అవును,

వాళ్ళు  భ్రమల్లోనే వున్నారు.

ఇక్కడ ప్రజాస్వామ్య చంద్రుడు

వెన్నలకాంతులు విరాజిమ్ముతుంటే,

కానన కారుచీకట్లో వెలుగుకై

వెదుకుతున్నఅమాయకులు వాళ్ళు

పచ్చని పంట పొలాలపై

కార్పొరేట్ గద్దలు వాలుతుంటే,

పంటను కాపాడే రైతన్న

 వడిసెల విసురు నేరమైన చోట

ప్రశ్నించిన ప్రతివాడూ దేశద్రోహయిన 

నేతి బీరకాయ ప్రజాస్వామ్యం లో

హక్కుల నేతికై దేవులాడక ,

 ఫాసిస్ట్ ఎడారిలో సామ్యవాద ఒయాసిస్ కై

దేబరించని అజ్ఞానులు వాళ్ళు.  

కులం,మతం పేరుతో

మానవత్వం మంటగలుస్తున్న

మహోన్నత భారతంలో,

హక్కులకై గొంతెత్తిన ప్రతివాడు అర్బన్ నక్సల్

దేశద్రోహి,పాకిస్తానీ ఏజెంట్ అయిన నేల

ఎన్నికల చదరంగంలో పావులుగా మిగలక,

బిర్శాముండా,కొమురం భీమ్

పంథానవసరంగా పట్టిన అజ్ఞానులు వాళ్ళు.

ఎన్నికల గోదారిని

కులం,మతం,ప్రాంత,ధనం తెప్పలలో

దాటే బదులు

వాళ్ళమయకంగా

అవేమీ లేని సమాజం కై ,

ఆదివాసీలతో “జల్” . “జంగిల్”,”జమీన్”ల  

పోరుజేస్తున్న ఆశాజీవులు వాళ్ళు

వారి సంగతలా వదిలేద్దాం.

మరి ఇక్కడ,

 పెన్ను పట్టినా,గళం విప్పినా

చర్లోపల్లిలో తోస్తున్నదెవరు?

హలం పట్టాల్సిన రైతును 

జైలుకో,లేక అజ్ఞాతం కొ తోస్తున్న దెవరు?

ప్రజలకై నిలబడాలంటే,

నిర్భంధమో,నిషేధమో

నిత్యకృత్యమయిన చోట

శంభూకునిలా సమానత్వం కై ప్రయత్నించకూ,

శిరచ్చేదమే నీకు ప్రాప్తి.

అమాయక ఏకలవ్యునిలా

అంగుళీయం గురుదక్షినివ్వూ

నీకూ,గురుపాదాలచెంత

రవ్వంత చోటిస్తారు.

ఇక్కడ “స్వేచ్చ” నిండుగా

ప్రవహిస్తూంది.

పాలకుల జపంజేస్తూ

నిత్యమంగళ స్తానాలు చేయొచ్చు.

ఇక్కడ

“స్వాతంత్ర్యం” దండిగా లభిస్తుంది.

మార్కెట్ వేలం పాటలో

నీవెంతైనా కొనొచ్చు.

కానీ,ఒక్కటే షరతు.

ప్రశ్నించడం మరిచిపో,

మెడదునూ,మెదస్సునూ తాకట్టు పెట్టు

ఇక,

ఈ “జనజీవన స్రవంతి” లో

అంతా స్వేచ్చా,స్వాతంత్రాలే.   

ప్రజాలకోసమా,లేక

ఈ ప్రజాస్వామ్య? బందీఖానాలో స్వేచ్చకోసమా?

మనిషన్నవాడు,మనసున్నవాడు

ఎంచుకోవాలనే తరుణమిది.

పసిపిల్లల్లా అమాయకంగా అందరికోసం

జీవించే వారు ,వాళ్ళు.

జీవించేందుకు మరణానికి

భయపడని వారు,వాళ్ళు

వారిమానాన వాళ్లనలా వదిలేద్దాం

మరణానికి భయపడి అనుక్షణం

చస్తున్న మనసంగతేమిటి?

బతికేందుకు బలుసాకుతింటూ ,

కులం కంపునూ ,మతం మత్తునూ

అనునిత్యం ఆస్వాదిస్తూ

మనం ఆచరించని  సుద్దుల

అనుక్షణం వల్లెవేస్తూ    

జీవచ్చవాల్ల బతికే మనదీ ఓ బతికేనా

. . . . . . . సందులలో పందులవలె.

(26,ఏప్రిల్,2021 “ఆంధ్రజ్యోతి ” లోని “అన్నా!నీవు చీకటి మింగే చంద్రునివే ” స్పందిస్తూ)

Leave a Reply