2021 సెప్టెంబర్‌లో కేంద్రహోం మంత్రి తన సహచర మంత్రులతో పాటు 10 విప్ల‌వోద్య‌మ ప్ర‌భావిత‌ రాష్ట్రాల మంత్రులు, ముఖ్య మంత్రులు, ప్రభుత్వ, పోలీసు, అర్ధ సైనిక అధికారులతో ఢిల్లీలో జంబో సమావేశం జరిపాడు. అందులో యేడాదిలోగా దేశంలో విప్ల‌వోద్య‌మాన్ని తుదముట్టిస్తామని  ప్రకటన చేశాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఈ ప్ర‌క‌ట‌న చేసి స‌రిగ్గా ఏడాది. ఈ సంవ‌త్స‌ర‌మంతా  అణ‌చివేత‌ మ‌ధ్య‌నే విప్ల‌వోద్య‌మం పురోగ‌మించింది. ఈ రెంటినీ ఈ సంద‌ర్భంలో ప‌రిశీలించ‌డ‌మే ఈ వ్యాసం ఉద్దేశం. 

విప్లవోద్యమాన్ని అణచివేత చర్యలతో తుదముట్టించడం సాధ్యం కాదు. అది ఈ ఏడాదిలో  మరోమారు రుజువైంది. అయితే గత సంవత్సర కాలంలో భారత మావోయిస్టు ఉద్య‌మం భారీ నష్టాలను ఎదుర్కొన్నది. అయినప్పటికీ దేశ వ్యాప్తంగా ముఖ్యంగా విప్ల‌వోద్య‌మ ప్రాంతాలలో చెలరేగుతున్న ప్రజా ఉద్యమాలతో పాటు నూతన పోరాట రూపాలతో ప్రజలు ముందుకు వ‌చ్చాయి.  దేశ, విదేశాల పీడిత ప్రజల, ప్రజాస్వామికవాదుల, వామ పక్షాల, విప్లవ సంస్థల సంఘీభావం గతంలో కన్నా మిన్నగా వ్యక్తం అయింది. 

యేడాది క్రితం అమిత్ షా రూపొందించిన అణిచివేత రూపురేఖలు:  

దేశంలోని ప్రముఖ విప్ల‌వోద్య‌మ  ప్రాంతాలుగా ఉన్న 10 రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బీహార్‌, జార్జండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్‌, కేర‌ళ‌,  మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఉన్నత స్థాయి పోలీసు అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఢిల్లీలో 26 సెప్టెంబర్‌ 2021 ఆదివారం నాడు సమాధాన్‌ నాలుగేళ్ల సమీక్ష సమావేశం జరిపాడు. ఇందులో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌, కార్యదర్శి అజయ్‌ కుమార్‌ బల్లా, ఇంటలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌ అరవింద్‌ కుమార్‌లతో పాటు కేంద్ర మంత్రులు గిరిరాజ్‌ సింగ్‌, అర్జున్‌ ముండా, అశ్వినీ వైష్ణవ, జనరల్‌ వీకే సింగ్‌ పాల్గొన్నారు. తెలంగాణ, బిహార్‌, ఒడిశా, మహారాష్ట్ర మధ్యప్రదేశ్‌, జార్ఖండ్  రాష్ట్రాల ముఖ్యమంత్రులు,  ఆంధ్రప్రదేశ్‌ నుంచి హోం మంత్రితో పాటు ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, కేర‌ళ  నుండి సీనియర్‌ పోలీసు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

మావోయిస్టుల కట్టడికి నాలుగు ఆయుధాలు:

జంబో మీటింగ్‌ తదుపరి మీడియాకు విడుదల చేసిన ప్రకటనల సారాంశం ప్రకారం – తుది దశలో ఉన్న వామపక్ష తీవ్రవాద నిర్మూలనలో ఈ ఏడాది ప్ర‌ధాన‌మైన‌ది. దీనికి  ముఖ్యమంత్రులందరూ అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.  తద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని అమిత్‌ షా తెలిపాడు. 2020 అక్టోబర్‌లో జాతీయ భద్రతా సలహాదారు కే. విజయ్‌కుమార్‌ ప్రహార్‌ – 1 రూపొందించి 10 యుద్ధ పాచికలు (ఎత్తుగడలు) రూపొందించాడు. అవి ప్రతికూల ఫలితాలను ఇవ్వడంతో, కేంద్ర హోం మంత్రి స్వయాన రంగంలోకి దిగి ఈ జంబో సమావేశం జరిపాడు. ఆ సమావేశం అనంతరం వారు విడుదల చేసిన నాలుగు మావోయిస్టు అణచివేత ప్రతిపాదనలు ఇవి. 1. శాంతి భద్రతల కోణంలో మావోయిజాన్ని కట్టడి చేయడం, 2. వారికి నిధులు అందకుండా చేయడం, 3. వారి అనుబంధ సంఘాలకు కళ్లెం వేయడం, 4. మారుమూల ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయడం. 

  2017లో ముందుకు తెచ్చిన అపరేషన్‌ సమాధాన్‌ వ్యూహంలో ఇంతకన్నా చాలా వివరాలు, పథకాలు ఉన్నాయి. వాటి కొనసాగింపే ఇవి!

శాంతి భద్రతల కోణంలో విప్ల‌వోద్య‌మాన్ని కట్టడి చేయడంలో భాగంగా భద్రతా లోపాలను సరిదిద్దుకోవడం, ఖాకీ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం, దుర్భేద్య‌మైన‌  పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేయడం, పోలీసుల అధునికీకరణకు మరిన్ని నిధులు, అదనపు బలగాల గురించి కూడ ప్రస్తావించారు. ప్రత్యేక బలగాలకు తగినన్ని వనరులు సమకూర్చాలని సమావేశంలో చర్చించారు. విప్ల‌వోద్య‌మ  కార్యకలాపాలను నిలువరించాలంటే, వారికి అజ్ఞాత మార్గాల ద్వారా అందే నిధులు, సాధనా సంపత్తులను అందకుండా నిరోధించడం ద్వారా నక్సల్‌ సమస్యకు పరిష్కారం  వేగవంతం అవుతుంద‌ని    ఊహించారు. వివిధ స్థాయిలలో, మార్గాలలో అందే నిధుల స్వరూపం గురించి పసిగట్టడంతో ఈడీ, ఎన్‌ఐఏ (నియా)లతో రాష్ట్రాల పోలీసులను సమన్వయించి కేసుల విచారణ, దర్యాప్తును వేగవంతం చేయాలని నిర్ణయించారు. చివరగా ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది మ‌రింత  ముఖ్యమైంది. అదేమంటే అనుబంధ సంఘాలను నియంత్రించడం. అనుబంధ సంఘాల విషయంలో ఉదాసీనత పనికిరాదననీ, వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలనీ నిర్ణయించారు. ఈ పేరుతో ప్ర‌జా కార్య‌క‌లాపాల్లో ఉన్న సంస్థ‌ల‌న్నిటినీ అదుపు చేయ‌డం ఈ  స‌మావేశం ఉద్దేశం.  ఇలా ఉండగా 26/11 ముంబాయి దాడుల తరువాత రూ. 3,400 కోట్ల ప్రాజెక్టుతో సిద్ధమైన ఇంటలిజెన్స్‌ గ్రిడ్‌ ఉనికిలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కొత్త పథకానికి ఊతం దొరికింది.

పైన పేర్కొన్న పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు సంకల్పబద్ధులై కంకణం కట్టుకున్నాయి. అధికార దాహంతో వాటి మధ్య రాజకీయ విభేదాలు ఎంతటి తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నప్పటికీ, విప్ల‌వోద్య‌మ  అణచివేత చర్యలలో మాత్రం వారంతా కేంద్రం రూపొందించిన సైనిక వ్యూహాన్ని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. వారంతా కార్పొరేటు వర్గాల ప్రయోజనాలకు కట్టుబడి వుండడంతో వాటి అమలులో అత్యంత నిష్టతో, ‘సేవా భక్తిని చాటుకుంటున్నారు. కొత్త కొత్త చట్టాలను రూపొందించడంలో, పాత చట్టాలను వారి ప్రయోజనాలకు అనుగుణంగా సవరించడంలో పోటీ పడుతున్నారు.   ఇటీవలే 2022 జూన్‌లో నూతనంగా కేంద్రం సవరించిన ‘అటవీ సంరక్షణ చట్టం (1980), తాజాగా ప్రకటించిన ప్రధాన మంత్రి గతి శక్తి కార్యక్రమాలలో భాగంగా రైల్వే భూమి విధానంలో మార్పు వరకు ఇందులో వున్నాయి. ఇప్పటివరకు వున్న ఐదేళ్ల కౌలును 35 సంవత్సరాలకు సవరించారు. కార్పొరేటు వర్గాలకు వుపయోగపడే ఇంకా అనేక సవరణలతో అ భూమి విధానాన్ని ముందుకు తీసుకువచ్చారు. దీనితో రైల్వేల నియంత్రణలో వున్న 7 లక్షలకు పైగా ఎకరాల భూమి కార్పొరేటు వర్గాలకు హస్తగతం కానున్నది. 2022 అగస్టు 8 నాడు అంటే సరిగ్గా విశ్వ ఆదివాసీ దినానికి 24 గంటల ముందు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని బుట్టదాఖలా చేస్తూ కొత్తగా పెసా చట్టాన్ని చేయడం కార్పొరేటు వర్గాల ప్రయోజనాల పట్ల అపర సేవాభావాన్ని మూలవాసీ ప్రజల పట్ల క్రూర పరిహాసాన్ని చాటడం తప్ప మరేం కాదు. ఈ దోపిడీ చర్యలన్నీ దేశ మూలవాసీ ప్రజలలో నూతన పోరాటాలకు దారులను విశాలం చేస్తున్నవి. వారిలో సమైక్యతను పెంచుతున్నాయి. అనేక సెక్షన్‌ల ప్రజల సానుభూతిని, సంఘీభావాన్ని సమకూరుస్తున్నవి.

దోపిడీ ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాలలో వెల్లువెత్తుతున్న ప్రజా వుద్యమాలు వారి మధ్య అంతఃకలహాలను తీవ్రం చేస్తూ, అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చట్టసభలే అగాధాలుగా మారిన పరిస్థితులను ముదరగొడుతున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇందుకు ఛత్తీస్‌గఢ్‌ కేబినెట్‌ మంత్రి సింహదేవ్‌ తనకున్న పలు శాఖలలో నుండి హస్‌దేవ్‌ ఉద్యమానికి మద్దతుగా అటవీశాఖకు రాజీనామ పెట్టడం స్వపక్షంలో పుట్టిన ముసలానికి చక్కని ఉదాహరణ. మరోవైపు, నిరుడు షా జరిపిన జంబో మీటింగులో పాల్గొన్న ముఖ్య మంత్రులలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులెవరూ ఈసారి ఆయనతో సమావేశంలో పాల్గొనడానికి సిద్ధంగా లేరు. ఇందుకు వారు అనుసరిస్తున్న విధానాలతో పాలకవర్గాల మధ్య పెరుగుతున్న వైరుధ్యాలే కారణం. ఆగస్టు 26కు ఛత్తీస్‌గఢ్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రికి ఎదురైన పరాభవం మన ముందుంది. తెలంగాణ మునుగోడులో అమిత్‌ షా, కేసీఆర్‌ల మధ్య సాగిన రసవత్తరమైన వాక్‌యుద్ధం, కేంద్ర సంస్థల సమావేశాలను కేసీఆర్‌ బహిష్కరించడం వారి మధ్య నీతిమాలిన నాటకీయ వైరి విరోధాన్ని చాటుతున్నవి.

గత సంవత్సర కాలంగా విప్ల‌వోద్య‌మ ప్రాంతాలలో భద్రతా బలగాల పహారాలో కేంద్రం దశాబ్దాలుగా నడుస్తున్న 4 లేన్ల, 8 లేన్ల రహదారులను పూర్తి చేయడంలో తలమునకలైంది. అడవులలో వందల సంఖ్యలో మొబైల్‌ టవర్లను నిలపడంలో మునిగిపోయింది. అడవులలో ముఖ్యంగా లోతట్టు అటవీ ప్రాంతాలలో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరిస్తూ ప్రజాభిప్రాయానికి భిన్నంగా, చట్ట ప్రకారం పొందాల్సిన వారి గ్రామసభల అనుమతి పొందకుండానే నూతన పోలీసు క్యాంపుల, స్టేషన్‌ల, ఫోర్టిఫైడ్‌ స్టేషన్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేసిన‌ట్లు ప‌త్రిక‌ల ద్వారా తెలుస్తోంది. పైగా ప్ర‌భుత్వం గనుల తవ్వకానికి వేగిరపడుతోంది. ప్రధాన మంత్రి డ్రీం ప్రాజెక్ట్‌లు పరిపూర్తి చేయడంలో భాగంగా రైల్వే లేన్‌లను శరవేగంగా ముందుకు సాగిస్తున్నది. వీటి కోసం నిధుల, బలగాల కొరత రానియ్యమని కేంద్ర గృహ మంత్రి జంబో సమావేశంలో హామీ ఇచ్చిన విధంగానే అ రెండూ అడవులను కమ్మేస్తున్నాయి. బస్తర్‌లో బస్తర్‌ ఫైటర్స్‌ పేరుతో నూతన బలగాలను నిర్మిస్తున్నారు. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ అంటూ పాలకులు సంబరాలు జరుపుకుంటూ గడ్‌చిరోలీలో ప్రజల అణచివేత కోసం నూతనంగా భారత్‌ బటాలియన్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారని ప‌త్రిక‌ల్లో వ‌చ్చింది.  ఆంధ్రప్రదేశ్‌ అడవులలో గాలింపుల కోసం దమన్‌ వాహిని నిర్మాణానికి కేటాయింపులు పూర్తయ్యాయి. జార్ఖండ్ కోసం అదనపు బటాలియన్‌లను కేంద్రం మంజూరుచేసింది. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ అంటూ, ఆదివాసీ గౌరవ దివస్‌ అంటూ ప్రచార ఆర్భాటాలతో ప్రజలను పక్కదారులు పట్టిస్తున్న హిందుత్వ శక్తులు ఆచరణలో అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఇటీవలే ఒడిశాలోని నవరంగ్‌పుర్‌ జిల్లాలో మూడు గ్రామాలలో దాదాపు 140 కుటుంబాల పంటలను, ఇళ్లను అటవీశాఖవారు తగులపెట్టి కువ్వీ ప్రజల ఆగ్రహాన్ని మూట కట్టుకున్నారు. ప్రభుత్వం రూపొందించిన నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ విధానానికి అనుగుణంగా తన ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ల అవసరాలను తీర్చడంలో భాగంగా ఇలా ఎక్కడికక్కడే మౌలిక సదుపాయాల రూపకల్పనకు (రోడ్డు, నీటి వనరులు, విద్యుత్తు సరఫరా, భూ సేకరణ మున్నగునవి) ఆఘమేఘాల మీద అన్ని చర్యలను చేపట్టడమే గత యేడాది కాలంగా విప్ల‌వోద్య‌మ నిర్మూలనా కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వం కొనసాగిస్తున్న పనులని స్థూలంగా చెప్పుకోవచ్చు.

ఈ  అణచివేత చర్యల పేరుతో ప్రభుత్వం చేపడుతున్న అత్యంత ప్రజావ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల నిరంకుశ విధానాలతో అడవులలోని మూలవాసీ ప్రజల జీవితాలలో మున్నెన్నటి కన్నా అధికంగా అభద్రత, అశాంతి, అస్థిత్వ సమస్య, అత్మ గౌరవ సమస్యలు చోటు చేసుకున్నవి. పోలీసు, అర్ధ‌సైనిక బలగాల అదనపు క్యాంపులు, పోలీసు స్టేషన్‌ల ఏర్పాటుతో పటిష్టమవుతున్న కార్పెట్‌ సెక్యూరిటీ ఫలితంగా అదివాసీ (గ్రామాలపై ఖాకీల దాడులు పెరిగాయి. వారి మహిళలపై అ(హ)త్యాచారాలు సాధారణమైనాయి.  అడవులలో, గ్రామాలలో తమ చేతికి చిక్కిన వారిని అరెస్టు చేయడం, వేధించడం, చితక బాదడం పోలీసులకు పరిపాటిగా మారింది. ఈ చర్యలన్నీ మూలవాసీ ప్రజలను అస్థిత్వ, అత్మగౌరవ, చట్టబద్ధ‌ హక్కుల సాధనకై పోరాటాల వైపు అనివార్యం చేస్తున్నాయి. వారికి నూతన మిత్ర శక్తులను సంపాదించి పెడుతున్నాయి. నిజంగా ఇందుకు మోదీ షా ద్వయాన్ని “అభినందించాల్సిందే”!

2021 ఏప్రిల్‌ ౩ నాడు సుక్కా జిల్లా జీరగూడ అటవీ ప్రాంతంలో జరిగిన దాడిలో భారీ సంఖ్యలో పోలీసు, అర్థసైనిక బలగాల కమాండోలు దెబ్బతిన్నాయ‌ని, దీంతో పాలకవర్గాలు యేడాది గడువుతో విప్ల‌వోద్య‌మ  నిర్మూలనకు ఈ  జంబో సమావేశంలో పథకం రూపొందించాయ‌ని ఆ రోజుల్లో ప‌త్రిక‌లు ప్ర‌ముఖంగా విశ్లేషించాయి.  ఆ దాడికి నాయకత్వం వహించాడంటూ కమాండర్‌ ఇడ్మాను లక్ష్యంగా ఎంచుకొని ఆయన నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాయ‌నే క‌థ‌నాలు కూడా మీడియాలో వ‌చ్చాయి.  వాటిలో భాగంగా ఇడ్మా స్వగ్రామమైన పువారను కేంద్రం చేసుకొని సిలింగేర్‌లో పోలీసు క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్టు పోలీసులు పత్రికా ముఖంగానే తెలిపారు. కానీ వారి ప్రజావ్యతిరేక చర్యలన్నీ వికటిస్తున్నాయి. అడవి మంటలా ప్రజాగ్రహం విస్తరిస్తున్నది. ఇవేవీ ఈ ఏడాదిగా ర‌హ‌స్యంగా జ‌ర‌గ‌లేదు. ప్ర‌భుత్వం అధికారికంగానే ప‌త్రిక‌ల్లో విధాన ప్ర‌క‌ట‌న‌లు చేసింది. ఆ ర‌కంగా ప్ర‌జ‌లంద‌రికీ తెలిసిన విష‌యాలే. అయినా ఒక‌సారి ఈ ఏడాదిగా ఇంకా ఏమేం జ‌రిగాయో ప‌రిశీలించ‌డం అవ‌స‌రం. ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌ని ప్ర‌జా ఉద్య‌మాల‌ను అణ‌చివేయ లేక‌పోగా అనేక కొత్త పోరాటాల వెల్లువ సాగిందా? అని అనుమానం క‌లుగుతోంది. దీనికి ఉదాహ‌ర‌ణ సిలింగేర్ అనే విశ్లేష‌ణ‌లు ఇప్ప‌టికే ఎన్నో వ‌చ్చాయి. 

మే 12న మొదలైన సిలింగేర్‌ పోలీసు క్యాంపు వ్యతిరేక ప్రజా కదలిక వుద్యమ రూపం సంతరించుకుంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ అడవులలోని సుక్కా జిల్లా సిలింగేర్‌లో రాజుకున్న ఆ నిప్పురవ్వ అనేక రాష్ట్రాలలోని మూలవాసీలను, ప్రగతిశీల శక్తులను, దేశ భక్త మేధావులను, రచయితలను, కళాకారులను, పాత్రికేయులను, విద్యార్థులను కలుపుకొని దేశ రాజధాని ఢిల్లీకి చేరి ఆదివాసీ హూంకార్‌ ర్యాలీ రూపం తీసుకుంది.

జంబో మీటింగ్‌ మావోయిస్టులను నిర్మూలించాలని అభివృద్ధి పేరు మీద అనేక వినాశకర పథకాలను రూపొందించిడంతో అవన్నీ బ్యాక్‌ఫైర్‌ అయ్యాయి. రాష్ట్రానికి దక్షిణాన వున్న సిలింగేర్‌ లో పోలీసు క్యాంపు ఎత్తివేత డిమాండ్‌తో ప్రారంభమైన ప్రజా కదలిక రాష్ట్రానికి ఉత్తరాన వున్న హస్‌దేవ్‌ అడవులలో గత పదేళ్లుగా సాగుతున్న ఆదివాసుల పోరాటానికి తోడుగా వున్నానంటూ “అడవి మనదే’ననే రణనినాదాన్ని వినిపించింది. సిలింగేర్‌లో పోలీసు క్యాంపుకు వ్యతిరేకంగా మొదలైన ప్రజాగ్రహం దావానలంలా విస్తరించి అడవులలో నుండి వనరులను తరలించుకు పోవడానికి పరుస్తున్న రోడ్లపై వేలాది మంది ప్రజలు  బైఠాయింపులకు దారి తీసింది. సిలింగేర్‌లో వేలాది ప్రజలపై పోలీసులు కాల్పులు జరిపి నలుగురు మూలవాసీలను హత్య చేయడాన్ని ఖండిస్తూ దేశంలోని అనేక ప్రాంతాలలోని మూలవాసులు రంగంలోకి దిగి తమ సంఘీభావాన్ని వివిధ రూపాలలో వ్యక్తం చేశారు. సిలింగేర్‌లో పోలీసులు జరిపిన హత్యకాండపై వెల్లువెత్తిన జనాలు అక్కడి మూడు జిల్లాలలో (సుక్కా దంతెవాడ, బీజాపుర్‌) గడచిన దాదాపు రెండు దశాబ్దాల కాలంలో చోటుచేసుకున్న అన్ని పోలీసు నరసంహారాలలో అసువులు బాసిన వారి విషయంలో దర్యాస్త సంస్థలు తేల్చిన నిజాల అధారంగా దోషులపై చర్యలు తీసుకోవాలనే న్యాయపూరిత ప్రజా వుద్యమానికి ఊపిర్లు పోసింది. ఒకవైపు అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ అంటూ పాలకులు వేడుకలు జరుపుకుంటుంటే మరోవైపు విప్ల‌వోద్య‌మ ప్రాంతాలలో ఘర్‌ ఘర్‌ తిరంగా మీద ప్ర‌భుత్వం ఊహించిని నిర‌స‌న వ‌చ్చిన‌ట్లు ప‌త్రిక‌ల్లో న‌మోదైంది. మాకు ఘ‌ర్ ఘ‌ర్ కా తిరంగా వ‌ద్దు.. మీ భద్రతా బలగాల తుపాకులతో రక్తసిక్తమవుతున్న మా అడవులలో అసువులు బాసిన మా బిడ్డల మరణాలపై జవాబులివ్వండి అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నించారు. ఇలా  ప్రశ్నించే విధంగా గత యేడాది కాలపు పోరాటాలు సునిశిత తర్పీదునిచ్చాయి. 2005లో నాగా బటాలియన్‌ బీజాపుర్‌ జిల్లా మిర్తూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధి లోని చెర్లి గ్రామంలో 11 మందిని వరుసగా నిలపెట్టి పిట్లల్లా కాల్చి చంపిన సల్వాజుడుం నాటి బాకీ చెల్లించండని జనం 2022లో ప్రభుత్వాలను నిలదీస్తున్నారు. బస్తర్‌ డివిజన్‌లోని కాంకేర్‌ జిల్లాలో వెచ్చఘాట్‌ వద్ద వేలాది ఆదివాసులు తమ ప్రాంతం నుండి వనరుల తరలింపును అడ్డుకుంటూ 2021 డిసెంబరు 7 నుండి ఈనాటి వరకు సిలింగేరు మార్గంలో నిరవధిక ధర్నా కొనసాగుతునే వుంది. జాగరూకులవుతున్న మూలవాసీ ప్రజలు తమ న్యాయమైన డిమాండ్లతో చేపడుతున్న పోరాటాలకు యువత నాయకత్వాన్ని అందిస్తున్నారు. గత యేడాది కాలమంతా నూతన పోరాటాలలో యువత తర్చీదు కావడానికి చక్కగా ఉపయోగపడింది. మావోయిస్టు ఉద్య‌మం సమూల నిర్మూలన కాలేదు స‌రిక‌దా నూతన తరాలకు పోరాట వారసత్వాన్ని అందించింది.

యేడాది కాలంలోగా 10 రాష్ట్రాలు సమన్వయంతో దాడులు నిర్వహించి మావోయిస్టులను మట్టుపెట్టాలని నిర్ణయించుకున్న సైనిక పథకం నీరుగారిపోతున్న పరిస్థితులను భరించలేక పోయిన ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు నిరాశ, నిస్పృహలతో 2022 ఏప్రిల్‌లో రెండవ విడత (మొదటి విడత 2021 ఏప్రిల్‌లో డ్రోన్‌ దాడులు జరిగాయి) డ్రోన్‌ దాడులకు పాల్పడ్డారు. ఆదివాసీ ప్ర‌జ‌ల‌పై ఈ డ్రోన్ దాడులు ఏమిట‌ని ప్ర‌జాస్వామిక వాదులు ప్ర‌శ్నించారు.  పాలకవర్గాలు   ఆదివాసీ ప్రజలపై  ఇప్ప‌టి దాకా ప్ర‌యోగించిన అనేక రకాల యుద్ధతంత్రాలలో డ్రోన్‌ దాడులు కొత్త‌వి. దుర్మార్గ‌మైన‌వి.  దీంతో ఆదివాసులు  అనేక రకాల అధునిక ఆయుధాలను, రకరకాల కమాండో బలగాలను, వారి యుద్ధ సాధనా సంపత్తిని ఎదుర్కొనేలా రాటు దేలారు. ఇప్ప‌డు  పాలక వర్గాల భద్రతా బలగాలు  వారిని మరో నూతన అస్త్రాన్ని ఎదుర్కొనే అనివార్యతకు నెట్టారు. వారి ఆత్మరక్షణా యుద్ధంలో ఇకపై వారు డ్రోన్‌ దాడుల నుండి రక్షణను తప్పక అనుసరించి తీరుతారు. శతృవు గుండెలపై యుద్ధ విన్యాసాలను నేర్చుకోగలిగేలా చేస్తున్న పాలకులు తమ గోతిని తామే తవ్వుకుంటున్నారనక మరేం అంటాం? గత ఏడాది అనుభవం దానినే రుజువు చేస్తున్నది.

అడవులలోనే తమ డిమాండ్లపై నెలల తరబడి నిరవధిక ధర్నాలు చేయడం నేర్చుకున్న అందోళనకారులు రోడ్లపై భైఠాయింపులు, బ్లాకేడులను నిర్వహించడం, తాలూకా కేంద్రాల నుండి రాష్ట్ర రాజధాని వరకు ర్యాలీలు నిర్వహించడం, బారికేడ్ల‌ను తొలగించుకొని కలెక్టరేట్లను ముట్టడించడం వరకు అనేక రూపాలలో ముందెన్నడూ తమకు తెలియని, తాము చేసి ఎరుగని రూపాలలో పోరాడడం వారికి గతేడాది కాలం వారికి నేర్చింది. పోలీసులతో బాహాబాహి పోరాటాలకు దిగక తప్పని పరిస్తితులు  క‌ల్పించింది. పోలీసులు ఎవరి పక్షమో, వారి తుపాకులు ఎవరి రక్షణకో పోరాడుతున్న మూలవాసులకే కాదు యావత్‌ లోకానికి ఎరుక చేసింది. మూలవాసులు లేవనెత్తుతున్న సమస్యలు, వారి డిమాండ్లు ఎంతమాత్రం వారివే కావవి, అవి ఈ దేశ ప్రజల వర్తమాన, భవిష్యత్తులతో ముడిపడి వున్నవి. అవి ఈ దేశ పర్యావరణ పరిరక్షణతో విడదీయ రాని ఉద్యమాలు. అవి సామ్రాజ్యవాద వ్యతిరేక దేశభక్తమైనవి. అందుకే వారి న్యాయమైన పోరాటాలను సమర్ధిస్తూ అనేక హక్కుల సంఘాలు నిజ నిర్ధారణ నివేదికలను వెలువరిస్తున్నవి. అవి ప్ర‌ముఖంగా మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చి ప్ర‌భావం చూపుతున్నాయి. ఈ దేశపు అడవులలో కార్పొరేటీకరణను, సైనికీక‌ర‌ణ‌ను వ్యతిరేకిస్తున్న సంస్థ “సీజ్‌ అఫ్‌ సిలింగేర్‌’ పేరుతో పుస్తకాన్ని వెలువరించాయి. ప్రజాహిత రచయితలు అనేక పత్రికలలో వాస్తవాలను వెల్లడిస్తూ వ్యాసాలు రాశారు. బస్తర్‌ అడవులలో,  అక్కడి విప్లవోద్యమంలో వ‌స్తున్న ప‌రిణామాల‌ను అధ్య‌య‌నం చేసి, నిర్బంధం మ‌ధ్య‌నే ప్ర‌జ‌లు ఎలా పోరాడుతున్నారో    ప్రపంచం ముందు ఉంచ‌డానికి  విప్లవ ర‌చ‌యిత  పాణి “ ఇన్కె తాకనా లఢాయి సిలింగేర్‌” పేరుతో  పుస్త‌కం రాశాడు. తెలుగు ప్రజల ముందు అక్షరాలలో పోరాట దారిని పరిచాడు. అక్కడి ప్రజా వుద్యమం, ఆలంబనగా ఎదిగివచ్చిన స్థానిక మీడియా మిత్రులు అక్కడి ప్రజల జీవన విధానం, వారి సంస్కృతి వారి పోరాటాలను, వారిపై కొనసాగుతున్న రాజ్యహింసను వాస్తవాల వెలుగులో ప్రపంచం ముందుంచడానికి ప్రయత్నిస్తున్నారు. వారి ఆలోచనలు, వారి వీడియో చిత్రీకరణ నూటికి నూరు శాతం ప్రజా వుద్యమాలను వాస్తవాలపై అధారపడి వున్నదున్నట్టుగా ప్రతిబింబించలేక పోతున్నప్పటికీ గత యేడాది కాలం స్థానికంగా నూతన మీడియా శక్తులను ముందుకు తెచ్చిందని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. ఇవన్నీ జంబో సమావేశం  త‌ద‌నంత‌రం ముందుకు వ‌చ్చిన వినూత్న   పరిణామాలే.

పైన తెలిపిన సంఘీభావ, సహభావ  వుద్యమాలకు తోడుగా మున్నెన్నటికన్నా విదేశాల నుండి కార్మికుల, విప్లవాభిమానుల, విప్లవ సంస్థ‌ల‌ అండదండలు లభించాయి. భారత ప్రజాయుద్ధ అంతర్జాతీయ సంఘీభావ కమిటీ అధ్వర్యంలో టర్కీ, స్విట్జ‌ర్లాండు, టునీషియా, స్పెయిన్, ఫ్రాన్స్‌, ఇటలీ, నార్వే, ఫిలిప్పీన్స్‌, గెలీషియా, బ్రిటన్‌, డెన్మార్క్‌ ్రెజిలు, ఐర్లాండ్‌, కొలంబియా, జర్మనీ, సహ ప్రపంచంలోని చైనాతో పాటు అనేక దేశాలలోని నిజమైన మావోయిస్టు శక్తులు,  నిరంతరం తమ విప్లవ సంఘీభావాన్ని అందచేస్తూ తమ తమ భాషలలో విస్తృతంగా ప్రచార సాహిత్యాన్ని వెలువరించి అందరికి అందుబాటులో  ఉండాల‌ని అంతర్జాలంలో వుంచారు.

2021 నవంబరు 24 నాడు అమరులు కామ్రేడ్‌ కిషన్‌జీ ప‌దో వర్దంతి, యోగేష్‌ 5వ వర్ధంతిలను పురస్కరించుకొని  కార్యాచరణ దినాన్ని విప్ల‌వోద్య‌మం ప్ర‌క‌టించింది.   దానిని జయప్రదం చేయడానికి ఆయా దేశాలలోని మావోయిస్టు శక్తులు, సంస్థలు అనేక కార్యక్రమాలను చేపట్టాయి. భారత రాయబార కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించడంతో పాటు సభలు, సమావేశాలు నిర్వహించి మోదీ ఫోటోలను తగులపెట్టారు. ప్రహార్‌ 3ను వెనక్కి తీసుకోవాలని నినదించారు. భారతదేశంలో హిందుత్వ శక్తులు చేపట్టిన విప్ల‌వోద్య‌మ  నిర్మూలనా సైనిక కేంపెయినుకు వ్యతిరేకంగా వివిధ రకాల సమరశీల పోరాటాలను నిర్వహించారు. భారతదేశంలో దండకారణ్య   జనతన సర్కార్ స్థాప‌నా  దినాన్ని  ఈ అన్ని అంశాలు కేంద్రంగా  పాటించిన‌ట్లు ప‌త్రిక‌ల్లో వ‌చ్చింది. అలాగే 2022 విశ్వ మూలవాసీ దినాన్ని భారత మూలవాసులతో భుజం భుజం కలిపి పాటించి హిందుత్వ శక్తులు వారిపై అమలు చేస్తున్న నిరంకుశ విధానాలను  ఖండించారు. వాటి కొనసాగింపులో భాగంగా భారత రాజకీయ ఖైదీలను బేషరతుగా విడుదల చేయాలనీ మార్చ్‌ 28 నుండి సెప్టెంబర్‌ 13 వరకు దీర్జావధి కేంపెయిను న‌డుస్తున్న‌ది.   ఈ రకంగా గత యేడాది కాలమంతా నిర్బంధం మ‌ధ్య‌నే ప్ర‌జ‌లు, ప్ర‌జాస్వామిక‌వాదులు, విప్ల‌వోద్య‌మం అనేక ర‌కాలుగా ఉద్య‌మాన్ని ఎత్తిప‌ట్టారు. ఇది నిస్సందేహంగా అణ‌చివేత‌లోంచి పెల్లుబికిన కొత్త పోరాటాలు. 

భారత మూలవాసీ ప్రజలపై కొనసాగుతున్న ద్విముఖ దాడిని (కార్పొరేటీకరణ, సైనికీక‌ర‌ణ‌) ఖండిస్తూ ముందుకు వచ్చిన అనేక శక్తులలో పాత్రికేయ మిత్రులు రూపేశ్‌ కుమార్‌ ఒకరు. ఆయన దృఢంగా ప్రజల పక్షం నిలిచినందుకు ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు వున్నాయంటూ పోలీసులు తప్పుడు ఆరోపణలతో 2022 జూలైలో అరెస్టు చేశారు. ఆయనను పోలీసు వాహనంలో తీసుకెళ్తుండ‌గా వాహనం దుర్ఘ‌ట‌నకు గురైందనీ అనుమానాస్పదమైన వార్తను మీడియాకు విడుదల చేశారు. మరోవైపు అదే సమయంలో ప్రముఖ గాంధీవాది, బస్తరు మూలవాసుల అనుంగు మిత్రుడు, సహవాసి, శ్రేయోభిలాషి హిమాంశు కుమార్‌ 17 ఏళ్ల క్రితం దంతెవాడ జిల్లాలో పోలీసులు ఒక బూటకపు ఎన్‌కౌంటర్‌లో 17 మంది మూలవాసీలను కాల్చి చంపిన ఘ‌ట‌న‌పై స్వ‌తంత్ర‌ దర్యాప్తుకు ఆదేశించాలని దేశ అత్యున్నత న్యాయస్తానాన్ని కోరగా, పోలీసుల నేరారోపణ పత్రంలోని వాస్తవాలను వ్యతిరేకిస్తూ హిమాంశు కుమార్‌ కోర్టుకు ఎక్కడం తప్పు అంటూ మరోసారి అలా ఎవరూ చేయకూడదనే తీరులో హిమాంశు కుమార్‌కు రూ. 5 లక్షలు ఫైన్‌ విధించి, చెల్లించని పక్షంలో రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాలని చెప్పింది. ఆ అన్యాయమైన తీర్పును ఆయన నిర్ద్వంద్వంగా వ్యతిరేకించగా నీతో మేం వున్నామంటూ మూలవాసీ ప్రజలు, ప్రగతిశీల శక్తులు, గాంధీవాదులు, మేధావులు ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ రకంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాలలో ప్ర‌జా పోరాట శ‌క్తులు సమైక్యం కావడానికి అధికారంలోని హిందుత్వ శక్తులు అనివార్యం చేస్తున్నాయి. వారు ప్రశ్నించే స్వరాలను అర్బన్‌ మావోయిస్టులుగా కాయిన్‌ చేస్తుండడంతో వారంతా నిర్భయంగా గా ‘మీ టూ అర్బన్‌ మావోయిస్టు అంటూ నినదిస్తున్నారు.

హిందుత్వ విధానాలకు వ్యతిరేకంగా మళ్లీ దేశంలో రైతులు సమైక్యమవుతున్నారు. దేశంలోని మూలవాసులు ‘ఏక్‌ తీర్‌ ఏక్‌ కమాన్‌ అదివాసీ ఏక్‌ సమాన్‌, ఆదివాసీయోంకా ఏలాన్‌ ఉల్‌గులాన్‌ ఉల్‌గులాన్‌’ అంటూ బిర్సా ముండా వారసులు పోరాటాన్ని గానం చేస్తున్నారు. “ఖదాన్‌ నహీ అనాజు పాహిజే” అంటూ సడ్మెక్‌ బాబూరావు వారసులు నినదిస్తున్నారు.

ఇసాయి మిషనరీలు ఆఫ్రికా వచ్చినపుడు

వాళ్ల వద్ద బైబిల్‌ వుండింది

మా వద్ద భూములున్నాయి

వాళ్లు మాతో ఇలా అన్నారు…….

“కళ్లు మూసుకొని ప్రార్ధన చేయండి”

కళ్లు మూసి తెరిచేసరికి,

బైబిల్‌ మా చేతులలో వుంది

భూములు వాళ్ల చేతులలో వున్నవి.

-జోమో కెన్యాటా

పై కవి నుడుగులు అఫ్రికా ప్రజల జీవిత సత్యాలు. ప్రపంచ మూలవాసీ ప్రజల జీవితాలకూ అవి వర్తిస్తాయి. వారి జీవితాలను కకావికలం చేశాయి. తిరిగి తిరిగి అలాంటి చేదు అనుభవాలను పునరావృతం కానివ్వ‌కూడదని నేటి పోరాట మూలవాసీ ప్రజానీకం జాగరూకతను ప్రదర్శిస్తున్నారు. త‌మ అస్తిత్వం, అత్మగౌరవం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నారు. ఆ పోరాటాలు అజరం, అజేయం.  దోపిడీ పాలకవర్గాల అణచివేత విధానాలకు అవే తిరుగులేని జవాబులు. అవే వారి నోళ్లకు తాళాలు వేస్తాయి. ఉద్య‌మాల‌ నిర్మూలన సాధ్యం కాదు సరికదా, వారిని పెంచడానికి, వారు బలపడడానికి, వారు విస్తరించడానికి అవి నారుమడిలా పని చేస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రజాందోళనలు బలపడుతుంటే పాలకవర్గాల మధ్య కూడ తగవులు, ఘర్ష‌ణ‌లు, చీలికలు అనివార్యమవుతాయి. ఇదే నడుస్తున్న చరిత్ర!

గత వారం, పది రోజుల ఛత్తీసుగఢ్‌ వార్తలు ఫాలో అయ్యేవారికి అ రాష్ట్రంలోని రాజనందగాం, నారాయణపురు, కొండగాం, కాంకేరు, బాలోదు, ఉత్తరాన సర్దూజా వరకు అనేక జిల్లాలలో మూలవాసీ ప్రజలు వేల సంఖ్యలో సంఘటితమవుతూ భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారనే వార్త‌లు ఫొటోల‌తో స‌హా ప‌త్రిక‌ల్లో వ‌స్తున్నాయి.    గాంధీని, బాబాసాహెబు అంబేడ్కరును స్మరించకుండా పూట గడుపుకోలేని జుమ్లాబాజీలు (మోదీషా జోడి) వారి అలోచనలకు, విధానాలకు పంగనామాలు ‘పెడుతూ కార్పొరేటు వర్గాల ప్రయోజనాల కోసం రూపొందించిన నూతన అటవీ సంరక్షణ చట్టం, రాష్ట్ర పెసాకు వ్యతిరేకంగా వారు తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. గాంధీ జయంతి రోజు వేల సంఖ్యలో సమావేశం కావడానికి సమాయత్తమవుతున్నార‌నే క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.  దోపిడీ విధానాలు అపారమైన పోరాటావకాశాలను ముందుకు తెస్తున్నవి. మోదీ ఎద్దేవా చేసిన ‘అందోళన జీవులు” జుమ్లాబాజీల మెడలు వంచే రోజులు చేరువవుతున్నాయి. వారి ఉత్తర ప్రగల్బాలకు కాలం చెల్లి తీరుతుంది.


Leave a Reply