ఆ ఇంటిముందు నిలబడి ఇల్లు అదేనా కాదా అన్నట్లు పరీక్షగా చూసింది కమలమ్మ. వేణుగోపాలస్వామి గుడివీధి, మల్లెపూల పందిరిల్లు, రెండంతస్థుల ఆకుపచ్చని  పాత బిల్డింగు. సుభద్రమ్మ చెప్పిన గుర్తులన్నీ సరిపోయాయి.

అయినా లోపలికి వెళ్లాలంటే ఒక్కక్షణం భయమేసింది. కాళ్లకేదో అడ్డం పడుతున్నట్లు అనిపించింది. మొహమాటంగా బెరుగ్గా అనిపించింది.మళ్ళీ తనే  ధైర్యం తెచ్చుకుంది. కదలకపోతే ఆగిపోయేది తన జీవితమే అని గుర్తు తెచ్చుకుంది.ఇల్లు ఇంట్లో ఆకలితో సగం చనిపోయినట్లు, ఒంట్లో రక్తమే లేనట్లు నిస్తేజంగా కనిపించే పిల్లల మొహాలు గుర్తుకు వచ్చేసరికి ఒక్క ఉదుటున ముందుకే కదిలింది.

మనుషులు ఎట్లున్నా ముందుకు వెళ్లాల్సిందే, వెళ్లకపోతే ఎట్లా కుదురుతుంది ?

ముగ్గురు పిల్లలు, సంపాదనలేని తాగుబోతు  మొగుడు, ముసలి అత్త, ఆవిడ రోగాలు,మందులు, టానిక్కులు, ఏది వున్నా లేక పోయినా ఆమెకు తప్పని ఆకు వక్కలు ,ఇంటిల్లిపాది ఖర్చులు, అప్పులు.. అన్నీ గుర్తొచ్చాయి. ఇంట్లో పరిస్థితులన్నీ  గుర్తొచ్చే కొద్దీ ఆమె అక్కడ నిలబడలేకపోయింది. వెనకనుండి ఎవరో  ముందుకు తోస్తున్నట్లు చప్పున కదిలి గేటు తెరుచుకుని లోపలికి అడుగు పెట్టి కాలింగ్ బెల్ మోగించింది.

అప్పటికే ఆమెకు మొహంనిండా చెమట్లు పట్టేశాయి. ముప్పై అయిదు దాటి వుంటుంది వయసు. సన్నగా

పొడవుగా వుంది. ముదురు రంగు చీర, చామనఛాయ.కొంగుతో మొహానికి పట్టిన చమట తుడుచుకుంది.

 తలుపు విసురుగా తెరుచుకుంది.

‘ఎవరూ…’

‘నేనండీ.. కమల… కమలమ్మ… ’

‘ ఏం కావల్ల? ఎవరికోసం ‘

“..నేను…. పని కోసమండి. మీ పక్కింట్లో పని చేసే సుభద్రకి మనిషి కావల్లని చెప్పారంట కదా !’ గబగబా అనేసింది కమలమ్మ.నుదుటిపైన పట్టిన చెమటను చీర కొంగుతో మరోసారి  తుడుచుకుంటూ పూర్తిగా తెరవబడని తలుపు వైపే చూస్తూ నిలబడింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత తలుపు పూర్తిగా తెరుచుకుంది. భారీ శరీరం ఒకటి సోఫాలో నింపాదిగా కూర్చుంది. టీపాయ్ మీద ఏవేవో తినుబండారాలు కనబడుతున్నాయి.

టీవీలో ఏవేవో దృశ్యాలు రకరకాల రంగుల్లో  కదిలిపోతున్నాయి.

‘ఊ… ఎక్కడుండేది నువ్వు.  ఏయే పనులు చేస్తావ్? బాగా పని చేస్తావా? ఎంత కావల్ల నీకు నెలకు?”

తల తిప్పి టీవీవైపే చూస్తూ అడిగింది ఆ ఇంటి యజమానురాలు జానకమ్మ..

‘అన్ని పనులూ చేస్తానమ్మా… మీ పక్కింట్లో పనిచేసే సుభద్ర ఉండేది మా పక్క వీధిలోనే. మేం నాగలకుంటలో వుంటాం. జీతం మీ ఇష్టం అమ్మా… మామూలుగా ఎంత ఇస్తారో మీకు తెలియంది ఏముంది ‘ మెడ వంచి చేతులు పిసుక్కుంటూ చెప్పింది కమలమ్మ.

తలెత్తి ఇల్లంతా ఒకసారి పరిశీలనగా చూడాలనుకుంది. అది చాలా పెద్దఇల్లని తెలుస్తోంది.ఇల్లంతా  ఎంతుందో, ఎంత పనుంటుందో తెలుసుకుందామనుకుంది. ఇంట్లో ఎంతమంది వుంటారో? ఏయే పనులు చెయ్యాల్సి వుంటుందో, ఎన్ని గంటలకు రావాలో ఎంత సేపు పని చేయాలో  ఆమెనే అడుగుదామనుకుంది. కానీ అడగాలనుకున్న మాటలన్నీ గొంతులోనే ఉండిపోయాయి. ఆమె ఇంకా ఏమేం అడుగుతుందో, ఏం జవాబులు చెప్పాలో అని మనసులోనే అనుకుంటుంటే కమలమ్మకు అప్పుడొచ్చిందొక అనుమానం. ఆ అనుమానం మనసులోకి రాగానే ఆమె మొహం కళ తప్పింది.

 అడుగుతుందా? ఈ కొత్త యజమానురాలు కూడా తనను ఇంట్లోంచి, పనిలోంచి వెళ్లిపొమ్మనటానికి దాన్నే ఆయుధంగా వాడుకుంటుందా?

తల కొంచెం పైకెత్తి మెల్లగా సంశయంగా జానకమ్మ వైపు చూసింది. ఆమె మొహం టీవీకే అతుక్కు పోయివుంది. ఆ మొహంలో టీవీలోని పాత్రల హావభావాలు తాలూకు ప్రతిస్పందనలు స్పష్టంగా కనపడుతున్నాయి. తల తిప్పకుండానే టీవీలో ప్రకటనలు వస్తున్నప్పుడు మాత్రం ఆ విరామంలో  ఉండుండి మాట్లాడుతోంది.

‘ఉదయాన్నే ఐదున్నరకల్లా వచ్చేయల్ల. నీ ఇష్టం వచ్చినట్లు చెప్పాపెట్టకుండా పనికి నిల్చిపోకూడదు. ఇంట్లో వస్తువులన్నీ బాగా ఖరీదయినవి వుంటాయి. యాడుండే వాట్ని ఆడ్నే పెట్టల్ల. నా దగ్గర అతిగా మాట్లాడితే కుదరదు. ఎప్పుడన్నా నువ్వు పనికి రాలేదంటే ఆ రోజు ఎవరో ఒకర్ని నువ్వే మాట్లాడి పంపించల్ల. అది కూడా నీ డ్యూటీనే. అర్థం  అయ్యిందా? ’ జానకమ్మ గొంతు ఖంగుమంది.ఎందుకో ఆమె గొంతు పెద్దది చేసి మాట్లాడినట్టు అనిపించింది కమలమ్మకు .

 జానకమ్మ తనవైపు చూడకపోయినా కమలమ్మ ఆ మాటలకు అంగీకారంగా తలాడిస్తూనే  ఉంది. ఇంకేమైనా అడుగుతుందేమోనని కాస్సేపు మధనపడి గోడల్ని, ఇంటిని ఇంట్లోని వస్తువుల్ని గమనిస్తూ యథాలాపంగా తలతిప్పి చూసే సరికి తనవైపే పరిక్షగా చూస్తున్న జానకమ్మ కనిపించింది. క్షణంలో ఉలిక్కిపడి సర్దుకుంది కమలమ్మ.తల తిప్పుకుంది.తల వంచి  అవసరం లేకపోయినా అరచేతి లోని రేఖల్ని  చూసుకుంది.

 ‘ఎంతమంది పిల్లలు, మొగుడేం చేస్తాడు..? ‘

‘ముగ్గురు పిల్లలమ్మా, పెద్దది పదోతరగతి, ఎనిమిదొకరు, ఏడొకరు, ముగ్గురూ ఆడపిలకాయలేనమ్మా. మొగుడంటారా వాడుండీ ఒకటే, లేకపోయినా ఒకటే. ఇంతకు ముందు సినిమా థియేటర్లో పని చేసేవాడు. సినిమా హాలు ఎత్తేసినంక కట్టెల మండీలో ఇప్పుడు పనికి బోతావుండాడు’

‘ముగ్గురూ ఆడపిల్లలేనా?’ అదేదో తప్పన్నట్లు, తక్కువన్నట్లు చులకనగా చూస్తూ అడిగింది జానకమ్మ.

నిశ్శబ్దంగా తలాడించింది కమలమ్మ..

‘ఇప్పుడు గర్భంగా వుండావా ఏమైనా?’ అదో రకంగా పొట్టవైపు అనుమానంగా  చూస్తూ అడిగింది. ‘లేదమ్మా, లేదు లేదు…’ గబగబా అనేసింది కమలమ్మ. ఎక్కడ నిజం చెప్పేస్తే ఆమె పనిలోకి రావద్దంటుందేమో అని భయపడిపోయింది.

నాలుగో బిడ్డ  వద్దు వద్దంటున్నా తన మాట అసలేమాత్రం చెవిలో వేసుకోని మొగుడ్ని, ఎట్లాగైనా ఈ సారి ఖచ్చితంగా  కొడుకే పుడతాడు అనే అతడి వెర్రి భ్రమల్ని , అందుకు వంత పాడే ఆ ముసలిదాన్ని  మనసులోనే తిట్టుకుంది. అయినా మనిషిని చూసీ చూడగానే ఈ పెద్దమనిషి ఎట్లా  తన సంగతిని కనిపెట్టేసుంటుంది? నాలుగో నెల కూడా రాలేదింకా, అయినా ఏం మనిషబ్బా, ఎంత నేగ్గా కనిపెట్టేసింది అనుకుంది కమలమ్మ మనసులోనే.

‘ఇల్లు చూస్తావా’

‘వొద్దులే అమ్మా. ఒకేసారి పనిలోకి వస్తా కదా. అప్పుడు చూస్తాలే ‘ వెళ్లటానికి సిద్ధపడుతూ అంది కమలమ్మ.

 ‘అవునూ సుభద్రకు చెప్పానే క్లియర్గానే. ఎవరైనా ముసలివాళ్లుంటే చూడమని. నలభైఐదు దాటినోళ్లయితే బావుండేది. వయసు పనోళ్ళతో చానా కష్టం. మీ ఏరియాలో ముసలోళ్లు ఎవరూ లేరా? మీ ఇంట్లో కూడా ఎవరో ముసల్ది ఉందంట కదా? ముందు ఆమెనే రమ్మని చెప్తామనుకుంటి’

జానకమ్మ మాటలతో కమలమ్మకు స్పృహ తప్పుతున్నట్లు అనిపించింది. ఇంట్లో పనామె గురించి ఎంత కూపీ లాగిండాది ఈమె అనుకుంటూ ‘మా అత్తకి దగ్గర దగ్గరగా డెబ్బయి దాటిండాదమ్మా . కళ్ళు కనబడవు, చెవులు వినపడవు నోరు మాత్రమే పని చేస్తుంది ‘ అంది.

యాభైఐదేళ్ల అత్తగారికి పొద్దస్తమానమూ వక్కాకు నములుతూ వీధి పురాణాలు చెప్పుకునే దానికే సరిపోతుంది. ఆమెకి దానికే   పొద్దుచాలదు. ఆమె ఇట్లాంటి పనులు చెయ్యటం కూడానా? కమలమ్మ ఆలోచనలు ఇంటి మీదకు వెళ్లాయి.

`పెద్దమ్మాయి స్కూలునుండి వచ్చేసుంటుందేమో, ఇంట్లో పనులన్నీ అదే చేస్తోంది. ముసల్ది ఇక్కడుండే గిన్నె తీసి అక్కడ పెట్టదు. మంచం పైనే అన్నీ జరిగిపోవాలంటుంది. అక్కడికి తానేదో మరబొమ్మ అయినట్లు, దినమ్మూ కూలికి నాలికి పోయి గొడ్డు చాకిరీ చేస్తుంటేనే ఇల్లు గడవడం కనాకష్టంగా వుంటోంది.

‘ రేపు మంగళవారం, మొన్నాడు దినం బాగా లేదు. రెండు రోజులాగి మొదలు తేదీ కాడ్నించి పనిలోకి రా అమ్మాయి… లెక్క కూడా కరెక్టుగా వుంటుంది. నీ పేరేమిటన్నావ్? ’ అడిగింది దర్పంగా జానకమ్మ ఎడమకాలుపైన కుడికాలు వేసుకుని అటూ ఇటూ  ఆడిస్తూ.

‘కమల.. కమలా అంటారండి’

జానకమ్మ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్నని ఎందుకు మరిచిపోయిందో కమలమ్మకు అర్థం కావటం లేదు. ఎవరింట్లో అయినా పనికి చేరే ముందు సర్వసాధారణంగా ఎవరైనా అడిగే ప్రశ్న అది. ఆ జవాబు పైనే ఆ ఇంట్లో పని చెయ్యటమా లేదా అనే విషయం, యజమాని  సేవకురాలి మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయి.

 జానకమ్మ వైపు చూసింది కానీ ఆమె వాలకం చూస్తుంటే ఆ ప్రశ్న అడిగేలా అనిపించలేదు.

తన గురించి తనింట్లోని మనుషుల గురించి స్పష్టంగా అన్ని వివరాలు తెలుసుకున్న జానకమ్మ ఆ ముఖ్యమైన విషయం  గురించి ఎందుకు వాకబు చెయ్యకుండా ఉంటుంది? ఒకవేళ ఆ ప్రశ్నకు జవాబు సుభద్రకు కూడా తెలియదేమో. ఇద్దరి మధ్యా మరీ అంత పరిచయం కూడా లేదు. బహుశా సుభద్రకు తెలిసి ఉంటే ఆ విషయం జానకమ్మకు తప్పకుండా తెలిసే ఉండాలి. అయితే జానకమ్మ మొహంలో ఎలాంటి భావాలు కనిపించటం లేదు. ఆ విషయం తెలిసినట్లూ లేదు, తెలియనట్లూ లేదు.

మరి ఎందుకు జానకమ్మకు ఆ సంగతి తెలుసుకోవాలని లేదు?. ఆలోచనలతో కమలమ్మ బుర్ర  వేడెక్కి పోయింది.

రిమోట్ తో చకచకా  చానల్స్ మారుస్తోంది జానకమ్మ. మధ్యమధ్యలో దానిమ్మ గింజలు తింటోంది. కుడికాలు నిర్విరామంగా  ఆడుతూనే ఉంది. ఆ వాతావరణం ఏమిటో ఊపిరి పట్టేసినట్లు అనిపించింది కమలమ్మకు.

కమలమ్మకు గత అనుభవాలు కళ్లముందు కదలాడాయి.

సుబ్రమణ్యంనాయుడు వాళ్లింట్లో వాచి దొరకనప్పుడు, నారాయణరెడ్డి వాళ్లింట్లో వెండి హారతి పళ్లెం మాయమైనప్పుడు, నీలాంబరి మేడం వాళ్లింటాయన వీధికుక్క మాదిరి తోకాడించుకుంటూ తన వెంటబడినప్పుడు, తన తప్పేమీ లేకపోయినా దొంగతనం అనేమాటే తనకు తెలియకపోయినా, రంకుతనం రక్తంలో లేకపోయినా. అందరూ ఒకే మాటన్నారు.

ఏ మాట అది?

రక్తాన్ని మరిగించే మాట.

ఒంటి పైన నిప్పులు కుమ్మరించినట్లుండే మాట అది.

‘యాడ పోతుంది? ఆ జాతి బుద్ధే అంత.’

అంతో ఇంతో చదువుకుంది కాబట్టి తిరగబడి, ఎదురు నిలబడి   ఆ మాటన్నవాళ్ల మొహాల పైనే నాలుగు అడిగింది. కానీ ఆ తరువాతైనా జరిగిందేమిటి? చేస్తా వుండే  పని మానెయ్యాల్సి వచ్చింది. పస్తులు ఉండాల్సి వచ్చింది.

కొంచెం చదువుకుంది కదా. దానికి వళ్లంతా పొగరే అనే మాటొకటి అదనంగా. ఇండ్లలో పనులు మానేసి బయట ఎక్కడైనా పనులు వెతుక్కుందామా అంటే శరీరం సహకరించదు. ఒంట్లో నీరసం ఎక్కువ. రక్తం, శక్తి తక్కువ. ఎండలో కాయకష్టం చేయలేందు.

కమలమ్మకు ఇంకో ఆలోచన కూడా వచ్చింది. ఈ జానకమ్మ అయినా రేపో, ఎల్లుండో పదీ పదైదు రోజులు పనులన్నీ చేయించేసుకుని ఆనక నీ కులమేమిటమ్మా అని అడిగి తెలుసుకుని, అప్పుడు  అయ్యో నాకు తెలీకుండా పనికి పెట్టుకున్నానే, మానేయమ్మా అని అనదని గ్యారెంటీ ఏమిటి. జీతం లేదు  గీతం లేదు పొమ్మంటే తన పరిస్థితి ఏమిటి?

పనిలో పొరబాటు జరిగినా, తప్పిదం జరిగినా, ఆమె మొగుడో, తమ్ముడో, కొడుకో ఎవడో ఒక మొగోడు  చొంగ కార్చుకుంటే అప్పుడయినా ఈ జానకమ్మ జాతి బుద్ధని అనకుండా ఉంటుందా?

ఇండ్లలో పాచిపనులు చేసే దానిక్కూడా కులం అడొస్తోంది. తిట్టటానికి, తప్పు పట్టడానికి వేరే కారణాలేం లేకపోయినా కులాన్నే సాకుగా చూపేస్తారు సులభంగా అని మనసులోనే  అనుకుంటూ అంత్యనిష్ఠూరం ఎందుకనుకుంటా ‘ మా కులం గురించి చెప్పలేదమ్మా, ఎరుకలోళ్లం తల్లీ’  నింపాదిగా జానకమ్మ వైపు చూస్తూ స్పష్టంగా  కొంచెం గొంతు పెంచి అంది కమలమ్మ. 

2 thoughts on “అదే ప్రశ్న

  1. అదే ప్రశ్న (ఎరుకల కథలు) బాగుంది బాలాజీ గారు! అభినందనలు. పాచి పని చేయడానికి కూడ కులం అడ్డం రావడం విషాదం.

  2. నిష్టుర సత్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు

Leave a Reply