచుకునే వారు, వడ్లు విడుదల కుట్టుకునే వారు, కందులకు ఎర్రమట్టి పూసి ఎండ పెట్టుకునేవారు. ఎండినాక బ్యాడలను  విసురుకునేవారు. ముసలోళ్ళు చలికాలంలో బండమీద ఒళ్ళు కాచుకుంటే, పసిపిల్లలు వానాకాలంలో  బండపైన నీరు జారే వాలులో జారుబండ ఆడుకునేవారు.  గురువుదేవర్లు చేసుకుంటే ఊరు ఊరంతా అక్కడే పొట్టేళ్లు కోసుకుని  కుప్పలు పంచుకుని, కూరొండుకుని కలిసి తినేవారు. అంతమందిని బండపై చూసిన గంగన్నకు ఆరోజు   తినకపోయినా కడుపు నిండిపోయేది. బండ  అంటారు గానీ అది గంగన్న గుండె. అట్లాటి బండపైన కొండ్రెడ్డి కన్నుబడింది. గంగన్న కూతురు పది పన్నెండేండ్ల చిన్నమ్మి మీదకూడా. రెడ్డికాడ అప్పుతీసుకున్న ఊరొళ్లు ఎవురూ ఎదురుచెప్పలేకపో యిరిగానీ ఏటా పండగకాలంలో వచ్చే టైలర్ మాబ్బాష గంగన్న పక్కనిలబడె. అయినా లాభంల్యా! గంగన్న బండ రాసిచ్చి ఊరిడిసె. ఎల్లకాలం వాళ్లదే రాజ్యం కాదుకదా! మాటుసూసుకొని ఏటేస్తే కొండ్రెడ్డికి నడుము లిరిగి సచ్చె. చిన్నమ్మి పెండ్లి మామ మాబ్బాష ఇచ్చిన తాళిబొట్టుతో ఘనంగా జరిగింది. బి.సి.లు,  మైనారిటీ ల మధ్య పల్లెల్లో వున్న సఖ్యతను ఎత్తి పట్టింది యీ కథ.

కరువు ప్రస్తావన రాకుండా మా సేద్యాన్ని,కురవకుండా మోసం చేసే  పై పై మోడాలను తిట్టకుండా మా వూళ్లను ఎప్పటికీ చెప్పలేము. కాబట్టే ప్రతీ కథలో కరువు అనివార్యంగా భాగమైంది. పల్లె నొదల్లేక చితికి పోయిన బతుకుల కథ కుమారస్వామి ‘మట్టిపెళ్ల వాసన’. పల్లెనొదిలి పట్నంకు వలసపోయిన సంధ్య జ్ఞాపకాలలో తండ్రి మరణంతో ముడిపడిన ఆనాటి కరువు కథావస్తు వు. ప్రకృతి శాపమా? మనుషుల చేతలఫలితమా?

పౌరోహితం మారుతి ‘తమ్మలోళ్ళు’ కథ బి సి కులానికి చెందిన తమ్మలోళ్ల వేంకటేశు సేద్యం . ఆయన గొంతుల లింగం ఏసుకొని ఆంజనేయ సామి(మా వూరి పక్క గిడ్డయ్య ) గుడిల బాపనయ్య సేయ్యికింద ఉంటాడు. పూజసేపిచ్చినోల్లు రూపాయో రెండ్రుపాయలో ఇస్తే తీసుకుంటాడు, దేవుని మాన్యం సాగు సేసుకొంటాడు. గుడిల డోలు కూడా వాయిస్తాడు. “ఇట్లా సంతోసంగా ఉన్న వూర్ల సిన్నగా దుక్కం మొదులాయ. తుంగబద్ర డ్యాంల పూడు పేరుకొని నీళ్ళు తగ్గే. కొంత మంది గుంటూరోల్లు కర్నాటకలో బూములు గుత్తకు తీసుకొని పెద్ద కాలవకి గాలి పైపులు ఏసి నీళ్ళు దొంగులు కుంటుండారు దానికే మనకి నీళ్ళు వొస్తలేవు  అనబట్టిరి. ఎప్పుడైతే నీళ్ళు బందు ఆయనో కరువు మొదలాయ. దరిద్రం సుట్టుకోని ఒక్కొక్కరు ఉరిడిసే కాడికొచ్చే. అయినా తమ్మోళ్ల వేంకటేశు వూరిడ్సలా ” అందరూ ఊరిడిస్తే గిడ్డయ్య సామి ఎట్లా? సేద్యం ఎట్లా ? ఎవురో ఒగరుండల్ల” అనె. అఖిరికి తన పెండ్లాం తో సహా కుటుంబంమొత్తం వూరిడిసినా తాను ఇడిసిపెట్టల్యా. పొలానికీ,  వూరికీ, రైతుకుఉన్న  సంబంధాన్ని హత్తుకు నేలా చెప్పినకథ యిది. ఉరిడిసి పెట్టిన వెంకటేసు సంసారం మళ్లీ వూరు జేరడంతో కథ ముగిసింది. సీమకరువు ప్రభుత్వాల  విధాన వైఫల్యాల ఫలితమని రుజువు చెప్పింది.

ప్రగతి రాసిన  ‘నేనూ రైతునే’ కథ కరువు నేపథ్యంలో సాగే సీమవ్యవసాయం. కూలీలను మాట్లాడి పీకించే లోపలే ఉల్లిగడ్డ రేటు భారీగా పడిపోయి, కూలీల ఖర్చులు కూడా రాని స్థితిలో ఉల్లిగడ్డలు పొలంలోనే కుళ్లిపోయాయి. అదేం విచిత్రమో పంటంతా అయిపోయి, చేను నున్నగయినంక ఉల్లిగడ్డ కేజీ నూర్రూపాయలు.. బోర్లో నీళ్లున్నాయని మళ్ళా ఏడాది ఆశ. మనిషి కదా, అందునా రైతు, ఈ ఏడాది చనిక్కాయతో అప్పుల నుంచి బయట పడదామనుకుంటే అదునులో వానపడి పంట బాగానే ఎదిగింది కానీ లద్దె పురుగు పట్టింది. సేద్యమంటే జూదమో,లాటరీనో అనుకునేంతగా మారిపోయి చాలకాలమైంది. ఓడిపోయిన రైతు ఆదే పురుగుమందు తాగి చనిపోతే  ఏవో కారణాలు చూపిన ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో (1988లో) ఒకప్పుడు పత్తి వంటి వ్యాపారపంటలకు మాత్రమే పరిమితమైన రైతు ఆత్మహత్యలు మరో 30 ఏళ్లలో ఆహారపంటలకూ విస్తరించడం వ్యవసాయంలోని సంక్షోభ తీవ్రతను సూచిస్తుంది.

ప్రభుత్వం అందించే రుణాలు, నష్టపరిహారాలు మహిళల కు దక్కవు. ఎందుకంటే పొలం వాళ్ళ పేరుమీద ఉండదు. భర్తతోపాటు ఆరుగాలం సేద్యంలో భాగమైన హనుమక్క వంటి మహిళలకు అందకపోవడం వ్యవస్థ లోని వివక్షకు నిదర్శనం. భర్తచనిపోయాక పట్టాదారు పాసు పుస్తకం కూడా భార్యకు కాకుండా కొడుకులకు అందటం మరో విషాదం. మనం పనిగట్టుకుని మరచి పోయే, నిర్లక్ష్యం వహించే స్త్రీ కోణం నుంచి వీపు చెళ్లు మనిపించినకథ.

“మాఁ… ఎమ్మార్వో ఆఫీసులో పట్టా పాసుబుక్కు నా పేరు మింద మార్చుకునేకి పోవల్లంట.”

“అట్లనేలేరా!” నిమిషమాగి, “వొద్దులేరా!” అంటున్న తల్లిని ఆశ్చర్యంగా చూశాడు వెంకటేశు.

“నీపేరు మీదొద్దులేరా, నా పేరు మింద రాపిస్తాం” వెంకటేశు ముఖంలో క్వశ్చన్ మార్కు మరింత పెద్దదయింది.

“అదేంది మా, నీపేరు ఎట్ల రాపిచ్చల్ల?”

“ఏం ఏంటికి రాపీగూడదు? నేను సేద్యం పన్లుజేస్తాండ్లేదా? సేన్లో పంజేసేకి మేంగావాల గానీ, పాసుబుక్కులోపేరెక్కిచ్చే కి తరుంగామా? నేనూ రైతునేరా, నా పేరు మిందేఉండనీ. నేను పొయినంక నువ్వూ, నీ సెల్లెలూ సగం సగం తీసుకుందురు.” హనుమక్క గొంతు స్థిరంగా పలికింది.  రైతు కథల్లో స్త్రీ కోణాన్ని బలంగా ఎత్తి చూపినకథ.

ఇటీవలి కాలంలో వ్యవసాయంలోకి కొత్త వర్గాల ప్రవేశా న్ని నిశితంగా గమనించింది సుభాషిణి కథ ‘తోట అమ్మకానికి లేదు’. ఎగువమధ్య తరగతి నుండి ఒక  కొత్త తరం రెండు రకాల ఆలోచనలతో వ్యవసాయంలోకి వస్తున్నది.  సాఫ్ట్వేర్ లో తగినంత సంపాదించుకున్న వర్గం మోనోటనస్ జీవితంతో  విసుగుచెంది ప్రశాంతజీవనం కోరుతున్నది. వీళ్ళు ఆర్గానిక్ ఉత్పత్తుల డిమాండును కూడా దృష్టిలో ఉంచుకొని పూర్తి వ్యాపార ఆలోచనతోనే ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి దిగుతున్నారు. ఈ రకం వ్యవసాయంలో నేల ఉత్పాదక నేలగానే వుంటూ ఉత్పత్తి కొనసాగుతుంది. ఆర్థికంగా బలహీనుడైన పేదరైతు స్ధానంలో కొంత ఆర్థిక పుష్టి వున్న చిన్న పెట్టుబడిదారుడు ప్రవేశిస్తున్నాడు. రెండో రకం ఇందుకు భిన్నం. వ్యవసాయం గురించి ఏమీ తెలియకపోయినా భవిష్యత్తుకు ఉపయోగపడే ఇన్వెస్ట్మెంట్ గా భూమిని ఫామ్ హౌసుల రూపంలో  కొనివుంచడం వీళ్ల పని.  వీళ్లకు నటులు శోభన్ బాబు, మురళీ మోహన్లుఆదర్శం.  రియల్ ఎస్టేట్ వీళ్ళ దీర్ఘ కాలప్రణాళిక. వ్యవసాయం ఇందులో ఎక్కువకాలం కొనసాగదు. కొంతకాలానికి అనుత్పదక నేలగా మారిపోతుంది. కష్టాల నుంచి గట్టెక్కడానికి పొలం అమ్ముదామనుకున్న రైతు ప్రతాప్ పునరాలోచన మాటలివి.

” ఎం పిల్లోల్లు ఈ కాలం పిల్లోల్లు! సిటిలల్లో పనిజేసు కుంటా పల్లెలల్లో భూములు కోనేస్తాన్నారు! ఒకర్ని జూసుకొని ఒగరు.. భూమి కొంటాము, కమీషన్ యిస్తామ ని. ఎంత ధైర్యంగా చెప్తారు!పెట్టుబడి ఎంతయినా పెడ్తాం… రెండేండ్లల్లో పెట్టిందంతా ఎనక్కు రావాలంట!  ఈ కరోనా కాలంలో జనాలందరు దుమ్ము నాక్కోని పోయింటే…వీళ్లకు మాత్రం మిగులుబాటు…డబ్బులు వుండాయనేనా వాళ్లు అట్ల ముందుకు వస్తాండేది? ల్యాకనేనా మేము వదిలిచ్చుకోవాలనుకుంటాండేది. కలిసి ఎవసాయం చేపిస్తారంట! ఈడేమో కలిసి చేసుకోకుండా కోట్లాడుకొని యిడి పోయ్యేది, చేసుకోలేక సచ్చేది. చ్యాతకాక అమ్ముకునేది. అమ్ముకుంటే ఆయింత లెక్కలు నిమిషాల్లో అయిపోతాయి. అ తర్వాత  వాళ్ళకాన్నే కూలికి పోవడ్తాది. ఎంతతిక్కనాకోడుకులం… తలకా యలు పూర్తిగా చెడిపోయేట్టు వుండాయి …వాళ్లు చేయాంగాలేనిది, ఈన్నేపుట్టి ఈన్నే పెరిగిండేటోళ్లం మా చ్యాత కాదా?”

రైతుగా తమ బతుకు ఎదుగుదల లేకపోవడానికి, నిరంతర కష్టాలకు కారణం మరేదో అతీత శక్తి అనుకునే అమాయక రైతుకుటుంబాలను మోసం చెయ్యడానికి కొత్తగాతయారైన దొంగ స్వాముల  బండారం బైటేసిన కథ శేషగిరి రాయుడు ‘మూలిగేనక్కపై….’  మల్లయ్య యెండిన యాపమ్యాను అరుగుమిందకుసోని రేపటి పొద్దెట్లరా భగవంతా! అని అంగలారుత్తా…  ఇంట్లో పెండ్లి కెదిగిండే కూతురు, పట్నం ప్రైవేటుస్కూల్లో సదువుతాండే కొడుకు ఫీజు గుర్తొచ్చి… అగమ్యంగా కనిపించింది. ” అట్లా కూకుని సింత సేత్తాంటే అగసాట్లు అవంతకవే పోతాయా యేంది. ఆ తెప్పలయ్య సూడు మనకాటికి కట్టాల్లో వుండేటోడు. ఇప్పుడు మంచి మిద్దేసుకొని దిమ్మిరంగా ఉండాడు. ఏమో యాపుట్టలో యాపాముండాదో  వూర్కొనే కుసోకపోతే ఓపాలి పొయ్యి ఆ పక్కూర్లో మంచి సామున్నాడంట కలిసిరాగుడదా యెవురదురుట్టం ఎవురు సెప్పొచ్చినారు”పెండ్లాం అంది. మనసులో యా మూలనో దూరాశ మిణుకు మిణుకు మంటాంటే మల్లయ్య పోయినాడు. 30వేలు ఖర్చు చెప్పి చిన్నస్వామి 20 వేలకు తగ్గించి పూజ ఖరారు చేసినారు.  పొలంలోని రాతియుగం నాటి సమాధులను దిబ్బలుగా చూపించి వాటిలో వున్న కుండలను, ఎముకలను అరిష్టంగా చెప్పి  దోచుకున్నారు యీ  కొత్త స్వాములు.

ఇటీవలి అమరావతి ‘రైతు ఉద్యమం’ మన పాత అనుభవాలను మళ్లీ కొత్తగా ముందుకుతెచ్చింది.

60 ఏళ్లకింద ప్రధానంగా కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల ప్రజలు దేశప్రయోజనాల కోసం,  శ్రీశైలం ప్రాజెక్టు కోసం తమ నాణ్యమైన సాగు భూములు ఇచ్చి అగుడుబట్టి పోయినారు.( శ్రీశైలం ప్రాజెక్టుముంపుతో చితికిపోయిన జీవితాల గురించి  గతంలో  శ్రీనివాసమూ ర్తి, వెంకటకృష్ణ, హరికిషన్ ల కథలు వచ్చివున్నాయి). ఇది ఎవ్వరికీ త్యాగం అనిపించదు. ఇప్పుడు రాజధానికి ఇచ్చిన భూములు మాత్రమే మహాత్యాగంగా పత్రికలూ, నాయకులూ కమ్మబలుకుతున్నారు. నేను భూములు నష్టపోయిన పేదలను కించపరచడం లేదు. దీని వెనుకజరిగిన భారీ కుట్రలను, వ్యాపారాన్ని, మోసాన్ని  నిరసిస్తున్నాను.

ప్రాజెక్టులు కట్టిన ప్రతీచోటా నిర్వాసితుల సమస్య వెనువెంటనే వుంటుంది. ప్రభుత్వాలకుభూమి యిచ్చిన వారిపట్ల కనీస గౌరవం లేకపోవటం, భూసేకరణ చేసే యంత్రాంగం వారిని బిక్షగాళ్ల కన్నా హీనంగా చూడటం మనసును కోతపెడుతుంది. సుంకోజు దేవేంద్రాచారి  అంటువంటి వస్తువునే ‘నీటి చిలువ’ కథగా రాసాడు.

26 టి.ఎమ్.సి ల రిజర్వాయర్. 22 గ్రామాల ముంపువున్నా లక్షలఎకరాలు సాగులోకి వస్తాయన్న ఆశతో రైతులు  త్యాగానికి సిద్ధపడ్డారు. సాగుభూమికి ఎకరాకు 1.25లక్షలు, డి.కె. టి భూములకు 75 వేలు, ఇంటికి 1.86 లక్షల పరిహారమన్నారు.

అటువంటి ఒక వూర్లో… జలాశయం తమ జీవితాలను నిలువునా ముంచేసినందుకు ఆగ్రహ, అసహాయ, ఉన్మాద స్థితిలో ఉన్న ప్రజలు. 3టి.ఎమ్. సి ల నుంచి 12 టి.ఎం. సి లు నింపడానికి రెండేళ్లు పట్టింది. రిజర్వాయర్ అయ్యేదికాదులే అనుకోని వూరు ఖాళీ చేయలేదు రైతులు. కులాల వారీ కాలనీలుగా వూరు చీలివుంది. మొదట్లో అందరూ కలిసికట్టుగా ఉద్యమంలో వున్నా మంత్రి వచ్చి మాట్లాడినాక ముందు మునిగేది యెస్.సి,యెస్.టి కాలనీలే కదా అని బి.సి.లు, ఇవన్నీ అయిపోయినాక గానీ మనకాడికి రావని రెడ్లు నిర్లక్ష్యంగా వున్నారు. ఒక్కొక్కరూ రోడ్డెక్కడం మానుకున్నారు. అధికారులు దీన్ని ఆసరా తీసుకుని ప్రొక్లెయినర్లతో ఇల్లు పడగొట్టడం మొదలు పెట్టారు. వందల ఇల్లు ఖాళీ అవుతున్నాయి. మొత్తం 23 టి.ఎం. సి లు నింపడానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అగ్రవర్ణాల ఇండ్లు మునిగే పరిస్థితి వచ్చింది. పాములు పట్టే దాంట్లో కృష్ణకు నైపుణ్యముంది. వూరివాళ్ళు ఎవరూ తొడురాకపోయినా భార్య తోడుగా ఎన్నోపాములను పట్టి అడవిలో వదిలా డు. “కృష్ణా! మా ఇంట్లోకి కొండచిలువ వచ్చిందప్పా! పట్టడానికి రావాల” అంటే “అన్నా! పాము అయితే నేనొకన్నీ పట్టగలను అది కొండచిలువ! ఇంటికొకరు తమర కట్టె పట్టుకొని రావాల” అంటూ రిజర్వాయర్ ఊరిని మింగకుండా ఆపాలన్నా, తగినన్యాయం కావాలన్నా కల్సి పోరాడాల్సిందేనని చెప్పిన కథ.

వ్యవసాయంలో వచ్చిన సంక్షోభం వలసకు దారితీస్తుంది. వూరివలసనే కాదు. అనివార్యంగా వృత్తి వలసకూడా.  పల్లె రైతు పట్టణానికి కూలీగానో, ఎ.టి.ఎం కాపలాదారు గానో, అపార్ట్మెంట్ వాచ్ మెన్లు గానో పోతున్నారు.

వూరి వలసలు కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలనుంచి భారీగా వుంటాయి. (కర్నూలు జిల్లాలో సుగ్గి అంటారు)

 ఈ వలస జీవితం ఎట్లా ఉంటుందో  తెలుసుకోవాలంటే కెంగారమోహన్ ‘వానమెతుకులు’ చదవాలి. కర్నూలు పశ్చిమ ప్రాంతం నుంచి వలసలు(సుగ్గి) చాలా సాధార ణం. బొంబాయికి చేపల పనికిపోతే మురికికాలువ పక్కన కొట్టాలు యేసుకొని వుండల్ల. వాసనకు అన్నం గూడాతిన బుద్దికాదు. వలసకు పోయిన మగపిల్లలైతే ఎయిడ్సు తెచ్చుకొని సచ్చిపోయిరి. ఇప్పుడది మానుకొని కుటుంబా లు మొత్తం  గుంటూరు పక్క మిరపకాయ కోయడానికి పోతున్నారు. సంసారం మొత్తం సుగ్గిపోతే ఎదిగిన ఆడపిల్లను యాడవుంచల్ల? బాగచదువుకునే పదోతరగతి పిల్లనైనా సరే సుగ్గికి తీసుకుపోవాల్సిందే. వలసలో బాల్యం ఎంతగా ధ్వంసం అయిపోతున్నదో గమనించారా!

ఇప్పటి పల్లెలు రచయితల వూహల్లోని గ్రామసీమల్లాగా లేవు . పట్టణ జీవితాల్లో వచ్చినట్టుగానే అన్ని మార్పులు అక్కడా వచ్చాయి. మధ్యతరగతి లాగానే యీజీ మనీ పట్ల వ్యామోహం వచ్చింది. పనికి ఆహార పధకం వచ్చాక పొలాల్లో నిఖార్సయిన కష్టం చేయడానికి కూలీలు ఆసక్తి చూపడం లేదు. పైగా పొలం వరకు ఆటోఖర్చు కూడా రైతుదే. కొన్నిచోట్ల ఆటోవాళ్లే కూలీ కమీషన్ ఏజెంట్లుగా వుంటే, కొన్నిచోట్ల వాళ్ళు యే పొలానికిపోవాలో శాసించే మాఫియాగా మారారు కూడా. యీ కోణంలో హనుమంతు వంటి సన్న రైతుల స్థితి మరింత జటిలం అయ్యింది. దీనికితోడు వూరి రాజకీయాలు. నీరున్న తుంగభద్ర గ్రామాల్లో దొంగతనంగా నీళ్లు పెట్టుకున్నారని

కాలువోళ్లు(సూపరువైజర్లు) చిన్నరైతుల పొలాల్లోబడి పైపులు పగలగొడ్తారు గానీ పలుకుబడిఉన్న గౌడువంటి

వాళ్లను ఏమీ అనరు.

పలమనేరు బాలాజీ కథ లోని “ఉడుకోడు”  ఏరుకల రామచంద్రుడు. తనకులం వాళ్ళు చదువుకోవాలనీ, అభివృద్ధి చెందాలని నిరంతరం తపనపడ్డ డెబ్భై ఏళ్ల యువకుడు. ఆయన మరణంతో కథ మొదలౌతుంది.

కథ కొనసాగుతూ అతని జీవితం లోని ఒక్కో పొరనూ విప్పుతూపోయి చివరలో  అతని ఔన్నత్యాన్ని ఆవిష్కరించిన గొప్ప శిల్పం. ఒకరి ఇంటిలో ఎవరైనా చనిపోతే  శవాన్ని దాపరం చేయడానికి వచ్చినోళ్ళకు ఒకపూట భోజనం పెట్టించడం తెగ/కులంలో అందరి బాధ్యత అని చెప్పిన  సంస్కర్త ఉడుకోడు. బీదా బిక్కి పిల్లలకు చదువు చెప్పినాడు. తనకోసం ఏమీ అడగలేదు. స్కూలు పిల్లలకు బుక్కులు, బట్టలు కావాలని మాత్రం పోరాటం చేసినోడు. తాను చనిపోయినాక తన ఇల్లు పిల్లలకు లైబ్రరీ కావాలని కోరుకున్నాడు.  వూళ్ళో ప్రతిఒక్కరు అతని ద్వారా ఏదో ఒక లబ్ది పొందినవారే. అందుకే చావు డప్పు కొట్టే వాళ్ళ దగ్గర్నించి, షామియనావాళ్ళ వరకు అందరూ స్వచ్చందంగా ముందుకొచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు.  అంతేనా… పోలీసుకేసులకి తన ఉద్యోగం పోయినా ఎనక్కు తగ్గలా… ఏరికలోడు సేద్యం ఒకటే నేర్చుకుంటే సాలదు. పోరాటంజెయ్యడమూ నేర్చుకోవాల.. కరువుతో, మొండిమేఘాలతోనే కాదు మొండిమనుషులతో, ఆధికా రంతో కూడా…అని ఎరుక కలిగించిన వ్యక్తి. ప్రభుత్వం ఎరికలోళ్ళకి కొండపక్క పొలమిచ్చింది. బండలు పగల గొట్టి న్యాల సదును జేసి పంటలేసినారు. ‘పందులు మేపుకునే ఎరికలోళ్లు సేద్యంజేస్తే సహిస్తారా?’ పంటదీసే కాలానికి  ఊర్లో ‘ పెద్దోళ్ళు’ సేలకుబొయ్యే దావలేదనిరి. ఉడుకోడు జీవితమంతా దానికోసరమే కొట్లాన్న్యాడు. దేశానికి ఒగ అంబేద్కర్ సాలడు వూరికొకరు, గేరికొగరు కావల్ల… అన్నాడు. భూమి మన ఆత్మగౌరవం…  ఎన్ని కష్టాలొచ్చినా దాన్ని అమ్ముకోవద్దు. పొలాలకు  దారిలేక పోతే మనమే దారి చేసుకుందాం…! అన్న ఎరుకను ఆడిబిడ్డలకు కలిగించిన ఉడుకోడి జీవితం ధన్యం.

రైతు బతుకు ఎన్నింటితోనో ముడిపడివుంటుంది. ఇల్లు-చేలు, చెట్టు-పుట్ట, ఎద్దలు-బఱెగొడ్లు, పారలు నాగళ్ళు, ప్రాణమున్నవి,లేనివీ… అన్నీ మనిషి శరీరావరణమే. వాటితో వున్న అనుబంధం విడదీయలే నిది. సంకలనంలోని నాలుగు కథల్లో ఎద్దుల పట్ల రైతు మమకారం వ్యక్తమైంది. ‘ఓబుల్రెడ్డి ఎద్దులు’ కథలో తన పొలం పనులు తప్పవేరే యే పనులకూ వాడకుండా బిడ్డల్లా ఎద్దుల్ని సాక్కుంటాడు ఓబుల్రెడ్డి. వాటి పట్ల ఆయప్ప ప్రేమ సూసిభార్యకు కూడా అసూయే. వూళ్ళో కూడా ఓబుల్రెడ్డి ఎద్దుల పిచ్చిని యిచిత్రంగా చూసేటోళ్లు. ఒకనాడు తొలి కానుపుకని పుట్టింటికొచ్చిన మున్రెడ్డి కూతురు రాజమ్మకు కానుపు కష్టమైంది. ఎద్దులబండి కట్టి మిట్టన రాళ్లలో తిప్పితే కుదుపులకు కాన్పయితాదని పెద్దవ్వ చెప్పింది. ఎంత తిప్పినా ఎద్దుల వొళ్ళు హూనమైందిగానీ కాన్పు కాలే, బిడ్డ అడ్డం తిరిగింది అప్పటికప్పుడు మళ్లీ బద్వేలు ఆస్పత్రికి దారి బట్టినారు. ఒకటే పరుగు. ఆ గసకు ఎద్దల నోట్లోనించి పిరికెట్లు పిరికెట్లు నురగ కారి కిందపడ్తోంది. అయినా టైముకు చేరడంవల్ల కాన్పులో ప్రమాదం తప్పింది. అమడ పిల్లలు పుట్టారు. ఎద్దులు చూపిన ఔదార్యానికి ఓబుల్రెడ్డి కళ్లల్లో నీళ్లు తిరిగినాయి. “వాటెకు దండం పెట్టడానికేమో అప్రయత్నంగా పైకి లేచాయి మున్రెడ్డి చేతులు కానీ సగం వరకొచ్చానే బలవంతంగా ఆపేశాడు ఎవరన్నా చూస్తే బాగోదని.”

కొడుకుతరం పొలమమ్ముకొని పట్నం పోదామని కోరుకుంటే తండ్రి తరం పల్లెను వదలలేని వేదనలను

ఇంతవరకూ వచ్చిన రైతుకథల్లో చూసివుంటాం. ఇనాయతుల్లా కథ దీనికి భిన్నమైనది.  కొడుకు శంకర్ కు వ్యవసాయమన్నా, తన ఎద్దులన్నా ప్రాణం.పదిలోచదువు వదిలిన వెంటనే సేద్యం లోకి దిగి దాని లోతుపాతులు చూసినవ్యక్తి. రైతు కుటుంబాల్లో ఎప్పుడు డబ్బు అవసరం పడినా ఇంట్లో డబ్బు అవసరం ఉన్న వాళ్లకు వెంటనే తట్టే సులువు పరిష్కారం ఆడవాళ్ళ నగల తాకట్టు, ఎద్దుల అమ్మకం, పొలాల ఆయకం. యీ ఆడవాళ్ళు, యీఎద్దులు, ఈ పొలమే ఇంతకాలం కుటుంబ భారాన్ని మొత్తం మోశారన్న ఎరుకను కోల్పోయి మాట్లాడటమే ఇది. రాయలసీమలో అగ్రవర్ణ భూస్వాములుగా రెడ్లు దళితులను ఎంత అణచి వేస్తున్నారో, తమ బలమున్న చోట వారికి తోడుగా బోయ, ఈడిగ(గౌడు) బిసి కులాలు కూడా దళితులపై అంతే  అణచివేత  అమలు చేస్తున్నారన్న వాస్తవం లింగప్ప నాయుడితో మాదిగ ఎల్లప్ప ఘర్షణ ద్వారా రికార్డు అయ్యింది.

నేను డోనులో ఇంటర్ చదువుతున్నప్పుడు  మా ఇంటి పక్కనే ‘భూతనఖా’ బ్యాంకు ఉండేది. రోజూ ఎంతోమంది రైతులు దీనంగా రుణాల కోసం పడిగాపులు కాసేవాళ్ళు. బ్యాంకు సిబ్బంది జప్తుకు వెళ్ళి పంపుమోటర్లు,ధాన్యము వంటి విలువైన వస్తువుల్ని ఎత్తుకు రావటం చాలా సాధారణం. వెంకటకృష్ణ ‘పాత బాకీలు’కథలో ఈ పంటరుణాల చుట్టూ అల్లుకున్న చిక్కుముడులను విప్పాడు. మన దేశంలో సహకారవ్యవస్థ ఎలా నిర్వీర్యం చేయబడిందో  రెండు కోణాల్లోంచి చూపాడు.వ్యవసాయ లోను తీసుకొని తన ఎరువుల యాపారానికి పెట్టుబడిగా పెట్టుకున్న పెద్దరైతు వీరభద్రారెడ్డి ఒకరకమైతే, బ్యాంకుఉద్యోగి జోసెఫ్ మరోరకం. ఇద్దరూ బ్యాంకును తమ అవసరానికి వాడుకున్నారు. రుణం వసూలు చేయడానికిపోయే బ్యాంకు ఉద్యోగులకూ కొత్తగా కష్టాలొచ్చాయి.  “అప్పుకట్టకపోతే , భూమి పత్రాలఆధారంగా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ నోటీసు యిచ్చినా జప్తు ముందుకు పోనివ్వరు.  పెద్ద పెద్ద నాయకులతో ఫోన్లు చేయిస్తారు. దండోరా వేయనీయరు. ఇంతకు ముందైతే ఇంటిమీద బడి సామాన్లూ, ధాన్యం కూడా జప్తు చేసేదుండేది. రైతు ఆత్మహత్యలు మెండైన తర్వాత, పద్దతులు మార్చేసారు. ఇప్పుడు ఇండ్ల ముందర బ్యాంకు సిబ్బంది తో ధర్నాలు వేయిస్తున్నాం.నిరసన దీక్షలు చేస్తున్నాం.”

జక్రయ్యది ఇంకొకథ. తన పర్సనల్ లోన్ తీర్చడానికి బ్యాంకు ఉద్యోగి అయిన జక్రయ్య ఆన్న కొడుకు జోసెఫ్ జక్రయ్యతో పొలం పెట్టిచ్చి లోన్ సాంక్షన్ చేయించాడు. యాభైవేలు చేతిలో పెట్టి మిగతాదంతా వాడుకున్నాడు. ఎప్పుడో ఒగప్పుడు లోన్లమాఫీ వచ్చేవస్తుంది, అప్పు ఎగిరిపోతుందిపో! అని చెప్పినాడు. ఈ మాయలకు మన సొసైటీ సెక్రెటరీ మద్దిలేటి కారణం. ఆరేండ్లైపోయింది. ఒక్క కంతుకూడా కట్టలే.. లీగల్ యాక్షన్ మొదలైంది. రైతు జక్రయ్య వూరిడిచి కర్నూల్లో ఆటో నడుపుకుని బతుకు తున్నాడు. కథ చదువుతుంటే జక్రయ్య భూమి పోగొట్టుకుంటాడో ఏమోనని మనకూ దిగులేస్తుంది. జక్రయ్య పొలం కాబట్టి వూర్లో దండోరా ఏపించారు. వీరభద్రారెడ్డి పొలమైతే కూడా వేయిస్తారా? చట్టానికీ, విధానాలకు కులవర్గ స్వభావముంటుందని

రచయిత చెప్పకుండా చెప్పాడు. కథ అల్లిక చాలా బాగుంది. ‘ముగ్గురు వ్యక్తులు తమతమ పాత బాకీలు తీర్చుకోవడం.’ అనే  దారం చుట్టూనే  పైన చెప్పిన విషయాలన్నీ ఆవిష్కృత మౌతాయి.

                                                                          3

ఏ ఇతర దేశానికీ లేని ఒక గొప్ప సౌకర్యం భారత దేశ చరిత్రకు ఉంది. అదేమిటంటే గతం యొక్క భౌతిక అవశేషాలే కాకుండా సామాజిక సాంస్కృతిక అవశేషాలూ సమాజం పొరలలో భద్రంగా ఉండడం   -డి.డి. కోశాంబి

కేరళ రచయిత నారాయణ్ నవల ‘కొండ దొరసాని’ చదువుతున్నప్పుడు గిరిజన తెగ ఆచారపు వర్ణన నాకు ఆశ్చర్యం కలిగించింది. “తాను వేసిన విత్తనం మొలకెత్తిన చోట తూర్పు వైపు తిరిగి నిలబడ్డాడు. సూర్యచంద్రులని, ధాన్య దేవతను స్మరించి పిడికెడు వరి కోశాడు. పంటకోస్తున్న తన అపరాధాన్ని మన్నించమని ప్రార్థిస్తూ వరికట్ట కట్టాడు.”

యిలాగే మన పల్లెల్లో వున్న ఆచారాలు కూడా ఉత్పత్తితో ముడిపడి, సంస్కృతిలో భాగమైవున్నాయి. సంస్కృతి అనేది సమాజప్రవర్తన. ఆ కాలపు మానవ సమూహపు నియమావళి. ఇందులో  జ్ఞానం, నమ్మకాలు, కళలు, మతం, ఆచారవ్యవహారాలు, వాడిన పరికరాలు, నిర్మిం చిన కట్టడాలు,  జీవన విధానం, ఆహారం, ఇదమిత్థమైన హద్దులు లేక అన్నీ…ఆ గుంపులోని వ్యక్తుల సామర్థ్యాలు, అభిరుచులు కూడా కలగలిసివుంటాయి. సంస్కృతి గతించిన కాలపు సమాచారాన్ని భవిష్యత్ తరాలకు అందించే వారధి. పశువులను కూడా మనిషి నివసించే ఇంటిలోనే భాగంగా ఉంచుకోవడం, వ్యవసాయ పనిముట్లను పూజించడం రాయలసీమ సంస్కృతి.

సోదుం శ్రీకాంత్ కథ ‘తిమ్మప్ప పార’ ఈ సంస్కృతిని  పట్టుకుంది. సేద్యగాడు తిమ్మప్ప కుటుంబం మొత్తం సేద్యమంటే ప్రాణమిస్తారు.తిమ్మప్ప తోట దున్నే తీరు, ఎద్దలపై మురిపెం … సూడాల్సిందే. ముప్పైఏండ్లకింద పారకు ఎసినకట్టె చెక్కు చెదరల్యా. పిడికిలి పట్టేకాడ నున్నగయ్యి బో ఆల్కాగ వుంటాడే. అది ఆయన నైపుణ్యం. కరెంటు నిరంతర సరఫరా లేకపోవడం, ఎప్పుడో అర్ధరాత్రి కరెంట్ ఇవ్వడం వంటి కష్టాలు… పక్కపక్క పొలాల రైతుల మధ్య అనుబంధం, ఒకరికొకరి సహకారం… నేపధ్యంలో కథను నడిపిస్తాయి. తిమ్మప్ప  పోతానే  విడిపోయిన కొడుకులు  భూమిని అమ్ముకున్నా రు “నాయిన పోయినప్పుడు ఆ పారతోనే గుంత తీస్తి మబ్బీ! ఆ పారతో పాటే కట్టెనుగూడా గుంతలో పెట్టి బూడిస్తిమి” అత్యంత ప్రియమైన వస్తువులను చనిపోయిన మనిషితో పాటు కలిపి బుడ్చడం ఆదిమానవుడి కాలం నాటి రాకాసి దిబ్బలలో లాగా.

“మార్పు వచ్చిన చోట కూడా కొత్త వ్యవస్థ పాత వ్యవస్థను పూర్తిగా నాశనం చేయకుండా – కొత్త రూపంలో ఒక్కోసారి అభావ రూపంలో-తనలో ఇముడ్చుకుంది” అంటాడు కొశాంబి. మనం వెతకగలిగితే అట్లా అభావ రూపంలో కొత్త వ్యవస్థలో కొనసాగుతున్న పాత వ్యవస్థ అవశేషాలు చూడవచ్చు. రచయిత ఎంతలోతుగా సంస్కృతి, సంప్రదాయాలలోకి చూడగలిగితే రచనకు అంత ప్రాణశక్తి వస్తుంది. మారుతి కథలో పండుగ సంబరాలు చూడండి. పది తలకాయిల రావణాసురిడి గాలి పటాకిసేసి ఏరువాక పూర్ణిమ నాడు  ఎగిరేస్తే ఊరూరు వొచ్చి సూస్తుండ్య.  మాపుసారి ఎద్దులకి పారాటం (పరుగు పందెం) పెడుతుండ్రి. మామిడిత్వార ణం ఎంకటేసు ఎద్దులే తెంచాల అనేతట్ల ఎద్దుల్ని రడీ సేస్తుండ్య. పండగనాడు వాట్ల కొమ్ములకి వొన్నె(రంగు) కొడుతుండ్య. గెర్రసబ్బుత ( నిరాలా బార్ సోప్) నున్నగా పై కడుగుతుండ్య . అవి మల్లెపూల మాదిరి తెల్లగా మెరుస్తా వుండ్య. ఉల్లిగడ్డని సగానికి కత్తిరించి , వాటిత  డిజైను సేసి ఎద్దుల పైమీద( శరీరం మీద ) వన్నెతో అద్దు తా వుండ్య. ఆ ఎద్దులు అ సోకులు సేపిచ్చుకొని మా మాదిరి  వుండే ఎద్దులు యాడుండాయి? అనేటట్ల  గర్వం గా మాతుక్కు సూస్తా వుండ్య. పెండ్లాముకి కొనిచ్చిన పెద్ద చీరల్ని ( పట్టు చీరలు) రెండుఎద్దుల మీద కప్పుతుండ్య. బోయ గిడ్డప్ప పెట్రోమాక్స్ లైట్లు అంటిస్తుండ్య. . మాదిగి  బజారి, కర్రెన్న, దుబ్బన్న లు తప్పెడలు “ కనకనక… జ్జేజ్జే న కన కన ….. అనిపిస్తుండిరి. ఈడిగ బీమన్న సారాయి అంగడిల  నాలుగు గలాసులు ఏసుకొంటుండ్రి. ఇంగ సూస్కో నా సామి రంగా!….. ఒక తుక్కు తప్పెట్లు …ఇంగో తుక్కు ఎగుర్లాట ..

రాయలసీమలో మత సఖ్యత అపారం. దానికి రుజువు ఇక్కడున్న దర్గాలు, ఏటాజరిగే ఉర్సులు. కులాలతో సంభంధం లేకుండా ఊరంతా ఘనంగా జరుపుకునే పీర్ల పండగలు. వెంకటకృష్ణ కథలోని అల్లసామి ఉర్సు అటువంటిది.

“ఒకప్పుడు యిదంతా అడవిగా వున్నప్పుడు.పశులూ గొర్రెలు కాసుకునే వాళ్లకి, యీ ఫకీర్ పెద్ద చింతచెట్టు కింద ధ్యానం చేసుకుంటూ కన్పించేవాడంట.  కాళ్లిరిగిన పశువులకు   కట్లుకట్టేవాడంట, పసుర్లు తాపేవాడంట, మనుషులకి ఆరోగ్యాలు బాగలేకుంటే వైద్యం చేసేవాడం ట, తాయెత్తులు కట్టేవాడంట.ఇక్కడే యీ చెట్టు కిందనే సమాధి అయ్యాడు.అడవి వూరుగా మారింది. అల్లస్వా మికి దర్గావెలసింది.  చుట్టుపక్కల పల్లెలకి ఏటేటా జరుపుకునే ఉర్సు అయ్యింది. కర్నూలు నుంచి ఆదోని వరుకూ యిప్పుడు యా వూర్లో చూసినా జాతర్లూ ఉర్సు లూ జరుగుతుంటాయి.పంటలు చేతికి వస్తుంటాయి గదా , ప్రతీ వూర్లోనూ పంటలు పండినా ఎండినా జాతర్లు మాత్రం చెయ్యకుండా వుండలేరు.’ పంటలు బాగా పండి నోడు బంధువుల్ని పిలుచుకొని యాటలు గోసి డాండూం గా చేస్తాడు.పంటలు పండనోడు సప్పిడి జేయకుండా పడుకుంటాడు.

రాయలసీమ అంతటా గంగమ్మ, పెద్దమ్మ, సుంకులమ్మ, జమ్ములమ్మ  వంటి అమ్మదేవతల చరిత్ర ఉంది. జాతరలు, దేవరలు క్రమం తప్పక జరుగుతాయి. కొన్నింటిలో దేవరగట్టు బన్నీ ఉత్సవం లాగా అంతులేని హింస వుండొచ్చు కూడా. మోహన్ వానమెతుకులు కథలో అటువంటి ఒక దేవర సంఘటనవుంది.ఆ ప్రాంతంలో ఏ ఊళ్ళో దేవర జరిగినా దున్న ఫోతు ప్రాణంతో పాటు మనిషి ప్రాణం పోతుంటాది. ఆ ఊరిబంగారమ్మవ్వ దేవర్లో కూడా అట్లే ఒకరి ప్రాణం పోయింది. ఆ ఊళ్లల్లో ఇది సహజం. ఫోతు నరికేటప్పుడు ఎవున్నో ఒకున్ని సంపుతా రు. కక్ష ఉన్నోన్నే కాదు. ఊర్లో పెద్దలకి ఎదురుతిరిగి నోడో..అవినీతిని ప్రశ్నించేవోడో, ఎవుడో ఒకడు సచ్చేది ఖాయం.  ఫోతు నరికే ముందురోజు  పూజ. పూజరోజు ఏమీ జరగదు.  ఊర్లో ఉండే అన్ని గుడులకి ఉదయం  పూజలు చేస్తారు. సాయంత్రం ఇంటింటికి ఒక కుంభం ఎల్లిస్తారు. కుంబాలన్నీ బంగారమ్మ గుడిదగ్గర దింపి నైవేద్యం పెడతారు.  ద్వావుర ఆచారం ప్రకారం ఉత్తబిత్తల భూతుబిల్లి తిరుగేది ఫోతు నరికేరోజే. భూతుపిల్లి అంటే కనుబొమ్మలతోసహా శరీరం మీద అన్ని వెంట్రుకలు తీసేసి పూర్తి నగ్నంగా వున్న మగ మనిషి. ఊరు సుట్టూ పొలిమేరంతా  తిరుగుతా ఫొలి సల్లుతాడు. ఆ టైములో ఎవురూ బయిటికి రారు. భూతుబిల్లి వచ్చింతర్వాత గుడికాడ ఫోతు నరుకుతారు.  ఊరి జనుమంతా కలిసేదప్పుడే.  ఎవున్నైతే సంపల్లను కుంటారో వాని మీద  ఒక్కసారి గుంపు గుంపంతా పడుతుంది. ఆ గుంపు దెబ్బకి కిందకు పడిపోతాడు. ఇంక ఎవుడు తొక్కుతాడో, ఎవుడు లేదో!ఆ తొక్కుడుకే మనిషి అక్కడిక్కడే ప్రాణాలిడుస్తాడు. బంగారమ్మవ్వ బలితీసు కునేద్య అని అనేస్తారు. కేసుల్లేవు. పోలీసొళ్ళడిగితే ఇక్కడ ఇది మామూలే మా ఆచారుమంటారు. పొడిసి సంపేదుండదు.  అడ్డు అనుకున్నోన్ని ఆచారం పేరుమీద గిల్లేస్తారు నాయకులు.

యీ కథల విస్తృతిని గమనించినపుడు నాకు కొన్ని విలక్షణతలు  కనిపించాయి. ఒకతరం ముందు సీమకథల్లో పాతపగలు, కక్షలు వస్తువుగా ఉండేది. ఈకథల్లో దానితోపాటు(మోహన్ కథ) ఇటీవలి  రైతు పోరాటాలు (ఇనాయతుల్లాకథ), వ్యవసాయ చట్టాలు(ఉమామహేశ్వర్ కథ) కథాంశాలు అయ్యాయి.

పాత గ్రామీణ సంస్కృతి లోని మనిషీ- పశువూ సంబంధాలతో పాటు  రైతు యింట్లోకి నడిచివచ్చిన లాప్ టాప్ ఆధునికత ( సుభాషిణి కథ) కనిపించింది.

గతకాలపు బలవంతపు  అప్పుల వసూళ్ల స్థానంలో బ్యాంకులు ప్రవేశపెట్టిన సున్నిత పద్ధతులూ కన్పిస్తాయి.ఇంతకుముందు లాగా యింటి యజమానిని అవమానం చేసేదుండదు గానీ బ్యాంకుల మోసాలు  యింకా నిగూఢమవుతున్నాయి. ఇవి రుణ మాఫీ ఫలితాలను దారి మళ్లించే విధంగా కూడా మారాయి.

రచయిత నిరంతర పరిశీలకుడు. సమాజానికి కాపలా దారు (watch dog) కూడా. అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలు ఒక్కోటీవిఫలమౌతున్న ఇప్పటిదేశ పరిస్థితిలో రచయిత బాధ్యత మరింత పెరిగిందని ఈ కథలు గుర్తుచేసాయి 

                                          *          *        *

ఈకథలు కొందరు మనుషుల అనుభవం, ఒక సమూహపు జీవితం. ఒక సామూహిక చలనం. ఇంత వైవిధ్యం చూపిన  ఈ కథలలో ఆ చివర చిత్తూరు నుంచి ఈ చివర కర్నూలు వరకు సీమ మాండలీకపు సొగసు, ఆయా ప్రాంతాల యాస  ఆయా పాత్రలవెంటే మనలను నడిపిస్తుంది. ….

చదివండి ….సహానుభూతి చెందండి.

రాయలసీమ ఏమి కోరుకుంటున్నదో, ఎందుకు కోరుతున్నదో ప్రజాస్వామికంగా ఆలోచించండి..

3 thoughts on “వాలని మబ్బులు- వానమెతుకులు

  1. 👍♥️🌹
    మా సత్యం
    వసంత మేఘం మార్చి 2022 లో
    ‘ వాలని మబ్బులు వానమెతుకులు’
    (రాయలసీమ రైతు కథలు
    సంకలనానికి)
    శ్రీనివాస్ మూర్తి రాసిన ముందు మాట పరిచయంలో కథలలోని ఇతివృత్తాన్ని గతితార్కిక చారిత్రక భౌతికవాద కోణంలో రాయలసీమలో గత 60 సంవత్సరాల కిందటి రైతు ఆర్థిక సంక్షోభ దుస్థితి నాటి నుంచి నేటి వరకు
    కొనసాగుతున్న పాలకుల అనాలోచిత ప్రణాళికల వల్ల రైతుల ఆత్మహత్యలు, నేటికీ ఇంకా రైతులు బలి అవుతున్న తీరును దోపిడి విధానాన్ని ఎంతో విశ్లేషణాత్మకంగా తెలియజేశారు.
    బహుళజాతి సంస్థ దగుల్బాజీని, మెగా పార్కులు, స్మార్ట్ సిటీలు విష సంస్కృతి సాంప్రదాయాలను ఎండగడుతూ, కాషాయ పాలకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలలోని దోపిడీ స్వభావాన్ని కథలలో దళారీ, చట్టాల దోషములను, మధ్యవర్తి ,కమిషన్ ఏజెంట్, స్వభావాలను ఆర్థిక కోణంలో , అంతేకాదు రాయలసీమలో ఉన్న మత సమైక్యత ఎంతో ఆదర్శవంతంగా కొనసాగుతున్న తీరును కూడా రచయితలు కథా ఇతివృత్తం లో ఆవిష్కరించారు. ప్రశంసనీయం.
    శ్రీనివాస మూర్తి
    కొత్త చూపుతో సమీక్షించే కథలలోని పాత్రల మనో ప్రవృత్తి కనులముందు కదలాడుతూన్నట్గాప్రత్యేకతను
    ప్రదర్శించారు.
    కథలలోని తేట రాయలసీమ మాండలిక పదాల గుబాళింపు..
    “యాపుట్టలో యాపాముండాదో,వాళ్ళకాన్నేకూలికి పోవడ్తాది,వాళ్లు అట్ల ముందుకు వస్తాండేది?,ఎవురో ఒగరుండల్ల”, నీళ్లుల్యాక ఎండిపాయ,
    ఏముంటుంది లేప్పా!,అయినా లాభంల్యా!,
    రడీసేస్తుండ్య,
    (‘రడీ’ అనే పదము ఆంగ్లం నుంచి సందర్భోచితంగా వాడారు.)
    కడుగుతుండ్య,
    అద్దుతావుండ్య
    ఎద్దులు యాడుండాయి?”
    కథా రచయితలు సందర్భోచితంగా ప్రయోగించారు.
    సంపాదకులు
    ఇనాయతుల్లా –
    కెంగార మోహన్
    అభినందనలు.

  2. ONE COUNTRY —-all are economically not equal
    ONE COUNTRY —varasathva raajakiyaalu —agrakulaala palana Lu
    ONE COUNTRY —-kula matha pattimpulu
    ONE COUNTRY —-unnoni ok Chattam – Lenoni ko chattam
    ONE COUNTRY — no democracy
    75 YEARS INDEPENDENCE — NOTHING CHANGED
    PEOPLE
    WAKE UP
    STAND UP
    RAISE YOUR VOICE NOW
    Murthy garu —— nice one sir
    =======================buchi reddy gangula

Leave a Reply