” ఏమిటండీ? అలా ఉన్నారు? ఒంట్లో బాగానే ఉంది కదా!” జానకి అడిగింది కోర్టు నుండి వచ్చినప్పట్నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఏదో ఆలోచిస్తూ కూర్చున్న భర్తను.
 
” ఇవాళ కోర్టులో ఒక వింత కేసు వచ్చింది …”

“సరిపోయింది. కోర్టు పిచ్చి.. ఇంటి దాకా తెచ్చుకున్నారా? నేను ఇంకా  ఏమిటోనని భయపడ్డా !లేవండి భోజనానికి.”    
       
జానకి కోటయ్య మాటలు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయింది .జానకి ఎప్పుడూ అంతే. తను చెప్పదలుచుకున్నది చెప్పడమే గానీ తన మాట  విన్నది ఎపుడని?  అందుకే తను మాట్లాడడమే మానేసాడు అవసరమైతే తప్ప. అప్పుడైనా తన మాట నెగ్గదు. అయినా జానకి నోటి దురుసు కు జంకి  తను మౌనాన్ని ఆశ్రయిస్తాడు. ఇంట్లో అస్తమానం గొడవలు, కీచులాటలు తనకు నచ్చవు .కోర్టులో ఎన్ని కేసులు చూడలేదు? తల్లిదండ్రుల కీచులాటల్లో  నలిగిపోయిన బాల్యాలు! విడిపోతున్న తల్లిదండ్రుల్లో ‘ ఎవరి దగ్గర ఉంటారని ‘జడ్జి అడిగినప్పుడు …వెక్కి వెక్కి ఏడ్చిన పిల్లలు ! మాకు వద్దు అంటే మాకు వద్దని మళ్లీ కోర్టులోనే గొడవపడే బాధ్యతారాహిత్యాలు!  పంతానికి మాత్రమే కావాలనే ఆధి పత్యాలు ! ‘నాకు ఇప్పించండి’  అని కన్న పేగుల కన్నీటి వేడి కోళ్ళు!
     

తన పిల్లలు ఒక ఆహ్లాదకర ఆనందమైన కుటుంబ వాతావరణంలో పెరగాలి. అప్పుడే వారు ఉన్నత వ్యక్తిత్వాన్ని సంపాదించుకో గలరు. తమ కోరిక కే పుట్టారో.. ప్రేమకే పుట్టారో… జన్మనిచ్చిన వారు పుట్టిన బిడ్డల్ని బాధ్యతగా సక్రమంగా పెంచాలి. ఉన్నంతలో మంచి చదువు, జీవితం ఇవ్వాలి. ముఖ్యంగా విలువలు నేర్పాలి. మనం చెప్పడం కాదు .మనం చేస్తేనే… చూస్తూ చూస్తూ పిల్లలు నేర్చుకుంటారు –అన్నది తన కుటుంబ నేపథ్యం తనకు నేర్పిన అనుభవ పాఠం .
    

తన తల్లిదండ్రులు పల్లెటూరి వారే .పెద్దగా చదువుకున్నదీ లేదు. అయినా మానవ సంబంధాల పట్ల ప్రేమానురాగాలతో , నైతిక విలువల పట్ల గౌరవ మర్యాదలతో బతికారు. తమది ఉమ్మడి కుటుంబం . తాతలు ..ఇద్దరూ కలిసే ఉన్నారు .నాన్న పెదనాన్న కలిసి ఉన్నారు . తమ తరం వచ్చేసరికి తానిక్కడ పట్నంలో   ఉద్యోగరీత్యా . అన్నయ్య పల్లెలో. పెద నాన్నకు ఇద్దరు ఆడపిల్లలు.  పెళ్లిళ్లు అయి అత్తగారింట్లో ఉన్నారు. పెదనాన్న, పెద్దమ్మ, నాన్న చనిపోయారు. ఈ మధ్యనే   ఆర్నెల్లప్పుడు వదిన చనిపోయింది. అన్నయ్యకు ఒక్కటే కూతురు .పెళ్లయింది .తన కో కూతురు , ఓ కొడుకు. చదువుకుంటున్నారు. తను ఉద్యోగం వచ్చేదాకా పెళ్లి వద్దను కోవడంతో లేట్ గా పెళ్లి అయింది. లేకపోతే ఈ పాటికి తన పిల్లల చదువులు, పెళ్లిళ్లు అయిపోయి ఉండేవేమో.  మంచితనం మానవత్వం మూర్తిభవించిన సుజీవనమ్మ  తమ ఇంటికి కోడలుగా  రావడం నిజంగా తమ అదృష్టమే. పెద్దమ్మ ,పెదనాన్న లను కూడా కోడలిగా కాకుండా కన్న కూతురిలా చూసుకొంది. వదిన వల్లనే తమ సమిష్టి కుటుంబం సంతోషంగా సాగిపోయింది అన్నది జగమెరిగిన సత్యం. మంచాన పడ్డ నాన్నకు ఓపిగ్గా  సపర్యలు చేసింది .పాప అమ్మ వల్ల కాదు .  ఆమెకు ఇప్పుడు ఎనభై అయిదేళ్లు. ఆవిడ ఇప్పుడు పనులు ఏమి చేయగలదు? ఇంత పెడితే తినడమే కష్టం. అన్నయ్యకు అరవైఅయిదేళ్ళు. ఆయన బీపీ ,షుగర్ పేషెంట్ . ఇద్దర్నీ చిన్న బిడ్డల మాదిరి చూసుకుంటున్న వదిన ..ఇంటి ముందు వర్షం నీటి బురదలో కాలు జారి పడ్డం ఆ పడడంలో … రాయి మీద పడి తల పగిలి చనిపోయింది. వదిన మరణం దిగ్భ్రాంతి నుండి, బాధనుండి ఆరు నెలలు అవుతున్నా అన్నయ్య అమ్మ ఇంకా కోలుకోలేదు .తను రోజు రాత్రిళ్ళు  ఫోన్ చేస్తూనే ఉన్నాడు.

” అన్నా … ”  అనంగానే తన కళ్ళు నిండుకుండలవుతాయి. ఆ బరువుకు గొంతు పూడుకుపోతుంది. పెదవి పెగలదు బాధను అదుముకుంటూ.

” నువ్వేం బాధపడకు రా ! మేము బాగున్నాము కాదూ” అన్నయ్య తనను  ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. ఆ పిడికిలంత గుండె కొండంత బాధను  మోస్తున్నా.

” ఆ మాలచ్మి తోనే మా బాగు  ఓగయిపోయింది. ఆ యముడికి మన ఇంట్లో ఒక ప్రానం  కావాలంటే నా ప్రానం తీసుకోకూడదా? నా బిడ్డ ప్రానమే కావలసి వచ్చినా ఆ ముండా యముడికి?” అమ్మ ఏడ్చి ఏడ్చి అలసిపోయింది.

” మా ! వాడసలే మెతక! ఇంగా  ఎందుకు బాధ పెట్టేది? బాగున్నామంటే సరిపోతాది కదా! వాడు నెమ్మళంగా ఉంటాడు”  అన్నయ్య సన్నగా అమ్మను మందలిస్తాడు.

” అంతేలే నాయనా !ఈ కట్టే కాటికి పోయే దాకా మన బాధ తీరేది కాదు”  ఫోను అన్నయ్యకు ఇచ్చేస్తుందో.. అన్నయ్యే తీసుకుంటాడో తెలియదు.

” పడుకో  కోటి’  పొద్దుపోయింది .పగలంతా పని లో అలిసిపోయి ఉంటావు కదా. రేపు మల్లా కోర్టుకు పోవాల కదా!”  అన్నయ్య ఫోన్ కట్ చేస్తాడు.  తనసలు ఏమీ మాట్లాడడు .కానీ  తన మనస్సు ఎరిగినట్లే మాట్లాడుతాడు అన్నయ్య . అవును తన గురించి అన్నయ్య కే బాగా తెలుసు.  అన్నయ్య కన్నా పదేళ్ళు చిన్నవాడు తను. ఇంట్లో కూడా అందరి కన్నా చిన్న వాడు కావడంతో గారాబంగానే పెరిగాడు . అక్కలు ఇద్దరు,  అన్నయ్య  తనకు బాగా ఊహ తెలిసే దాకా ఎత్తుకు తిరిగే వారు. అన్నయ్య అయితే తను కాస్త పెద్దయ్యాక కూడా ” ఉప్పు కట్టి” ఎక్కించుకుని తిరిగేవాడు . వీడెప్పుడూ వాళ్ళ అన్న వీపు మీదే ఉంటాడు రా ..కోతి పిల్ల మాదిరి –అని బడిలో పిల్లలు గేలి చేసేవారు.

” ఎద్దు మాదిరి పెరగతా  ఉండాడు .వాడ్నింకా ఎందుకట్లా మోసేది ?” ఇంట్లో వాళ్ళు మందలించినా అన్నయ్య పట్టించుకోలేదు.

” మా ! వీడికి నడవటమే తెలీదు. ఎబ్బుడూ పరుగులే. కింద పడి దెబ్బలు తగిలించుకునేదే! ఇదే పని.  కొంచెం  పెద్దోడు  అయితే కుదురుగా నడుస్తాడు .ఐనా నా తమ్ముడు నాకు బరువు కాదు . మోసేది నేను. మీకేలా బాధ?” అన్నయ్య మాటలు తన మనసులో శిలాక్షరాల్లా అతుక్కు పోయాయి. ఆ ప్రేమ ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాడు. తనను చదివించాడు. పెళ్లి చేశాడు. పట్నం లో కాపురం పెట్టించాడు. ఏ పంట పండించిన ముందు తనకే పంపుతాడు సేద్యగాళ్ళతో. అన్నయ్య వల్లనే తన కుటుంబం సాఫీగా సాగుతోంది. పిల్లలు చదువుకోగలుగుతున్నారు అన్నది నిర్వివాదాంశం .చిన్నప్పుడు తన శరీర బరువు ..ఇప్పుడు తన బాధ్యతల బరువు ..అన్నయ్య మోస్తూనే ఉన్నాడు.  ఇన్నేళ్లుగా అన్నయ్యకు వదిన తోడు ఉండేది .ఇప్పుడు అన్నయ్య ఒంటరివాడు అయిపోయాడు. తనను తాను చూసుకోవడమే కాదు అమ్మనూ చూసుకోవాలి. అమ్మను చూసుకోవాల్సిన బాధ్యత తనకు లేదా ?అమ్మ నే కాదు తండ్రిలా తనను పెంచి చదివించిన అన్నయ్య బాధ్యత కూడా తనదే! కానీ ఎలా?!?
  
ఈ రోజు కోర్టుకు వచ్చిన ” వింత కేసు”  విన్నప్పటి నుండి తన మనస్సు మరింత నలతపడుతోంది. ఆ కేసు వేసిన వ్యక్తి కాళ్లు మొక్కాలి  అనిపించింది. తనే కాదు ..జడ్జిగారు కూడా ఆశ్చర్య పోయినట్లు ఆయన ముఖ కవళికలు చెప్పాయి.  ఇరవై ఐదేళ్లుగా కోర్టుగుమాస్తాగా పనిచేస్తున్న తనకు మనుషుల మొహాల్లో భావాలు చదవడం తెలిసిపోయింది. సాక్షుల చేత భగవద్గీత మీద ప్రమాణం  చేయిస్తున్నప్పుడు   కూడా వాళ్ళు నిజం చెప్తున్నారో, అబద్ధం చెప్తున్నారో.. తన సిక్స్త్ సెన్స్ పసిగట్టేస్తుంది. కళ్ళల్లో బెరుకు, మాటల్లో జంకు, సన్నగా వణికే చేతివేళ్ళు తనకు మాత్రమే అర్ధమవుతాయి.- కానీ న్యాయ దేవతే కళ్ళకు గంతలు కట్టుకున్నాక ..చెవులు మాత్రమే విచారించి నోరు తీర్పు చెప్పక తప్పని పరిస్థితి కదా !

“యువరానర్ ! ఇలా అంటున్నందుకు మన్నించాలి. ఈ కేసులో తీర్పు ఇవ్వడానికి మళ్ళీ లా పుస్తకాలు తిరగేయనక్కర్లేదు. ఇంతకు మునుపెన్నడూ ఇలాంటి కేసు వచ్చి ఉండదు కాబట్టి పాత తీర్పులు ఉటంకింపనక్కర్లేదు. కేవలం  కుటుంబ ,మానవ సంబంధ  బాంధవ్యాల పట్ల ప్రేమానురాగాలు ఉంటే చాలు .నా మనో వేదన అర్థమైతే చాలు .నిజానికి కోర్టు కేసులు.. తీర్పులు  అవసరం లేని పనే నేను చేయాలనుకున్నది.  కానీ అవతలివారు మొండి వారు.మాట వినలేదు.  ఒక కార్యాన్ని సాధించడానికి సామ దాన భేద దండోపాయాలు ప్రయోగించమన్నారు పెద్దలు.  నా ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాకే.. చివరి అస్త్రంగా నేను కోర్టు మెట్లు ఎక్కాను .దయచేసి నాకు.. కాదు ..కాదు.. కేసు కు అనుకూలంగా తీర్పు ఇవ్వగలరని ప్రార్ధిస్తున్నాను”

ఏమాత్రం తడబాటు లేకుండా స్థిర గంభీర కంఠం తో అప్లికెంటు చెబుతుంటే ..కోర్టు హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్. తన మనో సాగరంలో ఆలోచనల సునామి.  తర్వాత తను  యాంత్రికంగా పనిచేశాడు గాని స్థిమితంగా ఉండలేకపోయిడు. భోజనం కూడా సయించలేదు.ఆలోచనల అలలు తీరాన్ని ఢీ కొడుతూనే ఉంటాయి. ఒడ్డు గట్టిగా లేకపోతే కోతకు గురి అవుతూనే ఉంటుంది .ఈ కోత తనింకా భరించలేడు. గట్టి పడాల్సిన సమయం వచ్చింది. కోటయ్య ఒక స్థిర నిశ్చయానికి వచ్చాడు.

” ఏమైంది? ఎప్పుడనగా చెప్పాను భోజనానికి రమ్మని?” జానకి వచ్చి కొంచెం విసుగ్గా అడిగింది .
కోటయ్య లేచాడు.

నలుగురూ భోజనానికి కూర్చున్నారు.

” నీతా! అభీ!  మీరు చిన్నప్పుడు మాతోనే పడుకునేవారు. అప్పుడు సింగల్ బెడ్ రూమ్ ఇల్లు సరిపోయేది. మీరు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తీసుకున్నాం .మీ చదువులు పెద్దయ్యాక …..మీ ప్రశాంతమైన చదువుల కోసం ..ప్రైవసీ కోసమే ఈ త్రిబుల్ బెడ్ రూమ్  ఫ్లాట్ లోకి మారాము .ఇంతకన్నా పెద్ద ఇంట్లోకి మారడానికి నా బడ్జెట్ సరిపోదు .అవసరాలు పెరిగినంత వేగంగా అదే స్థాయిలో ఆదాయం పెరగనప్పుడు సర్దుబాట్లు తప్పనిసరి కదా!  అభీ!  నీతుా!  మీరు మీ గదులు కొంచెం సర్దుకొని ఇంకొకరికి చోటివ్వాలి. నానమ్మ ను,పెదనాన్నను ఇక్కడకు తీసుకురావాలనుకొంటున్నాను.   నన్ను  కన్న తల్లి నన్ను తండ్రిలా పెంచిన అన్నయ్య ముసలితనం, రోగాలతో పల్లెటూర్లో ఒంటరిగా అవస్థలు పడుతుంటే నేను ఇక్కడ స్థిమితంగా ఉండలేకపోతున్నాను. వాళ్లను చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కూడా నేను తీసుకోకపోతే …నేను అసలు మనిషినే కాదు .నిజానికి వాళ్ళను ఇక్కడికి రావద్దనడానికి మీకు ఎవరికీ  హక్కు గాని అధికారం గాని లేదు. మీ అనుమతి కూడా అవసరం లేదు. అయినా ముందుగా మీకు ఎందుకు చెబుతున్నానంటే మన బాధ్యతను మీకు గుర్తు చేయడానికి. వాళ్లను తీసుకొచ్చాక.. మీరంతా వాళ్లతో ప్రేమగా మసలుకోవాలని. కుటుంబ వాతావరణం ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని .ఈ వయసులో వాళ్లకు అవసరమైనవి అవే . పెద్దమ్మ చనిపోయిన ఈ ఆరు నెలల నుండి నేను ఆలోచిస్తూనే ఉన్నాను కానీ ఏం చేయాలో తోచేది కాదు. వాళ్లను  బ్రతిమాలి ఇక్కడకు తీసుకు వద్దామని  ఆలోచన వచ్చింది కానీ మీ సహకారం ఉండదేమో అన్న భయం వెంటాడింది.
 
ఇందాక చెప్పబోతుంటే మీ అమ్మ వినిపించుకోలేదు. ఇప్పుడు అందరూ వినండి .ఇవాళ ఒక కేసు హియరింగ్ కు వచ్చింది .అప్లికెంట్   ఒక అరవై ఏళ్ల వ్యక్తి .తాను ఎంత భంగపడి పిలిచినా వృద్ధులైన తన తల్లి,  సోదరుడు తన వద్దకు రావడం లేదని… వారిని ..వారి కంటే చిన్నవాడు, ఆర్థిక స్తోమతా వున్న  తాను చూసుకుంటానని.. వారిని తనవద్దకు వచ్చేలా చేయమని కేసు పెట్టాడు. ఆయన మాటలే నా నిర్ణయానికి ఊపిరి పోశాయి. నా కర్తవ్యాన్ని బలపరిచింది .మీరూ ఆలోచించండి. మీరు సరేనంటే ఈ ఆదివారం మన ఊరికి వెళదాం .వాళ్ళను బతిమాలో, నచ్చచెప్పో  తీసుకువద్దాం. కాదంటే నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని మా ఊరికి వెళ్లి పోతాను. అలాగని మీ బాధ్యతల్ని విస్మరించను.  ఈ ఆదివారం ఊరు వెళ్ళాలా, సోమవారం రిటైర్మెంటుకు దరఖాస్తు చేయాలా అన్నది మీ ముగ్గురి నిర్ణయానికి వదిలేస్తున్నా.”
 
తన మాటలతో పాటు భోజనం ముగించి లేచాడు కోటయ్య.

**********************************************      
      
“నాన్నా!  ఇంకా పడుకున్నావేమిటి?  మేము అంతా రెడీ అయిపోయాం .లేచి స్నానం చేయమంటోంది అమ్మ. ఇదిగో కాఫీ.”
 

ఆదివారం ఉదయాన్నే కూతురు నిద్ర లేపుతోంది. కలో, నిజమో మరి!

Leave a Reply