“వాళ్ళు మెల్లమెల్లగా అడవి మొత్తాన్ని నరికివేస్తే, మేం ఎక్కడికి వెళ్తాం? సంపాదన ఎలా? ఏం తింటాం?” తమ అడవిని కాపాడాలంటూ హరిహరపూర్‌లో ఎంతో కాలంగా జరుగుతున్న నిరసనలో పాల్గొంటున్న హస్‌దేవ్ అరణ్యలోని  ఫతేపూర్‌ గ్రామ నివాసి సంత్‌రా బాయి వేదన ఇది.

నగరాల్లో వెలుగునింపడానికి ఆదివాసీల హృదయాలు నివసించే గ్రామాలను నాశనం చేస్తున్నారనేదే సంత్‌రా బాయిని వేధిస్తున్న తీవ్ర  ఆందోళన.

వాస్తవానికి, 170,000 హెక్టార్లలో విస్తరించి ఉన్న హస్‌దేవ్ అడవిపైన కార్పోరేట్ చాలా కాలంగా కన్నేసింది. అందులో రెండున్నర లక్షల చెట్లను నరికాల్సి ఉంది. వాటిలో కొన్నింటిని యిప్పటికే నరికేసారు. డిసెంబరులో చలిగాలులు వీస్తున్న కాలంలో 50 వేల చెట్లను నరికివేసే పనులను ప్రారంభించారు. నేటికీ కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయాలకు అనుగుణంగా ప్రకటనలు చేస్తున్నాయి.

అటవీ నిర్మూలన గ్రామస్తులను నిత్యం వేధిస్తోంది. జీవితమంతా అడవిపైనే ఆధారపడి వున్న వారిలో సంత్‌రా బాయి ఒకరు. ఆమె, “నాకు భూమి లేదు. భర్త మద్యానికి బానిస. సంపాదించేవారు ఎవరూ లేరు.  ఇద్దరు పిల్లలు, వారిని పెంచే బాధ్యత నాదే. నేను అడవి నుండి మహువా, తోర, మోదుగ ఆకులులాంటివి  తెచ్చి అమ్ముతాను. బతుకుతెరువు కోసం వరిసాగు కాలంలో యితరుల పొలాల్లో పని చేస్తాను” అని వివరించింది.

హస్‌దేవ్ అరణ్య బచావో సంఘర్ష్ సమితి బ్యానర్‌ కింద నిర్వహిస్తున్న నిరసనలలో సంత్‌రా బాయి నిరంతరం పాల్గొంటోంది. అడవులు, పొలాలే ఆమె జీవితానికి ఆసరా. ఆమెకు చదువు లేదు. కానీ ఎట్టి పరిస్థితులలోనైనా అడవిని కాపాడుకోవాలని తెలుసు. అడవి లేకపోతే ఆమె జీవనం యిబ్బందులపాలవుతుంది.

“నాకు ఒక కొడుకు, ఒక కూతురు. కూతురు 11 వ తరగతి, కొడుకు 9వ తరగతి చదువుతున్నారు. నా కున్న కొద్ది  సంపాదనతో వారిద్దరికీ వీలైనంత మంచి జీవితాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. వారు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయగలిగితే తమ హక్కుల కోసం పోరాడవచ్చు. మా పిల్లలు పోరాటాన్ని చూస్తున్నారు కాబట్టి అలా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అడవిని కాపాడేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాం. నేను ఇంటి పని చేసుకొని దాదాపు ప్రతిరోజూ నిరసనలో పాల్గొనడానికి వస్తాను” అని వివరించింది.

ఇంతకుముందు ప్రజలకు పెద్దగా సమాచారం తెలిసేది కాదని, అందువల్ల  బొగ్గు కోసం కేతే గ్రామం బలి అయ్యిందని,  కేతే గ్రామ ప్రజలలాగా మరెవరూ మోసపోకూడదనేది ఆమె భావన.

“కేతె గ్రామంలో పెద్ద జాగాలో యిల్లు కట్టుకున్నవారిని చిన్న ఇళ్లలోకి వెళ్ళేలా ప్రభుత్వం ఒత్తిడి చేసింది.  కానీ ఇక ఇప్పుడు అలా జరగదు. అదానీని ఇక్కడి నుంచి వెనక్కి పంపి, మా అడవిని మాకు ఇవ్వాలన్నదే మోదీ జీకి మేము చేస్తున్న డిమాండ్” అని దృఢ స్వరంతో అంటుంది.

హస్‌దేవ్ అరణ్యలోని విశాల ప్రాంతంలో నివసిస్తున్న చాలా మంది ప్రజలు తమ అడవిని తమకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అడవిలోని పలు ప్రాంతాల్లో చెట్ల నరికివేత కొనసాగుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని మూడు జిల్లాలను కలిపే ఈ అడవిలోని కోర్బా జిల్లాలో చాలా కాలంగా బొగ్గును వెలికితీస్తున్నారు. ఇక్కడ అనేక ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు వున్నాయి. కోల్ ఇండియాకి చెందిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ కోర్బా జిల్లాలో ఉంది. వీరి ప్రధాన కార్యాలయం బిలాస్‌పూర్‌లో ఉంది.

ఛత్తీస్‌గఢ్‌లోని ఉత్తర ప్రాంతంలో బొగ్గు, దక్షిణాన ఇనుప ఖనిజంతో పాటు అనేక విలువైన చెట్లు కూడా ఉన్నాయి. ఖనిజ సంపదతో సమృద్ధిగా ఉన్న ఈ రాష్ట్రంలోని హస్‌దేవ్ అరణ్య అడవిని రక్షించడానికి ప్రజలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇందులో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.

నీతు కొర్రమ్, ఆమె ఆడపడుచు ఇద్దరూ అడవిని కాపాడాలనే దృఢ నిర్ణయంతో వున్నారు.  తమ అడవి నాశనమైపోవడాన్నికళ్ళారా చూసామని, కానీ ఇప్పుడు తమ ఊరిని నాశనం చేయనివ్వమని వాళ్ళంటున్నారు.

నీతు ఒక గృహిణి, ఆమె ఆడపడుచు 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంట్లోనే ఉంటోంది.  తాము నిల్చున్న ప్రదేశంలో ఒకప్పుడు దట్టమైన అడవి ఉండేది. ఇప్పుడు కేవలం మట్టి దిబ్బలు మాత్రమే మిగిలింది,  మొత్తం బొగ్గును తవ్వేసి అడవిని అంతం చేశారు అని అంటున్నారు.

ఎదురుగా ఉన్న ఓపెన్ మైన్ వైపు చూపిస్తూ నీతూ ఇలా వివరించింది, “ఇంతకు ముందు ఇక్కడ ఒక నది ఉండేది. ఇది ఇప్పుడు అది సన్నని కాలువగా మారింది.  మెట్ల ఆకారంలో కన్పిస్తున్న ఓపెన్ మైన్‌లు వున్న స్థలంలో  ఒకప్పుడు కేతే గ్రామం ఉండేది. చాలా పెద్ద గ్రామం అది. చూస్తుండగానే ఖాళీ అయిపోయింది. కొంతమంది పట్టణాలకి వెళ్లారు. చాలా మందిని బెదిరించి ఖాళీ చేయించారు. ఇప్పుడు ఇక్కడ మట్టి మాత్రమే ఉంది.  పొలాల్లో నామమాత్రంగా కొన్ని చెట్లు మాత్రం మిగిలాయి.  ఇప్పుడు పర్సా వంతు వచ్చింది. పెండ్రమార్ వైపు చెట్ల నరికివేత నిరంతరం కొనసాగుతోంది. ఘట్‌బర్రాలోని కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయించాలనే చర్చ జరుగుతోంది.”

“భవిష్యత్తులో నిన్ను ఖాళీ చేయమంటారని భయపడుతున్నావా?” అని నీతూని అడిగితే “ఇప్పుడు అలా జరగదు, మేము భయపడం. చాలా కాలంగా ధర్నా చేస్తున్నాం. గెలుస్తామనే నమ్మకంతో ఉన్నాం. కేతె గ్రామాన్ని  ఖాళీ చేయించినప్పుడు ప్రజలకు తమ హక్కుల గురించి పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు మా హక్కులేమిటో మాకు తెలుసు. ఇప్పుడు మమ్మల్ని ఖాళీ చేయించడం కుదరదు” అని దృఢంగా సమాధానమిచ్చింది.

“మా అడవులు నాశనం కాకుండా చూసుకోవడానికే మా పోరాటం. ఇది మన భవిష్యత్ తరాలకు హానికరం. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు మాత్రమే మూలం కాదు, ఇతర ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. అడవులను నిలబెట్టడానికి వాటి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి.”

హస్‌దేవ్ అరణ్యను నాశనం చేసే ప్రక్రియ 2010 నుండి ప్రారంభమైంది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం ఉండింది. 2010లో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సరఫరా కోసం రాజస్థాన్ ప్రభుత్వానికి హస్‌దేవ్‌లో మూడు గనులను కేటాయించింది. కానీ అటవీ పర్యావరణం-వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ హస్‌దేవ్‌లో గనుల తవ్వకాలు జరగకూడదని నిషేధిత జోన్‌గా ప్రకటించింది. ఆ ప్రకటనతో ఈ ప్రాంతం ఐదవ షెడ్యూల్‌లోకి వస్తుంది.

కానీ నిబంధనలను తుంగలో తొక్కి, అటవీ మంత్రిత్వ శాఖలోని అటవీ సలహా కమిటీ పర్సా ఈస్ట్-కేతే బేసెన్ బొగ్గు గనులకు అనుమతి ఇచ్చింది. దీని ఫలితంగా కేతే గ్రామాన్ని ఖాళీ చేయించి, చెట్లను నరికి అక్కడ నుంచి ఓపెన్ మైన్ ద్వారా బొగ్గును వెలికితీశారు. ప్రస్తుతం ఇది పర్సా ఈస్ట్ ఎండ్ కేట్ బేసెన్ ఓపెన్‌కాస్ట్ మైన్ ప్రాజెక్ట్ పేరుతో నడుస్తోంది.

యూపీఏ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా 2012లో బొగ్గు తవ్వకానికి అనుమతి లభించింది. మొదటి దశలో 726 హెక్టార్లలో 137 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వకాలకు ఆమోదం లభించింది. హస్‌దేవ్‌లో తొలి దశ తవ్వకాలకు అనుమతి ఇచ్చినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నాయి. కేంద్రం నుంచి అనుమతి రావడంతో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఆమోదం తర్వాత, ‘నో-గో జోన్‌’ను (ఎవరూ ప్రవేశించకూడదు)దృష్టిలో ఉంచుకుని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గనుల తవ్వకాన్ని నిషేధించింది. అయితే 2015లో పనులు ప్రారంభమయ్యాయి. మొదటి దశ మైనింగ్ దాదాపు పూర్తయింది. ఇందులో కేతే గ్రామ ప్రజలు నిర్వాసితులయ్యారు.

ఇప్పుడు అడవుల నరికివేతను ఆపాలని ఉదయ్‌పూర్ నుండి హరిహర్‌పూర్ గ్రామం వరకు నిరసనలు కొనసాగుతున్నాయి. “పర్సా ఈస్ట్-కాంతా బేసన్ ఓపెన్‌కాస్ట్ మైన్ ప్రాజెక్ట్‌కు స్వాగతం” అని రాసి ఉన్న ఒక నీలిరంగు బోర్డు పెట్టారు. బొగ్గు తవ్వకాలలో ఇది మొదటి భాగం. రెండోదానికి జరుగుతున్న సన్నాహాలలో భాగంగా పెండ్రమార్‌లో 50 వేల చెట్లను నరికివేస్తున్నారు.

హస్‌దేవ్ అరణ్యలో 23 బొగ్గు బ్లాకులు ఉన్నాయి. గోండ్, ఓరాన్, పాండో ధన్వర్ సముదాయాలకు చెందిన ప్రజలు ఈ అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇందులో పాండాల సంఖ్య అందరికంటే తక్కువ.

అటవీ నిర్మూలన కారణంగా ఆదివాసీ ప్రజలు అస్తిత్వ ముప్పును కూడా ఎదుర్కొంటున్నారు. ఠాకూర్ రామ్ కుస్రో సాల్హి గ్రామానికి చెందిన రైతు. ఎంతో కాలంగా గ్రామాన్ని కాపాడుకునేందుకు పోరాడుతున్నాడు.

డిసెంబర్ 21న అడవుల నరికివేతకు సంబంధించి పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో రామ్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. ఆయన నిరంతరం నిరసనల్లో పాల్గొంటున్నాడు.

ప్రభుత్వం మమ్మల్ని చూసి భయపడుతోందని అంటున్నారు. అందుకే అడవిని నరికివేసే ముందు మమ్మల్ని అదుపులోకి తీసుకుంటారు. అందుకు మేం భయపడం. మనం మన మనుగడ కోసం పోరాడాలి. ఇది మా పూర్వీకుల భూమి. మన భవిష్యత్ తరాలకు నిర్జన ప్రదేశాన్ని ఇస్తామా? అదానీ మొత్తం అడవిని నరికేస్తే? అడవిని కాపాడుకోవడానికి మేం దృఢంగా నిలబడతాం. ఇప్పటి వరకు పోరాడాం, భవిష్యత్తులో కూడా పోరాడతాం.

2021, అక్టోబర్ నెలలో హస్‌దేవ్ అరణ్యని రక్షించడానికి సర్గుజా నుండి రాయ్‌పూర్ వరకు పాద యాత్ర చేసారు. ఆ తరువాత, 2024జనవరి 7న హరిహరపూర్‌లో పెద్ద ఉద్యమం జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సామాజిక కార్యకర్తలు, రైతు సంఘాల వారు, పర్యావరణ ప్రేమికులు ఇందులో పాల్గొన్నారు. ఉద్యమం సందర్భంగా మూల మూలనా పోలీసులను మోహరించారు. చాలా మందిని అడ్డుకున్నారు కూడా.

మైనింగ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల మధ్య, సామాజిక కార్యకర్త అలోక్ శుక్లా మాట్లాడుతూ, “హస్‌దేవ్ అడవిని ఛత్తీస్‌గఢ్ ఊపిరితిత్తులు అని పిలుస్తారు. అటువంటి పరిస్థితిలో, దానిని రక్షించడం ముఖ్యం. ఇది కేవలం అడవికి సంబంధించిన సమస్య కాదు. హస్‌దేవ్ అడవులు నాశనమైతే హస్‌దేవ్ నది నాశనమవుతుందని ఇండియన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. హస్దేవ్ హస్‌దేవ్ బాంగో డ్యామ్ నాశనమై పోతుంది. ఇక్కడ నుంచి నాలుగు లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందుతోంది. మనుషులు-ఏనుగుల మధ్య ఘర్షణ  పెరుగుతుంది. దీన్ని నిభాయించడం అంత సులభం కాదు.

అటవీ నిర్మూలనను నిరసిస్తూ 2021లో ప్రజలు రాయ్‌పూర్‌కు పాదయాత్ర చేసారు. బూటకపు గ్రామసభల అనుమతితో జరిగిన అడవుల నరికివేతపై  విచారణ జరపాలి అని గవర్నర్‌ను డిమాండ్‌ చేశారు.  కానీ ఇప్పటి వరకు ఎలాంటి విచారణ జరగకపోవడమే కాదు మరింత అడవిని నరికివేస్తున్నారు.

నివేదికల ప్రకారం, 2022 సంవత్సరంలో 43 హెక్టార్ల విస్తీర్ణంలో, 2023 ప్రారంభంలో, అదే ప్రాంతంలో మరో 91 హెక్టార్ల చెట్లను నరికేసారు. కాగా డిసెంబర్ 21న యంత్రాల ద్వారా 50 వేల చెట్లను నరికివేశారు.

ఈ విషయంలో రాజకీయం కూడా మొదలైంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దీపక్ బైజ్ ఇటీవల హస్‌దేవ్ బచావో ఆందోళన్‌లో పాల్గొనడానికి వెళ్లాడు.

“ఐదవ షెడ్యూల్‌లో గ్రామసభ అతిపెద్ద శక్తి. కానీ ఇక్కడ బూటకపు గ్రామసభ ఆధారంగా అనుమతి ఇచ్చారు. గ్రామస్తుల డిమాండ్‌కు మేం మద్దతు ఇస్తున్నాం. గ్రామసభపై విచారణ జరపాలి.

గత ఐదేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హస్‌దేవ్‌పై మౌనం వహించడాన్ని, గ్రామసభపై విచారణ చేయకపోవడాన్ని మా పార్టీ పొరపాటు అని ఒప్పుకొంటోంది. కానీ ఇప్పుడు మేము బస్తర్ నుండి సర్గుజా వరకు జరుగుతున్న ఆదివాసీల పోరాటంలో వారితో ఉన్నాము. రాష్ట్రంలోని ఆదివాసీ ముఖ్యమంత్రి కూడా సమాజ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి” అని అన్నారు.

డిసెంబర్ నెలలో, ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి విష్ణు సాయి, హస్‌దేవ్ అరణ్యలో అడవుల నరికివేత గురించి  మీడియాతో మాట్లాడుతూ  చెట్లు నరకడానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అనుమతి ఇచ్చారని, అందులో తమ పాత్ర ఏమీ లేదు అని చేతులు దులుపుకున్నాడు.

ఈ విషయమై గతేడాది ప్రభుత్వమే స్వయంగా సుప్రీం కోర్టుకు పర్సా ఈస్ట్, కాంటా బసన్ ఓపెన్ మైన్ ప్రాజెక్టులో ప్రస్తుతం 4340 మిలియన్ టన్నుల బొగ్గు ఉందని తెలిపింది. తవ్విన తర్వాత కూడా 350 మిలియన్ టన్నులు మిగిలి ఉన్నాయి. రాజస్థాన్‌కు వచ్చే 20 ఏళ్ల వరకు బొగ్గు సరఫరా చేయడానికి ఇది సరిపోతుంది.

ఛత్తీస్‌గఢ్‌లో అటవీ నిర్మూలన, బొగ్గు గనుల ప్రారంభానికి వ్యతిరేకంగా నిరంతరం న్యాయ పోరాటం చేస్తున్న న్యాయవాది, సామాజిక కార్యకర్త సుదీప్ శ్రీవాస్తవ, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్ట్ నుండి కేవలం 120 మిలియన్ టన్నుల బొగ్గును మాత్రమే వెలికి తీసారని, మిగిలిన బొగ్గు రాజస్థాన్‌కు వచ్చే 20 ఏళ్లకు సరిపోతుంది అని చెప్పారు.

అయినప్పటికీ కార్పొరేట్లు పార్సా, కేతే ఎక్స్‌‌టెన్షన్ అనే రెండు గనులను తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం పికెసిబి కుడి వైపున వున్న అడవిని నరికేస్తారు. ఇందులో హరిహర్‌పూర్, సాల్హి వంటి గ్రామాలు ఉన్నాయి. ఇది జరగకుండా ఆపడం అత్యవసరం.

( అంబికాపూర్ నుండి   క్షేత్ర స్థాయి నివేదిక.)

Leave a Reply