అవును!!!
నేను..
ఎన్నిసార్లు పిలిచినా
విసుగురాని పదం అమ్మ!

ఎందుకంటే..
మా అమ్మ అందరి అమ్మలా
టీవీ ముందు కూర్చుని
వంట ప్రోగ్రామో
కామెడీ ప్రోగ్రామో చూసే అమ్మ కాదు..మా అమ్మ!

నైస్ గా ఇంగ్లీషులో మాట్లాడే అమ్మ కాదు..మా అమ్మ !
రోజుకో టిఫిన్ చేసి పెట్టే అమ్మ కాదు.. మా అమ్మ!
మరి
మా అమ్మ ఎలాంటి అమ్మ ?

ఈ భూమి మీద
అరొక్క పంటకి పురుడు పోసే అమ్మ.. మా అమ్మ!
ఎర్రని సూర్యున్ని తన వీపు మీద మోస్తూ
పంటకి కలుపు తీసే అమ్మ… మా అమ్మ !

ఆకాశమంత దుఃఖం
అవనికి ఉన్నంత ఓర్పు
మా అమ్మ సొంతం

తన చెమట చుక్కల్ని
తన కన్నీటి గుక్కల్ని
తాగిన ఈ భూమి
మా అమ్మకి ఎప్పుడు రుణపడి ఉంటుంది

అందుకేనేమో..
నేను మా అమ్మ గురించి
రాద్దాం అనుకున్న ప్రతిసారీ
అలా తెల్లకాగితం వైపు చూసినప్పుడు
అక్షరాలు రాని మూగవాన్ని అయిపోతాను

ఎందుకంటే
అమ్మ అనుభవం రాయాలంటే
అక్షరాల కంటే ముందు
నాకు
దుఃఖం, కన్నీళ్లే వస్తాయి

అయినా..
అమ్మకి సరితూగే పదాలను
నేను ఎక్కడి నుంచి తేగలను
ఒకవేళ తెచ్చినా,
రాయడానికి ఒక జీవితం సరిపోతుందా!!

ముగింపు మరిచిపోయిన
కవిత ఏదైనా ఉంది అంటే
అది ఒక అమ్మ కవిత మాత్రమే

చుక్కానికి కూడా దొరకని
సిరా చుక్కలతో నేను రాసిన కవిత
మా అమ్మ కవిత

2 thoughts on “అమ్మ

Leave a Reply