కథలను రాయడం వెనకాల సామాజిక ప్రయోజనంతో బాటూ , గుండెలోపలి దుఃఖాన్ని అర్థం చేసుకొని, అవమానాల్ని దాని వెనకాల ఉన్న కారణాల్ని అర్థం చేసుకుని, అసమానత్వాన్ని ఎదుర్కొని, బానిసత్వం నుంచి విముక్తి పొందడానికి , ఒక సామూహిక పోరాట శక్తిని సమీకృతం చేసుకోవడానికి ఉద్యమ నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కథలన్నీ శక్తివంతమైన కథలని చెప్పలేము కానీ, ఆయా ఉద్యమాల కాలంలో  కథలు కవిత్వం నవలలు తదితర ప్రక్రియల్లో శక్తివంతమైన రచనలు వెలువడ్డాయి.వాస్తవాలను కేంద్రీకృతం చేసుకున్న రచనలు , మానవ జీవితాల్లోని వెలుగు చీకట్లను యధాతధంగా చిత్రిoచిన  రచనలకు విలువ ఎప్పుడూ ఎక్కువే. 

మల్లెమొగ్గల గొడుగు- డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ గారి కథా సంపుటి. 

ఆయన ఎంతో మంది విద్యార్థులకు ఆటు సాహిత్యాన్ని,ఇటు సమాజాన్ని ఒకే సమయంలో అర్థమయ్యేలా విడమరచి విశదీకరించి పాఠాలు చెప్పిన ఉత్తమ ఉపాధ్యాయుడు. గతాన్ని గురించి చెప్పడంతో ఆగిపోకుండా, వర్తమానం ద్వారా భవిష్యత్తులోకి ముందుగానే చూడగలిగిన దార్శనికుడు. ప్రపంచీకరణ పరిణామాలను,  అసమసమాజంలోని పోకడలను, కుల వివక్షతను లింగ వివక్షతను, శ్రామిక దోపిడిని, లైంగిక దోపిడీని, కుల మత వర్గ వర్ణ ప్రాంతీయ విభేదాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన కవి, రచయిత.దళిత జీవితాల్లోని సున్నితమైన అన్ని కోణాలను  ప్రతిభావంతంగా కథల్లో, కవితల్లో ఆయన చిత్రించిన తీరు, అయన వాడిన జీవద్భాష ఆ కథలకు ఆ కవితలకు ప్రాణ శక్తిని అందించాయి.

తను రాసింది మాత్రమే చదవడంతో ఆగిపోకుండా, తన తరం తన ముందు తరం వాళ్ళ రచనలతోనే  ఆగిపోకుండా, వర్ధమాన, నూతన కవులు, రచయితల రచనలు చదవటం ఉత్తమ రచయితల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. సుధాకర్ వర్ధమాన రచయితల గురించి, వారి రచనల గురించి నిష్పక్షపాతంగా మాట్లాడగలిగే హృదయ వైశాల్యం కలిగిన రచయిత. సాహిత్యంలో ఉత్తమ రచనలను ఎలాంటి  పక్షపాతం లేకుండా గుర్తించి అభినందించిన సాహితీవేత్త.అందుకే కులమత వయో భేదాలు లేకుండా ఆయనకు అనేక మంది మిత్రులు ఏర్పడ్డారు. 

ఆయన రచనలన్నీ కలసి ఒక సమగ్రమైన సంపుటిగా రావాల్సిన సందర్భం ఇది.అయన రచనలపై ఇంకా లోతుగా చర్చ జరగాల్సి వుంది. అట్లగే ఆయన రచనలు కూడా ఇతర బాషల్లోకి అనువాదం కావాల్సిన అవసరం ఎంతైనా వుంది.చిన్న కథలే అయినా  వాటిల్లో ఆయన చూపిన జీవితం మాత్రం చిన్నది కానే కాదు.  విస్తృతమైన,లోతైన తాత్విక అంశాలెన్నో ఆ కథలనిండా పరచుకుని వున్నాయి.అందుకే ఈ కథలు కాలానికి నిలుస్తాయి. జీవితాన్ని యధాతదంగా వున్నది ఉన్నట్లుగా కళాత్మకంగా చూపుతూనే, జీవితం అట్లా ఎందుకు వుందో, ఎలా ఉండాలో, అందుకు ఏం చెయ్యాలో కూడా చెప్పేవి మంచి కథలని అనుకుంటే ఈ కథలు మంచి కథలని అర్థం. 

నిజానికి ఈ కథలన్నీ గుండెను పిండేసేటివి. ఈ కథలు పాఠకులను కుదురుగా ఉండనివ్వనివే.

 “డప్పుగొడితే సరస్పతి సిందులెయ్యాల!” కథ చదువుతూ వుంటే పాఠకులు తమను తాము మర్చి పోతారు. ఆయన తో బాటూ అయన బాల్యం లోకి పాఠకులు ప్రయాణిoచక తప్పదు.ఆ కాలం లోకి ఆ ప్రాంతం లోకి ఆ మనుషులలోకి ఒక్క సారి అడుగు పెట్టినాము అంటే ఇక అక్కడ  నుండి వెనుదిరిగి రావడం చాలా కష్టం. ఎలాగో చూడండి…

“డప్పుగొడితే సరస్పతి సిందులెయ్యాల!” కథ నడచిన తీరు చూడండి.

*

నేను లింగారెడ్డి పల్లెలో రోజంతా సెడదిరిగే వోన్ని. పగల్లే! రాత్రిల్లే! నేనూ, ఆంతోనిగాడూ పొద్దస్తమానమూ కుక్కల మాదిరి తిరిగేది. అంతోని గాడంటే ఎవుడూ? నాగత్త కొడుకూ, శాంతమ్మ తమ్ముడూ అయ్యన్నీ యెందుకూ? ఆడు నా సిన్ని సెల్లెలు మొగుడు. ఆడికి నేనంటే బోయిది. యాపన్జెప్పినా జేస్తడు. వోడు కజ్జికాయల మాదిరి బుగ్గలేసుకొని కిసకిన నవ్వుతావుంటే బోసుందరం గుంటడు నల్లనాయాలు.

 “బావా! నువ్వు పియ్యదినమంటే తింటాబావా! నీ మాట కాదంటానా?” అనేవాడు యింక నాకు మండుకొచ్చేది.

“చ్చాయ్! మూసుకో! యాందిరా ఆ మాటలు?” అని నేను కసురు కునేది.

  “బావా! యియ్యాల గూడెంలో ఒక పెళ్లుండాది. ఆడకి బోదాం పా! మా పెదబోడన్న చిన బోడన్న పలకేసే దానికొస్తరు. అల్లను గలవాల్సిందే! అల్ల దరువు ఇనాలిసిందే’ అనే వరకి యింగ నాక్కూడా ఉచ్చాకం బుట్టుకొచ్చింది.

మావోళ్ల మాటల్ని పాటల్ని దొరికినయి దొరికినట్టు మూటగట్టుకోను బయలు దేరినం. జగ్గునక బిగ్గునక జగ్గునక అంటా నోటి దరువేస్తా అంతానిగాడూ, వాడితో బాటు సిందేస్తా నేనూ పెళ్లికి బోయినం. 

ఇలా ఒక ప్రవాహం లా మొదలవుతుంది కథ. డప్పు గురించిన మాత్రమే ఈ కథకుడు మనకు చెప్పడు. ముందు డప్పు రూపును కళ్ళ ముందు నిలుపుతాడు.డప్పు ప్రత్యేకతలన్నీ చెపుతాడు. జీవితంలో డప్పుకు వుండే ప్రాధాన్యత, అవసరం, గుర్తింపు, గౌరవాలు, అవమానాలు, దుఃఖాలు, కథ లోపలి కథలెన్నో చెపుతాడు.   కథ చదువుతూ వుంటే ఆ డప్పు చప్పుడు మన చెవుల్లో కాదు, గుండెల్లో వినిపిస్తుంది. అదే ఈ కథ ప్రత్యేకత.

మా పెదబోడి బావ మెత్తబడ్డ ఆవుమాదిరి గుంటడు. చినబోడి బావ మటుకు ఒంగోలు గిత్త మాదిరి బోకుశాల గుంటడు. వాడు సుక్కేసి పలక బట్టుకుంటే సుక్కలైనా సరే జలజలా రాలి పోవాల్సిందే!

 “బావా! నాకు బువ్వలేకపోయినా సింతలేదు గానీ, డప్పు మాతర ముండాల. నాకు దాని మీద బో పేమ గదూ! అది సంకనుంటే సాలు, యింగేమీ అడగబడ్లే! ఎక్కడకైనా బోతా!” అంటుంటాడు.

సరే! మేము పెళ్లికాడికి బొయ్యేతలికి మంట రాజేసి డప్పులకి సెగపెడతావుండరు పెదబోడిబావా,చినబోడి బావా!

 డప్పులు బిగుసుకున్నంక వోళ్లద్దరూ మాకాడికొచ్చి కూసున్నరు.

” అసలు ఈ డప్పులు యెవురు చేస్తరు బావా! అని నేనడిగిన.

“  యాప సిక్క తీసి మాస్టో స్టోనికిచ్చేది.చేల సేక్కయితే ఇంకా బాగుంటది. వాడు దాన్ని సెక్కి బాగా కడెంబెట్టి బిగిస్తడు. ఆడు బొందులేసి బిగిస్తడు. మాస్టోల్లు మన జాతోల్లే. మనల్ని అడుక్కుంటారు. దున్న చెర్మం దెచ్చి మూడు రోజుల నానబెట్టాల. యింగ ఆవంతనే సింత గింజలుదెచ్చి బాగా దంచేది. దాని అంచులు బూసి పగ్గాలేసి బిగిస్తారు. గుండటి కడెమేసి నలుగురు ‘బట్టి సెర్మాన్ని బిగియ్యాల. ఒక బండ కింద పచ్చి తప్పెట పెట్టాల. యింగ బాగా యెండ కాత్తావుంటే ఒక మద్దేనం దాకా అట్టనే పెట్టి తీసి అంచులు గించులు కోసేది. నున్నంగ చేసుకునేది. కూసింత మంటేసుకోని కాకబెట్టి సుతి జూసుకునేది. దీనికి కుర్రదున్న సెర్మం గావాల. ఒక సమచ్చరంగానీ, రెండు సమచ్చరాల్డి వొగిసున్నదయితే బాగుంటది.

 “ నిజ్జం జెబుతుండ సుదయ్యబావా! నేనుగానీ సుక్కేసుకోని కాకబెట్టిన పలక వాయిస్తే దీనబ్బడాల! సరస్పతి గూడ ఈన అవతల బారనూకి సిందులెయ్యక పోతే నేను మా యబ్బకి బుట్టలా! నేను మల్లెల చినబోడయ్యవేగాను. యావనుకుంటుండవో?” అన్నడు మీసం మెలేసుకుంటా.

“ఓ యబ్బో  అంత గొప్పదాన్న మాట ఈ డప్పు” అన్నడు ఆంతోని గాడు.

 “ఆ..ఈ తప్పెటతో శానాపనితనం జెయ్యెచ్చు. ఓ యబ్బ! ఎన్నుండయ్యి దరువులు! కర్రసాముండే, బజనుండే, పీర్లదరువు, సిందరువు, సిటికలు, పెదపులి  దరువుండె. గుర్రపు దరువు, అమ్మోరి దరువు ఇట్టా శానా దరువులండయ్యి. మంచి పనోళ్లుండరు.  మనోళ్లల్లో ఆరోను, దిబ్బయ్య యింకా శానా మంది వుండరు.

*

అప్పుడప్పుడు మన నాలుగూర్ల మద్దెన డప్పుల పోటీ గూడా వుంటది. పోటీలకి మేమిద్దరం బోతే వాళ్లు వాయించరు. వాళ్లు మనోళ్లేగాని మమ్మల్ని జూసి సాలిచ్చుకుంటరు. ఆళ్ల మీన మేము మొనగాళ్లమని కాదుగానీ అట్టా జరుగుతాది.

ఈ డప్పుల మీన అన్ని సబ్దాలు పట్టుకోవచ్చు. రైలుగానీ, ఉరుముగానీ, వాగుగానీ పొంకుగానీ దేన్నైనా బట్టుకుంటం. తెల్లవార్లూ, పొద్దుకూకులూ వాయించమంటే వాయించమూ.!తిర్నాలకు బోతే అయిదు రోజులైనా వాయిస్తుండ్లా? అయితే మందేసుకుంటేనే డప్పు కంగుమనేది. దాంతోటి ముక్కబడితే యింగ తిక్కరేగిపోద్ది. దరువులు పరుగుల్దీప్తయ్యి. తిర్నాల్లకి బోయినప్పుడు మందు గొట్టకుండ తప్పెట ముట్టుకంటే ఆసాములూరుకుంటారా! తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతరు. ఆశ్లే సారాయి పోయించేది. మనకు యిట్టమున్నా కట్టమున్నా సారాయి దాగాలిసిందే! యింత కట్టబడి వాయిస్తే యేమి లాభం? డబ్బులు గిట్టుబాటయితయా? మంగలోల్ల మేలానికేమో యెక్కువిత్తరు, మాకేమో తక్కువిత్తరు. మంగలోల్లేమో మా సందిట దూరుకోని యేం వాయించకుండ వుంటరు. అల్లకు యేలితే మాకు వందో బొందో సేతులో పెడతరు. యాంది బావా? అయిదు రోజులు కట్టపడి వాయిస్తం. మా కట్టం ఎవురుకి తెలుసుద్దీ? ఈ పిల్లకర్రకీ, తప్పెట పుల్లకీ తెల్సుద్ధి.

సీరామనవుమికి, తిర్నాల్లకీ, పోలేరమ్మ జాతరకీ, దేవర్లకీ అన్నిటికీ మేమే గదూ వాయిచ్చేది. శనిగినీ వుంటే ఆయన్నీ మాదిగోడి మీదగా పోతయ్యని ఆళ్ల నమ్మకం. పోలేరమ్మకి బండ్లు గడతరు అసాములు, నలుగురు బట్టుకుంటరు యెద్దుల్ని,

యింగ మేము యెద్దుల  సెవుల్ దగ్గరికి  సేరేది. ఖణఖణఖణ తప్పెట వాయించేది.గూబలు గుయ్యిమంటయ్యి. పిల్లకర్రతోటి వాటి సెవుల్లో బొడిస్తే పేరాల్దిసి పరుగుల్డిస్తయ్యి.

గొల్లోల్లకి సివాలొస్తయ్యి, ఆల్లకి మేమే వాయించేది. మాకు అలుపొచ్చేట ఆసాములే మందుబోస్తరు. మందు సంగతంతా ఆళ్లే చూసుకుంటారు.మనకేం సంబందంలే! రెడ్డిగారి పిల్లలకి, వాళ్ల పెళ్లిళ్లకి మేమే గదూ వాయించేది. మందు బోయించేది ఆల్లే! తప్పెట గొట్టించేది ఆళ్లే! ఆళ్ల పాలేర్లతో అన్నం బెట్టిస్తారు. ఇంట్లోకి రానియ్యరు. బయట కూసునేది. బయట్నే దినేది. బయట్నుంచే బొయ్యేది.బయట మనుసులంగదూ!”.

పీర్ల గుండం మాదిరి చినబోడిబావ లోన కుత కుత లాడతా వుండాడు. యెప్పటికైనా చినబోడి బావ లాంటోళ్లు దండుగట్టి నిప్పుల గుండాలయ్యేరోజు దగ్గర్లోనే ఉందనిపించింది.

కథ మొత్తం లో రచయిత దుఃఖాన్ని సూచించే మాటలివి. సమాజంలో ఏ రకమైన మార్పుని రచయిత ఆశిస్తున్నాడో, దళితుల జీవితాల్లో ఏ విధమైన వెలుతురుని ఆయన ఆశిస్తున్నాడో ఈ మాటలు చెబుతాయి.

మాదిగోడికి యింటికో డప్పుండాల్సిందే! కాపులూ రెడ్డిగోర్లూ వుంటారు. అళ్లు పిల్చినప్పుడల్లా డప్పెత్తక బోవాల. నేను బోలేదనుకో, “అబయ్యా! నువ్వు రాలేదు. నీ డప్పు వాద్ధెం లేదు. నీ బాగం లేదు. నీకు డబ్బులిచ్చేది లేద”నంటారు. అందుకే యింటికో డప్పెత్తుక బోవాల.

డప్పు అయిదు రోజులు వాయిస్తం. మూడు రోజులు వాయిస్తం. ఎన్రోజులైనా వాయిస్తం. అట్టా వాయిస్తువుంటే సెయ్యంతా నొస్తది. ఒల్లంత సెమట. గూడలు బట్టేస్తయ్యి. అలుపొచ్చే వరకి ఆసాములొచ్చేది. యెయ్యొండ్రా,

యెయ్యొండ్రా ! అని అదిలించేది,అరిసేది,ముందు బోయించేదీ.అయిదు రోజుల తరువాత వళ్లు జాస్తే ఏముంటది! కాలు సేతులాడతయ్యా అని నోరులేని తప్పెట నొచ్చుకోదు గాని యింగ మాకైతే ఒల్లంత నొప్పులే గదూ!”

“అయితే ఎట్లయినా నువ్వు నాకు డప్పు నేర్పియ్యాల బోడిబావా!” అన్నా దబదబ డప్పు మీద వాయిస్తా. 

 పెదబోడిబాన, చినబోడిబావ యిరగబడి నవ్వుకోని నాసాయ జూసిండ్రు.

“యిప్పుటోళ్లు యెవురు నేర్చుకుంటుండరు. తక్కువనుకుంటుండ్రు. యాంది పెద్దల్ల కాడ నేర్చుకునేది అనుకుంటరు. కర్ర సాదననీ, కరాటీలనీ యాందేందో ఆటెంటబడుతుండరు. ఈ మట్టిగిట్టి అంటించుకోను యిప్పుటోళ్లు యిష్టబడుతుండరా? యింక సినిమాలొచ్చే! సోకులు మారే! వాయిచ్చే వాళ్ల కాడికి బోయి సుతి నేర్వలేరు. యెవురంతట వాళ్లే తెలివి కొద్దీ నేర్సుకుంటే యిజ్య నిలుపుకుంటారు. ఆళ్లుగూడ ఫైల్లోకొస్తరు. రాకపోతేయేం జరుగుద్ది? జాతి యిజ్ఞలన్ని నశించి పోతుండ్లా!”

“అయితే నీ గురువెవురు బావా?” అనడిగిన నేను. 

ఆ మాటకి పెదబోడెయ్య అన్నడు గదా? 

“నాకు డప్పు గురువిజ్జె గాదు,వెలివిజ్జే . మా జేజినాయన ఉక్కియ్య కోడిగూయక ముందే నిద్దర లేసేవోడు. సలికాలంలే! వానాకాలంలే! యింగ యా కాలమైనా సరే!  నిప్పురాజేసేది. డప్పుకాక దెట్టేది. ఖణఖణ వాయిస్తా వుండేది. యింగా నవ్వు యినేసరికి మాకు నిద్దర దెంకబొయ్యేది. ఇంగ నేనూ యీ సినబోడిగాడూ కక్కి మంచాల్లోంచి లేసేది, మా బేజినాయన దగ్గర కూకునేది. తప్పిట మోత యింటా వుండేది. ఉక్కియ్య తాత పలక వాయిస్తావుంటే వోనొచ్చినా ఆగిపోవాల. సలిబుట్టినా దెంకపోవాల.  సీకటంతా కరిగి తెల్లంగయ్యేది. బెరసపుంజు జుట్టు మాదిరి ఎర్రంగా పొద్దు బొడిసేది, యింగ మేము యాప్పుల్లేసుకోని పళ్లు తోముకునేది సద్దికూడు తాగేది. కొంచేపు ఆడుకునేది. డప్పు సాదన్చేసేది. మనకీ డప్పయినా సెప్పయినా గురువిజ్యగాదు. వెలివిజ్జె. మన జేజబ్బలే మన గురువులు.”

“మా జేజినాయన యా పొద్దు గమ్మునుండడు, డప్పయినా కొడతా వుంటడు. చెప్పయినా కుడతా వుంటాడు. అయ్యి జూసేగదూ! యియ్యన్నీ నేర్చుకునేది. మన రాతలంతా సచ్చిపోయిండ్లా! యాడికి బోతరు? మట్లోకి పోయినా తప్పెట గొట్టాల్సిందే! సెప్పులు గుట్టాల్సిందే! ఆకాసంలోకి బోయినా, మబ్బుల మీన నిలబడి డప్పులు గొట్టాల్సిందే! యాడికి బోయినా తాతోల్లు సుకంగుంటరా! ఈడ యాంజేసిన్రో, ఆడా అదేజేస్తరు. పైయ్యోడేంది! కిందోడేంది? మాదిగోన్ని మట్టసంగ బతకనిస్తరా?”

 పెదబోడిబావ పొగాక్కాడ మునిపంటితో కొరికి తుపుక్కున వూసిండు.వాడి గుండెల్లో వుండే కసంతా ఆ పుమ్మిలో కానొచ్చింది నాకు.

*

ఇదీ కథ ముగింపు. 

మన సంస్కృతిలో  డప్పుకు ఉన్న స్థానం ,విలువ ,మనిషికి  డప్పుకు ఉన్న అనుబంధం, డప్పు నిర్మాణం, వాడకం వెనుక ఉన్న నేర్పరితనం పనితనం, కళాత్మకత ఇవన్నీ చెబుతూనే గుండెను పిండేసేలా కొన్ని సునిశితమైన సత్యాలను అలవోకగా చెబుతాడు రచయిత.ప్రవాహంలా సాగిపోయే ఈ కథనం పాఠకులను నివ్వెరపరుస్తుంది. ఇది కదా జీవితం అని ఈ కథ చదువుతున్నంత సేపు అనిపిస్తుంది. వర్తమాన జీవితంలోని అన్ని సందర్భాలను, సమాజంలోని అన్ని డప్పు తో ఉన్న అనుబంధం ఈ కథ చదివితే తెలుస్తుంది.

ఈ కథ లో అన్నట్లు “ మనిషి కష్టం ఎవరికి తెలుస్తుంది? ఈ పిల్ల కర్రకి తప్పెట పుల్లకీ  తెలుస్తుంది.”

అన్నం తిండి లేకపోయినా చింత లేదు కానీ డప్పు మాత్రం ఉండల్ల అని  అన్నాడు అంటే అది అతడి ప్రేమ. 

 “ఈ తప్పెటతో శానాపనితనం జెయ్యెచ్చు. ఓ యబ్బ! ఎన్నుండయ్యి దరువులు! కర్రసాముండే, బజనుండే, పీర్లదరువు, సిందరువు, సిటికలు, పెదపులి  దరువుండె. గుర్రపు దరువు, అమ్మోరి దరువు ఇట్టా శానా దరువులండయ్యి. మంచి పనోళ్లుండరు  మనోళ్లల్లో.ఆరోను, దిబ్బయ్య యింకా శానా మంది వుండరు.” అని అనటం ఒట్టి ప్రేమ కాదు. అది డప్పు గొప్పతనం.

ఇది కేవలం డప్పు కథ కాదు.

డప్పు గుండె కథ, డప్పు ఆత్మగౌరవ కథ. 

(ఇలాంటి ఎన్నో ఆణి ముత్యాల వంటి కథలు రాసిన  కథకుడు, కవి ఎండ్లూరి సుధాకర్ అన్నకు  నివాళులు..)

Leave a Reply