(2023 మే 2న, కశ్మీర్‌లో లోయలో రాజ్యహింసకు పాల్పడుతున్న ఒక ప్రసిద్ధ జర్నలిస్టును రెజాజ్ ఎం షీబా సైదీక్ ఇంటర్వ్యూ చేశారు. భారత ప్రభుత్వం నుండి రాబోయే పరిణామాలను ఊహించిన ఆ జర్నలిస్ట్ తన పేరు బయటపెట్టవద్దని అంటే అతనికి “ఫ్రీడమ్” (స్వేచ్ఛ) అని పేరు పెట్టాం.

హడావిడిగా తీసుకున్న ఈ చిన్న ఇంటర్వ్యూ వెనుక ఉన్న రాజకీయ కారణాన్ని తన పేరును అజ్ఞాతంగా వుంచాలనే అతని అభ్యర్థన నుండి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అనామకతను పిరికితనం అనే  దృష్టితో చూడలేం. కానీ “ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో” వున్న”ప్రజాస్వామ్యం- స్వాతంత్ర్యాల “వాస్తవాన్ని, భారతదేశ ప్రధాన భూభాగంలోనూ, కశ్మీర్‌లోనూ ప్రస్తుతం పత్రికా స్వేచ్ఛకున్న వాస్తవికతను ప్రతిబింబిస్తుంది. 2023 మే 3 న రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (సరిహద్దులు లేని విలేఖరులు) విడుదల చేసిన 2023 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ సూచికలో 180 దేశాలలో భారతదేశం 161వ స్థానానికి దిగజారింది.

ఆసిఫ్ సుల్తాన్, ఫహద్ షా, సజాద్ గుల్, ఇర్ఫాన్ మెహ్‌రాజ్‌ మొదలైన కశ్మీరీ జర్నలిస్టుల ఖైదు కశ్మీర్, భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఎలా క్రమంగా అంతరించిపోతోందో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు.

ఆ విషయం పైన మాట్లాడటానికి నేను కనీసం 10 మంది కశ్మీరీ జర్నలిస్టులను సంప్రదించాను, కాని వారిలో చాలా మంది అధికారికంగా మాట్లాడటానికి సిద్ధంగా లేరు. రాజ్యమూ, రాజ్యహింసల పరిణామాలను పేర్కొంటూ సున్నితంగా తిరస్కరించారు. మరో అవార్డు గెలుచుకున్న, జైలు శిక్ష అనుభవించిన ఒక కశ్మీరీ ముస్లిం జర్నలిస్ట్ ఇంటర్వ్యూ యిచ్చారు కానీ సాంకేతిక సమస్యల వల్ల వారితో సంపర్కం తెగిపోవడంతో  తిరిగి ఇంకొక ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది.

ఈ ఇంటర్వ్యూ అనేక పరిమితుల మధ్య కఠినమైన షెడ్యూల్‌లో జరిగింది. ఇది రెజాజ్ నిర్వహించిన ఇంటర్వ్యూకి వ్రాతపతి. మరింత స్పష్టంగా అర్థమవడానికి కొన్ని మార్పులు చేసాం)

రెజాజ్: భారతదేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది. ప్రజాస్వామ్యపు నాల్గవ స్తంభాన్ని మిగిలిన మూడు స్తంభాలు నాశనం చేస్తున్నాయి. కాశ్మీర్ ప్రెస్ క్లబ్‌ను ప్రభుత్వం మూసివేసింది. “రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్” వారి 2022 వరల్డ్ ప్రెస్ ఇండెక్స్‌‌లో భారతదేశం 180 దేశాలలో 150వ స్థానంలో నిలిచింది. జాతీయతను ఖైదు చేసే పెద్ద జైలులో ఖైదు అయిన కశ్మీరీ  ప్రెస్ ఎంతకాలంగా అత్యవసర దశకు గురైంది? కశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న పత్రికా స్వేచ్ఛాస్థితిని పరిష్కరించడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారా?

స్వేచ్ఛ: దురదృష్టవశాత్తూ, కశ్మీర్‌లో దిగజారుతున్న పత్రికా స్వేచ్ఛాస్థితి తరచుగా గణనీయమైన దృష్టిని ఆకర్షించడంలో విఫలమవుతోది. అవసరమైనంత పట్టింపు, మద్దతు లేదా ఫాలో-అప్ లేకుండా కశ్మీరీ జర్నలిస్టులు ఈ సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. రాజ్యాధికారం వారిపై అమలుచేస్తున్న రోజువారీ వేధింపులను ఎవరూ ఎక్కువగా గమనించరు. కశ్మీరీ జర్నలిస్టుల దుస్థితికి ఇంత పరిమితమైన మద్దతు ఎందుకు లభిస్తుందనేది అయోమయంగా ఉంది, అర్థం చేసుకోలేకపోతున్నా. వారి అనుభవాలు దేశ ప్రధాన భూభాగంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న కష్టాలకంటే ఎంతో ఎక్కువగా వున్నాయి. కశ్మీరీ జర్నలిస్టులకు మద్దతు లేకపోవడం నన్ను అబ్బురపరిచింది. ఈ నిరుత్సాహకర వాస్తవికతకు అనేక కారణాలు ఉండవచ్చు.

కశ్మీర్ ప్రెస్ క్లబ్ మూసివేతను మీడియాపై విస్తృతమైన అణిచివేత సందర్భంలో చూడాలి. ప్రెస్‌క్లబ్‌ను మూసేయడం హఠాత్తుగా జరిగిన ఒక మూలమలుపుగా నేను అనుకోవడం లేదు. జర్నలిస్టులుగా మా హక్కులను క్రమంగా హరించడాన్ని, చివరికి పూర్తిగా అంతరించిపోవడాన్ని మేము రాత్రింబగళ్ళు చూస్తున్నాం. ఇది పూర్తిగా ఆశ్చర్యం కలిగించనప్పటికీ, మా గుర్తించదగ్గ అసఫలతను సూచిస్తుంది.

కశ్మీర్‌ జర్నలిస్టులు చాలా కాలంగా ఈ అణిచివేతను ఎదుర్కొంటున్నారు. అయితే 2019 ఆగస్టు తర్వాత, రాజ్యానికి  ప్రెస్‌క్లబ్‌లను మూసేయాల్సిన అవసరం కనిపించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

రెజాజ్: రాజ్య హింస, కార్పొరేట్ దోపిడీ, సైనిక వేధింపులు, పేదరికం, మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా రాసే కథనాలు ప్రభుత్వాన్ని కలవరపరుస్తాయి. అణచివేత నుండి ప్రజల స్వేచ్ఛ కోసం జర్నలిజం అని చెప్పగలమా? ఘర్షణ ప్రాంతంలో సామాన్య ప్రజలకు కశ్మీరీ జర్నలిస్టులు ఎలా సహాయం చేస్తున్నారు?

స్వేచ్ఛ: ప్రజలను అణచివేత నుండి విముక్తి చేసే ధ్యేయంతోనే జర్నలిజం ఉనికిలో ఉందని నేను చెప్పలేను. కశ్మీర్‌లో, జర్నలిజం చాలా కాలం పాటు జర్నలిజంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఒక నిర్దిష్ట ఫలితాన్ని సాధించే అంతర్లీన ఉద్దేశం చాలా అరుదుగా ఉండింది. కథనం ముద్రణ అయ్యేలా చూడడం, ప్రజలు తమ స్వీయ అవగాహన ప్రకారం ప్రతిస్పందించడం, అర్థం చేసుకొనేలా చేయడం, ఇక్కడ ఏమి జరుగుతుందో బయట ప్రజలకు తెలియజేయడం అనేది సాధారణంగా మా ప్రాథమిక లక్ష్యంగా వుంటుంది .

ఇక్కడ విషయాలను అటు లేదా యిటూ అని తేల్చి చెప్పలేము. అన్నీ విషయాలూ నలుపు-తెలుపుగా వుండవు , చాలా మటుకు మధ్యస్థంగా ఉంటాయి. చాలా సార్లు, ఈ కథనాల ద్వారా లోయలో జరుగుతున్న అనేక మానవ హక్కుల ఉల్లంఘనలను వెలుగులోకి తీసుకురాగలుగుతారు. ఈ కథనాలను ప్రధాన స్రవంతి మీడియా సాధారణంగా పక్కన పెట్టేస్తుంది లేదా విస్మరిస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ సమస్య పట్ల ప్రజల మధ్య చర్చలను రేకెత్తిస్తాయి. కథ బలవత్తరంగా వుంటే ప్రజా దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ కథాంశాలకి వ్యతిరేకంగా రాజ్యం ఏదైనా చర్య చేపట్టినప్పుడు అది ఒక కవచంగా పనిచేస్తుంది. అయితే, ఒక రిపోర్టర్ ఏదైనా కథనాన్ని రాసి, ముందుకు సాగిన తర్వాత కూడా, రాజ్యం చేపట్టే చర్యల వల్ల బాధపడుతున్న వ్యక్తులను కూడా నేను చూశాను. కొంతమంది జర్నలిస్టులు కశ్మీరీలను కేవలం కథలుగా, కథా విషయంగా, తమ పదోన్నతికి ఒక ఇంధనంగా మాత్రమే చూస్తారు.

రెజాజ్: బ్రాహ్మణ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా మాట్లాడిన గౌరీ లంకేష్ వంటి జర్నలిస్టులను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ హత్య చేసింది.  కఠినమైన UAPA కింద జైలులో మగ్గుతున్న రూపేష్ కుమార్ సింగ్, గౌతమ్ నవలఖా వంటి జర్నలిస్టుల గొంతులను విమర్శనాత్మక జర్నలిజం చేసి, కశ్మీర్, మైనారిటీల కోసం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు అణిచివేస్తోంది. ఈ పరిస్థితుల్లో మీరు జర్నలిజాన్ని ఎలా విశ్లేషిస్తారు, కశ్మీర్ వెలుపల మీడియా స్వేచ్ఛను ఎలా చూస్తారు?

స్వేచ్ఛ: ఈ అణిచివేత పద్ధతుల్లో చాలా వరకు మొదట కశ్మీర్‌లో ప్రయోగించారు, ‘కశ్మీర్ ఒక ప్రయోగశాల’ అని చాలా ప్రజాదరణ పొందిన సామెత ఉంది. ఇది కాశ్మీర్‌లో పని చేసినప్పుడు, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తారు. “మేము ఇక్కడ మీడియాను లేదా ప్రజలను అణచివేయడానికి ప్రయత్నించాము. అది పనిచేసింది. మిగిలిన భారతదేశంలో కూడా ఉపయోగిద్దాం అని వారు అంటారు.”  కేవలం జర్నలిజంలోనే కాదు, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న అనేక ఇతర విధానాల్లో కూడా అలా జరగడం నేను చూశాను.

భారతదేశం వెలుపల జర్నలిజం గురించి, అది చెడు నుండి అధ్వాన్నంగా మారిందని నేను చెప్పను ఎందుకంటే అది ‘రోజుకు 24 గంటలు వుంటాయి’ లేదా అలాంటి ‘ కుంటి సాకులు చెప్పడం లాంటిది. భారతదేశంలో జర్నలిజం ఏమైందో అందరికీ తెలిసిందే. చాలా మంది జర్నలిస్టులు ఇప్పటికీ తమకు సాధ్యమైన మార్గాలు, వనరుల నుండి ఆబ్జెక్టివ్ జర్నలిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారి వల్ల భారతదేశంలో జర్నలిజం కొంతవరకు మనుగడలో ఉంది. కానీ సంక్షిప్తంగా చెప్పాలంటే నాశనమైపోయింది.

రెజాజ్: కశ్మీరీ జర్నలిస్టులు, ప్రత్యేకించి కశ్మీరీ ముస్లిం జర్నలిస్టులు తరచుగా “ఉగ్రవాదులను” కీర్తిస్తున్నారని ఆరోపిస్తారు. అదే విధంగా UAPA ఖైదీల కోసం హాజరయ్యే న్యాయవాదులను “ఉగ్రవాదుల స్నేహితులు”గా చూస్తారు. కశ్మీరీలకు వ్యతిరేకంగా ఇస్లామోఫోబియా(ఇస్లాం లేదా ముస్లింల పట్ల ముఖ్యంగా రాజకీయ శక్తిగా ద్వేషాన్ని కలిగివుండడం ; వారిపై దాడి చేయడం, లేదా వివక్షతా చర్యలు అమలు చేయడం మొదలైనవి), జెనోఫోబియా (సెక్స్ లేదా లైంగిక సాన్నిహిత్యం అంటే భయం; ఇది సాధారణ అయిష్టం లేదా విరక్తి కంటే ఎక్కువ) ప్రబలంగా ఉన్నప్పుడు మీరు వృత్తిపరంగా ఎలా చూస్తారు?

స్వేచ్ఛ: ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలోని ప్రధాన భూభాగం నుండి కశ్మీరీ జర్నలిస్టులకు పెద్దగా మద్దతు లేదని నేను మొదట్లో చెప్పినదానికి ఇది పాక్షికంగా సమాధానం ఇస్తుంది. జర్నలిస్టులను కశ్మీరీ ముస్లింలుగా గుర్తించడమే దీనికి కారణమని నేను నమ్ముతున్నాను. ఈ దేశంలో ఒక ముస్లింని తీవ్రవాదిగా లేదా తీవ్రవాద సానుభూతిపరుడిగా ముద్ర వేయడం చాలా సులభం. అందులోనూ ఒక వ్యక్తి కశ్మీరీ ముస్లిం అయినప్పుడు, ఆ కశ్మీరీ ముస్లిం రాజ్య అణచివేత గురించి వ్రాసే జర్నలిస్ట్ అయినప్పుడు, రాజ్యానికి మరింత సులభమవుతుంది. వారు ఏమైనా చెప్పి తప్పించుకోగలరు. నేను చూశాను; అలా జరగడం మనమందరం చూశాం.

రెజాజ్: ఫహద్ షా, ఇర్ఫాన్ మెహ్రాజ్, సజాద్ గుల్, ఆసిఫ్ సుల్తాన్‌ల అరెస్టుపై చాలా మంది భారతీయ జర్నలిస్టులు, మీడియా సంస్థలు మౌనంగా ఉండటానికి గల కారణాలేమిటంటారు?

స్వేచ్ఛ: ఒక కశ్మీరీ ముస్లిం జర్నలిస్టు కోసం రాయడం, వైఖరి తీసుకోవడం విషయానికి వస్తే ఒక పక్షపాత దృష్టి ఉంది. ఇందులో గుర్తింపు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నేను భావిస్తున్నాను.

రెజాజ్: జర్నలిజం నేరం అనే సందేశాన్ని ఇస్తూ జర్నలిస్టులపై UAPA, PSA, రాజద్రోహం వంటి క్రూరమైన చట్టాలను ప్రయోగిస్తున్నారు. చాలా మంది కశ్మీరీ జర్నలిస్టులు రాజ్య అణచివేత కారణంగా ఈ వృత్తిని విడిచిపెట్టినట్లు నివేదికలు వచ్చాయి. ఇలా జర్నలిస్టులను నేరస్తులుగా చేయడాన్ని ఎలా అంతం చేయగలం?

స్వేచ్ఛ: ఇది విధాన నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని నేను భావిస్తున్నాను. సమాచారాన్ని సేకరించి  రిపోర్టులు తయారు చేయడానికి విలేఖరులను అనుమతించినప్పుడే  ప్రజాస్వామ్యం విలసిల్లుతుందని ప్రభుత్వం గ్రహించాలి. అప్పుడే ప్రభుత్వం తన  విధానాల యోగ్యతని,  వాస్తవంలో వాటి ప్రభావం ఏమిటో చూసి, మెరుగుపరుచుకోగలుగుతుంది. కానీ ప్రస్తుత లేదా గత ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి ఛాంపియన్లు కాదు కాబట్టి ఇది ఒక మూర్ఖపు లేదా ఆదర్శప్రాయమైన ఆలోచన మాత్రమే అవుతుంది. అలా జరుగుతుందా అని నేను ఆలోచిస్తున్నాను. ఏమైనప్పటికీ విషయాలు మెరుగ్గా, పారదర్శకంగా వుండి, ప్రజలకు సులభతరం చేయాలని వారు కోరుకోరు; పత్రికా స్వేచ్ఛను మెరుగుపరిచినట్లయితే ఏమి జరుగుతుందనే ప్రకాశవంతమైన మరో కోణాన్ని చూడడానికి ఇష్టపడరు. అందువల్ల, వారు తమ విధానాలను సరిదిద్దుకోడానికి ప్రయత్నిస్తున్నారనే ఆలోచనకు అవకాశమే లేదు. ఆందోళన కలిగించే దృష్టాంతాలను మేం యింతకు ముందు చూశాం. వీటికి విస్తృతమైన, ఏకీకృత మద్దతు లేదా లేకుండా, అర్ధవంతమైన మార్పు అనేది చాలా సుదూరమైనదిగానూ, అనూహ్యంగానూ వుంటుంది.

గౌతమ్ నవలఖాను అరెస్టు చేసినప్పుడు, చాలా విస్తృతమైన ఐక్య ప్రతిఘటన ఏర్పడి ఉంటే, ప్రభుత్వాన్ని తలవంచి జవాబుదారీగా ఉండేలా చేసి ఉండేది. అలా జరిగే వరకు, ఇది ప్రజల మద్దతు అయితే, కశ్మీర్‌వాలా ఎడిటర్ ఫహద్‌ని అరెస్టు చేయడంతో సహా మరిన్ని ప్రమాదకరమైన పూర్వప్రమాణాలు స్థిరపడుతూనే ఉంటాయి. ఫహద్ మరణం కాశ్మీర్‌లో జర్నలిజానికి మైలురాయిగా అనిపించింది. ఎందుకంటే, ఆ తర్వాత సమాచారంతో సంపర్కమే లేకుండా పోయింది. వాస్తవంగా ఏ కథనాలు బయటికి రాలేదు.

గ్రేటర్ కాశ్మీర్, రైజింగ్ కశ్మీర్, కశ్మీర్ అబ్జర్వర్ లాంటి ఏదైనా ఒక వార్తాపత్రిక  పేజీలను తెరిచి మొదటి పేజీ ఎలా ఉందో చూడండి. అవన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ నిధులతో చేసిన ప్రకటనలతో నిండి వుంటాయి.  ప్రధాన శీర్షికలు రెండవ ప్రధాన కథనాలు కూడా అతనికి చెందినవే. కాశ్మీర్‌లోని ప్రచురణలు కేవలం ప్రభుత్వ సమాచార శాఖ మెసెంజర్‌గా మాత్రమే రూపాంతరం చెందాయి. ఇది కరపత్రాలు మాత్రమే. అవి ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌గా మారిపోయాయి. దీన్ని ఉద్దేశపూర్వకంగా మనసులో నాటి ముందుకు తీసుకెళ్తున్నారు. వార్తాపత్రికల కవరేజ్ మొత్తం లెఫ్టినెంట్ గవర్నర్ దేని గురించి, ఏమంటున్నాడు, పోలీసులు ఏమంటున్నారు అని వుంటుంది అంతే. ప్రస్తుతం కశ్మీర్ నుంచి వస్తున్న వార్తలన్నీ ఇవే.

రెజాజ్: బంగ్లాదేశ్ జర్నలిస్టుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ వేధింపులకు గురికావడం, వారిపై జరిగిన దాడుల గురించి నేను చదివాను. కశ్మీరీ జర్నలిస్టుల కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి? జర్నలిస్టుల మానసిక ఆరోగ్యం ఎంత దారుణంగా ప్రభావితమవుతోంది?

స్వేచ్ఛ: ఒక యువకుడు ఖైదు చేయబడితే, బాధపడేది అతను మాత్రమే కాదు, కుటుంబమంతా కూడా బందీగా మారిపోతుందని ఒక ప్రసిద్ధ సామెత వుంది. ఈ కుటుంబాలు జర్నలిస్టులపై ప్రభుత్వ, రాజ్య అణచివేత, బెదిరింపుల భారాన్ని భరిస్తున్నాయి. ఈ, ఎందుకంటే ఒక కుటుంబం ఇలాంటి విషమ పరీక్షలో చిక్కుకుపోయిన పరిస్థితి తరచుగా అపరాధ భావాన్ని రేకెత్తిస్తుంది. నేరానికి బాధ్యులు కానప్పటికీ, వారు ఈ పోరాటంలో పాల్గొనేలా చేసే బాధ్యత వహించేలా చేయాలనే మానసిక స్థితికి గురవుతాం. దీనిని మనం నిరంతరం ఎదుర్కొనే యుద్ధంతో పోల్చవచ్చు. కానీ మా కుటుంబాలు ఎటువంటి ఎంపిక లేకుండా అసంకల్పితంగా ఈ సంఘర్షణలోకి లాగబడుతున్నాయి. ప్రభుత్వం సృష్టించిన పరిస్థితులకు బందీలుగా మారుతున్నాయి.

రెజాజ్: మీ జర్నలిజం ప్రపంచంలోనే అత్యంత సైనికీకరణ జరిగిన ప్రాంతంలో ఉంది. మీరు వ్యక్తిగతంగా లేదా మీ వార్తా సంస్థ భారత రాజ్యం నుండి, ప్రత్యేకించి ప్రస్తుత డిజిటల్ నిఘా యుగంలో, ఏదైనా నిఘా లేదా దాడిని ఎదుర్కొన్నారా,?

స్వేచ్ఛ: నిఘాలో వున్నామనే భావం ఎల్లప్పుడూ ఉంటుంది. కశ్మీర్‌లో పనిచేస్తున్న ప్రతి కశ్మీరీ జర్నలిస్టు తమను ఎవరు గమనిస్తున్నారు, ఎవరు అనుసరిస్తున్నారు లేదా ఫోన్ సంభాషణలను వింటున్నారా అని చూసుకుంటూనే ఉంటారు. కళ్ళు ఎప్పుడూ కిటికీ బయట గమనిస్తూనే వుంటాయి.

ప్రెస్‌పై దాడుల కోణంలో, ఇదంతా జరుగుతున్నదని నేను భావిస్తున్నాను. దాడులు నిరంతరం జరుగుతుంటాయి, పునరావృతమవుతాయి. కొన్నిసార్లు, వారు చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటారు. ఒక్కసారిగా మొత్తంగా అంతమైపోవాలని మీరు కోరుకుంటారు. కానీ అలా జరగదు. చాలా నెమ్మదిగా, క్రమక్రమంగా మరణిస్తున్న జర్నలిజాన్ని మేము ప్రస్తుతం అనుభవిస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన అనుభవం.

రెజాజ్: కోవిడ్, ఆర్టికల్ 370 రద్దు కాశ్మీర్‌లోని మీడియాను ఎలా ప్రభావితం చేసాయి?

స్వేచ్ఛ: కోవిడ్ పరిస్థితి, ఆర్టికల్ 370 రద్దు, ఆ సమయంలో లాక్‌డౌన్‌తో పాటు, రెవెన్యూని, బయట తిరిగే సామర్థ్యాన్ని బాగా ప్రభావితం చేసింది. కశ్మీర్‌లో మీడియా స్వేచ్ఛను మరింతగా అణిచివేసేందుకు ప్రభుత్వం కోవిడ్, ఆర్టికల్ 370 రద్దు తర్వాత, లాక్‌డౌన్ వంటి పరిస్థితులను ఒక సాధనంగా ఉపయోగించుకోవడం మనం చూశాము. కదలికలను  అనుమతించలేదు. ఈ ప్రాంతంలోని వైద్య సదుపాయాల గురించి కూడా నివేదించడానికి మాకు అనుమతి లేదు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో రాస్తున్న వ్యక్తులపై రాష్ట్ర విపత్తు చట్టాన్ని ప్రయోగించింది. ఎవరినీ వదలలేదు. జర్నలిస్టులు, పౌరులతో సహా ప్రతి ఒక్కరూ రాజ్య ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు.

రెజాజ్: చివరగా, జర్నలిజం రాజకీయ క్రియాశీలత కాదని కొందరు వాదించారు. ప్రత్యేకించి కశ్మీర్‌పైనా, జర్నలిస్టులపైనా ఉపయోగించిన క్రూరమైన చట్టాల రాజకీయ స్వభావం నేపథ్యంలో మీరు ఈ దృక్కోణంతో ఏకీభవిస్తారా?

స్వేచ్ఛ: పాఠ్యపుస్తక సమాధానం అనే అర్థంలో మాట్లాడుతూ, జర్నలిజం రాజకీయ క్రియాశీలత కాదని నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే అదే సమయంలో కశ్మీర్ గురించి మాట్లాడితే అది రాజకీయంగా మారుతుంది. అంతా రాజకీయం అవుతుంది. కశ్మీర్‌లోని ప్రధాన స్రవంతి పత్రికలు ఈరోజు రాస్తున్నది, ప్రచురిస్తున్నది ఒక  రాజకీయ ఆలోచన. ఇది ఒక నిర్దిష్ట రాజకీయ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడం లాంటిది. ఈరోజు మనం కశ్మీర్ లేదా విశాల దృక్పథంలో భారతదేశం గురించి మాట్లాడేటప్పుడు మనం రెండింటి మధ్య తేడాను గుర్తించలేము. జర్నలిస్టులు అలా చేయరు. కానీ అంతిమంగా రాజకీయ క్రియాశీలతకు దారితీసే సంవాదాలను రూపొందించడానికి వారికి తరచుగా శక్తి, సాధనాలు ఉంటాయి అనేది నా ప్రాథమిక అవగాహన.

Kashmir Is An Experimental Lab

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply