భారతదేశంలో కుల సమస్యకు, స్త్రీ సమస్యకు సంబంధించి చాలా ఆధునికంగా ఆలోచించిన వాళ్ళల్లో అంబేద్కర్ చాలా ముఖ్యుడు. అందుకే ఆయన దేశీయ చరిత్రలోకి వెళ్లి లోతుగా పరిశోధించి కుల వ్యవస్థ మూలాలను కనుగొన్నాడు. అంత మాత్రమే కాదు, కులం పనితీరును, చారిత్రక గమనంలో దాని మార్పు క్రమాన్ని పరిశీలించి వివరించాడు. అయితే ఆధునికత వైపుగా జరగాల్సిన సామాజిక మార్పు క్రమానికి సంబంధించిన నిర్దిష్టత పట్ల అత్యంత సీరియస్ గా, మౌలికంగా ఆలోచించిన ప్రజా మేధావి అంబేద్కర్.
అలాగే భారత సమాజాన్ని ఆదిమయుగపు అవశేషాలను నిలుపుకుంటూ వస్తున్న ఒక ‘నాగరిక’ సమాజం అని అంబేద్కర్ నిర్వచించాడు. అలాంటి ఆటవిక అవశేషాలలో బహిర్ వివాహ పద్ధతి(exogamy)ఒకానొక కీలకమైన మారని కట్టుబాటు (rigid norm) అన్నాడు. అందుకే భారత సమాజం సపిండ (రక్త బంధువుల )వివాహాన్ని, సగోత్ర( ఒకే మూల పురుషుని వారసుల )వివాహాన్ని మహా పాపంగా భావిస్తుంది. అయితే ఇటువంటి వేర్వేరు సాంఘిక సముదాయాల మధ్య జరిగే బహిర్వివాహ పద్ధతి(exogamy ) పైన ఒకే సాంఘిక సముదాయంలో పెళ్లి అనే అంతర్ వివాహ నియమాన్ని(endogamy ) ప్రవేశపెట్టడం అనేది కులాల పుట్టుకకు దారి తీసిన ఒక కీలక పరిణామమని ఆయన పేర్కొన్నాడు. అందుకే ‘బహిర్ వివాహం పై అంతర్ వివాహ ఆపాదనమే కులం పుట్టుక ‘ అని అంబేద్కర్ ప్రతిపాదించాడు. ఇలా ఒకే కుల సముదాయం లో జరిగే వివాహాల వల్లనే కులాల నిరంతర పునరుత్పత్తి జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి.
అయితే ఈ అంతర్ వివాహ పునాది బీటలు వార కుండా కాపాడబడాలంటే ఒకే సాంఘిక(కుల) సముదాయం లోని స్త్రీ పురుషులందరికీ పెళ్ళికి అవసరమైన జోడి లభించి తీరాలి. అంటే, కులం పుట్టుకకు, కుల వ్యవస్థ నిరంతరాయతకు వివాహ యోగ్యులైన స్త్రీ పురుషుల సంఖ్య సమానంగా ఉండితీరాలి. అయితే అనేక చారిత్రక, ఆకస్మిక పరిస్థితుల కారణంగా వివాహ యోగ్యత గల స్త్రీ పురుషుల సమానతా నియమానికి భంగం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు-యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, అనుకోని వ్యాధుల కారణంగా వివిధ కుల సముదాయాలలో స్త్రీ,పురుషులు మరణించడం వల్ల అదనపు స్త్రీల(surplus women ), అదనపు పురుషుల(surplus men) సమస్య తలెత్తుతుంది. ఆ అదనపు స్త్రీ, పురుషుల సమస్యను పరిష్కరించనట్లయితే వారు వేరే కులం (బయటివారి)తో సంబంధాలు పెట్టుకుని, సంతానాన్ని కూడా పొంది (స్వ ) కులం లోపలికి తీసుకువచ్చే ప్రమాదం ఉంటుంది. తత్ఫలితంగా అంతర్ వివాహ పద్ధతే విఛ్చిన్న మై పోయే ప్రమాదం ఏర్పడుతుంది.
కాబట్టి కులం లోపల అంతర్ వివాహ పద్ధతిని కాపాడడానికి అదనపు స్త్రీ (వితంతువు)ని వదిలించుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఆ అనివార్యత లోంచే ఆనాటి కులవ్యవస్థ నిర్మాతలు సతీసహగమనాన్ని ఒక మార్గంగా ముందుకు తెచ్చారు. దానికి ఎక్కడా లేని పవిత్రతను, పాతివ్రత్యాన్ని ఆపాదించారు. కాని మరణించిన భర్త చితిమంటల్లో అదనపు స్త్రీని కాల్చేసి వదిలించుకోవడం ఎల్లకాలం ఆచరణ సాధ్యం కాని మార్గం. కనుక ఈ అదనపు స్త్రీని జీవితాంతం వితంతువు గానే ఉండేలా చేసే బలవంతపు వైధవ్యం రెండో మార్గంగా ముందుకు వచ్చింది. అయితే ఈ బలవంతపు వైధవ్యం లో స్త్రీ సక్రమమైన భార్యగా బతికే సహజమైన హక్కును కోల్పోవడం వల్ల ఎవరో ఒక పురుషునితో అక్రమ సంబంధం లోకి వెళ్లే అవకాశం ఉండడం వల్ల కుల (సముదాయ) నైతికతకు ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఏ పురుషునికీ ఆమెపై వ్యామోహం కలగని విధంగా ఆమెకు శిరోముండనం చేయడం, తెల్లని వస్త్రాలు ధరించాలని,బొట్టు,గాజులు వగైరాలను తొలగించి ఆమె పరిస్థితిని దిగజార్చే అమానవీయ కట్టుబాట్లను విధించడం అనేవి ముందుకొచ్చిన (అప)మార్గాలు.
మరి అదనపు స్త్రీ సమస్యను వదిలించు కున్నట్లుగా చనిపోయిన భార్యతో పాటే భర్తను కాల్చేయడం ద్వారా అదనపు పురుషుని సమస్యను వదిలించుకోవడం సాధ్యంగాని పని. ఎందుకంటే, అతడు మగవాడు కావడం (పితృస్వామ్యం) ఒక ప్రధాన కారణం. రెండవది, అదనపు పురుషున్ని ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండాలని కట్టడి చేయడం కూడా కుదరని పని. ఎందుకంటే పురుషుడు కులానికి ఒక బలమైన సభ్యుడు, అతి ముఖ్యమైన వాడు. అతడు వివిధ సాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటూ నిత్యం చురుకుగా ఉండి కుల సముదాయాన్ని కాపాడాలి. కనుక అతని ఇష్టాయిష్టాలకు ఎక్కువ విలువ ఉండడం పితృ స్వామిక సమాజంలో సహజమైన విషయం. అతని అస్తిత్వం పితృస్వామ్యానికి చాలా విలువైనది.
అయితే భార్య మరణించడం ఫలితంగా ఏర్పడ్డ అదనపు పురుషుని ఉనికి వల్ల కూడా అతని కుల సముదాయ నైతికత ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఇహలోక సుఖాలను త్యజించి విరాగులుగా ఉండాలని కట్టడి విధించడం కూడా అదనపు పురుషుని సమస్యా పరిష్కారానికి నిరుపయోగం. ఇక మిగిలింది అతన్ని గృహస్థు గా ఉంచడమే కుల సముదాయానికి ప్రయోజనకరమైన మార్గం. అదీ కుల సముదాయంలోని పెళ్లీడు రాని బాలికను అతనికి భార్యగా సమకూర్చాలి. ఈ బాలికా వివాహంతో అతడు (అదనపు పురుషుడు) కులం లోపలే ఉండి కుల కార్యకలాపాలలో మునుపటి లాగే పాల్గొంటాడు. ఫలితంగా అంతర్ వివాహ నియమం, కుల సముదాయపు నైతికతా పరిరక్షించబడతాయి.
కనుక భారత సమాజంలో అంతర్ వివాహ పద్ధతి అనేది కులవ్యవస్థను నిరంతరం పునరుత్పత్తి చేస్తుందని,కుల వ్యవస్థ పనితీరులో పితృస్వామిక స్త్రీ,పురుష సంబంధాలు ఒక ప్రముఖ పాత్ర వహిస్తాయని మనం సులభంగానే గ్రహించవచ్చు. పైగా పితృస్వామిక కుటుంబ వ్యవస్థ ను కొనసాగించడంలో పాతివ్రత్యం,మాతృత్వం లాంటి భావనలపై అనేకానేక ఆచారాలు సృష్టించి, నైతిక ఆదర్శాలను ప్రచారం చేసి కీర్తిస్తూ వాటికి సమాజంలో ఎప్పటికప్పుడు ఆమోదనీయతను సృష్టించడం పితృస్వామిక కులవ్యవస్థ పునర్ నిర్మాణానికి అవసరం అయ్యింది.
అందుకే ‘కుల నిర్మూలన’ అనే పుస్తకంలో 16 వ చాప్టర్లో అంబేద్కర్ చాతుర్వర్ణ వ్యవస్థలో స్త్రీల స్థానం గురించి చర్చించాడు. చాతుర్వర్ణ సిద్ధాంతం స్త్రీలకు కూడా వర్తించి ఉండినట్లైతే స్త్రీలలో పురోహితురాళ్లు,సైనికురాళ్లు ఉండి ఉండాలి కదా. కానీ ఆలా లేరు. ఎందుకంటే, చరిత్రలో స్త్రీ లను సైనిక, (వేద )విద్యా శిక్షణల నుండి, తత్సంబధిత విజ్ఞానాల నుండి దూరం చేసారు. స్త్రీల ఆస్తిత్వాన్ని లుప్తం చేసి, వారిని పురుషులకు నీడలుగా మార్చివేసి విభజించింది పితృస్వామిక బ్రాహ్మనిజం అనంటాడు.
ఆర్యుల కాలంలో స్త్రీలను శూద్రుల లాగే అథమ స్థానంలో ఉంచారు. వారిని మోక్షానికి కూడా అనర్హులుగా పరిగణించారు. కాని బౌద్ధం ఆ ఆర్య నియమాలను సాంతం ఉల్లంఘించి శూద్రులను భిక్ష్దుకులుగా నియమించినట్లే, స్త్రీలను కూడా పరివ్రాజికలుగా చేసింది. అలా బౌద్ధం శూద్రుల,కడజాతి వారి, స్త్రీల స్థాయులను అత్యున్నతంగా పెంచింది. అయితే తర్వాతి కాలంలో బ్రాహ్మనిజం మనుస్మృతి రూపంలో బౌద్ధంపై విజయం సాధించింది. బ్రాహ్మణిజం శూద్రుల పైనా, స్త్రీల పైనా విరుచుకు పడి, తిరిగి వారిని బానిసలుగా చేయడంలో సఫలమైంది. ఫలితంగా శూద్రులు బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య వర్ణాల కు బానిసలైతే, స్త్రీలు వారి వారి భర్తలకు బానిస లయ్యారు. ఇలా మెజారిటీ ప్రజలుగా ఉన్న శూద్రులను, స్త్రీలను శాశ్వతమైన బానిసత్వానికి, భ్రష్టత్వానికి గురిచేసి చరిత్రలో బ్రాహ్మనిజం పరమ అకృత్యానికి పాల్పడింది.
ముఖ్యంగా మనువు చేసిందేమిటంటే, అంతకు మునుపు సామాజిక సిద్ధాంతంగా ఉన్న దాన్ని రాజ్యాంగ చట్టాలుగా రూపొందించాడు. చాతుర్వర్ణ వ్యవస్థలో ముఖ్య సమూహాలుగా ఉన్న స్త్రీలను, శూద్రులను బౌద్ధం ప్రభావం నుండి మళ్ళించాలనేదే మనువు కోరిక. ఒకరకంగా ఆనాటి బౌద్ధం ప్రభావం వల్ల పితృస్వామిక కౌటుంబిక వ్యవస్థ కొంత మేరకు బీటలు వారింది. దానిని నిలువరించడానికే మనువు స్త్రీలపై అనేక రకాలైన అసమానతలను, అనర్హతలను విధిస్తూ మనుస్మృతిని రూపొందించాడు. ఈ విషయాలన్నింటినీ అంబేద్కర్ ‘హిందూ స్త్రీ ఉత్తాన పతనాలు: అందుకు బాధ్యులెవరు?’ అనే శీర్షికన రాసిన తన వ్యాసంలో వివరించాడు. ఇలా పితృస్వామ్యం, కుల వ్యవస్థ రెండూ పడుగూ, పేకల్లా అల్లుకుపోయిన ఫలితంగానే భారతీయ కుటుంబ వ్యవస్థ ఏర్పడి కొనసాగుతుందనేది స్పష్టాతిస్పష్టం.
అయితే ఈ ‘ఫెమినిస్టు అంబేద్కర్’ అనే పుస్తకం గురించి రాద్దామని కూర్చున్నప్పుడు, అంబేద్కర్ నాకు అస్తిత్వ వాదిగా కనబడలేదు. కనుక అంబేద్కర్ కేవలం దళితవాదీ కాడు, స్త్రీవాదీ కాడు. భారతదేశపు అట్టడుగు మట్టి పొరల్లోంచి చిగురించిన మొక్కలా సహజాతి సహజంగా పైకి ఎదిగివచ్చిన ఈ నేల కన్న బిడ్డడు, అచ్చ మైన దేశీయ ఆధునికతావాది.
అందుకే వలస పాలనా కాలంలోనూ, వలస పాలనానంతర కాలంలోనూ ప్రజల స్వాత్తత్య్రం పట్ల దృఢమైన అభిప్రాయాలు, ఖచ్చితమైన ఆధునిక దృక్పథం గలవాడుగా డా. బి. ఆర్.అంబేద్కర్ ని చరిత్రలో నిలుస్తాడు. ఈ దేశపు నిర్దిష్ట సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన పోరాటాలు నిర్దిష్టంగానే జరగాలని ఆయన భావించాడు. దానికి కట్టుబడే ఆయన ఆనాటి కమ్యూనిస్టులతో విభేదించాడు. ఒక్క కుల సమస్య విషయంలోనే కాదు, స్త్రీ సమస్య (పితృస్వామ్యం )విషయంలో కూడా ప్రత్యేక మహిళా పోరాటం అవసరమని ఆనాడే గుర్తించిన ప్రథముడు అంబేద్కర్. అలాగే ఆయన చారిత్రకంగా అందివచ్చిన అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ఎప్పటికప్పుడు తన వాదనలను ముందుకు తెచ్చి, ఆయా సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను ప్రతిపాదించినవాడు అంబేద్కర్.
బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగ రచనా కమిటీకి ఛైర్మన్ గా ఉన్న కాలంలో రావ్ కమిటీ రూపొందించిన హిందూ కోడ్ బిల్ ఆయన ముందుకు వచ్చింది. ఆయన దానిలో మౌలిక మార్పులు చేసి హిందూ కోడ్ బిల్లును తిరగరాసి 1948లో శాసన సభా కమిటీ ముందు ప్రవేశ పెట్టాడు. ఈ బిల్లులో అంబేద్కర్ కున్న ప్రగతిశీల భావనలన్నీ కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ బిల్లు పితృస్వామిక సంబంధాల పొందికను సవాల్ చేసింది. పురుషునితో సమాన హోదాను కల్పించి స్త్రీని గౌరవించింది. హిందూ స్త్రీకి పురుషులతో సమానంగా వివిధ హక్కుల్ని కల్పించింది.
స్త్రీకి విడాకులు ఇచ్చే హక్కును,మగ /ఆడ పిల్లలను దత్తత తీసుకునే హక్కును, తండ్రి ఆస్తి పై స్త్రీకి కూడా సమాన హక్కును, స్త్రీకి తన సొంత ఆస్తిని అమ్ముకునే హక్కును కల్పించింది. ఇష్టం లేకపోతే స్త్రీకి కూడా భర్తకు విడాకులు ఇచ్చే హక్కును, ఒకవేళ భర్త విడాకులు ఇస్తే భార్యకు భరణం పొందే హక్కును, కులాంతర, మతాంతర, రిజిస్టర్డ్ వివాహాలను చట్టబద్ధం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ కోడ్ బిల్లు పై ప్రగతిశీల శక్తులకు, ప్రతీఘాతుక సాంప్రదాయిక శక్తుల మధ్య భీకర యుద్ధం లాంటి భావ సంఘర్షణ జరిగింది. సనాతన హిందూమత నియమాలను ఒక అంటరానివాడు ధ్వంసం చేస్తున్నాడని సాంప్రదాయవాదులందరూ హిందూ కోడ్ బిల్లు ను వ్యతిరేకించారు. ప్రప్రథమ ప్రధాని పండిట్ నెహ్రూ సైతం ఈ బిల్లు విషయంలో మౌనం వహించాడు. అలా అనేక వాయిదాల తర్వాత ఈ బిల్లు చివరకు 1951లో సస్పెండ్ అయింది. అందుకు నిరసనగా అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవికే రాజీనామా చేశాడు.
ఈ విధంగా అంబేద్కర్ జెండర్ సమానత్వం కోసం ఆనాడే పోరాడాడు.
ఇలా అంబేద్కర్ రాజ్యాన్ని సామాజిక మార్పుకు ఒక బలమైన సాధనంగా భావించాడు. అలాగే (నియత) విద్య కూడా ప్రజలకు ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందని, విద్యను పొందే హక్కు అందరికీ ఉందని అన్నాడు. కాని రాను రానూ భారత పాలకవర్గాలు సామ్రాజ్యవాదానికి దాసోహమై పోయి రాజ్యాంగంలోని ప్రజానుకూల చట్టాలను నిర్వీర్యం చేస్తూ వస్తున్నారు. కొత్త కొత్త అప్రజాస్వామిక నల్ల చట్టాలను రూపొందించి ప్రజలను హింసిస్తూ సామ్రాజ్యవాద దోపిడీకి సహకరిస్తున్నారు. దేశీయంగా బ్రాహ్మణీయ, పితృస్వామిక భూస్వామ్య సంబంధాలను బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో రాజ్యపు స్వభావం మారిపోతూ వస్తున్నది. నానాటికీ (నియత) ప్రభుత్వ విద్యా వ్యవస్థ లోని ప్రజాస్వామిక అంశాలు హరించి వేయబడుతూ సామాజిక మార్పుకు అది ఇంకెంత మాత్రము ఒక సాధనంగా ఉండలేని స్థితి వచ్చింది.
ఎందుకంటే యూరప్ లో తొలిసారిగా ఆవిర్భవించిన పెట్టుబడి తనకుండిన ప్రగతిశీల స్వభావాన్ని రానురానూ కోల్పోతూ 1920 ల నాటికే సామ్రాజ్యవాదంగా విశ్వరూపమెత్తింది. అది మొదలు ప్రపంచంలోని ఏదేశపు పెట్టుబడికైనా ఇంకెంతమాత్రం ప్రగతిశీల పాత్ర పోషించడానికి చారిత్రకంగా అవకాశం లేకుండా పోయింది. అందువల్ల మన దేశీయ పెట్టుబడికి సైతం ప్రగతిశీల పాత్ర పోషించే స్వతంత్రత గాని, సామర్థ్యం గాని లేదు. అది కింద మారిన భూస్వామ్యం తో, బ్రాహ్మణీయ పితృస్వామ్యం తో మిలాఖతై, రెండూ కల్సి పైన సామ్రాజ్యవాదానికి లోబడి వుండాల్సిన పరాధీన స్థితిలో ఉండడం వల్ల ఉత్పత్తి శక్తులకు, ఉత్పత్తి సంబంధాలకు మధ్య వైరుధ్యం పరిష్కారం కాకుండా పోతున్నది. ఫలితంగా రాజకీయ పాలనలో ప్రజాస్వామ్యాన్ని, సమాజంలో సమానత్వాన్ని ఆశించలేం.
చివరగా- అంబేద్కర్ ను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఆయనకు ఉండిన ఆధునికతా దృక్పథంలో రాజ్యం, రాజ్యాంగ చట్టాల పాత్ర ఏమిటి? రాజ్యం, చట్టాలపై ఆనాటి సామ్రాజ్యవాదం పట్టు ఎలా ఉండింది? ఆనాటి దేశీయ పాలక వర్గాల దృక్పథ స్వభావాలేమిటి? స్వాతంత్ర్య ఉద్యమ ఆకాంక్షలకు, తర్వాతికాలం నాటి ప్రజాకాంక్షలకు మధ్య ఎలాంటి సారూప్యత ఉండింది?కులసమస్యపై ఆనాటి భారత కమ్యూనిస్టుల దృక్పథం ఏమిటి? ఫూలే, అంబేద్కర్ లాంటి వాళ్ళ పోరాటాలపై ఆనాటి కమ్యూనిస్టుల వైఖరి ఏమిటి? ఇలాంటి ప్రశ్నలెన్నింటినో వేసుకొని, జవాబులు వెతుక్కోవాలి. ఆ క్రమంలోనే అంబేద్కర్ ఆలోచనలను, ఆచరణను మనం సరిగ్గా అర్థం చేసుకొనగలం. లేకపోతే అంబేద్కర్ రాజకీయ దృక్పథంలోని పరిధి, పరిమితులను మనం శాస్త్రియంగా అర్థం చేసుకోలేము.
అలాగే సామ్రాజ్యవాదంతో పాటు బ్రాహ్మణీయ, పితృస్వామిక భూస్వామ్యపు పట్టు ఇంకా భారత సమాజం పై బలంగానే ఉన్నందువల్ల, దాన్ని దెబ్బకొట్టి బలహీనపరచడానికి జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ ల భావజాలాన్ని ఎత్తిపట్టి ,వారి పోరాటాలను మరింత ఉదృతంగా కొనసాగించాల్సిన అవసరం నేటికీ ఉంది.
అంబేడ్కర్ ని అర్థం చేసుకో లేకపోవడం, ఆయనను కులం దృష్టి తో చూడడం ఈ సమాజం చేసిన పెద్ద పొరపాటు….
మంచి వ్యాసం అందించారు అభినందనలు 💐💐💐💐🙏🙏🙏🙏