ప్రజా శేయస్సును పక్కన పెట్టి కార్పొరేట్ దోపిడీకి అనుకూలంగా వుండే అభివృద్ధి నమూనాను విధించే ప్రయత్నంలో అటవీ భూముల నుండి తమని నిర్వాసితులను చేయడానికి ప్రయత్నిస్తున్న రాజ్యంతో ఆదివాసులు పోరాడుతున్నారు . సాంప్రదాయకంగా జీవించే భారతీయ ఆదివాసులు జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడుతూ నిరంతర పోరాటంలో చిక్కుకున్నారు. అనివార్యంగా విదేశీ మూలధనంపై ఆధారపడే ప్రాజెక్ట్‌ల కోసం, భారతదేశ సహజ వనరుల కార్పొరేట్ దోపిడీ కోసం అడవుల్లో నివసించేవారిని చట్టబద్ధంగా నిర్వాసితులను చేసేందుకు రాజ్యానికి అటవీ హక్కుల చట్టం 2006(ఫారెస్ట్ రైట్స్ యాక్ట్-ఎఫ్ఆర్ఎ), ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 (ఎఫ్‌సిఎ) వంటి చట్టాలు రాజకీయ సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.
“పరిరక్షణ” అనే ముసుగు లేదా “నష్ట పరిహారం యిచ్చి అటవీ నిర్మూలన” వంటి ప్రహసనాల పేరుతో పర్యావరణంపై ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసే సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనాను కూడా ఈ చట్టాలు సులభతరం చేస్తాయి. జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణుల, పులుల అభయారణ్యాలు వంటి ప్రత్యేక రక్షిత ప్రాంతాలను సృష్టించడం ద్వారా అటవీ భూముల్లోని విస్తారమైన ప్రాంతాలపై రాజ్యం తన నిర్దిష్ట ప్రభావాన్ని మరింతగా విస్తరిస్తుంది. ఎఫ్ఆర్ఎ, ఎఫ్‌సిఎ వంటి చట్టాలు ఆదివాసీలకు అందించడానికి ప్రతిపాదించబడిన ప్రజాస్వామిక అవకాశాలు కూడా బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం యుగంలో నిరంతరం క్షీణిస్తున్నాయి.
ఆదివాసీల అటవీ భూములపై ప్రాజెక్టులను ఆమోదించడానికి ముందస్తుగా గ్రామసభ సమ్మతి అవసరాన్ని తొలగించడానికి 2022 సవరణ తర్వాత ప్రభుత్వం అనుమతించింది; ఇప్పటికే పలుచన చేయబడిన, పనికిరాని ఆదివాసీల చట్టపరమైన రక్షణలపై దాడి ఎఫ్‌సిఎ కోసం ప్రతిపాదించిన కొత్త సవరణలతో మరింతగా కొనసాగింది.
వార్తల్లో వున్న అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు-2023 ప్రజలలో గణనీయమైన వివాదాన్ని రేకెత్తించింది. ప్రస్తుతం రాజ్యసభలో చర్చ కోసం వేచి ఉంది. బహుశా జూన్‌లో దాదాపుగా ఎటువంటి చర్చ లేకుండా లోక్‌సభ ఆమోదించిన తర్వాత అమలులోకి వస్తుంది.
కొత్త సవరణలు ప్రవేశపెట్టిన మార్పులు స్థూలంగా ఈ క్రింది విధంగా ఉన్నాయి:
మొదటిది, చట్టం కింద రక్షిత ప్రాంతంగా ఉండాలనే దానికి సంబంధించి కొన్ని సుప్రీం కోర్టు తీర్పులు మంజూరు చేసిన సడలింపులను తొలగించడానికి “అడవి” అనే పదాన్ని మారుస్తుంది.
రెండవది, “జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక వరుస ప్రాజెక్టులను” చేపట్టేందుకు సరిహద్దు భూముల్లో అడవులను నిర్మూలించడానికి అనుసరించాల్సిన విధానపరమైన అవసరాలకు మినహాయింపును మంజూరు చేస్తుంది, అటువంటి ప్రాంతాలలో అటవీ భూములను, అక్కడి జనాభాను తొలగించి రోడ్డు మార్గాలు, రైల్వేలు, పారిశ్రామిక ప్రాజెక్టులను నిర్మించడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా, “వామపక్ష తీవ్రవాద” ప్రభావిత ప్రాంతాల్లో”జాతీయ భద్రత” పేరుతో ప్రజల ప్రతిఘటనను అణచివేయడానికి ప్రభుత్వానికి మినహాయింపునిస్తుంది.
మూడవది, అటవీ భూములలో జంతుప్రదర్శనశాలలు, ‘ఇకో-టూరిజం(పర్యావరణ హిత)’ సౌకర్యాలు వంటి కొన్ని అటవీయేతర కార్యకలాపాలను బిల్లు అనుమతిస్తుంది. ప్రధానంగా వీటికి ప్రపంచ బ్యాంకు నిధులు సమకూరుస్తుంది; సామ్రాజ్యవాద సంపదకు సేవ చేస్తుంది. ఇది ఈ ప్రాంతాల పర్యావరణ వ్యవస్థలపై, అటువంటి ప్రాజెక్టుల ప్రయోజనాల కోసం నిర్వాసితులయ్యే / జీవనోపాధిని కోల్పోయే జనాభాపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది.
‘ఫారెస్ట్’ (అడవి) పదంలో మార్పు అంటే అర్థం ఏమిటి?
భారతదేశపు చట్టపరమైన చట్రంలోపల ‘అడవి’ అనే పదానికి తిరిగి నిర్వచనం యివ్వడం చుట్టూ బిల్లు దృష్టి కేంద్రీకృతమై వుంటుంది.
ఏదైనా సంబంధిత చట్టం లేదా అధికారిక ప్రభుత్వ రికార్డులతో సహా భారతీయ అటవీ చట్టం-1927 ప్రకారం ‘అడవులు’గా నమోదు అయినవి మాత్రమే ఈ చట్టం పరిధిలో ‘అడవులు’గా గుర్తింపు పొందాలనే నిబంధన యిందులో వుంది.
దీన్ని మరింతగా అర్థం చేసుకోవడానికి, టి ఎన్ గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1996 తీర్పును ప్రస్తావించడం చాలా అవసరం. భారతదేశంలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణపై ఈ తీర్పు కేంద్రీకృతమై ఉంది. అడవులలో చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ, వన్యప్రాణ సంరక్షణను ప్రోత్సహించడం, పర్యావరణ చట్టాలను అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఫలితంగా భారతదేశంలోని అటవీ ప్రాంతాలను సంరక్షించడానికి సుప్రీం కోర్టు ముఖ్యమైన ఆదేశాలు వచ్చాయి. తన నిఘంటువు నిర్వచనంని “అడవి”కి అన్వయించడం ద్వారా ఈ తీర్పు అటవీ సంరక్షణ చట్టం పరిధిని విస్తృతం చేసింది. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఈ తీర్పు ఫలితం ఆదివాసీ సముదాయాలకు ఏ మాత్రం అందడం లేదు.
వాస్తవానికి, ఈ తీర్పు పర్యావరణం, పరిరక్షణ ప్రయత్నాలలో సుప్రీం కోర్టుని ఒక ఛాంపియన్‌గా చూపవచ్చు, కానీ వాస్తవానికి సుప్రీం కోర్టు 2019 తీర్పులో అడవుల్లో నివసించే ఆదివాసీలను చట్టబద్ధం చేయడానికి, అలా కానివారిని తొలగించాలని ఆదేశించడంపై కేంద్రీకరించింది. ఆ తీర్పు అటవీ భూమిపై సాంప్రదాయ అటవీ నివాసుల 11.8 లక్షల దావాలను తిరస్కరించడంతోపాటు, అలా తిరస్కరించబడిన జనాభాను త్వరగా తొలగించాలని కూడా 16 రాష్ట్రాలను ఆదేశించింది.
అటవీ పరిరక్షణ చట్టానికి చేసిన సవరణలు గోదావరమన్ తీర్పు ఆదివాసీలకు అందించినట్లు కనిపించే స్పష్టమైన, నిజాయితీ లేని చట్టపరమైన రక్షణలను కూడా పలుచన చేస్తాయి. అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు 2023 ప్రకారం, 1980 అక్టోబర్ 25 తరువాత నుండి ప్రభుత్వ పత్రాలలో అధికారికంగా అడవులుగా గుర్తించిన ప్రాంతాలకు చట్ట పరిధి పరిమితం అవుతుంది. అందువల్ల ప్రత్యామ్నాయ ప్రయోజనాల కోసం విస్తృతంగా అటవీ భూముల బదలాయింపులకు దారితీయడంలో ఈ ప్రభావం కనిపిస్తుంది. అడవి తొలగింపుకు అనుమతులను పొందడం, స్థానిక సముదాయానికి అవసరమైన సమాచారం యిచ్చి సమ్మతి కోరడం లాంటి చట్టం అందించిన రక్షణలను 2022లో చేసిన సవరణ ఇప్పటికే తొలగించింది.
ప్రత్యేకించి హానికిగురయ్యే ఆదివాసీ సమూహం (పివిటిజి – పర్టిక్యులర్లి వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్) డోంగ్రియా కోండ్ నివసించే ప్రాంతాలు వున్న ఆరావళి శ్రేణిలో సుమారు 40%, నియమగిరి కొండల శ్రేణిలో 95% పైన గణనీయంగా ప్రభావితమవుతాయి.
ఈ సవరణలు అటవీయేతర, కార్పొరేట్ ప్రయోజనాల కోసం అడవులను బదిలీ చేయడానికి సంబంధించి రాజ్యానికి మరింత అధికారాన్ని ఇవ్వడమే కాకుండా, సామ్రాజ్యవాద, వర్గ ఆధారిత అభివృద్ధిని తప్పనిసరిగా ప్రోత్సహించడానికి మన సహజ వనరులను, భూమిని దోపిడీ చేయడానికి చట్టాన్ని ఎలా ఉపకరణంగా ఉపయోగించవచ్చనేది కూడా చూపిస్తాయి.
“అభివృద్ధి భారం”: అభివృద్ధి ఎవరి కోసం?
అభివృద్ధికి సంబంధించి ప్రజా వ్యతిరేక నమూనాను ప్రతిపాదిస్తున్నట్లు అటవీ (పరిరక్షణ) సవరణ బిల్లు ప్రాథమిక విశ్లేషణలో స్పష్టమవుతుంది. ఇది ఆదివాసీ సముదాయాలపై పరాన్నజీవి. వారి జీవనశైలికి హాని కలిగించే అభివృద్ధి నమూనాకు మద్దతుగా అటవీ భూముల నుండి వారిని నిర్వాసితులను చేయడంపై ఆధారపడింది. “అభివృద్ధి” అనే రాజ్య దృక్పథానికి మద్దతుగా భారతీయ అడవులలో చారిత్రాత్మకంగా నివసించే ఆదివాసీ సమూహాలపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి చరిత్రనే భారతదేశంలోని అటవీ “పరిరక్షణ” చట్టాల చరిత్ర.
వలసరాజ్యాల కాలంలో, భారతీయ అడవులను ఆ రాజ్యాల “అభివృద్ధి”ని ముందుకు తీసుకువెళ్ళే ప్రాజెక్టులకు వనరులను సమకూర్చే అజ్ఞాత గనిగానూ, రైల్వేలు, కార్యాలయాలులాంటి వలసరాజ్యాధిపతుల మౌలిక సదుపాయాల నిర్మాణంలో సహాయపడేవిగానూ గుర్తించారు.
అందువల్ల, డైట్రిచ్ బ్రాండిస్ అభివృద్ధి నమూనాను భారతదేశంలోని అటవీప్రాంతాలలో ప్రవేశపెట్టారు; “శాస్త్రీయ అటవీ” పేరుతో అటవీ భూములు నరికివేసారు, వలసరాజ్యాల అభివృద్ధికి కలపను అందించే ప్లాంటేషన్ నమూనాను ప్రవేశపెట్టారు. (భారతదేశంలోని బ్రిటీష్ ప్రభుత్వం ఒక జర్మన్ వృక్షశాస్త్రజ్ఞుడు డైట్రిచ్ బ్రాండిస్‌ను భారతదేశపు మొదటి జాతీయ అటవీ విభాగానికి అధిపతిగానూ, నిర్వహణాధికారిగానూ నియమించింది. అదే 1864లో స్థాపించబడిన ఇంపీరియల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇంపీరియల్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ స్థాపన, ఆ తర్వాత ఏర్పడిన ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్ (1867)ల వల్ల రాజ్య-అటవీ సంబంధాలలో పెద్ద ఎత్తున పర్యవసానాలు జరిగాయి. మరీ ముఖ్యంగా, చారిత్రకంగా అటవీ భూమి, వనరులతో ముడిపడి ఉన్న వారి స్థితిగతులను ప్రభావితం చేసాయి. అటవీ భూమి, వనరులపై సాంప్రదాయ హక్కులను అనుభవిస్తున్న అటవీ నివాస సముదాయాల స్థానంలో త్వరలోనే నిరంకుశాధికారులు, అటవీ శాఖ అధికారులు వచ్చి చేరారు. ఆ తర్వాత, భారతదేశంలోని వారి సేవక (హిజ్ మెజెస్టి) ప్రభుత్వం చేసిన శాసనాలు అటవీ నివాసులను నేరస్థులుగా పరిగణించాయి, వారిపై అటవీ భూమి ఆక్రమణదారులుగా ముద్ర వేసాయి. ఆదివాసీ సమూహాల తొలగింపులు, రాజ్య ఏజెంట్లు చేసిన మానవ హక్కుల ఉల్లంఘనలు, కోల్పోయిన అటవీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పోరాటాలు కొనసాగుతూండడం వల్ల ఈ వలసవాద సిద్ధాంత ‘పరిరక్షణ’ ప్రభావం నేటికీ కొనసాగుతోంది.) కాలక్రమేణా, శతాబ్దాలుగా ఈ భూముల మూల నివాసులను ఆదుకున్న సహజ వనరులను వలసరాజ్యాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉపయోగించుకోవడానికి, తద్వారా ఆదివాసీ సముదాయాలను నిర్వాసితులను చేయడానికి అటవీ చట్టాలు ఉపయోగపడ్డాయి.
బ్రిటీష్ ప్రభుత్వం క్రింద అటవీ హక్కుల చట్టం, కొన్ని అడవులను “రిజర్వ్”గా వర్గీకరించింది. అటువంటి అడవులలో నివసించే ఆదివాసీ సముదాయాలు నిర్వాసితమయ్యాయి. వారి జీవనానికీ, జీవనోపాధికి ఆధారమైన అడవులలో లభించే వనరులను ఉపయోగించుకోడానికి అనుమతించలేదు. బస్తర్ ఆదివాసీ జనాభా తమ అడవిలో 2/3 వంతును “రిజర్వ్”గా ప్రకటించడానికి వ్యతిరేకంగా జరిపిన ఉద్యమ అణచివేతలో, తమ భూమిని అన్యాయంగా స్వాధీనం చేసుకోవడానికి వ్యతిరేకంగా ప్రజలు చేసిన తిరుగుబాటులను బ్రిటిష్ సేనల క్రూర అణిచివేత కనపడుతుంది.
1947లో అధికార బదలాయింపు తర్వాత విస్తృత ప్రజానీకానికి కాకుండా రాజ్య ప్రయోజనాలకు ఉపయోగపడే, ఆదివాసీలను నిర్వాసితులను చేసే ఈ చారిత్రాత్మక అభివృద్ధి నమూనాను భారత రాజ్యం కొనసాగించింది. రాజ్యాంగం స్వయంగా ఆదివాసీ సముదాయాలు నివసించే కొన్ని ప్రాంతాలను “షెడ్యూల్డ్ ప్రాంతాలు”గా గుర్తించింది. ఇవి “స్వపరిపాలన”కు సంబంధించిన కొన్ని హక్కులను పొందుతాయి. ఏదేమైనప్పటికీ, ఈ నిబంధనయే రాష్ట్ర/కేంద్ర చట్టం ఈ ప్రాంతాలలో వర్తిస్తుందా లేదా అని నిర్ణయించే హక్కును రాష్ట్ర గవర్నర్‌కు యివ్వడంతో అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంచినట్లయింది. ఆదివాసీ సముదాయాలకు స్వయంప్రతిపత్తి, ప్రజాస్వామ్యం వున్నాయనే అపోహను బహిర్గతం చేస్తూ, ఈ ప్రాంతంలో “స్వయంప్రతిపత్తి కమిటీ” రూపొందించిన చట్టాలకు రాష్ట్ర గవర్నర్ సమ్మతి అవసరం అనే నిబంధన మరోసారి హానికరమైన అధికారాన్ని కేంద్రం చేతుల్లో ఉంచింది.
తాము నివసించే భూమిపై రాజ్యం చేపట్టే చర్యల విషయంలో ఆదివాసీ ప్రజల ప్రజాస్వామిక స్వరాన్ని వినిపించవచ్చనే అపోహను శాసనపరమైన చర్యలు కూడా కలిగిస్తాయి. స్వాతంత్య్రానంతరం అటవీ హక్కుల చట్టం, ప్రత్యేకించి 2006లో చేసిన సవరణ, వ్యక్తిగత లేదా సమాజపర దావాల ద్వారా అటవీ భూములపై ప్రభుత్వ గుర్తింపు పొందిన హక్కులను పొందేందుకు వీలు కల్పించడం ద్వారా ఆదివాసీ భూమిపై ఆదివాసీ రైతులు తమ హక్కులను సాధించుకోవడంలో సహాయపడే ప్రజాస్వామిక చట్టంగా ప్రకటితమయింది.
అయితే, అటువంటి దావాల వాస్తవ చరిత్ర అటవీ భూములపై ఆదివాసీ సముదాయాలు చేసిన దావాలను గుర్తించడానికి ప్రభుత్వానికున్న విముఖతను సూచిస్తుంది- మొత్తం గుర్తించబడిన దావాలలో 3.9% మాత్రమే (ఎఫ్.ఆర్.ఎ స్టేటస్ రిపోర్ట్, 2018 ప్రకారం) సాముదాయిక భూమికి అనుకూలంగా ఉన్నాయి, కానీ వాస్తవానికి 68.9% జనాభా సాముదాయిక భూమిగా బావించే అటవీ భూమిలో నివసిస్తున్నట్లు డేటా సూచిస్తుంది.
అంతేకాకుండా, మైనింగ్ ప్రాజెక్టులను సులభతరం చేయడానికి అటవీ భూములపై ఆదివాసీల దావాలను తిరస్కరించిన చరిత్ర ఉంది, ఇటీవల 2015లో మైనింగ్ ప్రాజెక్ట్ ను సులభతరం చేసేందుకు జార్ఖండ్‌లోని రించి గ్రామం నుండి వచ్చిన 72 దావాలు తిరస్కరణకు గురయ్యాయి. ఆ ప్రాంతంలో బొగ్గు బ్లాకులు వుండడమే ఆ తిరస్కరణకు కారణం. ఆదివాసీ సముదాయాల శ్రేయస్సు, మనుగడ కోసం కాకుండా, దాని ద్వారా నిధులు సమకూరుస్తున్న ప్రాజెక్టుల గురించి, వనరులను అందించడం గురించి ప్రభుత్వం మరింత శ్రద్ధ వహిస్తుందని ఈ వాస్తవం స్పష్టంగా వివరిస్తుంది.
ప్రజాస్వామిక నిర్మాణంగా చెబుతున్న 2006 సవరణ, తరువాత వచ్చిన చట్టాలు దాని సారాంశాన్ని తీవ్రంగా పలుచన చేసి అసలు ఏమీ లేకుండా చేసాయి. అభివృద్ధి ప్రాజెక్టుల ఆమోదానికి ముందు గ్రామసభ సమ్మతి తీసుకోవాల్సిన అవసరాన్ని 2022 నిబంధనలకు చేసిన సవరణ తిరస్కరించిందని, అప్పటికే ఆమోదం పొందిన అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ఆమోదించే దశకు అటువంటి “సమ్మతి”ని తరలించిందని అటవీ పరిరక్షణ నియమాల శాసన చరిత్రను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది.
2022 సవరణ, ఇతర చట్టాల ప్రభావం 2006 ఎఫ్ఆర్ఎ అందించిన బలహీనమైన ప్రజాస్వామిక హక్కులను మరింతగా పలుచన చేయడం గురించి భారతదేశంలోని కొత్త అటవీ సంరక్షణ నియమాల రాజకీయ ఆర్థిక వ్యవస్థలో మరింతగా అన్వేషణ జరిగింది.
సామ్రాజ్యవాద పెట్టుబడి ద్వారా నిధులు సమకూర్చే టాటా బిర్లా, అదానీ, అంబానీల వంటి దళారీ బూర్జువాల ( రాజ్యం మద్దతుతో సామ్రాజ్యవాద పెట్టుబడికి సేవ చేసే బూర్జువాజీలో ఒక సెక్షన్ ) ప్రాజెక్టుల ప్రయోజనాలకు మద్దతునివ్వడానికి భారత రాజ్యం పూర్తిగా సైనిక అణచివేతను ఉపయోగించింది. ఆపరేషన్ గ్రీన్ హంట్ వంటి సైనిక కార్యకలాపాల ద్వారా యిచ్చిన మద్దతు పస్తుత ఆపరేషన్ సమాధాన్-ప్రహార్ ద్వారా పరిపూర్తి అయింది. రాజ్యం చేసే ఈ సైనిక దాడులు అటవీ ప్రాంతాలలో నివసించే ఆదివాసీ జనాభాపై దాడి. ఆపరేషన్ సమాధానన్-ప్రహార్ కింద, వామపక్ష తిరుగుబాటును ఎదుర్కోవడానికి భారత రాజ్యం ఛత్తీస్‌గఢ్‌లోని తన సొంత పౌరులపై వైమానిక బాంబు దాడికి దిగింది.
ఆదివాసీ జనాభాపై భారత ప్రభుత్వం చేస్తున్న ఈ మారణహోమ యుద్ధానికి అటవీ పరిరక్షణ చట్టానికి ప్రతిపాదించిన కొత్త సవరణలు సహాయపడతాయి. “జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక వరుస ప్రాజెక్టుల” కోసం సరిహద్దు భూములను, ముఖ్యంగా ప్రభుత్వం సవరించిన బిల్లులో “వామపక్ష తీవ్రవాద ప్రాంతాలు”గా వర్గీకరించిన భూమిని మినహాయించడం ద్వారా, “జాతీయ భద్రత” అనే పురాతన కవచం కింద ప్రభుత్వం చేసే నిర్థారణ అటవీ భూములను, జనాభాను తొలగించగలుగుతుంది, సామ్రాజ్యవాద దోపిడీకి మరింత వనరులను సమకూర్చగలుగుతుంది.
భారతదేశంలోని అడవులలో నివసించే ఆదివాసీ జనాభాకు వ్యతిరేకంగా జరుపుతున్నఈ సంపూర్ణ యుద్ధాన్ని “అభివృద్ధి” పేరుతో రాజ్యం సమర్థిస్తోంది. ఈ అభివృద్ధి దేశ భవిష్యత్తుకు దోహదపడుతుందని పట్టణీకరణకు, బహుళజాతి మైనింగ్ ప్రాజెక్టులకు సహాయం చేస్తుంది అని అంటోంది. హిరాకుడ్ డ్యామ్ ద్వారా నిర్వాసితులైన ప్రజలకు నెహ్రూ చెప్పినట్లుగా 1948 నాటికే “నిర్వాసితులను చేయడం ద్వారా అభివృద్ధి”నమూనాకి నాంది పలికింది. “దేశ ప్రయోజనాలకు” సహాయం చేస్తుంది. 2011లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ‘అభివృద్ధి’ ప్రాజెక్టుల కారణంగా భారతదేశంలో 50 సంవత్సరాలలో దాదాపు అయిదు కోట్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.
వీటిలో, డ్యామ్‌లు, గనులు, పారిశ్రామిక అభివృద్ధి మొదలైనవాటి కారణంగా రెండు కోట్లకు పైగా ‘అభివృద్ధి’ ప్రేరిత అంతర్గతంగా నిర్వాసితులైన వ్యక్తులు (ఐడిపి – ఇంటెర్నల్లి డిస్ప్లేస్డ్ పర్సన్స్) ఉన్నారు. వీరిలో 40%గా ఉన్న ఆదివాసీలు మరింత దారుణగా ప్రభావితమవుతున్నారు.
ఆదివాసీల నిర్వాసిత్వానికి పారిశ్రామికీకరణ అతిపెద్ద కారణం. ఆదివాసీల ప్రాంతాల్లో గని తవ్వకాల ప్రాజెక్టుల కారణంగా 3.13 లక్షల మంది దౌర్జన్యంగా నిర్వాసితులయ్యారు. 13.3 లక్షల మంది ఆదివాసీలు తమ పూర్వీకుల భూమి నుండి నేరుగా నిర్వాసితులయ్యారు.
ఈ గందరగోళ స్థితి ముఖ్యమైన ప్రశ్నలను వేస్తుంది- మనం ఏ అభివృద్ధి నమూనాను అనుసరిస్తున్నాం? ఈ అభివృద్ధి వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ అభివృద్ధి ఆలోచన ఆదివాసీలు, గ్రామస్తులు, ఒక ప్రాంతంలోని స్థానికులపై ఎందుకు అసమాన భారంగా ఉంది?
ఈ “అభివృద్ధి ప్రాజెక్టుల” వెనుక ఉన్న కంపెనీలు, కార్పొరేషన్లు, సంస్థల స్వభావంలో పై రెండు ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి. ఇంతకు ముందు వివరించినట్లుగా- ఈ ప్రాజెక్టులను భారతదేశంలోని దళారీ బూర్జువాలు చేపట్టాయి- ఇవి సామ్రాజ్యవాద పెట్టుబడికి సేవచేస్తాయి, అయితే సర్దార్ సరోవర్, తెహ్రీ వంటి పెద్ద ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు ప్రపంచ బ్యాంకు లాంటి సామ్రాజ్యవాద ఏజెంట్ల నుండి నేరుగా నిధులు పొందుతాయి.
ముందుగా చర్చించినట్లుగా, అటవీ పరిరక్షణ నిబంధనలకు ప్రతిపాదించిన సవరణలు భారత ప్రభుత్వానికి “జాతీయ ప్రాముఖ్యత”, “జాతీయ భద్రత” మొదలైన ప్రాజెక్టుల ముసుగులో ఆదివాసీ జనాభాను చట్టబద్ధంగా తరలించడాన్ని సులభతరం చేస్తాయి. ఇటువంటి నిర్వాసిత్వం జీవితాలను నాశనం చేస్తుంది ఆదివాసీ ప్రజలు- శతాబ్దాలుగా వారు కలిగి ఉన్న తమ సామాజిక జీవనాన్ని, జీవనోపాధిని, సాముదాయిక భూమిని కోల్పోతారు.
ఒకసారి నిర్వాసితులవుతే, వారికి ద్రవ్య పరిహారం తప్ప మరింకేమీ సహాయం అందించే సమర్థత రాష్ట్రానికి లేదు. అనేక అభివృద్ధి ప్రాజెక్టులలో చూసినట్లుగా, చట్టపరంగా రావాల్సిన వాటిని యివ్వడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది.
ఈ పరిహారం చట్టాల క్రింద , స్త్రీలు వారి మగ బంధువుల పొడిగింపులుగా పరిగణించబడతారు: వారికి ప్రత్యేక పరిహారం అందదు. నిర్వాసిత్వం వలన ఆదివాసీ సముదాయాలలోని మహిళలు మద్యపానం, వివాహాలలో హింసను లాంటి సమస్యలు ఎక్కువవుతాయి. బాల్య వివాహాలు, మనుగడ కోసం తరచూ వ్యభిచారం, మానవ అక్రమ రవాణాకు గురవుతారు.
నిర్వాసిత్వం చెందిన జనాభా తమ జీవనోపాధి వెతుకులాటలో నగరాలు, ఇతర పారిశ్రామిక ప్రాంతాలకు వలస వెళ్లవలసి వస్తుంది. వారు ఇక్కడ రాష్ట్ర ఇతర “అభివృద్ధి” ప్రాజెక్టులకు చౌక కార్మికులుగా మారతారు. నిర్వాసిత్వం చెందిన జనాభా తీవ్రమైన మానసిక వేదనతో పాటు పేదరికం, దీర్ఘకాలిక పోషకాహార లోపం, ఆకలిలాంటి అనారోగ్యాలకి కూడా గురవుతారు.
“పరిరక్షణ” ముసుగులో పరిరక్షణ ముసుగులో, స్థానిక సముదాయాలను అడవుల నుండి బయటికి తరలిస్తున్నారు. వన్యప్రాణి పార్కులు, అభయారణ్యాలు నిర్మించినప్పుడు ఆదివాసీ సముదాయాలు నిర్వాసితులు కాకపోతే ఇది పర్యావరణానికి ఉత్తమమైనదని పరిరక్షకుల వాదన; అటవీ పరిరక్షణ పేరుతో తమ సాముదాయిక భూమిని చుట్టుముట్టినప్పుడల్లా తమ జీవనోపాధిని కోల్పోతున్నారు.
పరిరక్షణ ముసుగులో, స్థానిక సముదాయాలను అడవుల నుండి బయటికి తరిమికొడుతున్నారు. వన్యప్రాణుల పార్కులు, అభయారణ్యాలు సృష్టించినప్పుడు ఆదివాసీ సముదాయాలను నిరాశ్రయులను చేయకపోవడం పర్యావరణానికి మంచిది అని పరిరక్షకులు వాదిస్తున్నారు. అయితే అటవీ పరిరక్షణ పేరుతో వారిని తమ సాముదాయిక భూమి నుండి తరిమివేయనప్పటికీ, వారు జీవనోపాధిని కోల్పోతున్నారు. ఉదాహరణకు, ఒడిశాలోని సునాబేడ టైగర్ రిజర్వ్ ను నిర్మించడం కోసం, రిజర్వ్ అడవుల నుండి ఆదివాసీ కుగ్రామాలను వేరు చేస్తున్నారు. తమ రోజువారీ జీవనానికి, జీవనోపాధికి ఆధారమైన అడవుల నుండి కలపేతర అటవీ ఉత్పత్తులను సేకరణను నిషేధిస్తున్నారు.
అంతేకాకుండా, స్థానిక ఆదివాసీ సముదాయాలు అటవీ అధికారుల వేధింపులకు వ్యతిరేకంగానూ, వారి జీవనశైలి అడవులను అల్లకల్లోలం చేసిందనీ పోరాడారు. వాస్తవానికి, కొత్త నిబంధనల ద్వారా జరిగే జీవావరణ రిజర్వ్‌లు, జంతుప్రదర్శనశాలలు, అభయారణ్యాలు, పర్యావరణ-పర్యాటక సౌకర్యాలు మొదలైనవాటి నిర్మాణం, అడవుల సహజ పర్యావరణ వ్యవస్థకు మరింత హానికరం అవుతుంది.
ఆదివాసీ సముదాయాలు నివసించే అటవీ ప్రాంతాలలో అంతకుముందు ఉన్న పర్యావరణ వ్యవస్థలు, ఈ అడవుల సహజ పర్యావరణ వ్యవస్థతో సామరస్యంగా జీవిస్తున్న సముదాయాలను కలిగి ఉంటాయి. పర్యావరణ-పర్యాటక సౌకర్యాలను ప్రవేశపెట్టడం, పరిరక్షణ పేరుతో “రిజర్వ్‌లు” నిర్మించడం ఈ అడవుల్లో నివసించే ప్రజలకు, వన్యప్రాణులకు పర్యావరణ వ్యవస్థకు భంగం కలిగిస్తుందని నిరూపితమైంది.
మెక్సికో పసిఫిక్ తీరంలో, ఆడ సముద్ర తాబేళ్లు గుడ్లు పెట్టడానికి తీరానికి రాకుండా నిరోధించే ప్రతికూల ప్రభావాన్ని పర్యావరణ పర్యాటకం కలగచేసింది(అవి ఇప్పుడు జనసమూహం, బీచ్‌లలో వెలుతురును చూసి భయపడుతున్నాయి), అందువల్ల ఇప్పటికే అంతరించిపోతున్న జాతులను మరింత ప్రమాదంలోకి నెట్టినట్లవుతుంది. పర్యావరణ పర్యాటక కార్యక్రమాలు సమాజంలోని పెటీ-బూర్జువా, “మధ్య” లేదా ఉన్నత తరగతులకు మాత్రమే ఆకర్షిస్తాయి.
జంతుప్రదర్శనశాలలు, సఫారీలు, బయో-పార్క్‌లు/రిజర్వ్‌లలో వారి వినోదం కోసం ఆదివాసీ సముదాయాలు కల్లోలభరిత నిర్వాసిత్వాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ కార్యక్రమాలు దేశంలోని విశాల ప్రజానీకానికి వినోద కారకాలు కాకపోయినప్పటికీ, అందుకోసం వారు నిర్వాసితులవుతున్నారు. అంతేకాకుండా, పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహించే ఈ “హరిత పెట్టుబడి” కార్యక్రమాలకు, ప్రత్యేకించి పర్యావరణ పర్యాటక ప్రాంతంలో ప్రైవేట్ రంగ వృద్ధిని పెంచే కార్యక్రమాలకు, చాలా వరకు ప్రపంచ బ్యాంక్, ప్రపంచ వాణిజ్య సంస్థ నిధులు సమకూరుస్తాయి. అందువల్ల, పర్యావరణ-పర్యాటక కార్యక్రమాల నుండి పొందిన మూలధనం నేరుగా భారత ఆర్థిక వ్యవస్థకు కూడా చేరదు, అది దాని సామ్రాజ్యవాద యజమానులకు సహాయం చేస్తుంది.
ఇప్పటికే పర్యావరణంతో సామరస్యంగా జీవిస్తున్న ఆదివాసీ ప్రజలను నిర్వాసితులను చేయడానికి పర్యావరణ పరిరక్షణ ఒక సమర్థనీయ కారణం కాదు, పర్యావరణాన్ని పరిరక్షించని లేదా దేశంలోని ప్రజలకు అందని పర్యావరణ స్థిరత్వ సామ్రాజ్యవాద నమూనాను ముందుకు తెచ్చింది.
ఈ నేపధ్యంలో, భారత రాజ్యం చేపడుతున్న ప్రస్తుత అభివృద్ధి నమూనాను పరిశీలిస్తే, అది సామ్రాజ్యవాద పెట్టుబడికి ప్రత్యక్ష సేవలో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇది “భూ కబ్జా” చుట్టూ కేంద్రీకృతమై ఉన్న నమూనా మాత్రమే కాదు, స్థానిక జనాభా, శ్రామిక వర్గ హితాసక్తులపై ఆధారపడి జీవించే పరాన్నజీవి కూడా.
భారత రాజ్యంకి సామ్రాజ్యవాద యజమానులతో ఉన్న అనుబంధం, శ్రామిక ప్రజలపై దాని విధ్వంసక ప్రభావాల ఈ విశ్లేషణ వేసే ప్రశ్న – ప్రజల-కేంద్రీకృత అభివృద్ధి నమూనా ఎలా ఉంటుంది? ప్రస్తుత నమూనా నుండి అది ఎలా భిన్నంగా ఉంటుంది?
ప్రజల అవసరాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న నమూనా ప్రజల నుండి వస్తుంది. వారి సాంప్రదాయ భూమి నుండి జనాభాను నిర్వాసితులను చేయడంపై ఆధారపడి ఉండడానికి బదులు అవసరమైన వనరులకు సమానమైన ప్రాప్యతను నిర్ధారించడం ద్వారా జనాభా శ్రేయస్సుపై దృష్టి పెడుతుంది.
ఎగుమతి మిగులు ద్వారా భారతదేశ ఖనిజాలు, విద్యుచ్ఛక్తి, సహజ వనరులను విదేశాలకు తరలించే; త్రాగునీరు, ఆహారం, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల వంటి ప్రాథమిక సౌకర్యాలు అట్టడుగు వర్గాల జనాభాకు, శ్రమించే కార్మికులకు అందని, ఒక క్రమపద్ధతిలో ఉన్నతవర్గాలకు మాత్రమే అందుబాటులో వుండే ప్రస్తుత నమూనా కంటే ఇది పూర్తిగా భిన్నంగా వుంటుంది.
అటవీప్రాంతాల్లోని సహజ వనరులను రాజ్యం స్వాధీనం చేసుకునే బదులు, అవసరాలకు అనుగుణంగా జనాభాకు సేవలందించేందుకు వినియోగిస్తారు. ఈ అభివృద్ధి నమూనాలో క్రూరమైన దోపిడీకి గురవుతున్నన కార్మికులు, చిన్న, భూమిలేని రైతులు, ఆదివాసీలు నిర్వాసితులై చౌక శ్రమ వనరులుగా మిగిలిపోయిన ఆదివాసీలు లేదా నిరుద్యోగులుగా కార్మిక రిజర్వ్ సైన్యంలోకి నెట్టబడ్డారు. ఈ కొత్త నమూనాలో కేంద్రంగా వుంటారు. విశాల శ్రామికవర్గ ప్రయోజనాలను రక్షిస్తుంది, సామ్రాజ్యవాద శక్తులతో అనుబంధంలో ఉన్న బూర్జువా వర్గానికి చెందిన ఒక చిన్న వర్గానికి కాకుండా శ్రామికవర్గ ప్రజానీక ప్రయోజనాలను రక్షించే విధంగా ఈ కొత్త నమూనాకు కేంద్రంగా ఉంటుంది.
ఎందుకంటే వరదలు, పర్యావరణ విపత్తులు, మారుతున్న వాతావరణం కారణంగా పంట నష్టం లేదా పర్యావరణ కాలుష్యం, క్షీణత వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వంటి వాటి ద్వారా జరిగే నష్టం ఎక్కువగా ప్రభావితమవుతుంది కాబట్టి అటువంటి పర్యావరణ నష్టాన్ని నివారించడం, తగ్గించడం విస్తృత ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండడం వల్ల ఈ నమూనా పర్యావరణానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దాని నిర్దిష్టతతో సంబంధం లేకుండా ఏ ప్రదేశంలోనైనా మూలధనం విస్తరణ, దండయాత్రల కోసం ప్రయత్నించే, విదేశీ మూలధనం విలువను పెంచే భారత రాజ్యం ప్రస్తుతం అనుసరిస్తున్న నమూనాకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
ప్రస్తుత నమూనా వైఫల్యం పర్యావరణానికి, ప్రజలకు కలిగించిన తీవ్ర నష్టంలో స్పష్టంగా కనిపిస్తుంది. జోషిమఠ్‌లో రాజధాని విస్తరణ పర్యావరణ నష్టం, మరణాలు, నిర్వాసిత్వానికి దారితీసింది; లేదా అటవీ ప్రాంతాలలో, పర్యావరణ వ్యవస్థలు నాశనం అవుతున్నాయి, ఎఫ్‌సిఎ, ఎఫ్ఆర్ఎల ద్వారా చట్టబద్ధంగా ఆదివాసీలను నిర్వాసితులను చేస్తున్నారు లేదా విశాల ప్రజానీకం కోసం కాకుండా కొద్దిమందికి ఉద్దేశించిన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సైనిక దాడులు కూడా జరుగుతున్నాయి.
ముగింపు
అటవీ పరిరక్షణ సవరణ బిల్లు అనేది ఆదివాసీ జనాభాపై భారత రాజ్య అప్రకటిత యుద్ధాన్ని మరింతగా పెంచే ఒక ప్రజా వ్యతిరేక చట్టం. బిల్లును ఆమోదించిన విధానం, దాని వెనుక ఉన్న అంతర్లీన ఉద్దేశం ద్వారా బూర్జువా ప్రజాస్వామిక కాల్పనిక గాథ బహిర్గతమైంది.
ఈ వ్యాసంలో చర్చించినట్లుగా, ఈ అభివృద్ధి నమూనావల్ల స్థానిక సముదాయాలు మూల్యం చెల్లించే సమయంలో, భారతదేశ దళారీ బూర్జువా, వారి సామ్రాజ్యవాద యజమానుల ప్రయోజనాలను నెరవేర్చడంలో రాజ్యానికి ఈ సవరణల బిల్లు మరింత సహాయం చేస్తుంది. లాభదాయకమైన అభివృద్ధి ప్రాజెక్టులకు మార్గం సుగమం చేయడం కోసం స్థానిక సముదాయాలను నిర్వాసితులను చేయడం, ఓటు హక్కును రద్దు చేయడం, వారిపై బాంబుదాడి చేసేంత వరకుకూడా వెళ్ళే ఈ బిల్లు వివరించిన అభివృద్ధి నమూనా జాతి నిర్మూలన తప్ప మరొకటి కాదు.
రైతాంగ భూ యాజమాన్యాన్ని కాపాడాలని, దున్నేవాడికే భూమినివ్వాలని డిమాండ్ చేసే సంఘటిత ప్రజాపోరాటం మాత్రమే తన స్వంత ప్రజలపై భారత రాజ్యం చేస్తున్న బహిరంగ భీభత్స కేంద్ర భాగంలో దెబ్బ కొట్టగలదు. అన్నింటికంటే ముఖ్యంగా, భూమి పోయినప్పుడు, ఆదివాసీలు బొగ్గును తిని బతకరు కదా.
రచయిత జిందాల్ గ్లోబల్ లా స్కూల్ విద్యార్థిని
తెలుగు: పద్మ కొండిపర్తి