గతంలో కంటే భిన్నంగా అంబేద్కర్ కృషి, ఆలోచనల ప్రాసంగికతను నానాటికి విస్తరిస్తోన్న  ప్రజాపోరాట శక్తులు మరెప్పటి కంటే ఎక్కువగా ఇటీవలి కాలంలో గుర్తిస్తూ ఉండడమే పాలకవర్గాల రాజకీయ వ్యూహంలోని మార్పుకు ప్రధాన కారణం. గతంలో చాలాకాలం అంబేద్కర్ ను  గుర్తించకుండా నిరాకరించడం లోనూ, నేడు ఎంతో గుర్తించినట్లు కనబడుతూ ఆరాధించడం లోనూ ఆయన మూల తాత్వికతను ప్రజలు గ్రహించకుండా చేయడమనే  పాలకవర్గాల కుటిలత్వమే దాగి  ఉన్నది.

    
ముఖ్యంగా  సమకాలీన సమాజంలో చాలామంది అంబేద్కర్ వాదులు కూడా అంబేద్కర్ మూల తాత్వికతను గ్రహించకుండా వారు నిర్వహిస్తున్న సామాజిక, రాజకీయ పాత్రను ఎత్తిచూపడానికి  2011 లోనే   ఆనంద్ తేల్ తుంబ్డే గారు చేసిన  అంబేద్కర్ స్మారక ప్రసంగవ్యాసం ఇది.

    
అంటరానితనంపై అంబేద్కర్ రాజీ లేకుండా చేస్తూ ఉండిన పోరాటాలలో ఉన్నత చదువులు చదివిన హిందువుల ప్రవర్తన పట్ల విసుగు చెంది ఆయనిక సమాజ సంస్కరణల పనికి స్వస్తిచెప్పి రాజకీయాల వైపు దృష్టి సారించాడు. ఆ క్రమంలో 1938 లో ‘ఇండిపెండెంట్  లేబర్ పార్టీ’ని స్థాపించాడు. ఆ పార్టీ రాజకీయాల్లోనూ ఇతర సామాజిక వర్గాల ప్రాబల్యం పెరగడాన్ని గమనించిన తర్వాత, 1942 లో ‘షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీ’ని నెలకొల్పాడు. తన జీవితపు చరమదశలో ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’ని స్థాపించి కమ్యూనిస్టేతర ప్రగతిశీల శక్తులను సమీకరించే పనిని చేపట్టాడని ఆనంద్ అంటారు.  

  
అయితే అంబేద్కర్ ఆయన కాలం నాటి కమ్యూనిస్టులను ప్రగతిశీల శక్తులుగా ఎందుకు భావించలేదని ప్రశ్న వేసుకొని చరిత్రలోకి వెళితే మనకు ఒక జవాబు లభిస్తుంది. అదేమిటంటే- ప్రగతి విషయంలోనే అంబేద్కర్ కు, ఆనాటి కమ్యూనిస్టులకు మధ్య ఏకాభిప్రాయం లేదని తెలుస్తుంది. ప్రజల ప్రగతిని నాటి కమ్యూనిస్టులు సార్వత్రికతలం లోంచి చూడగా, అంబేద్కర్ ఆ ప్రగతిని నిర్దిష్టతలం లోంచి చూశాడని తెలుస్తుంది. ఇంకా వేరే మాటల్లో చెప్పాలంటే- వర్గాన్ని కుదించి చూడడం వల్ల నాటి కమ్యూనిస్టులు వర్గ పోరాటాన్ని విస్తృత పరచుకొని బలోపేతం చేసుకోలేకపోయారు, లేదా అంటరాని విశాల పీడిత ప్రజల పోరాటాల్లో సంలీనం కాకపోవడం వల్ల వారు వర్గ పోరాటాన్ని విస్తృతం చేసుకోలేకపోయారని తెలుస్తుంది. అంటే, ఆనాటి వర్గ పోరాట రాజకీయాలలో కుల సమస్య పరిష్కారానికి చోటులేదని భావించడానికి ఆస్కారమిచ్చే విధంగా నాటి కమ్యూనిస్టు నాయకత్వపు సిద్ధాంత, ఆచరణలపరమైన  అప్రజాస్వామిక వైఖరులున్నాయని, అందువల్లనే అంబేద్కర్ ఆనాడు కమ్యూనిస్టేతర ప్రగతిశీల శక్తులను కూడగట్టాడని మనకర్థమవుతుంది.

 
ఇంకొకవైపు అంబేద్కర్ వాదుల్లోనే అంబేద్కర్ తాత్వికత పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల వారు బృందాలుగానే కాకుండా నాయకులుగా కూడా చీలిపోయారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సైతం అనేకరకాలుగా చీలిపోయింది. ఎన్ని చీలికలయినప్పటికీ ప్రతి ఒక్కరూ, ప్రతి బృందమూ  అంబేద్కరైట్(అంబేద్కర్ వాది) అనే లేబుల్ ను  వదులుకోలేదని ఆనంద్ తేల్ తుంబ్డే అంటారు. అమెరికాలో ‘బ్లాక్ పాంథర్స్’ తరహాలో మహారాష్ట్రలో కూడా ‘దళిత్ పాంథర్స్’ ఉద్యమం కుల అత్యాచారాలకు వ్యతిరేకంగా బయలుదేరింది. అయితే దళిత పాంథర్స్  ఉద్యమానికి గల ఒక విశిష్టతను మనం ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే- అస్తిత్వాన్ని అధిగమించి అణిచివేతకు గురవుతున్న వారందరూ దళితులేనని వారు నిర్వచించడం, సమూలమైన సామాజిక పరివర్తన కోసం  తీవ్ర పదజాలాన్ని ఉపయోగించడం. అందుకు (ప్రతిక్రియగా) రాజాధోలే లాంటి వాళ్ళు విభేదించి,  అంబేద్కరిజం అంటే బుద్ధిజమేనని, అన్యమైనదంతా అంబేద్కరిజం కాదని చెబుతూ చీలి పోయారు. అరుణ్ కాంబ్లే, రామ్ దాసు లాంటి వాళ్ళయితే వేరుగానే  ‘భారతీయ దళిత్ పాంథర్స్’ ను  స్థాపించారని ఆనంద్ అంటారు.

  
మొత్తానికి తొలినాళ్ళలో విస్మరించబడిన అంబేద్కర్ పేరు 1980 ల  వరకు దేశమంతటా ప్రముఖంగా వినపడసాగింది. అందులో భాగంగానే  అంబేద్కర్ మనుమడైన ప్రకాష్ అంబేద్కర్ ముందుకొచ్చాడు. దళితుల ప్రత్యేక సమస్యలపై, ఇతర పేదల  ఆర్థిక సమస్యలపై ఉద్యమించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. దాంతో ఖంగుతిన్న కాంగ్రెస్ గతంలో దాదాసాహెబ్ గైక్వాడ్ ను ఎట్లయితే ‘ఆశ్రయ రాజకీయ’ వ్యూహంతో తనలోకి ఇముడ్చుకుందో, అలాగే రామదాస్ అత్వాలేను కూడా చేర్చుకుని ప్రకాష్ అంబేద్కర్ ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది.ఇలా అనేక రాజకీయ  క్రీడలెన్నో ఆడి మహారాష్ట్రలో దళిత ఉద్యమాన్ని నీరుగార్చారు. దేశంలోని గుజరాత్, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాలలో కూడా దళిత ఉద్యమం ఇలాగే ఆవిరైపోయింది. ఒక చీలిక వర్గం కాంగ్రెస్ తో, మరొకటి బి జె పి తో, ఇంకొకటి వేరే పార్టీతో, ఇలా రకరకాల పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ తమ స్వీయ అధికారం కోసం పాకులాడారు/పాకులాడుతున్నారని, ఆ క్రమంలో అంబేద్కర్ మూల తాత్వికతనే  పట్టించుకోలేదని ఆనంద్ అంటారు.

    
అంతేగాకుండా, వివిధ సాంఘిక సంస్థలు, ఉద్యోగ సంఘాలు, అకడమీషియన్లు, సాహితీ సాంస్కృతిక సంస్థలు, ఎన్జీవోలు, వ్యక్తిమాత్రులైన మేధావులు తదితరులందరూ కూడా అంబేద్కర్ వాద లేబుల్ ను ఉపయోగించుకుంటున్నప్పటికీ, అంబేద్కర్ ఫిలాసఫీని కేవలం కుల అస్తిత్వానికి సంబంధించినది గానే చూస్తున్నారు. కానీ ఆనంద్ తేల్ తుంబ్డే  దృష్టిలో అంబేద్కరిజం అనేది ఒక విప్లవాత్మక తాత్విక భావజాలం. అందులో కులవ్యవస్థను నిర్మూలించి ఆధునికతను ప్రతిపాదించే రాడికల్ స్వభావం ఉంది. అందుకే అంబేద్కరిజాన్ని విప్లవకర వర్గానికి చెందిన భావజాలమని ఆనంద్ చెబుతారు.కనుకనే పాలకవర్గాలు ఎప్పటికప్పుడు అంబేద్కరిజం లోని మూల తాత్వికతను నీరుకార్చాలని చూస్తున్నాయని అంటారు. ఉదాహరణకు, మహారాష్ట్రలో ఒకప్పుడు అంబేద్కర్ ను తీవ్రంగా వ్యతిరేకించిన శివసేనలో  ఇటీవల కొందరు దళిత అంబేద్కర్ వాదులు చేరి ‘శివ శక్తి + భీమ్ శక్తి = దేశభక్తి’ అనంటున్నారని చెబుతారు. అలాగే ప్రస్తుతం సంఘ్  పరివార్ సైతం సామరస్యతా  భావజాలం పేరుతో అంబేద్కర్ లేబుల్ ను ధరించి  ముందుకు వస్తోందని అంటారు. నేడు పాలకవర్గాలన్నీ  అంబేద్కర్ ను  ఒక  దేవునిగా, విగ్రహ మాత్రునిగా మారుస్తూ పూజిస్తోన్న వైనం వెనుక అంబేద్కరిజం అంతకంతకు ప్రజా బాహుళ్యం లోకి, ప్రజా భౌద్ధిక వికాస క్రమాల్లోకి వచ్చి చేరుతున్న వాస్తవాన్ని మనం తప్పక గమనించాలి.

    
ఆనాటి దళిత పాంథర్ ల  నుంచి నేటి మావోయిస్టు విప్లవకారుల దాకా కుల సమస్య  పట్ల ఎదిగి వచ్చిన చైతన్యాన్ని, విస్తృతి చెందిన అవగాహనను అందుకోవాల్సిన చారిత్రక ఆవశ్యకత మనముందున్నదని తప్పక అందరూ గ్రహించాలి. ఎందుకంటే- అసలు అంబేద్కరే అటు అస్తిత్వవాది కాడు, ఇటు  రాజ్యాంగవాదీ కాడు. అంబేద్కర్ స్వయంగా బౌద్ధాన్ని స్వీకరించినప్పటికీ అంబేద్కరిజం (అంబేద్కర్ ఆలోచన విధానం) కేవలం బుద్ధిజం కాదు. అందుకే అంబేద్కర్ మూల తాత్వికతను అస్తిత్వవాద, రాజ్యాంగవాద చట్రాలలో ఇరికించాలని చూస్తే, అది ఎప్పటికీ వాటిలో ఒదిగేదీ కాదు. నిజానికి అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అలా ఆయా చట్రాలలో ఇరికించాలని చూసే ఏ ప్రయత్నమైనా అంబేద్కర్ కోర్ ఫిలాసఫీ పట్ల నిజాయితీ గలిగిన కృషిగా ఎన్నటికీ అనిపించుకోదు.

   
ఒక ఆలోచనాపరుడిగా అంబేద్కర్ జీవితాన్ని పరిశీలిస్తే, అందులో అనేక దశలు ఉన్నాయని ఆనంద్ అంటారు. ఆయన ఆలోచనా స్రవంతిలో లిబరలిజం, కన్సర్వేటిజం, రాడికలిజం అనే వేర్వేరు దశలున్నాయని, తాత్వికంగా చూస్తే  అంబేద్కర్ లో  భౌతికవాదం, నైతిక భావవాదం   ఛాయలున్నాయని  కూడా ఆయనంటారు. ఈ వైరుధ్యాలను  మనం సక్రమంగా అర్థం చేసుకోకపోతే ఆయన ఆలోచనల్లో  సంక్లిష్టతే కనబడి ఆయన కోర్ ఫిలాసఫీ మరుగున  పడిపోతుంది. కనుక ఆనంద్ ఏమంటారంటే- నిజమైన ప్రజా పోరాటాలలోనే అంబేద్కర్ ఫిలాసఫీ  సంపద్వంతమవుతుందని, ఒక ప్రజాయుధంగా అంబేద్కర్ ను  కాపాడుకోవడానికి అదొక్కటే సరైన మార్గమని(అంటారు).

      
చివరగా ఆనంద్ కొన్ని ప్రశ్నలు వేస్తారు. దళిత ఉద్యమ అంతిమ లక్ష్యం ఏమిటి? కుల నిర్మూలనా? లేక అధికార కులంగా మారడమా? ఒకవేళ అధికార కులంగా మారడమే అయితే ఏ కులం అధికార కులం కావాలి? ఎందుకంటే- దళిత అంటే ఒక్క కులమే కాదు. అది అన్ని అంటరాని కులాలను కలిపే ఒక వర్గ ఐక్యతకు సూచిక అని అంటారు.(ఇదే ప్రసంగ  వ్యాసంలో ఆయన కొన్నిచోట్ల అంబేద్కర్ వాదుల భావజాల సంక్షోభం గురించి ప్రస్తావిస్తారు. దళితులకు బ్రాహ్మణవాదం, పెట్టుబడిదారీ విధానం అనే రెండు శత్రువులు ఉన్నాయని 1938 లోనే అంబేద్కర్ చెప్పిన విషయాన్ని, బ్రాహ్మణవాదం కేవలం బ్రాహ్మలలోనే కాక కింది కులాల్లో కూడా ఉంటుందని అంబేద్కర్ హెచ్చరించిన విషయాన్నీ  గుర్తించడంలో అంబేద్కర్ వాదులు వైఫల్యం చెందారని ఆయనంటారు. కొంతమంది దళితులు మూల నివాసుల గురించి జాతి(race) అనే  పదంతో మాట్లాడేవారు కూడా అంబేద్కర్ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్నట్లేనని ఆయనంటారు. ఎందుకంటే- భారతదేశంలో కులాలు జాతి(race) అనే పునాదిపై ఏర్పడలేదని స్వయంగా అంబేద్కరే చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తారు. మరికొందరు ఉన్నత విద్యావంతులైన  దళితులైతే  దళితులు  కేపిటలిస్టులుగా, దళిత బూర్జువాలుగా ఎదగాలని  సూచిస్తున్నారని కూడా ఆయన అంటారు.)

   
ఈ ప్రసంగాన్ని ఆనంద్ తేల్ తుంబ్డే గారు 2011 లోనే చేసినప్పటికీ భూమి బుక్ ట్రస్ట్, హైదరాబాదు వారు జనవరి 2022 లో దీని  తెలుగు అనువాదాన్ని  ప్రచురించడంతో దీని గురించి  తెలుగు పాఠకుల మధ్య  చర్చ జరగడానికి అవకాశం ఏర్పడింది. అది మరింత విస్తృతంగా  జరగాలనే  ఈ వ్యాసాన్ని  రాశాను.

  
 ముఖ్యంగా అంబేద్కర్ కాలంలో భారత ఆధునికత స్వరూప స్వభావాలేమిటి? తదనంతర కాలంలోనూ, నేటిదాకా అవి ఎలా మారుతూ వస్తున్నాయి? అలాగే ఆనాటి నుండి ఈనాటి దాకా రాజ్యం స్వరూప స్వభావాలేమిటి? వాటిని అంబేద్కర్ ఎలా చూశారు? అవి ఎలా మారుకుంటూ వస్తున్నాయి? ఇప్పుడు మనం వాటిని ఎలా చూస్తున్నాం? వాటిలో సానుకూలమైనవేవీ? వ్యతిరేకమైనవేవీ? ఆత్మహత్యా సదృశ్యమైనవేవీ ? అసలు అంబేద్కర్ ఏ రకమైన సోషలిస్టు? ఇలాంటి ప్రశ్నలు వేసుకొని చర్చిస్తే మరింత బాగుంటుందనే ఉద్దేశ్యం కూడా  ఈ వ్యాసం రాయడానికి ప్రధాన కారణం.  

Leave a Reply