బంగారు డేగ వర్ణంలోనే బంగారం
వనరులున్నా ఉన్మాదం కోరల్లో విలవిల
తన భూభాగం కోసమే తాను శ్రమిస్తూ
ఆశ్రయం కోసం ఎంతో దూరం వెళ్తుంటే
ఊసురోమని నీరసిస్తుంటే
కాసింత ఊరట కోసం జానెడు చోటు కోసం
వెంపర్లాడుతుంటే ఉసూరమనిపిస్తుంది జామ్ మీనార్ సాక్షి గా

చుకర్ పార్ట్రిడ్జ్ హిమాలయాల్లోనే
బతకగలదు
అది ఆ సరిహద్దు నుండి రాలేదు
వచ్చిందంటే బతుకు మృగ్యమైతేనే
అక్కున చేర్చుకునే నేల కోసం
నెలవంక ను వేడుకుంటుంది షాలిమార్ ఉద్యాన వనంలో

అడవి కోడి సెంబగం పోరులో
సెంబగం అలసిపోయి అడుగులు నెమలివైపు యల్పనం మీదుగా
సేదతీర దారులు మూసుకుపోయాయి

ప్రజాస్వామ్యం అంపశయ్య పై నుండగా
బూడిద నెమళ్ళు పడవల్లో సకల కష్టాలతో
ఘోష వినలేక ఇర్రవాడ జీవం కోల్పోగా
నెమలి పంచన ఒదిగితే
తరిమే నయా మత స్వామ్యం నియమాలతో
విరుచుకు పడింది

వలస పక్షుల గుర్తింపు
కొలమానం మతమై
ఆశ్రయంలో అంకుశంగా
తిరోగమనం వైపు!
ఏలికకి మతం ఆదరువై విరాజిల్లుతుంటే
లౌకిక రాజ్య పునాదులు బీటలు వారుతున్నాయి!
ఇరుగు పొరుగు రాజ్యాలమధ్య
నిసిగ్గు గా "కా" ప్రకటన ఓ పందేరం! ఓ జులుం!!

Leave a Reply