అడవిమీద రోడ్డు దండయాత్ర చేస్తున్నది
అడవిని రోడ్డు ఆక్రమించుకుంటున్నది
మట్టిని, చెట్టును, ఆకును, పుప్వును, నీటిని 
పుట్టను, పిట్టను, గుహను, గూటిని
గుట్టను, లోయను తొలిచేస్తూ రోడ్డు  పొక్లెయినర్‌లా వస్తున్నది
కొండచిలువతో కూడ పోల్చలేము
కొండచిలువ నుంచి పిల్లల్ని, వృద్ధుల్ని, తనను  రక్షించుకోవడం
అనాదిగా ఆదివాసీకి తెలుసు
రోడ్డు బాటల్ని రద్దుచేస్తూ  వస్తున్నది
మనిషి పాదాలకింద  మట్టిని
డాంబర్‌తో సిమెంటుతో కప్పేస్తూ వస్తున్నది
ఇసుకదాహంతో వస్తున్నది
ఇనుము దాహంతో వస్తున్నది
ఇంధనం దాహంతో వస్తున్నది
ఖనిజదాహంతో వస్తున్నది
ఎదుటివాని దప్పిక ఏమిటో ఆదివాసీకి తెలుసు
పసిపాపకు చన్నుకుడిపిన అడవితల్లికి తెలుసు
ఆవుపాలు దూడకోసమే అనుకునే ఆదివాసికి తెలుసు
కడుపుకి ఎన్నినీళ్లు కావాలి 
కడివెడైనా తరిగేది లేదు
దేహానికి ఎన్నినీళ్లు కావాలి
కడుక్కున్నా, ఈదినా నది అట్లాగే  పెన్నిధిలా ప్రవహిస్తూ ఉంటుంది
ఇది దాహం, యంత్రాలు తాగే దాహం
ఇసుక, మట్టి, బొగ్గు కలిపి బాటమీద దాడికివచ్చే
రోడ్డురోలరుల దాహం
బుల్‌డోజర్ల దాహం
సైనిక వాహనాల దాహం
కార్పోరేట్‌ కంపేనీల దాహం
విధ్వంసక అభివృద్ధి వ్యూహాల దాహం
దళారీ ప్రభుత్వాల దాహం

అడవికి రోడ్డురావడం అంటే
ముందేమొస్తాయో మీకు తెలుసా
రోడ్డు నిర్మాణ అర్థసైనిక బలగాలొస్తాయి
సరిహద్దు నిర్మాణ అర్థసైనిక బలగాలొస్తాయి
దేశ వాయవ్య,  ఈశాన్య, ఉత్తర సరిహద్దులు
మధ్యభారతంలోకి కుంచించుకుపోతాయి
గ్రామాల్లోని వాడలవలె వెలివాడల వలె అగ్రహారాలు 
ఆంక్షలు విధిస్తాయి
నగరాలకు అడవికి మధ్యన
మైదానాలకు అడవికి మధ్యన
ఉద్యోగికి  నిరుద్యోగికి మధ్యన
ఉపాధికి  వలసకార్మికుడికి మధ్యన
విద్యకు వివేకానికి మధ్యన
ఇంతెందుకూ తెల్లబట్టల వాళ్లకు అడవిమనుషులకూ మధ్యన
సరిహద్దులు వస్తాయి
అందుకే ఢల్లీిలో అడవికి రోడ్డు కోసం
పథకరచన జరుగుతున్నప్పుడే
సరిహద్దు రోడ్డు రక్షణదళాలు అడవిలోకి ప్రవేశిస్తాయి
మనం నది అనేదానికి వాహిని అనే పేరు కూడ ఉంది
వాహిని అంటే సైన్యం
వాళ్లు  నదుల్ని సైన్యానికి రోడ్డుగా మారుస్తారు
దేశంలోని నదులన్నీ కలపాలని
నదులవెంటనే కాదు, సముద్రాలవెంట రోడ్లు వెయ్యాలని
కోస్టల్‌ కారిడార్ల నిర్మాణం కోసం
సంస్కృత పండితుడు వాజ్‌పాయి
 ఎంత అందమైన పథకం వేసాడు
ఇప్పుడు రోడ్లు, వాహనాలు
ట్రాన్స్‌పోర్టు మంత్రి  గడ్కరీ  యుద్ధప్రాతిపదికపై
రోజూ నలభైకిలోమీటర్లు కొత్తగా నిర్మాణం చేస్తున్న రోడ్డుకు
రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ శభాష్‌ అంటున్నాడు
ఎంత విరోధాభాస, ఎంత వికృత పరిహాసం

నాగాజాతి ఆదివాసీ ఒకప్పటి రాజధాని నాగపూర్‌కు
అడవి తరలి వచ్చినట్లుగా ఆదివాసులు వచ్చారు
నదుల పాదాలతో వృక్షాకారంలో 
అచలాలు కదిలినట్టుగా వచ్చారు
వాళ్ల పండుగరోజు వరద వచ్చినట్టుగా వచ్చారు
దావాగ్ని రగిలి వచ్చినట్టుగా వచ్చారు
సుడిగాలి వలె వచ్చారు
విదర్భలో విధ్వంసాన్ని ఆపమని
గడ్చిరోలిలో సూరజ్‌గడ్‌ తవ్వకాలు ఆపమని
దండకారణ్యంపై దండయాత్ర ఆపమని
అది రాజధానికి తరలివచ్చిన నిరసన ఒక ఉదంతం మాత్రమే
ఇంద్రవెల్లి నుంచి సిలింగేర్‌ దాకా
ఇదొక 40 ఏళ్ల పోరాటాల చరిత్ర
ఇప్పుడు హన్సదా అడవి దరహాసంపై శత్రువు కత్తిదూసాడు
బీజభూమిపై రాజధాని మారణకాండకు నిరసనగా
పల్లెనుంచి ఢల్లీి దాకా
ఎన్నిసార్లు అడవి ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని 
మనకు చెప్పలేదూ ఆదివాసులు

మార్కెట్‌భాష మనకి కొత్తది కావచ్చు కానీ
బ్రాహ్మణీయభాష మనకు ఎంత ప్రాచీనమైనది
అడవి మనుషుల్ని అంటరాని వాళ్లు అన్నభాష
మంత్రాలు తప్ప మాటలు తెలియని భాష
మతం తప్ప మనుషుల మనోగతం, అభిమతం
తెలియని భాష
స్పర్శ..... దోషం అనుకునే భాష
దృష్టి..... దోషం అనుకునే భాష
చూపులేని భాష. ముందుచూపు లేని భాష
అంతరంగాన్ని తాకలేని భాష
ఈస్టిండియా కంపెనీ కాలంనుంచి
అది దోపిడీతో మిలాఖత్‌ అయింది
ఇప్పుడు కార్పొరేట్లకు దళారీ అయింది
మనకింకా చాలామందికి మార్కెట్‌భాష అలవాటయింది
కానీ అర్థం కాలేదు
అభివృద్ధి అంటే విధ్వంసం అని అంగీకరించడానికి
మనం ఆదివాసులం అయితే తప్ప సాధ్యం కాదు
మనుస్మృతులనే కాదు, మన చట్టాలను కూడ 
రద్దు చేసుకుంటే తప్ప అర్థం కాదు
అధికారాన్నే కాదు ఆధిపత్యభావాల్ని 
అధిగమిస్తే తప్ప అర్థం కాదు

నడక మనం మర్చిపోతే 
రోడ్డు మనకొక అవసరం అవుతుంది
బస్సునుండి మెట్రో దాక, బుల్లెట్‌ ట్రెయిన్‌ దాకా
అప్పుడది మనకి ఒక అవసరం అనిపిస్తుంది
వాహనం అవసరం అయినాక రోడ్డు అవసరం అవుతుంది
ఎయిట్‌లైన్ల  నుండి
అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ల దాకా
ఈ మనంలో మనమెక్కడ
అడవిబయట ప్రభుత్వంలో మనమెక్కడ
రాజ్యంలోపలా బయటా మనమెక్కడ
రాజ్యాంగయంత్రాంగం లోపలా బయటా మనమెక్కడ
ఈ రాజ్య ఆవరణకు బయట అడవి ఉంది
ఆ అడవిలో ఆదివాసీలు
అడవిమీద ప్రభుత్వంలో ఆదివాసీలెక్కడ
అడవికి రోడ్డు ఏమి ఇస్తుంది
మరింత అడవిని ఇస్తుందా...
ఆవాసాలని ఇస్తుందా...
నీడనిస్తుందా....
కూడునిస్తుందా...
చదువునిస్తుందా....
ఆరోగ్యం ఇస్తుందా....
మార్కెట్‌ లేనివారికి మార్కెట్‌నిస్తుంది
మతం లేనివారికి మతాన్ని ఇస్తుంది
జల్‌ జంగల్‌ జమీన్‌ ఇస్తుందా....
ఇవన్నీ తీసుకోవడానికి రోడ్డునిస్తుంది
ఇవన్నిటినీ రోడ్డు తీసేసుకుంటుంది
రోడ్డంటే బాట కాదు
అడవిబాట కాదుకదా... కాలిబాట కూడా కాదు

కమలాపూర్‌ అడవిలోకి దారులెన్నని
క్రాంతి ప్రశ్నించినప్పుడే ఆదివాసులకీ రహస్యం తెలుసు
రోడ్డంటే దారులన్నీ మూసేసి
పోలీసుల మోహరింపు
అతిశయోక్తి కాదు..... బస్తర్‌ వెళ్లి చూడండి
రోడ్డు రావడంకన్న ముందు
సైన్యం వస్తుంది, రోడ్డు వచ్చాక పోలీసుక్యాంపు వస్తుంది
బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ అనే మాట 
ఇంగ్లిషు చదువునుంచి కాదు 
రాజ్యహింస నుంచి నేర్చుకున్నారు ఆదివాసీలు
రోడ్లు ఇప్పుడు కొత్తగా ఎందుకు వేస్తున్నారు
ఎక్కడ వేస్తున్నారు
కొత్తగా పోలీసుస్టేషన్లు, పోలీస్‌క్యాంపులు నెలకొల్పడానికి
రోడ్లు వస్తున్నాయి
రోడ్డు రావడానికి ముందు పోలీసు
రోడ్డు వచ్చాక పోలీసు
అయినా పోలీస్‌ వస్తే అభ్యంతరం ఎందుకు
వాళ్లు రక్షకులు కదా
ఆ మాట రోడ్డుమీంచి  తాగివచ్చే వాహనం
గూడాల లోని ఆడవాళ్లమీద విరుచుకపడినపుడు అడుగు
యువకుల్ని ఎత్తుకపోయినపుడు అడుగు
ఊళ్లని తగులబెట్టినపుడు అడుగు
దేశభక్తి అంటే పొరుగుదేశాలని ద్వేషించడమా
మన ప్రజలని మనం ద్వేషించడమా
సరిహద్దులు దేశాలకి మధ్యనా మనుషులకి మధ్యనా
సరిహద్దు భద్రతాదళాలు ఎప్పుడూ చంపడానికేనా
ఎవర్ని కాపాడడానికి

ఇల్లు అంటే ఇరుగు పొరుగు ఉండాలని మనం అనుకుంటాము
కష్టానికి సుఖానికి మంచికి చెడుకు
చావుకు పుట్టుకకు
మాటకు, ఎదురుపడడానికి
తోడుకు నీడకు
మనిషికీ మనిషికే కాదు
గొడ్డు గోద పక్షి జంతువు
దొడ్డి పొలము 
నీరు నిప్పు ఉప్పురాయి
రాయిరప్ప
అన్నీ మన తోడనుకునే ప్రాణుల సమూహం మనది
మనుషులను కులాలతో మతాలతో ద్వేషించే జాతి మనది
అయినా విదేశీ కంపెనీలను అడవిలో ప్రవేశపెట్టే 
ఏజెంటే ప్రభుత్వం అయినచోట 
ఇంక దేశానికి సరిహద్దులెందుకు
అడవికి  సరిహద్దు ` విధ్వంసక  అభివృద్ధి
ఇక్కడిదాకా లూటీసర్కార్‌
ఇక్కడనుండి జనతనసర్కార్‌ అంటే అదే
అడవిబాటను కాలిబాటను మార్గంగా మార్చిననాడే
మనం సంస్కృతీకరించాము
ప్రజల జీవితాల్లోకి బ్రాహ్మణ్యం ప్రవేశపెట్టాము
బాట ఒక నడక, ఒక నడత
అడవి నడిచేదారి పల్లెబాట
రోడ్డు ఒక మోడ్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌
ఒక భిన్నమైన ఉత్పత్తివిధానం
సైన్యం ద్వారా రోడ్డు, రోడ్డు ద్వారా సైన్యం
సైనిక శిబిరాలు నెలకొల్పడానికి మాత్రమే రావడంలేదు
కార్పొరేట్ల కోసం వస్తున్నాయి
ప్రభుత్వాలు కార్పొరేట్ల కోసం తెస్తున్నాయి
అడవిని తవ్వేసి, అడవిని తలకిందులు తేసి
అడవిని తోడేసి, నదులను తోడేసి
మన భూమితలాలను, అంతరాలను
తరలించుకుపోవడానికి వస్తున్నాయి
అక్కడి ప్రతి నిర్మాణం విధ్వంసం కోసమే
అడవి మిగలకపోతే ఆదివాసీలు మిగలరు
ఆదివాసీ మిగలకపోతే అడవి మిగలదు
అప్పుడు మన ప్రకృతిసంపదా మిగలదు
మన వాతావరణమూ మిగలదు
మన శీతోష్ణస్థితులూ మిగలవు
మనకు వానలూ రావు, వరదలూ ఉప్పెనలూ సునామీలు తప్ప
మనకు ఎండాకాలం మిగలదు, గ్లోబల్‌ వార్మింగ్‌ తప్ప
మనకు చలికాలం రాదు, మంచుతో కురిసే చలికాలం తప్ప
విధ్వంస నిర్మాణాల
నిర్మాణాల దగ్గరికి పరిగెత్తే విధ్వంస వాహనాల 
కాలుష్యంతో నిండిన గాలి తప్ప
మనకు ప్రాణవాయువూ మిగలదు
మనకు కాలాలూ ఉండవు కష్టకాలాలు తప్ప

దీనిని ఉత్పత్తి విధానం అన్నానా
ఇందులో ఉత్పత్తి ఏముంది విధ్వంసం తప్ప
అంతా తరలిపోవడమే మానవుడి శ్రమ
ప్రకృతి సంపద అంతా తరలిపోవడమే 
భూచరాలు, జలచరాలు, వాయుచరాలు
మనుషులు అంతా వలసపోవడమే

పట్టాభిషేకం తప్పిన రాముడు అడవులపాలైనా
మళ్లీ రామరాజ్యం పొందగలడు
సీత మళ్లీ అడవిపాలే అవుతుంది
అవమానభారంతో చీలినభూమిలో లీనం అవుతుంది
ఆదివాసీలు ఎక్కడికి పోగలరు
మనందరికోసం తరతరాలుగా అడవిని కాపాడుతున్న 
మూలవాసులు 

రోడ్డు, అడవి సంపద ఆహారంగా
అందించడానికి రావడం లేదు
గుడ్డెలుగులు, కోతులు, నక్కలు, తోడేళ్ల నుంచి పంటల్ని
కాపాడడం కోసం రావడంలేదు
మంచెమీద ఒక మనిషి కేక
చేతిలో ఒడిసెల చాలు వాటిని తరమడానికి
పిల్లవాని చేతిలోని గులేరు చాలు 
కర్ర చాలు, కత్తీ చాలు

అది పంటను తగలబెట్టడానికి వస్తున్నది
ధాన్యాన్ని, ధాన్యాగారాలను, పశువులను మనుషులను
గూడాలకు గూడాలను తగలబెట్టడానికి వస్తున్నది
రోడ్డు, ఒక అలిఖిత కోడ్‌ 
చట్టాలు లేవని కాదు రాజ్యాంగ రక్షణలే ఉన్నాయి
అవన్నీ రక్షకభట ఆచరణ వలెనే అమలవుతున్నాయి
స్వయంప్రతిపత్తి నుంచి 
భౌగోళిక ప్రతిపత్తి నుంచి
నీరు నేల అడవిపై హక్కుల నుంచి
పెసా నుంచి గ్రామసభ దాకా అన్నీ చట్టాలే
అందుకే రోడ్డు ఒక శిక్షాస్మృతి
అడవి మనుషులకు చుట్టాలు ఎవరు, అతిథులెవరు
పోలీసులు, కార్పోరేట్లేనా

రోడ్డు వస్తే బడి వస్తుందా
బడిలోనే  పోలీసుక్యాంపు
రోడ్డువస్తే ఆసుపత్రి వస్తుందా
ఆసుపత్రిలోనూ పోలీసుక్యాంపే
రోడ్డు ఒక శత్రుభావనను తోడ్కొని వస్తుంది
రోడ్డు ఒక పరాయిభావనను తోడ్కొని వస్తుంది
ఆదివాసుల జీవితాల్లో తెలిసిన 
ఏ విషసర్పము  వంటిది కాదు 
ఏ క్రూరమృగం వంటిది కాదు
ఏ తుఫానూ పిడుగూ వంటిది కాదు
ఏ కరువు వంటిదీ కాదు ఏ కార్చిచ్చు వంటిదీ కాదు
పూలలోని పరిమళాన్ని ఆకుల్లోని పత్రహరితాన్ని
చెట్టు నీడను, నదిలోని జీవాన్ని, భూమిలోని సారాన్ని
హరించే కనిపించని శత్రువులను
మోసుకొచ్చే మోసమేదో ఉంది రోడ్డు మనసులో
 అది మనుషులు నడిచే బాట కాదు
అది రాజ్యానికి రాజమార్గం
రాజ్యం దాసోహం అనే సామ్రాజ్యవాదానికి
సాగిలపడే ప్రధాన స్రవంతి 
అడవినుంచి తరలించుకుపోయే రాయి, మట్టి, కలప
ఇనుము భవనమై  సెంట్రల్‌ విస్టా అవుతుంది
కుర్చీjైు పార్లమెంటు అధికారం అవుతుంది
కాయితమై శాసనం అవుతుంది, మీడియా అవుతుంది
అంతెందుకు కోర్టూ అవుతుంది 

చెట్టు, ఇనుము గొడ్డలి ఇస్తాయని తెలిసిన ఆదివాసీకి
ఇపుడు రోడ్డు సకల విధ్వంసాన్ని ఇస్తుందని తెలిసింది
కూర్చున్న కొమ్మని నరుక్కోని వివేకం ఆదివాసీలది
పంచభూతాల్ని హరించడానికి వస్తున్న పంచతంత్రాన్ని
ప్రతిఘటిస్తున్నదీ ఇవాళ అడవి
అడవి పరిరక్షణా ఉద్యమం 
ఒక ప్రతిఘటనా పోరాటంగా మారిన ఓజస్సు
బస్తర్‌ డివిజన్‌ ఓర్జా రహదారి మీద
ఆదివాసీలు విల్లంబులు, గొడ్డళ్లతో రోడ్డుపై బైటాయించారు
తొంబై  గ్రామాల ప్రజలు తమ నీళ్లు, ఆహారం, పనిముట్లు
అన్నీ పోరాటరూపాలుగా ఆయుధాలుగా మలుచుకొని వచ్చారు
పాలుతాగే పసికందులతో వేలాది మహిళలు ఓర్జా రహదారిని
దిగ్బంధించేసారు షహీన్‌బాగ్‌ వలె
 
గ్రామాల్లో రోడ్డునిర్మాణాన్ని ఆపాలి
కొత్త పోలీసుక్యాంపులు ఎత్తివేయాలి
మహిళలపై పోలీసుల అత్యాచారాన్ని ఆపాలి

బ్రెప్‌ాబెడా ఉద్యమంలో పాల్గొంటున్న మహిళల్ని
స్నానం చేస్తున్నప్పుడు  డ్రోన్‌తో వీడియోలు తీయకూడదు
నాగరిక సమాజం ముందు అడవిమనుషుల ఎంత సున్నితమైన 
ప్రైవెసీ డిమాండ్‌

బూటకపు ఎన్‌కౌంటర్లలో ఆదివాసీ హత్యలు ఆపాలి
ఆమ్‌దాయిగని, రావ్‌ఘాట్‌ కంపెనీలను మూసివేయాలి
బస్తర్‌లో ఆదివాసీ ఉద్యమంపై దాడులు ఆపాలి


అడవి - ఆకాశం
````````````````
అడవిమీద ఆకాశం దాడి చేస్తుందని ఆకాశం ఊహించగలదా
అడవికీ ఆకాశానికీ ఉన్నది ఒక కాల్పనిక ప్రేమానుబంధం
అడవి ఆకాశమే తనకు నీడ అనుకుంటుంది గొడుగు అనుకుంటుంది
శూన్యాన్ని చూసి ఆకాశమనుకుంటుందా
మేఘాల్నిచూసి ఆకాశమనుకుంటుందా
ఏమనుకున్నా తనకు వెలుగు వేడి వాననిచ్చేది
ఆకాశమే అనుకుంటుంది అడవి
తన చెట్ల కొమ్మల రాపిడి నిప్పు
అడవిమనిషి రగిలించిన నిప్పు తప్ప అడవికి
వెలుగంటే సూర్యుడే చీకటిలో దారంటే వెన్నెలే
నిబిడ గాఢాంధకారంలో మిణుగురులు
అడవి మనుషుల జంతువుల కళ్లల్లోని కాళ్లల్లోని కాంతి కాక
నింగిలోని తారకలే కదా అడవికి వెలుగు దారులు
వాన కురిస్తే అడవి తలంటి పోసుకుంటుంది
దాహాన్ని తీర్చుకుంటుంది
వానల్నీ వరదల్నీ తన నదుల్లోకి తరలించుకుంటుంది
తన గర్భంలో ఉమ్మగా దాచుకుంటుంది
ప్రకృతినే నమ్ముకున్న ఆదివాసీ అది ఇచ్చిన
సంపదనూ సౌందర్యాన్నీ స్వీకరించినట్లే భద్రపరచినట్లే
నష్టాన్నీ కష్టాన్నీ అడవి ఓర్చుకుంటుంది

ఆకురాలు కాలం వసంతాగమనానికి
అనివార్య శిశిర సంకేతమని అడవికి తెలుసు
రుతుచక్రాల గమనాల సహజత్వమూ
వైపరీత్యమూ అడవికి అలివిడియే
మంచు కురిస్తే ఆకులు తనిసినట్లే
పిడుగు రాలితే చెట్టు తనకు తాను నేలలోకి
చీలిపోతుంది

ఈమాత్రం త్యాగాలు అడవికి అలవికానివి కావు
మూలవాసులెప్పుడూ అడవి మూలాలను పెకిలించలేదు
చెట్టునీడ ఒక అంతస్తయింది ఆకాశం పైఅంతస్తయింది
వాన తనకొరకే కురిసిందనుకోలేదు
వడగళ్లవాన లోని మంచురాళ్లు ఏరుకొని తిన్నారు
వడగళ్ల దెబ్బలు తిన్నారు
వానలో తడిసారు వానలో ఆడారు వానలో పాడారు
వానలో రేలానృత్యాలు చేసారు
వాననీళ్లు కాల్వలుగా నదుల్లోకి మళ్లించారు
కొండవాగులతో సెలఏళ్లతో చెలిమి చేసారు
తమ ప్రేమ చెలిమలయి కళ్లల్లో ఊరారు
హృదయాల్లో ప్రవహించారు
స్నేహమే తప్ప ఆదివాసీకి ఆకాశానికి ఘర్షణ లేదు
అడవికి ఆకాశం గురించి ఉన్న కాల్పనిక ఊహలన్నీ
ఆదివాసివే 
ఆకాశం తనమీది ఒక కొప్పెర
ఎనిమిది దిక్కుల దీవెన అనుకున్నాడు
అది తనపై సూర్యచంద్రుల చూపు నక్షత్రకాంతి అనుకున్నాడు
అడవిమీద అలిగినా, అడవి అలిగినా
పారిపోవడానికి, తోసివేయడానికి బయలు ఉందని
రోషానికి పోయాడు భయపడ్డాడు గానీ
ఎంత దూరం పోయినా ఆకాశమే హద్దు అనుకున్నాడు
ఎక్కడికి పారిపోయినా అక్కడ ఆకాశమే ఉంది
ఎక్కడికి వెళ్లగొట్టినా అక్కడ ఆకాశమే ఉంది
అడవిలోని భూమి నీరు నిప్పు గాలి వలెనే
ఆకాశం ప్రాణులకొక ఆశ్రయమే అనుకున్నాడు

అడవి ఆకాశం సముద్రం మనిషికి
ఇతర ప్రాణులతోపాటు సహజాతాలనుకున్నాడు ఆదివాసి
అవి పరస్పరంగా జీవిస్తాయనుకున్నాడు
అవి ఘర్షణ పడుతూనే ఐక్యమవుతాయనుకున్నాడు
అవి నిరంతర సంభాషణలో సంవాదంలో
వెలుగుచీకట్లలో జనన మరణాలలో
నిరంతర మార్పుకు నూతన రూపానికి ఎదిగే
ఒక సమగ్ర సమాహారమనుకున్నాడు

పురాణాల్లో అడవిలోకి వచ్చిన శత్రువుపై
అడవి మనిషే రాక్షసుడై గంధర్వుడై యక్షుడై
వాయువై అగ్ని అయి వరుణాసురుడై
ఆత్మరక్షణ కోసం దాడిచేసాడని అడవికి తెలుసు గానీ
ఇపుడు రోడ్డును భూమార్గాన ఆదివాసులు అడ్డుకుంటుంటే 
చొరబాటుదారు ఆకాశమార్గాన వస్తున్నాడు
అడవిమీద ఆకాశంలో తిరిగే పక్షులు ఆదివాసికి తెలుసు
అవి అడవిచెట్ల మీద, వీళ్లమీద వాలి నేలమీద సేదదీరుతాయి

ఇపుడు ఆకాశంలో రోడ్లు వేసారు
పక్షులవలెనే గాలిమోటర్లు ఎగురుతున్నాయి
గ్రహాల్లోకి అంతరిక్షంలోకి రోదసిలోకి
రాకెట్లు, స్ఫుత్నిక్కులు, క్షిపణులు, డ్రోన్లు
ఇపుడిరక ఆదివాసులు ఈ ఆకాశ శత్రుభాష తెలుసుకోవాలి
 అక్కడా స్పేస్‌ స్టేషన్లు ఏర్పడుతున్నాయి
ద్రవ్య పెట్టుబడి అక్కడికి ఒక ఉపద్రవంగా
ప్రవహిస్తున్నది ఆకాశగంగ పాతాళానికి కురిసినట్లు  కాదు
పెట్టుబడి ఎంత అకవితాత్మక శబ్దం
విశ్వాన్నంతా వివశం చేసినట్లుగానే
అది కవిత్వాన్ని కైవసం చేసుకున్నది లేదా
కవిత్వాన్ని ఖైదు చేసింది, ఎన్‌కౌంటర్‌ చేసింది
గుత్తపెట్టుబడి ఆకాశాన్నీ గుత్తకు తీసుకున్నది
ఆకాశం నుంచి ద్రోణుల్లో ఆదివాసులపై
బాంబులు విసురుతున్నది
అడవిపాలిట ఆకాశం ఇపుడొక సరిహద్దు భద్రతాదళం అయింది
సైన్యమయింది
 అడవిదారులు, ఆవాసాలు మావోయిస్టుల తావులు
మిలీషియా కదలికలు తెలిసిన సాల్వాజుడుం ` అయింది
డిస్ట్రిక్టు రిజర్వు ఫోర్సయింది
ద్రోణి అయింది బాంబు అయింది మృత్యువైంది
ఇపుడిరక ఆదివాసి విల్లంబులకు ఆకాశం లక్ష్యమైంది
అడవి ఇపుడు రాకెట్‌ లాంచరయి డ్రోన్‌గా మారిన 
ఆకాశ మార్గాన్ని కూల్చక తప్పదు.

One thought on “అడవి –  రోడ్డు

  1. అడవిలోకి‌ చొచ్చుకుని వచ్చే రోడ్డు చేసే విధ్వంసాన్ని చదువుతుంటే భవిష్యత్తులో మిగిలేది తలచుకుంటే దుఃఖమొస్తోంది. పెట్టుబడి వికృత రూపం ఆకాశం పైనుండి అడవిపై చేస్తున్న ‌దాడి‌ ఇటు దుఃఖాన్ని ఆగ్రహాన్ని కలగలిపి ఆందోళనకు గురిచేస్తూంది సర్.

Leave a Reply