రైతు జీవిత చిత్రణలో రచయిత్రులు
'మంచిదయ్యా మీరెల్లబారితే నేనూ నా పనికి పోతా' అంటుంది హనుమక్క . గ్రామీణ రైతాంగజీవితాన్ని చిత్రించిన సాహిత్యంలో పురుషుడే కథానాయకుడు. ఆయా కథలు నవలలు నాటకాలలోని పాత్రలు సంఘటనలు సందర్భాలు పరిస్థితులు అన్నీ పురుషుడి కేంద్రంగానే కొనసాగాయి. రైతు సాహిత్యంలో మహిళారైతుల గురించి, రైతుకూలీల గురించి, వ్యవసాయేతర ,వ్యవసాయ అనుబంధరంగాల్లో నిరంతరం శ్రమించే దిగువ స్థాయి వారిని కేంద్రంగా చేసుకొని వెలువరించిన సాహిత్యం చాలా తక్కువ. రైతు జీవితం పొడవునా అమ్మమ్మ నానమ్మ తల్లి పిన్నమ్మ పెద్దమ్మ అత్త భార్య వదిన మరదలు అక్క చెల్లెలు కూతురు మనవరాలు ఇట్లా అనేక రూపాల్లో కనిపించే స్త్రీ పాత్ర విస్మరించలేనిది,